Showing posts with label Sunday Homily in Telugu - Year C. Show all posts
Showing posts with label Sunday Homily in Telugu - Year C. Show all posts

31వ సామాన్య ఆదివారము, Year C

 31వ సామాన్య ఆదివారము, Year C
సొ.జ్ఞాన. 11:22-12:1; 2 తెస్స. 1:11-2:2; లూకా. 19:1-10.

యేసు కరుణ - జక్కయ్య పరివర్తన
సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య. అన్యాయము ఆర్జితం ఎక్కువ కనుక, అతడు ధనికుడు. అతను యూదుడే. అయితే, యూదసమాజం సుంకరులను దేశద్రోహులుగా, ‘పాపులు’గా ముద్రవేసింది (19:7). ఎందుకన, వారు ధనాపేక్షతో రోమాసామ్రాజ్యానికి పన్నులను వసూలు చేసేవారు. అవసరమైన దానికంటే ఎక్వాకువగా బలవంతముగా వసూలు చేసేవారు. అందుకే, యూదులు సుంకరులను సమాజమునుండి వెలివేయబడినవారిగా భావించేవారు. జక్కయ్య ప్రముఖ సుంకరి కాబట్టి, అతనిని ఘోరపాపిగా భావించేవారు. పరిసయ్యులు అలాంటి వారిని వ్యభిచారులతో కలిపి లెక్కించేవారు.
అయితే జక్కయ్య, యేసు బోధనలు, అద్భుతాల గురించి విన్నాడు. సుంకరులను, పాపాత్ములను పరివర్తనకు పిలచుచున్నాడని విన్నాడు. యేసు యెరూషలేమునకు వెళుతూ యెరికో పట్టణమునకు వచ్చుచున్న విషయం గురించి కూడా విన్నాడు. ఆసక్తి వలన, ఎలాగైనా యేసును చూడాలనుకున్నాడు. బహుశా, కలవాలని అనుకోని యుండకపోవచ్చు. అయితే, యేసు వచ్చినప్పుడు, అచట జనసమూహము ఎక్కువగా ఉండుటచేత, ఆయనను చూడలేకపోయాడు. జక్కయ్య పొట్టివాడు (19:3). యేసును చూచుటకు, జక్కయ్య ముందుకు పరుగు తీసి, ఒక మేడి చెట్టును ఎక్కాడు (19:4). యేసే ముందుగా జక్కయ్యను చూచి, “జక్కయ్యా! త్వరగా దిగి రమ్ము. ఈరోజు నేను నీ యింటిలో నుండ తలంచితిని” (19:5) అని చెప్పారు. యేసు అతనికి ఎలాంటి బోధన చేయలేదు. జక్కయ్య హృదయాన్ని చవిచూచారు. అనేకమంది సణుగుకొన్నను (19:7) జక్కయ్య యింటికి వెళ్ళారు.
ఈవిధముగా, అంత గొప్ప జనసమూహములోకూడా, యేసే ముందుగా జక్కయ్యను చూచారు, కనుగొన్నారు, ఆహ్వానించారు. ఇది దైవకరుణకు తార్కాణం. ప్రభువు దయగల చూపు మనలను చేరుకుంటుంది. ఆ చూపు, మనలో పరివర్తనను రగిలిస్తుంది.
జక్కయ్య విశ్వాస-రక్షణ ప్రయాణం ఇలా సాగింది:
- జక్కయ్య యేసును గురించి (బోధనలు, అద్భుతాలు) విన్నాడు.
- అతనిలో యేసుపై విశ్వాసం కలిగింది (“వినుట వలన విశ్వాసం కలుగును”).
- ఆ విశ్వాసం, యేసును చూడాలన్న [దైవాన్వేషణ] కోరికను పెంచినది; చూచుటలో అడ్డంకులు వచ్చినను, అధిగమించాడు.
- యేసే ముందుగా జక్కయ్యను గుర్తించారు; అతని యింటిలో నుండ తలంచారు; యేసు అతనిపై దయను చూపారు.
- జక్కయ్య ఆనందముతో యేసుకు స్వాగతం పలికాడు (19:3-4)
- యేసు చూపు, పిలుపు, సాన్నిధ్యం జక్కయ్యలో పశ్చాత్తాపాన్ని, మారుమనస్సును కలిగించినది;
- చేసిన పాపాన్ని సరిదిద్దుకున్నాడు (19:8)
- [ఆరోజే] రక్షణ పొందాడు: సమాజములో తిరిగి ఆనందాన్ని, గౌరవాన్ని పొందాడు. 
- ఆతిధ్యం / విందు: రక్షణకు సూచనగా, జక్కయ్య యొద్దకు యేసు “అతిధిగా” వెళ్ళారు. ఈ ఆతిధ్య విందు, పరలోక విందును తలపిస్తుంది.
నేడు:
“నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది” (19:9). “నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది” (లూకా. 4:21) అన్న యేసు మాటలు మనం గుర్తుకు చేసుకోవాలి. “నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు” (లూకా.23:24). “నేడు” అన్న పదం – ‘రక్షణ’ కేవలం భవిష్యత్తులో జరిగే సంపూర్ణ ప్రక్రియ కాదని; అది ‘ఇప్పుడు’, ‘ఇక్కడే’ ప్రస్తుతం జరుగు దైవకార్యము అని అర్ధమగుచున్నది. ‘రక్షణ’ ‘ఇప్పుడు’, ‘ఇక్కడే’ ప్రారంభమగు దైవకార్యము: ధనికుడు అయినప్పటికిని, సమాజమునుండి, సంఘమునుండి ‘తప్పిపోయిన’ జక్కయ్య యేసుచేత వెదకబడి, రక్షింపబడ్డాడు (19:10). ఇదియే మెస్సయ్య ప్రేషిత కార్యము. “అబ్రహాము కుమారునిగా” (19:9), తాను కోల్పోయిన సఖ్యతను, ఐఖ్యతను, ఆనందాన్ని జక్కయ్య తిరిగి ఆ క్షణములో పొందాడు. అతని జీవితములో ‘రక్షణ’ దైవకార్యం ప్రారంభమైనది; అది అంతిమ కాలమున పరిపూర్తి అవుతుంది (రెండవ పఠనం).
ధనికులు:
ధనికులు దైవరాజ్యములో ప్రవేశించుట కష్టతరము (cf. మత్త. 19:23), కాని జక్కయ్య జీవితం అది సాధ్యమే అని నిరూపించినది. యేసు రక్షణ సార్వత్రికమైనది, అనగా అందరికి. పేదవారు, ధనికులు అందరు రక్షింపబడాలనేదే యేసు రక్షణ ప్రణాళిక.
మేడి చెట్టు ఎక్కడం:
జక్కయ్య స్థాయికి మేడిచెట్టు ఎక్కడం తగిన పని కాదు. కాని, యేసును చూడాలంటే, ఆయన రక్షణను పొందాలంటే, తన పాప జీవితాన్ని, ఇహలోక జీవితాన్ని అతను అధిగమించాలి. తన ‘పొట్టితనాన్ని’ [చెడ్డపేరు, బలహీనతలు] అధిగమించాలి. “మేడిచెట్టు ఎక్కటం” దీనికి తార్కాణం [ఇహలోకమును వీడి పరలోకమువైపుకు చూడటం].
పరివర్తన:
నిజమైన పరివర్తన, దేవునివైపు పరిపూర్ణముగా మరలుట. ‘లోక’ జీవితమునుండి మరలుట; వ్యసన ప్రవర్తననుండి మరలుట [మద్యం, మత్తుపానీయాలు, శారీరక వ్యామోహం];
యేసు మన రక్షకుడు. కనుక, ధనముకన్న రక్షణ ముఖ్యమని, ధనముకన్న గౌరవం ముఖ్యమని గుర్తించుదాం. యేసుతప్ప, లోకసంపదలు సంరక్షణను ఇవ్వలేదు. “నాకు కావలసిన వస్తువులన్ని ఉన్నవి. నాకెట్టి కీడు వాటిల్లదులే అని తలంపకుము” (సొ.జ్ఞాన. 11:24). యేసుతో ఉండాలంటే, ఈలోక వ్యామోహాలను వదులుకోవాలని తెలుసుకుందాం. జక్కయ్యవలె యేసును వెదుకుదాం. ఆయనవలె యేసును మన హృదయాలలోనికి ఆహ్వానించుదాం. ఆధ్యాత్మిక జీవితములో అంకితభావం, సంకల్పం, పట్టుదల ఉండాలి. అప్పుడే, యేసును కలుసుకోగలం! దేవుని దయ ఎల్లప్పుడు మనపై ఉంటుంది, కనుక కష్టసమయములో కూడా ఆశను కోల్పోకూడదు. యేసు పాపాన్ని ఖండించి, పాపిని హక్కున చేర్చుకుంటారు.

20 వ సామాన్య ఆదివారము, YEAR C

20 వ సామాన్య ఆదివారము, YEAR C
యిర్మియా 38:4-6, 8-10; హెబ్రీ 12:1-4; లూకా 12:49-53



ఈ రోజు మనము సామాన్య కాలంలోని 20వ ఆదివారమును జరుపుకుంటున్నాము. ఈ ఆదివారం పఠనాలలో మన హృదయాలను ఆలోచింపజేసే కొన్ని ముఖ్యమైన సందేశాలు ఉన్నాయి.

యేసుప్రభువు నేటి సువార్తలో ఒక శక్తివంతమైన ప్రకటన చేశారు. “నేను భూమిమీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసినది” (లూకా 12:49) అని క్రీస్తు అంటున్నారు. ఈ ‘నిప్పు’ అంటే కేవలం భౌతికమైన అగ్ని కాదు. లూకా సువార్త 3వ అధ్యాయంలో, బప్తిస్త యోహాను మాటలను ఇది గుర్తుకు చేస్తుంది, “నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను. కాని, నాకంటె అధికుడు ఒకడు రానున్నాడు. ఆయన మీకు పవిత్రాత్మతోను, అగ్నితోను జ్ఞానస్నానము చేయించును” (లూక 3:16). యేసు ఇక్కడ చెప్పిన అగ్ని, రాబోయే తీర్పు వల్ల కలిగే వేదనను సూచిస్తుంది.

పాత నిబంధనలో, ‘అగ్ని’ దేవుని శక్తికి, సన్నిధికి చిహ్నం. మోషే మండుతున్న పొదనుండి దేవుని స్వరం విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్ధత్త భూమికి ప్రయాణం చేయు సమయములో రాత్రిపూట అగ్నిస్తంభము వారికి మార్గదర్శిగా నిలిచింది. నూతన నిబంధనలో, పెంతకోస్తు రోజున పవిత్రాత్మ అగ్నినాలుకల రూపములో శిష్యులపైకి దిగివచ్చింది. ఈ  అగ్ని వారి హృదయాలను పూర్తిగా మార్చి, వారికి కొత్త శక్తిని ఇచ్చింది.

ఈ అగ్నితో యేసు మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాడా? లేదు, యేసు తెచ్చే అగ్ని భిన్నమైనది. అది మన ఆత్మలను దుష్టత్వం నుండి శుద్ధి చేసి, మనల్ని రక్షించే పరిశుద్ధాత్మ అగ్ని. ఈ ‘అగ్ని’ గురించి అలెగ్జాండ్రియాకు చెందిన పునీత సిరిల్ గారు, క్రీస్తు తెచ్చే అగ్ని మనుష్యుల రక్షణకు మరియు ప్రయోజనాలకు ఉద్దేశించబడింది... ఇక్కడ అగ్ని అంటే, సువార్త యొక్క రక్షణాత్మక సందేశం మరియు దాని ఆజ్ఞల శక్తి అని చాలా చక్కగా చెప్పారు.

