పునీత జాన్ బ్రిట్టో (ఫిబ్రవరి 4)

పునీత జాన్ బ్రిట్టో (ఫిబ్రవరి 4)
గురువు, వేదసాక్షి, భారతదేశ అపోస్తులుడు క్రీ.శ. 1647-1693


జాన్ బ్రిట్టో పోర్చుగల్లు దేశంలోని లిస్బను నగరంలో 1647 మార్చి 1న జన్మించారు. ఇద్దరు అన్నలు, ఒక అక్క తర్వాత చివరి సంతానంగా పుట్టారు. తండ్రి డాన్ సాల్వడారు పోర్చుగల్లు రాజుకు సన్నిహితుడు. దేశ సేవల్లోనే ప్రాణాలర్పించాడు. అప్పటికి జాన్ గారికి నాలుగేండ్లు తండ్రిలేని బిడ్డ అయిన వీరి తల్లి, డోనా బైట్సు ప్రేమలో పెరుగుతూవచ్చారు.

ఆ రోజుల్లో వారు దేవుణ్ని, దేశాన్ని ప్రేమించేందుకు గొప్పగా గర్వపడేవారు. పులకించిపోయేవారు. రాజ కుటుంబం, రాజాస్థానంలో సన్నిహిత సంబంధాలుండటంతో రాకుమారుడైన పాత్రోకు జానుగారు మంచి స్నేహితులయ్యారు. రాజాస్థానంలో రాజభోగాలు అనుభవించడానికి అవకాశాలున్నాగాని జానుగారు బాల్యంనుండే ఆ వైభోగాలు, ఆడంబరాలన్నింటిని తృణీకరించారు. వారు భక్తిలోను చదువులోను మొదటివారుగా ఉండేవారు.

ఒకసారి జాన్ గారు తమ 11వ ఏట తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్లు నమ్మకం చెప్పలేక పోయారు. తల్లి బియాట్రిసు తన కుమారుని జబ్బు నయం చేయమని పునీత ఫ్రాన్సీస్ శారివారి మధ్యవర్తిత్వాన్ని వేడుకుంది. వ్యాధినయమైతే బాబుకు ఒక ఏడాదిపాటు శారివారి మాదిరిగా పొడుగైన అంగీ, నడుముకు పట్టి ధరిస్తాడని మొక్కుకుంది. అలానే జబ్బు నయంకాగా జానుగారు శారివారివలె దుస్తులుధరించి ఒక ఏడాది పాటు రాజ కొలువులో తిరుగాడారు.

జానుగారి భావిజీవితానికి ఇది ఒక సూచన అయ్యింది. రోజులు గడుస్తున్నాయి జానుగారు పెరిగి యువకుడయ్యారు. యేసుసభలో చేరాలని ఫ్రాన్సీసు శారివారి అడుగు జాడల్లో నడవ తన కోరికను తల్లికి పెద్దలకు తెల్పి అనుమతి పొందారు. 1662 డిసెంబరు 17న యేసుసభలో 'నోవీసు' (గురు అభ్యర్థి) గా చేరారు. భారత దేశములో యేసుసభ గురువులు రాబర్ట్ దె నోబిలీగారు బ్రాహ్మణులను క్రైస్తవంలోకి పరివర్తన చెందడానికి ప్రయత్నించగా, బల్తజార్ దే కోస్తా గారు నిమ్నకులాలు దళితులమధ్య సేవలందించారు. భారత దేశములో వీరు 'పండారస్వామి' పేరిట అందించిన సేవల అనుభవాలను స్వయంగా యేసుసభ గురు అభ్యర్థులకు 1671లో పోర్చుగల్లులో కొయింబరా వద్ద వివరించినప్పుడు జాన్ చలించిపోయి వారిమార్గాన్ని చేపట్టి సేవచేయాలని, వేదసాక్షిగా మరణించాలని నిశ్చయించుకున్నారు.

గురుతర్పీదు అనంతరం జాన్ గారు 1673లో పవిత్ర గురుపట్టాభిషిక్తులయ్యారు. తన కోరిక మేర పెద్దల అనుమతితో 1673 మార్చి 25న మంగళవార్త మహోత్సవం రోజున లిస్బను రేవునుండి కాపితానా ఓడలో బయలుదేరారు. సెప్టెంబరు 4వ తేదీన భారత దేశములోని గోవా చేరుకున్నారు. వారికి భారతీయ సంప్రదాయం ప్రకారం మంగళవాయిద్యాలతో ప్రేమపూర్వక స్వాగతం లభించింది. బ్రిట్టోగారు గురువు అయిన వెంటనే పోర్చుగల్లునుండి భారత్ కు బయలుదేరటం వల్ల వేదశాస్త్రంలో వారు కొన్ని అధ్యాయాల్ని పూర్తి చేయాల్సి ఉంది.

