Showing posts with label Sunday Homily in Telugu - Year B. Show all posts
Showing posts with label Sunday Homily in Telugu - Year B. Show all posts

క్రీస్తురాజు మహోత్సవము (Year B)

క్రీస్తురాజు మహోత్సవము (Year B)
దాని 7:13-14; దర్శన 1:5-8; యోహాను 18:33-37


నేడు క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడు చున్నాము. ఈ పండుగను 1925వ సం.లో 11వ భక్తినాధ జగద్గురువులు స్థాపించారు. ఈ పండుగను స్థాపించడానికి మూడు కారణాలు ఉన్నాయి: ఒకటి, భూలోక అధికారముపై క్రీస్తు మహిమాన్విత అధికారమును ప్రకటించుటకు. రెండు, క్రీస్తుకు క్రైస్తవులు చూపించే విశ్వసనీయత, విధేయత గురించి గుర్తుచేయుటకు. క్రీస్తు తన మనుష్యావతారము వలన, త్యాగపూరిత సిలువ మరణము వలన మనలను దేవునకు దత్తపుత్రులుగా చేసెను, అలాగే పరలోకరాజ్య వారసులను చేసెను. మూడు, క్రీస్తు ఒక్కడే నిజరాజు, సర్వలోకానికి క్రీస్తే రాజు అని అప్పటి నిరంకుశ భూలోక పాలకులకు [ముస్సోలిని, హిట్లర్, స్టాలిన్] తెలియ జేయుటకు. క్రీస్తు మన ఆధ్యాత్మిక రాజు, పాలకుడు. ఆయన సత్యము, ప్రేమతో మనలను పాలించును. 381వ సం.లో నూతనముగా రచించిన నైషియన్ విశ్వాస సంగ్రహములో “ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అని జత చేయడం జరిగింది. ఈవిధముగా క్రీస్తు రాజు అని మన విశ్వాసములో ప్రకటిస్తున్నాము.

క్రీస్తు రాజు. రాజులకు రాజు. సర్వ సృష్టికి రాజు. ఈ భూలోక సంబంధమైన రాజు కాదు. సత్యము, న్యాయము, ప్రేమ, శాంతి గల రాజు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఆయన రాజ్యము ఆయనను విశ్వాసముగా అనుసరించు వారి హృదయాలలో కొలువై యున్నది. నేటి సువిశేషము యోహాను 18:33-37లో, యేసు “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు” అని స్పష్టముగా తెలియ జేశాడు. ఆయన రాజ్యము అధికారము, బలము, యుద్ధాలు, పోరాటాలతో కూడినది కాదని స్పష్టముగా తెలియ జేశాడు.  ఆయన సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని అని స్పష్టం చేసాడు. కనుక, ఆయన మా హృదయాలకు, మన జీవితాలకు, మన విశ్వాస జీవితానికి రాజు. సత్యము, ప్రేమతో నడిపింపబడు ఆయన రాజ్యములో, విశ్వాసులము అయిన మనమందరము కూడా ఆ రాజ్య పౌరులమే!

మొదటి పఠనము దానియేలు 7:13-14లో దానియేలు ప్రవక్త “నరపుత్రుని” గూర్చిన దర్శనమును గాంచాడు. ఆ నరపుత్రుడు శాశ్వత జీవి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధి కారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతమే లేదు అని దానియేలు ప్రవక్త తన దర్శనములో ఈ సందేశాన్ని పొందాడు. ఈ ప్రవచనం క్రీస్తు రాజుకు వర్తిస్తుంది. ఎందుకన క్రీస్తు రాజ్యం శాశ్వత రాజ్యము, మరియు సకల జాతులకు సంబంధించిన రాజ్యము. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దములో బబులోనయా రాజు యేరూషలేమును ముట్టడించి, ఇశ్రాయేలు రాజును, అనేకమందిని బానిసత్వములోనికి కొనిపోయాడు. వారిలో దానియేలు కూడా ఉన్నాడు. ఈ సందర్భములో దానియేలు తన దర్శనాల ద్వారా ప్రజలను ఊరట పరచి వారిలో నమ్మకం, ధైర్యాన్ని నింపాడు. దేవుడు మెస్సయ్య రాజ్యాన్ని స్థాపించ బోతున్నాడని ప్రవచించాడు. క్రీస్తు పూర్వం  రెండవ శతాబ్దములో యూదులు గ్రీకుల చేత పొందిన వేదహింసలలో రాయబడిన ఈ గ్రంథము వారికి ఎంతగానో ఊరటను, నమ్మకాన్ని కలిగించినది.

రెండవ పఠనము దర్శన గ్రంథము 1:5-8లో, యేసుక్రీస్తు విశ్వాస పాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రధమ పుత్రుడు, భూపాలురకు ప్రభువు అని యోహాను తన దర్శనములో వివరించిన దానిని వింటున్నాము. క్రీస్తు రాజు తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజకరాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడు, శక్తిమంతుడు అని ఆలకిస్తున్నాము. యోహాను కూడా దర్శన గ్రంధమును క్రైస్తవ వేదం హింసల నేపధ్యములో, వారి విశ్వాసాన్ని బలపరచడానికి రచించాడు. ఉత్థాన క్రీస్తు మేఘ మండలము నుండి, ‘ఆల్ఫా, ఓమేగ’, ఆదియును అంతముగా వచ్చును. ప్రతి నేత్రము ఆయనను చూచును.

          క్రీస్తు లోకమునుజయించెను, క్రీస్తు ఇప్పుడు లోకమును పాలించును, క్రీస్తు మహిమతో పాలించును. సిలువ శక్తి ద్వారా, మూడవ రోజున ఉత్థానము ద్వారా యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు. సిలువ క్రీస్తు రాజు కిరీటం. కొండమీద ప్రసంగం క్రీస్తు రాజు శాసనం, ఆయన పరిపాలన చట్టం, నియమం. ఆయన రాజ్య పౌరులు, “దేవున్ని పూర్ణ శక్తితో ప్రేమించాలి, నేను మిమ్ములను ప్రేమించునటుల, మీరు తోటివారిని ప్రేమించాలి” అనే ఆజ్ఞను తప్పక పాటించాలి. క్రీస్తు రాజు మిషన్, ప్రేషితత్వం, మనలను సకల దాస్యములనుండి రక్షించడం. తద్వారా మనం ఈ లోకములో శాంతి సమాధానములతో జీవించగలము. అలాగే, మనకు నిత్యజీవ రాజ్యమును ఒసగునని వాగ్దానం చేసాడు.

          సువిశేష పఠనము యోహాను 18:33-37లో యేసుక్రీస్తు పిలాతు యెద్ద తాను రాజు అని నొక్కి చెప్పాడు. అలాగే, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని స్పష్టం చేసాడు. పిలాతుకు ఎంతమాత్రమును అర్ధము కాలేదు. ఇతరులపై అధికారమును చెలాయించక, వారికి సేవ చేస్తూ తాను రాజుగా పరిపాలించును. క్రీస్తు అధికారము, భౌతిక శక్తిలోగాక, సత్యములో నెలకొని యున్నది. మరియు దైవరాజ్యము అష్టభాగ్యాలపై ఆధారపడి యున్నది.

          యేసుక్రీస్తు రాజు అని పాతనిబంధన గ్రంథములోని మెస్సయ్య ప్రవచనాలలో, ముఖ్యముగా సమూవేలు, యెషయ, యిర్మియా, దానియేలు గ్రంధాలలో స్పష్టం చేయబడినది. నూతన నిబంధనములో, మొదటిగా, “యేసుజనన సూచన-దూత ప్రకటన”లో లూకా 1:32-33లో “ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువ బడును. ప్రభువగు దేవుడు తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అని చూస్తున్నాము. వాస్తవానికి, ప్రభువు బోధనలలో దైవరాజ్యము ప్రాధాన్యం. రెండవదిగా, మత్తయి 2:2లో తూర్పు దిక్కునుండి యెరూషలేమునకు వచ్చిన జ్ఞానులు “యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును చూచి మేము ఆరాధింప వచ్చితిమి” అని పలికారు. మూడవదిగా, లూకా 19:38లో యేసు పుర ప్రవేశ సమయములో, “ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింప బడునుగాక!” అని యూదులు దేవుని స్తుతించారు. నాలుగవదిగా, నేటి సువిశేషం యోహాను 18:33లో “నీవు యూదుల రాజువా?” అని పిలాతు యేసును ప్రశ్నించాడు. దానికి సమాధానముగా యేసు, 37వ వచనములో, “నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీనికొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధులందరు నా మాటనాలకింతురు” అని సామాధాన మిచ్చారు. ఐదవదిగా, యోహాను 19:19లో, పిలాతు “నజరేయుడగు యేసు, యూదుల రాజు” అను బిరుదమును వ్రాయించి యేసు సిలువపై  పెట్టించెను. ఆరవదిగా, మత్తయి 20:27-28లో  యేసు తన శిష్యులకు, “మీలో ఎవడైన ప్రధముడు కాదలచిన, అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు” అని భోదించాడు. చివరిగా, మత్తయి 25:31లో, తుది తీర్పున “మనుష్యకుమారుడు సమస్త దూత సమేతముగా తన మహిమతో వచ్చునపుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును” అని చదువుచున్నాము.

          ప్రియ సహోదరీసహోదరులారా! ఇంతకు ‘దైవరాజ్యం’ అనగా ఏమిటి? ఏ కుటుంబములోనైతే, ప్రేమ ఉంటుందో, అక్కడ దైవరాజ్యం ఉంటుంది. ఏ దేశమైతే, బలహీనులపట్ల శ్రద్ధవహిస్తుందో అక్కడ దైవరాజ్యం ఉంటుంది. ఏ విచారణ అయితే అవసరతలోనున్న వారికి చేరువవుతుందో, అక్కడ దైవరాజ్యం ఉంటుంది. ఎప్పుడైతే, ఆకలిగొన్న వారికి ఆహారం ఇవ్వబడుతుందో, ఆశ్రయం లేనివారికి ఆశ్రయం కల్పించ బడుతుందో,నిర్లక్ష్యం చేయబడినవారిపట్ల శ్రద్ధ చూపబడుతుందో, అక్కడ దైవరాజ్యం నెలకొంటుంది. అన్యాయపు చట్టాలు రద్దుచేయబడతాయో, అన్యాయం, న్యాయముగా మార్చబడుతుందో, యుద్ధం నివారించబడుతుందో, అచ్చట దైవరాజ్యం నెలకొంటుంది. పేదరిక నివారణ, అజ్ఞానమును రూపుమాపుటలో, విశ్వాసాన్ని అందించుటలో చేతులు కలుపుతారో అచ్చట దైవరాజ్యం నెలకొంటుంది.

          యేసును ఆలకించని యెడల, ప్రేమ-సేవ లేని యెడల, ఆయన నడిపించు మార్గములో అనుసరించని యెడల, యేసుక్రీస్తు మనకు రాకు కానేరడు. క్రీస్తుతో నడచినప్పుడే, సువార్తానుసారముగా జీవించినప్పుడే, క్రీస్తు రాజ్యమునకు చెందిన కారము అవుతాము.

          క్రీస్తు మన జీవితాలకు రారాజు. మనలను పరిపాలించు వెసలుబాటు మనం ఆయనకు ఇవ్వాలి, అనగా మనం ఆయనకు లోబడి, ఆయన ఆజ్ఞలు, బోధనల ప్రకారం జీవించాలి.

          రారాజు క్రీస్తు వినయముగల సేవ, సత్యముగల జీవితాన్ని ఆదర్శముగా అనుసరించాలి. ఆయన సేవించుటకే ఈ లోకమునకు వచ్చియున్నాడు. సత్యమునకు సాక్ష్యమీయ వచ్చానని ప్రభువు చెప్పియున్నారు. ఆ సత్యమునకు మనము కూడా సాక్ష్యమీయవలయును.

          క్రీస్తు ఒసగిన ప్రధాన ఆజ్ఞను మనం పాటించాలి: దైవప్రేమ మరియు సోదరప్రేమ.

 

30వ సామాన్య ఆదివారము, Year B

30వ సామాన్య ఆదివారము, Year B
యిర్మీయా 31:7-9; హెబ్రీ 5:1-6; మార్కు 10: 46-52
ప్రేమగల దేవునియందు మన విశ్వాసం


మొదటి పఠనము, నిరీక్షణ, పునరుద్ధరణ, దేవుని దయయొక్క సందేశాన్ని తెలియజేయుచున్నది. యిర్మియా గ్రంథములోని “ఓదార్పు ప్రవచన” భాగములోనిది. యిస్రాయేలు ప్రజలు ప్రవాసములో ఉండగా పలుకబడిన ప్రవచనాలు. చెల్లాచెదరైన తన ప్రజలను పిలచి, వారి గాయాలను నయము చేసి వారిని రక్షణలోనికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. పునర్నిర్మాణము, పునరుద్ధరణ వాగ్ధాన ప్రవచనాలు. ప్రవాసములోనున్న ప్రజలకు గొప్ప ఊరటను కలిగించే వాక్యాలు. వారి బాధలలో, కష్టాలలో దేవుడు వారిని మరువలేదని వారికి జ్ఞాపకం చేసే పలుకులు. నేటికీ ఈ ప్రవచనం మనకు వర్తిస్తుంది. పాపపు బానిసత్వములోనున్న మనకుకూడా ఊరటను కలిగించే పలుకులు. యిస్రాయేలు ప్రజలు దేవునిపట్ల వారి అవిశ్వాసము వలన ప్రవాసానికి కొనిపోబడ్డారు [586లో దక్షిణరాజ్యం (యూదా), 722లో ఉత్తరరాజ్యం (ఇశ్రాయేలు) ప్రవాసానికి లోనయ్యాయి]. అయినప్పటికినీ, “సంతసముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను రక్షించెను” (31:7) అని నిరీక్షణతో కూడిన పలుకులను దేవుడు పలుకుచున్నాడు. ప్రజలు అవిశ్వాసముగా నున్నను, దేవుడు విశ్వాసపాత్రుడై యున్నాడు. ఈ వాక్యం నేడు మనకుకూడా బలమైన సందేశాన్నిస్తుంది. పాపములోనున్న మనకు, ఆధ్యాత్మిక ప్రవాసములోనున్న మనకు, దేవునినుండి దూరముగానున్న మనకు, దేవుని దయ మన చేరువలోనే నున్నదని తెలియజేయుచున్నది. యిస్రాయేలు ప్రజలవలె మనలనుకూడా దేవుడు తన దరి చేర్చుకోవాలని ఆశిస్తున్నాడను నమ్మకాన్ని కలిగిస్తుంది. పాపక్షమాపణ ఒసగే దివ్యసంస్కారాల ద్వారా దేవుని దయను ఇప్పటికే మనం పొందుచున్నామని గుర్తుచేసుకుందాం.

“గ్రుడ్డివారు, కుంటివారు, గర్భవతులు, ప్రసవించుటకు సిద్ధముగా నున్నవారు ఎల్లరు కలిసి మహా సమూహముగా తిరిగి వత్తురు” (31:8). దేవుడు కేవలం బలవంతులను, నీతిమంతులను మాత్రమే కాకుండా, బలహీనులను కూడా తిరిగి పిలుస్తాడని, నడిపిస్తాడని ప్రవచనం తెలియజేయు చున్నది: బలహీనులపట్ల, పేదవారిపట్ల, అట్టడుగున నున్నవారిపట్ల, బాధలలో నున్నవారిపట్ల దేవునికి ప్రత్యేక శ్రద్ధ కలిగి యున్నాడని చెప్పడానికి ఇదొక గొప్ప సాక్ష్యం. తమంతటతాము గమ్యానికి చేరుకోలేరు. దేవుడు వారిని నడిపిస్తాడని వాగ్దానం చేయుచున్నాడు. క్రీస్తు దేహమైన శ్రీసభయొక్క దృక్పధముకూడా ఈవిధముగా ఉండాలని ఈ ప్రవచనం పిలుపునిస్తుంది.