యేసు చెప్పిన ఈ ‘అగ్నిని’, మనం మూడు ముఖ్యమైన అంశాలుగా అర్థం చేసుకోవచ్చు:

1. పరిశుద్ధాత్మ అగ్ని: క్రీస్తు చెప్పిన ఈ అగ్ని, పరిశుద్ధాత్మ శక్తికి ప్రతీక. పెంతుకోస్తు పండుగ రోజున శిష్యులపైకి అగ్ని జ్వాలల రూపంలో పరిశుద్ధాత్మ దిగివచ్చిన విషయం మనందరికీ తెలుసు (అపో.కా. 2:3). ఆ అగ్ని వారిలో కొత్త శక్తిని నింపింది. వారిలోని భయాన్ని తీసివేసి వారిని ధైర్యవంతులుగా మార్చి, క్రీస్తు సువార్తను ధైర్యముగా ప్రకటించడానికి వారిని సిద్ధం చేసింది. ఈ అగ్ని మనలో ఉన్న భయాన్ని, అనుమానాలను తొలగించి, దేవుని కార్యం చేయడానికి కావలసిన ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ అగ్ని మనల్ని సామాన్య వ్యక్తుల నుండి దైవసాక్షులుగా మారుస్తుంది.`

2. శుద్ధీకరణ అగ్ని: లోహాలను అగ్నితో శుద్ధి చేసినట్లు, ఈ అగ్ని మనలోని పాపాలను, చెడు అలవాట్లను, స్వార్థాన్ని, కోపాన్ని కాల్చివేస్తుంది. మన హృదయాలను పవిత్రం చేస్తుంది. మనలో ఉన్న స్వార్థం, ద్వేషం, అసూయ, కోపం వంటివి దేవుని దృష్టిలో కల్మషాలు. క్రీస్తు ఈ అగ్ని ద్వారా ఈ కల్మషాలను దహించివేసి, మనల్ని ఆయన ప్రేమకు, సేవకు యోగ్యులుగా చేస్తారు. ఈ ప్రక్రియ కష్టంగా అనిపించినా, దాని వల్ల మన ఆత్మ పవిత్రమై, దేవుని ప్రేమకు యోగ్యంగా మారుతుంది.

3. దేవుని ప్రేమ మరియు ఉత్సాహం యొక్క అగ్ని: ఈ అగ్ని దేవుని పట్ల మనకున్న ప్రేమను, ఆయన రాజ్య స్థాపన పట్ల మనకున్న ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఈ అగ్ని మనలో జ్వలించినప్పుడు, మనం క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచుతాము. ఈ ప్రేమ మన మాటలలో, చేతలలో వ్యక్తమవుతుంది. ఈ అగ్ని, మన హృదయాలను కదిలించి, మనలను దేవుని వైపుకు మారుస్తుంది. నేడు మనం యేసు శిష్యులముగా దైవప్రేమ యొక్క అగ్నిని ప్రతీచోట వ్యాప్తిచేయాలి.

క్లుప్తముగా చెప్పాలంటే, క్రీస్తు చెప్పిన ‘అగ్ని’ కేవలం భౌతికమైన వినాశనం కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి, పవిత్రీకరణ మరియు దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఉత్సాహానికి ప్రతీక. ఈ అగ్నిని మనం మన హృదయాల్లోకి ఆహ్వానించినప్పుడు, మన జీవితాలు ఒక కొత్త మార్గంలో పయనిస్తాయి.

“నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలయును” (లూకా 12:50). ఈ వాక్యం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. యేసు త్యాగంలో ఉన్న లోతైన అర్థాన్ని మన కళ్ళముందు ఉంచుతుంది. ఇక్కడ యేసు తాను పొందబోయే శ్రమలను మరియు మరణాన్ని, “శ్రమల జ్ఞానస్నానంతో” పోలుస్తున్నారు. సాధారణంగా, మనం జ్ఞానస్నానం గురించి ఆలోచించినప్పుడు, అది నీటిలో మునిగి, మళ్ళీ బయటకు రావడాన్ని సూచిస్తుంది. అనగా, పాపాల నుండి పవిత్రమై, క్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది. అయితే, ఇక్కడ యేసు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇచ్చట జ్ఞానస్నానం యేసు శ్రమలలో, మరణములో మునుగుటను సూచిస్తుంది. దీనిద్వారానే మనం విముక్తిని పొందుతాము. అయితే యేసు ప్రభువు, మరణము అను జ్ఞానస్నాన తొట్టిలో మునిగి ఉత్థానముతో నూతన జీవితములోనికి ఆవిర్భవించుటను తెలియజేయు చున్నది. ఈవిధముగా, ఈ వాక్యం, జ్ఞానస్నానం యొక్క రెండు ముఖ్య అంశాలను తెలియజేస్తుంది:

1. శ్రమలలో మునిగిపోవడం: యేసు తన రాకకు ముందుగానే, తాను పడబోయే శ్రమల గురించి, సిలువపై తన మరణం గురించి ఎరిగియున్నాడు. ఆయన తాను అనుభవించబోయే వేదన, అవమానం, మరియు మరణమనే “జ్ఞానస్నానం”లో మునిగిపోతానని చెప్తున్నారు. ఇది కేవలం ఒక బాధాకరమైన అనుభవం కాదు, మానవాళిని రక్షించడానికి దేవుడు సిద్ధం చేసిన ఒక అనివార్యమైన ప్రణాళికలో భాగం. ఆయన సిలువపై పడిన బాధలన్నీ మన పాపాలను శుభ్రం చేయడానికి ఒక నూతనమైన, పవిత్రమైన ప్రక్రియ.

2. మరణం నుండి నూతన జీవితంలోకి ఉద్భవించడం: జ్ఞానస్నానం మునిగి మళ్ళీ లేచి రావడం ఎలాగైతే సూచిస్తుందో, అలాగే, యేసు మరణమనే జ్ఞానస్నానంలో మునిగి, ఉత్థానంతో నూతన జీవితంలోకి వస్తారు. ఈ గొప్ప విజయం ద్వారా ఆయన మరణాన్ని జయించి, మనకు విముక్తిని ప్రసాదించారు. ఆయన పడిన బాధలు, మరణం కేవలం ఒక అంతం కాదు, అది మనకు రక్షణ, కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక మార్గం.

క్లుప్తంగా చెప్పాలంటే, యేసు ఈ మాటల ద్వారా, తన త్యాగం ఎంత గొప్పదో, దాని వెనుక దేవుని సంకల్పం ఎంత లోతైనదో తెలియజేశారు. ఆయన పడిన శ్రమలు, మరణం ఒక పవిత్రమైన కార్యం. అది ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరినీ పాపం నుండి విడిపించి, పునరుత్థానం ద్వారా కొత్త జీవితంలోకి నడిపిస్తుంది.

“నేను భూమిమీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచు చున్నారా? లేదు. విభజనలు కలిగించుటకే వచ్చితిని” (లూకా 12:51). ఈ మాటలు వినడానికి కఠినంగా అనిపించవచ్చు. యేసు శాంతిస్థాపకుడు కాదా? అన్న అనుమానం కలుగుతుంది. యేసు జననమున, దేవదూతలు, “మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగును గాక” (లూకా 2:14) అని స్తుతించలేదా! సిమియోను, బాలయేసును హస్తములలోనికి తీసుకొని, “ప్రభూ! ఈ దాసుని ఇక సమాదానముతో నిష్క్రమింపనిమ్ము” (లూకా 2:29) అని పలకలేదా! యేసు తన శిష్యులతో, “శాంతిని మీకు అనుగ్రహించు చున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు” (యోహాను 14:27) అని కడరా భోజన సమయములో చెప్పలేదా! “భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను” (మత్త 11:28) అని చెప్పలేదా! భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని యుండగా, యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, “మీకు శాంతి కలుగునుగాక!” (యోహాను 20:19) అని పలుకలేదా! అవును, యేసు మనకు ఆంతరంగిక శాంతిని ఇస్తారు. కానీ, ఆయన మార్గాన్ని అనుసరించేవారు లోకంలో సవాళ్లను, విభజనలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే సిమియోను, “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనముకను, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు” (లూకా 2:34) అని పలికాడు. దేవుని రాజ్యానికి అంతిమ లక్ష్యం శాంతి, కానీ శాంతికి ఒక మూల్యం చెల్లించాల్సి ఉందని అర్ధమగుచున్నది. ఎక్కడైతే దేవుని వాక్యం వినిపింప బడుతుందో, అక్కడ విభజన జరుగుతుందని యేసు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అన్యాయమైన సమాజానికి, దానికి వ్యతిరేకంగా ఉన్నవాటన్నింటికీ, సువార్త భిన్నంగా ఉండడం వల్ల విభజనకు కారణమవుతుందనేది వాస్తవమే కదా!

అలాగే, తాను ఈ లోకమునుండి వెడలి పోయిన తరువాత శిష్యుల ప్రయాణం కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. యేసు నిమిత్తము అందరు ద్వేషింతురని చెప్పారు. సువార్త వ్రాయబడే సమయానికి ప్రభువు ప్రవచనాలు నేరవేరుచున్నాయి. కుటుంబాలలో విభజనలు కలిగాయి ఎందుకన, కొంతమంది క్రీస్తును విశ్వసించి, జ్ఞానస్నానాన్ని పొందుచున్నారు. తనను అనుసరించాలని అనుకొనేవారు, అవసరమైతే, తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధువులను ఆస్తిపాస్తులను విడిచి పెట్టాలని ప్రభువు తెలియజేసారు. సత్యం, ప్రేమ, స్వేచ్చ, న్యాయము అను మార్గములో పయనించాలనుకుంటే, సవాళ్లు ఎదుర్కోవడం తప్పదు! దీర్ఘకాలములోసత్యం, ప్రేమ, స్వేచ్చ, న్యాయములే ఖచ్చితముగా విజయాన్ని సాధిస్తాయి.

ఈవిధముగా, క్రీస్తు చెప్పిన విభేదాలు విశ్వాసపు విభేదాలు. ఈ విభజనలు విశ్వాసం వల్ల వచ్చేవి. క్రీస్తు సువార్త అనేది ఎల్లప్పుడూ ఒక సవాలు! అది మనల్ని మన సౌకర్యవంతమైన జీవితం నుండి బయటకు రమ్మని పిలుస్తుంది. క్రీస్తును అనుసరించడం అంటే, కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నచ్చని నిర్ణయాలు తీసుకోవడం. క్రీస్తు కోసం నిలబడినప్పుడు, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకు విభేదాలు ఏర్పడవచ్చు. హెబ్రీయుల లేఖలో, “మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగు వాడైన, ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము” (హెబ్రీ 12:2) అని చదువుచున్నాము. విశ్వాస మార్గంలో పరుగెత్తేటప్పుడు మనకు అనేక అడ్డంకులు, కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు మనం క్రీస్తు వైపు చూడాలి. ఆయన సిలువను భరించారు, అవమానాలను సహించారు. కానీ చివరికి విజయం సాధించారు. మనము కూడా క్రీస్తు మార్గంలో ఎదురయ్యే విభేదాలను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. క్రీస్తు కోసం నిలబడటం అంటే, కొన్నిసార్లు తండ్రికి వ్యతిరేకంగా కొడుకు, తల్లికి వ్యతిరేకంగా కూతురు నిలబడవలసి వస్తుంది. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. కానీ క్రీస్తు మనల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పలేదు. మన విశ్వాసాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి అని చెప్పడానికి ఆయన ఈ మాటలను ఉపయోగించారు. దేవుని ప్రేమ, దేవుని రాజ్యం కోసం మనం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.

నేడు అనేకచోట్ల హింసాకాండను, యుద్ధవాతావరణాన్ని చూస్తున్నాము. నేటి సువిశేషం, యుద్ధానికి పిలుపునిస్తుంది. అయితే ఈ యుద్ధం ఇతరులపై కాదు. ఈ యుద్ధం, పాపము, అవినీతిపై.

మొదటి పఠనములో యిర్మియా ప్రవక్త తప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకముగా పోరాటం చేయుచున్నాడు. సత్యానికి కట్టుబడి యున్నాడు. యిర్మియా ప్రవక్త, దేవుని సత్య వాక్యాన్ని చెప్పినందుకు ఎంతో బాధను అనుభవించాడు. రాజవంశీయులు మరియు అధికారులు యిర్మియా చెప్పిన దేవుని సందేశాన్ని ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమును విడిచి శత్రువులైన కల్దీయులకు లొంగిపోవాలని యిర్మియా ప్రవచించాడు. ఇది సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, రాజ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని అధికారులు వాదించారు. ఈ ప్రవచనం శాంతిని కోల్పోయేలా చేసి, ప్రజలను చనిపోయేలా చేస్తుందని వారు రాజుతో చెప్పారు (38:4). అప్పుడు సిద్కియా రాజు బలహీనంగా, ప్రజల మాటలకు లొంగిపోయాడు. “అతడు మీ ఆదీనమున ఉన్నాడు. నేను మీకు అడ్డుపడజాలను కదా!” అని అధికారులతో చెప్పాడు. దీనితో రాజు యిర్మియాను రక్షించడానికి ఏమీ చేయలేదని, అధికారులు తమ ఇష్టప్రకారం వ్యవహరించడానికి అనుమతించాడని స్పష్టమవుతుంది (38:5). ఆ అధికారులు యిర్మియాను పట్టుకొని, మల్కీయా కుమారుడైన హమ్మేలెకు బురద బావిలో పడవేశారు. ఆ బావి రాజభవన ప్రాంగణంలోనే ఉంది. బావిలో నీరు లేకపోయినా, బురద మాత్రం ఉంది. యిర్మియా ఆ బురదలో కూరుకుపోయాడు. ఇది యిర్మియాకు జరిగిన అత్యంత ఘోరమైన అన్యాయం మరియు శ్రమ (38:6).

