Divine Mercy

దివ్య కారుణ్య సందేశం
దేవుడు దయామయుడు, ప్రేమ స్వరూపి. మన కొరకు తన ప్రేమను, కరుణను ధారపోసి యున్నాడు.  దేవుని కరుణను విశ్వసించుదాం.  పరులపట్ల కరుణను చూపుదాం. ఎవరును దేవుని కరుణకు దూరము కాకూడదని దేవుని కోరిక.  ఇదియే దివ్య కారుణ్య సందేశము.  రాబోవు జీవితమున దేవుని కరుణను మనం పొందాలంటే, ఈ జీవితమున ఇతరుల పట్ల కరుణతో జీవించాలి.

దేవుడు మనందరిని మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు.  మన పాపములకన్న ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అనంతమైనది. హద్దులు లేనిది, షరతులు లేనిది. తద్వారా, నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి, ఆయన కరుణను పొంది, మన ద్వారా, ఇతరులకు కూడా ఆ కరుణ ప్రవహించాలనేది దేవుని కోరిక.  ఆ విధముగా, ప్రతి ఒక్కరు దైవ సంతోషములో పాలు పంచు కొనగలరు.

దివ్య కారుణ్య సందేశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలంటే, మూడు కార్యాలు చేయాలి...

అ). దివ్య కరుణను వేడుకోవాలి
ప్రార్ధనలో మనం దేవుణ్ణి తరచూ కలుసుకోవాలన్నదే ఆయన కోరిక.  మన పాపాలకు పశ్చాత్తాపపడి, ఆయన కరుణను మనపై మరియు సమస్త లోకముపై క్రుమ్మరించబడాలని దివ్య కరుణామూర్తిని వేడుకోవాలి.

ఆ). కరుణ కలిగి జీవించాలి
మనం కరుణను పొంది, మన ద్వారా ఆ కరుణ ఇతరులకు కూడా లభించాలన్నదే దేవుని కోరిక.  ఆయన మనపై ఏ విధముగా తన అనంత ప్రేమను, మన్నింపును చూపిస్తున్నారో, ఆ విధముగానే మనము కూడా ఇతరుల పట్ల ప్రేమను, మన్నింపును చూపాలని ప్రభువు ఆశిస్తున్నారు.

ఇ). యేసును సంపూర్ణముగా విశ్వసించాలి
తన దివ్యకరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడియున్నవని, మనం తెలుసుకోవాలనేది ప్రభువు కోరిక.  మనం ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే, అంతగా ఆయన కరుణా కృపావరాలను పొందుతాము.

దివ్య కరుణ భక్తి - చరిత్ర
 దివ్య కరుణ భక్తియనగా, దయాపరుడు, కరుణమూర్తియైన దేవునికి సంపూర్ణముగా అంకితభావము కలిగియుండుట.  ఆయనను సంపూర్ణముగా విశ్వసించుటకు, కృతజ్ఞతాభావముతో ఆయన కరుణను అంగీకరించుటకు, ఆయనవలె దయ కరుణలతో జీవించుటకు, తగు నిర్ణయాన్ని తీసుకోవడమే దివ్య కరుణ భక్తి.  పునీత ఫౌస్తీనమ్మగారి   దినచర్య పుస్తకములో ప్రతిపాదించిన దివ్యకారుణ్య భక్తికృత్యములు మరియు పుస్తక సంబంధ ప్రభోదములు అన్నియు శ్రీసభకు అనుగుణముగా ఉంటూ సువార్తా సందేశములో పూర్తిగా నాటుకొని పోయినట్లున్నాయి.  వీనిని చక్కగా అర్ధంచేసికొన్నయెడల, మరియు నిజజీవితములోనికి అన్వయించుకొన్నయెడల, ప్రభువునకు యదార్దమయిన శిష్యులుగా జీవించడానికి ఎంతగానో సహాయం చేస్తాయి.  ఈ భక్తిగల ప్రార్ధనలు నిజమయిన విలువలను ప్రతిపాదించగలవు.  సాక్షులుగా జీవించుటకు ఉపకరించగలవు. వ్యక్తిగత పవిత్రతలో జీవించుటకు మార్గమును సుగమము చేయగలవు.

రెండవ వాటికన్ సమావేశాలు ప్రవేశ పెట్టిన పవిత్ర దైవార్చన సంవిధానము, క్రైస్తవులు, భక్తి కృత్యములన్నియు, తిరుసభ చట్టములు, ప్రమాణములను అనుసరించునంత వరకే వాటిని ప్రోత్సహించాలని బోధిస్తుంది.

1931  ఫిబ్రవరి 22న పునీత ఫౌస్తీనమ్మగారు తన దినచర్య పుస్తకములో ఈ విధముగా వ్రాసియున్నారు: "యేసునాధుడు తెల్లని వస్త్రములను ధరించియుండటం నేను చూసియున్నాను.  కుడి చేతి పైకెత్తి ఆశీర్వదిస్తూ, ఎడమ చేతిని తన తెల్లని వస్త్రమును తాకుచు తన ఛాతిపై ఉంచియున్నారు.  తన ఎరుపు రంగులోను మరొకటి వివర్ణమయినదిగా విరజిమ్ముతూ ఉన్నాయి.”

