Showing posts with label St. Francis of Assisi. Show all posts
Showing posts with label St. Francis of Assisi. Show all posts

అస్సీసిపుర ఫ్రాన్సిస్ పంచగాయాలు - 800 సం.ల వార్షికోత్సవము

అస్సీసిపుర ఫ్రాన్సిస్ పంచగాయాలు - 800 సం.ల వార్షికోత్సవము
గురుశ్రీ ప్రవీణ్ గోపు, కపూచిన్
రెక్టర్, వియాన్ని కాలేజి, జానంపేట (ఏలూరు)

అక్టోబరు 4న, విశ్వశ్రీసభ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉంటుంది. సెప్టెంబరు 17న ఫ్రాన్సిస్ వారి పంచగాయాల పండుగను కొనియాడుతుంది. ఈ పండుగను 5వ పౌలు జగద్గురువులు ఆమోదించారు. అయితే, 2024 ప్రత్యేకత ఏమిటంటే, ఫ్రాన్సిస్ పంచగాయాలు పొంది 800 సం.లు (17.09.1224-17.09.2024) పూర్తియైన సందర్భముగా, శ్రీసభ, ముఖ్యముగా, ఫ్రాన్సిస్కన్ సహోదరీ, సహోదరులు వార్షికోత్సవాన్ని కొనియాడుచున్నారు. 3 అక్టోబర్‌ 1226లో ఫ్రాన్సిస్ స్వర్గస్తులైనారు. ఈ సందర్భముగా, జనరల్ మినిస్టర్ బ్రదర్ ఎలియాస్, “నేను మీకొక సంతోషకర, నూతన అద్భుతాన్ని ప్రకటిస్తున్నాను. దైవకుమారుడైన క్రీస్తులో తప్ప ఆరంభమునుండి వినబడని సూచన. అతని మరణానికి కొంతకాలం ముందుగా, మన సోదరుడు, తండ్రియునైన ఫ్రాన్సిస్ తన శరీరములో పంచగాయాలను పొంది, సిలువ వేయబడిన క్రీస్తును పోలినట్లుగా కనిపించారు” అని ఫ్రాన్సిస్ మరణ వార్తను ప్రకటిస్తూ లేఖను విడుదల చేసాడు. అయితే, ఫ్రాన్సిస్ పంచగాయాలను మరణావస్థలో పొందినవి కావు. తన మరణానికి రెండు సంవత్సరాలకు ముందుగా, 17 సెప్టెంబరు 1224న క్రీస్తు పవిత్ర పంచగాయాలను పొందియున్నాడు. క్రైస్తవ చరిత్రలోనే ఇదొక మరుపురాని మైలురాయి. ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. క్రీస్తు శ్రమలతో పునీతుని లోతైన ఐఖ్యతకు అద్భుత చిహ్నం. అతని పవిత్రతకు, అంకితభావానికి గొప్ప సూచన. దైవచిత్తానికి సంపూర్ణముగా తలొగ్గడం. క్రీస్తు ప్రేమపట్ల అమితాసక్తి కలిగియుండటం. సిలువలో కొట్టబడిన క్రీస్తుపట్ల, ఆయన శ్రమలపట్లనున్న ఫ్రాన్సిస్ భక్తికి ఇది పరాకాష్ట! పేదరికము, వినయము, దాతృత్వము పట్ల ఫ్రాన్సిస్ నిబద్ధతకు ఇదొక అద్భుత సాక్ష్యము.

 ఇటలీ దేశములోని ‘లవర్నా’ పర్వతమునకు ఫ్రాన్సిస్‌, మరో ఇరువురు సహోదరులతో వెళ్ళాడు. వారిలో బ్రదర్ లియో ఒకరు. ఆగష్టు 15 మరియ మోక్షారోపణ పండుగ తరువాత, ఫ్రాన్సిస్ ‘లవర్నా’ పర్వతమునకు వెళ్లి అక్కడ 29 ఆగష్టు అతిదూతయగు పునీత మిఖయేలు పండుగ వరకు ఉపవాస ప్రార్ధనలో గడపడం ఆనవాయితీ!