అందువల్ల పునీత పౌలు గురువిద్యాలయములో కొంతకాలము ఉండి వేదశాస్త్రాధ్యయాన్ని పూర్తిచేశారు. పిమ్మట జాన్ గారు మధురై మండలంలో బోధింప నియమితులయ్యారు. మధురై అంటే దాదాపు ఇప్పటి తమిళనాడు ప్రాంతం. అక్కడ అప్పటికే పునీత తోమాసుగారు, పునీత ఫ్రాన్సీసు శౌరిగారిచే విశ్వాసంలోకి తేబడిన లక్షలాది కతోలికులున్నారు.

జాన్ గారు మధురై చేరేసరికి కొందరు యేసుసభ గురువులు ‘పండారిస్వాములు'గా పిలువ బడుతూ వేదవ్వాపకం చేస్తున్నారు. మలబారు ప్రాంతంలోని 'అంబాలాకాడ్' విచారణలో బ్రిట్టోగారు తమిళం నేర్చుకున్నారు. తన పేరును 'అరుళానందర్'గా మార్చుకున్నారు. తమిళ సన్యాసి ధరించే కాషాయ వస్త్రాల్ని ధరించడం చాపపై పడక ప్రారంభించారు. వారు బోధింప నియమింపబడిన సెంజీ ప్రాంతంలోని కొలాయి, చేరుకున్నారు. ఇదే వీరి వేదప్రచారపు మొదటి ఊరు. తెల్లవారితే తమ సభస్టాపకులు ఇన్యాసివారి పండుగ దినోత్సవం. కొందరు క్రైస్తవులతో బలిపూజ నర్పించుకున్నారు. 

ఆ రోజుల్లో భారత దేశములో మొగలు సామ్రాజ్యం విస్తరించి ఉంది. దక్షిణానగర సామ్రాజ్యం ఉంది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు ప్రజల్ని ఇస్లాం మతంలోకి ఆకర్షిస్తున్నాడు. దీన్ని విజయనగరం రాజులు వ్యతిరేకించేవారు. అందువల్ల వీరిమధ్య తరచు యుద్దాలు జరిగేవి. అప్పుడు మధురైలో నాయర్ రాజ్యం కూడ ఉండేది. వీరు విజయనగర రాజులతో ఒక్కసారి స్నేహంగాను మరొకసారి విరోధంగాను వ్యవహరించేవారు. ఆట్టిదినాల్లో బ్రిట్టోగారు తమ వేద ప్రచారం చేస్తుండేవారు. ఇందుకు స్థానిక పాలకుల అనుమతి తీసుకోవాల్సి ఉండేది. అలా తీసుకుంటేనే క్రైస్తవులు వారి మతాచారాల ప్రకారం నడుచుకునేందుకు వీలుకలిగేది.

బ్రిట్టోగారు ఉత్సాహంతో వేదవ్యాపకం చేయబూనారు. పిల్లలకు సత్యోపదేశం, పెద్దలకు క్రైస్తవ జీవన విధానం నేర్పించేవారు. క్రైస్తవం స్వీకరించిన వారి పేర్లన్నింటిని ఒక నమోదు పుస్తకంలో ఎక్కించేవారు. కాలినడకన, మరియు ఎద్దుల బండిమీద విచారణలోని వివిధ గ్రామాలు సందర్శించి దివ్యపూజలు సమర్పిస్తూ, పుణ్యసంస్కారాన్ని ఆచరింపజేసే వారు. ఆశ్రమాల్లో, అడవుల్లో వీరు నిర్వహించు 'భగవత్ ధ్యానాలు' కార్యక్రమం బాగా ప్రసిద్ది కెక్కాయి.

ఇలా పదకొండేండ్లు విశేషంగా కృషిచేసి వేలాది ప్రజలను విశ్వాసంలోకి తెచ్చారు. పలువురు క్రైస్తవ విశ్వాసంలోకి రావడంతో బ్రిట్టోగారు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. 'క్రొత్తమతంలోకి పోయినట్లయితే మన దేవుళ్ల ఆగ్రహానికి గురవుతారు' అని హైందవ పూజార్లు బెదిరించారు. ఈ సమయంలోనే 'కొలాలు' సమీపంలో అంటువ్యాధి ప్రబలింది. పూజార్లు చెప్పినట్లు హిందూ దేవుళ్లు ఆగ్రహించారని విశ్వాసుల్లో కొందరు జారుకున్నారు.