యేసు ప్రభువు ఫౌస్తీనమ్మతో ఈ విధముగా చెప్పియున్నారు: "నీవు ఈ దర్శనములో చూసిన విధముగా ఒక చిత్ర పటాన్ని చిత్రీకరించుము.  దాని క్రింద, యేసూ! నీలోనే నా నమ్మకము! అని వ్రాయవలయును.  ఈ చిత్ర పటాన్ని ఆరాధించే ఆత్మలు ఎన్నటికినీ నాశనము కావని వాగ్ధానము చేయుచున్నాను.  మరణావస్తలో ఈ భూలోకమందలి శత్రువులపై వారికి విజయాన్ని బడయుదును. నా మహిమతో ఆ యాత్మలను కాచి కాపాడెదను.  ఈ చిత్ర పటాన్ని లోకమంతా ఆరాధించాలన్నదే నా కోరిక"

పునీత సౌస్తీనమ్మగారు ఆ రెండు కిరణాలకు అర్ధమేమిటని అడిగినప్పుడు, ప్రభువు ఈ విధముగా చెప్పియున్నారు: "ఆ రెండు కిరణాలు రక్తాన్ని, నీటిని సూచిస్తున్నాయి. వివర్ణమయిన కిరణము ఆత్మలను శుద్ధీకరించు నీటిని సూచిస్తుంది. ఎరుపు వర్ణముగల కిరణము ఆత్మలకు జీవమునైన రక్తాన్ని సూచిస్తుంది.  సిలువపై నా ప్రక్కన బల్లెముతో పొడచినప్పుడు నా దివ్య కరుణా హృదయా౦తరాలలో నుండి ఈ దివ్య కిరణాలు వెలువడియున్నాయి.  ఈ చిత్ర పటము ద్వారా అనేక అనుగ్రహాలను ప్రసాదించెదను."

పునీత ఫౌస్తీనమ్మ - దివ్య కరుణ అపోస్తురాలు
 పునీత ఫౌస్తీనమ్మగారు పోలండు దేశములోని గ్లోగోనిక్ అను గ్రామములో హెలెన్ కొవాలేస్కేగా 25 ఆగష్టు 1905 వ సం..లో జన్మించారు.  పదిమందిలో ఆమె మూడవ సంతానం.  తన 20 వ యేట "సిస్టర్స్ అఫ్  అవర్ లేడి" అను సభలో చేరియున్నారు.  ఈ సభ, అనేక సమస్యలతో సతమతమవుతున్న యౌవన స్త్రీలకు చదువులలో సహాయాన్ని అందించేది.

మరుసటి సంవత్సరమే, మఠవాసినుల అంగీని ధరించి సిస్టర్ మరియ ఫౌస్తీనాగా తన పేరును మార్చుకొన్నారు. 1930 వ సం,,లో లోకమునకు అందించడానికి ప్రభువునుండి దివ్యకరుణ సందేశమును పొందియున్నారు.  దివ్య కరుణకు  అపోస్తురాలుగా ఉండాలని, ఇతరులకు కరుణ చూపుటలో ఆదర్శప్రాయముగా ఉండాలని, దివ్య కరుణ ప్రణాళికను ఈ లోకములో నెరవేర్చుటకు ఒక సాధనముగా ఉండాలని ప్రభువు ఆమెను కోరియున్నారు.

ఇది అంత సులువైన కార్యమేమి కాదు! ఆమె తన సంపూర్ణ జీవితాన్ని ఈ కార్యమునకై త్యాగము చేయవలసి ఉంటుంది.  ప్రభువు సందేశానుసారముగా తన వ్యక్తిగత బాధలన్నింటిని ప్రభువుతో పంచుకొంటూ, పొరుగువారి పాపాల పరిహారముగా, తన బాధలను ప్రభువునకు సమర్పించింది.  ఆమె దైనందిక జీవితములో దివ్య కారుణ్యమునకు ఒక ద్వారమువలె ఉంటూ, ఇతరులకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చింది. తన లేఖల ద్వారా, ప్రభువునందు పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి జీవించాలని, అందరు ప్రభుని రెండవ రాకడకై సంసిద్ధతను చూపాలని ఉత్తేజ పరచింది.

తన అయోగ్యతను గుర్తెరిగి బయట లోకానికి లేఖ వ్రాయాలనే ఆలోచన ఆమెను ఎంతగానో కలవర పెట్టింది. దానికి బదులుగా, 1934 వ సం,,నుండి దినచర్య పుస్తకమును వ్రాయడం ప్రారభించింది.  దానిలో తన ఆధ్యాత్మిక గురువు మరియు క్రీస్తు ప్రభువు యొక్క ఆశలను తెలియపరచింది. నాలుగు సం,,ల పాటు దైవదర్శనములను, నిగూఢరహస్యములను వ్రాసియుంచినది. వాటికి తన ఆధ్యాత్మిక ప్రార్ధనలు, భావాలు, అంత:రంగిక అనుభవాలు, ఉద్దేశాలు జోడించింది. దానికి ప్రతిఫలముగా, సామాన్య రీతిలో సువిశేషానుసారం   దేవుని ప్రేమ కార్యాలను మన జీవితములోని సర్వకార్యములలో ఎలా నమ్మాలో తెలియ జేస్తూ 600 ల పుటల దినచర్య పుస్తాకాన్ని పొందుపరచియున్నది. దివ్యమూర్తి కరుణకు మనం ఎలా స్పందించాలో కూడా ఆ పుస్తకం తెలియజేయుచున్నది. దేవుని అద్భుతమైన కృపను మరియు దానిని ఇతరులకు ఏవిధముగా అందించాలో తెలియజేయుచున్నది.