1224వ సం.లో, ‘లవర్నా’ ‘పర్వత శిఖరముపై, ఫ్రాన్సిస్ ఏకాంతముగా, తీవ్రమైన ఆధ్యాత్మిక చింతనతో ఉపవాస ప్రార్ధనలు చేయు సమయములో, ఆరు మండుతున్న రెక్కలతోగల సెరాఫీము దేవదూత స్వర్గమునుండి దిగిరాగా, రెక్కల మధ్యన, సిలువపై సిలువవేయబడిన క్రీస్తును ఫ్రాన్సిస్ గాంచాడు. ఆ దృశ్యములో, క్రీస్తు దయగల చూపు ఫ్రాన్సిసును సంతోషముతో నింపగా, యేసు సిలువ వేయబడటం అతనిని దు:ఖముతో నింపినది. ఇది క్రైస్తవ ప్రేమ పారడాక్స్ను వ్యక్తపరుస్తుంది. అలా సిలువ వేయబడిన క్రీస్తు దర్శనములో మమేకమై యుండగా, అకస్మాత్తుగా తన శరీరముపై క్రీస్తు పంచగాయాలు పొందియున్నాడు’. ‘క్రీస్తు దర్శనాన్ని చూసి ఫ్రాన్సిస్ సంతసించాడు. అతని ఆత్మ వేదనతో కూడిన ఆనందాన్ని అనుభవించింది. గతములో ఎన్నడూ వినని, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన క్రీస్తు పవిత్ర పంచగాయలతో అలంకరించబడిన నూతన వ్యక్తిగా ఫ్రాన్సిస్ ‘లవర్నా’ పర్వతము దిగివచ్చాడు’ అని థామస్ సెలానొ (1229) మరియు పునీత బొనవెంతుర (ఫ్రాన్సిస్ జీవిత చరిత్ర, 13వ శతాబ్దం మధ్యకాలం) వివరించారు. సెరాఫీము దేవదూతల గురించి యెషయ 6:2-3లో చదువుతాం. “మండుతున్న రెక్కలు” క్రీస్తు ఫ్రాన్సిసుకు తెలియబరచిన ప్రజ్వరిల్లే దైవప్రేమను సూచిస్తుంది. అందుకే, “ఫ్రాన్సిస్ హృదయం ఉత్సాహముతో ప్రజ్వరిల్లినది. అతని శరీరం సిలువ వేయబడిన క్రీస్తు రూపాన్ని కలిగి యున్నది మరియు దైవీక ముద్రతో సీలు చేయబడినది” (అల్బాన్ బట్లర్, “పునేత అస్సీసిపుర ఫ్రాన్సిస్ జీవితము”).

ఫ్రాన్సిస్‌ తన చేతులు, కాళ్ళు, ప్రక్కటెముకలో గాయాలను పొందినట్లుగా స్పష్టముగా వర్ణించారు. ఈ పంచగాయాలు రెండు సంవత్సరాల పాటు, అనగా తన మరణము వరకు ముద్రించబడి యున్నాయి. తాను పొందిన పంచగాయాలను వీలైనంత వరకు ఎవరి కంటబడకుండా గుప్తముగా యుంచేవాడు. ఇది అతని వినయాన్ని, ఆయన జీవించిన పేదరికాన్ని తెలియజేయు చున్నది. ఒక హతసాక్షి మరణాన్ని పొందకున్నాను, ఈవిధముగానైనా క్రీస్తు శ్రమలలో పాల్గొన్నందుకు ఫ్రాన్సిస్ సంతోషపడ్డాడు. పంచగాయాలు భౌతికమైన సంకేతాలు మాత్రమేగాక, లోతైన ఆధ్యాత్మిక సంకేతాలు. ఫ్రాన్సిస్ క్రీస్తు శ్రమలతో పోల్చుకొనుటను, క్రీస్తు వినయమును, త్యాగమును అవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దైవదర్శనం కేవలం ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే గాక, ఫ్రాన్సిసుకు క్రీస్తు ప్రేమాభిమానాలతో, సంకల్పముతోనున్న ఐఖ్యతకు, మమేకతకు గొప్ప నిదర్శనం!

గ్రీకు భాషలో, “స్తిగ్మాట” (Stigmata) అన్న పదానికి ‘సిలువ వేయబడిన క్రీస్తు గాయాలను పోలియుండే శరీరముపై పొందు గుర్తులు’ అని అర్ధం. ‘పంచగాయాల’ గురించి బైబులులో వివరించబడనప్పటికినీ, క్రీస్తు బాధలలో భాగస్థులమవడం అనే భావన నూతన నిబంధనలోని ఫిలిప్పీ 3:10; గలతీ 2:20లో చూడవచ్చు. “నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించియున్నాను” (గలతీ 6:17) అని పునీత పౌలుగారు తన లేఖలో వ్రాసారు. క్రైస్తవ చరిత్రలో రికార్డ్ చేయబడిన, పంచగాయాలను పొందిన ప్రధమ వ్యక్తి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారే! పౌలుగారు చెప్పినట్లుగా, ఫ్రాన్సిస్ పంచగాయాలు క్రీస్తు శ్రమలతో నొకటిగా గావింప బడ్డాయి. గలతీ 2:20, “ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు”. ఫ్రాన్సిస్ పంచగాయాలు, తాను క్రీస్తుకు సంపూర్ణముగా చెందినవాడని తెలియజేయు చున్నాయి. అందుకే ఫ్రాన్సిస్ “అపర క్రీస్తుగా’, “మరో క్రీస్తుగా” పిలువ బడుచున్నాడు.

‘క్రీస్తు శ్రమల, మరణ గాయాలు, మానవాళిపై దైవప్రేమకు చిహ్నాలు. క్రీస్తు పంచగాయాలను కొంతమంది క్రైస్తవ విశ్వాసులు [పునీతులు] పొందడం, మనపై, మన రక్షణకోసమై, క్రీస్తు ప్రేమతో తన శరీరములో అనుభవించిన బాధను గుర్తుచేస్తుంది’.

పంచగాయాలపట్ల కొంత సందేహం, ప్రశ్నలు ఉండటం సాధారణమే! చరిత్రలో పంచగాయాల గురించి వివిధరకాలైన వివరణలను ఇచ్చారు. ఎన్నో సందేహాల నివృత్తి తర్వాతనే, విశ్వవ్యాప్తముగా ఆమోదించ బడినవి. ఏదేమైనప్పటికినీ, ఫ్రాన్సిస్ విషయములో, సందేహాలతో సంబంధము లేకుండా, అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి, క్రీస్తుతో ఐఖ్యతకు గొప్ప నిదర్శనము, సాక్షిగా నిలిచింది.

