మరియమాత జన్మదినోత్సవం (8 సెప్టెంబరు)

మరియమాత జన్మదినోత్సవం (8 సెప్టెంబరు)
ఫా. ప్రవీణ్ గోపు OFM Cap.


మరియ – దేవుని తల్లి
మరియమాతను గురించి పునీత అల్ఫోన్సస్‌ లిగోరి ఈవిధంగా అన్నారు: ‘‘పరలోక వాక్కుకు తల్లిగానుండుటకు ఆమె ఎన్నుకోబడినది. అందుకే ఆమె నిష్కళంకోద్భవిగా - అనితర సాధ్యమైన గొప్పవరాలతో అభిషేకింపబడి జన్మించింది. పవిత్రతలో పునీతులను, దేవదూతలను మించింది. దేవుని తల్లిగా ఉండే అర్హతకై ఉన్నతమైన దైవవరానుగ్రహాలతో నింపబడినది. ఆమె అత్యంత అధికమైన పరమ పునీతగా జన్మించింది. తన సృష్టిలోనే అంతకు ముందెన్నడూ కలిగించనంత సుందరంగా ఆమె ఆత్మను దేవుడు తీర్చిదిద్దారు. ఇహపరలోక దృష్టిలో మనోహరమైన, అందమైన, ఆత్మకలిగి సంతోషపూరిత పాపగా ఆవిష్కరింప బడినది. ఆమె పరమ పావన దేవునికి అత్యంత ప్రియమైనదై, పూర్ణవరాలతో నింపబడినది. మనం మధురమైనట్టి ఆ పసిపాపను చేరి మహానందంతో పరవశించి పోదాం. ఆమె ‘‘జన్మపాపరహితోద్భవి. నిష్కళంక హృదయ మరియ నామధేయ. అదే ఆమె జన్మకు మన జన్మకు మధ్య తేడా.’’
పితదైవానికి ప్రియమైన కుమార్తె. ఈలోకంలో పునీత జ్వాకీము అన్నమ్మ సంతానంగా ఆవిర్భవించి, దేవుని ఏర్పాటు చొప్పున మానవ రక్షణ ప్రణాళికలో పరిశుద్ధ భాగస్వామిని అయ్యింది. ఈమెయే రెండవ ఏవ. పవిత్ర గొర్రెపిల్లను ప్రసవింపబోవు మహా మంచి తల్లి. దైవ రక్షణలో తొలిమెట్టు. సాతాను ప్రారబ్దానికి ఆఖరి మెట్టు. ఈ రెండవ ఏవ గురించి పరిశుద్ధ గ్రంథము, ఆది. 3:15, యెషయ 7:14లో దేవుని వాక్కుగా ప్రజావళికి తెలుపబడినది. యెరూషలేము పవిత్ర నగరమందు జన్మించినది. మొదటగా ఆరవ శతాబ్దంలో మరియ జయంతిని సిరియా లేక పాస్తీనాలో కొనియాడబడినట్లు తెలుస్తున్నది. మరో నూరేండ్ల అనంతరం రోమునగరంలో ఆమె జన్మదినోత్సవం జరుపబడటం ఆనవాయితి అయ్యింది.
యేసు జననం, బప్తిస్త యోహాను జననం, మరియమాత జనన ఉత్సవాల్ని శ్రీసభచే ఆరంభ సంవత్సరాలనుండే కొనియాడ బడుతున్నట్లు తెలుస్తోంది. నాలుగవ శతాబ్దంలోనే యెరూషలేములో పునీత అన్నమ్మగారి దేవళంలో, మరియ జయంతిని తొలిసారిగా కొనియాడారు. ఆ స్ఫూర్తితోనే రోమునగరములో శ్రీసభ ఆయమ్మ జనన వార్షికోత్సవాన్ని ఆచరించడం ఆరభించింది. క్రీస్తుయేసుద్వారా లోకరక్షణ ప్రణాళికలో ‘‘మేరిమాత జననం’’ ఒక ముఖ్య ఘట్టంగా దేవుడు ఏర్పరచినట్లు వేదాలు ఘోషిస్తున్నాయి. పూర్వవేద అంత్యానిక, నూతనవేద ఆరంభానికి మధ్యస్థ వేదాంత రేఖ ఆ జగజ్జనని జన్మదినం. మరయ నామం ఉన్నత దైవ వరానుగ్రహాలతో నింపబడినది.
మరియ – మనందరి తల్లి
సిలువపై వ్రేలాడుతూ మృత్యు ముఖంలోనున్న యేసు ప్రభువు రక్త సిక్తమైన తన దేహంతో ఒక ప్రక్క లోకపు పాపాన్ని మరోప్రక్క దేవుని కారుణ్యాన్ని భరిస్తూ మానవ దౌర్భల్యానికి, దేవుని వాత్సల్యానికి మధ్యన నలిగిపోతున్న తరుణంలో సిలువచెంత శోకమూర్తుల్లా నిలబడిన ఆయన తల్లి మరియ, ఆయన శిష్యుడు యోహాను ఆయనకు అంతిమ ఓదార్పుగా మిగిలారు. ఆ మహా భయంకరమైన క్షణంలో తండ్రి తనకు అప్పగించిన లోకకార్యాన్ని సంపూర్ణం కావించేముందు క్రీస్తుప్రభువు తన తల్లి మరియ మాతను మనందరికి తల్లిగా ఒసగారు (యోహాను 19:26-27). ప్రభువు తల్లితో, ‘‘స్త్రీ, ఇదిగో నీ కుమారుడు’’ తరువాత శిష్యునితో, ‘‘ఇదిగో నీ తల్లి’’ అని పలికారు. ఇలా మరణావస్థలో ప్రభువు పలికిన మాటలు తన తల్లిపట్ల తనకుగల ప్రేమాభిమానములను వ్యక్తం చేయటమేగాక, ప్రధానంగా మరియతల్లికి అప్పగింపబడనున్న రక్షణ ప్రణాళికను వెల్లడిస్తున్నాయి.