ఆమె ఆధ్యాత్మిక జీవితం, దీనత్వం, పరిశుద్ధ తలంపులపై దేవుని చిత్తమునకు ప్రేమపూరిత విధేయతపై మరియు మరియ తల్లి సుగుణాలను అనుసరించి జీవించడంపై ఆధారపడియున్నది. నిష్కళంక మరియపై, దివ్యసత్ప్రసాదము, పాపోచ్చరణములపై ఉన్న ఆమె భక్తి నమ్మకమే, కష్టాలను, బాధలను ఓర్పుతో, సహనముతో భరించుటకు కావలసిన శక్తిని పొందియున్నది.  శ్రీసభ మరియు మరణావస్తలోనున్నవారి పక్షాన దేవునికి వీటన్నింటిని అర్పించియున్నది.

ఆమె టి.బి. వ్యాధితో బాధపడి అక్టోబర్ 5, 1938 వ సం,,లో ధన్యమరణాన్ని పొందియున్నారు. ఆమె జీవించియున్నప్పుడు, పొందిన బాధలు కష్టాలు ఆమె ఆధ్యాత్మిక గురువు మరియు కొద్దిమంది మఠవాసినులు మాత్రమే ఎరిగియున్నారు. ఆమె మరణానంతరం, ఆమె పడిన కష్టాలు, బాధలు ఎరిగినవారు మిక్కిలి ఆశ్చర్యచకితులైరి.  ఎందుకన, ఆమె అంతగా బాధపడినప్పటికిని, ఎల్లప్పుడూ చిరునవ్వుతో, సంతోషముతో కనిపించెడిది.  ఆమె దరికి వచ్చిన వారందరు సంతోషముగా తిరిగి వెళ్లాలని ఆశించియున్నారు.

ఈనాడు "దివ్య కరుణ సందేశం" లోకమంతటా ప్రకటింపబడియున్నది.  "నా ఆత్మలో దివ్య కరుణ" అను ఆమె డైరి దివ్య కరుణ భక్తికి ఎంతగానో తోడ్పడు చున్నది.

సిస్టర్ ఫౌస్తీనమ్మ గారు ఏప్రిల్ 18, 1993 వ సం,,లో ధన్యత పట్టమును మరియు ఏప్రిల్ 30, 2000 సం,,లో పునీత పట్టమును పొందియున్నారు.
దివ్యకరుణ మహోత్సవం
శ్రీసభలో "దివ్యకరుణ మహోత్సవము" స్థాపించబడాలని ప్రభువే స్వయముగా కోరినట్లు పునీత ఫౌస్తీనమ్మగారు తన దినచర్య పుస్తకములో తెలిపియున్నారు (699). ప్రభువు ఆమెకి ఈ మహోత్సవమును గూర్చి ఫిబ్రవరి 22, 1931 వ సం,,లో తెలిపియున్నారు. "పునరుత్థాన పండుగ తర్వాత వచ్చు ఆదివారమున (పాస్కా రెండవ ఆదివారము) దివ్య కరుణ మహోత్సవము కొనియాడబడాలనేది నా కోరిక. ఆ దినమున, దివ్య కరుణ సకల జనులకు ఇవ్వబడుతుంది. ఆ దినమున, పాప సంకీర్తనము చేసి, దివ్య సత్ప్రసాదమును లోకొను వారికి సంపూర్ణ విమోచనము, శిక్షనుండి విముక్తియును లభించును. మానవలోకము నా దరికి చేరిననే తప్ప అది శాంతమును పొందలేదు.  ఆనాడు అనంత దివ్యవరానుగ్రహాలు ప్రవహించే దివ్య ద్వారాలన్ని తెరిచే ఉంటాయి. వారి పాపాలు ఎంతటివైనను, నన్ను చేరడానికి ఏ ఆత్మగాని భయపడకుండునుగాక!  నా దరి చేరు ఆత్మలకు నా కరుణా సముద్ర వరాలను క్రుమ్మరించెదను.  దివ్యకరుణ మహోత్సవము సకల ఆత్మలకు, ముఖ్యముగా పాపాత్ములకు శరణముగాను, ఆదరణముగాను ఉండునుగాక!".

పునరుత్థాన మహోత్సవము తర్వాత వచ్చు ఆదివారమున కరుణ మహోత్సవమును కొనియాడుట ద్వారా, మన రక్షణ పాస్కా పరమ రహస్యమునకు ఎంతో సంబంధము కల్గియున్నదని విదితమగుచున్నది.  ఆ దినమున ప్రత్యేకముగా రక్షణ పరమరహస్యము దివ్య కారుణ్యము యొక్క అతి గొప్ప వరప్రసాదము అని ధ్యానించాలి.

దివ్యకరుణ మహోత్సవానికి ముందుగా దివ్యకరుణ నవదిన ప్రార్ధనలను, దివ్యకరుణ జపమాలను జపించి, ధ్యానించి, ఉత్సవానికి సంసిద్దులము కావలయునని ప్రభువు కోరుచున్నారు. నవదిన ప్రార్ధనలను చెప్పు వారికి సాధ్యమైనన్ని వరాలు ఇవ్వబడును (796).

దివ్య కరుణ మహోత్సవాన్ని ఘనముగా, వైభవముగా జరుపాలనేది ప్రభువు ఆంక్ష.  ఈ మహోత్సవాన్ని జరుపుకొనే విధానాన్ని ప్రభువు రెండు రకాలుగా సూచించారు. మొదటగా, దివ్యకరుణ చిత్ర పటాన్ని ఆశీర్వదించి, సమూహముగా గౌరవించి, ఆరాధించాలి (49, 341, 414, 742).  రెండవదిగా, ఆ దినమున గురువులు దివ్యకరుణ గూర్చి దైవ ప్రజలకు భోధించాలి (570, 1521).

మే 5, 2000 వ సం,,న జాన్ పౌల్ పోపుగారు రెండవ పాస్కా ఆదివారాన్ని "దివ్య కరుణ ఆదివారము" గా ప్రకటించి యున్నారు.