‘ఫ్రాన్సిస్ పంచగాయాల అష్టశతాబ్ది వేడుకల’ను కొనియాడు వేళ, ఫ్రాన్సిస్ జీవితం, ఆధ్యాత్మికత మరియు బోధనల గురించి తెలుసుకుందాం, ధ్యానిద్దాం! క్రీస్తు ప్రక్కనుండి ప్రవహించు ప్రేమ బలముతో, క్షమాపణ, స్వస్థత, సంతోషం, సౌభాతృత్వంతో జీవించుదాం. కేవలం సిలువచెంత మాత్రమే సువార్తను పూర్తిగా అర్ధంచేసుకోగలము. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫ్రాన్సిస్ పంచగాయాలు ప్రేమలోనున్న శక్తికి నిదర్శనం. కనుక ద్వేషముతోనున్న లోకం ప్రేమతో నింపబడాలి.

ఫ్రాన్సిస్ సువార్త వెలుగులో జీవించిన గొప్ప పునీతుడు. ఆయన జీవించిన ‘పేదరికం ఎవరూ జీవించి యుండరు. పేదవారిపట్ల ప్రేమ, సేవాభావముతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో, అప్పుడే దేవున్ని పరిపూర్ణంగా ప్రేమించగలనని నమ్మాడు. ప్రేమ, కరుణగల దేవుని మంచితనమును అలవర్చుకున్నాడు. పవిత్రాత్మచేత ప్రేరేపింప బడినాడు. ధాతృత్వమును జీవితాంతం ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి. తప్పుచేసిన తన సహోదరులను సరిచేయుటకు ఎన్నడు వెనకాడలేదు. “ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇకనైనా ఆరంభిద్దాం” అని తన మరణావస్థలో తోటి సహోదరులతో పలికిన గొప్ప పునీతుడు. దేవుని సృష్టిపట్లముఖ్యంగా మూగజీవులపట్ల సోదరభావాన్ని వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.

ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ.1182లో జన్మించారు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌, తల్లి పీకా. తండ్రి బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్‌ చలాకీగా, కలుపుగోలు తనముతో వ్యాపారంలో తండ్రికి సహాయం చేసేవాడు. కాని, విందు, వినోదాలకు ఖర్చుచేసేవాడు. యుక్తవయస్సులో గొప్ప యోధుడవ్వాలని కళలు కన్నాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు. పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డాడు. చెరనుండి విడుదల అయిన కొద్దిరోజులకే తీవ్రజబ్బున పడ్డాడు. కోలుకున్నాక, ఆపూలియా వెళ్ళు త్రోవలో ప్రభువు స్వరాన్ని విన్నాడు: “ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా, సేవకుడినా? ‘యజమానుడిని’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం. “నీవు యాజమానుడినిగాక, సేవకుడిని సేవిస్తున్నావు” అని ఆస్వరం పలికింది. అప్పుడు ఫ్రాన్సిస్‌, ‘అయితే, నన్నేమి చేయమంటారు? అని ప్రశ్నించాడు. “నీవు తిరిగి అస్సీసికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని ఆ స్వరం పలికింది. ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్త ధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానం చేసాడు. రోము నగరములోని పునీత పేతురు సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకురోగులకుముఖ్యంగా కుష్ఠరోగులకు సేవలు చేసాడు.

ఫ్రాన్సిస్‌ దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్తవయస్సులో, చిలిపిగా, విచ్చలవిడిగా జీవించినప్పటికినిమార్పుమారుమనస్సు అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాల్లో దేవుని వాక్యం, ప్రేమపై ధ్యానించాడు, ప్రార్ధించాడు. ‘దమియాను’ దేవాలయంలో సిలువపై వ్రేలాడు క్రీస్తు ఫ్రాన్సిస్‌ హృదిని, మదిని తొలిచింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే! అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టాడు. ఇలా దైవచిత్తాన్ని అన్వేషించాడు.

తన జీవితాన్ని చూసి కొందమంది ఆయన సహోదరులుగా, అనుచరులుగా చేరారు. 1209లో 3వ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మల రక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకు, భిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతినిచ్చారు. 1219 నాటికే ఫ్రాన్సిస్‌ సోదర బృందం ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిస్‌ స్థాపించిన సభ ఎంతగానో అభివృద్ధి చెంది, నేడు ప్రపంచమంతట సేవలను అందిస్తున్నది.

