సకల పునీతుల పండుగ (1
నవంబర్)
పునీతుడు / పునీతురాలు అనగా పవిత్రుడు / పవిత్రురాలు అని అర్ధం. ప్రతి పునీతుడు / పునీతురాలు సృష్టికర్తయైన దేవుని అత్యత్తమ నిర్మాణము. ఆయన ప్రతినిధి, ఆయన స్వరం. నులివెచ్చదనంతో అటు ఇటుగాకుండా జీవించే వందమంది కంటే ఒక్క పునీతుడు / పునీతురాలు దేవునికి అమోఘమైన మహిమను సంపాదించి పెడతారు. పునీతులందు దేవుడు తన వాక్కు విలువను, సువార్తా సుగంధమును, అష్టభాగ్యాల మాధుర్యాన్ని నిక్షిప్త పరుస్తారు.
ఈ పునీతులందే శ్రీసభ తన అమూల్య సంపదను, తన విలువ క్రమాన్ని భద్రపరుస్తుంది. పునీతులద్వారా
పునరుద్ఘాటిస్తూ, తన సభ్యులను
సంఘటిత పరుస్తుంది. పునీతుల ద్వారా తన ఔన్నత్యాన్ని, మహిమను, విజ్ఞానమును
ప్రతిబింబిస్తుంది.
పునీతులు జ్ఞాన చోదకులు, సునిశిత బోధకులు, ఆదర్శప్రాయు, దైవరాజ్య నమూనాలు, ఇహవరాలకు వారధులు. అట్టివారి స్మరణ మనకు
దీవెనే! అయితే, పునీతులలో
అన్నిరకాల జీవన స్థాయికి, అంతస్తుకు చెందిన
వాళ్ళున్నారు. యేసు ప్రభుని ప్రధమ శిష్యులు (అపోస్తులు), పీఠాధిపతులు, సువార్తీకులు, ప్రేషితులు, దైవరాజ్యం కోసం అహర్నిశలు శ్రమించినవారు, వివిధ మఠస్థాపకులు, గురువిధ్యాయాలలో ఆచార్యులు, మఠవాసులు (స్త్రీ-పురుషులు), క్రొత్తగా విశ్వాసంను చేపట్టినవారు, వివిధ దేశవాసులు (భారతీయులు కూడా), అత్యున్నత పురస్కారం (నోబల్ బహుమతి)
పొందినవారు, వీరందరూ దేవుని
పరికరాలే, ఆనవాళ్ళే.
ఈ సకల పునీతుల మహోత్సవం రోజున శ్రీసభ
అధికారికంగా గుర్తించబడిన, గుర్తింపులేని, పునీత పట్టం కట్టిన, కట్టని సకల పునీతులను గౌరవిస్తూ, వారిని ఆ గొప్ప స్థితికి చేర్చిన పవిత్రాత్మను
ఆరాధిస్తాం. ‘‘మనకోసం
మధ్యవర్తిత్వం వహించి ప్రార్ధించమని మనం పునీతులను వేడుకోవడం అవసరమా?’’ దీనిని గురించి పునీత తోమాస్ అక్వినాసుగారు
దేవుని అధికార క్రమంలో, మనం పునీతుల
ద్వారా ఆయన చెంతకు చేర్చబడాలని, ఆయన దివ్యవరాలు
వారిద్వారా మనపై కురిపిస్తారని, వారి మధ్యవర్తిత్వం
ద్వారా మనపై దీవెనలు దిగివస్తాయని చెప్పారు. పునీతుల విజ్ఞానం దేవుని ప్రేమలో నెలకొని
ఉంటుంది. అందువలననే, పునీత
అల్ఫోన్సుస్ గారు, ‘‘ఎవరైతే తన
హృదయంలో సంపూర్ణ పవిత్రత సాధించుటకు ఆశను కలిగి ఉండరో అతడు/ఆమె ఉత్తమ
క్రైస్తవుడు/రాలు కానేరడు/దు’’ అని తెలిపారు.
దేవుడు ఎప్పుడునూ అసాధ్యమైన కార్యాలను కోరడు.
మన జీవితంలో చేసే ప్రతి మంచి పనికి దేవుడు బహుమతినిస్తారు. అది ఈ జీవితంలో కూడా
సాధ్యమే! కాని, సణుగు కొనుచు
పనిచేస్తే దేవుని నుండి గొప్ప కార్యమును, మహత్తర కార్యమును ఎలా ఆశించగలం అని పునీత అవిలాపుర తేరేసమ్మగారు అన్నారు.
అయితే, ఈ లోకంలో జీవిస్తున్న మనం
సంపూర్ణ స్థితిగల దైవరాజ్యంలోని ఆత్మతో సఖ్యత కలిగి ఉన్నాం. క్రైస్తవులు తమ
విశ్వాస ప్రకటనలో ‘‘పునీతుల సంబంధ
ప్రయోజనమును విశ్వసించు చున్నాను’’
అని చెప్పుచున్నారు.