దివ్య కరుణకు నవ దిన ప్రార్ధనలు
1937 వ సం,,ము, పెద్ద శుక్రవారమున, దివ్య కరుణకు ప్రత్యేక నవదిన జపాలను జపించాలని యేసుక్రీస్తు, పునీత ఫౌస్తీనమ్మగారికి తెలియజేశారు.  ఈ ప్రార్ధనలు పెద్ద శుక్రవారమున ప్రారంభమై తొమ్మిదవ రోజైన శనివారమున ముగియును. మరుసటి ఆదివారమున (పాస్కా మొదటి ఆదివారము) దివ్య కరుణ మహోత్సవము కొనియాడబడును.

దివ్యకరుణా కటాక్షానికి ఉద్దేశించిన నవదిన జపాల ఆచరణావిధానాన్ని మరియు నిర్దిష్ట నిర్దేశాలను యేసుప్రభువు స్వయముగా పునీత ఫౌస్తీనమ్మ గారికి తెలియజేసియున్నారు.  "ఆత్మలు తమకు కావలసిన శక్తిని, ఉత్తేజాన్ని, తమ జీవిత కాలములో, ప్రత్యేకించి మరణావస్థలో కావలసిన కృపావరములను పొందుటకు వీలుగా, నీవు ఈ తొమ్మిది దినాలలో వారిని నా దివ్యకరుణా ఊట వద్దకు నడిపించు.  ప్రతిరోజు వివిధ బృందాల ఆత్మలను నడిపించి, వారిని నా కరుణా సముద్రములో ముంచెత్తుము. ప్రతిరోజు, నీవు, ఆ ఆత్మలకు ఆవశ్యకమైన కృపావరములకొరకు, నేను పడిన సిలువ పాటుల కారణముగా పరలోక తండ్రిని ప్రార్ధించుము." (డైరీ, 1209).

నవదిన జపాలు (డైరీ 1209-1229)
నవదిన ప్రార్ధనలను, దివ్యకరుణ జపమాలతో కలసి ప్రార్ధించవలసినదిగా కోరడమైనది. ఎందుకనగా, నవదిన జపాలను దివ్యకరుణ జపమాలతో కలిపి, ముఖ్యముగా దివ్యకరుణ మహోత్సవమునకు ముందుగా ప్రార్ధించాలని మన ప్రభువే స్వయముగా చెప్పియున్నారు.

మొదటి దినము
ఈ రోజు సమస్త మానవాళిని, ప్రత్యేకించి పాపులను నా వద్దకు తీసుకొని రండి".
 "వీరిని నా కరుణా సముద్రములో, ముంచెత్తుము. ఈ విధముగా, పాపములో మునిగి దూరమైన ఆత్మల ద్వారా పొందన అధిక వేదన నుండి నన్ను ఒదార్చెదరు." మహా కరుణపూర్ణ యేసువా! మాపై కనికరము కలిగి, మమ్ములను మన్నించడమే మీ సహజ  నైజమైనందున మేము చేసిన పాపములను చూడక, మీ అనంత సహృదయతపై మేముంచిన విశ్వాసాన్ని కటాక్షింపుమని బ్రతిమాలుకొనుచున్నాము.  మమ్మందరిని అనంతమయిన మీ సహృదయ నివాసములోనికి చేర్చుకొని, అచ్చటినుండి మమ్ములను ఎన్నటికి వెడలిపోనివ్వకండి. తండ్రితోను, పవిత్రాత్మతోను మిమ్ము ఐక్యపరుస్తున్న మీ ప్రేమనుజూచి, మా మనవులను ఆలకింపవలయునని వేడుకోనుచున్నాము. నిత్య పిత, కరుణపూరితమయిన మీ దృష్టిని సమస్త మానవాళివైపు, ప్రత్యేకముగా, దీనులైన పాపులపై త్రిప్పకరుణించండి. మేమంతా మహాభరితమయిన మీ హృదయములో నెలకొనియున్నాము.  మీ భాధాకరమయిన సిలువ పాటులను జూచి, యుగయుగములు మీ అనంత కరుణ ప్రభావాన్ని స్తుతించుటకు మాపై కరుణజూప నవధరించండి.
పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం.

రెండవ దినము
"ఈరోజు గురువుల, మఠవాసుల ఆత్మలను నా వద్దకు తీసుకొని రండి."
 "వీరిని లోతైన నా కరుణా సముద్రములో ముంచెత్తుము. ఎందుకన, నా శ్రమలలో తాళిమి పొందుటకు వీరే నాకు బలమును, శక్తిని ఒసగితిరి.  వీరిద్వారా, నా అనంత కరుణ, సమస్త మానవాళికి ప్రవహించును".

సహృదయతకు నిలయమయిన మహా కరుణపూర్ణ యేసువా! కరుణ భరిత కార్యములు చేయుటకు, మీ సేవకై అంకితమైయిన వారిని మీ కరుణా కాటాక్షాన్ని మెండుగా అనుగ్రహించండి.  వారి సత్కార్యములను చూచిన ప్రజలు దయగల పరలోక తండ్రిని మహిమ పరచెదరు గాక!

నిత్యపిత, కరుణపూరితమయిన మీ దృష్టిని, మీ ద్రాక్షతోటలో పని చేయడానికి మీరు ఎన్నుకొన్న వ్యక్తుల సమూహం వైపు - గురువుల, మఠవాసుల - వైపు త్రిప్ప కరుణించండి.  మీ ఆశీర్వాద బలాన్ని వారికి ప్రసాదించండి. మీ కుమారుని హృదయం పట్ల గల ప్రేమను జూచి మీ శక్తి ప్రకాశాలను వారికి వెల్లడి చేయండి.  అప్పుడు వారు ఇతరులను రక్షణ మార్గం వైపు నడిపించగలరు. మితిలేని మీ కరుణను గూర్చిన స్తుతిని యుగయుగముల వరకు, వారంతా ఏక కంఠముతో గానము చేయ గలుగుదురుగాక. ఆమెన్.

పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం.

మూడవ దినము
"ఈ రోజు సమస్త భక్తిమయ విశ్వాసుల ఆత్మలను నా వద్దకు తీసుకొని రండి."
 "నా కరుణా సముద్రములో వీరిని ముంచెత్తుము.  నా సిలువ శ్రమల మార్గములో వీరే నాకు ఓదార్పును ఒసగితిరి.  శ్రమల, బాధల సంద్రములో వీరే ఓదార్పు బిందువులైరి."

మహా కరుణగల యేసువా! మీ కరుణానిధి నుండి అందరికి మీ కృపావరములను ధారాళముగా కుమ్మరించండి.  మహా కనికరముకలిగిన మీ హృదయములోనికి మమ్మందరిని చేకొని, దానిలో నుండి మమ్ములను ఎన్నటికి వెడలి పోనివ్వక, స్వర్గపిత పట్ల, ఏ అమితాశ్చర్యకర ప్రేమతో మీ హృదయం ప్రజ్వలిస్తున్నదో, ఆ గొప్ప ప్రేమను జూచి, మాకు ఈ కృపావరములను అనుగ్రహించవలసినదిగా మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాము.

నిత్యపిత, కరుణ పూరితమైన మీ దృష్టిని మీ కుమారుని వారసత్వం వైపు త్రిప్పిన విధముగా, ఈ విశ్వాసుల ఆత్మల వైపు త్రిప్ప నవధరించండి.  యేసునాధుని బాధాకరమైన సిలువ పాటులకుగాను, మాకు ఈ ఆశీర్వాదములను ఒసగి, నిరంతర రక్షణను అనుగ్రహించండి. ఆ ప్రకారముగా మేము మిమ్ములను ప్రేమించుటలో విఫలముగాక, దైవనమ్మిక నిధిని కోల్పోక ఉందుముగాక.  సమస్త దేవదూతలతోను, సన్మనస్కులతోను, యుగయుగముల వరకు ఎల్లరెరుగని మీ కరుణను మహిమ పరచుదముగాక. ఆమెన్.

పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం.

నాలుగవ దినము
"ఈ రోజు దేవుని విశ్వసించనివారిని మరియు నన్ను ఎరుగని వారిని నా వద్దకు తీసుకొని రండి."
 " వారిని నా కరుణా సముద్రములో ముంచెత్తుము.  నా శ్రమలలో నేను వారిని గురించి కూడా ఆలోచించి యున్నాను.  భవిష్యత్తులో వారి ఉత్సాహము, దృఢభక్తి నా హృదయాన్ని ఓదార్చి యున్నది."

మహా కనికరముగల యేసువా! మీరే సమస్త ప్రపంచానికి జ్యోతి.  మిమ్ములను ఇప్పటికీ, విశ్వసించని, మరియు మిమ్ములను ఎరుగని ఆత్మలను, మహా కనికరముగల మీ హృదయములోనికి స్వీకరించండి.  మీ కృపా కిరాణాలు వారిని చైతన్య పరచనివ్వండి. అప్పుడు వారును మాతో కలసి ఆశ్చర్యకరమైన మీ కరుణను ఆరాధింతురుగాక.

నిత్యపిత, కరుణపూర్ణమైన మీ దృష్టిని మిమ్ములను విశ్వసింపని ఆత్మలపై, ఇప్పటివరకు ఎరుగకుండిన ఆత్మలపై త్రిప్పండి. వారిని సువార్త వెలుగులోనికి తీసుకొని రండి. మిమ్ములను ప్రేమించుట ఎంతటి ఆనందకరమైన విషయమో ఆ ఆత్మలకు తెలియ జేయండి. వారు కూడా, యుగయుగముల వరకు మీ కరుణ యొక్క ఔధార్యాన్ని ఆరాధించుటకు ఆవశ్యకమైన కృపను వారికి అనుగ్రహించండి. ఆమెన్.

పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం.

ఐదవ దినము
"ఈ రోజు, తిరుసభనుండి విడిపోయిన ఆత్మలను నా వద్దకు తీసుకొని రండి."
" వీరిని నా కరుణా సముద్రములో ముంచెత్తుము.  శ్రమల బాధలలో శ్రీసభయైన నా శరీరమును, నా హృదయాన్ని గాయపరచియున్నారు.  శ్రీసభ ఐక్యతలో తిరిగి చేరుటవలన, నా గాయాలు మానును. ఆ విధముగా వారు నా శ్రమలకు ఉపశమనమును కలుగజేయుదురు."

సహృదయులు, మహా కరుణగల యేసువా! మీ వెలుగును కాంక్షించు వారికి అనుగ్రహించుటకు మీరు తృణీకరించరు.  శ్రీసభనుండి విడిపోయిన వారి ఆత్మలను మహాకనికరము కలిగిన మీ హృదయ వాసములోనికి స్వీకరించండి. మీ వెలుగుతో వారిని సత్యసభ ఐక్యతలోనికి చేర్చండి. మహా కనికరము కలిగిన హృదయావాసమునుండి వారిని వెడలి పోనివ్వకండి. వారును మీ కరుణ ఔదార్యాన్ని గుర్తించి మహిమ పరచుటకు ముందుకు వచ్చేలా అనుగ్రహించండి.

