ఆరోగ్యమాత: భారత దేశములో వెలసిన గొప్ప మరియభక్తి (8 సెప్టెంబర్)
నేడు ఆరోగ్యమాత పేరిట ఎన్నో
దేవాలయాలు నెలకొన్నాయి. వాటిలో మూడు పుణ్యక్షేత్రాలు, ఒక బసిలిక ఉన్నాయి. అయితే, ఆరోగ్యమాత
భక్తి ఆరంభం 16వ శతాబ్దానికి చెందినది. అది వెలాంగణి అను ఒక చిన్న పట్టణము. ఒకరోజు
(1550వ సం.లో) పాలు అమ్ముకునే ఒక హైందవ బాలుడు, చెరువు దగ్గరనున్న ఒక మర్రిచెట్టు
కింద నిలుచునియుండగా, సుందరమైన ఆరోగ్యమాత, దివ్యబాల యేసుతో దర్శనమిచ్చి, తన బిడ్డకు
కొన్నిపాలు ఇవ్వమని కోరగా, ఆ బాలుడు సంతోషముగా ఇచ్చాడు. తరువాత, తాను పాలుపోసే
ధనవంతుని యింటికి వెళ్ళగానే, తాను ఎందుకు ఆలస్యమైనది, ఆరోజు పాలు ఎందుకు కొంచెం
తక్కువైనవని వివరించాడు. కాని ఆ వ్యక్తి కుండను తీసిచూడగా, పాలు నిండుగానే
ఉన్నాయి. పాలు కుండనిండి పొంగిపొరలుతున్నాయి. ఆ స్త్రీ వద్దకు తనను తీసుకుని
వెళ్ళమని అడుగగా, అ బాలుడు అలాగే చేసాడు. అయితే, ఆ స్త్రీమూర్తి ఎవరో హైందవులకు
అర్ధము కాలేదు. అక్కడనున్న కొద్దిపాటి కతోలిక విశ్వాసులకు ఆ స్త్రీమూర్తి
మరియతల్లి అని అర్ధం చేసుకున్నారు. తన దివ్యకుమారుడైన బాలయేసుతో దర్శనమిచ్చినదని
వారు గ్రహించారు.
కొన్ని సంవత్సరాల తరువాత (16వ
శతాబ్ద చివరిలో), మరియతల్లి తన కుమారుడైన దివ్యబాల యేసుతో మరల దర్శనమిచ్చినది.
ఈసారి, మజ్జిగ అమ్ముకొనే ఒక కుంటి బాలునికి దర్శనమిచ్చినది. కొంచెం మజ్జిగను తన
బిడ్డకు ఇవ్వమని కోరగా, ఆ బాలుడు సంతోషముగా ఇవ్వడం జరిగింది. అదే క్షణములో పుట్టికతోనే
కుంటివాడైన ఆ బాలుడు స్వస్థతను పొందాడు. అచట తన గౌరవార్ధం ఒక దేవాలయాన్ని
నిర్మించాలనే తన కోరికను నాగపట్నంలోని ఒక స్థానిక కతోలిక వ్యక్తికి తెలుపవలసినదిగా
మరియతల్లి ఆ బాలునికి చెప్పినది. ఆ బాలుడు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ విషయాన్ని ఆ
వ్యక్తికి తెలియజేయడం జరిగింది. అప్పటికే, మరియతల్లి పేరిట ఒక దేవాలయాన్ని
నిర్మించాలని అతను కలలో గాంచియున్నాడు. త్వరలోనే, మరియతల్లి ఆ బాలునికి దర్శనమిచ్చిన
చోటులో, ఆ వ్యక్తి ‘మంచి ఆరోగ్యమాత’ పేరిట ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించాడు.
సంవత్సరాల తరువాత (17వ
శతాబ్దములో), ఘోర తుఫానులో చిక్కుకొనిన
పోర్చుగీసు నావికులకు మరియతల్లి దర్శనమిచ్చి వారిని విపత్తునుండి
కాపాడినది. వారు సెప్టెంబరు 8, మరియతల్లి జన్మదినోత్సవమున వెలాంగణి సముద్ర
ఒడ్డునకు చేరుకున్నారు. కృతజ్ఞతగా వారు అచ్చట
ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. నేడు ఇది గొప్ప పవిత్ర స్థలముగా కొనియాడ బడుచున్నది.
అద్భుతాల స్థలముగా పేరుగాంచినది. ఈ స్థలం నేడు ముద్దుగా ‘లూడ్స్ అఫ్ ది ఈస్ట్’ అని
పిలువబడుచున్నది. పునీత 23వ జాన్ జగద్గురువులు 1962వ సం.లో ఈ దేవాలయానికి బసిలికా
హోదాను కల్పించారు. ఈ దేవాలయములో ప్రతిష్టింపబడిన ‘ఆరోగ్యమాత’ అసలు స్వరూపాన్ని
మనం కనులార చూడవచ్చు. అలాగే ప్రార్ధనా మందిరములో, పై మూడు అద్భుత దర్శనాల వర్ణనలను
కూడా చూడవచ్చు. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 8న ‘ఆరోగ్యమాత’ పండుగ ఘనముగా కొనియాడబడు
చున్నది.