అయితే, దేవుడు అతన్ని విడనాడలేదు. ఎబెద్మెలెకు అనే ఒక కూషు లేదా ఇథియోపియా దేశస్థుడు,  నపుంసకుడు అయిన ఒక విదేశీయుడిని పంపి యిర్మియాను రక్షించారు. అతను సిద్కియా రాజుతో మాట్లాడి యిర్మియాను కాపాడాడు. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రమాదకరం అయినప్పటికీ, అతడు నిజం మాట్లాడి యిర్మియాను కాపాడాడు. ఈవిధముగా, మొదటి పఠనములో, విశ్వాసం, కష్టం మరియు ఊహించని దేవుని సహాయం గురించి చూస్తున్నాము. యిర్మియా దేవుని మాటను ధైర్యంగా చెప్పాడు, అందుకు కష్టాలను అనుభవించాడు. కానీ దేవుడు ఆయనను మరచిపోలేదు, ఎబెద్మెలెకు అనే ఒక విదేశీయుడి ద్వారా ఆయనను రక్షించాడు. ఇది దేవుడు తన సేవకులను ఎప్పుడూ కాపాడతాడని, సరైన సమయంలో సహాయం పంపుతాడని తెలియజేస్తుంది.

అలాగే, సత్యం, న్యాయం కొరకు పోరాటములో దేవుడు ఎప్పుడు మన తోడుగా ఉంటారు. అందుకే రెండవ పఠనములో “మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు. నీరసపడి పోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందు నంతగా ఎదిరింపలేదు” (హెబ్రీ 12:3-4) అని చదువుచున్నాము. విశ్వాస మార్గంలో పరుగెత్తేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ మాటలు చెబుతున్నాయి. మన దృష్టిని “మన విశ్వాసానికి కారకుడూ, దానిని పరిపూర్ణం చేసేవాడూ అయిన యేసు” మీద నిలుపుదాం.

నేటి ప్రసంగము నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రహించి, మన జీవితాలలలో ఆచరిద్దాం:

మొదటిగా, యేసు చెప్పిన అగ్ని కేవలం నాశనానికి సంబంధించినది కాదు, అది మన హృదయాలను శుద్ధి చేసి, మనల్ని మార్చడానికి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. దీనిని ఆచరణలో పెట్టడానికి, మనం: ముందుగా ధైర్యంగా ఉండాలి: పెంతుకోస్తు రోజున శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ధైర్యంగా సువార్తను ప్రకటించారు. అదేవిధంగా, మనలో ఉన్న భయాన్ని, అనుమానాలను తొలగించుకొని, దేవుని కార్యాన్ని చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి యుండాలి. తరువాత, సాక్షులుగా జీవించాలి: పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని కేవలం మామూలు వ్యక్తులుగా కాకుండా, క్రీస్తుకు సాక్షులుగా మారుస్తుంది. మన జీవితం ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి.

రెండవదిగా, యేసు తెచ్చిన అగ్ని లోహాలను శుద్ధి చేసినట్లుగా, మనలోని పాపాలను, చెడు అలవాట్లను, స్వార్థాన్ని, ద్వేషాన్ని, అసూయను దహించివేసి మన హృదయాలను పవిత్రం చేస్తుంది. కనుక, మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి: మనలో ఉన్న కల్మషాలను, దేవునికి ఇష్టం లేని వాటిని గుర్తించి, వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది కష్టంగా అనిపించినా, ఈ ప్రక్రియ మన ఆత్మను పవిత్రం చేసి, దేవుని ప్రేమకు యోగ్యంగా మారుస్తుంది.

మూడవదిగా, యేసు శాంతిని కాదు, విభజనను తెచ్చానని చెప్పడం వెనుక ఉన్న సందేశం, ఆయన మార్గాన్ని అనుసరించేవారు లోకంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్ధం. కనుక, ముందుగా మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి: క్రీస్తును అనుసరించడం వల్ల కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విభేదాలు రావచ్చు. అయినప్పటికీ, మనం సత్యం, ప్రేమ, న్యాయం కోసం నిలబడాలి. అలాగే, క్రీస్తు వైపు దృష్టి ఉంచాలి: విశ్వాస మార్గంలో కష్టాలు వచ్చినప్పుడు, హెబ్రీ 12:2లో చెప్పినట్లుగా, మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగువాడైన, ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము”. ఆయన సిలువను భరించి విజయం సాధించినట్లు, మనం కూడా ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.

నాలుగవదిగా, నేటి సువార్తలో చెప్పబడిన 'యుద్ధం' ఇతరులపై కాదు, అది మనలోని పాపం, అవినీతిపై జరిగే యుద్ధం. కనుక, మనం పాపంతో పోరాడాలి: హెబ్రీ 12:4 ప్రకారం, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు”. ఈ మాటలు మనలోని చెడు అలవాట్లు, పాపపు కోరికలతో పోరాడాలని ప్రోత్సహిస్తాయి. అలాగే, దేవుని సహాయాన్ని నమ్మాలి: యిర్మియా ప్రవక్త విషయంలో చూసినట్లుగా, సత్యం కోసం నిలబడినప్పుడు కష్టాలు వచ్చినా, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. సరైన సమయంలో ఆయన సహాయాన్ని పంపి రక్షిస్తాడు.

ముగింపు: యేసు చెప్పిన అగ్నిని మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాం. ఆ అగ్ని మనల్ని పవిత్రం చేసి, దేవుని ప్రేమతో నింపుతుంది. సత్యం కోసం, క్రీస్తు కోసం నిలబడటానికి సిద్ధంగా ఉందాం. అప్పుడు మన జీవితాలు ఒక సాక్ష్యంగా మారి, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి శాంతిని, ప్రేమను పంచుతాయి. ఈ యుద్ధం ఇతరులపై కాదు, మనలోని పాపం, అవినీతిపై. ఈ పోరాటంలో దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు.

కనుక, ఈరోజు, తల్లి శ్రీసభ మనలను దుష్కార్యాలపై పోరాడమని ప్రోత్సహిస్తుంది. దాని కోసం క్రీస్తు అడుగుజాడలను అనుసరించాలి, ఎందుకంటే ఆయన మనల్ని శుద్ధి చేయడానికి, మార్చడానికి, మనల్ని పీడించే ప్రమాదాల నుండి రక్షించడానికి భూమిపైకి అగ్నిని తీసుకొచ్చాడు. కనుక మన విశ్వాసానికి కారకుడైన క్రీస్తునందు మన దృష్టిని ఉంచుదాం. కష్ట సమయాల్లో క్రీస్తు యొక్క పట్టుదల మరియు ధైర్యాన్ని మనం అనుకరించాలి.

15వ సామాన్య ఆదివారము, Year C

15వ సామాన్య ఆదివారము, Year C
ద్వితీయ 30:10-14; కొలోస్సీ 1:15-20; లూకా 10:25-37



ప్రియ సహోదరీ సహోదరులారా! నేటి ఆదివార పఠనాల సందేశం: నిత్యజీవమును పొందుటకు మనం ఏమి చేయాలి? మొదటిగా దేవున్ని ప్రేమించాలి; రెండవదిగా, దేవున్ని మన పొరుగు వారిలో చూస్తూ, మనం మంచి పొరుగు వారిగా జీవించడం ద్వారా మనం నిత్యజీవితాన్ని పొందుకుంటాము. దేవున్ని ప్రేమించడం (In Himself): మన హృదయపూర్వక భక్తి, ఆరాధన, మరియు దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా వ్యక్తమవుతుంది. దేవుని పట్ల మనకున్న ప్రేమ కేవలం ఒక భావన కాకుండా, మన జీవితాన్ని ప్రభావితం చేసే లోతైన నిబద్ధత. మన పొరుగువారిలో దేవున్ని ప్రేమించడం (Living in our neighbors, by becoming good neighbors): మరింత ఆచరణాత్మకమైన అంశం. యేసు చెప్పిన మంచి సమరీయుని ఉపమానం దీనికి చక్కటి ఉదాహరణ. మన చుట్టూ ఉన్నవారి పట్ల, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారి పట్ల మనం చూపించే కరుణ, దయ, సేవ ద్వారా దేవుని ప్రేమను ఆచరణలో పెడతాము. మన పొరుగువానిని మన వలె ప్రేమించడం అంటే, వారి బాధలను పంచుకోవడం, వారికి సహాయం చేయడం, మరియు వారిని గౌరవించడం. కనుక, నిత్యజీవం అనేది కేవలం వ్యక్తిగత భక్తి ద్వారానే కాకుండా, మన తోటి మానవుల పట్ల చూపించే నిస్వార్థ ప్రేమ మరియు సేవ ద్వారా కూడా వస్తుంది. దేవున్ని ప్రేమించడం మరియు మన పొరుగువారిని ప్రేమించడం వేర్వేరు అంశాలు కావు, అవి ఒకదానికొకటి లోతుగా ముడిపడి ఉన్నాయి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్తిగా ఉంటుంది.

నేటి మొదటి పఠనం (ద్వితీయ 30:10-14) కూడా మనం నిత్యజీవితం పొందుకోవాలంటే, ఏమి చేయాలో తెలియజేస్తుంది. ప్రభువుకు విధేయులై, ఆజ్ఞలనెల్ల పాటించాలని తెలియజేయు చున్నది. దేవుని వాక్యానికి కట్టుబడి జీవించాలని తెలియజేయు చున్నది. దేవుడు సజీవులని, ఎల్లప్పుడు మనకు దగ్గరగా ఉన్నారని తెలియజేయు చున్నది. “మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైన, ఎంత గొప్పజాతి జనులకైన వారి దేవుడు మన దేవునివలె చేరువలోనున్నాడా?” (ద్వితీయ 4:7). కనుక, దేవుని వాక్కును విధేయించాలి ఎందుకన, అది మన జీవితాలకు మూలం, ఆధారం. తన వాక్కుతోనే, దేవుడు తననుతాను మనకు బహిర్గత మొనర్చుకున్నారు. దేవుడు తన ఆజ్ఞలను కేవలం పరిశుద్ధ లేఖనాలలో వ్రాయడం మాత్రమే గాక, వాటిని మన హృదయాలలో లిఖించారు. “ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు పాటింపుడు” (ద్వితీయ 30:14). దీని అర్థం ఏమిటంటే, దేవుని చిత్తం మనకు కేవలం బాహ్యమైన ఆజ్ఞలుగా మాత్రమే కాకుండా, మన అంతరంగంలో, మన మనస్సాక్షి ద్వారా కూడా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ అంతర్గత జ్ఞానం, బాహ్యమైన ఆజ్ఞలతో కలిసి, మనం వాటిని పాటించడానికి, తద్వారా దేవునితో నిత్యజీవాన్ని పొందడానికి సహాయపడుతుంది.