నిత్యపిత, మీ కుమారుని శ్రీసభ నుండి విడిపోయిన మా సోదరుల ఆత్మల మీద మరియు మీ వరప్రసాదములను దుర్వినియోగ పరచిన వారి మీద, మీ కరుణపూర్ణమైన దృష్టిని త్రిప్పండి. ఎందుకన, వారు కూడా మీ కుమారుని కరుణగల హృదయములో పదిలపరచబడినవారే. వారి తప్పులను చూడక, వారికోసం మీ కుమారుడు పడిన బాధాకరమైన సిలువ పాటులను, ప్రేమను చూడండి.  వారుకూడా, మీ మహాకరుణను యుగయుగముల వరకు మహిమ పరచుదురుగాక. ఆమెన్.

పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వస్తోత్రం.

ఆరవ దినము
"ఈ రోజు వినమ్రులను, దీనులను మరియు చిన్న బిడ్డల ఆత్మలను నా వద్దకు తీసుకొని రండి"
 "నా కరుణలో వారిని ముంచుము.  ఇట్టి ఆత్మలు నా హృదయానికి చాలా దగ్గర పోలికను కలిగియున్నవి.  నా శ్రమలలో నాకు బలాన్ని ఒసగియున్నారు.  భూలోక దూతలవలె నేను వారిని గాంచియున్నాను. నా అనుగ్రహ ప్రవాహాన్ని సంపూర్ణముగా వారిపై కుమ్మరించెదను. దీనాత్ములు మాత్రమే నా అనుగ్రహాలను స్వీకరించగలరు. దీనాత్ములను, విశ్వాసములో, నమ్మకములో ఉంచెదను"

మహా కరుణగల యేసువా! "నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను, నా నుండి నేర్చుకొనండి" అని మీరే చెప్పియున్నారు.  కనుక, సాధుశీలతను, వినమ్ర హృదయముగల ఆత్మలనందరిని, మీ మహా కరుణగల హృదయావాసములోనికి స్వీకరించండి.  ఈ ఆత్మలు స్వర్గాన్ని పారవశ్యం చేయుటవలన స్వర్గ పితకు ప్రీతిపాత్రులుగా అగునుగాక! దైవ సింహాసనం సన్నిధిలో వీరంతా సువాసనలు విరజిమ్మే ఒక పుష్పగుచ్చమువలె ఉందురుగాక. స్వయముగా దేవుడే వారి పరిమళాన్ని ఆఘ్రాణించడములో ఆనందాన్ని చవిచూచెదరుగాక! ఓ యేసువా! ఈ ఆత్మలకు మహా కరుణగల హృదయములో శాశ్వత నివాసాన్ని దయచేయండి. ప్రేమ, కరుణగల స్తుతి గీతాన్ని వారు నిరంతరం గానము చేయుదురుగాక!

నిత్యపిత, ఈ ఆత్మలు మీ కుమారున్ని చాలా దగ్గర పోలికను కలిగియున్నారు. వీరి పరిమళాన్ని భువినుండి నేరుగా మీ సింహాసనాన్నే తాకుచున్నాయి. దయగల తండ్రీ! సర్వ శ్రేష్టతకు నిలయమా! వారిపట్ల మీకుగల ప్రేమను చూసి, వారియందు మీరు పొందుతున్న ఆనందమును చూసి, సమస్త ఆత్మలు కూడా యుగయుగముల వరకు కలసి కట్టుగా మీ స్తుతులను గానం చేయుటకుగాను, సమస్త లోకాన్ని ఆశీర్వదించవలసినదిగా మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమెన్.

పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం.

ఏడవ దినము
"ఈ రోజు నా కరుణను ప్రత్యేకముగా పూజించి మహిమ పరచే ఆత్మలను నా వద్దకు తీసుకొని రండి"
 "వీరిని నా కరుణగల సంద్రములో ముంచెత్తండి. ఈ ఆత్మలు నా శ్రమల బాధలయందు మిక్కిలిగా వ్యాకులము చెంది, నా ఆత్మ అంత:రంగములోనికి ప్రవేశించి యున్నారు. వారు నా కరుణగల హృదయానికి సజీవ ప్రతి రూపాలు.  రాబోవు జీవితమున ప్రత్యేక వెలుగుతో వారు  ప్రకాశించెదరు. వారిలో ఏ ఒక్కరు అగ్నిజ్వాలల నరకమున ప్రవేశించరు. వారిని, ప్రత్యకవిధముగా మరణావస్థలో కాచి కాపాడెదను."

ప్రేమకు ప్రతిరూపమయిన హృదయముగల, మహా కరుణ గల యేసువా! మీ కరుణ మహత్యాన్ని ప్రత్యేకముగా స్తుతించి, పూజించి, మహిమ పరచే ఆత్మలను మహా కరుణగల మీ హృదయ నివాసములోనికి స్వీకరించండి.  దైవశక్తి వలన ఈ ఆత్మలు చాలా శక్తివంతమై మీ కరుణ మీది నమ్మకముతో, సర్వదు:ఖదురితముల మధ్య  భుజస్కందములపై సర్వ మానవాళిని మోయుచున్నారు. ఈ ఆత్మలకు కఠిన తీర్పునివ్వకండి.  ఈ జీవితమునుండి, నిష్క్రమించునప్పుడు, మీ కరుణ వారిని ఆలింగనము చేయునుగాక.

