పునీత మత్తయి (21 సెప్టెంబర్)

పునీత మత్తయి (21 సెప్టెంబర్)

“యేసు అటునుండి వెళ్ళుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అను వానితో, “నన్ను అనుసరింపుము” అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను” (మత్త.9:9).

క్రీస్తునందు ప్రియ సహోదరీ సోదరులారా, నేడు సెప్టెంబరు 21న అపోస్తలుడు మరియు సువార్తీకుడు పునీత మత్తయిగారి మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. పన్నులు వసూలు చేసుకుంటున్న మత్తయి దగ్గరికి యేసు వెళ్లి “నన్ను అనుసరింపుము” అని రెండే రెండు మాటలు పలుకగా, మత్తయి వెంటనే లేచి యేసును అనుసరించాడు. తన యింటికి భోజనానికి పిలిచాడు. అలాగే, ఇంకా అనేకమంది సుంకరులను భోజనానికి పిలిచి తన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నాడు.

పండ్రెండు అపోస్తలుల పట్టికలో ఏడు లేదా ఎనిమిదవ స్థానములో కనిపిస్తుంది (మత్త 10:3; మార్కు 3:18; లూకా 6:15; అ.కా. 1;13).

‘లేవీ అతని అసలు పేరు అయియుండవచ్చు. బహుశా, ‘మత్తయి అని క్రీస్తు ప్రభువే నామకరణం చేసి యుండవచ్చు. హీబ్రూ భాషలో “మత్తత్” అనగా ‘కానుక’ లేక ‘వరం’ అని అర్ధం. “య” అనే అక్షరం యావే దేవుని సంక్షిప్తరూపం. కనుక, “మత్తయి” అనగా ‘దేవుని కానుక’ లేదా ‘దేవుని వరం’ అని అర్ధం.

‘లేవీ లేదా ‘మత్తయి’ వృత్తిరీత్యా సుంకరి, అనగా ‘పన్నులు వసూలు చేయడం’ అతని వృత్తి. ఇతను గలిలియాలోని కఫర్నాము నివాసి. తండ్రి పేరు అల్ఫయి (మార్కు 2:14). ‘లేవీ’ అను నామం, అతను ఇశ్రాయేలు 12 తెగలలోని లేవీ తెగకు చెందినవాడని అర్ధమగుచున్నది. ఈ సుంకరి హేరోదు అంతిపసు కాలంలో కఫర్నాములో పన్నులు వసూలు చేసేవాడు. లేవీయులు రోమను అధికారుల తరుపున పన్నులు వసూలు చేసేవారు. ఎందుకన, అప్పటికీ, గలిలీయప్రాంతం, రోమను పాలితప్రాంతం. కనుక, అందరూ పన్నులు రోమా చక్రవర్తికి, స్థానిక గవర్నరుద్వారా పన్నులు చెల్లించాల్సిందే! దీనిని స్థానికముగానున్న యూదులద్వారా వసూలు చేసేవారు.

బహుశా, లేవీ అత్యాశాపరుడు, ధనవ్యామోహం కలవాడు. దానికి బలవంతంగా పన్నులువసూలు చేసేవాడు మరియు అవసరమైన దానికంటే ఎక్కువ పన్నులు వసూలు చేసేవాడు. అందుకే, యూదనాయకులు, ప్రజలు, సుంకరులను లేదా ‘లేవీయులను’ జాతిద్రోహులుగా, మతద్రోహులుగా, పాపాత్ములుగా, దొంగలుగా పరిగణించేవారు. అయితే, మనలనందరినీ ఆశ్చర్యపరచే విషయాలు ఏమిటంటే, ఒకటి అలాంటి వ్యక్తిని ప్రభువు సమీపించి తనను అనుసరించమని పిలవడం, రెండు మత్తయి వెంటనే, తన వృత్తిని సర్వస్వాన్ని విడచి ప్రభువును అనుసరించడం! బహుశా, యేసు మత్తయి హృదయాన్ని చూసాడు. బహుశా, తను జీవిస్తున్న జీవితంపట్ల మత్తయి సంతోషముగా లేకపోయి యుండవచ్చు. తన హృదయములో ఎదో కొత్త జీవితాన్ని అన్వేషిస్తుండవచ్చు! ఈ లోకములో మనకు అన్ని ఉండవచ్చు, కాని హృదయములో నిజమైన సంతోషం, సమాధానం క్రీస్తును కలుసుకొని, ఆయనను అనుసరిస్తేనే మనకు లభిస్తుంది.

