సామాన్య రెండవ వారం - శుక్రవారం (II)
క్రీస్తు మోక్షారోహణ పండుగ
క్రీస్తు మోక్షారోహణ పండుగ
అ.కా. 11:1-11; ఎఫెసీ. 1:17-23, 4:1-13; మార్కు. 16:15-20
క్రీస్తు
నికొదేముతో మాట్లాడుతూ, "పరలోకమునుండి దిగివచ్చిన మనుష్యకుమారుడు తప్ప ఎవడూ
పరలోకానికి ఎక్కిపోలేడు" అని చెప్పారు (యోహాను. 3:13). ఈ వాక్యం ఎంతో లోతైన
అర్ధాన్ని ఇస్తూ ఉన్నది. ఈ వాక్యంలో పరలోకమునుండి దిగిరావడం అంటే క్రీస్తు
"మనుష్యావతారం", పరలోకానికి ఎక్కిపోవడమంటే క్రీస్తు
"మోక్షారోహణం."
క్రీస్తు
"మోక్షారోహణం" ప్రధానంగా అతని మహిమను వెల్లడిస్తుంది. క్రీస్తుని
విశ్వసించే ప్రతి ఒక్కరుకూడా ఈ మహిమలో పాలుపంచుకుంటారు. "మోక్షారోహణాన్ని"
గురించి కొన్ని విషయాలను లోతుగా పరీశీలిద్దాం
1. మోక్షారోహణ సంకేతాలు
అపోస్తులుల
కార్యములు 1:9-14 వచనములు, క్రీస్తు
"మోక్షారోహణాన్ని" వర్ణిస్తున్నాయి. ఈ వచనాలలో ప్రస్తావించబడ్డ
"నలువది నాళ్ళు" , "మేఘం", "దేవదూతలు"
అనే మాటల భావం పరిశీలించుద్దాం. క్రీస్తు భగవానుడు మరణానికి పిమ్మట 40 రోజులదాకా
శిష్యులకు దర్శనమిస్తూ వచ్చారు (అ.కా. 1:3). అతడు ఈ లోకంలో సేవకు పూనుకోకముందు
నలువది నాళ్ళు ఎడారిలో సంసిద్ధమయ్యారు. అలాగే పరలోకంలో తండ్రి ఎదుట సేవకు
పూనుకోకముందు మరలా నలువది నాళ్ళు సిద్ధమయ్యారు. ఈ నలభై కచ్చితంగా 40 రోజులను కాదు
సుదీర్ఘ కాలాన్ని సూచిస్తుంది. "40" యూదులకు పరిపూర్ణమైన సంఖ్య.
ప్రభువు
ఒలీవ కొండమీద నుండి మోక్షారోహణం చేశారు. పూర్వం ఈ కొండ మీదనుండి ప్రభువు తేజస్సు
యెరుషలేమును వీడిపోతుండగా యెహెజ్కేలు ప్రవక్త చూశారు (యెహెజ్కె. 11:23) ఇప్పుడు
మళ్ళా కొండ మీదనుండే తండ్రి తేజస్సు ఐన క్రీస్తుకూడ యెరుషలేమును వీడివెళ్లిపోయారు..
మోక్షానికి
ఎక్కిపోతున్న క్రీస్తుని ఒక మేఘం కప్పివేసింది (అ.కా. 1:9) బైబులులో మేఘం దైవసాన్నిధ్యానికి
గుర్తు. ఇదే మేఘం క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో, దివ్యరూపధారణ సమయంలోను
కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఇద్దరు
దేవదూతలుకూడా శిష్యులకు కనిపించారు. వీళ్ళు క్రీస్తు సమాధిచెంత పుణ్య స్త్రీలకు
సైతం దర్శనమిచ్చారు. బైబులులో దేవదూతలుకూడా దైవసాక్షాత్కారానికి గుర్తుగా ఉంటారు.
క్రీస్తు
పునరుత్థానము, మోక్షారోహణము వేరువేరు కార్యాలు కావు. ఇవి రెండూ ఒకే
సంఘటనం. క్రీస్తు ఉత్థానం కాగానే తండ్రి సన్నిధికికూడా చేరుకున్నారు. ఐనా, అతడు
ఇంకా నలువదినాళ్ళు శిష్యులతో మెలగుతూ వాళ్లకు దర్శనమిస్తూ వచ్చారు. ఆ దర్శనాల్లో
చివరిదాన్ని ఇక్కడ లూకా "మోక్షారోహణముగా" వర్ణించారు. ఆ మీదట ప్రభువు
మళ్ళా భౌతికంగా పలుమార్లు శిష్యులకు కనిపించారు..
క్రీస్తు
తండ్రి వలన పరలోకానికి చేర్చబడ్డారు (అ.కా. 1:1) ఇది అతడు పొందిన మహిమ. పూర్వం
అతడు విధేయుడై మోక్షంనుండి ఈ భూమ్మీదకు దిగివచ్చారు. ఆ విధేయతకు,
వినయానికి బహుమానంగా తండ్రి ఇప్పుడు క్రీస్తుని
మోక్షానికి కొనిపోయారు.
ఆ
మోక్షంలో అతడు తండ్రి కుడిపక్కన కూర్చున్నారు (మార్కు. 16:19). పరిశుద్ధ గ్రంథములో
"కూర్చోవటం" పని పూర్తయిందని తెలియజేస్తుంది. ఇక్కడ క్రీస్తు రక్షణకార్యాన్ని
పూర్తిచేశారని భావం. క్రీస్తు తండ్రి " కుడిపక్కన" కూర్చున్నారు అంటే ఆ
తండ్రి మహిమలో పాలుపొందారని భావం. పూర్వం అతడు వినయంతో బానిసరూపం చేకొన్నారు.
నీచమైన సిలువ మరణం అనుభవించారు. అందుకుగాను ఇప్పుడు కీర్తిని పొందారు. తండ్రితోపాటు
తాను రాజ్యపాలనం చేస్తారు.
2. పరలోక పట్టాభిషేకం
తండ్రిచిత్తాన్ని
విధేయించి, తనకొసగబడిన
కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించుకొని విజయుడై పరలోకానికి విచ్చేసిన ఉత్థాన
క్రీస్తుకు ఆనందగానాలతో, స్తుతిస్తోత్రములతో పరలోక పరివారమంతా ఎదురేగి
స్వాగతం పలికింది. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని రాకతో ఆనందపరవశుడై
క్రీస్తును ఆహ్వానిస్తూ ప్రేమతో కౌగలించుకుని పరలోక సింహాసనంవైపు నడిపిస్తున్నారు.
ఈ దినాన్ని ఉత్థాన క్రీస్తు పట్టాభిషేక దినమని భావించాలి. దైవదూతలు, సన్మనస్కులు
ఎదురేగుచున్నారు, పునీతులు
ఆహ్వానిస్తున్నారు, వేదసాక్షులు
చుట్టూ గుమికూడుచున్నారు. అంతా ఆనందముతో స్వాగత గీతం పాడుచున్నారు..
తండ్రి
తన ప్రియ కుమారుని మహిమాన్విత సింహాసనంపై కూర్చుండబెట్టి పరలోక,
భూలోకాలకు రాజుగా ఆయనకి పట్టాభిషేకం చేస్తున్నారు..
ఇక్కడ
మన రక్షకుడు పరలోక, భూలోకాలను
రాజుగా పాలిస్తారు. ఆయన ప్రజలంతా తిరుసభలో చేర్చబడి, శత్రువులంతా పాదాక్రాంతమయ్యే వరకు పరిపాలించి చివరకు తన
రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తారు (1 కొరి. 15:24-28)
3. ప్రధముడు, ప్రధమ ఫలం
"క్రీస్తు
మరణించిన తరువాత సజీవుడుగా లేవబడి, మరణించి లేపబడినవారిలో ప్రధమ ఫలంగా ఉన్నారు" అని పౌలు మహర్షి
పలుకుతున్నారు. క్రీస్తునాథుడు తన మరణ, పునరుత్థానాలద్వారా ఒక నూతన ఆధ్యాత్మిక సృష్టిని ఏర్పరిచారు. ఆయన కూడా అందులో
ఒకరు. ఈ నూతన సృష్టిలో క్రీస్తు ప్రధమ ఫలం. అందరికంటే ముందు ఆయన మోక్షానికివెళ్లి
సర్వోన్నత మహిమను పొందారు. మానవాళి రక్షణలో మొదట పరలోకంలో ప్రవేశించిన క్రీస్తు
ప్రధమ ఫలమని చెప్పాలి. మన ప్రతినిధిగా ఆయన యిప్పుడు పరలోకానికి వెళ్లిపోయారు. మనంకూడా
మంచి జీవితాన్ని జీవిస్తూ ఆయనను అనుసరించి పరలోకం చేరగలమని నమ్మకం కలుగుతుంది.