దేవుడు యిస్రాయేలు ప్రజలను నడిపించుకొని రాగా వారు ఏడ్పులతో, ప్రార్ధనలతో తిరిగి వత్తురు. (31:9). ఏడ్పులు - దేవుని దయకు ప్రతిస్పందనగా, గతములో చేసిన పాపాలకు దుఃఖపడుదురని సూచన. ‘తప్పిపోయినవారు’ తిరిగి దొరికినప్పుడు పొందే ఆనంద భాష్పాలుగా అర్ధంచేసుకోవచ్చు. ఇది నేటి మన పశ్చాత్తాపానికి, దేవునితో సఖ్యతను సూచిస్తుంది. వినయముతో దేవున్ని సమీపించినపుడు, ఆయన దయకొరకు వేడుకొనినప్పుడు, యిస్రాయేలు ప్రజలవలెనె ఆయన మనలను తన వైపునకు నడిపిస్తాడు. ఈ పరివర్తన కొన్నిసార్లు బాధాకరమైనను, దేవునితో సహవాస బంధములోనికి నడిపించునను సంతోషమును కలిగిస్తుంది. పాపసంకీర్తనలో పాపాల కోసం కార్చిన కన్నీరు, దేవుని దయను పొందినప్పుడు ఆనంద బాష్పాలుగా మారతాయి.

దేవుడు యిస్రాయేలు ప్రజలను తిన్నని మార్గమున నడిపించును. వారు కాలుజారి పడిపోరు. జల ప్రవాహముల వద్దకు కొనివచ్చును (31:9). సరళమైన మార్గములో, తడబడని మార్గములో, అనగా దేవుని మార్గదర్శకములో వారిని నడిపించును. జలము తాజాదనమును, జీవితాన్ని, పరిశుభ్రతను సూచిస్తుంది. జలప్రవాహం నేడు మనకు మన జ్ఞానస్నాన జలాలను జ్ఞప్తికి చేయుచున్నది. మనం పాపమునుండి శుద్ధిచేయబడి యున్నాము. తిరిగి దేవుని కుటుంబములోనికి నడిపింపబడి యున్నాము. సువార్తలో ప్రభువు చెప్పిన “జీవజలము”ను (యోహాను 4:10) ఇది గుర్తుకు చేయుచున్నది. విశ్వసించు వారికి నిత్యజీవం ఒసగును. “తిన్నని మార్గము” నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది.

దేవుడు యిస్రాయేలుకు తండ్రి. ఎఫ్రాయీము తొలిచూలు బిడ్డయగును (31:9). ఇది దేవుని ఒడంబడికను గుర్తుచేస్తుంది. తన ప్రజలతో చేసుకున్న ఒడంబడిక కొనసాగును. తన ప్రజలతో దేవునికున్న అవినాభావ సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని తెలియజేయుచున్నది. దేవుడు దూరముగా ఉండువాడు కాదు. తన బిడ్డలకోసం లోతైన శ్రద్ధ కలిగే ప్రేమగల తండ్రి. దేవుడు మన తండ్రియని గుర్తుకు చేయుచున్నది. క్రీస్తుద్వారా మనం దేవుని బిడ్డలమైనాము. ఇది మన గుర్తింపునకు పునాది. ప్రేమగల తండ్రిగా, దేవుడు మనలను నడిపించును, మనకు ఒసగును, తన సహవాసములోనికి కొనివచ్చును. “ఎఫ్రాయీము తొలిచూలు బిడ్డ” యిస్రాయేలుపై దేవునికున్న ప్రత్యేక సంబంధాన్ని సూచిస్తుంది. అయితే విశ్వసించు వారందరూ ఈ దైవీక కుటుంబములోనికి చేర్చబడతారనే గొప్ప అవగాహనను మనకు కలుగ జేయుచున్నది.

యిర్మియా 31:7-9 ప్రవాసమునుండి దేవుని విడుదలకు వాగ్దానం. ఇది క్రీస్తు రక్షణ కార్యాన్ని ముదస్తుగానే సూచిస్తుంది. క్రీస్తు సమస్త మానవాళిని [నేటి సువిశేషములో గ్రుడ్డివానిని] నిత్యజీవములోనికి నడిపించును. ఈ పఠనమును ధ్యానిస్తూ ఉండగా, యిస్రాయేలు ప్రజలవలె మన పాపాల కొరకు దుఃఖపడుదాం. దేవుని దయపై నమ్మకముంచుదాం. ఆయన ఏర్పాటు చేసిన ‘తిన్నని’ మార్గమున అనుసరించుదాం.

నేటి సువిశేషములో యేసుప్రభువు యెరికో పట్టణమునుండి, తన శిష్యులతోను, జనసమూహములతోను యెరూషలేము వైపునకు వెళ్ళుచుండగా, భిక్షకుడైన బర్తిమయి అనే గ్రుడ్డివానికి దృష్టిదానము చేయుట గురించి వింటున్నాము. ‘బర్తిమయి’ అనగా ‘తిమయి కుమారుడు’ అని అర్ధం. ఈ సంఘటన బర్తిమయి విశ్వాసము, పట్టుదలను, యేసుప్రభువు యొక్క కరుణ, దైవీకశక్తిని వెల్లడి చేయుచున్నది. బర్తిమయి గ్రుడ్డివాడైనప్పటికిని, యేసు ఎవరో తన లోతైన అత:దృష్టిని ప్రదర్శించాడు. యేసు అటుగా వెళ్ళుచున్నాడని విని, “దావీదు కుమారా! యేసు ప్రభూ! నన్ను కరుణింపుము” (10:47, 48) అని కేకలు వేసాడు. అయితే, ఈ కేక భిక్షము కోసం కాదు. ఇది నజరేతు నివాసియగు యేసునందు తన విశ్వాస ప్రకటన. యేసును ‘మెస్సయ్య’గా గుర్తించాడు, అంగీకరించాడు, విశ్వసించాడు. “దావీదు కుమారా!” అనునది దీర్ఘకాలముగా ఎదురుచూస్తున్న దావీదురాజు వారసుడిగా, ‘మెస్సయ్య’యొక్క ప్రేషిత కార్యమును గుర్తేంచే బిరుదుగా చూస్తున్నాము. అతని కేకలు విన్నవారు, అతనిని ఆపాలని చూసినవారు కూడా అతని ముఖములో, స్వరములో పట్టుదలను చూసారు. అందుకే వారు “ఓరి, లెమ్ము, ధైర్యముగా నుండుము. ఆయన రమ్మనుచున్నాడు” (10:49) అని బర్తిమయిని పిలిచారు. ఇది నిజముగా యేసు తనను స్వస్థపరచగలడని తన అచంచలమైన నమ్మకానికి, విశ్వాసానికి గొప్ప నిదర్శనం. ఈ అత:దృష్టిని కలిగి యుండటములో అనేకసార్లు శిష్యులు విఫలమయ్యారు.

యేసు పిలవగానే, బర్తిమయి తన వస్త్రమును పారవేసి, వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. “వస్త్రమును పారవేయడం” [బహుశా తనకున్న ఏకైన సంపద] తన పాత జీవితాన్ని వదిలివేయడాన్ని, భిక్షమెత్తుకునే తన స్థితిని వదిలివేయడాన్ని సూచిస్తుంది. వాటన్నింటిని వదిలిపెట్టి యేసును అనుసరించడానికి బర్తిమయి సిద్ధముగా నున్నాడని సూచిస్తుంది. యేసుప్రభువుతో కలయిక తన జీవితాన్ని సంపూర్ణముగా మార్చివేస్తుందని బర్తిమయి విశ్వసించాడు. శిష్యరికం అనేది ప్రతీఒక్కరికి అని కూడా మనకు అర్ధమగుచున్నది.

“నేను ఏమి చేయగోరుచున్నావు?” అని యేసు బర్తిమయిని అడుగగా, “బోధకుడా! నాకు చూపు దయచేయుము” అని వేడుకొన్నాడు” (10:51). “నీవు వెళ్ళుము. నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది” (10:52) అని యేసు అనిన వెంటనే బర్తిమయి దృష్టిని పొంది యేసును “త్రోవవెంట” అనుసరించాడు. స్వస్థతకు వాడిన గ్రీకు పదానికి అర్ధం “రక్షింపబడెను” అని అర్ధం. కనుక, బర్తిమయి శారీరక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక స్వస్థతను కూడా పొందియున్నాడు. “త్రోవవెంట” అనుసరించడం అనగా భౌతిక మార్గం మాత్రమేగాక, శిష్యరిక మార్గాన్ని, సిలువ మార్గాన్ని సూచిస్తుంది.

బర్తిమయి పట్టుదల: విశ్వాసమునందు బర్తిమయి పట్టుదల మనందరికి ఆదర్శం. “ఊరకుండుము” అని గద్దించినను మరింత బిగ్గరగా కేకలు పెట్టాడు. యేసును వెతకడములో ఈ పట్టుదల మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆదర్శం. అనుమానం, అడ్డంకులు, భయం, ఒత్తిడుల సమయాలలో మనం ధైర్యముగా ప్రభువును పిలుస్తూనే [ప్రార్ధన] ఉండాలి.

ఆధ్యాత్మిక అంధత్వం: బర్తిమయి శారీరకముగా అంధుడైనను, చూపు ఉన్న చాలామంది కంటే స్పష్టముగా ప్రభువును చూడగలిగాడు. యేసును ‘మెస్సయ్య’గా గుర్తించాడు. బైబులులో గ్రుడ్డితనం ఆధ్యాత్మిక అంత:దృష్టి లేకపోవడానికి సూచన (యెషయ 42:18-19) కనుక, మన ఆధ్యాత్మిక అంధత్వాన్ని పరికించుకుందాం. మన అనుదిన జీవితాలలో, ఆధ్యాత్మిక కన్నులతో యేసును ఇతరులలో చూడగలుగు చున్నామా?

విశ్వాసము వలన పరివర్తన: బర్తిమయి కేవలం శారీరక స్వస్థతయేగాక, అతని విశ్వాసం అతని జీవితాన్ని పరిపూర్ణముగా మార్చివేసింది. యేసు శిష్యునిగా క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. విశ్వాసముతో క్రీస్తును అనుసరించాలని అనుకున్నప్పుడు, పాత జీవితాన్ని విడిచి పెట్టాలని ప్రభువు మనలను కోరుచున్నాడు. దేవుని కృపను పొందుటకు, విశ్వాసం కీలకం. విశ్వాసము వలన స్వస్థత, రక్షణ లభిస్తుంది.

నేటి సువార్త మన విశ్వాసాన్ని సవాలు చేయుచున్నది. విశ్వాసముతో యేసును అనుసరిస్తున్నామా? యేసు మనలను పిలుస్తాడు అన్న నమ్మకముతో ఉన్నామా? ప్రభువునుండి మనం నిజముగా ఏమి కోరుకుంటున్నాము. యేసు మన కోరికలను తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. కాని మనం విశ్వాసముతో, ఆయన దయపై నమ్మకముతో అడగడానికి సిద్ధముగా ఉన్నామా? ఒకసారి యేసు స్వస్థత స్పర్శను పొందుకున్న తర్వాత, మనం ఆయనను అనుసరించాలని పిలువ బడతాము. విశ్వాసం అనగా కేవలం స్వీకరించడం మాత్రమే కాదు, ఆయనతో సహవాస బంధములోనికి ప్రవేశించడం, మరియు ప్రతిరోజు ఆయనతో నడవడము.