అపోస్తలుడు మత్తయి పిలుపునుగూర్చి మనం మత్తయి 9:9-13; మార్కు 2:13-17; లూకా 5:27-32 లలో చదవవచ్చు. తాను రచించిన మత్తయి సువార్తలో మాత్రమే తన పేరును ‘మత్తయి’గా ప్రస్తావించడం జరిగింది. మిగతా సువిషేశాలలో తన పేరును ‘లేవీ’గా చెప్పబడింది. “నన్ను అనుసరింపుము” అన్న ప్రభువు మాటలకు, మత్తయి వెంటనే స్పందించాడు. వెంటనే లేచి యేసును అనుసరించాడు. యేసు పిలుపునందుకున్న లేవీ అమితానందముతో, తాను పొందిన ‘దైవపిలుపు’కు, నూతన జీవితానికి సూచనగా గొప్పవిందును ఏర్పాటుచేసి, యేసును, తన శిష్యులను, తోటివారందరిని ఆహ్వానించాడు. మన ‘దైవపిలుపు’ కేవలం మన కొరకు మాత్రమే కాదని, ఇతరుల మేలు కొరకుకూడా అని అర్ధమగుచున్నది. దేవుని పిలుపులోని సంతోషాన్ని ఇతరులతో పంచుకొనే సంతోషంగా మనం గుర్తించాలి. అలాగే, నేటి ప్రస్తుత సమాజములో బహిష్కరింపబడినవారితోను, పాపాత్ములుగా పరిగణించబడినవారితోను, అణగద్రొక్కబడిన వారితోను, నిరాశ్రయులతోను, పేదవారితోను మనం ప్రభువువలె సహవాసం చేయాలి, వారిని ఆదరించాలి. ఇలా చేయడములో మనం ప్రభువు ఉద్దేశాన్ని మరువకూడదు, అదేమంటే, పాపులను పశ్చాత్తాపానికి పిలువడం, వారికి దేవుని క్షమాపణను, కరుణను, దయను, స్వస్థతను అందించడం, దేవునితో వారిని సమాధానపరచడం, తోటివారితో సఖ్యత పరచడం. అయితే, ఇతరులతో సహవాసం చేసేముందు, మనం యేసుక్రీస్తుతో సహవాసం చేసామా అని ప్రశ్నించుకోవాలి? మనం ఇతరులకు వైద్యునిగా ఉండాలంటే, ముందు మనం పరమవైద్యునినుండి స్వస్థతను పొందాలి. మనం ఇతరులకు క్రీస్తుగా ఉండాలంటే, ముందు యేసు మనకు క్రీస్తు అయియుండాలి.

క్రీస్తుప్రభువు అపోస్తులలో వీరు ఒకరు. ప్రభువు జీవితంలోని ముఖ్యసంఘటనలకు, ప్రసంగాలకు ప్రత్యక్షసాక్షి. కావున తాను వాటన్నింటిని రాసేందుకు ప్రేరేపింపబడ్డాడు. అపోస్తులులు వీటన్నింటిని బహిరంగంగా బోధించేవారు. క్రీస్తుకాలంలో యూదులు, ఇతరులుకూడా అరమాయిక్‌ భాష ఎక్కువగా తెలిసినవారు కనుక, తన సువార్తను అరమయిక్‌ భాషలో వ్రాసినారు.

మత్తయి తన సువార్తను యూద-క్రైస్తవులను ఉద్దేశించి రాసాడు. యేసుక్రీస్తు జీవిత చరిత్రను చెప్పడానికి మాత్రమే కాకుండా, అప్పటి యూదాక్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి, బలమైన యూదామత ప్రభావంనుండి తన తోటియూదులకు పరివర్తన కలిగించి రక్షించేందుకు వ్రాశాడు. ముఖ్యముగా పాత నిబంధన గ్రంధములో దేవుడు వాగ్దానం చేసిన ఆ మెస్సయా ఈ క్రీస్తేనని బలంగా తన సువార్తలో వినిపించాడు. అందుకోసమై, వారి స్వభావానికి తగిన ఆజ్ఞలను, కార్యాలను, ప్రోగుచేసి, మెస్సియానుగూర్చి వ్రాయబడిన ప్రవక్త ప్రవచనాలన్నింటినీ సంపూర్ణంగా యేసు నెరవేర్చాడని వ్రాశాడు. యేసు బెత్లెహేములో కన్యమరియకు జన్మిస్తాడని, రోగులను స్వస్థపరుస్తాడని, అన్ని క్రియలందును చివరకు తన శ్రమలు, మరణం వరకును పూర్వం యెషయా ప్రవక్త ప్రవచనాలను నెరవేర్చారని నిరూపించాడు. 28 అధ్యాయాలు, 1,071వచనాలు కలిగిన ఈ సువార్తలో 53సార్లు పూర్వ నిబంధన వచనములు ప్రస్తావించడం జరిగింది. ఈవిధముగా, పాత నిబంధన ప్రవచానాలు యేసుక్రీస్తు జీవితములో నెరవేరాయని మత్తయి తన సువార్తలో నివృత్తి చేసాడు.