రెండవ పఠనంలో కూడా (కొలోస్సీ 1:15-20), దేవుడు మన దరిలోనే ఉన్నారని, తన కుమారుడైన యేసు క్రీస్తుద్వారా, మనలో వసిస్తున్నారని, పౌలు గుర్తుకు చేయుచున్నాడు. కనుక, దేవున్ని ప్రేమించడ మనగా, ఆయన వాక్కును ప్రేమించడం! ఆ వాక్కు యేసు క్రీస్తు ప్రభువే! దేవుడు తన వాక్కుతో ప్రతీరోజు మనతో మాట్లాడుచున్నారు. “క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము” (1 కొలొస్సీ 1:15) అయినట్లే, మన పొరుగువారు మన మధ్య నివసిస్తున్న క్రీస్తు ప్రత్యక్ష రూపము అని మనం గ్రహించాలి. మన చుట్టూ ఉన్న వారిలో, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారిలో మనం క్రీస్తును చూడగలగాలి. మనం మన పొరుగువారికి సేవ చేసినప్పుడు, మనం క్రీస్తుకే సేవ చేస్తున్నామని అర్థం. మనం వారిని ప్రేమించినప్పుడు, మనం క్రీస్తునే ప్రేమిస్తున్నాం అని అర్ధం. కనుక, ప్రతి వ్యక్తిలోనూ దైవికమైన రూపం ఉందని గుర్తించి మనం వారిని మరింత కరుణతో, గౌరవంతో చూడగలగాలి. ‘పరలోకపు మంచి సమరీయుడు’ అయిన యేసుక్రీస్తు కడరాత్రి భోజన సమయములో, “నేను మిమ్ములను ప్రేమించినట్లే, మీరు ఒకరినొకరు ప్రేమించుడి” అని ఆజ్ఞను ఇచ్చారు. అనగా, ప్రతీ వ్యక్తిలో అదృష్యుడైన దేవుడు వసిస్తాడని అర్ధమగుచున్నది.

నేటి సువార్తలో యేసు యెరూషలేమునకు తన ప్రయాణాన్ని కొనసాగించుచుండగా, మార్గమధ్యలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసును పరీక్షింప ప్రయత్నించాడు. ‘బోధకుడా నిత్యజీవము పొందుటకు నేను ఏమి చేయవలయును?(లూకా 10:25) అని ప్రశ్నించాడు. మత్తయి (22:34-40), మార్కు (12:28-34) సువార్తల ప్రకారం, ‘ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ప్రాధమికమైన, మతపరమైన ప్రశ్న!

ప్రభువు వెంటనే ఆ ధర్మశాస్త్ర బోధకునికి సమాధానమివ్వక, వానిని మొదటిగా పరిశుద్ధ లేఖనాల వైపు మళ్ళించాడు. అందుకే ప్రభువు, “ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి యున్నది? అది నీకెట్లు అర్ధమగుచున్నది?” (లూకా 10:26) అని ధర్మశాస్త్ర బోధకుడిని తిరుగు ప్రశ్నవేసారు. అందుకు ఆ ధర్మశాస్త్ర బోధకుడు, ద్వితీయ 6:5ను ప్రస్తావిస్తూ “దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమింపుము” అని అలాగే లేవీ 19:18 ప్రస్తావిస్తూ, “నిన్ను నీవు ప్రేమించు కొనునట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుము”  (లూకా. 10:27) అని పలికాడు. ద్వితీయ 6:5, యూదులకు అతి ప్రాముఖ్యమైన ప్రార్ధన. యేసు కాలములో, దీనిని రోజుకు రెండుసార్లు ప్రార్ధించేవారు. కాబట్టి పరిశుద్ధ లేఖనాల ప్రకారం, నిత్యజీవము పొందుటకు దైవప్రేమ-సోదరప్రేమ కలిగి జీవించుట అవసరమని స్పష్టం చేయబడింది. అప్పుడు యేసు అతనితో, “నీవు సరిగా సమాధాన మిచ్చితివి. అటులనే చేయుము. నీవు జీవింతువు” (లూకా 10:28) అని చెప్పారు.

అయితే, ఆ ధర్మశాస్త్ర బోధకుడు తననుతాను సమర్ధించుకొనుటకై, ‘నా పొరుగువాడు ఎవడు?’ (లూకా 10:29) అని యేసును ప్రశ్నించాడు. ధర్మశాస్త్ర బోధకుడికి, ‘పొరుగువాడు’ అంటే కేవలం మరొక ధర్మశాస్త్ర బోధకుడు లేదా పరిసయ్యుడు మాత్రమే! అతని దృష్టిలో సమరీయుడు గానీ, అన్యుడు గానీ (యూదులు కానివారు) ఎప్పటికీ పొరుగువాడు కాలేడు. అందుకే, ధర్మశాస్త్ర బోధకుడు ‘పొరుగువాడు’ అనే పదంపై మరింత స్పష్టతను కోరాడు. ఈ సందర్భంలోనే, యేసు అతనికి మంచి సమరీయుని ఉపమానాన్ని చెప్పారు.

యేసు కాలపు సమాజములో, యూదులు-అన్యులు, స్త్రీలు-పురుషులు, పవిత్రులు-అపవిత్రులు అని వ్యత్యాసాలు ఉండేవి. ఈ సందర్భముగా అతను అడిగిన ప్రశ్న ప్రభువును ఇరకాటములో పెట్టె ప్రశ్నయే! కాని యేసు చక్కటి మంచి సమరీయుని ఉపమానముతో (లూకా 10:30-37) సమాధానము ఇచ్చారు. మంచి సమరీయుని ఉపమానం ప్రేమ, కరుణ, మరియు మన పొరుగువారికి సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ‘పొరుగువాడు’ అంటే సహాయం అవసరమైన ఏ వ్యక్తి అయినా అని స్పష్టమవుతుంది. అయితే, మనం ప్రశ్నించాల్సింది, “నా పొరుగు వాడు ఎవడు?” అని మాత్రమే కాదు; మనం ప్రశ్నించాల్సింది, “నేను ఇతరులకు మంచి పొరుగువానిగా ఉంటున్నానా?”

యెరూషలేమునుండి యెరికో నగరమునకు మధ్య దూరం 27 కి.మీ. రాళ్ళురప్పలతో ఇరుకైన మార్గం కనుక ప్రయాణీకుల నుండి దోచుకొనుటకు వీలుగా ఉండేది. ఉపమానములో ప్రయాణికుడు “ఒకానొకడు” అని చెప్పబడింది. ఎందుకన, ప్రేక్షకులు ఆ వ్యక్తి యూదులతోనైన, అన్యులతోనైన పోల్చుకోగలరు. దాడిచేసిన తరువాత, ఆ వ్యక్తిని కొన ఊపిరితో విడిచి పోయారు. ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచూ, వానిని చూచియు, ఏ సహాయము చేయక తప్పుకొని పోయాడు. ఒక లేవీయుడు అటుగా వెళ్ళుచూ, వానిని చూచి, యాజకుని వలెనె తొలగి పోయెను. లేవీయుడు దేవాలయములో సహాయం చేసేవాడు. అతను బ్రతికున్నాడో, లేదోయని కూడా పట్టించుకొనకుండా అక్కడనుండి వెళ్ళిపోయారు. మూడవ వ్యక్తి... బహుశా యేసు శ్రోతలు ఒక ఇస్రాయేలీయుడు అయుండవచ్చని భావించి యుండవచ్చు. కాని ఆ మూడవ వ్యక్తి ఇస్రాయేలీయులకు అత్యంత శత్రువుగా భావించబడే సమరీయుడు.

యూదులు సమరీయులను అసహ్యించు కొనేవారు. వారితో ఎలాంటి పొత్తు ఉండేది కాదు. క్రీస్తు కాలంలో, యూదులకు సమరీయులు వెలివేయబడిన, చిన్నచూపు చూడబడిన ప్రజలు. వారిని జాతిపరంగా తక్కువవారని, ఆధ్యాత్మికంగా తప్పుత్రోవ పట్టినవారని యూదులు భావించేవారు. ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు వంటి కఠిన హృదయులైన యూద మత నాయకులకు, సమరీయులను తిరస్కరించడం ఒక మతపరమైన విధిగానే ఉండేది. వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వారు ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. సమరీయులు ఉత్తర రాజ్యానికి చెందిన యూదుల వారసులే! కాని సమరీయులు అన్యులను వివాహ మాడారు మరియు వారు యెరూషలేములో ఆరాధనలు చేయరు.

అలాంటి ఒక సమరీయుడు, గాయపడిన వ్యక్తిని చూడగానే “జాలిపడ్డాడు” (10:33); అతని దగ్గరకు వెళ్ళడం మాత్రమేగాక, గాయాలను శుభ్రముచేసి, కట్టుకట్టి, తన వాహనముపై కూర్చుండబెట్టి, సత్రమునకు తీసుకొనిపోయి, పరామర్శించాడు. అతని ఖర్చులన్నీ తానే చెల్లిస్తానని వాగ్దానం చేసాడు. ఈవిధముగా, అసహ్యించుకొనబడేవాడు, పొరుగువాడు అయ్యాడు. అలాగే, ‘పొరుగువాని ప్రేమ’కు చక్కటి ఉదాహరణగా నిలిచాడు.

మతం, కులం, జాతి, దేశం, వర్ణం, వర్గం, ప్రాంతం, మగ, ఆడ ఇవేమీ కూడా మన పొరుగువారిని నిర్వచించ కూడదని యేసుప్రభువు తెలియజేయు చున్నారు. యూదులు కేవలం తోటి యూదులను మాత్రమే పొరుగువారిగా భావించేవారు. ఒకరిపట్ల కరుణతో ప్రవర్తించే వ్యక్తి పొరుగువాడు. అందరిని కరుణతో చూసేవాడు పొరుగువాడు.

ఉపమాన అనంతరం, “పై ముగ్గురిలో, దొంగల చేతిలో పడినవానికి పొరుగువాడు ఎవ్వడు?” అని యేసు ప్రశ్నించగా, ఆ ధర్మశాస్త్ర బోధకుడు, సమరీయుడు అని చెప్పకుండా ‘కనికరము చూపినవాడే’ అని సమాధాన మిచ్చాడు. అప్పుడు యేసు అతనితో “నీవు వెళ్లి అటులనే చేయుము” అని పలికారు. యేసు యూదులకు ఇచ్చిన గొప్ప సందేశం ఏమిటంటే, సమరీయులను ఇక శత్రువులుగా భావించక, పొరుగు వారిగా భావించాలని స్పష్టం చేసాడు.

మంచి సమరీయుడు అపరిచితున్ని తన సోదరునిగా భావించాడు. తనవలె తన పొరుగు వానిని ప్రేమించాడు. పొరుగు వాడు ఎవడు? ప్రతీ ఒక్కరు మన పోరుగువారే! ‘పొరుగువాడు’ అనగా మనకు దగ్గరలో ఉన్నవాడు అని అర్ధం! ప్రతీ ఒక్కరిని దయతో చూడాలి. ప్రతీ ఒక్కరు మన పోరుగువారే! ‘ప్రతీ వ్యక్తి యేసువే’ అని మదర్ తెరెసా గారు అన్నారు. అనగా ప్రతీ వ్యక్తిలో దేవున్నిచూడగలగాలి. పౌలు గారు నేటి రెండవ పఠనములో అన్నట్లుగా, “క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము”. మనము కలిసే వ్యక్తుల ద్వారా క్రీస్తు మన చెంతకు వస్తారు. వారిలో దేవుని రూపమును తెలియజేస్తారు.

ఒక వ్యాఖ్యానం ప్రకారం, ఉపమానంలోని సమరీయుడు స్వయంగా క్రీస్తును సూచిస్తాడు. పాపము, సాతాను చేత గాయపడి, సగం చనిపోయిన స్థితిలో ఉన్న మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవులు తమ సృష్టిలో పొందిన దైవిక మహిమను, వైభవాన్ని కోల్పోయి, పాపం వల్ల దాదాపు పతనమైన స్థితిని ఇది సూచిస్తుంది. దేవుని కుమారుడైన క్రీస్తు అపారమైన కరుణతో, మానవాళి దీనమైన పరిస్థితిని చూసి ఊరుకోలేకపోయాడు. అంతులేని దయ, ప్రేమతో నిండి, స్వయంగా మానవ శరీరాన్ని ధరించి, తన సృష్టి అయిన మానవుల వద్దకు వచ్చాడు. క్రీస్తు వారి మరణకరమైన గాయాలను కట్టి, వారిని “ఆధ్యాత్మిక సత్రం”గా చెప్పబడే తన పరిశుద్ధ సంఘం (శ్రీసభ) లోకి తీసుకువెళ్లాడు. ఈ సత్రం రక్షణ, ఆధ్యాత్మిక వైద్యం, మరియు పోషణ లభించే సురక్షితమైన స్థలం. కనుక, పాపం నుండి మానవాళిని విమోచించడానికి క్రీస్తు చేసిన అపారమైన ప్రేమ, త్యాగం గురించిన లోతైన సత్యాన్ని కూడా ఈ ఉపమానము వెల్లడిస్తుందని శ్రీసభ మనకు బోధిస్తుంది.