20వ సామాన్య ఆదివారము, Year B

20వ సామాన్య ఆదివారము, Year B
సామె. 9:1-6; ఎఫెసీ. 5:15-20; యోహాను 6:51-58

మొదటి పఠనములో విజ్ఞానమునకు సంబంధించిన లోతైన భావాన్ని గూర్చి వింటున్నాము. “విజ్ఞానమను స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి, ఏడు స్తంభములు నెలకొల్పెను” (9:1). ఈ సామెత దైవీక జ్ఞానము యొక్క లోతును మరియు స్థిరత్వమును తెలియ జేయుచున్నది. దైవీక జీవితము, అర్ధవంతమైన మరియు నీతిగల జీవితానికి పునాది అని వివరిస్తున్నది. “ఏడు” అనే సంఖ్య ‘పూర్తిని’ మరియు ‘పరిపూర్ణతను’ సూచిస్తుంది. దీనిని బట్టి జ్ఞానం నశ్వరమైన ఆలోచన కాదని, మన జీవితములోని ప్రతీ అంశానికి మద్దతునిచ్చే సుస్థిరమైన, సమగ్రమైన వాస్తవికత అని ఈ సామెత తెలియజేయు చున్నది. “భవనము” అనేది ఆశ్రయం మరియు పోషణకు తావు లేదా స్థలము. నిజమైన జ్ఞానమును కోరుకునే వారందరిని లోపలకు వచ్చి నివసించుమని ఆహ్వానిస్తున్నది.
“ఆమె వేట మాంసము వండి, సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసము సిద్ధము చేసి, భోజన పదార్దములు తయారు చేసెను” (9:2). ఈ విందు జ్ఞానము యొక్క గొప్పతనాన్ని, సమృద్ధిని తెలియజేస్తుంది. జ్ఞానం కేవలం ప్రాథమిక అవసరాలను మాత్రమే గాక, గొప్ప “విందు”ను అందజేయును. ఈ విందు ఆత్మీయ పోషణను, సమృద్ధిని సూచిస్తుంది. విజ్ఞానాన్ని ఆలింగనం జేసుకోవడం అనగా, కేవలం జ్ఞానాన్ని పొందుకోవడం మాత్రమే కాదని, జీవితాన్ని సంపూర్ణముగా ఆస్వాదించడం మరియు జీవితములో నిమగ్నమై జీవించడం అని తెలియజేస్తూ, ఈ విందులో పాల్గొనమని ఆహ్వానిస్తున్నది. “రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపుము” (9:5) అన్న ఈ పిలుపు, విజ్ఞానము ఒసగు జీవిత సూత్రాలను, బోధనలను అందుకోవడానికి ఆహ్వానం. ఇది లోతైన మరియు సంతృప్తికరమైన జీవన విధానాన్ని అనుభవించడానికి ఆహ్వానం. ఇచ్చట నిర్ణయాలు, చర్యలు జ్ఞానముచేత (అంత:దృష్టి, అవగాహన) మార్గనిర్దేశం చేయబడతాయి.
ఈ ఆహ్వానము యొక్క ఉద్దేశ్యం స్పష్టం చేయబడినది: “మూర్ఖత్వమును విడనాడెదవేని నీవు జీవింతువు. నీవు విజ్ఞాన పధమున నడువుము” (9:6). జ్ఞానము, మూర్ఖత్వమునకు వ్యతిరేకం. అజ్ఞానమును విడచిపెట్టి, జ్ఞానములో మునిగిపోయిన జీవితాన్ని జీవించమని మనలను ప్రోత్సహిస్తున్నది. ఆలోచనారహిత జీవితమునుండి వివివేచనతో కూడిన జీవితానికి మార్పును సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక మరియు నైతిక జీవితానికి మార్గాన్ని సుగమము చేస్తూ జీవించడానికి ఆహ్వానం.
ఈ మొదటి పఠనమును ధ్యానిస్తూ ఉండగా, జ్ఞానం మనకొసగే సమృద్ధిని, గొప్పదనాన్ని గుర్తించుదాం. మూర్ఖత్వాన్ని విడచిపెట్టి, విజ్ఞానముతో కూడిన సుసంపన్నమైన జీవితాన్ని జీవించ ప్రయత్నం చేద్దాం. ఈవిధముగా, జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాకుండా, దయ, శాంతి, అనుగ్రహములో ఎదుగుతాము. జ్ఞానమును శ్రద్ధతో వెదకుటకు, అది ఒసగు సమృద్ధిగల విందులో పాల్గొనుటకు, విజ్ఞానము ఒసగు లోతైన బోధనలకు అనుగుణముగా జీవించుటకు గల క్రుపను, శక్తిని దయచేయుమని ప్రార్దన చేద్దాం!
రెండవ పఠనములో మన క్రైస్తవ పిలుపును ప్రతిబింబించే జీవితాన్ని జీవించడానికి శాశ్వతమైన మార్గనిర్దేశకాన్ని పౌలు చేయుచున్నాడు: “మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనులవలె జీవింపకుడు. వివేకవంతులవలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసికొనుడు.” (5:15). పౌలుగారి ఈ సలహా నేటికీ మనకు ఎంతగానో వర్తిస్తుంది. మన విశ్వాసానికి అనుగుణముగా తగిన నిర్ణయాలతో జ్ఞానయుక్తముగా జీవించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇచ్చట జ్ఞానం అనగా క్రీస్తు బోధనలను మన అనుదిన జీవితములో అర్ధముచేసుకొని, అన్వయించుకొని జీవించడం. “చెడు దినములు” మనం ఎదుర్కుంటున్న నైతిక, ఆధ్యాత్మిక సవాళ్ళను సూచిస్తుంది. ఈ లోక ప్రలోభాలు, శోధనలు మన గమ్యమునుండి మనలను పెడత్రోవ పట్టిస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి క్రీస్తు వెలుగును ప్రతిబింబించే క్రైస్తవ జీవితాలను జీవించాలని పౌలు ఆశిస్తున్నాడు. జ్ఞానమునకు వ్యతిరేకం మూర్ఖత్వము. మద్యపానం దుర్మార్గానికి దారితీస్తుంది. అది మిడిమిడి ఆనందాలకు దారితీస్తుంది. దానికి బదులుగా ఆత్మపూరితులై జీవించాలి. ఆత్మ నిజమైన ఆనందాన్ని, పరివర్తనను కలుగజేస్తుంది. ఆరాధన, కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని జీవించాలి. మన మాటలు, చేతలు దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రతిబింబించాలి. అలా జీవించినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితాలను, మన చుట్టూ ఉన్న వారి జీవితాలను సైతం సుసంపన్నం చేస్తూ, విశ్వాసము, ఆనందముతో కూడిన సంఘాన్ని నిర్మించగలము.
ఈ పఠనముపై ధ్యానం చేయుచుండగా, విశ్వాసములో ఎదగడానికి, తోటివారికి సేవ చేయడానికి అవకాశాలను స్వీకరించి, జ్ఞానములో జీవిస్తూ, అవకాశాలను సద్వినియోగము చేసుకోవడానికి కృషి చేద్దాం! లోకపు శోధనలను తప్పించుకొని ఆత్మలో జీవించుదాం! దేవునకు అంకితం కావింప బడిన జీవితము నుండి వచ్చే ఆనందాన్ని వెదకుదాం! తద్వార, దేవుని ప్రేమకు, దయకు ఈ లోకములో నిజమైన సాక్ష్యులుగా జీవించగలము. జ్ఞానములోను, ఆత్మలోను, సేవలోను, కృతజ్ఞతతోను జీవించడానికి కావలసిన శక్తికోసం ప్రార్ధన చేద్దాం!
సువిశేష పఠనములో “నేనే జీవాహారము” అని యేసు ప్రకటించి యున్నారు: “పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే” (6:51). ఇది దివ్యసత్ప్రసాదాన్ని సూచిస్తుంది. అలాగే, ఈ దివ్యసంస్కారాన్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి, ప్రశంసించడానికి సవాలు చేస్తుంది. “ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే” అను వాక్యం యేసు క్రీస్తు యొక్క లోతైన ప్రేమను, శ్రీసభలో “దివ్యసత్ర్పసాదము” యొక్క ప్రాముఖ్యతను వెల్లడి చేయుచున్నది. తన శరీరరక్తములనే ఒసగుట ద్వారా, ఒక నూతన ఒడంబడికను ఏర్పాటు చేయుచున్నాడు. ఇది దేవునితో సహవాసము మరియు నిత్యజీవితాన్ని వాగ్దానం చేయుచున్నది. కడరాత్రి భోజన నేపధ్యములో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించు కున్నది. తను అర్పించే బలికి జ్ఞాపకార్ధముగా దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించాడు. తన శరీర రక్తములో మనం పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నారు.
“మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఈయగలడు?” అని యూదులు వాదించుకున్నారు. ఇది దివ్యసత్ర్పసాదము యొక్క పరమరహస్యాన్ని నొక్కి చెబుతుంది. ఇది మన తెలివి తేటలకు అందనిది. విశ్వాసముతో మరియు దేవిని విజ్ఞానముతో మాత్రమే గ్రహించగలము.
“నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును” (6:56). దివ్యపూజలోని లోతైన సహవాసాన్ని తెలియ జేయుచున్నది. ఇది ఒక సూచక క్రియ లేదా ప్రతీకాత్మక చర్య కాదు. నిజముగానే మనం క్రీస్తుతో సహవాసము కలిగి జీవిస్తాము. నిజముగానే మనం క్రీస్తును కలుసుకుంటాము. దివ్యసత్ర్పసాదమును స్వీకరించుట ద్వారా మనం దైవీక జీవితములో భాగస్తుల మగుచున్నాము.
అంతేకాకుండా “ఈ ఆహారమును భుజించు వాడు ఎల్లప్పుడును జీవించును” (6:58). దివ్యసత్ర్పసాదము అనేది స్వర్గపు విందును సూచిస్తుంది. దేవునితో మన అంతిమ సహవాసానికి సంకేతం. ఇది మన జీవిత ప్రయాణములో ఆధ్యాత్మిక పోషణ. మనకు బలాన్ని చేకూర్చుతుంది.
ఈ సువిశేష పఠనమును ధ్యానిస్తూ ఉండగా, భక్తితోను, కృతజ్ఞతతోను దివ్యసత్ర్పసాదమును ఆశ్రయించుదాం! ఇది దేవుని గొప్ప బహుమానము, కృపానుగ్రహము. ఇది క్రీస్తుతోను మరియు తోటివారితోను ఐఖ్యముగా జీవించమని ఆహ్వానం. విశ్వాస పరమ రహస్యాన్ని ఆలింగనం చేసుకొనుటకు, తద్వారా క్రీస్తుతో సహవాసాన్ని కలిగియుండుటకు మరియు దాని ఫలితాలను మన అనుదిన జీవితములో జీవించుటకు ఇది సవాలు!
దివ్యసత్ర్పసాద అనుగ్రహాన్ని ప్రశంసించుటకు, గౌరవించుటకు, పవిత్ర హృదయములతో స్వీకరించుటకు, తద్వారా మనం క్రీస్తుకు ప్రియ శిష్యులుగా మారే అవకాశాన్ని దయచేయమని ప్రార్ధన చేద్దాం!

5 వ సామాన్య ఆదివారము, Year B

 5 వ సామాన్య ఆదివారము, Year B
యోబు 7:1-4; 6-7, భక్తి కీర్తన 147; 1-6, 1 కొరి 9:16-19, 22-23; మార్కు 1: 29-39
"రండు, మనలను సృజించిన సర్వేశ్వరుని ముందు సాగిలపడి ఆయనను ఆరాధింతము. ఎందుకన, ఆయనే సర్వాధికారి, ఆయనే మన కర్త."
"అందరు మిమ్ము వెదకుచున్నారు" (మార్కు 1:37 ) - ప్రార్ధన ప్రాముఖ్యత

ఉపోద్ఘాతము: శ్రమల అంతర్యము

బాధలు మన జీవితములో అనివార్యము. ఈలోక బాధలలో చివరిది మరియు తీవ్రమైనది మరణం. నాశనం చేయబడ వలాసిన చివరి శత్రువు మృత్యువు (1 కొరి 15:26). మన బాధలలో మనం అశక్తులం. అందుకే, మన బాధలకు అర్ధాన్ని వెదకుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. క్రైస్తవులకు, క్రీస్తును విశ్వసించి అనుసరించు వారైన మన బాధలకు, క్రీస్తు శ్రమలు అర్ధాన్ని చేకూర్చుతున్నాయి. బాధలను, మరణాన్ని జయించుటకు క్రీస్తు ఒక రక్షకునిగా ఏతెంచాడు. క్రీస్తు శారీరక బాధలను మాత్రమే గాక, సంపూర్ణ వ్యక్తిని స్వస్థత పరచును. అంతర్గత స్వస్థత, పాపమన్నింపు ఆయన ప్రేషిత కార్యాలు. మన బాధల ఉపశమనము కొరకు, దేవుడు మన జీవితాలలో జోక్యము చేసికొనును. అయినప్పటికిని, బాధలను ఆయన అనుమతించును. "దేవుని మహిమ వీనియందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను" (చూడుము యో 9:1-3). బాధలలోనున్న వ్యక్తి, దేవున్ని వెదకుటకు ప్రయత్నిస్తాడు.

మొదటి పఠనం - శ్రమలను ఎలా అర్ధం చేసుకోవాలి?

ఈనాటి మొదటి పఠనం యోబు జీవిత గాధనుండి వింటున్నాం. యోబు ఆయన జీవితములో ఎన్నోకష్టాలను, బాధలను అనుభవించాడు. ఆయన పొందే బాధలను మాటలలో వ్యక్తపరస్తున్నాడు. తన స్నేహితులు ఆయన విడచిపోయారు. యోబు పాపం చేసాడని ఒకరు, పశ్చాత్తాప పడాలని ఒకరు, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని మరొకరన్నారు. చివరికి, ఆయన భార్యకూడా శంకించింది. 'దేవున్ని శపించి మరణింపుము' అని కోరింది. కాని, యోబు, "దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితిమి. కీడులను పంపినపుడు మాత్రము స్వీకరింప వలదా?" అని ప్రశ్నించాడు. ఆవిధముగా, బాధలలోనే యోబు ఇంకా ఎక్కువగా దేవున్ని వెదికాడు, ప్రార్ధించాడు. ఆయనకు మరింత దగ్గరయ్యాడు. యోబు విశ్వాస ప్రార్ధనకు దేవుడు జవాబు ఇచ్చాడు.

మనముకూడా, మన కష్టాలకు, బాధలకు కృంగి కృశించక, ఆధ్యాత్మిక హృదయముతో, వాటిద్వారా దేవుడు మనకి అందిస్తున్న సందేశాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి. బాధలలో, ప్రభువు మనలను పరిశుద్ధులను చేయుచున్నాడా? మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా / బలపరుస్తున్నాడా? మన నిలకడను పరీక్షిస్తున్నాడా? మన దైవ/సోదరప్రేమను పరీక్షిస్తున్నాడా? మనం తప్పక గ్రహించాల్సిన విషయం, 'ప్రార్ధనతో, పవిత్రాత్మ శక్తితో జవాబు వెదకిన వారికి సరియైన సమాధానం దొరకును'.

సువిశేష పఠనము: శ్రమలలో ప్రభువును వెదకాలి

ఈనాటి సువిశేష పఠనములోకూడా, కష్టాలలో, బాధలలోనున్న ప్రజలందరు ప్రభువు కొరకు వెదకుచున్నారు. ప్రార్ధనా మందిరములో అధికారపూర్వకముగా బోధించి, అపవిత్రాత్మ ఆవేశించిన వానిని స్వస్థత పరచి, ఇంకా మరెంతోమందిని స్వస్థత పరచాడు. వేకువ జామున, ఒక నిర్జన ప్రదేశమున ప్రార్ధన చేయుచుండగా, సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, "అందరు మిమ్ము వెదకుచున్నారు" అని చెప్పారు.

ప్రార్ధన జీవితముతో ప్రభువును వెదకాలి: ఈ రోజుకి కూడా, అందరు ఆయన కొరకు వెదకుచున్నారు. మన కష్టాలు, బాధలు ఎంతవైనను, ఆత్మశక్తితో వాటన్నింటిని జయించవచ్చు. దేవుని కృపవలన, యేసు నామమున ఎలాంటి బాధలనైనను ఎదుర్కొనవచ్చు. దేవునినుండి మనం ఎన్నో అనుగ్రహాలను పొందియున్నాము. ఏదీ ఆశించకుండా, ఇతరులతో ఆ వరాలను పంచుకొందాం. మన జీవితానికి ఓ అర్ధాన్ని చేకూర్చుకోవాలని ప్రభువు ఆశిస్తున్నారు. ప్రార్ధనతో కూడిన జీవితం, దేవునికి దగ్గరగా చేరు జీవితం, ఇతరులతో పంచుకొను జీవితం, స్వస్థత, పశ్చాత్తాపముతో కూడిన జీవితాన్ని జీవించాలని ప్రభువు ఆశిస్తున్నారు. తండ్రి చిత్తాన్ని కనుగొనుటకు యేసు ప్రతిదినం ప్రార్ధన చేసాడు. ఆయన ప్రార్ధానా మందిరములలో, అలాగే ఏకాంత ప్రదేశాలలో ప్రార్ధన చేసాడు. యేసు ప్తరభువుకు కూడా, తన ప్రేషితకార్యములో ప్రార్ధన ఎంతో ప్రధానమైనది. దేవుని కుమారుడైనప్పటికినీ, ప్రార్ధన అవసరత, తండ్రి దేవునితో సంభాషించడం ఎంతో అవసరమని గుర్తించాడు. మరి మనికింకా ఎంత అవసరమో గుర్తించాలి!  అందులకే, దైవచిత్తాన్ని తెలుసుకొనుటకు, ప్రభువు మనకు కూడా ప్రార్ధన నేర్పించాడు. 

మన జీవిత అంధకారమునుండి బయటపడుటకు ప్రార్ధన ఎంతో ప్రాముఖ్యం. క్రీస్తానుచరులుగా, క్రీస్తువలే మారుటకు ప్రయత్నంచేద్దాం. తండ్రి చిత్తం, ప్రభువు కార్యమైనప్పుడు, అదే దేవుని చిత్తం, ప్రభువు కార్యం, మన కార్యముకూడా కావలయును. తండ్రితో ప్రభువు ఇలా ప్రార్ధించాడు: "నీవు నాకు అప్పగించిన పనిని పూర్తిచేసి, నిన్ను ఈ లోకమున మహిమ పరచితిని" (యో 17:4). మనతో ప్రభువు ఇలా అంటున్నాడు, "ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెడల ప్రకాశింపనిండు" (మ 5:16).

ప్రభువు ప్రేషిత కార్యములో మనమూ భాగస్తులమే. తండ్రి కుమారున్ని పంపినట్లే, మనలను కూడా పంపియున్నాడు. "నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యో 14:12).

రెండవ పఠనము - శ్రమలలో పౌలు ఆదర్శం

ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు ఇలా అంటున్నారు, "ఈ పనిని (సువార్తా బోధన) నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కాని, ఇది నా విధి అని భావించినచో, నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్ధము (1 కొరింతి 9:17). పౌలుగారు యేసువలెనె దైవకార్యాలను చేసియున్నాడు. అన్ని ఇబ్బందులను, బాధలను ధైర్యముతో ఎదుర్కొని, సువార్తను బోధించి తన జీవితాన్ని అర్పించాడు. యో 9:4 లో ప్రభువు చెప్పిన మాటలను తన జీవితములో పాటించాడు: "పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలెను. రాత్రి దగ్గర పడుచున్నది. అపుడు ఎవడును పని చేయలేడు." మనం ఏ పని చేసిన ప్రభువు పేరిట చేసినచో ఆనందాన్ని పొందగలము. ప్రతీది ఆయన కొరకు చేద్దాం. మన బాధలను, కష్టాలను, మన అనుదిన కార్యాలను ఆయన చెంతకు తీసుకొని వద్దాం. "భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" (మ 11: 28).