“యేసు సిలువ లోకానికి, మానవ చరిత్రకు కేంద్రం. ఒకవైపు సిలువ మానవ క్రూరత్వానికి సంకేతం. గందరగోళ పరిస్థితిలో జీవనదాతనే మనిషి సిలువ వేసాడు. మరోవైపు సిలువ, ఏ హింస, తిరస్కరణ ఆపలేని దేవుని స్వేచ్చకు, అనంత ప్రేమకు సంకేతం. ఫ్రాన్సిస్ తన జీవితములో దైవప్రేమను అనుభవించాడు. దాని సాక్ష్యమే అతను పొందిన పంచగాయాలు. ఈవిధముగా, దైవప్రేమకు, స్వేచ్చకు ఫ్రాన్సిస్ మరో సంకేతముగా, రుజువుగా, జ్ఞాపికగా మారాడు.
క్రీస్తు పంచగాయాలు – నూతన జీవితం
స్వస్థత: యేసు గాయాలు మనకు స్వస్థతను చేకూర్చును. మన గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును నయం చేస్తాయి. క్రీస్తు పంచగాయాలు మన బలానికి, విశ్వాసానికి మూలం. శాంతిని పొందుటలో మనక తోడ్పడగలవు. యెషయ 53:5 (చదువుము).
దేవుని బహిర్గత: యేసు గాయాలు దేవుని శక్తిని, ప్రేమను, దయను వెల్లడి చేస్తాయి. మనము, శ్రమల నొందునపుడు, యేసు తన గాయాలను తాకమని, దేవుని శక్తిని అనుభవించమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు.
విశ్వాసం: మన గాయాలు, యేసు గాయాలను తాకినప్పుడు లేదా కలిసినప్పుడు, మనలో నూతన విశ్వాసం జనిస్తుంది.
దివ్యసంస్కారాలు: శ్రీసభ దివ్యసంస్కారాలు, గాయపడిన క్రీస్తు ప్రక్కనుండి ప్రవహిస్తాయి. క్రీస్తు ప్రక్కనుండి నీరు, రక్తము ప్రవహించాయి. జీవదాయక కృప: క్రీస్తు గాయాలు, జీవదాయకమైన కృపను ఒసగును.

అస్సీసిపుర ఫ్రాన్సిస్ - మానవాళికి సేవ

అస్సీసిపుర ఫ్రాన్సిస్ - మానవాళికి సేవ (Editorial, "Thamby Velugu" October 2019)

మారుమనస్సు పొందక ముందు ఫ్రాన్సిస్‌, యోహాను (జాన్‌)గా పిలువబడినాడు. అస్సీసి పట్టణంలో (ఇటలి దేశం) ధనికుడైన బట్టల వ్యాపారి కుమారుడు. గొప్ప యోధుడిగా ఎదగాలని కలలు కన్న తను ఒక పోరాటంలో ఖైదీగా పట్టుబడి, ఒక సంవత్సరం పాటు చెరలో ఉంచబడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది. ఈ సమయంలో తనలో ఎంతో మార్పు కలిగింది.. కుటుంబ ఆస్తినంతా కూడా త్యజించి, స్వచ్చంధ పేదరికంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. దైవ పిలుపును అర్ధం చేసుకున్నాడు. తన జీవితాన్ని, సేవకు (సంఘంనుండి వెలివేసిన వారికి, పేదవారికి, కుష్ఠురోగుకు) అంకితం చేసుకున్నాడు. అస్సీసి పట్టణ ఆవ జీవిస్తూ ప్రార్ధించాడు, బోధించాడు, రోగుకు సేవ చేసాడు. కుష్ఠురోగు సేవద్వారా తనలో ఆధ్యాత్మిక చింత పెరిగింది, తన మిషన్‌, ప్రేషిత సేవను, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. కుష్టురోగును ఆలింగనం చేసుకోవడం ద్వారా, సర్వమానవాళిని గౌరవించాలి, రక్షించాలి అని తెలుసుకున్నాడు. సక సృష్టితో  సహోదర భావంను పెంపొందించు కోవడం కూడా మెల్లమెల్లగా తెలుసుకోగలిగాడు.

తనకున్న ఈ వైఖరి తను ఎంచుకున్న శాంతి, అహింసా, సంభాషణ మార్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. 1219లో జరిగిన ఐదవ క్రూసేడు సమయంలో ఈజిప్టుకు పయనించి సుల్తానుని కలిసి శాంతి సందేశంను బోధించాడు.

త్వరలోనే అస్సీసిలో అనేక మంది మన్ననను పొందాడు. తన పేద, ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి ఎంతోమంది ఆయనను అనుసరించారు. ఈవిధంగా, చిన్న సహోదర సంఘం ఏర్పడిరది. ఫ్రాన్సిస్‌ తన స్వచ్చంధ పేదరికం, సహోదరభావం, సంఫీుభావం ద్వారా, లోకాన్నే మార్చివేసాడు.

ఫ్రాన్సిస్‌ అనుచరుడనగా ‘‘స్వచ్చంధ పేదరికం’’లో జీవించడం, సోదరునిగా జీవించడం, మానవ గౌరవాన్ని పెంపొందిచడం (పేదవారు, అణిచివేయబడినవారు, అన్యాయానికి గురైనవారు).

ఫ్రాన్సిస్‌వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఈనాడు ఎంతోమంది తమ జీవితాను అంకితం చేసుకొని, ఫ్రాన్సిస్‌ వారి బాటలో నడుస్తూ, సేవా మార్గంలో జీవిస్తున్నారు. ఈనాడు ఫ్రాన్సిస్‌వారి అనుచరులు, స్వచ్చంధ పేదరికాన్ని జీవిస్తూ, ప్రపంచమంతటా తమ సేవను అందిస్తున్నారు. అలాగే, మానవ హక్కును పరిరక్షిస్తున్నారు.

