ఆగమనకాల
రెండవ ఆదివారము, YEAR C
బారూకు
5:1-9; ఫిలిప్పీ 1:4-6, 8-11; లూకా 3:1-6
ప్రభువు
మార్గములో నడచెదము
సియోను వాసులారా! వినుడు. ప్రజలను
రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు
ఆనందకరముగా వినిపింపజేయును. ఈరోజు
శ్రీసభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శముగా చూపిస్తూ ఉంది. అతడే పునీత బప్తిస్మ
యోహాను. ప్రవక్తలందరిలోకెల్ల గొప్ప ప్రవక్త, చివరి
ప్రవక్త బప్తిస్మ యోహాను. దేవుని వాక్యాన్ని ఆలకించి, దానిని
మనసారా స్వీకరించి, దైవప్రజలకు అందించడం ప్రవక్తల
మొదటి కర్తవ్యం. కనుక ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి. అలాంటి ప్రవక్తలలో ఒకరైన యెషయా ప్రవక్త పలికిన
మాటలు, బప్తిస్మ యోహాను జీవితము ద్వారా నిజమవుతూ
ఉన్నాయి. "ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు" (యెష 40:3; లూ 3:4)
అని ప్రవక్త పలికిన ఈ మాటలద్వారా బప్తిస్మ యోహాను దైవప్రజలను ప్రభువు
మార్గములోనికి ఆహ్వానించియున్నాడు. ప్రభువు రాకకోసం మార్గమును సిద్ధము చేయాలని
కోరుతున్నాడు. పశ్చాత్తాపము, జ్ఞానస్నానము అను మార్గములద్వారా ప్రజలను
సిద్ధముచేసి ముందుకు నడిపించాడు. ప్రవక్తగా, ప్రభువు
మార్గమును సిద్ధపరచడం, ప్రభువును అనుసరింపగోరువారికి పశ్చాతాపముగూర్చి ప్రకటించడం
యోహాను పాత్ర. ప్రభువు దరికి వచ్చు వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన భాద్యత.
మొదటి పఠనములో బారూకు ప్రవక్త చెప్పిన
విధముగా: "ప్రతీ లోయ పూడ్చబడును. పర్వతములు, కొండలు
సమము చేయబడును. వక్రమార్గములు సక్రమము చేయబడును. కరకు మార్గము నునుపు
చేయబడును" (5:7; లూ 3:5). మొదటి పఠన
నేపధ్యము, ఇశ్రాయేలు ప్రజల బానిసత్వ ముగింపును, రక్షణను
(మార్గము), త్వరలో వారు పొందబోవు ఆనందమును ఈ వాక్యం
సూచిస్తుంది. ఈవిధముగా, ప్రభువు
తన ప్రజల పాపములను క్షమించి తన దయను చూపును.
క్రీస్తు రాకకొరకు మనలను మనం
తయారుచేసుకొనే ఈ పవిత్ర ఆగమన కాలములో, మనలోనున్న లోయలగు చెడును తీసివేయడానికి
ప్రయత్నించాలి. అలాగే, గర్వాన్ని, అహంకారాన్ని
విడచి పెట్టాలి. మనం తీసుకొనే చెడు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి. మనలో ఉన్న రాతి
హృదయాన్ని కరిగించమని ప్రభువును వేడుకోవాలి. పాపము మన రక్షణ మార్గమునకు ఆటంకము.
రక్షణ మార్గమునకు మొదటి మెట్టు నిజమైన పశ్చాత్తాపము, పరిపూర్ణమైన
ప్రేమ. రక్షణ అనేది దేవుని వరం. అయినను, మన కృషిని, సహకారాన్ని
దేవుడు ఆశిస్తాడు. 'యేసు క్రీస్తునందు విశ్వాసము' మనకు
రక్షణ వరము లభింప జేయును: 1). క్రీస్తు పిలుపును (మా 1:17; 2:14) అందుకొని
ఆయనను అనుసరిస్తూ, ఆయన ప్రేషిత కార్యములో భాగస్తులం కావాలి. 2).