మంచి సమరీయుని ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు:
1. నిజమైన ప్రేమ మరియు దయ: ఈ ఉపమానం నిజమైన ప్రేమ కేవలం మాటలలో కాకుండా, చేతలలో ఉంటుందని బోధిస్తుంది. యాజకుడు మరియు లేవీయుడు మతపరమైన వ్యక్తులు అయినప్పటికీ, వారు కరుణ చూపడంలో విఫలమయ్యారు. సమరీయుడు, సమాజం ద్వారా చిన్నచూపు చూడబడినప్పటికీ, నిస్వార్థంగా సహాయం చేశాడు. ఇది మన విశ్వాసం మన చర్యలలో ప్రతిబింబించాలని సూచిస్తుంది. మన ఇంటిలో [కుటుంబ సభ్యుల పట్ల సహనం, దయ, క్షమ కలిగి జీవించాలి], పాఠశాలలో, కార్యాలయంలో [స్నేహితులు, సహోద్యోగుల పట్ల గౌరవం, సహాయం, మరియు మద్దతు ఇవ్వడం], మరియు మన చుట్టుపక్కల సమాజంలో [పొరుగువారికి, అవసరంలో ఉన్న అపరిచితులకు సహాయం చేయడం, వారి బాధలను పంచుకోవడం] ఇతరుల పట్ల ప్రేమను చూపించమని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నాడు.

2. క్రైస్తవ ధర్మానికి సవాలు: ఈ ఉపమానం క్రైస్తవ ధర్మాన్ని పాటించే వారికి ఒక సవాలు. యేసు తన శిష్యులకు కేవలం ఆజ్ఞలను పాటించడం కాకుండా, ప్రేమ మరియు కరుణతో నిండిన హృదయాన్ని కలిగి ఉండాలని బోధిస్తున్నారు. మనం పక్కన పెట్టబడినవారిని, అవసరంలో ఉన్నవారిని, మరియు సమాజం చిన్నచూపు చూసేవారిని ఎలా చూస్తున్నామో ఈ ఉపమానం ప్రశ్నిస్తుంది.
3. అందరూ మన పొరుగువారే: ఈ ఉపమానం మన పొరుగువాడు ఎవరనే దానికి సంబంధించిన మన సంకుచిత ఆలోచనలను పటాపంచలు చేస్తుంది. మన పొరుగువాడు మన కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మనకు తెలిసిన వారు మాత్రమే కాదు. అతను లేదా ఆమె, జాతి, మతం, సామాజిక స్థితి లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా, అవసరంలో ఉన్న ఏ వ్యక్తి అయినా మన పొరుగువారే.

మంచి సమరీయుని ఉపమానం నేటి సమాజానికి ఇచ్చే సందేశం:
1. సహాయం అవసరమైన వారిని గుర్తించడం: మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో మంది బాధల్లో ఉన్నారు - పేదరికం, అనారోగ్యం, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, మరియు సామాజిక అన్యాయం వంటివి. అలాంటి వారిని గుర్తించి, వారికి సహాయం చేయాలి.

2. నిస్వార్థ సేవ: స్వార్థం మరియు వ్యక్తిగత లాభం ప్రాధాన్యత వహించే ఈ సమాజంలో, నిస్వార్థ సేవ యొక్క ప్రాముఖ్యతను ఈ ఉపమానం గుర్తుచేస్తుంది. మనం మన సౌలభ్యాన్ని పక్కన పెట్టి, ఇతరుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.

3. పక్షపాతం లేకుండా ప్రేమించాలి: జాతి, మతం, రాజకీయాలు లేదా సామాజిక భేదాల ఆధారంగా ప్రజలను విడదీసే ప్రవృత్తి నేటి ప్రపంచంలో ప్రబలంగా ఉంది. మంచి సమరీయుని ఉపమానం ఈ పక్షపాతాలను అధిగమించి, అందరినీ ప్రేమతో మరియు కరుణతో చూడాలని మనల్ని ఆహ్వానిస్తుంది.

4. కరుణ మరియు సానుభూతి: ఇతరుల బాధలను చూసి సానుభూతి చెందడం మరియు వారి పట్ల కరుణ చూపడం ఈ ఉపమానం యొక్క ప్రధాన సందేశం. కేవలం చూసి వదిలివేయడం కాకుండా, వారి బాధను పంచుకొని, వారికి ఉపశమనం కలిగించడానికి చర్య తీసుకోవాలి.

5. సామాజిక న్యాయం కోసం కృషి: ఈ ఉపమానం కేవలం వ్యక్తిగత దయ గురించి మాత్రమే కాదు, సామాజిక న్యాయం గురించి కూడా తెలియ జేస్తుంది. దొంగల చేతిలో పడిన వానిని చూసి విస్మరించిన యాజకుడు మరియు లేవీయుడు, అప్పటి సామాజిక మరియు మతపరమైన నిర్మాణంలోని లోపాలను సూచిస్తారు. మనం అన్యాయమైన వ్యవస్థలను సవాలు చేయాలి మరియు అందరికీ సమానత్వం మరియు న్యాయం కోసం కృషి చేయాలి.

ప్రియ సహోదరీ సహోదరులారా! నా పొరుగువారు ఎవరు? అని ప్రశ్నించుకుందాం! సమాధానం మన అంత:రంగమునుండి రావాలి. నా పొరుగువారు ఎవరు? నా మతం వాడేనా? నా కులం వాడేనా? నా జాతివాడేనా? నా వర్గం వాడేనా? నా ప్రాంతం వాడేనా? ఎవరు నా పొరుగువారు? ఆత్మపరిశీలన చేసుకుందాం! సర్వమానవాళి దేవుని సృష్టియేనని, అందరం దేవుని బిడ్డలమేనని, సోదరులమేనని, అందరూ నా పొరుగువారేనని భావిస్తున్నామా?

ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం: “నేను ఇతరులకు మంచి పొరుగువానిగా ఉంటున్నానా?” మనం ఎలా మంచి పొరుగువానిగా మారగలను? ఉదారత, దయ, మరియు కరుణ కలిగిన వ్యక్తులుగా మారినప్పుడు, బాధపడుతున్న ప్రతి ఒక్కరి పట్ల మనం మంచి పొరుగువారిగా మారతాము. ఒక నిజాయితీతో కూడిన చిరునవ్వు, ఒక ఉత్సాహభరితమైన పలకరింపు, ఒక ప్రోత్సాహకరమైన ప్రశంసా వాక్యం, హృదయపూర్వక "ధన్యవాదాలు", బాధలలో ఉన్నవారి ఆత్మలకు అద్భుతాలు చేయగలవు.

ఆత్మపరిశీలన చేసుకుందాం: దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నామా? దైవాజ్ఞలను పాటిస్తున్నామా? మంచి సమరీయునివలె, యేసు మనకు చేరువలోనే ఉన్నారని నమ్ముచున్నామా? ఆయన మన ప్రతీ అవసరములో తోడుగా ఉంటారు. మన పొరుగువారిద్వారా , ప్రభువు మన చేరువలో, మనకు సహాయం చేయడానికి ఉన్నారని విశ్వసిస్తున్నామా? మనం ఇతరులకు మంచి సమరీయులుగా మారుటకు సిద్ధముగా ఉన్నామా? ఎవరైనా ఆపదలో, ప్రమాదములో ఉంటె, సెల్ఫీలు, విడీయోలు తీసి ఆనందపడుచున్నామా లేక వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళుచున్నామా? అవసరతలోనున్న వారికి చేయూత నివ్వడానికి సిద్ధముగా ఉన్నామా?

ప్రతీ ఒక్కరికి మనం మంచి పొరుగువారిగా మారడానికి కావలసిన శక్తిని, దీవెనలను దేవుడు దయచేయాలని ప్రార్ధన చేస్తూ... దేవుడు మిమ్ములను దీవించునుగాక! ఆమెన్!

14వ సామాన్య ఆదివారము, YEAR C - పునీత తోమా

14వ సామాన్య ఆదివారము, YEAR C
యెషయ 66:10-14; గలతీ 6:14-18; లూకా 10:1-12, 17-20


మన జీవితంలో శాంతి, సమాధానం అమూల్యమైన బహుమతులు. క్రీస్తుయే నిజమైన శాంతి ప్రదాత. ఈనాటి సందేశం ఈ లోకంలో శాంతి యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ధ్యానిస్తుంది. క్రీస్తుయే మన శాంతికి మూలం అని కూడా ఇది గుర్తుచేస్తుంది. మనలో ప్రతి ఒక్కరికీ ఉన్న సహజ కోరిక శాంతి, సమాధానాలతో జీవించాలని. లోకం విభిన్న రంగాలలో అభివృద్ధి పథంలో ఉండగా, సాధారణంగా, మానవాళి మరింత శాంతి, సామరస్యంతో జీవిస్తుందని ఆశిస్తాం. కానీ, దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. ఎందుకంటే, నిజమైన శాంతి దేవుని నుండే వస్తుంది. కాబట్టి, దానిని మనం గౌరవించాలి, పోషించుకోవాలి, మరియు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

మొదటి పఠనములో, దేవుడు తన అపారమైన దయతో మనకు శాంతిని వాగ్దానం చేయుచున్నారు: “నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును, [శాంతిని] నది వలె పారింతును” (యెషయ 66:12). ప్రవక్త యెరూషలేమును బిడ్డలను ఓదార్చి, పోషించే తల్లితో పోల్చుతున్నాడు. అనగా, విశ్వాసముగా ఉండేవారికి దేవుని, శాంతి, ఆనందం, సమృద్ధి లభిస్తాయి. ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది: దేవుడు ప్రసాదించే ఆశీర్వాదాలలో మనం ఆనందించాలి, ఆయన సంరక్షణపై పూర్తి నమ్మకముంచాలి. ఒక తల్లి తన బిడ్డను ఎలా అపురూపంగా పోషిస్తుందో, అదేవిధంగా దేవుడు తన ప్రజలకు, కష్ట సమయాల్లో కూడా, ఓదార్పును, నిరీక్షణను అందిస్తారు. కనుక, ఆయనను విశ్వసించి, ఆయనలోనే నిజమైన శాంతిని కనుగొనమని మనకు పిలుపునిస్తుంది.

దేవుడు ఒసగు ఈ దివ్య శాంతి మన హృదయాల్లోకి ప్రవహించి, మన జీవితాలను నడిపించడానికి మనం అనుమతించినప్పుడు, మన జీవితాలు సంపూర్ణమవుతాయి. అంతేకాదు, మన సమాజాలు, యావత్ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశంగా మారుతాయి. అందుకే దేవుడు మనల్ని శాంతికి దూతలుగా, సాధనాలుగా, ప్రతినిధులుగా ఉండమని పిలుస్తున్నారు. ఈ శాంతి మన నుండి మొదలై, మన ద్వారా ఇతరులకు కూడా ప్రవహించాలి.

దురదృష్టవశాత్తు, నేడు మనలో చాలామందిమి, శాంతి అనేది కేవలం భౌతిక సంపదతో ముడిపడి ఉంటుందని భావిస్తున్నాం. ఎంత సంపద, డబ్బు, అధికారం, పలుకుబడి ఉందనే దానిపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నాం. “శాంతి అనేది విజయవంతమైన జీవితం నుండి పొందుకొనే ఆశీర్వాదకరమైన ఆనందం. సజీవ దేవుని సమక్షంలో లభించే జీవిత సంపూర్ణత్వం. మానవుల పరస్పర ప్రేమలో వ్యక్తమయ్యే జీవిత సంపూర్ణత్వం” (జుర్గెన్ మోల్ట్‌మన్). కనుక, నిజమైన శాంతి, శాంతికి ప్రధాత అయిన యేసుక్రీస్తు నుండి మాత్రమే ప్రవహించగలదు.

రెండవ పఠనంలో, అపొస్తలుడైన పౌలు ఒక శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నాడు: “ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము, కనికరము తోడగును గాక!” (గలతీ 6:16). ఈ మాటల లోతైన అర్థం ఏమిటంటే, మనం దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తూ, ఆయనతో సామరస్యంగా నడచినప్పుడు మాత్రమే మన హృదయాలలో, కుటుంబాలలో, సమాజాలలో, చివరికి ప్రపంచమంతటా నిజమైన శాంతి వెల్లివిరుస్తుంది. పౌలు వలె, క్రీస్తు యొక్క ముద్రలను (అనగా, ఆయన పట్ల విశ్వాసం, ఆయన బోధనలకు విధేయత) ధరించిన ప్రతి ఒక్కరికీ ఈ శాంతి లభిస్తుంది. కాబట్టి, మన ఆనందం యేసుక్రీస్తులో సంపూర్ణం కావాలంటే, శాంతికి మన జీవితంలో పెద్దపీట వేయాలి.