మానవ చరిత్రలో, ప్రత్యేకించి
కల్లోల సమయములో మరియ మాతృత్వముద్వారా, దేవుడు తన ప్రజలతో జోక్యము చేసుకుంటున్న
విషయం కాదనలేనిది! మరియ యేసు తల్లి మాత్రమే కాదు. ఆమె మనందిరికి తల్లి. మనందరిపట్ల
ఆమె త్రిత్వైక దేవుని సన్నిధిలో నిత్యమూ ప్రత్యేకమైన శ్రద్ధను వహిస్తున్నది.
అవసరమైనప్పుడు, పరలోకమున తన మహిమ సింహాసనమును వీడి, భువిపైకి దిగి తన బిడ్డలకు
దర్శనాలు ఇచ్చి దైవసందేశాన్ని మాతృప్రేమతో ఎప్పటికప్పుడు తెలియజేయు చున్నది. ఇది ఆ
మరియతల్లికి మనపైనున్న ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనం. రోగులపట్ల ఆ తల్లి ప్రత్యేక
శ్రద్ధ కలిగియున్నదని చెప్పడములో ఏ మాత్రము అతిశయోక్తి లేదు. 1524వ సం.మునకు
ముందుగా, అమెరికాలోని మెక్సికో పట్టణములో స్థాపించబడిన ఆసుపత్రికి “హాస్పిటల్ అఫ్
ది ఇమ్మాకులెట్ కన్సెప్షన్” అని నామకరణం చేయబడినది. ఇది ‘ఆరోగ్యమాత’కు గొప్ప
నివాళి.
కరోన వైరస్ వంటి ఎన్నో అనారోగ్య
సమస్యలతో సతమతమవుతున్న మనం మంచి ఆరోగ్యమాత వైపు మన కన్నులెత్తి చూద్దాం. శారీరక,
మానసిక స్వస్థత కొరకు ప్రార్ధన చేద్దాం. మన ఆత్మల ఆరోగ్యం కొరకు నిత్యం
ప్రార్ధనచేసే గొప్ప ఆరోగ్యమాత మన మరియతల్లి. పునీత సైమన్ స్టాక్, మరియను “పాపుల
ఔషధం”గా వర్ణించాడు. పునీత ఎఫ్రేము, “ఆశ్రితుల దృఢమైన ఆరోగ్యమా” అని వర్ణించాడు. మరియను
“లెబనాన్ దేవదారు వృక్షమా” అని పిలుస్తారు. ఎందుకన, ఆ చెట్టుకు వైద్యంచేసే
సద్గుణాలు ఉన్నాయి. “ఓ దేవుని తల్లి, పాపిని నీవు ఎన్నడు అసహ్యించుకొనవు.
నిట్టూర్పుతో నీ వద్దకు వచ్చిన పాపిని, నీ చేయితో అతనిని విడిపిస్తావు” అని పునీత
బెర్నార్డు కొనియాడారు.
ఆరోగ్యమాత సందేశం ఏమనగా, మనందరం
దేవుని బిడ్డలము. ఆకలిదప్పులతో నున్నవారితో అన్నపానీయాలను పంచుకోవాలి.
చిన్నబిడ్డలను, వికలాంగులను ఆదుకోవాలి. శాంతి, న్యాయం కొరకు కృషిచేయాలి.
ఆరోగ్యమాత
ప్రార్ధన: కనికరమునకు నిలయమైన ఆరోగ్యమాతా! మీ చెంతకు వచ్చిన మమ్ములను
దీవించండి. మమ్మందరిని ఆశీర్వదించండి. మాకందరికి మంచి తెలివి తేటలను ప్రసాదించండి.
ఓ తల్లి, మా కుటుంబములను మీ వరములతో నింపి, మా అందరి కుటుంబములలో శాంతి, సమాధాన,
సంతోషములను నెలకొల్పండి. ఓ మాతా, మాకు మంచి ఆయురారోగ్యములను ప్రసాదించండి. మా
బంధుమిత్రాదులను, మాకు సహాయం చేసేవారిని, మా శ్రేయోభిలాషులందరిని దీవించండి. మాకు
కావలసిన వరములను తగిన కాలములో దయచేసి, పైరుపంటలను సమృద్ధిగా దయచేయండి. మేమందరము మా
పాపములను విడనాడి పుణ్యమార్గమును అనుసరించి, మీ కుమారుని మంచి అనుచరులుగా జీవించే
భాగ్యమును మాకు అనుగ్రహించండి. మమ్ము సకల అపాయములనుండి కాచికాపాడండి. మంచి
ఆరోగ్యమాత! మాకొరకు వేడుకొనండి! మాకు మంచి ఆరోగ్యం పాలించండి!
No comments:
Post a Comment