కతోలిక శ్రీసభలో అతిపెద్ద కుటుంబం ఫ్రాన్సిస్‌గారి కుటుంబము (పురుషులు, స్త్రీతో కలిపి).  ఫ్రాన్సిస్‌ కుటుంబము మూడు శాఖలుగా విభజింప బడినది: 
మొదటి శాఖ మూడు సభలు:
- ఆర్డర్‌ అఫ్‌ ఫ్రైయర్స్‌ మైనర్‌  (OFM)
- ఆర్డర్‌ అఫ్‌ ఫ్రైయర్స్‌ మైనర్‌ కన్వెంచువల్స్‌ (OFM Conventuals)
- ఆర్డర్‌ అఫ్‌ ఫ్రైయర్స్‌ మైనర్‌ కపూచిన్స్‌ (OFM Capuchins)

రెండవ శాఖ పునీత క్లారమ్మ గారి సభ.

మూడవ శాఖ ఇతర ఫ్రాన్సిస్కన్‌ సభలు: థర్డ్‌ ఆర్డర్‌ రెగుర్‌ (TOR, (పురుషు, స్త్రీలు) మరియు సెక్యుర్‌ ఫ్రాన్సిస్కన్‌ ఆర్డర్‌ లేదా SFO (సాధారణ ప్రజల కొరకు).

పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ - క్రిస్మస్

పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ - క్రిస్మస్

పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ దివ్య బాల యేసునకు ప్రత్యేకమైన భక్తిని కలిగియున్నాడు. చరిత్రలో 1223వ సం॥లో క్రిస్మస్‌ జాగరణ సందర్భంగా పశువుల పాకను ఏర్పాటు చేసి క్రీస్తు జనన సన్నివేశాన్ని సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి. క్రీస్తు జన్మించిన చారిత్రాత్మకమైన పవిత్ర భూమికి తీర్ధయాత్ర చేయటం, ముఖ్యముగా బెత్లహేము నగరంలో ఉన్న గుహను సందర్శించటం, ప్రాన్సిస్‌ వారికి ఇలాంటి ప్రత్యేకమైన గొప్ప ఆలోచన రావటానికి కారణం అని చెబుతారు. ఈ అనుభవము వలననే పేదరికముతో, వినయముతో పశువుల పాకలో జనించిన దివ్య బాల యేసు పట్ల తన ప్రత్యేక భక్తి మరింత బలపడినది. వాస్తవానికి ఈ గొప్ప సుగుణాలను అనుకరించటానికి ఫ్రాన్సిస్‌ వారు సన్యాస సభను స్థాపించి    ఉన్నారు. ఇటలీ దేశంలో అస్సీసి పట్టణమునకు దరిగా ఉన్న గ్రేచియా అనే గుహలో క్రీస్తు జన్మను ఒక ప్రత్యేక అనుకరణములో ఫ్రాన్సిస్‌ పున:సృష్టించాడు. ఈ సందర్భంగా అచ్చట దివ్య పూజా బలిలో పాల్గొనాలని, తాను స్వయంగా ఏర్పరచిన పశువుల పాకలోని క్రీస్తు జనన సన్నివేశాన్ని దర్శించాలని అచ్చటి పట్టణ ప్రజలను ఆహ్వానించి యున్నాడు.

‘‘బెత్లెహేములో జన్మించిన ఆ బాలయేసును జ్ఞాపకం చేసుకుంటూ దివ్యబాల యేసు పొందిన అసౌకర్యాలను పశువుల పాకలో ఎలా పరుండినది, ఎద్దు, గాడిద తొట్టి ప్రక్కన ఎలా నిలిచి ఉన్నవి మొ॥గు సన్నివేశాన్నిటినీ తన కళ్ళారా చూడాని అలా చేయాలను కున్నాను’’ అని ఈ విధంగా చేయడానికి గల కారణాన్ని ఫ్రాన్సిస్‌ వారు ఒకసారి తన స్నేహితునితో చెప్పియున్నాడు.

ఫ్రాన్సిస్‌ వారు గ్రేచియా గుహలో పశువుల పాకను ఏర్పాటు చేసి దానిలో ఓ చక్కటి పశువుల తొట్టిని ఏర్పాటు చేసి, ప్రక్కన ఎద్దును, గాడిదను కట్టివేసి ఆ రోజు రాత్రి నిజముగా మొదటిసారి క్రిస్మస్‌ జరుగుతున్నట్టుగా, అనగా క్రీస్తు జన్మిస్తాడేమో అన్నట్లుగా క్రీస్తు జనన సన్నివేశాన్ని చాలా అద్భుతంగా సుందరంగా సృష్టించాడు. ఈ సన్నివేశం ద్వారా క్రీస్తు ఈ లోకానికి ఏ విధముగా ముఖ్యముగా పేదరికంలో, నిడారంబరంలో వచ్చి ఉన్నాడో ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాని అలా చేసి ఉన్నాడు.

గొప్ప సువార్త విలువయిన పేదరికముచేత ఎంతగానో ఆకర్షితుడైన ఫ్రాన్సిస్‌వారు, ఆయన జీవించి ఉన్న కాలంలోని భౌతిక వాదనను, దురాశను జయించడానికి ఈ సన్నివేశాన్ని సృష్టించినట్లుగా కూడా చెప్పుకుంటారు.