సువిషేశములో, “మీరు ఏ యింట ప్రవేశించిన ఆ యింటికి సమాధానము కలుగునుగాక! శాంతి కాముడు అచ్చట ఉన్న యెడల మీ శాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును” (లూకా 10:5-6). కనుక, శాంతి లోకానికి మనం తప్పక అందివ్వాల్సిన బహుమతి. ప్రస్తుత ప్రపంచానికి అత్యంత అవసరమైనది. ఈవిధముగా, క్రీస్తు తన శాంతికి సాధనాలుగా ఉండమని మనలను ఆహ్వానిస్తున్నారు. మనం మన ప్రపంచానికి తీసుకురావాల్సినది మన ప్రభువైన యేసుక్రీస్తు శాంతి సదేశము. అందరం శాంతి, సమాధానాలతో జీవించాలని ఆశిస్తాం. పూజలు కూడా ఈ ఉద్దేశ్యం కొరకు పెట్టిస్తాం. శాంతి, సమాధానం యొక్క అవసరత ఎంతగా ఉందో, అది మన జీవితములో ఎంత ప్రాముఖ్యమో, మనకు తెలుసు!

ఉత్థాన క్రీస్తు తన శిష్యులతో మొదటిగా పలికిన మాటలు, “మీకు శాంతి కలుగునుగాక” అని (యో 20:19). ఈ మాటలకు ఎంతో లోతైన అర్ధం ఉంది: శిష్యులలో నున్న భయాన్ని తొలగించడం; వారిపట్ల యేసు క్షమాపణ, సమాధానంను తెలియజేయడం; తన సందేశాన్ని లోకానికి తీసుకెళ్ళడానికి వారిని సిద్ధంచేయడం; నిజమైన శాశ్వత శాంతిని క్రీస్తు ఒసగునని ఈ మాటలు తెలియ జేస్తున్నాయి.

బైబులులో హీబ్రూ భాషలో శాంతిని షలోం [shalom] అని పిలుస్తాం. అయితే, బైబిల్‌లో 'శాంతి' అనే పదానికి కేవలం యుద్ధం లేకపోవడం అనే అర్థం మాత్రమే కాదు, అంతకు మించి లోతైన, సమగ్రమైన అర్థం ఉంది.
'షలోం' అంటే,
- సంపూర్ణత్వం (Wholeness): షలోం అంటే ఒక వ్యక్తి లేదా పరిస్థితి అన్ని విధాలా సంపూర్ణంగా, లోపాలు లేకుండా ఉండటం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది;
- క్షేమం (Well-being): ఇది కేవలం అనారోగ్యం లేకపోవడం కాదు, అన్ని పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి క్షేమంగా, సురక్షితంగా ఉండటం. ఆర్థికంగా, సామాజికంగా కూడా క్షేమంగా ఉండటాన్ని ఇది తెలియజేస్తుంది;
- సమగ్రత (Integrity): వ్యక్తిగతంగా, నైతికంగా ఉన్నత విలువలతో జీవించడం. మోసం, అన్యాయం లేని స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం;
సామరస్యం (Harmony): దేవునితో, ఇతరులతో, ప్రకృతితో సామరస్య సంబంధాలను కలిగి ఉండటం. వివాదాలు లేకపోవడమే కాదు, ప్రేమ, గౌరవంతో కూడిన సంబంధాలు ఉండటం;
- శాంతి, విశ్రాంతి (Peace and Rest): శారీరక, మానసిక విశ్రాంతిని సూచిస్తుంది. జీవితంలోని అలజడుల నుండి స్వేచ్ఛను పొంది, ప్రశాంతంగా ఉండటం;
- సంపూర్ణ ఐశ్వర్యం (Total Prosperity): ఇది కేవలం ధనం కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి, ఎదుగుదల కలిగి ఉండటం. జీవితంలో ఏ కొరత లేకుండా సంపూర్ణంగా ఉండటం.
- విమోచన, రక్షణ (Deliverance and Salvation): శత్రువుల నుండి, కష్టాల నుండి దేవుడు ఇచ్చే రక్షణ, విమోచన కూడా షలోంలో భాగమే.

          శాంతి అనగా, యుద్ధాలు లేకపోవడం మాత్రమే కాదు. విజయవంతమైన జీవితము యొక్క ఆశీర్వాదం; సజీవుడైన దేవుని సన్నిధిలో జీవితము యొక్క పరిపూర్ణత; మానవుల పరస్పర ప్రేమ యొక్క పరిపూర్ణత; ఇతరులతో కూడి సమాజములో సంపూర్ణ జీవితం; సమాజ సామరస్యం మరియు సంపూర్ణ శ్రేయస్సు; ‘షలోం’ అనగా దేవుని పరిపూర్ణమైన అనుగ్రహం. దేవుని చిత్తానికి అనుగుణముగా జీవించినప్పుడుదేవుని ఆజ్ఞలను పాటించినపుడు, మన హృదయాలలో, కుటుంబాలలో, సమాజములో, ప్రపంచములో శాంతిని చవిచూస్తాము. సువార్త సందేశాన్ని తిరస్కరించిన వారికి శాంతి, సమాధానం ఉండవు.

అయితే ఆ శాంతి, సమాధానాలను మనం ఎక్కడ వెదుకుచున్నాము? ఈ లోక సంపదలలోనా? అభివ్రుద్ధిలోనా? మరెక్కడైనా? నిజమైన శాంతి, సమాధానం దేవునినుండి లభిస్తాయి. శాంతి, సమాధానమునకు మూలకర్త క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు ఒసగు శాంతి మన హృదయాలలో ప్రవహించేలా, మన జీవితాలను నడిపించేలా మనం అనుమతించాలి. అప్పుడే మనం సంతృప్తిగా జీవిస్తాం. అప్పుడే ఈ లోకం అద్భుత ప్రదేశముగా మారుతుంది. అలాంటి శాంతి, సమాధానాలకు మనం దూతలుగా, సాధనాలుగా ఉండాలని ప్రభువు కోరుచున్నారు. “శాంతి సాధనముగా నన్ను మలచుమయా దేవా!” అని పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారు ప్రార్ధించారు.

శాంతిస్థాపనకై, ప్రభువు తన శిష్యులను లోకములోనికి పంపించారు. నేటి సువిషేశములో వింటున్నట్లుగా, “ప్రభువు డెబ్బది ఇద్దరినీ నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపారు”. వారిని దైవరాజ్యము సమీపించినదని ప్రకటించుటకై పంపారు; రక్షణ సందేశమును ప్రకటించుటకై పంపారు. “ఇద్దరిద్దరి చొప్పున” ఎందుకన, మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక సాక్ష్యం నమ్మదగినది కావాలంటే, ఇద్దరు సాక్ష్యులు అవసరం. అలాగే, “డెబ్బది రెండు” సంఖ్య మానవ జాతులన్నింటిని సూచిస్తుంది.

మనం నేడు ప్రతీ ఒక్కరికి ఈ శాంతి సందేశాన్ని చాటాలి. ప్రతీ యింటికి శాంతిని, సమాధానమును తీసుకొని వెళ్ళాలి. ఈ ప్రపంచానికి మనం ఒసగెడి గొప్ప బహుమానం శాంతి’. శాంతితో మనం ప్రపంచాన్ని మార్చగలం; పునరుద్ధరించగలం! ద్వేషం, యుద్ధం అను సంస్కృతినుండి శాంతి అను సంస్కృతికి మనం మారాలి. శాంతి దూతలుగా, శాంతి సాధనాలుగా మారాలని ప్రభువు కోరుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు శాంతికి సంబంధించిన శుభవార్తను మనం ప్రపంచానికి తీసుకురావాలి.

అయితే, పంట విస్తారము కాని పనివారు తక్కువ (లూకా 10:2). “పనివారు” అనగా శాంతి స్థాపకులను, దూతలను, శాంతి సాధనాలను ఎక్కువగా ఒసగమని యజమానిఅయిన దేవున్ని మనం ప్రార్ధించాలి. “పంటపొలము” ఈ ప్రపంచము. కోతకు, అనగా ‘తీర్పుకు’ సిద్ధముగా యున్నది. ప్రజలకు సువార్త ప్రకటింప బడాలి; దైవరాజ్య మార్గాలను బోధించాలి. దీని నిమిత్తమై ప్రచారకులు, బోధకులు, గురువులు అవసరం. కనుక దేవున్ని ప్రార్ధించాలి.

“తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె మిమ్ము పంపుచున్నాను” (లూకా 10:3). “తోడేళ్ళ మధ్యఅనగా సువార్తకు వ్యతిరేక పరిస్థితులు. సాతాను ఎప్పుడుకూడా సువార్త బోధనకు అడ్డుపడుతూ ఉంటుంది. లోకం శత్రువులతో, ప్రలోభాలతో నిండియున్నది, కనుక శిష్యులు జాగరూకులై యుండాలి. యేసు ప్రభువునే ఆయన శత్రువులు సిలువకు నడిపించారు. శిష్యులుకూడా ఇలాంటి ఇబ్బందులను లేక ఎక్కువ ఇబ్బందులనే ఎదుర్కొంటారు. అందుకే ప్రభువు ముందుగానే శిష్యులకు సూచనలను చేసియున్నారు. శిష్యులు పరిపూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించాలి. శాంతి స్థాపనకై పాటుబడాలి. జాలె, సంచి అవసరం లేదు; ఎందుకన వారు భిక్షాటనకు వెళ్ళడం లేదు. వారు దేవుని పొలములో [రాజ్యములో] పనివారు. కాబట్టి వారి జీతానికి వారు అర్హులు. “పనివాడు కూలికి పాత్రుడు” (లూకా 10:7). పాదరక్షలు కూడా అవసరం లేదు. దేవుని కొరకు అంత పేదవారిగా శిష్యులు జీవించాలి. ఇది సర్వసంపూర్ణ పరిత్యాగానికి సూచన! ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు! ఇది సువార్త యొక్క అత్యవసరతను సూచిస్తుంది. కొన్నిసార్లు, అనవసరమైన మాటలద్వారా, చర్చలద్వారా, వాగ్వివాదాలద్వారా, విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. లూకా 1:39లో దేవుని వాక్య సందేశాన్ని స్వీకరించిన మరియ, “త్వరితముగా ప్రయాణమై పోయినది.” యోహాను 1:41-42లో – క్రీస్తును కనుగొనిన అంద్రేయ, వెంటనే అతని సోదరుడగు సీమోనును కనుగొని మేము మెస్సయ్యను కనుగొంటిమిఅని చెప్పాడు. యోహాను 4:28-29లో – క్రీస్తును గుర్తించిన సమరీయ స్త్రీ తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్లి ప్రజలతో, “ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన క్రీస్తు ఏమో!అని చెప్పినది. లూకా 24:33-35లో – ఎమ్మావు మార్గములో క్రీస్తును దర్శించుకొనిన ఇద్దరు శిష్యులు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఇతర శిష్యులకు తెలియజేసారు.

సువార్తను తిరస్కరించే వారు, ఆ ప్రదేశం అపవిత్రమైనదిగా భావించ బడును. అందుకేకాళ్ళకు అంటిన దుమ్మును అచ్చటె దులిపి వేయాలి. సువార్తను తిరస్కరించేవారు దైవరాజ్యములో భాగస్తులు కాలేరు. ఎందుకన, వారు దేవుని తిరస్కరించుచున్నారు. ఈ శాంతి స్థాపనలో సామాన్య ప్రజలు కూడా గురువులకు, బోధకులకు తప్పక సహాయముగా యుండాలి. శిష్యుల పరిచర్య ఎలా ఉండాలంటేసాతానుపై విజయం సాధించేలా ఉండాలి (లూకా 10:17). యేసు సువార్త పరిచర్య మనద్వారా పరిపూర్ణం కావాలి. అయితే మన విజయాల వలన గర్వితులుగా మారకూడదు. “దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనంద పడక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి యున్నవని ఆనందింపుడు” (లూకా 10:20) అని ప్రభువు పలుకుచున్నారు. మన విజయాలకు కారణం దేవుడు అని ఎల్లప్పుడు గుర్తుపెట్టు కోవాలి!