అయినా అంటువ్యాధివల్ల హైందవులలోకూడ మరణాలు సంభవించాయి. బ్రిట్టోగారు కూడ వైద్యసేవల్లో పాల్గొన్నారు. అవస్థాభ్యంగాలిచ్చారు. చనిపోతున్నవారు ఆత్మశాంతితో చనిపోయినట్లు తెల్పారు. బ్రిట్టోగారి నిస్వార్ధ సేవలను ప్రజలంతా శ్లాఘించారు. పిమ్మట బ్రిట్టోగారు తంజావూరు ప్రాతంలోని 'తాతువన్సెరి', ఆ చుట్టుప్రక్కల విశ్వాస సేవలందించారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని మరాఠా రాజు శివాజీ సోదరుడైన 'ఏక్కోజి' పాలిస్తున్నాడు. రాజకీయ అల్లర్లు సాగుతున్నాగానీ 'తాతువన్సేరి' ప్రాంతంలోని 'ఉదయార్ పాలయం' జమిందారు కృషి ఫలితంగా క్రైస్తవం అభివృద్ధి పొందింది. కొన్ని దేవాలయాలు నిర్మింపబడ్డాయి కూడ.

ఆ రోజుల్లో పంటలకు తెగులు వచ్చినప్పుడు బ్రిట్టోగారు ఆశీర్వదించిన విభూధికై రైతులు వచ్చేవారు. అది పంట పొలాల్లో చలినప్పుడు చీడలుపోయి అధిక దిగుబడులు వచ్చినట్లు తెలుప బడింది. అయితే స్థానిక పరిస్థితులను బట్టి అడవుల్లో దొంగచాటుగా ఉండి విశ్వాసప్రచారం చేయాల్సి వచ్చింది. పిమ్మట వీరు మధురై ప్రాంతానికి 1685లో వేద ప్రచారాధిపతి (మిషన్ సుపీరియరు) అయ్యారు.

పదకొండేడ్లలో వారు మధురై, తిరుచ్చి, తంజావూరు, పుదుకొట్టాయి, దక్షిణ ఆర్కాటు ఉత్తర ఆర్కాటు ప్రాంతాల్లో సువార్తా ప్రచారం చేశారు. ఇకపై బ్రిట్టోగారు 'మరువనాడు మార్వా' ప్రాంతంలో బోధింప వెళ్లారు. అక్కడ 'సేతుపతిరాజు' ఆ స్థానంలో 'కుమారప్పపిళ్లయి' మంత్రిగా ఉన్నారు. పెళ్లయి బ్రిట్టోగారిని, వారి అనుచరులను అనేక విధాలుగా హింసించాడు. మరణ దండన ఆజ్ఞనుకూడ తీసుకున్నాడు.

పోర్చుగల్లు వారి వలస భవనాల్లో నివశించిన బ్రిట్టోగారు అనేక క్రూరబాధలు అనుభవించాల్సి వచ్చింది. వీరిని వీరి శిష్యుడు 'సిలువైనాయకర్'ను కూడ కాలే బండలమీద పొర్లించారు. బ్రిట్టోగారి రెండుచేతులు ఒకచెట్టుకు, రెండు కాళ్లు మరోచెట్టుకు కట్టి హింసించారు. పిళ్లయి బ్రిట్టోగారి చెంపపై కొట్టగా రెండో చంపకూడ చూపారు.

సిలువైనాయకర్ కంటిమీద కర్రతో కొట్టాడు. కనుగ్రుడ్డు బయటకు వచ్చింది. బ్రిట్టోగారు దాన్ని యథాస్థానంలో ఉంచగా అది అద్భుతంగా స్వస్థపడింది. ఇది చూసిన పిళ్లయి ఇదో మోసం అన్నాడు. కాని విశ్వసింప లేదు. పైగా ఖైదీచేశాడు. 1685 జూలై 30 నుండి ఆగష్టు 16వరకు జైల్లో గడిపారు. మరువరాజు బ్రిట్టోగారి గొప్పతనాన్ని తెలుసుకొని తన వద్దకు రప్పించుకొని క్రీస్తు సత్యాల్ని విని వారిని సగౌరవంగా విడుదల చేశాడు.

కాని భవిష్యత్తులో తమరాజ్యంలో బోధించవద్దని హెచ్చరించాడు. పిమ్మట పెద్దల ఆజ్ఞపై బ్రిట్టోగారు స్వదేశం ప్రయాణమై 1687 సెప్టెంబరు 8న మరియమాత జన్మదినం రోజున లిస్బను రేవులో ఓడ దిగారు. జీవిస్తున్న పునీతుడు వచ్చాడంటూ విశ్వాసులు వారిని చుట్టుముట్టి కొనియాడుతూ సాదర స్వాగతం పలికారు.