కనుక మన హృదయాన్ని, ఆశలను,
ఆశయాలను, కోరికలను పరలోకం వైపు మరల్చి జీవించాలి.
చివరి పలుకులు
క్రీస్తునాథుడు
"నా తండ్రి గృహంలో అనేక నివాస స్థలాలున్నాయి. నేను వెళ్లి మీకు కూడా ఓ నివాసం
సిద్ధం చేస్తాను. నేను మరల వచ్చి మీ అందర్నీ అక్కడికి తీసుకెళ్తాను అని
చెప్పారు" (యోహాను. 14:2-3). ఆ నివాసస్థలమే మోక్షం. అనగా మోక్షం
చేరుకున్నప్పుడు మన మహిమ సంపూర్ణమౌతుంది. మోక్షానికి చేరుకోవాలంటే మనముకూడా
క్రీస్తు భగవానుడివలె నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. దేవుని చిత్తానికి తలవంచాలి.
మంచి జీవితాన్ని జీవించుదాం! పరలోక భాగ్యాన్ని సంపాదించుకుందాం!
అందరికీ
క్రీస్తు "మోక్షారోహణ" పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
జోసెఫ్ అవినాష్ సావియో✍
యువ కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచారణ, గుంటూరు
పాస్కా ఆరవ ఆదివారము 9 మే 2021
పాస్కా ఆరవ
ఆదివారము 9 మే 2021
అ.కా.10:25-26, 34-35, 44-48, 1 యోహాను
4:7-10, యోహా
15:9-17
నిలచియుందాం!
సేవకులమై, స్నేహితులమై...
‘నిలకడ’ అనేది అన్నింటికీ ముఖ్యం. పనిలో, చదువులో, ఆటలో, ఏరంగములోనైన నిలకడ ఎంతైనా అవసరం. ఈనాటి సువిషేశములో యేసు ఈ మాటలనే ఒత్తిపలకుచున్నాడు. నిలచియుంటే, నిలబడతారు! పంపబడతారు అని ప్రభువు బోధిస్తున్నాడు. అసలు ఈ ‘నిలిచియుండటం’, ‘నిలబడటం’ అంటే ఏమిటో ఓసారి ఆలోచిద్దాం! సాధారణముగా, ‘నిలిచి యుండటం’ అంటే కాళ్ళమీద నిలిచియుండటం అనేది మొట్టమొదటిగా మనకు అనిపిస్తుంది. అది నిజమే! కాని ఇంకా ముందుకెలితే ఆ మాటకు ఉన్న పలుఅర్ధాలు మనకు విశదమవుతాయి. యోహాను 15వ అధ్యాయములో ‘నిలచియుండటం’ అనే మాటకు, సమీపముగా ఉండటం, దగ్గరగా ఉండటం, సంబంధం కలిగియుండటం, అంటిపెట్టుకొని యుండటం, అనుబంధం కలిగియుండటం అనే అర్ధాలు ఉన్నాయి. నాకు దగ్గరగా నిలిచియుండమని ప్రభువు అంటున్నాడు. ద్రాక్షావల్లిలో తీగలాగా నాలో నిలిచి యుండండి అని అంటున్నాడు. నిలిచి యుంటే ఏం జరుగునో, ధ్యానించి తెలుసుకొందాం!
1. నిలచియుంటేనే
నీకు తెలుస్తుంది-నీవెవరోయని
ఆయనతో నిలిచి ఉండటం వలన, ఆయనలో కలసి
ఉండటము వలన, ఆయన
వెలుగులో నిలబడటం వలన మనమెవరమో, మన బలాలు, బలహీనతలు, మన శక్తులు-యుక్తులు, మన విలువ, మన ఆశయాలు, మన అసలు తత్వం
తెలియవస్తుంది.
దేవుని ఎదుట, ఆయన వెలుగులో, ఆయన స్పర్శలో
ఉన్నవాడైన పేతురు (అ.కా. 10:9) కొర్నేలితో “నేనును ఒక మనుష్యుడనే” అని అంటున్నాడు. గర్వము లేక దీనుడై తన నిజతత్వమును ఒక అన్యుడైన కోర్నేలిముందు
అంగీకరిస్తున్నాడు (అ.కా.10:26). తన నిజరూపమును, బలహీనతలను, స్వతంత్రముగా, సంతోషముగా అంగీకరిస్తున్నాడు.
ప్రభువుతో కలసి, ప్రభువులో
నిలచియుండటం నేర్చుకున్నాడు కాబట్టే, ఈ విధముగా దీనమనస్కుడై పేతురు ఉండగలిగాడు.
ఆయనలో నిలచియున్న అబ్రహాము,
తానేమిటో తెలిసికొన్నాడు. ఆ.కాం. 18:27లో అబ్రహాము దేవునితో ఈ విధముగా అంటున్నాడు.
“నేను మట్టి మనిషినే, నేను
బూడిదనే”. దేవునిలో నడచినవానిగా, దేవుని స్నేహితునిగా, దేవునిలో నిలిచియుండుట వలన తన నిజరూపమును అబ్రహాము
తెలిసికొంటున్నాడు (ఈ విధముగానే పరిసయ్యుడు కూడా తను పాపినని దేవుని సన్నిధిలో
తెలిసికుంటున్నాడు, లూకా
18:9-14).
2. నిలిచి
యుంటేనే నీకు తెలుస్తుంది, దేవుడు ఎవరోయని!
దేవునిలో నిలచియుంటే, దేవునితో
కలిసియుంటే, ఆయన
వెలుగులో నడుస్తుంటే, మన బల, బలహీనతలతో
పాటు దేవుని గొప్పతనం,
ఆయన మహిమ, ప్రభావం
మనకు తెలియవస్తుంది. ఆయన నీ కొరకు ఏమి చేయగలడో నీవు తెలిసికొంటావు. కష్టసమయములో, దు:ఖసమయాలలో
కూడా ఆయనలోనే ఉండటం మనం నేర్చుకోవాలి. సంతానంలేని సమయములో, ఇక సంతానం
కలుగడం అసాధ్యమని తెలిసిన సమయములో కూడా, అబ్రహాము దేవునిలో నిలిచి యుండటం నేర్చుకొన్నాడు.
అందుకే, దేవుడు
అసాధ్యమైనది సుసాధ్యం చేసి తననుతాను బయలు పరచుకొన్నాడు.
నిలచియుంటేనే ఆయన తననుతాను
బయలుపరచుకొంటారు. మగ్దల మరియ సమాధివద్దనే నిలచియుంది, మరణించిన
యేసును వెదకింది. ఆయనను చూడాలనే కోరిక, ఆయన సన్నిధిలో
ఉండాలనే ఆశ ఆమెను నడిపించింది. ఆయనను కలిసింది (యోహా 20:11-18). తద్వారా, ఆయనతో
అనుబంధం ఏర్పడినది.
3. నిలిస్తే ఫలిస్తావ్!