“సాతాను ఆకాశము నుండి మెరుపువలె పడిపోవుట కాంచితిని” (లూకా 10:18) అని ప్రభువు అన్నారు. సాతాను గర్వము వలన పరలోకమునుండి భూలోకానికి పడిపోయింది. కనుక గర్వితులు కాకూడదని ప్రభువు హెచ్చరిస్తున్నారు.

గతములోని మిషనరీలు మనకు ఆదర్శము కావాలి. ఎంతో దూరం కాలినడకన వెళ్ళారు. వారు తమ పనిని మిక్కిలిగా ప్రేమించారు. దానికి కట్టుబడి జీవించారు. ఎలాంటి రిస్కులకు వెనుకాడలేదు. ప్రజలతో వ్యక్తిగత పరిచయాలను కలిగి యున్నారు. సంఘాలను స్థాపించి, నిర్మించారు. నేటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి: వ్యక్తిగత పరిచయాలు కనుమరుగై పోవుచున్నాయి. వేగముగా (వేగము, పైన చెప్పబడిన అత్యవసరత ఒకటి కాదు; వేగముగా పనులు చేయడం అత్యవసరత కానేరదు) ఎన్నో పనులు, కార్యక్రమాలు చేస్తున్నాం; కాని, సువార్త ప్రచారములో పసలేకుండా పోతున్నది. కొన్నిసార్లు అభిరుచి కూడా తగ్గిపోవుచున్నది. కనుక, నేటి సువిశేషం మనందరికీ ఓ సవాలు! ప్రభువు కేవలం గురువులను మాత్రమేగాక, జ్ఞానస్నానం పొందిన ప్రతీ క్రైస్తవులను పంపుచున్నారు. కనుక ఈ సవాలు అందరికీ!

మన జీవితంలో మన స్థితి, హోదా ఏదైనా సరే అది తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా, యజమానులుగా, నిపుణులుగా లేదా విద్యార్థులుగా అయినా క్రీస్తు రక్షణ సందేశాన్ని ప్రకటించడానికి మనం పిలువబడి యున్నాము. దేవుని వాక్యాన్ని బోధించడం కేవలం గురువులకే ప్రత్యేకమని భావించడం సరికాదు. “సువార్తను విని, రక్షింపబడినవారు ఇప్పుడు స్వయంగా సువార్తను ప్రకటించేవారుగా మారాలి” (పౌల్ VI, Evangelii Nuntiandi). మనం పొందిన జ్ఞానస్నానం, పవిత్రీకరణ ద్వారా, క్రీస్తును అనుకరిస్తూ, మన మాటల ద్వారా, చేతల ద్వారా ఆయనను ప్రకటించడం ద్వారా క్రీస్తు సువార్త బోధనలో మనం పాలుపంచుకుంటాము.
నేటికీ “పంట విస్తారము, కాని పనివారు తక్కువ”; బహుశా, నిబద్ధత, అంకితభావం కలిగినవారు తక్కువ. ఆలోచించదగ్గ విషయం! నిబద్ధత, అంకితభావం కలిగినవారిని పంపమని దేవున్ని ప్రార్ధన చేద్దాం!

త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, Year C

త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, Year C
సామె.
8: 22-31; రోమీ. 5:1-5; యోహాను. 16:12-15



ధ్యానాంశము: త్రిత్వైక సర్వేశ్వరుడు: ప్రేమ, ఐఖ్యత

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినపుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును” (యో 16:13).

 ఈరోజు మనం త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను గొప్పగా జరుపుకుంటున్నాం. ఇది మన విశ్వాసంలో అత్యంత లోతైన మరియు మర్మమైన సత్యం. మన దేవుడు ఒక్కరే అయినప్పటికినీ, ఆయనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు దివ్య వ్యక్తులు ఉన్నారని మన విశ్వాసం బోధిస్తుంది. ఇది మానవ తర్కానికి అందని విషయమే అయినా, ప్రేమలో నిండిన దేవుని నిజమైన స్వభావం ఇదే.

చారిత్రాత్మకంగా, ఈ పండుగ క్రీ.శ. 1030వ సంవత్సరంలో పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చే ఆదివారం ప్రారంభమైంది. ఆ తర్వాత క్రీ.శ. 1334వ సంవత్సరంలో, ఇరువై రెండవ జాన్ పోప్ గారు దీనిని విశ్వశ్రీసభ పండుగగా అధికారికంగా ఆమోదించారు.

మన దేవుడు ఏక త్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు. అంటే, ఆయన ఒకే సర్వేశ్వరుడు అయినప్పటికీ, త్రిత్వవంతుడై ఉన్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ అనే ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఉన్నారని, కానీ ఆ ముగ్గురు వ్యక్తులకు ఒకే స్వభావం ఉందని దీని అర్థం. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు. ఎందుకంటే వీరికి ఒకే జ్ఞానం, ఒకే చిత్తం, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావం ఉన్నాయి. వీరిలో శక్తి, మహిమ వంటి లక్షణాలలో ఎలాంటి భేదం లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నింటిలో సరిసమానులు. వీరు ముగ్గురూ ఆరంభం లేనివారు కాబట్టి, వీరిలో ముందు లేదా వెనుక అనే తేడా లేదు.

“పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించు చున్నాను. పవిత్రాత్మను విశ్వసించు చున్నాను” అని అపోస్తలుల విశ్వాస ప్రమాణములో స్పష్టంగా ప్రకటిస్తున్నాము.

పితయైన దేవుడు-మన ప్రేమగల తండ్రి: పితయైన దేవుడు మనకు ప్రేమగల తండ్రి వంటివారు. ఆయన తన దివ్య పోలికలో మనలను సృజించారు. ఈ భూలోక ప్రయాణం ముగిసిన తర్వాత, మనం తిరిగి తండ్రియైన దేవుని చెంతకు చేరుకుంటాము. ఆయన మనలను పోషిస్తారు, మరియు నిత్యజీవాన్ని మనకు అనుగ్రహిస్తారు. నేను ఉన్నవాడను” అని దేవుడు మోషేకు తనను తాను తెలియజేశారు. తండ్రియైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగా ఎన్నుకున్నారు. వారిని బానిసత్వం నుండి విడిపించి, సీనాయి కొండపై పది ఆజ్ఞలను ఒసగి, నిత్యం వారి వెన్నంటే ఉన్నారు. ఆయన ప్రేమామయులు, దయామయులు, మరియు విశ్వసనీయులు.

పుత్రుడైన దేవుడు-మన సోదరుడు, స్నేహితుడు: పుత్రుడైన దేవుడు, యేసుక్రీస్తు, మనకు ప్రియమైన సోదరుడు మరియు నిస్వార్థ స్నేహితుడు. ఆయనే మనకు తండ్రియైన దేవుడిని పరిచయం చేశారు. అంతేకాదు, అవిధేయత మార్గాల నుండి మనలను తనవైపునకు ప్రేమతో మరల్చుకుంటారు. ఆయన మనకోసం, మనలో ఒకరిగా ఈ లోకంలో జన్మించారు. మనం శ్రమలలో ఉన్నప్పుడు, ఆయన మనతో పాటు శ్రమలనుభవించి, మన ఆనందంలో పాలుపంచుకుంటారు. ప్రేమించడం, ప్రేమించబడటం అనే జీవిత పరమార్థం వైపునకు మనలను నడిపిస్తారు. ఆయన ద్వారానే మనం దేవుని కృపానుగ్రహాన్ని, రక్షణను పొందుకొని ఉన్నాము.

పవిత్రాత్మ దేవుడు-మనలోని జీవం, దైవిక శక్తి: పవిత్రాత్మ దేవుడు మనలో వసిస్తున్న జీవం, మన శ్వాస, మరియు మన దైవిక శక్తి. ఆత్మ ద్వారానే మనం దేవుణ్ణి 'అబ్బా! తండ్రీ!' అని పిలవగలుగుతున్నాం. దీని ద్వారా మనం దేవుని బిడ్డలమయ్యాము. బిడ్డలం కాబట్టి, మనము ఆయనకు వారసులము; క్రీస్తుతోటి వారసులము (రోమీ 8:15-17). యేసుక్రీస్తు మరియు పవిత్రాత్మ ఇద్దరూ కూడా మనలను ప్రేమగల తండ్రియైన దేవుని వైపునకు నడిపిస్తారు. జ్ఞానస్నానం ద్వారా ఆత్మను పొందిన మనం 'నూతన జీవితాన్ని' పొందియున్నాము. ఆత్మ మనలను క్రీస్తులో ఐక్యం చేస్తుంది; దేవుని బిడ్డలుగా ఆయనతో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆత్మ మనకు మార్గనిర్దేశం చేస్తుంది, బోధిస్తుంది, మనలను ప్రేమిస్తుంది, ఓదార్చుతుంది, మరియు బలపరుస్తుంది.

నేటి పఠనాలు-త్రిత్వైక సత్య దర్శనం: ఈ రోజు పఠనాలు త్రిత్వైక సత్యాన్ని వివిధ కోణాల నుండి మనకు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.

మొదటి పఠనం, సామెతల గ్రంథం నుండి, దైవిక విజ్ఞానం గురించి విన్నాము. ఈ విజ్ఞానం సృష్టికి ముందే దేవునితో ఉందని, సృష్టి కార్యంలో దేవునితో కలిసి పనిచేసిందని వర్ణించబడింది. “ప్రభువు నన్ను ప్రప్రథమమున సృజించెను. తాను పూర్వమే కలిగించినవాని యన్నింటిలో నన్ను మొదటి దానినిగా చేసెను” (సామెతలు 8:22). ఈ విజ్ఞానం దైవత్వానికి చెందినది, ఇది దేవునిలో నిత్యంగా ఉన్నది మరియు ఆయన సృష్టికర్త శక్తిని ప్రతిబింబిస్తుంది. ఇది దేవుని రెండవ వ్యక్తియైన యేసుక్రీస్తును సూచిస్తుంది, ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడింది.

రెండవ పఠనం, రోమీయులకు వ్రాసిన పత్రిక నుండి, విశ్వాసం ద్వారా దేవునితో సమాధానం లభించిందని పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు. క్రీస్తు ద్వారానే మనకు దేవుని దయలోనికి ప్రవేశం లభించింది. శ్రమలలో కూడా ఆనందించాలని పౌలు మనల్ని ప్రోత్సహిస్తాడు, ఎందుకంటే: “కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన, దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను” (రోమీ. 5:3-5). ఈ వచనం త్రిత్వంలోని మూడు వ్యక్తులనూ స్పష్టంగా సూచిస్తుంది: దేవుని ప్రేమ (తండ్రి), యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన దయ (కుమారుడు), మరియు మన హృదయాలలో నింపబడిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారానే మనం దేవుని అపారమైన ప్రేమను అనుభవించగలుగుతున్నాము.

సువార్తలో త్రిత్వైక బోధన-అద్భుత ఐక్యత: యోహాను సువార్త తండ్రి, కుమారుల మధ్య ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాన్ని స్పష్టంగా నొక్కి చెబుతుంది. తండ్రి ప్రేమను లోకానికి తెలియజేయడమే కుమారుని ప్రధాన లక్ష్యం (యో 17:6-8). నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము” (యో 10:30) అని యేసు ప్రకటించారు. వారి మధ్య ఉన్న అగాధమైన ఐక్యతను ఇది తెలియజేస్తుంది. ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే అని యేసు అన్నారు (యోహాను 14:9). తండ్రిని గురించి వెల్లడి చేస్తూనే, యేసు ఆత్మ గురించి కూడా తెలియజేశారు. "తండ్రి యొద్దనుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ" (యోహాను 15:26) మనతో ఉండటానికి దేవుడు పవిత్రాత్మను పంపుతారని ఆయన అన్నారు. అంతేకాకుండా, "నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను" (యోహాను 16:7) అని యేసు పలికారు. అంటే, యేసు పవిత్రాత్మను పంపుతారు. ఈ సత్యం తండ్రి దేవుడు మరియు పుత్ర దేవుడు పవిత్రాత్మను పంపుతారనే గొప్ప సహవాసాన్ని, ఐక్యతను స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఇదే ఐక్యత తన ప్రజల మధ్య కూడా ఉండాలని ప్రభువు ఆశించారు (యో 13:34-35; 17:21). ఇదే త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ యొక్క గొప్ప సందేశం: మనము పరస్పర ప్రేమ కలిగి, ఐక్యతతో జీవించాలి.