4 వ సామాన్య ఆదివారము, Year B

4 వ సామాన్య ఆదివారము, Year B
దేవుని వాక్కు శక్తి గలది: ఆలకింపుము - యేసు ఆ వాక్కును అధికారముతో బోధించెను
ద్వితీ 18: 15-20; భక్తి కీర్తన 95: 1-2, 6-9; 1 కొరి 7: 32-35; మార్కు 1: 21-28

ఉపోద్ఘాతము: దేవుని వాక్కు శక్తిగలది
"మా కర్తయగు ఓ సర్వేశ్వరా! మమ్ము అన్ని దేశములనుండి రప్పించి తిరుగ ఏకము చేయుడు. అపుడు మేము మీ నామ సంకీర్తనము చేయుచు మీకు ప్రస్తుతి చేయుటలో ఆనందము కలిగియుందుము".
గతవారం, "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు" (మార్కు 1:14) అంటూ యేసు దైవరాజ్యమును ప్రకటించియున్నాడు.  ఈ వారం యేసు తన సువార్తా వాక్య బోధనద్వారా, తన అధికారముతో, శక్తితో వాక్యమును బోధించి, వాక్య శక్తిని ఋజువు చేయుటకు దయ్యము (అపవిత్రాత్మ) పట్టిన వానికి స్వస్థతను చేకూర్చాడు. సాతానును గద్దించి పారద్రోలుచున్నాడు. దేవుని వాక్యం మన మధ్యలోనికి అనేక విధాలుగా వచ్చును. "దేవుని వాక్యం సజీవమును, చైతన్యవంతమునైనది. అది కత్తివాదరకంటే పదునైనది. జీవాత్మల సంయోగస్థానము వరకును, కీళ్ళు మజ్జ కలియు వరకును, అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను, అది విచక్షింపగలదు" (హెబ్రీ 4:12). దేవుని వాక్యం, మన హృదయములోనికి దూసుకొని పోగలదు. మన ఆలోచనలను, మన జీవితాలను మార్చగలదు. మనలను శుద్ధులను గావించి, మనలోని పాపమును తొలగించగలదు. ఈలోక విలువలకు వ్యతిరేకముగా, దైవరాజ్య విలువల వైపునకు మనలను నడిపించ గలదు. దేవుని వాక్యమునకు పాపోశ్చరణ శక్తిగలదు. మనలోని విభేధములను తొలగించి, ఒకటిగా చేయగలదు.
మొదటి పఠనము: దేవుడు పంపు ప్రవక్త బోధను ఆలకింపుము
మోషే ప్రవక్త (క్రీ.పూ 13వ శతాబ్దం) ఇశ్రాయేలు ప్రజలకు తన చివరి వీడ్కోలు సందేశమును ఇస్తున్నాడు. వాగ్ధత్తభూమిలోనికి ప్రవేశించు వారికి, వారిని నడిపించుటకు, జీవిత మార్గమును చూపుటకు దేవునివాక్యం వారితో ఎల్లప్పుడు ఉంటుందని చెప్పాడు. తన మరణం తర్వాత, దేవుడు వారిని విడచి వేయక వారితో తన ప్రవక్తలద్వారా మాట్లాడతాడని అభయాన్ని ఇచ్చాడు. మోషే ప్రవక్తను ఆలకించిన విధముగా, రాబోవు ప్రవక్తలను, వారి ప్రవచనాలను ఆలకించాలి. ప్రవక్తలను నిర్లక్ష్యము చేసిన యెడల, వారి జీవితాలు ప్రమాదములో పడిపోతాయి. యోర్దాను నది దాటి, వాగ్ధత్త భూమిలోనికి ప్రవేశించిన తర్వాతకూడా, దేవునికి విధేయులై జీవించడం చాలా ముఖ్యమని వారికి మోషే గుర్తుకు చేస్తున్నాడు. దేవుని ఒప్పందాలకు విశ్వాసపాత్రులుగా జీవించిన యెడల, వారు అనేక దైవవరములను పొందెదరు. నిబంధనలను ఉల్లంఘించిన యెడల వారికి కష్టాలు తప్పవు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నపుడు, వారికి దేవుడు ఎలా అవసరపడి యున్నాడో, అలాగే, వాగ్ధత్త భూమిలో కూడా, దేవుని అవసరం, సహాయం, శక్తి వారికి అవసరమని వారు గుర్తుంచుకోవాలి. అనేక ప్రవక్తలద్వారా వచ్చు దేవుని సందేశమును, వాక్యమును శ్రద్ధగా ఆలకించి, పాటించాలి.
ఈవిధముగా మోషే, భవిష్యత్తులో రాబోవు గొప్ప ప్రవక్త, రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చి ప్రవచిస్తున్నాడు. "నీ వంటి ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారిచెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నియు అతడు వారితో చెప్పును" (ద్వితీ 18:18). క్రీస్తునందు ఈ ప్రవచనం నెరవేరినది. క్రీస్తుద్వారా మనం నిజమైన వాగ్ధత్తభూమికి (పరలోకం, నిత్యజీవము) నడిపించ బడుచున్నాము. కనుక దేవుని చిత్తమును, సత్యమును బయలుపరచు నిజ ప్రవక్తల బోధనలను శ్రద్ధగా ఆలకించాలి.
రెండవ పఠనము: వివాహితుల బాధ్యతలు
దేవునిచేత ప్రత్యేకముగా ఒసగబడిన పిలుపును విశ్వాసముతో జీవించాలని, పునీత పౌలుగారు బోధిస్తున్నారు. ప్రత్యేక పిలుపు అనేది కేవలం అవివాహితులకు మాత్రమేగాక, వివాహితులకుకూడా అని గుర్తించాలి. సకల విచారముల నుండియు దూరము కావలయుననియు, అత్మచేత ప్రేరేపింపబడి, ప్రభువును నమ్మిన పౌలుగారు చెబుతున్నారు. అవివాహితులు, విధవరాండ్రు దేవుని విషయములందు నిమగ్నులై ఉండాలి. దేవున్ని సంతోష పెట్టుటకు ప్రయత్నించాలి. అలా శారీరకముగా, ఆత్మయందును పరిశుద్ధులై ఉండెదరు. వివాహితులు ఈలోక విషయాలలో చిక్కుకొని ఉండెదరు. భర్త భార్యను, భార్య భర్తను ఎలా సంతోషపెట్ట వలయునని లౌకిక వ్యవహారములలో చిక్కుకొని ఉండెదరు. వారి జీవితం దేవునికి-లోకానికి మద్య విభజింప బడుతూ ఉంటుంది. వారు విచారములనుండి దూరము కావలయునంటే, ప్రభువునకు సంపూర్ణముగా వారి జీవితాలను అర్పించుకోవాలి మరియు క్రమశిక్షణ అలవరచు కోవాలి. కుటుంబ భాధ్యతలను నేరవేరుస్తూనే, దేవుని విషయాలయందుకూడా నిమగ్నులై యుండాలి. పొరుగువారిని ప్రేమిస్తూ, దైవాజ్ఞలను విధేయిస్తూ, సజీవ విశ్వాసము కలిగి క్రీస్తునందు వారు జీవించగలగాలి.
సువిశేష  పఠనము: యేసు బోధ అధికారము గలది
యేసు విశ్రాంతి దినమున (సబ్బాతు) కఫర్నాములోని (గలిలీయ సముద్ర తీరమున ఒక చిన్న గ్రామము; పేతురు అతని సోదరుడు అంద్రేయ అక్కడ నివసించిరి; నజరేతును వీడిన యేసు, కఫర్నామును తన నివాస మేర్పరచు కొనెను మత్త 4:13; మార్కు 2:1) యూదుల ప్రార్ధన మందిరములోకి (సినగోగు - ప్రార్ధన, బోధన, ఆరాధన, సంఘకూడిక) ప్రవేశించి, ధర్మశాస్త్రబోధకులవలెగాక (యూదచట్టం యొక్క అధికారిక వ్యాఖ్యాతలు), అధికారపూర్వకముగా బోధించాడు. అనగా ఆత్మవిశ్వాసముతో లేఖనాలను వివరించాడు. ధర్మశాస్త్రబోధకులు, ఆత్మసంబంధమైన విషయాలకుగాక, బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. "వారు బోధించునది వారే ఆచరింపరు" (మత్త 23:3) అని వారి గురించి యేసు చెప్పాడు. మత్త 7:29లో "ఏలయన ధర్మశాస్త్ర బోధకులవలె గాక అధికారము కలవానివలె యేసు బోధించెను".
యేసు అధికారము వ్యక్తిగత అనుబంధముపై ఆధారపడి యున్నది. ఆయన అధికారము తండ్రి దేవునితో తనకున్న వ్యక్తిగత అనుబంధము నుండి వస్తుంది. నేటి సువిషేశములో అపవిత్రత్మతో ఆవేశించిన వ్యక్తి యేసు అధికారాన్ని గుర్తించి, "నీవు ఎవరివో నేను ఎరుగుదును.నీవు దేవుని పవిత్ర మూర్తివి" అని అరిచాడు (మార్కు 1:24). 
యేసు దైవీక అధికారాన్ని కలిగియున్నాడు. ఆయన బోధనలయందును, కార్యములందును శక్తిగల ప్రవక్త, మెస్సయ్య. ఆయన బోధకు అచ్చటనున్నవారు ఆశ్చర్యపడ్డారు. మార్కు సువార్తలో, ప్రభువును, ఒక బోధకునిగా, గురువుగా, ఆశ్చర్యకరునిగా, ప్రార్ధనాపరునిగా చూస్తాము. ఇవన్నియు, ప్రభుని అనుదిన చర్యలో భాగాలే! ఆయన, ఓ గొప్ప గురువు, బోధకుడు. ప్రజలకు దర్మశాస్త్రమునుగూర్చి బోధించాడు. ఆయన వద్దకు విశ్వాసముతో వచ్చిన ప్రతీవారిని స్వస్థపరచాడు. గురువు తన వ్యక్తిగత జీవితముద్వారా, అనుభవముద్వారా, జ్ఞానాన్ని ఇతరులకు ఒసగుతాడు. ప్రభువు, తన జీవితాంతముకూడా, దేవుడు తనకు అప్పగించిన ప్రజలకు సువార్తను బోధించాడు. సువార్తను అర్ధము చేసికొనుటకు, ఉపమానాలద్వారా విశదపరచాడు. క్రీస్తు బోధన కేవలం మదిలోనికేగాక, హృదయములోనికి కూడా ప్రవేశిస్తుంది. ప్రజలు అతని చర్యలలో దేవుని దయను, కరుణను అనుభవించారు. రోగులను, పాపాత్ములను, సమాజముచే వెలివేయబడిన వారిని ప్రేమతో ఆదరించాడు. నేటి సువార్తలో దయ్యము పట్టినవానికి స్వస్థతను చేకూర్చాడు (మార్కు 1:23-26). అందుకే ప్రజలు, ఆశ్చర్యపడి "ఇది యేమి? ఈ నూతన బోధయేమి?" (మార్కు 1:27) అని గుసగుసలాడారు.
యేసు తండ్రిప్రేమను బోధించాడు. యేసు అధికారము - తండ్రి దేవుని ప్రేమ యొక్క శక్తి. ఆయన నిశ్చయముగా, అధికార పూర్వకముగా బోధించాడు, ఎందుకనగా, ఆయన బోధన తండ్రిచిత్తమని, తండ్రివాక్కు అని ఎరిగియున్నాడు. యేసుప్రభువు దేవుని వాక్యమును బోధించాడు. దేవునిగూర్చి, రక్షణ ప్రణాళికనుగూర్చి బోధించాడు. ప్రజలు ఆయన బోధనను ఆలకించడానికి ఆసక్తిని చూపారు. ఈ సందర్భాలలోనే ఆయన ఎన్నో అద్భుతాలను, స్వస్తతలను కూడా చేసాడు. ఈనాడు, అపవిత్రాత్మతో ఆవేశించిన వానిని, ప్రభువు స్వస్థపరచాడు. ఆ అపవిత్రాత్మ ప్రభువు శక్తిని అణగత్రొక్కుటకు ప్రయత్నం చేసింది. కాని, ప్రభువు దానిని తన శక్తితో, అధికారముతో గద్దింపగా, అది వదలి పోయింది. క్రీస్తు అధికారపూర్వకముగా బోధించాడు. యేసు బోధనలు అధికారపూర్వకమైనవి, ఎందుకన, ఆయన దేవుడు, నిత్యజీవపు మాటలు కలవాడు. అందుకే, ఆయన బోధ మనసున, హృదయమున నాటుకొని పోతుంది. అదే యేసుప్రభువునకు, ధర్మశాస్త్రబోధకులకు మధ్యనున్న వ్యత్యాసము. యేసు తన అధికారాన్ని ఇతరుల శ్రేయస్సు, స్వస్థత, రక్షణ కొరకు ఉపయోగించాడు (చదువుము మా 10:45). మనం కూడా యేసువలె జీవించాలి (చదువుము మా 10:42-43). ఎందుకన, మన జ్ఞానస్నాముద్వారా, యేసు అధికారములో భాగస్వామ్యం అవుతున్నాము. ఇతరుల సేవకై మనకున్న అధికారాన్ని వినియోగించాలి.
మత్త 10:1లో చూస్తున్నట్లుగా, యేసు తన శిష్యులకు అధికారమును ఇచ్చాడు. అధికారము ఎప్పుడు కూడా దేవుని నుండి వస్తుంది. మనం సంపాదించుకునేది కాదు. అధికారము అనగా 'సేవ' అని శిష్యులకు బోధించాడు. యేసు ఆదర్శాన్ని మత్త 20:28 లో చూడవచ్చు: "మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింప బడుటకు రాలేదు". 
సందేశము
అయితే, ఈ రోజుల్లో, 'అధికారం' ఓ చెడు పదముగా మారింది. అధికారం అంటే డబ్బు, పదవులు, ఆధిపత్యం, విజయాలు అని తప్పుగా భావిస్తున్నాం. దేవుని దృష్టిలో, అధికారం అనగా, సేవ, వినయము, ప్రేమ.
ఈనాడు మనం ఇతరుల అధికారాన్ని చూసి వారికి గౌరవాన్ని ఇస్తాం. అలా అధికారముతోగాక, మన మంచి జీవితముద్వారా, ఇతరుల గౌరవాన్ని పొందాలి. అప్పుడే, మనం చేసే బోధనని ఇతరులు ఆలకిస్తారు. ఆరవ పౌలు పాపుగారు, ఓ సందర్భములో 'ఈ లోకం బోధకులకన్న ఎక్కువగా సాక్షులు అవసరం ఎంతో ఉన్నది' అని అన్నారు. ఈ రోజు, గురువులను, బోధకులను గౌరవిస్తున్నారంటే, వారికున్న అధికారమునుబట్టి కాదు. కాని వారి జీవితమును బట్టి. వారు ఎలాంటి వ్యక్తులు, ఎలా జీవిస్తున్నారో వారి బోధనలను బట్టి చెప్పగలరు. యేసు ప్రభువు అధికారపూర్వకముగా బోధించాడు. ఆయన గొంతెత్తి బోధించాడనో , శిక్షనుగూర్చి బోధించాడనో కాదు. ఆయన బోధన ఆయన జీవిత ఆదర్శానుసారముగా సాగింది. ఆయన జీవించినదే, బోధించాడు. అందుకే, అధికారముతో బోధించగలిగాడు. మన బోధ కేవలం మాటలద్వారా మాత్రమేగాక, మన బోధ జీవితమై యుండాలి.
క్రీస్తు ఓ గొప్ప బోధకుడు. మనమందరం ఆయన శిష్యులం, అనుచరులం. దేవుడు, జ్ఞానస్నానము ద్వారా, మనకొక్కరికి ఓ విధమైన పిలుపునిచ్చి ఆయన బిడ్డలుగా జీవించునట్లు చేసాడు. ఆ పిలుపునకు మనం ఎల్లప్పుడు స్పందించాలి. ఎలాంటి విచారములకు లోనుకాకుండా, లోకవ్యవహారములలో చిక్కుకొనక, ప్రభునిలో నమ్మకముంచి, ముందుకు సాగిపోవాలి. మనలోనున్న అపవిత్రాత్మ శక్తులను, లోకవ్యామోహములను గద్దింపమని ప్రభువుని ప్రార్దన చేద్దాం. యేసుక్రీస్తు శక్తిని, అధికారాన్ని మన అనుదిన జీవితాలలో గుర్తించి ప్రతిస్పందించాలి. 
దయ్యములను వెడలగొట్ట బడటం పాత నిబంధనలో 1 సమూ 16:14-23; తోబితు 8:1-3); పాత నిబంధనలో ప్రేషిత సేవలో భాగముగా చూడవచ్చు (మత్త 9:32-34; 12:22-32; మా 1:22-27; 3:14-30; 5:1-20; 6:7; 7:24-30; 9:17-29; 16:17; అపో.కా. 5:16; 8:7; 19:12). ఇది శ్రీసభ పరిచర్యలో కూడా భాగమే (శ్రీసభ చట్టం 1172 1,2).
తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, గురువులుగా, మఠవాసులు, మఠకన్యలుగా, పాలకులుగా, ప్రజాధికారులుగా మనం కలిగియున్న అధికారము, మనము జీవించే జీవిత విధానమునుండి (సేవ, వినయము, ప్రేమ) రావాలి. అప్పుడే, మనం చెప్పేదానిని ఇతరులు ఆలకిస్తారు. మనమూ గౌరవాన్ని పొందగలము. 
శ్రీసభలో నిజమైన అధికారము
ప్రజల కొరకు ఉపయోగార్ధమైనదే నిజమైన అధికారము. అవసరతలో నున్న వారికి సహాయం అందించుటకై వినియోగించునదే నిజమైన అధికారము. ఇతరులపై ఆధిపత్యం చెలాయించేది నిజమైన అధికారం కాదు. దుర్భుద్ధితో, స్వార్ధబుద్ధితో ఉపయోగించేది నిజమైన అధికారం కాదు.
ఆధిమ క్రైస్తవ సంఘములో కూడా కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిసి పునీత పౌలుగారు ఈ విషయాన్ని ప్రస్తావించారు: 2 కొరి 10:8 - "ప్రభువు మాకు ప్రసాదించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ గొప్పగా చెప్పుకొనినను, దాని కొరకు సిగ్గుపడుట లేదు. ఆ అధికారము మీ ప్రసిద్ధి కొరకే కాని, మిమ్ము నాశనము చేయుటకు కాదు." క్రీస్తు ఒసగిన అధికారము దైవప్రజలను, దైవసంఘమును ప్రసిద్ధి చేయుటకు అధికారము వినియోగించ బడాలి.
ఎఫెసీ 4:11-12 - "క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుబడుటకు, పవిత్రులెల్లరను సిద్ధము చేయుటకు ఆయన క్రీస్తు కొందరిని అపోస్తలులుగను, కొందరిని ప్రవక్తలుగను, కొందరిని కాపరులుగను, కొందరిని బోధకులుగను నియమించెను.". కనుక, శ్రీసభలోని అధికారము సంఘాభివృద్ధికై, ప్రసిద్ధి చేయుటకై ఉండాలి. అలాగే 'విశ్వాస విషయములోను, యేసు జ్ఞానము విషయములోను, ఏకత్వము పొంది, సంపూర్ణము కావలయును. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందాలి' (ఎఫెసీ 4:13).
నేడు ప్రార్ధనాలయములాంటి మన హృదయములో అధికారముతో మనకు బోధిస్తున్నారు. ఆయన మాటలను హృదయపూర్వకముగా ఆలకించు చున్నామా? ప్రస్తుత కాలములో ఎన్నో విధములైన ‘అపవిత్రాత్మలతో’, నిండియున్నాము, శోధింపబడుచున్నాము. స్వస్థపరచమని యేసుక్రీస్తును వేడుకుందాం. అలాగే, మనకొసగబడిన అధికారాన్ని దుర్వినియోగం చేయక, క్రీస్తు శరీరమైన దైవసంఘము కొరకు వినియోగించ శక్తిని, ఆత్మప్రేరణను ఒసగమని ప్రార్ధన చేద్దాం!