క్రీస్తు శ్రమలు, మరణములో పాల్గొనునట్లు చేయు ఆయన సిలువను
అంగీకరించాలి (మ 16:24). అన్నింటికన్న, ఆయనను
పరిపూర్ణముగా ప్రేమించాలి. 3). అన్ని విషయములలో క్రీస్తును అనుసరించాలి, అనుకరించాలి
(యో 12:26).
అయితే, ఇక్కడ
మనం ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా, ఆ
ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. మనం ఆయన చెంతకు వెళ్లకముందే ఆయన ఒక అడుగు
ముందుకేసి మనకన్న ముందుగా మన దగ్గరకు వస్తున్నాడు. ఎందుకన, రక్షణ
కార్యములో మొదటి అడుగు వేసింది ప్రభువే కదా! కనుక, క్రిస్మస్
పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి యేసు అను వ్యక్తిగా మన మధ్యకు వస్తూ
ఉన్నాడు. ఆ గొప్ప ఘడియనే మనం క్రీస్తు జయంతిగా కొనియాడుతూ ఉన్నాము. ఒక విధముగా
దేవుడే మనకు మార్గాన్ని తయారు చేస్తున్నాడు. ఆ మార్గములో మనలను నడచుకోమని, జీవించమని
ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు "నేనే మార్గమును, సత్యమును,
జీవమును" (యో 14:6) అని చెప్పారు. కనుక, ప్రభువు
పిలుపును గుర్తించి, గ్రహించి, అది ఒక
భాద్యతగా స్వీకరించి, ప్రభువుకు సమాధానం చెప్పాలి. ఆయన మార్గములో
నడవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రభువు మార్గము మన మార్గాలకన్న భిన్నమైనది. ఆయన
మార్గము రక్షణ మార్గము. "ప్రతీ ఒక్కరు దేవుని రక్షణమును కాంచును" (లూ 3:6)
అని సువార్తలో వినియున్నాము. కనుక, ఎవరైతే
ప్రాపంచిక మార్గాలను విడిచి, ప్రభువు చూపించే మార్గములో నడుచుకొంటారో, వారు
తప్పక ఆయన రక్షణములో పాలు పంచుకొంటారు.
ఆగమన కాలంలో, 'ప్రభువు
వస్తున్నాడు' అన్న సందేశం మన హృదయాలలో మ్రోగుతూ ఉంటుంది. ఆ
సంతోషకర సందేశమే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రభువు రాకతో, తన
జీవితాన్ని, ప్రేమను మనతో పంచుకొంటున్నాడు. అదే సమయములో,
మన జీవితాన్ని, ప్రేమను దేవునితోను, ఇతరులతోనూ
పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాడు. యోహాను ప్రకటించిన 'క్రీస్తు
రాకడ' కొరకు విశ్వాసముతో నిరీక్షించాలి. ప్రభువు రాకను
స్వాగతించి, ఆయనకు మన హృదయాలలో స్థానం ఇవ్వాలి. యోహానువలె మనముకూడా ఈనాడు మన సంఘములో ప్రవక్తలుగా
మారాలి. ఇతరులకు మార్గచూపరులుగా ఉండాలి. ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలి. ప్రభువు
దరికి రావడానికి వారికి మార్గమును సిద్ధపరచాలి. దేవుని వాక్యమును బోధించాలి.
రెండవ పఠనములో
మూడు అంశాలను చూడవచ్చు: 1). కృతజ్ఞత: ఫిలిప్పీ
క్రైస్తవుల ఉదారస్వభావాన్నిబట్టి, తన అపోస్తోలిక కృషిలో వారు చేసిన సహాయాన్ని బట్టి,
పౌలు సంతోషముతో దేవునకు కృతజ్ఞతలు తెలియజేయు చున్నాడు. వారియందు
దేవుడు ప్రారంభించిన మంచి పనిని సంపూర్ణము చేయును. 2). ప్రేమయందు
ఎదుగుదల: దైవప్రేమ, సోదర
ప్రేమ వారిలో ఎదగాలని ఆశిస్తున్నాడు. వారి ప్రేమ వర్ధిల్లాలని పౌలు ప్రార్ధన
చేయుచున్నాడు. 3). క్రీస్తు దినము: క్రీస్తు
దినమున వారు కల్మషము లేనివారుగా, నిర్దోషులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. అది వారి
ప్రేమద్వారా సాధ్యమగును.