మనం ఆయనయందు, ఆయనలో ఉంటేనే
(నిలిస్తేనే) మనం ఫలిస్తాము! యోహాను 15:5లో ప్రభువు ఇలా అంటున్నాడు, "నేను లేక మీరు
ఏమీ చేయలేరు". నిలకడ యుంటేనే ఫలితం వస్తుంది. ద్రాక్షతీగ, ద్రాక్షవల్లిని
అంటిపెట్టుకొని యున్నట్లు మనం ఆయనతో నిలిచియుంటే మన పనిలో, చదువులో, ప్రార్ధనలో, జీవితములో
ఫలిస్తాం. ఆయన ప్రేమను పొందుతూ, పొందిన ప్రేమను పంచుతూ, ఆ ప్రేమను తెలియని వారికి, ఆయన నామములో
మన సేవద్వారా, స్నేహంద్వారా
తెలియ జేయగలుగుతాం!
అందుకే, నిలిచియుందాం! ఆయన సన్నిధిలో సేవకులముగా!
ఐదవ పాస్కాకాల ఆదివారము (2 మే 2021)
అ.కా. 9:26-31, 1యోహాను 3:18-24, యోహాను 15:1-8
మన ప్రేమ
కేవలము మాటలు, సంభాషణలు
మాత్రమే కాదు. అవి చేతలలో నిరూపింపబడు యదార్ధ ప్రేమ కావలయును (1 యోహా 3:18). యేసు
తన బహిరంగ జీవితములో అనేక సందర్భాలలో తన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను, వ్యక్తులను
గమనించి వాటిని ఉదాహరణగా తీసుకొని, గొప్ప పరలోక సత్యాలను, తన శిష్యులకు
భోధించేవాడు. ఉదాహరణకు, గొర్రెల కాపరులు, నీరు, వెలుగు, రొట్టె, పరిసయ్యులు... ఉదాహరణగా చేసుకొని అనేక విషయాలను
భోధించాడు. ఈ కోవకు చెందిన ఒక ద్రాక్షావల్లిని ఉదాహరణగా తీసుకొని, ఈనాటి సువిశేష
పఠనము ద్వారా మనకు బోధిస్తున్నాడు.
యేసు ప్రభువు
జీవించిన సమయములో, యూదయా దేశములో ద్రాక్షాతోటలు ఎక్కువగా సాగుచేసేవారు. ద్రాక్షా ఎదుగుదల, ఫలాలు గురించి
అందరికికూడా ఒక అవగాహన యుండేది. అందువలననే యేసు ద్రాక్షావల్లిని-తీగలను ఉదాహరణగా
చేసుకొని, దానిద్వారా ఆయనను అనుసరించే శిష్యులకు, దేవునితో ఉండవలసిన బంధాన్ని గురించి
భోదిస్తూ ఉన్నాడు. కనుక ద్రాక్షావల్లిని గురించి కొంత సేపు ద్యానిద్దాం.
మొదటగా, ద్రాక్షావల్లి
యందు ఉండని తీగ దానియంతట అది ఫలింప జాలదు. ద్రాక్షావల్లి నుండి వేరుచేయబడిన
రెమ్మలు జీవింపలేవు. అందుకే, ద్రాక్షావల్లి రెమ్మలు ద్రాక్షావల్లిని అంటిపెట్టుకొని
యుంటాయి. అవి ద్రాక్షావల్లిని అంటి పెట్టుకొని ఉండుట వలన అధికముగా ఫలిస్తాయి.
ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ద్రాక్షారెమ్మల వలన ద్రాక్షావల్లి బలపడుటలేదు.
కారణం, మనం
ఒక రెమ్మను కత్తిరిస్తే మరియొక రెమ్మ పుట్టుకొస్తుంది. కాని ద్రాక్షావల్లి వలన
దాని రెమ్మలు లబ్దిపొందుతూ ఉన్నాయి. ద్రాక్షావల్లి దానిలో ఉన్న జీవాన్ని, బలాన్ని, రెమ్మలకు
ఇస్తుందే తప్ప,
రెమ్మలనుండి అది జీవం పొందుటలేదు. ద్రాక్షావల్లిని రెమ్మలు అంటిపెట్టుకొని
యుండుటవలన, అవి
ధృడముగా, ఎదగగలుగు
చున్నాయి. మనందరి జీవిత సత్యం కూడా ఇదే! మనం ప్రభువుని విశ్వసించి, ఆయనను అంటిపెట్టుకొని
యుండుట వలన, మనముకూడా
ఆయన జీవాన్ని, బలాన్ని
పొందుతూ ఉన్నాము. ఆయన విశ్వాసములో ధృడముగా ఎదగగలుగుతాము. మన జీవితాలు సంతోషముతో, సమాధానముతో వర్ధిల్లుతాయి.
మనము ఆయనతో ఉండుట వలన,
జీవితములో ఎదురయ్యే ప్రతీ కష్టాన్ని, సమస్యను, ఆయననుండి వచ్చే బలముద్వారా, పరిశుద్ధాత్మ
సహాయ శక్తిద్వారా అధిగమించ గలము. కనుక, ద్రాక్షావల్లియగు క్రీస్తుకు మన జీవితాన్ని అంటిపెట్టినప్పుడు
మన జీవితాలు అధికముగా ఫలిస్తాయి.
“నాయందు
ఫలింపని ప్రతీ తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతీ తీగను అధికముగా ఫలించుటకై, ఆయన దానిని
కత్తిరించి సరిచేయును.” ద్రాక్షావల్లి అధికముగా ఫలించాలి అంటే, మనం దానికి
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని సరిగా అంటు కట్టాలి. కాలమును బట్టి ఎండిన
ఆకులను, కొమ్మలను
కత్తిరించి సరిచేయాలి. దానికి కావలసిన ఎరువును, నీటిని సకాలములో అందించాలి. ఈ జాగ్రత్తలు
పాటించినప్పుడే, ద్రాక్షావల్లి మంచి రుచికరమైన ఫలాలను మనకు అందించగలదు.
ద్రాక్షావల్లి క్రీస్తు అయితే, మనమంతా ఆయన రెమ్మలం. ఎండిన ఆకులు, కొమ్మలు మనలో ఉన్న
చెడుకు, పాపానికి
చిహ్నంగా నిలుస్తాయి. వాటిని ఏవిధముగా కత్తిరించి, ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదమో, అదేవిధముగా, మనలో ఉన్న
చెడును, చెడు
క్రియలకు, ఆలోచనలకు
స్వస్తి చెప్పి మనల్ని మనం సక్రమమైన మార్గములో నడచుకోవడానికి ప్రయత్నించినప్పుడు
మనం అధికముగా ఫలించగలుగుతాము.
“నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు.” ద్రాక్షావల్లి ఎదుగుదలకు, మరియు అది ఫలించడానికి దాని తీగలు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. ద్రాక్షా రెమ్మలు, ద్రాక్షావల్లినుండి వచ్చే బలాన్ని, జీవాన్ని స్వీకరించి, అవి బలపడుతూ, ఎదుగుతూ, ద్రాక్షావల్లిని జీవింప చేస్తాయి. అదేవిధముగా ఈ ప్రపంచములో దేవునికి మానవుడుకూడా ఎంతో అవసరము. మన సత్యోపదేశములో చదువుకున్నట్లు, మానవుడు దేవుని ప్రేమించి, సేవించి అటువెనుక మరణము పొందుటకు సృష్టింపబడెను. మనం ఒక వ్యక్తిని ప్రేమించినపుడు లేదా ఒక వ్యక్తి చేత ప్రేమింపబడినప్పుడు, ఆ వ్యక్తి గురించి పదిమందికి చెబుతూ ఉంటాం.
అదేవిధముగా, మానవుడు
దేవుని గురించి ఈ ప్రపంచానికి చాటగలగాలి. దేవుని నామాన్ని ఆయన ప్రేమను ప్రకటించటం
అంటే ఆయనను ఈ లోకములో జీవింప చేయటం. ఆయన మరణమును ప్రకటించడం అంటే, ఆయనను ఈ
లోకములో జీవింప చేయడం. ఆయన మహిమను కొనియాడటం.
ఆయనను స్తుతించి గౌరవించడం. కనుక, క్రీస్తు బిడ్డలుగా ఇది మనందరి కర్తవ్యం.