ప్రభువు తన తల్లిని మన తల్లిగా అప్పగించి అనంతరం, అంతయు పరిపూర్తియైనదని గ్రహించి, ‘‘అంతయు సమాప్తమైనది’’ (యోహాను 19:28) అని పలికి ప్రాణం విడిచారు. ఇలా మరియమాతను లోకమాతగా ప్రకటించడం, లోకరక్షణ బాధ్యతను మరియతల్లికి అప్పగించి వెళ్ళడం, రక్షణ ప్రణాళికలో భాగమే అని ప్రభువు పరోక్షంగా తెలియజేస్తున్నారు.
సృష్టి ఆరంభంలోనే ఎప్పుడైతే ఆది తల్లిదండ్రులు దేవుని మాటకు వ్యతిరేకంగా పాపము చేశారో అప్పుడే దేవుడు మరియతల్లిని రక్షణ ప్రణాళికలో భాగంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకే ‘‘నీకును స్త్రీకిని, నీ సంతతికిని, స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును’’ (ఆ.కాం. 3:15) అని దేవుడు పలికాడు. రక్షణ ప్రణాళికలో ఆ మరియతల్లి పాత్ర లేకపోతే, అనాడు తండ్రి దేవుడు ‘నీకును స్త్రీకిని అనకుండా స్త్రీ సంతతికి, నీ సంతతికి’ అని పలికే వాడు కదా! దేవుడు ఆవిధంగా పలకడంలో పరమార్ధం రక్షణ ప్రణాళికలో మరియతల్లి సైతానుతో పోరాడుతుందని అర్ధం. అనగా మరియతల్లి ఎన్నిక అప్పుడే జరిగింది.
అందుకే, ఎన్నోసంవత్సరాలుగా బిడ్డలు లేక బాధపడుతున్న అన్నమ్మ, జ్వాకీములకు పవిత్రాత్మ వరము వలన జన్మించింది కన్య మరియతల్లి. ఆ పుణ్యదంపతుల ప్రేమానురాగాలతో పెరుగుతూ మంచి నడవడికను, క్రమశిక్షణను, వినయ విధేయత అను సుగుణాలను అవరచుకున్నది. ముఖ్యంగా తన ప్రార్ధనా జీవితంద్వారా చిన్నతనంనుండే దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించింది. ప్రభువు కార్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధపడినది. ఎప్పుడైతే గబ్రియేలు దూత వచ్చి తండ్రి దేవుని సందేశాన్ని మరియతల్లికి తెలియజేసిందో, ‘‘నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక’’ (లూకా 1:38) అని తండ్రి మాటను విధేయించింది.
తల్లిలేని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవన యాత్రను కొనసాగించడం ప్రభువునకు ఇష్టంలేదు. కనుకనే, మనలను ఆ తల్లి చెంతకు నడిపించి మన రక్షణ భారాన్ని ఆ తల్లికి అప్పగించారు. ఆ తల్లి నిత్యం మనతో ఉంటూ మన అనుదిన జీవనంలో పాలుపంచుకొంటూ మనను దేవుని ప్రేమతో నింపుతూ ఆ ప్రభుని దరికి చేరుస్తుంది. కనుక, మనం మన కన్నతల్లి పట్ల ఏవిధంగా ప్రేమ చూపించి మనకు కావసిన అవసరాలను అడుగుటకు వెనకాడమో, అంతకంటే ఎక్కువ ప్రేమను మరియతల్లి పట్ల చూపుతూ మనకు కావలసిన అవసరాలను ఆ తల్లితో విన్నవించుకొంటూ ఆ తల్లిని అంటి పెట్టుకొని జీవిద్దాం.

No comments:

Post a Comment