బ్రిట్టో తన స్వదేశం వెళ్లినప్పటికి గతంలోవలె తమిళ సన్యాసిగానే జీవిస్తూ బాల్య మిత్రుడు పోర్చుగల్లు రాజును సందర్శించినప్పుడు కూడా అదే వేషధారణ కలిగి శాకాహారమే భుజించారు. మద్యం ముట్టలేదు. వారు లిస్బనులో ఉన్నప్పుడు మధురై మిషనులో పనిచేయ నియమితులైన గురువులకు విషయాలు వివరించి వారికి తోడుగా ఉంటానని ప్రోత్సహించారు. వారంతా తిరిగి 1690 ఏప్రిల్ 7న లిస్బనులో ఓడనెక్కి, నవంబరు 2వ తేదీన సకల ఆత్మల పండుగ రోజున గోవా చేరుకున్నారు.

బ్రిట్టోగారు తన శిష్యుడు సిలువైనాయకర్ ఆయన కుమారుడు మరియదాస్తో కలసి పాత విచారణల్లో బోధిస్తూ 1692 మే మాసానికల్లా తాను ఆశించిన - వారు ప్రాంతంకు బోధింప చేరుకున్నారు. ఆ రెండేళ్లలోనే పదివేల మందికిపైగా జ్ఞానస్నానాలిచ్చారు. అనిపిళయి, మరువరాజు ఆదేశాన్ని ధిక్కరించి ఆ రాజ్యంలో గటున ప్రవేశించి వేదవ్యాపకం చేయసాగారు. వీరు శిక్షణనిచ్చినకులను నియమించి, విశ్వాసాన్ని బలపరచి, వేదవ్యాపకం చేయడంలో వారికి యుక్తులను మహాత్తరంగా వినియోగించుకున్నారు. బ్రిట్టోగారి బోధనలద్వారా మన విశ్వాసాన్ని అంగీకరించిన వారిలో 'తడియతేవర్' ఒకరు. ఈయన సేతుపతిరాజుకు సామంతుడైన రాజవంశీకుడు. సత్యాన్వేషి, వ్యాధిగా ఉన్న అతన్ని దర్శింప బ్రిట్టోగారు తనశిష్యుడు సిలువైనాయకర్ ను పంపారు.

అతడు వేదపఠనం విన్పించి, క్రైస్తవసత్యాలు చెప్పి విశ్వాస ప్రమాణం చెప్తుండగా రాజుకు వ్యాధి మటుమాయమైంది. ఇక ‘తడియతేవర్ తనకు జ్ఞానస్నానమిమ్మని ఒత్తిడి చేశాడు. అతనికి అయిదుగురు భార్యలుండేవారు. మొదటిభార్యను ఉంచుకొని మిగతా నలుగురికి పోషణ భరణమిచ్చి స్వేచ్ఛనిచ్చాడు. తాను బ్రిట్టోగారి వద్ద బాప్తిజం పొందాడు. అయితే తడియతేవర్ విడిచి పెట్టిన నలుగురిలో సేతుపతిరాజు మేనకోడలైన 'కడలాయి' ఒకర్తె.

ఆమె సేతుపతిరాజుకు బ్రిట్టోగారిపై పిర్యాదు చేసింది. రాజు బ్రిట్టోగారిని, వారి ఉపదేశులను బంధించమని సైనికులకు అనుజ్ఞనిచ్చాడు. వారట్లే బంధించారు. బ్రిట్టోగారు 1693 జనవరి 8న తమ కడపటి బలిపూజ నర్పించారు. బంధింపబడిన బ్రిట్టోగారిని రక్షింప తడియతేవర్ తీవ్రంగా కృషిసల్పినా ఫలితం లేకపోయింది. బ్రిట్టోగారిని రామనాధపురంకు 40మైళ్ల దూరంలోని ఒరియూరుకు బహిష్కరించి 1693 ఫిబ్రవరి 4న పెరుమాళ్ అను తలారిచే తలనరకబడి స్వర్గస్తులయ్యారు.

ఈ ఒరియూర్లోనే వీరి జ్ఞాపకార్ధంగా దేవళం నిర్మతమై తీర్థయాత్రా స్థలంగా వెలుగొందుతుంది.12వ పయస్ (భక్తినాధ) పోపుగారు 1948 జూన్ 22న బ్రిట్టోగారిని శ్రీసభ పునీతునిగా ప్రకటించారు. వీరిని ప్రార్థించుటద్వారా అగ్నిప్రమాదాలు తప్పిపోవడం, గ్రుడ్డివారికి చూపు, కుష్ఠరోగులు బాగుపడడం వంటి అద్భుతాలు జరిగాయి. జాన్ అనగా దైవం కృపాకరుడు, దేవుడు అనుగ్రహించాడని భావం.

1 comment:

  1. Thank you for sharing the beautiful story of st . John britto.

    ReplyDelete