మరియతల్లి తల్లిదండ్రులు పు.జ్వాకీము, అన్నమ్మ గార్ల మహోత్సవం - జూలై 26వ తేదీ
"మరియతల్లిని" గూర్చి తెలియని క్రైస్తవ ప్రపంచం ఉండదు. ఆమె దేవుని తల్లి, దేవమాత అని అందరికీ తెలుసు. మరి అంతటి గోప్ప ధన్యురాలకు జన్మనిచ్చిన ఆమె తల్లిదండ్రులు పునీత జ్వాకీము, అన్నమ్మ గార్ల గురించి ఎంత మందికి తెలుసు? ప్రతి ఏట ఈ రోజున అనగా జూలై 26 వ తేదీన విశ్వ శ్రీ సభ వారి మహోత్సవాన్ని కొనియాడుతున్నది అని ఎంత మందికి తెలుసు? ఈనాడు వారి మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంగా వారి జీవితాలను గూర్చి, వారి సుగుణాలను గూర్చి కొన్ని లోతైన విషయాలు సవివరంగా ధ్యానిద్దాం-:
1. దేవమాతకు జన్మనిచ్చిన ధన్య దంపతులు
పునీత జ్వాకీము,
అన్నమ్మ గార్లు-:
కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు
తన కుమారుని జన్మను సంకల్పించి, ఓ పుణ్య దంపతుల కోసం శోధించి, పరిశోధించి పునీత జ్వాకీము, అన్నమ్మ
గార్లను ఎన్నుకున్నారు. ఎన్నో సంవత్సరాలు దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించి, తన కుమారుని
ఆగమనానికి జన్మనిచ్చే బిడ్డ వీరి ద్వారా కలగాలని ఈ వృద్ధ దంపతులను ఎన్నుకున్నారు.
యూదా మత విశ్వాసములో సంతానాన్ని దేవుడిచ్చిన సంపదగా భావించేవారు. సంతానం లేని
వారిని పాపాత్ములుగా, ఎందుకు
పనికిరాని వారిగా పరిగణించేవారు. పాత నిబంధనలో మనం ధ్యానం చేసినట్లయితే ఏవైనా
పండుగలు వచ్చినప్పుడు,
లేదా చేసిన పాపాలకు పరిహారం చెల్లించుకోవటానికి గొర్రె పిల్లలను దహన బలిగా
దేవునికి సమర్పించేవారు.పునీత జ్వాకీము, అన్నమ్మ గార్లకు వివాహమైన చాలా సంవత్సరాల వరకు
సంతానం కలుగలేదు. ఏ దేవాలయానికి అర్పణ తీసుకువెళ్ళిన యాజకులు సంతానం లేకపోవడం వలన
వీరి యొక్క అర్పణలను తిరస్కరించి మీరు ఏదో పాపము చేసి ఉంటారు అందుకే మీకు సంతానం
కలుగలేదు అనే సూటిపోటి మాటలతో బాధ పెట్టే వారు. ఇటువంటి మాటలు వారిని తీవ్రంగా బాధ
పెట్టాయి. వెంటనే వారు దేవుని శరణు వేడుకున్నారు. దేవుడు వారికి ఒక ఉన్నతమైన
బహుమానాన్ని అనుగ్రహించారు. అదే దేవమాతకు జన్మనివడం. వారి జీవితంలో ఎన్ని అవమానాలు, ప్రజల యిసడింపులు, శాపనార్థాలు ఎదురైనా వాటికి తట్టుకుని
నిలబడి ఓర్పుతో ప్రార్థించారు దేవమాతకు జన్మనిచ్చారు. దేవుని సంకల్పానుసారం ఆ
తల్లిని దేవుని అడుగుజాడల్లో పెంచారు. పసి వయసులోనే ఆ తల్లిని దేవాలయంలో కానుకగా
అర్పించి పుణ్య దంపతులుగా,
ఆదర్శ దంపతులుగా క్యాతిని పొంది ప్రసిద్ధికెక్కారు.