పునీత బొనవెంతుర గారు (ఫ్రాన్సిస్‌ స్థాపించిన సభ సభ్యుడు మరియు సమకాలికుడు) ఈ అద్భుత సన్నివేశం గురించి ఈ విధముగా వ్రాసియున్నారు: ‘‘ఫ్రాన్సిస్‌ వారి మరణానికి 3సం॥ల ముందు ఈ సంఘటన జరిగియున్నది. అత్యంత భక్తితో సాధ్యమైనంత గొప్ప ఉత్సవముగా ఉత్సాహముతో క్రీస్తు జనన సన్నివేశాన్ని కొనియాడారు. దీని కొరకై ఫ్రాన్సిస్‌ వారు అప్పటి పోపుగారి నుండి అనుమతిని కూడా పొందియున్నారు. ఆ తర్వాత పశువుల పాకను, తొట్టిని ఏర్పాటు చేసి, ఎండిన గడ్డిని, ఒక ఎద్దును, ఒక గాడిదను, అక్కడ కట్టివేశాడు. తన సహోదరుందరినీ పిలిచాడు. ప్రజలు కూడా అక్కడ సమావేశమయ్యారు. వారి సంతోష గానముతో అచ్చటి వనము దద్దరిల్లి పోయింది. అద్భుత రాత్రి ఘడియు వెలుగుతో, స్తుతి కీర్తనలతో, పాటలతో, మహా గొప్పదిగా గడచి పోయినది’’. ఎంత అద్భుతమైన సన్నివేశం! బొనవెంతుర గారు ఇంకా ఇలా వ్రాసియున్నారు : ‘‘దైవ సేవకుడు ఫ్రాన్సిస్‌ నిండైన భక్తితో ఆ తొట్టి ఎదుట నిలబడి ఉన్నప్పుడు, అతని కళ్ళలో నీళ్ళు తిరుగు చుండగా, ప్రకాశ వంతమైన ఆనందంలో మునిగి పోయాడు. ఫ్రాన్సిస్‌ వారు సువార్తను గానం చేశాడు. ఆ తర్వాత క్రిస్మస్‌ గురించి అక్కడ సమావేశమైన వారందరికీ ప్రసంగించాడు. తన సున్నితమైన ప్రేమను బట్టి, క్రీస్తు నామమును ఉచ్చరించలేక బెత్లహేము బాలుడాఅని పిలచియున్నాడు’’.

దివ్య బాల యేసు దర్శనం: ఫ్రాన్సిస్‌ మొదటిసారిగా పశువుల పాకను ఏర్పాటు చేసిన రోజున, ఫ్రాన్సిస్‌ వారికి అక్కడ సమావేశమైన వారికి, దివ్య బాల యేసు దర్శన మిచ్చినట్లుగా చెబుతారు. బొనవెంతురగారు వ్రాసినట్లుగా, ‘‘గ్రేచియా ప్రాంతంలోని జాన్‌ అనే యుద్ద వీరుడు క్రీస్తు ప్రేమ వలన యుద్ధమును వీడి ఫ్రాన్సిస్‌ వారికి ప్రియమైన స్నేహితుడుగా మారాడు. ఈ జాన్‌ గారు పొందిన దర్శన సాక్ష్యముగా, ఆ రోజు ఫ్రాన్సిస్‌ వారు తను చేసిన పశువుల పాకలోని తొట్టిలో పరుండి, నిద్రించుచున్న దివ్య బాల యేసును తన రెండు చేతులలోనికి ఆప్యాయముగా తీసుకొని తన గుండెలకు హత్తు కున్నాడు’’.

ఈ భక్తి ప్రచారం: పునీత ఫ్రాన్సిస్‌ ఆరంభించిన ఈ క్రిస్మస్‌ సన్నివేశం త్వరలోనే ఇటలీలోని ప్రతి దేవాలయములో ప్రాచుర్యము పొందినది. ఈ భక్తి, విశ్వాసం గృహాలలో కూడా త్వరలోనే చేరి పోయింది. ఈ రోజు అనేక సెక్యులర్‌ సంస్థలలో కూడా పశువుల పాకను కట్టడం చూస్తున్నాము. పశువుల పాక లేకుండా క్రిస్మస్‌ పండుగను ఊహించలేము. ఈ అద్భుత సన్నివేశం శ్రీసభ ఆచారంగా వస్తున్నది. అయితే మనము ఏర్పాటు చేసే పశువుల పాక కేవలం అంకరణ కొరకు కాక దివ్య బాల యేసుని వినయము, నిరాడంబరత, పేదరికం అనే సుగుణాలను మనము ధ్యానించాలి.

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)

ఫ్రాన్సిస్‌ 12వ శతాబ్దంలో జీవించిన గొప్ప పునీతుడు, మహనీయుడు. ఆయన జీవించిన పేదరికం’, ఎవరూ జీవించి ఉండరు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహ, సేవా భావాలతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించ గలనో, అప్పుడే దేవున్ని పరిపూర్ణంగా ప్రేమించగలనని ఎరిగినవాడు. ప్రేమ, కరుణ స్వరూపియైన దేవుని మంచితనమును ఫ్రాన్సిస్‌ అలవర్చుకున్నాడు. పవిత్రాత్మ చేత ప్రేరేపింప బడినవాడు. తనకున్న ధాతృత్వం, జీవితాంతం ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి. తప్పుచేసిన తన సహోదరులను సరిచేయుటకు ఎన్నడు వెనకాడలేదు. ‘‘ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇప్పటికైనా మొదలు పెడదాం’’ అని తన మరణావస్థలో తన సహోదరులతో పలికిన గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్‌. దేవుని సృష్టి పట్ల, ముఖ్యంగా మూగ జీవులపట్ల ప్రత్యేకమైన ఆకర్షణని, ప్రేమని, సోదరభావాన్ని వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.

ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.. 1182లో జన్మించారు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌, తల్లి పీకా. తండ్రి పెద్ద బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్‌ చలాకీగా, కలుపుగోలు తనంతో వ్యాపారంలో తండ్రికి సహాయం చేసేవాడు. కాని, ఫ్రాన్సిస్‌ విందు, వినోదాలకు అధికంగా ఖర్చుచేసేవాడు. యుక్త వయస్సులో గొప్ప యోధుడుగా కావాలని కళలు కన్నాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు. పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డాడు. చెరసాలలో కూడా అందరితో కలవిడిగా తిరుగాడుచూ చతురోక్తులతో నవ్వించేవాడు. చెరనుండి విడుదల అయిన కొద్ది రోజులకు తీవ్రజబ్బున పడ్డాడు. కోలుకున్నాక, ఆపూలియా వెళ్ళు త్రోవలో ప్రభువు స్వరాన్ని విన్నాడు: ‘‘ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా, సేవకుడినా?’’  ‘‘యజమానుడిని’’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం ఇచ్చాడు. మళ్ళీ ఆ స్వరం, ‘‘కాని, నీవు యాజమానుడిని గాక, సేవకుడిని సేవిస్తున్నావు’’ అని పలికింది. అప్పుడు, ఫ్రాన్సిస్‌, ‘‘అయితే, నన్నేమి చేయమంటారు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్వరం, ‘‘నీవు తిరిగి నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు’’ అని చెప్పింది. ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్త ధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానం చేసాడు. రోము నగరములోని పునీత పేతురు సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు సేవలు చేయాలని తీర్మానించుకున్నాడు.

దైవ చిత్తాన్వేషి
ఈనాటి మానవుడు కోరికలుఅనే వలయంలో చిక్కుకున్నాడు. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహ పడిపోతున్నాడు. సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక పోతున్నాడు. దేవుని వాక్యం, కార్యంపై ధ్యానంచేసి, ఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మానవునికి సమయం లేకుండా పోయింది. దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలోనున్న ఆనందాన్ని, సంతోషాన్ని గ్రహించలేక పోతున్నాడు.

ఫ్రాన్సిస్‌ దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్త వయస్సులో, చిలిపిగా యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికిని, మార్పు, మారుమనస్సు త్వరలోనే అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాల్లోనికి వెళ్లి దేవుని వాక్యంపై, ప్రేమపై ధ్యానించడం, ప్రార్ధించడం ప్రారంభించాడు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు క్రీస్తు ప్రతిమ ఫ్రాన్సిస్‌ హృదిని, మదిని తొలచడం ప్రారంభించింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే!

ఖచ్చితమైన దైవపిలుపును 14 మే 1208న పునీత మత్తయి గారి పండుగ రోజున పొందాడు. ఆనాటి సువార్తా, ‘‘క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం’’ ఫ్రాన్సిస్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం చేసుకున్నది వెమ్మటే ఆచరణలో పెట్టుటకు బయలు దేరాడు. ఇలా దైవ చిత్తాన్ని అన్వేషించాడు.

తన జీవితాన్ని చూసి కొందమంది ఆయన  సహోదరులుగా, అనుచరులుగా చేరారు. 1209లో 3వ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మరక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకు, భిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతిని ఇచ్చారు. 1219 నాటికి ఫ్రాన్సిస్‌ అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిస్‌ స్థాపించిన సభ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈనాడు ప్రపంచమంతటా వారు సేవలను అందిస్తున్నారు.

ఫ్రాన్సిస్‌ చాలా పేద జీవితాన్ని జీవించాడు. ఒక్కోసారి భోజనంలో బూడిద కలుపుకొని తినేవాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు ముళ్ళపొదల్లో పడుకొనేవాడు. తన సహోదరుల పట్ల శ్రద్ధగా ఉండేవాడు.

ప్రకృతి ప్రేమికుడు
ఫ్రాన్సిస్‌ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవాడు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమను, గౌరవాన్ని పెంచుకున్నారు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. సమస్తమును తన సహోదరీ, సహోదరులుగా పిలిచాడు. ప్రకృతి పట్ల, అతనికున్న ప్రేమ వలన, ఈ తరము వారు కూడా ప్రకృతి పట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు ప్రేరేపింప బడాలని ఆశిద్దాం.

14 సెప్టెంబర్‌ 1221లో ప్రార్ధన చేస్తుండగా పంచగాయాలను పొందాడు. 3 అక్టోబర్‌ 1226లో స్వర్గస్తులైనారు. మరణించిన రెండేళ్లకే శ్రీసభ ఫ్రాన్సిస్‌ను పునీతునిగా ప్రకటించింది.

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్: బాల్యము, యవ్వనము

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ వారి జీవిత చరిత్ర
(మూలము: పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్: పోవరెల్లో)

1. బాల్యము, యవ్వనము

జోవాన్న పీకా పురిటినొప్పులతో ప్రసవ వేదన పడుచున్నది. ఆమె భర్త పీటర్ బెర్నడోనె, అస్సీసి పట్టణంలోని ప్రముఖ బట్టల వ్యాపారులలో ఒకరు. ఆ సమయంలో వ్యాపార నిమిత్తమై ఫ్రాన్స్ దేశమునకు వెళ్లి యున్నాడు. అస్సీసి మార్గముగా వెళుతున్న ఒక యాత్రికుడు పీకా తో ఇలా అన్నాడు, “అమ్మా, దగ్గరలో ఉన్న పశువుల పాకలోనికి వెళ్ళినట్లయితే ఎలాంటి నొప్పులు లేకుండా మగబిడ్డను ప్రసవించెదవు.”