క్రీస్తు రాజు మహోత్సవము, YEAR B

క్రీస్తు రాజు మహోత్సవము, YEAR B

దానియేలు 7:13 -14; దర్శన. 1:5 -8; యోహాను 18:33-37 


సర్వేశ్వరుడు రాజ సింహాసనమందు ఆసీనుడై యుండును. ఆయన తన ప్రజలకు శాంతి వరమును ప్రసాదించును (కీర్తన 29:10-11). ప్రభువు రాజు. అతడు ప్రాభవమును వస్త్రమువలె ధరించెను. ప్రభూ! నీ సింహాసనము అనాదికాలము నుండియు స్థిరముగా నిల్చియున్నది (కీర్తన 93:1,2).

పండగ చరిత్ర:

అది మొదటి ప్రపంచ యుద్ధము (1914-1918) ముగిసిన కాలము. ప్రపంచమంతా అల్లకల్లోలమైన పరిస్థితి. ఎక్కడ కూడా శాంతి, ప్రశాంతత లేదు. దేశాలన్నీ కూడా ఆర్ధిక గంధర గోళములో ఉన్నాయి. నిరుద్యోగం ప్రబలిపోయింది. చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయారు. నిరాశావాదం, దేశాల మధ్య ద్వేషంతో నిండిన నిస్సహాయ భావాన్ని విపరీతంగా నింపింది. నిరంకుశ అధికారుల పాలన ప్రారంభమైనది. ఫాసిజం, నేషనల్ సోషలిజం (నాజీలు), కమ్యూనిజం పుట్టుకొచ్చాయి. కష్టాలలో, బాధలలో నున్న ప్రజలు, ఈ గంధర గోళ పరిస్థితులలో, ఆశను చూపిన ఎవరి చెంతకైనా చేరిపోయారు. ఉద్భవిస్తున్న నియంతలకు ఆకర్షితులయ్యారు. తమ దైనందిన జీవితాల నుండి భగవంతుడిని మినహాయించి, తరచుగా స్వయం సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. చాలా మంది నైతికత ప్రాథమిక అంశాలు, శ్రీసభ బోధనలు కాలం చెల్లినవిగా భావించారు; అవి 20వ శతాబ్దపు సమాజంలో సంబంధితంగా లేవని తలంచారు. క్రీస్తు వ్యక్తిగత జీవితంలో రాజు కావచ్చు, కానీ ఖచ్చితంగా సామాజిక ప్రపంచంలో కాదు అని ఆధునికంగా ఆలోచించారు. కొన్ని రాజకీయ పాలనలు యేసు క్రీస్తును పూర్తిగా సమాజం నుండి, కుటుంబాల నుండి బహిష్కరించడాన్ని సమర్థించాయి. దేశాలు, ప్రభుత్వాలు పునర్నిర్మించబడినందున, వాటి పునాదులు, విధానాలు, చట్టాలు తరచుగా క్రైస్తవ విలువలతో సంబంధం లేకుండా రూపొందించ బడ్డాయి. 

లౌకికవాదం, భౌతిక ప్రయోజనం, నిరంకుశులు సృష్టించిన తప్పుడు ఆశలతో ఆధిపత్యం చెలాయించే జీవనశైలికి అనుకూలంగా క్రీస్తును తిరస్కరిస్తున్న ఈ పరిణామములో, 11వ భక్తినాథ పోపుగారు యేసు రాజ్యాధికారాన్ని తిరస్కరిస్తున్న రాజకీయ, ఆర్థిక శక్తులను సంబోధించాలనే తలంపుతో, పోప్‌గా తన పాలనను "క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు శాంతి"కి అంకితం చేశారు. ఇలాంటి సమయములో, క్రీస్తు ఒక రాజుగా గౌరవించబడాలని, శ్రీసభకి కూడా స్వతంత్ర౦ కలదనే విషయం లోకం తెలుసుకోవాలని, విశ్వాసులు బలాన్ని, ధైర్యాన్ని పుంజుకొంటారని తలంచారు. రాజు అనేవాడు తన ప్రజలకు ఓ గొర్రెల కాపరివలె, ప్రేమించే హృదయాన్ని కలిగి యుండాలి. సంఘాన్ని న్యాయముతో, శాంతి పధములో నడిపించ గలగాలి. ప్రజల అవసరాలను గుర్తెరిగి వాటిని నెరవేర్చే వాడై ఉండాలి. అలాంటి పరిపాలనను క్రీస్తు రాజు మనకు ఒసగునని గుర్తించాలి.

కౌన్సిల్ ఆఫ్ నైసియా 1600వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 1925లో శ్రీసభ జూబిలీ సంవత్సరాన్ని జరుపుకుంది. తండ్రి దేవునితో కలిసి ఉండడం ద్వారా కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు దైవత్వాన్ని ఆ సమావేశం ధృవీకరించింది. ఈ విశ్వాసాన్ని నేటికీ మనం విశ్వాస సంగ్రహములో ప్రకటిస్తున్నాము. వార్షికోత్సవ సంవత్సరం అంతయు కూడా, భక్తినాథ పోపుగారు, "క్రీస్తు రాజ్యానికి అంతమే ఉండదు" అని క్రీస్తు రాజరికాన్ని గూర్చి నిరంతరం ప్రకటించారు. కనుక, సకల దేశాలపై, సకల జనులపై క్రీస్తు రాజు యొక్క ఆధిపత్యాన్ని శాశ్వతముగా గుర్తించడానికి, 11 డిసెంబర్ 1925లో, "మన ప్రభువైన యేసుక్రీస్తు రాజు" మహోత్సవాన్ని స్థాపించారు.

ప్రతీ సంవత్సరం దైవార్చన సంవత్సరములో సామాన్య కాల చివరి ఆదివారాన్ని "సర్వాధికారియగు క్రీస్తు రాజు" మహోత్సవమును కొనియాడుచున్నాము. ఈ పండుగ ద్వారా, క్రీస్తు మన హృదయాలను, మనసులను పరిపాలించే రాజు అని గుర్తుకు చేసుకోవాలి.

పండగ పరమార్ధం: 

మొదటి పఠనము - దానియేలు 7:13-14: "శాశ్వత జీవి, నరపుత్రుని (క్రీస్తు-రక్షకుడు) గూర్చిన దర్శనము" గూర్చి దానియేలు (= దేవుడు నా తీర్పరి) ప్రవక్త తెలియజేయు చున్నాడు. తండ్రి నుండి అధికారం పొందిన నరుని కుమారుడు క్రీస్తు. "ఆ నరపుత్రుడు పరిపాలనమును, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఈ ప్రవచనం, దేవుడు రాజుగా కలకాలం ప్రజల చెంత ఉన్నాడని, దేవుని రాజ్యం, క్రీస్తు రూపములో భూలోకమునకు ఏతెంచినదని నిరూపిస్తున్నది. స్వయముగా క్రీస్తే దానియేలు ప్రవచనాన్ని మార్కు 14:62; మత్తయి 24:30 లో ప్రస్తావించారు.

యేసు జీవిత గాథ, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?" (మత్తయి 2:2)  అన్న ప్రశ్నతో ప్రారంభమై, "నీవు యూదుల రాజువా?" (లూకా 23:3) అన్న ప్రశ్నతో ముగుస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం, నేటి సువిశేష పఠన౦లో యేసు మాటలలోనే చూడవచ్చు: "నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు... నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీనికొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధులందరు నా మాటనాలకింతురు" (యోహాను 18:36,37). పిలాతు ఎదుట ప్రభువు తన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని, తన రాజ్యము ఆధ్యాత్మికమైనదని, తన రాజ్యము సత్యము, న్యాయములపై ఆధారపడి ఉన్నదని ప్రకటించాడు. సిలువ, క్రీస్తు రాజ్య విజయానికి చిహ్నము. ఈ విజయం జీవితం, సత్యం, ప్రేమ కొరకు. "దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది" (లూకా 17:21) అన్న ప్రభువు పలుకులు క్రీస్తే ఆ దైవ రాజ్యము అని అర్ధమగుచున్నది. అయిదువేల మందికి ఆహారము పంచిన తరువాత, ప్రజలు తనను బలవంతముగా రాజును చేయ ప్రయత్నించినపుడు, యేసు ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళాడు (యోహాను 6:15), ఎందుకనగా, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు.

క్రీస్తు తన శిష్యులతో, "అన్య జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనం చెలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడై ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన, మనుష్య కుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను (మార్కు. 10:42-45) అని అన్నారు. యేసు రాజ్యాధికారం అనగా సేవ,  ప్రేమ, సమర్పణ, త్యాగం. ఆయన పాలన, అధికారమునుగాక ప్రేమను, అసత్యమునుగాక సత్యమును, ద్వేషమునుగాక దయను, దుష్టత్వమును లేదా స్వార్ధమునుగాక న్యాయమును అనుసరిస్తుంది. మన రక్షణ కొరకు తన ప్రాణాలను సైతం అర్పించాడు. లోక పాప భారాన్ని మోసే రాజు. 

ఈనాటి రెండవ పఠన౦ - దర్శన గ్రంధము 1:5-8 క్రీస్తును ప్రేమించే రాజుగా వర్ణిస్తుంది. "ఆయన మనలను ప్రేమించు చున్నాడు" (1:5). మనకోసం ఒక రాజ్యాన్ని స్థాపించిన సర్వాధికారియైన క్రీస్తు రాజసత్వమును గూర్చి భోదిస్తుంది. ఈ రాజ్యములో క్రీస్తు మనలను దైవసేవకు అంకితము చేసియున్నాడు. "ఆయన రక్తము ద్వారా, మనలను పాప విముక్తులను చేసి (1:5), తన ప్రేమను నిరూపించుకున్నాడు. అందుకే, ఆయన సర్వాధికారమునకు పాత్రుడైనాడు. ఆయన మరల మహిమతో తిరిగి వచ్చును. ఆయన "ఆల్ఫా, ఒమేగ" (1:8).

క్రీస్తు ఈ లోకమున జీవించినప్పుడు, దైవ రాజ్యము గూర్చి భోదించాడు. "మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు" (మ 6:33) అని తన శిష్యులతో చెప్పాడు. దేవునికి ప్రధమ స్థానాన్ని ఇవ్వాలని సూచించాడు. తన శిష్యులను సేవకులని గాక, స్నేహితులని పిలిచాడు. తన గురుత్వమును, రాజరికాన్ని వారితో పంచుకున్నాడు. రాజుగా ఈ లోకములో ఒక సేవకునిగా ప్రజల దరికి చేరాడు. తన శిష్యులను సైతం సేవకులుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. ఆయన నిజమైన స్వాతంత్రాన్ని ఒసగువాడు.  ఈ విధముగా, 'రాజు'కు ఓ నూతన అర్ధాన్ని ఇచ్చాడు. ఈ లోక రాజులవలె, పాలకులవలె గాక, ఆయన ఇష్టపూర్తిగా, తన ప్రజల రక్షణార్ధమై మరణించాడు. ఆయన మరణం యుద్ధము వలన వచ్చినది కాదు. రక్షణ ప్రణాళికలో సృష్టి పూర్వమే ఏర్పాటు చేయబడినది.

