జెరూసలేము నగర పునీత సిరిల్‌

జెరూసలేము నగర పునీత సిరిల్‌

పాలస్తీనాలోని జెరూసలేము పట్టణములో పునీత సిరిల్‌ ఒక క్రైస్తవ కుటుంబములో క్రీ.శ. 315వ సంవత్సరములో జన్మించారు. జెరూసలేములోనే విద్యాబుద్ధులు గడించారు. జెరూసలేము పీటాధిపతియైన పునీత మాక్సిమన్‌ గారి హస్తాల మీదుగా పవిత్ర గురుపట్టాభిషిక్తులయ్యారు.

క్రైస్తవ విశ్వాస ప్రబోధాన్ని, సిద్ధాంతాన్ని చిన్నచిన్న ప్రశ్నలు సమాధాన రూపములో సత్యోపదేశం పేరట ప్రజలకు నేర్పించిన మొట్టమొదటి గురువు సిరిల్‌గారే. విన్నవారెవరైనా ఒకసారి వింటే బాగా గుర్తుండిపోయేలా స్పష్టంగా, సులభముగా, సమగ్రంగా, ఈ సత్యోపదేశాన్ని తయారుచేశారు. ప్రతి గురువు, ప్రతి విశ్వాసి ఈ సత్యోపదేశము వలన ఆధ్యాత్మిక శక్తిని, నూతనోత్సాహాన్ని పొందారు.

జెరూసలేం పీటాధిపతియైన పునీత మాక్సిమన్‌ గారి తరువాత సిరిల్‌గారే జెరూసలేముకు క్రీ.శ. 349లో పీటాధిపతి అయ్యారు.

శ్రీసభ సిద్ధాంతాన్ని బలమైన సమర్ధుడుగా ఎన్నో కష్టాలు, అవమానాలు భరించాల్సి వచ్చింది. ఈ రోజుల్లో, క్రీస్తు నరుడే కాని దేవుడు మాత్రం కాదు, ఆయనొక మహాపరుషుడు మాత్రమే అని ఏరియన్‌అను వ్యక్తి ఒక సిద్ధాంతం తెచ్చి క్రైస్తవ మతములో చిచ్చుపెట్టాడు. దీని వలన ఎంతోమంది పీటాధిపతులు, గురువులు వితండవాదులై పోపుగారికి అవిధేయులయ్యారు. పదవి, అధికారం కోసం పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. ఏరియన్‌ సిద్ధాంతం నమ్మిన కైసరియా బిషప్‌ ఎకాషియస్‌సిరిల్‌ గారిని బహిష్కరించాడు. కాని అది తాత్కాలికమే అయ్యింది.

సిరిల్‌ గారిపై విచారణ జరుపబడినది. విచారణ చేయుటకు వచ్చిన పునీత నిస్సా గ్రెగోరి గారు సత్యం తెలుసుకున్నారు. సిరిల్‌గారిని జెరూసలేము బిషప్‌గానే గుర్తించారు. ఇరువురు కలసి క్రీ.శ. 381లో కాన్‌స్టంట్‌ నోపుల్‌లో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ నైసెన్‌ విశ్వాస ప్రమాణాన్ని ముఖ్యంగా త్రిత్వైక సర్వేశ్వరుని, దేవుడు నరుడు అయిన, ఆది మధ్యాంతరహితుడైన దేవునికి ప్రత్యక్ష రూపమే యేసు క్రీస్తు (కోలోసి 1:15-20) అని నొక్కివక్కాణించబడినది. పునీత సిరిల్‌గారు తన సాక్ష్యం వినిపించి ఏరియన్‌ సిద్ధాంతాన్ని దీటుగా ఎండగట్టాడు.

పునీత సిరిల్‌గారు తమ 71 ఏట క్రీ.శ. 386లో దేహం చాలించి దైవలోకం చేరుకున్నారు. శ్రీసభ ఆయనను పునీతునిగా గౌరవించినది. వారు నిజమైన శ్రీసభ పండితుడని 13వ లియో (సింహరాయు) పొప్‌గారు 1882లో ప్రకటించారు. సిరిల్‌ అంటే ప్రభువు, చక్రవర్తి, రాజు అని అర్ధం.

No comments:

Post a Comment