నిత్య పిత, యేసునాధుని మహా కరుణగల హృదయ నివాసములో కొలువుదీరి, మీ ఊహాతీత కరుణ అయినటువంటి మీ మహోన్నత గుణాన్ని మహిమ పరచి పూజిస్తున్న ఆత్మల వైపు మీ కరుణా పూర్ణ దృష్టిని త్రిప్ప కరుణించండి.  ఈ ఆత్మలు సజీవ సువార్తకు ప్రతిరూపాలుగా, వారి హస్తాలు దయా పూరిత కార్యాలతో నిండియుండునుగాక!  వారి మనసులు ఆనందముతో పొంగి పొరలుతూ, కరుణా స్తుతిగీతాన్ని గానము చేయుదురుగాక.  ఓ సర్వోన్నతా! నేను మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను.  మీలో వారు నెలకొల్పుకున్న నమ్మకము, విశ్వాసమును చూసి, వారికి మీ కరుణను జూపనవధరించండి. వారి జీవిత కాలములో, ప్రత్యేకించి వారి మరణ సమయమందు, మీ కరుణను అర్ధించిన ఆత్మలను ఆదుకోగలనని విన్నవించియున్నారు.  కనుక, మీ వాగ్ధానము ప్రతి ఫలించునుగాక. ఆమెన్.

పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వస్తోత్రం.

ఎనినిదవ దినము
"ఈ రోజు ఉత్తరించు స్థలములోని ఆత్మలను నా వద్దకు తీసుకొని రండి"
 "నా రక్త ప్రవాహము వారి అగ్నిజ్వాలలను చల్లార్చునుగాక! ఈ ఆత్మలను నేను అమితముగా ప్రేమించుచున్నాను. వారు ఉత్తరించుస్థలములో ప్రాయశ్చిత్తము చేయుచున్నారు.  వారికి ఊరటను ఒసగు శక్తి మీలో ఉన్నది.  శ్రీసభ ప్రసాదించు పాపమన్నింపు ప్రార్ధనలను వారి తరుపున అర్పింపు ము. వారు పడు భాధలను మీరు ఎరిగియున్నచో, ఎప్పటికిని వారికోసం ఆత్మను వేడుకొని వారి అప్పులను  తీర్చెడివారు.

మహా పరిపూర్ణ కరుణగల యేసువా! "నేను దయను కోరుకుంటాను" అని మీరే స్వయముగా చెప్పియున్నారు.  కాబట్టి, మీ తీర్పుకు తగిన దండనను అనుభవిస్తున్నటువంటి ఉత్తరించు స్థలములోని  ఆత్మలను, మహా కరుణ గల మీ హృదయ వాసములోనికి తీసుకొని వచ్చియున్నాము. తెరువబడిన మీ హృదయపు గాయాలనుండి పొంగిపొరలిన రక్త జలధారలు, ఉత్తరించుస్థలములో మీ కరుణాశక్తిని కొనియాడుటకు వీలుగా, వారి అగ్నిజ్వాలలను ఆర్పివేయును గాక!

నిత్య పిత, యేసునాధుని మహాకనికరముగల హృదయాలయములో నెలవైయున్న మీ కరుణపూర్ణ దృష్టిని, ఉత్తరించుస్థలములో భాదలను అనుభవిస్తున్న ఆత్మలపై త్రిప్ప కరుణించండి.  మీ కుమారుడైన యేసు నాధుని సిలువ పాటులను చూసి ఆవేదనతో నిండిన వారి ఆత్మలను చూసి మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను. మీ న్యాయ పరిశీలనలోనున్న ఆత్మలపై మీ కరుణను క్రుమ్మరించండి.  మీ ప్రియ కుమారుడైన యేసునాధుని దివ్యగాయములను జూచి వారిని కరుణించండి. ఎందుకన, మీ సహృదయతకు, కనికరమునకు హద్దులేవని మేము ప్రగాడముగా విశ్వసించుచున్నాము. ఆమెన్.

పరలోక జపం, మంగళ వార్త జపం, త్రిత్వ స్తోత్రం.

తొమ్మిదవ దినము
"ఈరోజు అశ్రద్ధగల ఆత్మలను నా వద్దకు తీసుకొని రండి"
 "వీరి ఆత్మలు నా హృదయాన్ని అమితముగా గాయపరచియున్నవి.  ఈ అశ్రద్ధ కలిగిన ఆత్మల వలననే ఒలీవు తోటలో నా హృదయం మిక్కిలిగా వేదన చెందియున్నది. వీరి మూలముగానే, నేను కన్నీరు కార్చితిని. 'తండ్రీ! నీ చిత్తమైనచో, ఈ పాత్రమును నానుండి తొలగించుము'.  రక్షింప బడుటకు వీరికి ఉన్న చివరి ఆశ నా దివ్య కరుణవైపు మరలడమే".

మహా కరుణగల యేసువా!  మీరు కనికరముగలవారు. మహాకరుణగల మీ హృదయములోనికి ఉదాసీనత లేదా అశ్రద్ధకలిగిన ఆత్మలను చేరపిలచుకొని వచ్చియున్నాను. శవములవలె పోలియున్న ఈ ఆత్మలను మీ ప్రేమాగ్నితో మరొకమారు జ్వలింపజేయండి.  ఓ మహా కనికరముగల యేసువా! మీ కరుణ యొక్క సర్వతోముఖ శక్తితో వారిని మీ ప్రేమావేశాములోనికి రప్పించండి.  మీ శక్తికిమించినది ఏదియు లేదు కాబట్టి, వారికి మీ ప్రేమవరాలను ధారాళముగా అనుగ్రహించండి.