క్రీస్తు మన రాజు, అందరి రాజు, సర్వాధికారము కలిగినవాడు. ఆయన మన జీవితాలకు, హృదయాలకు రాజు. ఆయన మన ఆధ్యాత్మిక రాజు. సత్యము-ప్రేమతో పాలించు రాజు. ఆయన చూపిన ప్రేమ-సేవ మార్గములో మనము కూడా పయనిద్దాం. ఇతరులకు సేవకులమై దేవుని రాజ్యాన్ని ఈ లోకములో బలపరచుదాం. మన క్రైస్తవ జీవిత విధానమును బట్టి (ప్రేమ, సేవ, క్షమాపణ, పేదవారిపట్ల సంఘీభావం) ఆయనకు లోబడి యున్నామని నిరూపించుకుందాం. లోక సంబంధమైన పాలన, పాలకులు అశాశ్వతం, కాని క్రీస్తు రాజ్యం, పాలన కలకాలం నిలుచును. సిలువ ఆయన సింహాసనం. యేసు కొండపై బోధనలు ఆయన ప్రధాన శాసనం. ఆయన ప్రేషిత కార్యం లోక రక్షణ. సకల నిర్బంధములనుండి మనలను విముక్తి గావించును. మనం సంతోషముగా, ఆనందముగా జీవించునట్లు చేయును. పరలోక రాజ్యమునకు వారసులగునట్లు చేయును! "నా తండ్రిచే దీవింప బడిన వారలారా! రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు" (మత్తయి 25:34). 

జీవిత పాఠాలు:

- క్రీస్తు రాజు పట్ల మన నిబద్ధతను పరిశీలించుకుందాం: క్రీస్తును రాజుగా అంగీకరించిన మనం ఆయన మాటలను ఆలకిస్తున్నామా? ఆయన చూపిన ప్రేమ-సేవ మార్గములో పయనిస్తున్నామా? క్రీస్తుతో కలిసి నడచినప్పుడే ఆయన రాజ్యమునకు చెందిన వారమవుతాము. "నా కాడిని మీ రెత్తు కొనుడు. సాధు శీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు" (మత్తయి 11:29) అన్న క్రీస్తు పిలుపుకు స్పందించుదాం. నతనయేలు వలె క్రీస్తును రాజుగా ప్రకటించుదాం (యోహాను 1:49).

- మన జీవితాలపై క్రీస్తు రాజుకు నియంత్రణ ఉండునట్లు చూడాలి: క్రీస్తు మన జీవితాలకు సర్వం కావాలి. ప్రతీ నిర్ణయములో క్రీస్తు రాజునా లేదా బరబ్బనా అని నిర్ణయం చేయాలి.

- క్రీస్తు సత్యాన్ని, వినయపూర్వకమైన సేవను అనుసరించాలి: సత్యమునకు (క్రీస్తు) సాక్ష్యము ఇవ్వవలెను. తండ్రి దేవుడు ప్రేమ కలవాడు, క్షమించువాడు. మనంకూడా ఇతరులను క్షమించాలి. పేదవారిని దయతో ఆదరించాలి. సేవాభావంతో జీవించాలి. నాయకుడు అనగా సేవకుడని గుర్తించాలి. పవిత్రాత్మతో తండ్రి క్రీస్తును అభిషేకించి యాజకునిగా, ప్రవక్తగా, రాజుగా నెలకొల్పాడు (హెబ్రీ 1:8-9). "పరిపాలించడం అంటే సేవించడం, ముఖ్యముగా నిరుపేదలకు, బాధాతప్తులకు సేవలందించడములో రాజధర్మం రాణిస్తుంది. ఈ అభాగ్యుల్లో శ్రీసభ తన స్థాపకుని పేదరికాన్ని బాధామయ రూపాన్ని కనుగొంటుంది. క్రీస్తుతో పాటు సేవలందించడం ద్వారా దైవప్రజలు తమకున్న రాజ ధర్మాన్ని నెరవేరుస్తారు" (సత్యోపదేశం 786).

- క్రీస్తు రాజ్య వారసులమైన మనం ఆయన ప్రేమ ఆజ్ఞను పాటించాలి: "దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింప వలెను" (మార్కు 12:30). "మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు (యోహాను 14:15). "నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు" (యోహాను 13:34). 

సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా! సమస్తము మీద రాజ్యాధికారముగల మీ ప్రియతమ పుత్రుని ద్వారా సృష్టినంతటిని పునరిద్దరించ చిత్తగించితిరి. సృష్టి అంతయు పాప దాస్యమునుండి విముక్తి చెంది, మీ వైభవ సేవకు అంకితమగునట్లును, నిత్యము మీ స్తుతిగానమందు నిమగ్నమై యుండునట్లును చేయుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఆమెన్.

యేసు రాజరికం గురించిన ప్రవచనాలు: యెషయా 9:6; 11:10; యిర్మీయా 23:5; అ.కా. 2:30; యోహాను 12:15; 1 తిమోతి 6:15; దర్శన 17:14; 19:16.

దైవ రాజ్యము – మన యోగ్యత

23వ సామాన్య ఆదివారము, Year B

 23వ సామాన్య ఆదివారము
యెషయ 35:4-7; యాకోబు 2:1-5; మార్కు 7:31-37

మొదటి పఠనము: దేవునియందు విశ్వాసము

మొదటి పఠనము యెషయ గ్రంథము నుండి వినియున్నాము. భవిష్యత్తులో, దేవుని మహిమగల శక్తివలన ఇశ్రాయేలు ప్రజల జీవితములో జగరబోయే మార్పుల గురించి యెషయ ప్రవక్త తెలియజేయు చున్నారు. ఇది ఓదార్పు, ఊరటగల ప్రవచనాలు! ఇశ్రాయేలు ప్రజలలో నమ్మకం, ఆశ కలిగించు ప్రవచనాలు! వారి రక్షణ గురించిన ప్రవచనాలు! సకల సమస్యలనుండి వారిని కాచి కాపాడతానని దేవుడు వారికి అభయాన్ని ఇస్తున్నారు. గ్రుడ్డివారు చూతురని, చెవిటి వారు విందురని, కుంటివారు నడచునని, మూగవారు మాట్లాడుదురని ప్రవచించారు. ఈ ప్రవచనం దేవుని కుమారుడైన క్రీస్తునందు నెరవేరియున్నది.

దేవుడు నమ్మక పాత్రుడు, నమ్మదగిన వాడు. తన ప్రజల పట్ల ఎంతో ఆసక్తిని చూపువాడు అని యెషయ ప్రవచనం ద్వారా తెలియుచున్నది. దేవుని దీవెనలు పొందాలంటే, ప్రజలు కూడా దేవుని వైపు మరలి, ఆయన యందు విశ్వాసము, నమ్మకం ఉంచాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. అనేకసార్లు ఇశ్రాయేలు ప్రజలు వారి విశ్వాస విషయములో తొట్రిల్లారు. అయినను, దేవుడు వారిని విడబాయక వారి వెన్నంటే ఉన్నారు.

రెండవ పఠనము: ఎవరిపట్ల పక్షపాతం చూపరాదు

రెండవ పఠనము అపోస్తలుడు యాకోబు వ్రాసిన లేఖనుండి వినియున్నాము. సంఘములో గొప్పవారని, పేదవారని, ఎవరిపట్ల పక్షపాతమును చూపవద్దని బోధిస్తున్నారు. లోక విషయాలను బట్టి (ధనము, అధికారము) ఎవరిని తక్కువ, ఎక్కువ చేసి చూడవద్దు. దేవుని దృష్టిలో అందరు సమానమే! లోక విషయాలకు ప్రాముఖ్యతను గాక, వ్యక్తులకు ప్రాముఖ్యతను ఇవ్వడం మనం నేర్చుకోవాలి. బాహ్యముగా చూసి వ్యక్తులను అంచనా వేయరాదు. “ఈ లోక విషయములలో పేదలగు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగ ఉండుటకును, తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనెను” (2:5).

సువార్త పఠనము: ఆధ్యాత్మిక అంధత్వం నుండి వెలుగునకు (సత్యము) తెరువబడాలి

నేటి సువార్త పఠనమును మార్కు నుండి వినియున్నాము. యేసు అన్య ప్రజల ప్రాంతములో ఉన్నారు. అచట మూగ, చెవిటి వానిని యేసు తన శక్తితో స్వస్థపరచిన విషయం వివరించ బడినది. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్ధించారు. అనగా తండ్రి దేవుని శక్తి సహాయం కొరకు ప్రార్ధించారు. తండ్రి చిత్తము నెరవేరాలని ప్రార్ధించారు.

యేసు తన బహిరంగ ప్రేషిత కార్యములో అనేకమందిని స్వస్థత పరచారు. కనుక, యేసు రాకతో, యెషయ ప్రవచనం నెరవేరినది. వినుట, మాట్లాడుట దేవుని వరములు. ఈ వరములు లేని వ్యక్తిని చూసి యేసు దయను, కనికరమును చూపారు. తన వాక్కుతో (ప్రార్ధన, ఇతర పలుకులు), కార్యములతో (చెవులలో వ్రేళ్ళు పెట్టడం, ఉమ్మి నీటితో నాలుకను తాకడం) ఆ వ్యక్తిని స్వస్థత పరచి, సంపూర్ణ వ్యక్తినిగా మార్చారు.

యేసునందు విశ్వాసం ఉంచువారికి తప్పక స్వస్థత కలుగును. ఆయన తాకిడి మనకు స్వస్థతను కలుగజేసి మనలను సంపూర్ణులను చేయును. జ్ఞానస్నానం పొందినప్పుడు, మన చెవులు, పెదవులు తాకబడ్డాయి. ఈవిధముగా, మనం కూడా ఈ మూగ, చెవిటి వాని కథలో భాగస్తులం అవుచున్నాము.

ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థత పరచునపుడు అరమాయిక్ భాషలో “ఎఫ్ఫతా” అని పలికారు. అనగా ‘తెరువబడును’ అని అర్ధము (మార్కు. 7:34). క్రీస్తునందు సత్యమునకు మనం తెరువ బడాలి. ఎందుకన, ఆయన సమస్తమును చక్కపరచువాడు (మార్కు. 7:37). నేడు మనం (ఈ లోకం) అనేక విషయాలలో ఆధ్యాత్మిక అంధత్వముతో, ఆధ్యాత్మిక మూగతనముతో ఉంటున్నాము. దీని వలన, సత్యమును తెలుసుకోలేక పోవుచున్నాము. దేవునితో మాట్లాడలేక పోవుచున్నాము. దేవుని వాక్యమును వినలేక పోవుచున్నాము. కనుక నిజ దేవుడైన క్రీస్తు నందు సత్యమునకు మనం తెరువబడాలి (ఎఫ్ఫతా”). అంధత్వము నుండి వెలుగులోనికి నడిపించ బడాలి.

వినుట, మాట్లాడుట వరములను పొందిన వ్యక్తి, యేసు చేసిన సంపూర్ణత గురించి ప్రచారం చేసాడు. అనగా, మనం కూడా సువార్తను మన మాటలద్వారా, చేతలద్వారా ఇతరులకు ప్రకటించాలి. దేవుని వాక్యమును ఆలకించాలి, ధ్యానించాలి.

22వ సామాన్య ఆదివారము, Year B

 22వ సామాన్య ఆదివారము, Year B
ద్వితీయ. 4:1-2, 6-8; యాకో. 1:17-18, 21-22,27; మార్కు. 7:1-8, 14-15, 21-23


“వెలుపలనుండి లోపలికిపోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు. కాని, లోపలినుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును” (మార్కు 7:15). పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు న్యాయనిపుణులు. చట్టాన్ని అక్షరాల పాటించేవారు (చదువుము. ద్వితీ. 4:1). అయితే, ఆ ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని లేదా దేవుడు ఒసగిన ఆజ్ఞల ఉద్దేశాన్ని పక్కనపెట్టేవారు. బాహ్యపరమైన ఆచారాలకు, సంప్రదాయాలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు. బాహ్యపరమైన శుద్ధికి ప్రాముఖ్యతను ఇచ్చేవారు, కాని అంత:ర్గత పవిత్రతను నిర్లక్ష్యం చేసేవారు.

అందుకే, యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యేసు వద్దకు వచ్చి, “తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్కచేయక, మలిన హస్తములతో భుజించు చున్నారేమి?” అని ప్రశ్నించారు. అప్పుడు యేసు వారితో నైతికముగా ఏది ముఖ్యమో వారికి తెలియజేయు చున్నారు; అలాగే, వారి కపట భక్తిని బట్టబయలు చేయుచున్నారు.

సంప్రదాయాలను యేసు ఎప్పుడు ఉల్లంఘించలేదు; అలా చేయమని ఎప్పుడుకూడా యేసు తన శిష్యులకు చెప్పలేదు. దానికి బదులుగా, “నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దుచేయ వచ్చితినని తలంప వలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే గాని, రద్దుచేయుటకు కాదు” (మత్త. 5:17) అని స్పష్టం చేసియున్నారు.

యూదులకు “ధర్మశాస్త్రము” లేదా “చట్టము” అనగా ఒకటి వ్రాతపూర్వకమైన చట్టం, రెండు మౌఖిక (నోటమాట జెప్పిన) చట్టం. వ్రాతపూర్వకమైన చట్టం బైబులులోని మొదటి ఐదు గ్రంథాలు (‘తోరా’ అని పిలుస్తారు). కొన్నిసార్లు దీనిని ‘మోషే చట్టం’ అని కూడా పిలుస్తారు. చాలాకాలముగా, యూదులు వ్రాతపూర్వకమైన చట్టముతో సంతృప్తి చెందారు. దీనిని తమ జీవితాలలోనికి అన్వయించుకొని జీవించారు.

అయితే, కాలక్రమేణా, ధర్మశాస్త్ర బోధకులు ఈ వ్రాతపూర్వకమైన చట్టం, అర్ధంచేసుకోవడానికి కష్టంగా యున్నదని తలంచారు. దీనికి వివరణ ఇవ్వాలని భావించారు. దానిఫలితముగా, అది మౌఖిక (నోటమాట జెప్పిన) చట్టానికి లేదా సంప్రదాయాలకు దారి తీసింది. వాటిలో ఒకటే, భోజనమునకు ముందుగాని, ప్రార్ధనకు ముందుగాని చేతులు కడుగు కొనవలయును అను చట్టము. ఈ సంప్రాదాయాల వెనుక ఉన్న ఉద్దేశ్యం చాలా మంచిదే! కాని కాలక్రమేణా, ఈ సంప్రదాయాలు బాహ్యపరమైన మతాచారాలుగా మారిపోయాయి.

యేసు జీవించిన కాలానికి, శుద్ధత, ఆశుద్ధత గూర్చి ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. మొదటి పఠనములో విన్నట్లుగా, మోషే ఇశ్రాయేలు ప్రజలతో, “నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చేర్చరాదు. వానినుండి యేమి తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు” (ద్వితీయ. 4:2) అని స్పష్టం చేసారు.

అన్ని భక్తికార్యాలు, సంప్రదాయాలు, పద్ధతులు చెడ్డవి కావు. అయితే క్రీస్తు, పరిసయ్యుల వైఖరిని ఖరాఖండిగా వ్యతిరేకించారు. కేవలం బాహ్యపరమైన చర్యలు, క్రియలు ఒక వ్యక్తియొక్క మతతత్వాన్ని కలిగియుండటాన్ని యేసు వ్యతిరేకించారు. అయితే, ఈ సంప్రదాయాలను ప్రదర్శనకోసం, ఇతరుల మెప్పుకోసం, లేదా వారు ఎంత ధర్మాత్ములని ఇతరులకు చూపించడం కోసం పాటించడం అనేది చాలా దారుణం! మరోమాటలో చెప్పాలంటే, కేవలం కర్మ క్రియలను పాటించడం కోసం, చట్టం యొక్క నిజమైన ఉద్దేశ్యం కనుమరుగై పోయింది. పరిశుభ్రతకు చేతులు, పాత్రలు శుభ్రపరచు ఆచారాలు అవసరమైనప్పటికినీ, అవి ఒక వ్యక్తియొక్క అంత:ర్గత శుద్ధీకరణను తెలియజేయలేవు అని ప్రభువు తెలియజేయు చున్నారు.