“మీరు
అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరప బడును.” ప్రియులారా! మానవ జీవితాన్ని ఒక
ఉన్నతమైన దృక్పధముతో చూసినప్పుడు, మనం అనుకున్న ఫలాలకంటే, అధికముగా ఫలిస్తూయున్నాం. మన అనుదిన జీవితములో ప్రతీసారి
మనం మంచి చేసినప్పుడు,
మంచిని గురించి ఆలోచించినప్పుడు అధికముగా ఫలిస్తూయున్నాం. ప్రేమ, శాంతి, సమాధానాన్ని
ఇతరులకు పంచినప్పుడు మనం అధికముగా ఫలించినట్లే... ఇతరులను మన్నించడంద్వారా, మనకున్నదాన్ని
ఇతరులతో పంచుకొనుటద్వారా,
మనం అధికముగా ఫలిస్తూయున్నాం. మన శత్రువులను ప్రేమించి, వారికోసం
ప్రార్ధించినప్పుడు మనం ఫలిస్తూయున్నాం. ఈవిధముగా, ప్రతీసారి, ప్రతీరోజు, మన మాటలద్వారా, క్రియలద్వారా
ఫలిస్తూ తండ్రి దేవుని మహిమ పరస్తూ ఉన్నాము. కనుక, మన ఫలములో దేవుని మహిమ పరచగలగాలి.
“మీరు నా యందు ఉండుడు.” ఈనాటి సువిశేష పఠనములో ఈ వాక్యము 8 సార్లు చెప్పబడింది. అంటే, ఈ వాక్యము ఎంత ముఖ్యమైనచో మనం గ్రహించాలి. కొన్ని సందర్భాలలో, కొంతమంది వ్యక్తులు ఒకే కుటుంబములో జీవిస్తూ ఉంటారు. వారు కలసి ఉన్నప్పటికిని, పరదేశులుగా బ్రతుకుతూ ఉంటారు. ఒకరంటే ఒకరికి పడదు. పట్టించుకోరు. ఒకలాంటి విదేశీ మనస్తత్వాన్ని కలిగియుంటారు. వారి మధ్య ప్రేమలు, ఆప్యాయతలు ఉండవు. నామమాత్రముగా కలసి జీవిస్తూ ఉంటారు. అదేవిధముగా, "ప్రభువు యందు ఉండటం" అంటే నామమాత్రానికే క్రైస్తవులుగాయుండి ఆయన శిష్యుడిని అని చెప్పుకుంటే సరిపోదు. “మీరు నాయందు ఉండుడు” అను వాక్యము ద్వారా, ప్రభువు మనలను తనతో కలసి జీవించటానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనతో జీవించడం, ఆయనతో పంచుకోవడం, ఆయనతో ఉండటం ఒకరి నుండి మరియొకరు పొందటం, ఒకరిని ఒకరు గౌరవించడం, ప్రభువుయందు ఉండటం అంటే, మన నమ్మకాన్ని ఉత్థాన క్రీస్తుయందు ఉంచటం. ఆయనయందు ఉండటం అంటే, ఆయనలో శాంతిని, సమాధానాన్ని, ప్రేమను పొందటం. నిండైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయనలో కలిగియుండటం. కారణం ఆయన కూడా “నేను మీ యందు ఉందును” అని మనకు మాట ఇచ్చియున్నాడు. కనుక మనం మన జీవితంలో ఎన్ని కష్టాలు, భాదలు, నష్టాలు, రోగాలు ఎదురైనప్పటికిని ప్రభువుతో ఉన్నట్లయితే ఆయనే మనకు బలాన్ని ఇచ్చి, జీవితములో ముందుకు నడిపిస్తాడు. కనుక, ప్రభువుయందు ఉండటానికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని అర్ధిద్దాం.
చివరిగా, ఇది మే మాసం.
ఈ నెల మరియ తల్లికి అంకితం చేయబడిన నెల. ఆమె దేవుని యొక్క తల్లి. ఆమె దేవుని తల్లి
కనుక మనందరికీ కూడా తల్లిగా నిలుస్తుంది. ఈ కారణం చేత, మనంకూడా ఆమెను
విన్నవించుకోవాలి. రక్షణ చరిత్రలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె ఈ
ప్రపంచానికి యేసు ప్రభువును అందించింది. ఆమె ‘తన గర్భ ఫలమును’ మనకు కానుకగా
ఒసగింది. ఆమె ఇంకా ఈ ప్రపంచానికి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంది. ఆమె తన విశ్వాస జీవితముద్వారా
ప్రభువుయందు ఉంటూ, ఆ
ప్రభువులో జీవిస్తూ అధికముగా ఫలించింది. కనుక, ఆమె నిత్యసహాయముద్వారా మనముకూడా అధికముగా ఫలించుటకు
ఆమె సహాయాన్ని వేడుకొందాం. ఆమె చూపిన విశ్వాస మార్గములో జీవించడానికి ప్రయాసపడదాం.
ఆమెన్.
పాస్కా నాలుగవ ఆదివారము, Year B
పాస్కా నాలుగవ ఆదివారము Year B
పఠనాలు: అ.కా. 4:8-12, 17-19, 1 యోహాను 3:1-2, యోహాను 10:11-18
యేసు [దేవుడు] మంచి కాపరి
మంచి నాయకత్వం గురించి నేడు
ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. ‘మంచి కాపరి’గా తన గూర్చి తాను చెబుతూ, మనందరికీ
ఓ గొప్ప ఆదర్శమూర్తిగా ఉన్నారు. మంచి కాపరి తన మందను చూచుకొనును. పచ్చిక
బయళ్ళలోనికి నడిపించును. తప్పిపోయిన గొర్రెల కొరకు వెదకును. తన గొర్రెల కొరకు
ప్రాణములనైనను అర్పించుటకు సిద్ధముగా ఉండును.
మంచి కాపరి అయిన యేసు మందకు
చెందినవారమని సంతోష పడాలి. నేటి మన దైవ సేవకుల ద్వారా [మన ఆధ్యాత్మిక నాయకులు] ఆయన
మనలను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నేడు దైవ పిలుపు కొరకు ప్రార్ధన చేయు ప్రపంచ
దినము కనుక, ఆధ్యాత్మిక నాయకుల కొరకు ప్రార్ధన చేద్దాం. దైవ పిలుపు కొరకు ప్రార్ధన
చేద్దాం. నేడు గురువులు మనకు ఎంతో అవసరం. గురువులు లేనిచో దివ్యబలిపూజ లేదు, ప్రేషిత
కార్యం లేదు,
సంఘము కూడా లేదు. కనుక, నేటి యువత, దైవ
పిలుపును అందుకొని గురుత్వ జీవితములోనికి నడిపింప బడాలని ప్రత్యేక విధముగా
ప్రార్ధన చేద్దాం. నేడు మన విచారణలలో సరియైన కతోలిక శ్రీసభ బోధనలు లేక, ఎంతోమంది
శ్రీసభను వీడి ఇతర సంఘాలలో చేరుతున్నారు. దివ్యసంస్కారాలను స్వీకరించారు కాని
ఎంతోమందిలో శ్రీసభ సిద్ధాంతాలపట్ల, బోధనలపట్ల సరియైన అవగాహన లేదు. దీనికి
కారణం గురువులు లేకపోవడమే! అపోస్తలుల కార్యములులో, ఫిలిప్పు-ఇతియోపియా
ఉద్యోగి సంఘటనను ఇచ్చట
ప్రస్తావించుకోవచ్చు. ఉద్యోగి యెషయా గ్రంథము చదువు చుండగా, ఫిలిప్పు, “నీవు
చదువుచున్నది నీకు అర్ధమగు చున్నదా?” అని ప్రశ్నించగా, “నాకు
ఎవరైన వివరింపని యెడల నేను ఎట్లు అర్ధము చేసికొనగలను?” అని ఆ
ఉద్యోగి పలికాడు (అ.కా. 8:26-40).
గురువుల కొరత స్పష్టముగా
లోకమంతటా మనకు కనిపించుచున్నది. ఉన్నవారు సాంఘీక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ
ఆధ్యాత్మిక [బోధనలు] ప్రేషితత్వమునకు చాలా తక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. ఇది
నేడు మనం ఎదుర్కొంటున్న ఓ పెద్ద సవాలు! ఇచ్చట రెండు విషయాలను గుర్తుపెట్టు కుందాం:
ఒకటి, నేడు మన ప్రజలకు గురువుల, మఠవాసుల అవసరత, విలువను గూర్చి తెలియజేద్దాం.