2. ఈ పుణ్య దంపతులు మనందరికీ
ఇస్తున్నటువంటి సందేశం-:
నేటి ఆధునిక యుగంలో
తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను గారాబం దిశగా పెంచుతున్నారు. అడిగిన వెంటనే అన్ని
ఆలోచించకుండా కొనేస్తున్నారు. చిన్నతనం నుండే సెల్ ఫోన్స్ అలవాటు చేస్తూ
దైవభక్తికి దూరంగా పెంచుతున్నారు. "మొక్కై వంగనిది మానై వంగునా" అనే
నానుడి మనందరికీ తెలుసు మొక్కై వంగనిది అంటే చిన్నతనం నుండి పిల్లలను సరైన
క్రమశిక్షణలో పెంచాలి. మంచి ఏదో చెడు ఏదో చెబుతూ పెంచాలి. మానై వంగునా అనగా
చిన్నతనంలో మన పిల్లలకు ఏది మంచి ఏది చెడు అని చెప్పకుండా పెంచి పెరిగి పెద్దయిన
తర్వాత దారిలో పెట్టాలి అనుకుంటే వారు మన దారిలోకి రారు మన మాటలను పెడచెవిన
పెడతారు. సాక్షాత్తు క్రీస్తుకు
జన్మనిచ్చి తరతరాల వారితో ధన్యురాలుగా మరియతల్లి కీర్తించబడుతున్నారు అంటే
మరియతల్లి తల్లిదండ్రులు ఎంత భక్తి, విశ్వాసాలతో ఆమెను పెంచారో మనకు అర్థం అవుతున్నది.
సాధారణంగా దంపతులకు ఒకరే సంతానం ఉంటే గారాబంగా పెంచుతు కాలు క్రింద పెట్టకుండా
చూసుకుంటారు. కానీ మరియతల్లి తల్లిదండ్రులు ఆమెను గారాబంగా పెంచలేదు. దేవుడు
మెచ్చే బిడ్డగా పెంచారు ధర్మశాస్త్రాన్ని ఆ తల్లికి బోధిస్తూ పెంచారు. అందుకే ఆ
తల్లి ఈ లోకాన్ని ఏలే క్రీస్తు రారాజు కని మనకు ప్రసాదించగలిగారు. ఏ కుటుంబంలో
అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం దైవ వెలుగుతో నిండి పోతుంది అనటానికి పునీత
జ్వాకీము, అన్నమ్మ
గార్ల జీవితమే ఒక ఉదాహరణ సంతానం లేనప్పుడు ఎందరో వారిని సూటిపోటి మాటలతో
అవమానించారు కానీ వారు దేవుని విశ్వసించి ప్రార్థించారు ప్రార్థించారు
ప్రార్థించారు చివరికి ఎవరికి దక్కని అనుగ్రహంతో సాక్షాత్తు దైవ కుమారుడిని ఈ
లోకానికి ప్రసాదించిన దేవమాతకే జన్మనిచ్చారు ధన్యులయ్యారు. దేవుని గమ్యం చేరే
దారిలో ఎన్నో కష్టాలు,
ఎన్నో కడగండ్లు ఎన్నో అవమానాలు ఎదురైనా ప్రార్థనే మన ఆయుధం అయితే మన కష్టం
ఎప్పుడూ వృధా కాదు అనడానికి పునీత జ్వాకీము, అన్నమ్మ గార్ల జీవితమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
కాబట్టి ప్రియ విశ్వాసులారా మనము కూడా వీరి జీవితాలను ఆదర్శంగా తీసుకుని పిల్లలను
సరైన రీతిలో పెంచుదాం ప్రార్థన అనే వెలుగులో విశ్వాసము అనే ఆయుధంతో మన కుటుంబాలలో
ఉన్న కష్టాలను జయించుదాం. అందరికీ మరోమారు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
ఆమెన్...
జోసెఫ్
అవినాష్ సావియో✍
యువ కతోలిక
రచయిత
పెదవడ్లపూడి
విచారణ
No comments:
Post a Comment