నిత్యపిత, ఉదాసీనులైనప్పటికిని, యేసునాధుని మహాకనికరము కలిగిన హృదయములోనే ఉన్నటువంటి ఈ ఆత్మలపై మీ కరుణపూర్ణ దృష్టిని త్రిప్పనవధరించండి. దయగల తండ్రీ! మీ కుమారుని బాధాకర శ్రమలను జూచి, మూడు గంటలసేపు వారుపడిన ఆవేదనను జూచి కరుణింప బ్రతిమాలు కొనుచున్నాము. అప్పుడు వీరంతా కూడా మీ అనంత కరుణను మహిమపరచుదురుగాక.  ఆమెన్.

పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం.

దివ్య కరుణ జపమాల
మన ప్రభువైన యేసునాధుడు పునీత ఫౌస్తీనమ్మకు, ఆమె వ్యక్తిగత ఉపయోగార్ధమై, దివ్య కరుణ సాధనకు నవదిన జపాలను గురించి చెప్పడమేగాక, ప్రతి ఒక్కరు చెప్పవలసిన ఒక ప్రభావపూర్ణ ప్రార్ధనను మరియు కరుణ కొరకు జపమాలను ఆమెకు తెలియజేసియున్నారు.  పునీత ఫౌస్తీనమ్మ దివ్యకరుణ జపమాలను నిరంతరం ప్రార్ధించింది. ఆమె ప్రత్యేకించి మరణావస్తలో ఉన్నవారికోసం ప్రార్ధించగా, ఇతరులను కూడా జపమాలతో ప్రార్ధించడానికి ఉత్సాహ పరచవలసినదిగా, ప్రభువు ఆమెను ఆదేశించారు.  దివ్యకరుణ జపమాలను ప్రార్ధిస్తే విశేష కృపావరాలను అందించగలనని   ప్రభువు వాగ్దానం చేసారు.

ఈ జపమాలను ఎవరైనా, ఎప్పుడైనా చెప్పవచ్చు.  జపమాలను జపించిన ఆత్మలకు కావలసిన కృపలన్నింటిని అనుగ్రహిస్తాను అని ప్రభువు వాగ్దానం చేసారు. మన వ్యక్తిగత ఉద్దేశముల కొరకు లేదా పునీత ఫౌస్తీనమ్మకు నిర్దేశించిన తొమ్మిది ఉద్దేశాల కొరకు నవదిన జపాలతో జపమాలను దివ్య కరుణకు అర్పించవచ్చును.

పునీత ఫౌస్తీనమ్మకు ప్రభువు ఈ విధముగా చెప్పియున్నారు. "నేను నీకు అనుగ్రహించిన జపమాలను జపించుటకు ఆత్మలను ప్రోత్సహించుము. దీనిని ఎవరు జపిస్తే వారికి ముఖ్యముగా మరణసమయములో గొప్పకరుణను అనుగ్రహిస్తాను. మరణావస్థలోనున్న వ్యక్తి సమక్షములో ఈ జపమాలను చెప్పిన యెడల, నేను ఆవ్యక్తికి, నా తండ్రికి మధ్యన ఉంటాను. రక్షణకొరకు చివరి ఆశగా దీనిని జపించుమని పాపులకు గురువులు సలహా ఇస్తారు. ఒకవేళ వ్యక్తి ఘోరపాపియైనసరే, ఈ జపమాలను కనీసం ఒక్కసారి జపించినచో, నా అనంతమయిన కరుణనుండి అతడు కృపావరాన్ని పొందగలడు. నా కరుణపై విశ్వాసముంచిన ఆత్మలకు నేను అనూహ్యమైన కృపావరాలను అనుగ్రహించడానికి ఇష్టపడతాను. నీవు అడిగేది నాచిత్తానుసారమైనచో ఈ దివ్యకరుణ జపమాల మూలముగా సర్వాన్ని సాధించుకోగలవు."

దివ్య కరుణ జపమాలను చెప్పడమేలా?
 పరలోక జపము
మంగళ వార్త జపము
విశ్వాస సంగ్రహము

పెద్ద పూసలపై (5)
నిత్యపితా! మా పాపముల మరియు సకల ప్రపంచం గావించిన పాపాల పరిహారమై మీ ప్రియ అద్వితీయ కుమారుడును, మా నాధుడైన యేసుక్రీస్తుయొక్క శరీర రక్తములను, ఆత్మ, దైవత్వమును నేను మీకు అర్పించుచున్నాను.

చిన్న పూసలపై (50)
 యేసు క్రీస్తు నాధుని బాధాకరమైన
సిలువ పాటులకుగాను, మా మీదను,
సమస్త ప్రపంచం మీదను దయగానుండండి.

ముగింపు ప్రార్ధన
 పావన దేవా!
ఏకైక పావన శక్తి స్వరూపా!
ఏకైక పావన నిత్యుడా!
మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి (3 సార్లు)

దివ్య కరుణా మూర్తికి
మధ్యాహ్నం 3 గం,,ల ప్రార్ధన
యేసువా! మీరు మరణించినప్పటికీ కూడా, ఆత్మల కొరకు మీ జీవపు ఊట పొంగి పొరలింది. సమస్త ప్రపంచానికి మీ కరుణా సముద్రం ఆహ్వానం పలికింది.
ఓ జీవపు ఊటా! ఊహాతీత దివ్యకరుణామూర్తీ! సమస్త ప్రపంచాన్ని ఆలింగనం చేసికొని, మా కోసం మిమ్ములను మీరు శూన్య పరచుకొన్నారు.
మా కోసమై దివ్యకారుణ్యపు ఊటలా, యేసు హృదయమునుండి ఎగజిమ్మిన ఓ రక్తజల ద్వయమా! నేను మిమ్ము విశ్వసిస్తున్నాను.

Home Page
Go to Top

No comments:

Post a Comment