భౌతికవాద, అహంభావ సంస్కృతిలోనున్న పరిస్థితులలో దీనిని తెలియ జేయడం ఎంతో అవసరం. యువతలో
ముఖ్యముగా ఈ మేలుకొల్పు ఎంతో అవసరం. గురుత్వములో ఆనందం, సంతోషం
ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నా గురుత్వ జీవితమును బట్టి నేను ఈ విషయమును చెప్పగలుగు
చున్నాను. నిజమైన సంతోషమును నేను అనుభవించు చున్నాను. కలిగియుండుట లేదా పొందుటలో
కన్న, ఇచ్చుటలో నిజమైన ఆనందము ఉన్నది. ఇతరులకు సేవ చేయుటలో, సహాయము
చేయుటలో నిజమైన ఆనందము ఉన్నది. రెండవదిగా, యేసు మన మంచి కాపరి అయినప్పుడు, మనం
నిజముగా ఆయనకు చెందినవారముగా ఉండాలి. “నేను మంచి కాపరిని. నేను నా గొర్రెలను, నన్ను
నా గొర్రెలును ఎరుగును” (యోహాను 10:14). మంచి కాపరిగా, ఆయన
తన గొర్రెలకు ముందుగా నడచును. గొర్రెలు ఆయన వెంట పోవును, ఎందుకన, అవి
ఆయన స్వరమును గుర్తించును” (యోహాను 10:4). మంచి కాపరిని మనం
అనుసరించునప్పుడు,
మనము మంచి కాపరులము కాగలము. గురుత్వమునకు దైవపిలుపు, సువార్తా
[క్రైస్తవ] విలువలు కలిగిన కుటుంబముల నుండి వచ్చును అనునది ఎంతో వాస్తవము!
కాపరులు నాయకత్వమునకు తార్కాణం.
పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు నాయకులను సూచిస్తుంది. మోషే తన మామ యిత్రో మందలను
మేపడం మాత్రమేగాక (నిర్గమ 3:1), దేవుడు మోషేను పిలచుకొని, ‘కాపరి
కఱ్ఱను’ అతనికి ఒసగారు (నిర్గమ 4:2). ఇచ్చట ‘కఱ్ఱ’ మోషే నాయకత్వమునకు, అధికారానికి, దేవుని
శక్తికి తార్కాణం. దావీదు కేవలము గొర్రెలు కాచు కాపరి మాత్రమే కాదు.
యిశ్రాయేలీయుల తెగలన్నీ
హేబ్రోనున దావీదును రాజుగా చేయవచ్చినప్పుడు, పెద్దలందరు దేవుని వాగ్ధానమును
గుర్తుచేసిరి,
“నీవు నా ప్రజలకు కాపరివి. నాయకుడవు అయ్యెదవు” (2
సమూ 5:1-3). ప్రవక్తలు కూడా ఇశ్రాయేలు ప్రజల నాయకులు కాపరులన్న విషయాన్ని
అనేకసార్లు నొక్కి చెప్పడం జరిగింది. ప్రవక్తలు యావే ప్రభువును కూడా కాపరిగా
చెప్పడం జరిగింది: యెషయా 40:10-11, యిర్మియా 23:2-4, యెహెజ్కేలు
34:23.
అయితే, యేసు
ఎప్పుడైతే తననుతాను మంచి కాపరిగా చెప్పాడో, దానిలో ప్రత్యేకత ఉంది. రెండు
ప్రత్యేకతలను చూడవచ్చు: ఒకటి, “నేను నా గొర్రెలను, నన్ను
నా గొర్రెలును ఎరుగును: (యోహాను 10:14), యేసు ఇక్కడ గొర్రెల గురించి
చెప్పడం లేదు. నీ గురించి, నా గురించి, మన
గురించి చెప్పుచున్నాడు. రెండవదిగా, “మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును
ధారపోయును” (యోహాను 10:11,
15, 17, 18). యేసు మంచి కాపరిగా మనలో
ఒకడై ఉన్నాడు. మన కోసం మరణించాడు.
యేసు క్రీస్తు మంచి కాపరి. మనం
మూర్ఖముగా ప్రవర్తించినను, మొండితనముగా ఉన్నను, భయముతో
ఉన్నను, ఆయన మనలను చూచును, ప్రేమించును. మన మంచిని కోరును, ఆశించును.
వ్యక్తిగతముగా మనలో ఒక్కొక్కరితో ఆయన అనుబంధాన్ని కలిగియుండును. అపాయములో, కష్టములో
ఆయన మనతో ఉండును. మనలను ఎన్నటికీ విడనాడడు. తప్పిపోయినప్పుడు మనలను వెతుకుతూ
వచ్చును. ఆయన స్వరమును మనం గుర్తిస్తున్నామా? అని ఆత్మపరిశీలను చేసుకుందాం!
మన కోసం ప్రాణమిచ్చు మన మంచి కాపరి యేసయ్యను విశ్వసించుదాం. ఆయన మనకు జీవమును, సంతోషమును
ఒసగును.
పాస్కా మూడవ ఆదివారము, Year B
పాస్కా
మూడవ ఆదివారము, Year B
పఠనాలు:
అ.కా. 3:13-15, 17-19, 1 యోహాను 2:1-5, లూకా 24:35-48
ఉత్థాన
క్రీస్తుకు సాక్షులమవుదాం!
రెండు వారాల క్రితం, యేసు క్రీస్తు ఉత్థాన మహోత్సవమును కొనియాడాము. గడచిన వారము మన పాపములను మన్నించుట ద్వారా క్రీస్తు కరుణ ఎంత గొప్పదోయని ధ్యానించాము. నేడు పాస్కా మూడవ ఆదివారమున మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి అనే మన బాధ్యతను గురించి గుర్తుకు చేసుకుంటున్నాము. నేటి మూడు పఠనాల సారాంశం క్రీస్తుకు సాక్షులుగా జీవించడం. ఉత్థాన ప్రభువు శిష్యులకు అనేకసార్లు కనిపించి, వారిలోనున్న భయాన్ని, అనుమానాలను తొలగించి వారితో, అన్నింటికిని మీరే సాక్షులు అని పలికాడు. అలాగే, పేతురుగారు, దేవాలయ ద్వారమున కుంటి వానికి స్వస్థత కలుగజేసిన తరువాత, దేవాలయములో పేతురు ప్రసంగం చేసారు. ఆ ప్రసంగములో ఉత్థాన క్రీస్తుకు పేతురు సాక్షం ఇస్తున్నాడు: "దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము" (అ.కా. 3:15).
మనము పొందిన యేసు క్రీస్తు ఉత్థాన అనుభవమును ఇతరులతో పంచుకోవాలి. ఇతరులకు సాక్షులుగా జీవించాలి. యేసు క్రీస్తు ఉత్థానము గురించి, నీ వ్యక్తిగత అనుభవం ఏమిటి? తపస్సు కాలము నుండి నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు చూస్తున్న మార్పులు ఏమిటి? ఎమ్మావు మార్గములో శిష్యులు యేసును దర్శించిన విధముగా నీవు ఉత్థాన క్రీస్తును కలుసుకున్నావా, దర్శించావా? యేసు తన శిష్యులతో, “క్రీస్తు కష్టములు అనుభవించుననియు, మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాపక్షమాపణము ప్రకటింప బడుననియు వ్రాయబడియున్నది వీనికి అన్నింటికిని మీరే సాక్షులు” (లూకా 24:46-48) అని చెప్పారు. ఇదే విషయాన్ని పునీత పేతురుగారు నేటి మొదటి పఠనములో చెప్పుచున్నారు: “మేము దీనికి సాక్షులము” (అ.కా. 3:15).