పునీత మత్తయి తన సువార్త వ్రాయకపూర్వమే యేసు ప్రసంగాలు, మాటలు అరమాయిక్‌ భాషలో ఉండేవని వాటన్నింటిని ప్రోగుచేసి ఒక క్రమపద్ధతిలో అమర్చి సువార్తగా రూపొందించాడని కొందమంది చెబుతూ ఉంటారు. అరమయిక్‌ భాషలో వ్రాయబడిన ప్రాచీన సువార్త దురదృష్టవశాత్తు మనకు అందుబాటులో లేదు.

పెంతకోస్తు పండుగ అనంతరం, మత్తయి యూదియా ప్రాంతములోని యూదులకు, అలాగే దూరప్రాంతలైన సిరియా, పర్షియా ప్రజలకు సువార్తా ప్రచారం చేసి అనేకులను క్రీస్తువిశ్వాములోనికి నడిపించాడు. ఇతియోపియా దేశానికి చెందిన ‘హిరాకుస్’ అనే రాజు, నిత్యకన్యకా వ్రతమును స్వీకరించిన మరియు వయసులో ఎంతోచిన్నదైన తన మేనకోడలు ‘ఎఫిజెనియా’ను వివాహమాడుటకు సన్నాహాలు చేయుచుండగా, మత్తయి దానిని తీవ్రముగా ఖండించాడు అందుకు అతను రాజు ఆగ్రహానికి గురయ్యాడు. ఒకరోజు దివ్యపూజాబలిని సమర్పిస్తున్న సమయములోనే, సైనికులు దేవాలయములోనికి ప్రవేశించి ఖడ్గముతో పొడిచి మత్తయిగారిని హతమార్చారు. అపోస్తలుడు మత్తయి వేదసాక్షి మరణాన్ని పొందాడు. ఈవిధముగా, “నన్ను అనుసరింపుము” అన్న ప్రభువు పిలుపుకు స్పందించి, మత్తయి క్రీస్తును కల్వరి వరకు అనుసరించాడు.

మత్తయిగారి అవశేషాలు ఇటలీ దేశములోని ‘సలెర్నో’ అనే నగరమందు భద్రపరచగా, 11వ శతాబ్దములో అక్కడ గొప్ప దేవాలయం వెలసింది.

నేటి సువిషేశములో ప్రభువు పలికిన మూడు ముచ్చటైన వాక్యాలను జ్ఞాపకం చేసుకుందాం: ఒకటి “వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!” రెందు, “నాకు కారుణ్యము కావలయును గాని, బలి అవసరము లేదు”, మూడు, “నేను పాపులను పిలువా వచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు.”

మత్తయిగారి జీవితం మారుమనస్సు పొందిన జీవితం. క్రీస్తుతో వ్యక్తిగతానుభవం కలిగిన జీవితం. పన్నులు వసూలుచేసే బల్లనుండి, ప్రభువు బల్లవద్ధకు అనుసరించిన జీవితం. మత్తయిగారి జీవితం మనదరికీ ఒక స్ఫూర్తి, ఆదర్శం, ప్రేరణ. మనకు ఒక గొప్ప ఆశను, నమ్మకాన్ని కలిగిస్తుంది. దేవుని ప్రేమకు, దయకు మించినది ఏదీ లేదని తెలుస్తుంది. దేవుని ప్రేమ, మన్నింపు గొప్ప శక్తిగలవి. పాపాత్ములను పిలచి పునీతులుగా మార్చు గొప్ప శక్తిగలవి. “గతంలేని పునీతుడు లేడు; భవిష్యత్తులేని పాపాత్ముడు లేడు” అన్న పునీత అగుస్తీను వారి మాటలు మత్తయిగారి జీవితానికి ఆపాదించవచ్చు. దేవుని ఎదుట మనమందరం పాపాత్ములమే, అయితే పశ్చాత్తాప పడినచో, దేవుని దయకు, కృపకు పాత్రులమవుతాము. ఇదే మనందరి భవిష్యత్తు కావాలని ప్రార్ధన చేద్దాం.

No comments:

Post a Comment