ప్రియ సహోదరీ సహోదరులారా, త్రిత్వైక దేవుడు మనకు దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన మన జీవితంలో చురుకుగా పాల్గొనే దేవుడు.

తండ్రి-మన సృష్టికర్త, పోషకుడు, ప్రేమగల తండ్రి: తండ్రియైన దేవుడు మన సృష్టికర్త. ఆయన మనకు జీవాన్ని ఇచ్చారు, మనలను అపారంగా ప్రేమిస్తారు, మరియు మనల్ని నిత్యం పోషిస్తారు. మన క్రైస్తవ విశ్వాసంలో, తండ్రియైన దేవుడే మన అస్తిత్వానికి మూలం. దీనిని మనం ఆదికాండము నుండే స్పష్టంగా చూడవచ్చు. “ఆదిలో దేవుడు ఆకాశమును, భూమిని సృష్టించెను” (ఆది 1:1) అని ఉంది. ఈ వచనం దేవుడే సమస్త సృష్టికి కారణమని స్పష్టం చేస్తుంది. ఆయన మానవజాతిని కూడా తన స్వరూపములో, తన పోలికలో సృష్టించాడు (ఆది 1:27). ఇది మనకు ప్రత్యేకమైన గౌరవాన్ని, విలువను ఇస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప లక్ష్యంతో, ఒక ఉద్దేశ్యంతో సృష్టించబడ్డాము.

దేవుడు కేవలం మన శరీరాలను సృష్టించడమే కాకుండా, మనలోకి జీవశ్వాసమును ఊదాడు (ఆదికాండము 2:7). ఈ జీవశ్వాసం మన ఆత్మను, మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి, మనం కేవలం భౌతిక శరీరాలు కాదు, దైవత్వం నుండి వచ్చిన జీవాన్ని కలిగియున్న జీవులము. ప్రతి ఉదయం మనం మేల్కొన్నప్పుడు, అది దేవుడు మనకు ప్రసాదించిన మరో అద్భుతమైన రోజు అని గుర్తుచేస్తుంది.

దేవుని ప్రేమ మానవ ప్రేమకు మించినది. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, షరతులు లేనిది మరియు శాశ్వతమైనది. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను" (యోహాను 3:16). ఈ ప్రేమ కేవలం మాటల్లో కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తును మన పాపముల నిమిత్తం బలిగా అర్పించడంలో అది అత్యున్నతంగా ప్రదర్శించబడింది.

తండ్రి మన బలహీనతలను, తప్పులను ఉన్నప్పటికీ, మనల్ని ప్రేమిస్తారు. ఆయన మనల్ని క్షమించడానికి, మనల్ని తన దగ్గరకు తిరిగి తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. దేవుడు మనకు జీవాన్ని ఇచ్చి, మనల్ని ప్రేమించడమే కాకుండా, మనల్ని నిరంతరం పోషిస్తారు. ఆయన మన భౌతిక అవసరాలను (ఆహారం, నీరు, వస్త్రాలు) తీరుస్తాడు, కానీ అంతకు మించి మన ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీరుస్తారు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు జ్ఞానాన్ని, బలాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇస్తారు. ఆయన మన ప్రార్థనలను వింటారు, మనకు ఓదార్పునిస్తారు మరియు కష్ట సమయాలలో మనకు తోడుగా ఉంటారు. ఒక మంచి తండ్రి తన పిల్లల బాగోగులు చూసుకున్నట్లే, తండ్రియైన దేవుడు మనకు కావలసినవన్నీ సమకూరుస్తారు.

కుమారుడు, యేసుక్రీస్తు-మన రక్షకుడు, విమోచకుడు: కుమారుడైన యేసుక్రీస్తు మన రక్షకుడు. ఆయన మన పాపాల కోసం తన ప్రాణాన్ని ఇచ్చి, దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించారు. ఆయనే దేవుని అపారమైన ప్రేమను మనకు చూపారు.

క్రైస్తవ విశ్వాసంలో, తండ్రియైన దేవుని తర్వాత, కుమారుడైన యేసుక్రీస్తు రెండవ దైవవ్యక్తి. ఆయన ఈ సృష్టిలో మానవ రూపంలో వచ్చిన దేవుడు. మన రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు పాత్ర అత్యంత కీలకమైనది.

యేసుక్రీస్తు మన విమోచకుడు. మానవజాతి ఆదాము ద్వారా పాపంలో పడింది. ఈ పాపం దేవునితో మన సంబంధాన్ని తెగదెంపులు చేసింది, మనలను మరణానికి, దేవుని నుండి వేరుపాటుకు గురిచేసింది. దేవుని న్యాయమైన తీర్పు ప్రకారం, పాపానికి ప్రతిఫలం మరణం. అయితే, దేవుడు తన అనంతమైన ప్రేమతో మనల్ని ఈ స్థితి నుండి విమోచించడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు.

కుమారుడైన యేసుక్రీస్తు ఈ విమోచనను సాధించాడు. ఆయన పాపరహితుడైన దేవుని కుమారుడు. ఆయన తన స్వచ్ఛమైన, అమూల్యమైన రక్తాన్ని సిలువపై చిందించడం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. "మన పాపములను భరించుటకు మన పాపముల నిమిత్తమై తనను తాను అర్పించుకొనెను" (1 పేతు 2:24). ఏలయనగా, పాపము వలన వచ్చు జీతము మరణము; అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము” (రోమీ 6:23). యేసు మరణం మన పాపాలకు విలువ చెల్లించింది, దాని ద్వారా మనం విమోచించబడ్డాము.

ఈ విధంగా, యేసుక్రీస్తు మన పాపాల కోసం తన ప్రాణాన్ని ఇచ్చి, దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించారు. యేసుక్రీస్తు దేవుని ప్రేమను అత్యంత స్పష్టంగా మనకు చూపినవాడు. ఆయన ద్వారానే మనం దేవునితో సమాధానం పొంది, నిత్యజీవంలోకి ప్రవేశించగలుగుతాము.

పరిశుద్ధాత్మ-మన మార్గదర్శి, బలపరిచేవారు, మరియు అంతరంగిక నివాసి: పరిశుద్ధాత్మ మన మార్గదర్శి, మనలను బలపరిచేవారు, మనలో నివసించేవారు, మరియు మనలను సత్యం వైపు నడిపించేవారు. పరిశుద్ధాత్మ ద్వారానే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము, ఆయన అద్భుతమైన శక్తితో జీవించగలుగుతాము.

త్రిత్వంలోని మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ, క్రైస్తవ జీవితంలో అత్యంత చురుకైన మరియు సన్నిహిత పాత్రను పోషిస్తారు. యేసు పరలోకానికి తిరిగి వెళ్ళే ముందు తన శిష్యులకు పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం పెంతెకోస్తు రోజున శక్తివంతంగా నెరవేరింది. యేసు తన శిష్యులకు చెప్పినట్లుగా, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును” (యో 16:13).

పరిశుద్ధాత్మ మన మార్గనిర్దేశి (The Guide): పరిశుద్ధాత్మ మన జీవితంలో ఒక GPS లాంటివారు, మనకు సరైన మార్గాన్ని చూపిస్తారు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలో, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడంలో, మంచి చెడులను వివేచించడంలో ఆయన మనకు సహాయపడతారు. ఇది కేవలం నైతిక మార్గదర్శకత్వం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోవడానికి, బైబిలు వచనాల లోతైన అర్థాన్ని గ్రహించడానికి కూడా ఆయన మనకు సహాయపడతారు.

పరిశుద్ధాత్మ మన బలపరిచేవారు (The Strengthener): పరిశుద్ధాత్మను “ఆదరణకర్త” (Comforter/ Advocate/Helper) అని కూడా అంటారు (యో 14:16). జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, శ్రమలు, ప్రలోభాలు, బలహీనతలలో ఆయన మనకు అపారమైన బలాన్ని ఇస్తారు. ఆయన మనల్ని ఓదార్చుతారు, మనకు ధైర్యాన్ని ఇస్తారు, మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తారు. అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు, నా బలహీనతయందు నాకు దేవుని కృప చాలును, ఆయన శక్తి బలహీనతలో పరిపూర్ణమగును.” ఈ శక్తి పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. క్రైస్తవ జీవితం జీవించడానికి, పాపాన్ని జయించడానికి, దేవునికి మహిమను తీసుకురావడానికి మన సొంత బలం సరిపోదు; పరిశుద్ధాత్మ యొక్క దైవిక బలం అత్యవసరం.

పరిశుద్ధాత్మ మనలో నివసించేవారు (The Indwelling Spirit): ఇది పరిశుద్ధాత్మ యొక్క అత్యంత అద్భుతమైన మరియు వ్యక్తిగత అంశాలలో ఒకటి. యేసుక్రీస్తును మన ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించిన క్షణం నుండి, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తారు. “మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీకు తెలియదా? (1 కొరి 3:16). పరిశుద్ధాత్మ మనలో నివసించడం వల్ల, మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము. ఆయన మన ఆత్మతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు, మనతో సంభాషిస్తారు, మన ప్రార్థనలకు సహాయపడతారు (రోమీ 8:26). ఇది మనకు దేవుని నిరంతర ఉనికిని, ఆయన అపారమైన ప్రేమను, ఆయనకు మనపై ఉన్న శ్రద్ధను అనుభవించే అమూల్యమైన అవకాశాన్ని ఇస్తుంది.

పరిశుద్ధాత్మ మనల్ని సత్యం వైపు నడిపించేవారు (The Revealer of Truth): పరిశుద్ధాత్మ సత్య స్వరూపి. ఆయన దేవుని సత్యాలను మనకు వెల్లడిస్తారు, క్రీస్తు బోధనలను మనకు గుర్తుచేస్తారు, మరియు దేవుని ప్రణాళికలను మనకు తెలియజేస్తారు. "ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని, మీకు తెలియచేయును" (యో 16:14). పరిశుద్ధాత్మ లేకుండా, మనం దేవుని మాటలను, ఆయన హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఆయన మన కళ్ళను తెరిచి, ఆధ్యాత్మిక సత్యాలను చూడటానికి మనకు సహాయపడతారు, తద్వారా మనం దేవుని చిత్తాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోగలుగుతాము.

త్రిత్వైక దేవుని ప్రేమలో జీవిద్దాం: ప్రియ సహోదరీ సహోదరులలరా!

పిత, పుత్ర, పరిశుద్ధాత్మఈ ముగ్గురు దివ్య వ్యక్తులు ఒకే దేవునిలో ఉన్నట్లే, మన జీవితాలలో కూడా వారు కలిసి అద్భుతంగా పనిచేస్తారు. దేవుని అపారమైన ప్రేమ తండ్రి నుండి ప్రవహిస్తుంది, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు చేరుతుంది, మరియు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో నివసిస్తుంది.

ఈ రోజు మనం ఈ మహత్తర త్రిత్వైక సత్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, త్రిత్వంలోని పరిపూర్ణ ప్రేమ సంబంధాన్ని మనం అనుకరించడానికి ప్రయత్నించాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకరినొకరు సంపూర్ణంగా ప్రేమించుకున్నట్లే, మనం కూడా ఒకరినొకరు నిజాయితీగా ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సేవించుకోవాలి మరియు ఐక్యతతో జీవించాలి.

మన సంఘంలో, మన కుటుంబాల్లో, మన సమాజంలో, మనం త్రిత్వైక దేవుని ప్రేమను ప్రతిబింబించాలి. త్రిత్వం ప్రేమ యొక్క పరమ రహస్యం. త్రిత్వం ఐక్యత యొక్క పరమ రహస్యం. త్రిత్వైక దేవుని దివ్య జీవితంలో మనము పాలుపంచుకోవడానికి పిలువబడి యున్నాము. ఆయన మనకు నిత్యజీవాన్ని ప్రసాదిస్తారు.

త్రిత్వైక దేవునిలో ప్రేమ, ఐక్యత కలిగి మనము జీవించాలని ప్రార్థన చేద్దాం. త్రిత్వైక దేవుడు మన హృదయాలలో ఐక్యతను, శాంతిని మరియు ప్రేమను పెంపొందించుగాక. ఆమేన్.