సాక్షులముగా, మనం ఈ లోకానికి ఏమి తెలియజేయాలి? దేని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి? ఉత్థాన క్రీస్తుకు సాక్షం ఇవ్వాలి. హృదయపరివర్తన మరియు పాపక్షమాపణ గురించి సాక్ష్యం ఇవ్వాలి. పేతురు వలె, “మీరు హృదయ పరివర్తన చెంది, దేవునివైపు మరలిన యెడల, ఆయన మీ పాపములను తుడిచి వేయును” (అ.కా. 3:19) మనమూ సాక్ష్యం ఇవ్వాలి. ఉత్థాన క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, పాపములనుండి హృదయ పరివర్తన చెందాలని కోరాలి. మన పాపాల క్షమాపణ కొరకే క్రీస్తు మరణించాడు. హృదయపరివర్తన చెందనిచో, క్రీస్తును నేను మరల మరల సిలువ వేసిన వాడనవుతాను.
రెండవ పఠనములో విన్నట్లుగా, క్రీస్తు
వెలుగులో నడవటం లేదా జీవించటం, ఆజ్ఞలను పాటించడం, ఆయనకు
సాక్ష్యమిచ్చుటలో ఉత్తమమైనది. “దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను
గ్రహించితి మనుట నిశ్చయము” (1 యోహాను 2:3). “దేవుని వాక్కునకు ఎవడు
విధేయుడగునో,
అట్టి వానియందు దేవుని యెడల అతని ప్రేమ నిజముగ
పరిపూర్ణమైనది”
(1 యోహాను 2:5).
మనం పాపములో ఉండగా, మనం
క్రీస్తుకు సాక్ష్యము ఇవ్వలేము! ఒక గ్రుడ్డివాడు, ఇంకో గ్రుడ్డివాడిని
నడిపించలేడు. కనుక మనము ముందుగా హృదయపరివర్తన చెందాలి. నేటి మన గొప్ప సమస్య ఇదే!
బోధించేవారు ఎక్కువే కాని పాటించేవారు తక్కువ! ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కాని నిజ
ఆరాధన చేసేవారు తక్కువ!
నేడు క్రీస్తుకు సాక్ష్యమివ్వు.
సాక్ష్యమివ్వడం అనగా కేవలం క్రీస్తు గురించి మాట్లాడటం కాదు. దేవుని పట్ల నీ
విధేయతా జీవితం ద్వారా నీవు సాక్ష్యమివ్వ గలగాలి. దేవుని వాక్కును జీవించడం ద్వారా
సాక్ష్యమివ్వ గలగాలి. ఎమ్మావు మార్గములో ఇద్దరు శిష్యులు యేసు గురించి తర్కించు
కొనుచుండగనే ఉత్థాన క్రీస్తు వారికి కనిపించారు, వారివెంట
నడిచారు, వారితో రొట్టెను భుజించారు... అలాగే, మన సాక్ష్యములో స్వయముగా యేసు
ప్రభువే మనకు తోడు ఉంటారు. మనం ఏమి మాట్లాడాలో తెలియ జేస్తారు. మనకు ధైర్యము నిస్తారు.
కనుక, మనము దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అందరు మనలను వదిలివేశారు
అనుకున్నప్పుడు,
అక్కడ ప్రభువు మనతో ఉంటారు. సువార్తను ఇతరులతో ప్రకటించు
ప్రతీ సందర్భములో యేసు భగవానుడు మనతో ఉంటారు. ఇది నా వ్యక్తిగత అనుభవం! “ఎక్కడ
ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉంటాను” (మత్తయి
18:20).
తరతరాలుగా ఈ సాక్ష్యము వలననే మనం విశ్వాసాన్ని పొందాము. కనుక మన సాక్ష్యము ద్వారా భావితరాలవారిలో విశ్వాసాన్ని నింపగలగాలి. మన సాక్ష్యం ఎంత ప్రామాణికమైనదైతే, అంత ఎక్కువగా ప్రభావితం చేయగలదు. కనుక నేడు బోధకులకన్న, సాక్షులు ఎంతో అవసరం! మంచి మాటలు ఎంతో ముఖ్యం, కాని, వాటిని జీవించ గలగాలి. నేటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో మంచి మంచి వాక్యాలను, సూక్తులను పొందుతున్నాము. వాటిని లైక్ చేసి, షేర్ చేస్తే మన బాధ్యత తీరిపోయిందని భావిస్తూ ఉంటాము. వాటిని జీవించాలనే ఆలోచనే మనకు రాదు.“మీకు శాంతి కలుగునుగాక!” (లూకా 24:36) అని ఉత్థాన ప్రభువు శిష్యులతో పలికారు. ఉత్థాన క్రీస్తు ఒసగిన శాంతిని సకల జాతి జనులకు తీసుకొని రావాలి (సాక్షం ఇవ్వాలి). ‘శాంతి’ అనగా నాణ్యమైన జీవితం... నిజమైన శాంతి ఉత్థాన క్రీస్తే!
(Additional Notes)
పాత నిబంధనములో “సాక్ష్యము”ను
వివిధ సందర్భాలలో చూస్తాము. మొదటిది, వ్యక్తిగత సాక్ష్యము; ఒక వ్యక్తికిగాని, ఒక
సంఘటనకు గాని సాక్షం ఇవ్వడం. రెండవది, ఒక వ్యక్తి తాను గమనించిన దానిని
సత్యమైనదిగా, నమ్మదగినదిగా సాక్ష్యము ఇవ్వడం. దీనికి చక్కటి ఉదాహరణ రూతు 4:9-11. బోవసు
నగరమున ఉన్న పెద్దలందరిని సమావేశ పరచి తాను చేయబోయే కార్యమునకు సాక్షులను
చేయుచున్నాడు. మూడవదిగా, సాక్షులు తీర్పు విధించుటలో కూడా పాత్రను పోషింతురని
ద్వితీయో 17:7లో చూస్తున్నాము: “దోషిని శిక్షించునపుడు సాక్షులే మొదట రాళ్ళు
రువ్వవలయును.” అలాగే, నిర్దోషులుగా, నీతిమంతులుగా జీవించుటకు దేవుడు ధర్మశాస్త్రమును
సాక్ష్యముగా ఇచ్చెను.
దివ్య కారుణ్యం: దివ్యకారుణ్య మహోత్సవము 11 ఏప్రిల్ 2021
‘కరుణ’ లేదా ‘కారుణ్యము’ లేదా ‘కృప’ అనే తెలుగు మాటకు ఆంగ్లములో ‘Mercy’
అందురు. ‘Mercy’
అనే ఆంగ్ల మాట misericordia
అను లతీను పదం మూలం. misericordia అను పదం రెండు పదాల కలయిక: cor
అనగా ‘హృదయం’, misereri అనగా ‘జాలి కలిగియుండటం’ లేదా ‘దయ, కరుణ
కలిగియుండటం’. కనుక, కరుణ యనగా “ఇతరులపై హృదయపూర్వకమైన కరుణను కలిగియుండటం”. ఒక
వ్యక్తి యొక్క అంత:ర్గత / లోతైన భావమును తెలియజేస్తుంది. misericordia అను
పదమునకు మూలం mercedem లేదా merces అనే లతీను పదాలు. ‘Mercedem’ లేదా ‘merces’ అనే మాటకు ‘ప్రతిఫలము’, ‘వేతనము’, ‘కిరాయి’ అనే అర్ధాలు గలవు. నైతిక, మత, సామాజిక, చట్టపరమైన
సందర్భాలలో, ‘దయ, క్షమ’ అనే అర్దాలుకూడా ఉన్నాయి. బైబులు పరిభాషలో ఈ మాటకు (Mercy)
‘ప్రతిఫలము’ లేదా ‘వేతనము లేదా కిరాయి
చెల్లించ బడినది’ అని అర్ధము.