పునీత ఎఫ్రేము, పునీత జాన్
క్రిసోస్తం వారిననుసరించి నాల్గవ శతాబ్దంలోనే సకల వేదసాక్షులను (పునీతులను)
గౌరవించడం జరిగింది. ఎనిమిదవ శతాబ్దంలో రోమ్ నగరంలో నవంబర్ ఒకటవ తారీఖున ఈ
సంప్రదాయము నాచరించడం ఉండేది. ఈ శతాబ్దంలోనే జగద్గురువులైన నాల్గవ గ్రెగోరి ఈ
సంప్రదాయాన్ని శ్రీసభ అంతటికీ వ్యాపింప చేసారు. ఈరోజున ప్రతి విచారణ గురువు తన
విచారణలోని ప్రజందరి కొరకు దివ్యపూజా బలిని అర్పిస్తారు.
మనం సత్యోపదేశంలో నేర్చుకున్న దానిని బట్టి, ఈలోకంలో ఉన్నవారు యుద్ధసభ లేదా యుద్ధరంగ
క్రైస్తవులు, ఉత్తరించు స్థలంలోని
ఆత్మలు ఉత్తరించు సభ లేదా బాధామయ క్రైస్తవులు, మోక్షాన్ని
స్వతంత్రించుకున్న ఆత్మల జయసభ లేదా విజయ క్రైస్తవులు అని తెలుసుకున్నాం. ఈ మూడు సభలు
కలిస్తేనే విశ్వ శ్రీసభ అవుతుంది. ఈ సభలు ఒకరికొకరు సంబంధం కలిగి దైవ ప్రేమలో, కృపలో భాగస్తులై ఒక కుటుంబంగా భావించాలి. ఒక
కుటుంబములోని సభ్యులు ఎలాంటి సహాయ సహకారాలు అందించుకుంటూ జీవిస్తుంటారో సామాన్యులకు
కూడా తెలిసిందే కదా!
ఇటువంటి సఖ్యత, బాంధవ్యమును బట్టి దైవరాజ్యంలోని పునీతులు మనల్ని కూడా తమ అడుగు జాడల్లో నడచి, ప్రభు మార్గంలో పైకి రావాలని, శక్తివంచన లేకుండా తమ ప్రార్ధనల్ని, విన్నపాల్ని ప్రభువుకు అప్పగిస్తారని అనడంలో
సందేహం లేదు.
‘‘పరదేశం (భూలోకం) లో ఉన్న మనల్ని స్వదేశం (మోక్షరాజ్యం) లోని స్వగృహంకు చేరి
తండ్రిని చూచి, స్తుతించి, ఆరాధిస్తూ, సంతోషిస్తూ ఉండేందుకు పునీతులు సదా మనల్ని స్వాగతిస్తూనే ఉంటారు. ప్రభువు
ద్వారా, ప్రభువుతో, ప్రభువునందు ఉండేందుకై మనకోసం ఆ పునీతులు
మధ్యవర్తుల్లా ఎల్లప్పుడూ దేవాధి దేవుని వేడుకుంటూనే ఉంటారు. వారి శ్రద్ధ మన
బహీనతల్లో ఎంతో సహాయకారి కాగలదు’’
అని ఆరవ పౌలు
పోపుగారు సందేశం ఇచ్చారు.
ఆత్మలన్నింటికి పరిపూర్ణతను ప్రసాదించి, హెచ్చించి, వారిని దేవుని మహిమలోనికి ప్రవేశింప యోగ్యత కలిగించేది స్వయంగా పవిత్రాత్మ
సర్వేశ్వరుడే. ఇక్కడ మనం గుర్తుంచు కోవసినది ఏమంటే, క్రీస్తు పరమ దేవరహస్యాలను క్రోడీకరించి, ఏడాది పొడవున గుర్తుచేసి కొనియాడ చేసిన శ్రీసభ ఈ సకల పునీతుల పండుగ రోజున
క్రీస్తు సిలువ విజయ ఫలాల్ని గుర్తు చేస్తుంది. పునీతులను సాధించుకున్న ప్రభువును
కొనియాడుతుంది.
పరిశుద్ధతకు మారుపేరు మన రక్షకుడైన క్రీస్తు
పాప దోషంపై పరిశుద్ధతా విజయం సాధించి,
మనకు విజయం
సాధించి పెట్టిన క్రీస్తు కృపయే, అనగా క్రీస్తు
అద్వితీయ ప్రేమ జీవితమే. అదే ముక్తికి మూలం.
‘‘పరిశుద్ధతను సాధించాలనే కోరిక తన హృదయంలో లేకున్నట్లయితే, అతడు క్రైస్తవుడైనా కాని, అతడు ఉత్తమ క్రైస్తవుడు కాడు, కానేరడు’’ అంటున్నారు పునీత అల్ఫోన్సుసు గారు. ప్రభువైన క్రీస్తు అసాధ్యమైనదేదీ మనలనుండి
కోరుట లేదు. అసాధ్యమనుకున్న మంచికి సుసాధ్యం చేసుకొన ప్రయత్నించమని దేవుడు మనల్ని
కోరుతున్నాడు.
క్రీస్తు ప్రేమకోసం, సాక్ష్యంకోసం ఎందరో పుణ్యాత్ములు అనేక ప్రదేశాలలో అనేక విధాల హింసింపబడి వధింప బడ్డారు. ఈ సందర్భంగా ఈ లోకంలో మరణం అనగా పరలోకంలో జననం అని అర్థం అని చెప్తారు.
No comments:
Post a Comment