ప్రక్షాళన కర్మను (బాహ్యపరమైన శుద్ధి) పాటిస్తే ప్రజలు శుద్దులవుతారని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అనుకున్నారు. దేవుని చట్టాన్ని పాటించడంలోగల నిగూఢ అర్ధాన్ని వారు గ్రహించలేక పోయారు. కేవలం బాహ్య పరమైన ఆచారాలు, సంప్రదాయాలుగా మిగిలిపోయాయి. వాటిని అక్షరాల పాటిస్తారు కాని, వారి హృదయాలలో ఇసుమంతైన ప్రేమకూడా లేదు. ప్రేమలేని జీవితం, మనం ఎన్ని కర్మక్రియలు, చట్టాలు పాటించినా హృదాయే అని నేడు మనం గ్రహించాలి.

అందుకే యేసు వారితో యెషయా ప్రవక్త ప్రవచనాన్ని పలుకుతూ, “కపట భక్తులారా! ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించు చున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్ధము” (మార్కు. 7:6-7; చదువుము. యెషయ 29:13) అని పలికారు. వారు బోధించే దానికి వారు చేసే కార్యాలు విరుద్ధముగా ఉన్నాయని వారిని విమర్శించారు. దేవుని చట్టం పట్ల వారి ఉత్సాహం కేవలం నోటి మాటకు మాత్రమే, అయితే కార్యాలు మాత్రం శూన్యం! ఇక్కడ రెండు విషయాలు గమనించుదాం: ఒకటి బాహ్యపరమైన ఆచారాలను ప్రేమ లేకుండా పాటించడం; రెండు, మాటలకు, చేష్టలకు పొంతన లేకపోవడం.

భోజనానికి ముందుగాని, ప్రార్ధనకు ముందుగాని చేతులు కడుక్కోక పోవడం ఒక వ్యక్తి శుద్దుడా, ఆశుద్ధుడా అని చెప్పలేము. చేతులు కడుక్కోకుండా తినడం వలన ఒక వ్యక్తి ఆశుద్ధుడు కాడు. ఒక వ్యక్తిని ఆశుద్ధపరచునది, మాలిన్యపరచునది వారి అంతరంగము నుండి లేదా హృదయమునుండి వెలువడునదియే. “హృదయమునుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును” (మార్కు. 7:21-23). వీటినుండి మనం ఎలా శుద్దులం కావాలని ఆలోచించాలి!

అన్నింటికన్న ముఖ్యమైనది ప్రేమ: కేవలం మనం చేసే బాహ్య క్రియలను, కర్మలను బట్టి మన మతాన్ని లేదా నేను మతస్థుడనని గుర్తించ కూడదు. ఉదాహరణకు: ఆదివారాలలో దేవాలయానికి వెళ్లి పూజలో పాల్గొనడం, జపాలు వల్లించడం, బైబులు చదవడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, దీక్షలు తీసుకోవడం, దానధర్మాలు చేయడం.... ఇవి మన పవిత్రతకు హామీ ఇవ్వలేవు. అన్నింటికన్న ముఖ్యమైనది, అవసరమైనది మన హృదయాలలో ప్రేమ. ఆ నిజమైన ప్రేమ ఉన్నప్పుడే మనస్పూర్తిగా పై కార్యాలను చేయగలం. నేను దేవున్ని అమితముగా ప్రేమిస్తున్నాను కనుక నేను దేవాలయమునకు వెళ్లి పూజలో పాల్గొంటాను. నేను ఇతరులను ప్రేమిస్తున్నాను కనుక దానధర్మాలు చేస్తాను. మన హృదయములో గర్వము, అహంభావము ఉన్నచో, మనలో ప్రేమ లేనిచో, ఇవన్ని మనలను పవిత్రులుగా చేయలేవు.

ఈనాటి రెండవ పఠనములో యాకోబు ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నారు: “తండ్రియైన దేవుని దృష్టిలో పవిత్రమును, నిష్కళంకమునైన మతమేదనగా – అనాధలను, విధవరాండ్రను, వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండ, తనను తాను కాపాడుకొనుట అనునవియే” (యాకో. 1:27). “వాక్యమును కేవలం వినుటయేనని ఆత్మవంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు” (1:22) అని యాకోబు తెలియజేయు చున్నారు. దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలి, ప్రార్ధించాలి, ముఖ్యముగా దానిని ఆచరించాలి. “దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు” (లూకా. 11:28).

బైబులు ప్రకారం, హృదయం జ్ఞానమునకు, భావాలకు, భావోద్వేగాలకు, నిర్ణయాలకు నిలయం. ఉదాహరణకు, “నన్ను ప్రభువుగా గుర్తింప వలెనన్న కోరికను వారికి కలిగింతును. వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడనగుదును. వారు పూర్ణహృదయముతో నా వద్దకు తిరిగి వత్తురు” (యిర్మీ. 24:7). హృదయమునుండియే మంచి చెడులు వెలువడును (మత్త. 7:21; లూకా. 6:45). హృదయం విశ్వాసమునకు మూలం (రోమీ. 10:10). జ్ఞానము యొక్క ఆలయము (1 రాజు. 3:12). అలాగే, హృదయం ఒక వ్యక్తికి, వ్యక్తిత్వానికి తార్కాణం. మనకున్నది ఒకే హృదయం. దానిని దేవునికి అర్పించుదాం. “దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక!” (2 తెస్స. 3:5).

ప్రతీ దేశములో, ప్రతీ రాష్ట్రములో, ప్రతీ గ్రామములో, ప్రతీ కుటుంబములో, ప్రతీ వ్యక్తిలో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్ని కూడా ముఖ్యమే ఎందుకన, సమాజములో స్థిరత్వాన్ని, అవగాహనను, క్రమాన్ని కలిగిస్తాయి. అయితే, మనకు భిన్నమైన సంప్రదాయాలు ఉండటం వలన, ఇవి ఒక్కోసారి అనైఖ్యతకు, అపార్ధాలకు కూడా దారి తీస్తాయి. కనుక, మన సంప్రదాయాల పట్ల సరైన అవగాహన మనకు ఉండాలి, లోతైన భావాన్ని ఎరిగి యుండాలి. వాటిని గుడ్డిగా కాకుండా, అర్ధవంతముగా పాటించడానికి ప్రయత్నం చేయాలి.

21వ సామాన్య ఆదివారము, Year B

 21వ సామాన్య ఆదివారము, Year B
యెహోషు. 24:1-2, 15-18; ఎఫెసీ. 5:21-32; యోహాను. 6:60-69
యేసు: జీవవాక్కు

యూదులు అనేకమంది యేసు బోధనలకు, కార్యాలకు ఆకర్షింపబడ్డారు. యేసు ఎక్కడికి వెళ్లినను ఆయనను వెదికి అనుసరించారు. యేసు ఎప్పుడైతే “జీవాహారము”ను గురించి బోధిస్తూ, “నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును” (యోహాను. 6:54) అని చెప్పారో, అది విని, అనేకమంది శిష్యులు “ఈ మాటల కఠినమైనవి. ఎవరు వినగలరు?” అని చెప్పుకున్నారు. ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి, మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. ఎందుకన, వారు ఆయనను విశ్వసించ లేదు. యేసు బోధను అంగీకరించలేక పోయారు. ఇలా కఠినమైనవిగా భావింప బడిన బోధనలు ఎన్నో ఉన్నాయి.

మొదటి పఠనములో మనం చూసినట్లయితే, యెహోషువ, తన జీవితములో అప్పజెప్పబడిన బాధ్యతను ముగించిన తరువాత, చివరిలో ఇశ్రాయేలు ప్రజలను సమావేశ పరచి, వారందరు ఒక నిర్ణయం చేయాలని కోరారు. యావేనా లేక మరియొకరిని పూజింతురో నిర్ణయం చేయాలని కోరారు. యెహోషువ, “నేనూ, నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము” అని స్పష్టం చేసారు. అప్పుడు వారందరు “మేమును యావేను పూజింతుము అతడే మాకును దేవుడు” అని నిర్ణయించారు.

అలాంటి నిర్ణయమే తన పన్నిద్దరు శిష్యులు కూడా చేయాలని, వారితో, “మీరును వెళ్లిపోయెదరా?” అని అడుగగా, సీమోను పేతురు, “ప్రభూ! మేము ఎవరి యొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి. నీవు దేవునినుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి” అని అన్నారు.

జీవవాక్కుగల యేసును ప్రభువుగ మన హృదయాలలో ప్రతిష్టించు కోవాలి. ఆ జీవవాక్కును మనం అనుదిన జీవితములో ఆచరించాలి. గొప్ప నమ్మకముతో, విశ్వాసముతో ప్రభువును అనుసరించాలి. మనం ఎవరి యొద్దకు పోయెదము? సర్వము ఆయనే! ప్రేమ, క్షమ, శాంతి, నిరీక్షణ, రక్షణ....

సాధారణంగా, మన జీవితాలకు వ్యతిరేకముగా, విరుద్ధముగా లేనంతవరకు మనము కూడా దేవుని వాక్కును అంగీకరిస్తాము. ఏదైతే, మన జీవితాలకు, ఆలోచనలకు అడ్డుగా ఉంటుందో, దానిని కఠినమైనదిగా భావిస్తూ ఉంటాము. నోటితో పలికిన మాటలను మనం ఆచరించడములో విఫలమవుతాము. ఇశ్రాయేలు ప్రజలు కూడా యావే మా దేవుడు అని పలికారు, కాని ఆ తరువాత అనేకసార్లు  దేవున్ని తృణీకరించారు, విడనాడారు. ఇతర దేవుళ్ళను కొలిచారు. “అన్యదైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు” (కీర్తన. 16:4) అన్న వాక్యాన్ని గుర్తుకు చేసుకుందాం. అలాగే, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో శ్రమలను అనుభవించారు.

పేతురు చెప్పిన నిత్యజీవపు మాటలను బైబులులో చూడవచ్చు. అందుకే, మనం ప్రతీ రోజు బైబులును చదవాలి, ధ్యానించాలి, ఆచరించాలి. దివ్యపూజ కూడా మనం దేవుని వాక్కును చదువుకొని ధ్యానిస్తూ ఉంటాము. మన రక్షణకు, దేవుని వాక్కు, క్రీస్తు శరీర రక్తములు (దివ్యసత్ప్రసాదం) ఎంతో ముఖ్యమైనవి. మన నిత్యజీవితానికి అవి ఎంతో అవసరం. ఒక్కోసారి, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము.

రెండవ పఠనం కేవలం భార్యాభర్తల గురించి లేక వివాహము గురించి చర్చించడం లేదు; ప్రధానముగా ‘వివాహము’ అను ఉదాహరణను బట్టి, క్రీస్తుతో మన సంబంధం ఎలా ఉండాలి అన్న అంశాన్ని గురించి బోధిస్తుంది. క్రీస్తుతో మన బంధం ప్రేమతో ఉండాలి. నమ్మకం, విశ్వాసం ఉండాలి. చిన్న కష్టం వస్తే విడాకులు తీసుకొనే ఈ రోజుల్లో, ఏ సంక్షోభం వచ్చినను, క్రీస్తుతో మన బంధం దృఢముగా ఉండాలి.

మనం కూడా అలాగే ఆలోచిస్తున్నామా? క్రీస్తును అనుసరిస్తే, అంతా సులువుగా ఉంటుందని అనుకుంటున్నామా? మనం అనుకున్నది జరగకపోతే, దేవాలయానికి వెళ్ళడం మానేస్తాము, వాక్యాన్ని ఆలకించము. కొంతమంది, సంఘాన్ని కూడా విడిచి వెళ్లిపోతారు. మన సంగతి ఏమిటి? ఆత్మపరిశీలన చేసుకుందాం! యెహోషువ, పేతురువలె, మన దేవుని కొరకు, క్రీస్తు కొరకు నిర్ణయం చేద్దాం!

19వ సామాన్య ఆదివారము, Year B

19వ సామాన్య ఆదివారము, Year B
1 రాజు. 19:4-8; ఎఫెసీ. 4:30-5:2; యోహాను. 6:41-51
“నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును”

ఐదు వేల మందికి ఆహారమును ప్రసాదించి, వారి శారీరక ఆకలిదప్పులను తీర్చిన ప్రభువు, ఇప్పుడు వారి ఆధ్యాత్మిక ఆకలి తీర్చుట గురించి మాట్లాడుచున్నారు. “నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును” (6:41) అని యేసు చెప్పారు. అందులకు, యూదులు గొణగ సాగిరి. “ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాదా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయిన తాను పరలోమునుండి దిగివచ్చితినని ఎటుల చెప్పగలడు? అని చెప్పుకొనసాగిరి” (6:42). ప్రభువు మాటలను వారు అర్ధం చేసుకోలేక పోయారు. వారి మనస్సులు అంధకారములో మునిగిపోయాయి. యేసు మాటలను ఆలకించక, ఆయనను ప్రశ్నించాలని చూసారు. వారి హృదయ కాఠిన్యత వలన, వారు సత్యమును గ్రహించలేక పోయారు.

మనలో చాలామందిమి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. కతోలిక ప్రభోదములను ఆలకించక, అర్ధంచేసుకొనకుండా, తప్పుబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అధికారమును, సిద్ధాంతాలను ప్రశ్నించడానికి, సవాలు చేయడానికి సిద్ధముగా ఉంటాము. పరిశుద్ధాత్మ స్వరమును ఆలకించడానికి సిద్ధముగా ఉండము.

కనుక, కొన్నిసార్లు, మౌనధ్యానం ఎంతో అవసరం. మౌనముగా యున్నప్పుడే, దేవుని స్వరమును వినగలము. మనం విన్నదానిని, ప్రార్ధనా పూర్వకముగా ధ్యానించాలి. సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నం చేయాలి.  

ప్రభువు పలికిన మాటలకు అర్ధమేమి? తండ్రి దేవుడు మనకు నిత్యజీవమును ఒసగుటకు, మనతో వాసము చేయుటకు యేసును మనమధ్యలోనికి పంపారు. అందుకే యేసు దివ్యసత్ప్రసాదమును స్థాపించారు. దివ్యపూజాబలి ద్వారా, క్రీస్తు మనతో వాసము చేయుచున్నారు. కనుక, క్రీస్తు సాన్నిధ్యమును మనం అనుభవించాలంటే, ప్రతీరోజు దివ్యపూజా బలిలో పాల్గొనాలి. దివ్యసత్ప్రసాదమును స్వీకరించాలి. ప్రార్ధన చేయాలి. సేవా కార్యాలు చేయాలి. దేవునకు కృతజ్ఞులమై జీవించాలి. దివ్య పూజలో, తన శరీర రక్తముల ద్వారా, మనకు రక్షణను, జీవమును, శక్తిని ఒసగుచున్నారు. “జీవాహారమును నేనే... దీనిని భుజించువారు, మరణింపరు... వారు నిరంతరం జీవించును (6:48-51).

మనమందరం పైకి ఎదగాలని చూస్తాము. ఇతరులకన్న ఎంతో ఎత్తులో ఉండాలని ఆరాట పడతాము. ఎత్తు ఎదిగిన తరువాత, కిందవారిని చిన్నచూపుతో చూస్తాము. కాని, దైవ కుమారుడు మనకోసం పరలోకము నుండి కిందికి దిగివచ్చారు. తననుతాను రిక్తునిగా చేసుకొని మనతో సమానముగా నిలిచారు. మనకోసం “జీవాహారము”గా మారారు. మానవాళి ఆకలిదప్పులను తీర్చుతున్నారు. ప్రజలు మెస్సయ్య, అభిషిక్తుడు పరలోకమునుండి దిగివస్తారని ఎదురుచూసారు. “నేనే ఆయనను” (యోహాను. 8: 24, 28) అని ప్రభువు తెలిపియున్నను, వారు విశ్వసింపలేక పోయారు. “ఈయన ఎక్కడి వాడో మనమెరుగుదుము. కాని ‘క్రీస్తు’ వచ్చినపుడు ఆయన ఎక్కడ నుండి వచ్చునో ఎవరికిని తెలియదు” (యోహాను. 7:27) అని పలికారు.