హీబ్రూ భాషలో rahamim అను పదానికి రెండు అర్ధాలు
ఉన్నాయి: ‘గర్భము’ మరియు ‘కరుణ’. “తల్లి ప్రేమ”ను సూచిస్తుంది. rehem అనగా
‘తల్లి గర్భము’. తల్లి ప్రేమ ఏమీ ఆశించనటు వంటిది. అది హృదయపు లోతులలో నుండి
వచ్చును. rahamim అనగా ‘మంచితనము,
సున్నితత్వం, సహనం, అర్ధంచేసుకొనుట’ అను అర్ధాలు వస్తాయి. వీటన్నింటికి అర్ధం
క్షమించుటకు సిద్ధముగా ఉండటం. “స్త్రీ తన పసికందును మరచినను దేవుడు మాత్రము నిన్ను
మరువడు” (యెషయ 49:15; చూడుము 54:6-8) “దేవుడు నిండు హృదయముతో ప్రేమించును” (హోషేయ 14:4; చూడుము 2:19).
‘కారుణ్యము’ అనునది దైవీక స్వభావమని, ఆయన కరుణ సర్వ ప్రాణికోటిపై
ఉంటుందని బైబులు బోధిస్తున్నది (కీర్తన 145:9). “దేవుని కృప అపారము” (ఎఫెసీ 2:4). “తండ్రి కృపామూర్తి” (2 కొరి 1:3). దేవుడు “దయార్ద్ర
హృదయుడు” (యిర్మియా 31:20; 42:12; లూకా 1:78). "ప్రభువు మిక్కిలి దయాపరుడు" (2 సమూ 24:14-15; చూడుము కీర్తన 25:6; 51:1; 103:13). ఇది అత్యంత గొప్ప దైవీక లక్షణం. ఈ గొప్ప
దైవీక లక్షణాన్ని యేసు ప్రభువు మనకు బహిర్గత మొనర్చారు (యోహాను 1:18, హెబ్రీ 1:1f.).
“ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద దేవుని కనికరము తరతరముల వరకు ఉండును” (లూకా
1:50) అని మరియ స్తోత్ర గీతములోని ఈ పలుకులు రక్షణ చరిత్ర యొక్క కొత్త కోణాన్ని
ఆవిష్కరిస్తున్నాయి.
దివ్యకారుణ్య అపోస్తరాలుగా పిలువబడే పునీత ఫౌస్తీనమ్మ గారి
మాటలలో చెప్పాలంటే, ఈ
పండుగ ముఖ్య ఉద్దేశాలు మూడు: (1). దేవుని కరుణను కోరుకోవడం,
(2). యేసుని అనంత కరుణను
నమ్మడం, (3). మనం
పొందిన/పొందుతున్న ఆ దేవుని కరుణను పంచడం.
ఈ పండుగ సందర్భముగా మనం ఈనాడు విన్న సువిశేషమును
ధ్యానిద్దాం. దానికి ముందుగా... నీకు తెలిసిన వారు ఎవరైనా అకస్మాత్తుగా తటస్థ
పడితే ఏమి చేస్తావు? లేదా
ఏమి అడుగుతావు? నీకు
మంచి చేసిన వాడైతే, మేలు
చేసిన వాడైతే, నీ
అభివృద్ది కోరేవాడైతే, వారు
మనల్ని చూడకపోయినా, మనమే
ఎదురెళ్లి, వారికి
అగుపడి గతమున చేసిన మేలును జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసి,
కుశల ప్రశ్నలు అడుగుతాం! అదే మనకు
చెడు చేసిన వారైతే, మనల్ని
మోసగించిన వారైతే, మన
నమ్మకాన్ని వమ్ము చేసినవారైతే, వంచనతో మన స్నేహాన్ని కోరిన వారైతే,
స్వార్ధం కొరకు ప్రేమగా నటించిన
వారైతే, వారిని
చూసినా కాని, చూడనట్లు
నటించి వారి చూపులనుండి, వారి
చుట్టు ప్రక్కల నుండి తప్పించు కొనడానికి ప్రయత్నిస్తాం! కొద్దిగా దైర్యవంతులైతే,
తప్పు చేయని వాడిని నా కెందుకు భయం
అని చూసి చూడనట్లుగా వెళతాం! ఇంకా అతను/ఆమె కాని మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తే,
జరిగింది,
చేసింది,
చెప్పింది చాలు! ఇక వెళ్ళు అంటాం! ఇంకా
మాట్లాడాలని ప్రయత్నిస్తే మోసగించిన, వంచన చేసిన, అవమానము, ఆ సందర్భము, ఆ సందర్భములో జరిగిన మాటలు, సంభాషణ, హృదయపు లోతులలో చేసిన గాయాలను గుర్తుకు తెచ్చుకొని
కోపపడతాము లేదా బాధపడతాము!
ఇదంతా ఎందుకు వివరిస్తున్నానంటే,
ఈనాటి సువార్తలో,
యేసు ప్రభువు అటువంటి పరిస్థితులలోనే
ఉన్నా, దానికి
భిన్నముగా ప్రవర్తించారు. ఆయనే వారికి అగుపడుచున్నారు. ఆయనే వారితో
మాట్లాడుచున్నారు. యూదుల భయముతో ఉన్న వారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఏమి
చేయాలో అని పాలుపోని స్థితిలో, ఏమి చేయాలో, ఎలా చేయాలో చెప్పుచున్నారు. బాధను,
భయమును పోగొడుచున్నారు. ఇంత జరిగినా,
ఏమీ జరగనట్లు,
ఏమీ తెలియనట్లు ఉన్నాడు.
అదే మనమైతే, నాయవంచాకులారా! విశ్వాస ఘాతకులారా! గురుద్రోహులారా! పిరికి
పందల్లారా! అని అనే వాళ్ళం! కాని ఆయన మాత్రం, షాలోం (శాంతి) సమాధానం కలుగుగాక! సమృద్ధి కలుగును గాక!
ఆనందం సంతోషం వర్ధిల్లుగాక! అని వారిని సంభోదిస్తూ ఉన్నారు. ఎందుకంటే,
(ఆయన) మన పాపాలకు తగినట్లుగా మనలను
శిక్షింపడు, మన
దోషములకు తగినట్లుగా మనలను దండింపడు
(కీర్తన 103:10).
ఆయన కరుణగలవాడు, దయగలవాడు. అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు. సులభముగా కోపపడువాడు కాదు.
ప్రేమామయుడు, విశ్వాసమందు
అనంతుడు (నిర్గమకాండము 34:6). అందుకే నమ్మని తన శిష్యులకు,
తనకు కలిగిన గాయాలను చూపిస్తున్నాడు.
ఈ సందర్భములో మనమైతే, ఇదిగో
మీ/నీ నయవంచనకు మోసమునకు, విశ్వాస
ఘాతమునకు, గురు
ద్రోహమునకు గుర్తు! అని అంటాం! కాని ప్రభువు అంటున్నాడు: ఇదిగో మీ రక్షణ చిహ్నాలు,
మీ పాపమునకు పరిహారముగా సిలువ మీద
నన్ను సమర్పించుకొన్నాను అనడానికి చిహ్నాలు - మీ పాపములకు జీతము/ప్రతిఫలము/కిరాయి
చెల్లించ బడినది అనుటకు గుర్తు. మీ కొరకై, మీ విముక్తి కొరకై, అమ్మబడ్డాను, చంపబడ్డాను/ పరిహార బలిగా అర్పింపబడ్డాను అని అనడానికి
గుర్తు. మీపై గల ప్రేమకు,
రక్షణకు,
కరుణకు గుర్తులు నా తీపి
జ్ఞాపకాలు. మీరు చెల్లించవలసిన మూల్యం
(అప్పు) చెల్లించబడినది అని నిరూపించే రసీదు.
మీరు పొందిన ఈ పరిహారమును, మన్నింపును, విముక్తిని, మీతోనే, మీకొరకే, పరిమితం చేసికొనకుండా, ఇతరులకు పంచండి. మన్నింపులోని మహత్యమును కరుణలోని కమనీయతను
వెదజల్లండి అని భోదిస్తున్నాడు యేసు. ఇంకా ఈ కరుణకు దూరముగా ఉంటె,
కరుణకు దగ్గరవ్వాలని కోరుకొందాం! మనకు
దగ్గరయి, మనలను
దేవుని దరికి చేర్చిన క్రీస్తు కరుణను నమ్ముదాం! నమ్మిన ఆ కరుణను పొంది,
పంచుదాం ... మన తోటి వారందరికీ...
శ్రీసభలో “దివ్యకారుణ్య
మహోత్సవం” స్థాపించబడాలని
ప్రభువే స్వయముగా కోరినట్లు పునీత ఫౌస్తీనమ్మగారు (దివ్య కరుణ అపోస్తురాలు) తన
దినచర్య పుస్తకములో తెలిపియున్నారు (699). ప్రభువు ఆమెకి ఈ మహోత్సవమునుగూర్చి
ఫిబ్రవరి 22, 1931వ
సంవత్సరములో తెలిపియున్నారు, “పునరుత్థాన పండుగ తరువాత వచ్చు ఆదివారమున (పాస్కా
రెండవ ఆదివారము) దివ్యకారుణ్య మహోత్సవం కొనియాడబడాలనేదే నా కోరిక. ఆ దినమున, దివ్యకరుణ
సకల జనులకు ఒసగబడును. ఆ దినమున, పాపసంకీర్తనం చేసి, దివ్యసత్ప్రసాదమును
స్వీకరించు వారికి సంపూర్ణ పాపవిమోచనము, శిక్షనుండి విముక్తియును లభించును.
మానవ లోకము నా దరికి చేరిననే తప్ప అది శాంతమును పొందలేదు. ఆనాడు, అనంత
దివ్య వరానుగ్రహాలూ ప్రవహించే దివ్య ద్వారాలన్నీ తెరచే ఉంటాయి. వారి పాపాలు
ఎంతటివైనను, నన్ను చేరడానికి ఏ ఆత్మగాని భయపడక ఉండునుగాక! నా దరి
చేరు ఆత్మలకు నా కరుణా సముద్ర వరాలను క్రుమ్మరించెదను. దివ్యకారుణ్య మహోత్సవం సకల
ఆత్మలకు, ముఖ్యముగా పాపాత్ములకు శరణముగాను, ఆదరణముగాను
ఉండునుగాక!''
పునరుత్థాన మహోత్సవము తర్వాత వచ్చు ఆదివారమున కరుణ
మహోత్సవమును కొనియాడుట ద్వారా, మన రక్షణ పాస్కాపరమ రహస్యమునకు,
దివ్యకారుణ్యమునకు ఎంతో సంబంధము
కలిగియున్నదని విదితమగుచున్నది. ఆ దినమున, ప్రత్యేకముగా రక్షణ పరమ రహస్యము దివ్యకారుణ్యము యొక్క అతి
గొప్ప వర ప్రసాదము అని ధ్యానించాలి. దివ్యకరుణ మహోత్సవానికి ముందుగా దివ్యకరుణ
నవదిన ప్రార్ధనలను, దివ్యకరుణ
జపమాలను జపించి ధ్యానించి ఉత్సవానికి సంసిద్దులము కావలయునని ప్రభువు కోరుచున్నారు.
నవదిన ప్రార్ధనలను చెప్పువారికి సాధ్యమైనన్ని వరాలు ఒసగబడును.
దివ్యకరుణ మహోత్సవాన్ని ఘనముగా,
వైభవముగా కొనియాడాలనేదే ప్రభువు
ఆకాంక్ష. ఈ మహోత్సవాన్ని జరుపుకొనే విధానాన్ని ప్రభువు రెండు విధాలుగా సూచించారు.
మొదటగా, దివ్యకరుణ
చిత్ర పటాన్ని ఆశీర్వదించి, సమూహముగా
గౌరవించి, ఆరాధించాలి
(49, 341,
414, 742). రెండవదిగా, ఆ దినమున గురువులు దివ్యకరుణ గూర్చి దైవప్రజలకు బోధించాలి
(570, 1521).
దివ్యకారుణ్య సందేశము
దేవుడు దయామయుడు. ప్రేమ స్వరూపి. మన కొరకు తన ప్రేమను,
కరుణను ధారపోసియున్నాడు. దేవుని
కరుణను విశ్వసించుదాం. పరులపట్ల కరుణను చూపుదాం. ఎవరును దేవుని కరుణకు దూరము
కాకూడదని ఆయన కోరిక. ఇదియే దివ్యకారుణ్య సందేశము. రాబోవు జీవితమున దేవుని కరుణను
మనం పొందాలంటే, ఈ
జీవితమున ఇతరులపట్ల కరుణతో జీవించాలి. దేవుడు మనందరిని మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. మన
పాపములకన్న ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అనంతమైనది. హద్దులు లేనిది, షరతులు లేనిది. తద్వారా,
నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి,
ఆయన కరుణను పొంది,
మన ద్వారా,
ఇతరులకు కూడా ఆ కరుణ ప్రవహించాలనేదే
దేవుని కోరిక. ఆవిధముగా, ప్రతి
ఒక్కరు దైవ సంతోషములో పాలుపంచు కొనగలరు.
దివ్యకారుణ్య సందేశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలంటే,
మూడు కార్యాలు చేయాలి:
1. దివ్య కరుణను వేడుకోవాలి: ప్రార్ధనలో మనం దేవున్ని తరచూ కలుసుకోవాలన్నదే ఆయన కోరిక.
మన పాపాలకి పశ్చత్తాపపడి, ఆయన
కరుణను మనపై, సమస్త
లోకముపై క్రుమ్మరించబడాలని దివ్య కరుణామూర్తిని వేడుకోవాలి.
2. కరుణ కలిగి జీవించాలి: మనం కరుణను పొంది, మన ద్వారా ఆ కరుణ ఇతరులకు కూడా లభించాలన్నదే దేవుని కోరిక.
ఆయన మనపై ఏవిధముగా తన అనంత ప్రేమను, మన్నింపును చూపిస్తున్నారో, ఆ విధముగానే మనము కూడా ఇతరుల పట్ల ప్రేమను,
మన్నింపును చూపాలని ప్రభువు
ఆశిస్తున్నాడు.
3. యేసును సంపూర్ణముగా విశ్వసించాలి: తన దివ్యకరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడి యున్నవని
మనం తెలుసుకోవాలనేదే ప్రభువు కోరిక. మన ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే,
విశ్వసిస్తే,
అంతగా ఆయన కరుణా కృపావరాలను
పొందుతాము.
“దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు” (మత్త. 5:7). “నాకు ఒసగబడిన ఈ దైవకార్యము నా మరణముతో అంతము కాదని, ఇది ఆరంభమేనని, నాకు ఖచ్చితముగా తెలుసు. అనుమానించు ఆత్మలారా! దేవుని యొక్క మంచితనము గూర్చి మీకు ఎరుకపరచుటకు, నమ్మించుటకు పరలోకపు తెరలను తీసి మీ చెంతకు తీసుకొని వత్తును” (పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 281).
యేసుక్రీస్తునందు ప్రధమముగా బహిరంగ పరచబడిన దేవుని దివ్యకరుణా రహస్యం, ఈ యుగానికొక గొప్ప సందేశము. మానవ చరిత్ర ప్రతి దిశలోనూ, ముఖ్యముగా, ఈ యుగములోను, దివ్య కరుణా రహస్యాన్ని లోకానికి చాటిచెప్పాల్సిన గురుతర భాద్యత శ్రీసభకు ఉన్నది (పునీత రెండవ జాన్ పాల్ పోప్). “యేసుక్రీస్తు వ్యక్తిగా కారుణ్యమూర్తి. క్రీస్తును దర్శిస్తే దైవకారుణ్యమును దర్శించడమే” (16వ బెనెడిక్ట్ పోప్).
మనం దేవుని పోలికలో సృజింపబడినాము. కనుక, ఆ దివ్య కారుణ్యము మనకి ఇవ్వబడును. వినమ్ర హృదయులై దేవుని కరుణను అంగీకరించుదాం. మన ప్రేషిత కార్యము ద్వారా, ఇతరులకు దేవుని కరుణను అందిద్దాం. మనం క్రీస్తు శిష్యులముగా కొనసాగాలంటే, ఈ దివ్య కారుణ్యమును, ప్రేమను కొనసాగించాలి.