కనుక క్రీస్తునందు విశ్వాసము ఎంతో ప్రాముఖ్యము. “నన్ను విశ్వసించువారు నిత్యజీవము పొందును” (యోహాను. 6:47) అని ప్రభువు చెప్పియున్నారు. తనను విశ్వసించు వారికి నిజమైన, శాశ్వతమైన ఆహారమును ఒసగును. “వినుము! నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును. అతడును నాతో భుజించును” (దర్శన. 3:20).

వాక్కు శరీరధారియైనట్లుగా, క్రీస్తు శరీరము మనకోసం జీవాహారముగా మారుచున్నది. ఎంత అద్భుతం! ఎంత గొప్ప వరం! క్రీస్తువలె మనం కూడా ఇతరులకు “ఆహారము” కావలెను. అనగా ఇతరుల జీవితాలను నిర్మాణాత్మకముగా మార్చుటకు, ఆధ్యాత్మికముగా పోషించుటకు ప్రయత్నం చేయాలి.

రెండవ పఠనము: “దేవుని పోలి జీవింపుడు” (5:1) అని పౌలు ఎఫెసీయులను కోరుచున్నారు. అవును! నిజమే! మనం దేవుని ప్రియమైన బిడ్డలము కనుక ఆయనను పోలి జీవించాలి. “మీ దేవుడను ప్రభువునైన నేను పవిత్రుడను. కనుక మీరును పవిత్రులై యుండుడు” (లేవీ. 19:2) అని యిస్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించారు. ‘పవిత్రులై యుండుడు’ అనగా ‘దేవుని పోలి యుండుట’.

అయితే, దేవుని పోలి జీవించుటలో మనకు ఆదర్శం “క్రీస్తు” అని పౌలు స్పష్టం చేయుచున్నారు: “వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరుపులుగాని, అవమానములుగాని ఇక ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను” (ఎఫెసీ. 4:31-32; 5:2). అలాగే, దుర్గుణాలను త్యజించాలి, సద్గుణాలను అలవరచుకోవాలి.

క్రీస్తును ఆదర్శముగా చేసుకొని జీవించుటకు పవిత్రాత్మ దేవుడు మనకు సహాయం చేయును: “దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలయన, దేవుడు మీకు స్వేచ్చను ఒసగెడు రోజు రానున్నది అనుటకు అది నిదర్శనము” (4:30).

మొదటి పఠనము: ఏలియా గొప్ప ప్రవక్త. కాని తన జీవితములో కూడా విశ్వాస సంక్షోభాన్ని ఎదుర్కున్నారు. తనను చంపాలని తలంచిన వారి బారినుండి, హోరేబు (సినాయి) కొండకు ప్రయాణమై పోవుచున్న ఏలియా ఆకలిదప్పులతో అలసిపోయి, ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడువ గోరినప్పుడు, దేవుడు తన దూతద్వారా అతనికి భోజనమును ప్రసాదించారు. ఏలియా ఆ ఆహారపు బలముతో నలుబది రోజులు నడచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నారు.

ఆధ్యాత్మిక ఆకలిదప్పులు గలవారికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అంతా అయిపోయింది, మరణమే ఇక గత్యం అని తలంచిన ప్రవక్తను దేవుడు పునరుద్ధరించారు. శారీరక ఆకలిదప్పులను మాత్రమేగాక, అతని ఆధ్యాత్మిక ఆకలిని కూడా తీర్చారు. అతని శారీరక ఆకలిదప్పులను రొట్టె, నీటితో తీర్చారు. అతని ఆధ్యాత్మిక ఆకలిదప్పులను తన సాన్నిధ్యముతో తీర్చారు.

మనం కూడా మన అనుదిన జీవితములో ఏలియావలె ఆధ్యాత్మిక సంక్షోభాన్ని చవిచూడవచ్చు. అలాంటి క్లిష్ట సమయములో దేవునిపై ఆధారపడుదాం. “జీవాహారము” అయిన క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉందాము.

18వ సామాన్య ఆదివారము, Year B

18వ సామాన్య ఆదివారము, Year B
నిర్గమ 16:2-4, 12-15; ఎఫెసీ 4:17, 20-24; యోహాను 6:24-35
మన ఆధ్యాత్మిక అవసరత: క్రీస్తు - నిత్య జీవాహారము


గతవారం, యేసు ఐదు రొట్టెలను, రెండు చేపలను ఐదువేల మందికి పైగా నున్న జనసమూహమునకు [శారీరక / భౌతిక] భోజనముగా పంచడం గూర్చి ధ్యానించాం. వారందరు తృప్తిగ భుజించారు. అనంతరం, ప్రభువు, తన శిష్యులు గలిలీయ సరస్సు ఆవలివైపునకు వెళ్ళారు. ఆ తరువాత జరిగిన సంఘటనలను, నేటి సువిశేష పఠనములో చదువుచున్నాము.
ప్రజలు యేసును వెదకుచు పడవలపై కఫర్నాములో సరస్సు అవలివైపున ఆయనను కనుగొన్నారు. వారి ‘శారీరక’ లేదా ‘భౌతిక’ ఆకలిదప్పులు తీర్చినందున, ప్రజలు యేసును రాజును చేయ ప్రయత్నించారు (6:15). అంతేకాకుండా, ఆ రొట్టెలు మాకు ప్రతీరోజు కావాలని ప్రభువును వెదుక్కుంటూ వచ్చారు! కాని ప్రభువు వారితో, “మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత చిహ్నములను చూచి కాదు” (6:26) అని నిశ్చయముగా చెప్పియున్నారు. అనగా, వారు యేసును మెస్సయగా విశ్వసింపలేదు. విశ్వసించుటకు ఎట్టి గురుతును ఇచ్చెదవని, ఏ క్రియలు చేసెదవు అని వారు యేసును ప్రశ్నించారు. ఈవిధముగా, వారు కేవలం అశాశ్వతమైన భోజనముకై శ్రమిస్తున్నారని, వెదకుచున్నారని నిర్మొహమాటముగా ప్రభువు వారితో స్పష్టం చేసియున్నారు.
ప్రజలు వారి ఆలోచనలకు నిదర్శనముగా, తరువాత భాగములో, మోషే ఎట్లు ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ప్రసాదించారో, అటులనే యేసుకూడా వారికి భోజనం ప్రసాదించాలని ఆశించారు. అనగా, ప్రతీరోజు వారికి రొట్టెలు లేదా భౌతిక ఆహారాన్ని ఒసగాలని కోరుచున్నారు.
కాని యేసు ఆశ్చర్యకరముగా వారితో, “నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువారు ఎన్నటికిని ఆకలిగొనరు. నన్ను విశ్వసించువారు ఎన్నడును దప్పికగొనరు” (6:35) అని చెప్పారు. ప్రభువు వారికి పంచి యిచ్చిన రొట్టెలకు నిజమైన పరమార్ధాన్ని తెలియజేసారు. యేసు ఎడారిలో వారికి ప్రసాదించిన భోజనము లేదా ‘మన్నా’ వారి ఆత్మలకు ఒసగు ఆధ్యాత్మిక, నిత్య జీవాహారమునకు సూచనగా నున్నది తప్ప, అదే నిత్య జీవాహారము కాదు. దీనిని ప్రజలు అర్ధం చేసుకోలేక పోయారు. ఇంకా ఎక్కువ ఆహారము కొరకు ప్రభువును వెదకుచున్నారు. అందుకే, వారు యేసును కనుగొన్నప్పుడు, “అయ్యా! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము” (యోహాను. 6:34) అని అడిగారు. అనగా, వారు కేవలము శారీరక (అశాశ్వతమైన) భోజనము కొరకు మాత్రమే తాపత్రయ పడుతూ ప్రభువు వద్దకు వచ్చారు అని అర్ధమగుచున్నది.
ప్రియ సోదరులారా! మనకు శారీరక, మానసిక అవసరాలతోపాటు, ఆధ్యాత్మిక అవసరాలు కూడా ఎంతో ముఖ్యము అని గుర్తించాలి. కనుక, కేవలం శారీరక అవసరాల కొరకేగాక, ఆధ్యాత్మిక అవసరాల కొరకు కూడా మనం శ్రమించాలి, తృష్ణ కలిగి యుండాలి. “నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు” (6:27) అని ప్రభువే స్వయముగా ఆదేశించారు. అలాగే, “మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు. కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును” (మత్త. 4:4) అని ప్రభువు సైతానుతో చెప్పారు. “నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తిచేయుటయు నా ఆహారము” (యోహాను. 4:34) అని యేసు పలికారు.
సమరీయ స్త్రీతో ప్రభువు, “ఈ నీటిని త్రాగువారు ఎన్నటికిని దప్పికగొనరు, నేను ఇచ్చు నీరు, వారి యందు నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును” (యోహాను. 4:13-14) అని పలికినప్పుడు, సమరీయ స్త్రీ వెంటనే, ఈనాటి సువిషశములోని ప్రజలవలెనే, “అయ్యా! నేను మరల దప్పిక గొనకుండునట్లును, నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము” (4:15) అని అడిగింది. ఆ స్త్రీ కూడా కేవలం శారీరక, అశాశ్వతమైన నీటి కొరకు మాత్రమే అడిగింది. లోకాశలతో నిండినవారు ఆధ్యాత్మిక విషయాలను గ్రహించలేరు అన్న వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు!
అందుకే, నేటి రెండవ పఠనములో, “అంధకారమయమగు మనస్సులు కలవారును అయిన అన్యజనులవలె మీరు ఇక ప్రవర్తింపరాదు. వారు అవివేకులును మూర్ఖులును అగుటచే దేవుని జీవితమునుండి దూరమైరి. వారికి సిగ్గులేదు. వారు దురభ్యాసములకు తమనుతాము అర్పించుకొని, అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములగు పనులను చేయుచుందురు” (ఎఫెసీ. 4:18-19) అని పౌలు విశ్వాసులకు ఉపదేశించారు. పాపమును, స్వార్ధమును వీడి నిత్యజీవము కొరకు జీవించాలని, యేసు నందు కేంద్రీకృతమై జీవితములో ఒక ధ్యేయము కలిగి జీవించాలని  పౌలు కోరుచున్నారు. క్రీస్తునందు నూతన జీవితమును జీవించాలని పౌలు కోరుచున్నారు. “క్రీస్తునందు నూతన జీవితము” అనగా రూపాంతరము చెందిన జీవితము. సువార్తా విలువలు కలిగిన జీవితాన్ని జీవించడం. కొంతమంది పుట్టుకతో అన్యులుగా జీవిస్తే, కొంతమంది, క్రీస్తునందు విశ్వాసమును కోల్పోయి అన్యులుగా జీవిస్తున్నారు. ‘దేవుడు ఎట్టి పక్షపాతములేక అందరిని సమదృష్టితో చూచును. దేవునికి భయపడుచు, సత్రవర్తన కలవారు ఏ జాతివారైనను దేవునికి అంగీకార యోగ్యులే!’ (అ.కా. 10:34-35) అని పేతురు బోధించారు.  
ప్రియ సోదరులారా! పని, సంపాదనలో పడిపోయి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. నేడు మనం ఇహలోకపు వస్తువులందు ‘సంతృప్తిని’ కనుగొన వెదకుచున్నాము. దేవుని అవసరత మనకు ఎంతగానో యున్నదని, శాశ్వతమైన వాటి కొరకు ప్రయాస పడాలని మనం తెలుసుకోవాలి. మనకు అన్ని యున్నను, యేసును గనుక మనము కలిగి లేనిచో, ఏదో వెలితి మనలో ఉంటుంది. ఆధ్యాత్మికత మనలో లేనిచో, మన జీవితాలు శూన్యమే!
అందుకే యేసు మనందరి కొరకు నేడు తననుతాను “జీవాహారము”గా ప్రకటిస్తున్నారు. ఆయన మనకు ఆధ్యాత్మిక ఆహారము. యేసు జీవాహారముగా, నేడు వాక్కునందు క్రీస్తు మనలను ఆధ్యాత్మికముగా పోషించుచున్నారు. అలాగే “జీవాహారము”గల యేసు దివ్యసత్ప్రసాదమును మనకోసం స్థాపించారు. ప్రతీ దివ్యపూజలో దివ్యసత్ప్రసాదముచేత మనం ఆధ్యాత్మికముగా పోషింప బడుచున్నాము. దివ్యసత్ప్రసాదములో ప్రభువు తన సంపూర్ణ శక్తితో కొలువై యున్నారు. దివ్యసత్ప్రసాదముద్వారా మనపై తన సంపూర్ణ ప్రేమను ప్రదర్శిస్తున్నారు. అనేకసార్లు, ఆయన ప్రేమను, కరుణను గ్రహించలేక పోవుచున్నాము. దేవుడు మన జీవితములో చేసిన మేలులకు, ఒసగిన వరములకు, మనం కృతజ్ఞులమై యుండటము లేదు.
ఈనాటి మొదటి పఠనములో విన్నట్లుగా, ఇస్రాయేలు ప్రజలవలె, మనముకూడా దేవునిపట్ల గొణుగుచూ ఉంటాము. అద్భుతరీతిన ఐగుప్తు బానిసత్వమునుండి దేవుడు వారిని రక్షించారు. ఎడారిలో ఆకలితో అలమటించుచున్న వారికి మన్నాను కురిపించి ఆకలిని తీర్చారు [హీబ్రూ - మన్హూ = “యిది ఏమి?” అని అర్ధం నిర్గమ 16:15. మొదటిసారిగా చూసినప్పుడు అది ఏమిటో వారికి అర్ధము కాలేదు]. దాహముగొన్న వారికి దాహమును తీర్చారు - మారా వద్ద చేదుగానున్న నీటిని, తియ్యని తాగునీటిగా మార్చాడు (నిర్గమ 15:22-25). ఆపదలనుండి, శత్రువులనుండి వారిని కాపాడారు. అయినను, వారు దేవునిపట్ల గొణిగారు. చివరికి అద్భుత రీతిన కురిపించిన ‘మన్నా’ పట్లకూడా తమ అసంతృప్తిని తెలియజేసారు, గొణుగు కొన్నారు (సంఖ్యా 11:6). ఎందుకంటే, వారు దేవున్ని పూర్తిగా నమ్మలేదు, విశ్వసించలేదు.
దేవుడు ఎడారిలో కురిపించిన “మన్నా” దేవుని సమకూర్పును, దేవుని విశ్వసనీయతను, మరియు ఆధ్యాత్మిక పోషణను సూచిస్తుంది. అందులకే ఆనాడు వారి ఆక్రందనను విని మన్నాను కురిపించిన తండ్రి దేవుడే, నేడు జీవాహారమును అయిన క్రీస్తును మనకోసం ఆశీర్వాదముగా, కృపగా కురిపించు చున్నారు. మనం పొందిన ఉత్తమమైన బహుమతి జీవాహారముగల క్రీస్తు. అదే గొప్ప బహుమతిని, వరమును, అనుగ్రహమును నేడు దివ్యసత్ర్పసాదము ద్వారా స్వీకరిస్తున్నాము.
దివ్యసత్ర్పసాదమును విశ్వసిస్తే, జీవాహారమును విశ్వసించి భుజిస్తే, మన జీవితాలు క్రీస్తువలె రూపాంతరం చెందాలి. అనగా, మనము కూడా క్రీస్తువలె, ఇతరుల (ఆధ్యాత్మిక) ఆకలిదప్పులుతీర్చుటకు ఆహారముగా మారాలి. మనం చేసే ప్రతీ చిన్న సహాయం ఇతరులకు ఆహారముగా, పోషణగా మారగలదు.