దేదీప్యమైన గది, పాలరాయితో నేల, బంగారు రేకు పూత పూసిన సీలింగ్, ఇలాంటి విలాసవంతమైన భవంతిని వీడి, పీకా ఆ పశువుల పాక లోనికి వెళ్ళినది. సుతిమెత్తని పట్టువస్త్రాలతో గాక ఎండు గడ్డితో ఆమె పరిచారకురాండ్రు, ప్రసవించుటకు పడకను పశువుల పాకలో సిద్ధము చేసియున్నారు. బెత్లెహేములోని పశువుల పాకలో కన్య మరియ వలనే 26 సెప్టెంబరు 1182 వ సం,,న పీకా అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది.

“అందరికీ హాయ్! అంతయు సిద్ధముగా ఉన్నది. బిడ్డకు జ్ఞానస్నానం ఇచ్చుటకు సాన్ రుఫీనొ కేతెద్రల్ కు వెళ్లెదము. అత్తా! ఏమి పేరు పెట్టాలని అనుకుంటున్నావు” అని పీకా మేనకోడలు బెయాట్రిస్ అడిగింది.

కొద్దిసేపు మౌనం తర్వాత పీకా ఇలా సమాధానం చెప్పింది, “జాన్ అని నామకరణం చేయబడును. బాప్తిస్త యోహాను గారి వలె, యేసు ప్రభువును ఆయన సువార్తను ఈ లోకానికి ప్రకటించుటకు పిలువబడునని నా అంతరాత్మ దృఢముగా చెప్పుచున్నది.”

తండ్రి పీటర్ బెర్నడోనె వ్యాపార నిమిత్తమై వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి తన కుమారుని చూచి చాలా సంతోషించాడు. కాని తన కుమారుని పేరు అతనికి నచ్చలేదు. ఫ్రాన్సిస్ అని పేరు పెడితే చాలా మంచిదని అన్నాడు. ఎందుకన, ఫ్రాన్స్ దేశం తనని సంపన్నునిగా, కీర్తిమంతునిగా చేసింది (ఫ్రాన్సిస్ అనగా ఫ్రాన్స్ దేశస్తుడు అని అర్థం). ఫ్రాన్సు దేశం తన మాతృదేశం అగుటచేత, ఫ్రాన్సిస్ అని పేరు పెట్టుటకు పీకా అంగీకరించింది.

ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడయ్యాడు. తన తండ్రి బట్టల దుకాణంలో పనిచేయుటకు ఇష్టపడ్డాడు. వారు అమ్మెడి పట్టువస్త్రాలు ఎంతో అందమైనవి, నాణ్యత కలవి. వారి దుకాణములో వస్త్రాలను అమ్మడంలో ఫ్రాన్సిస్ ఎంతగానో గర్వపడే వాడు. అంతేగాక అక్కడికి వచ్చే గృహిణులు, యువతులతో పరిహాసాలాడెడి వాడు. పట్టు వస్త్రాలపై అతిశయోక్తులు విసురుతూ వారిని ఎంతగానో ఆకర్షించేవాడు.

తన తండ్రి వ్యాపారము విరాజిల్లుటకు తను ఓ ప్రధాన కారణమని ఫ్రాన్సిస్ కు తెలుసు. ఆ పట్టణములో ఉన్న యువతులంతా, బట్టలు కొనడానికి గాక, ఫ్రాన్సిస్ అందాన్ని, మాటల సరళిని, చక్కని సంభాషణ చతురతను చూచుటకు వచ్చెడివారు. యువతులే గాక గృహిణులు కూడా ఫ్రాన్సిస్ ను అభినందించేవారు. తనే స్వయముగా అత్యంత సుందరమైన బట్టలు కొనమని అందరిని ఆలరించేవాడు.

వ్యాపారము లో దిట్ట అయిన పీటర్ బెర్నడోనె తన కుమారుని వ్యాపార సరళిని చూసి ఎంతగానో గర్వపడే వాడు. తరచుగా ఫ్రాన్సిస్, తలుపు దగ్గర నిలబడి, మీసాలు మెలేస్తూ, వచ్చే ప్రతి అమ్మాయి చెవిలో గుసగుసలాడే వాడు.

ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడవుతున్న కొలది చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆకర్షణకు కారణమైన ప్రతి ప్రదర్శనకు ఆహ్వానం పలికే వాడు. పగలంతా దుకాణంలో వ్యాపారం చేస్తూ, సాయంత్రానికి సంపాదించిన డబ్బుతో సరదాలు చేసేవాడు. కొద్దిపాటి శ్రమ కలిగితే చాలు, సంగీత సరళితో కాలం గడిపేవాడు. కొద్దిమంది గాయకులతో స్నేహం పెంచుకున్నాడు. యవ్వన కాలమంతా పట్టణములో జరిగే వినోద కార్యక్రమాల్లో, బహిరంగ ప్రదేశాల్లో జరిగే విందులు వినోద కార్యక్రమాల్లో, పొద్దు పోయే వరకు గడిపేవాడు. ఆస్సీసి పట్టణములో ఫ్రాన్సిస్ ప్రముఖ గాయకుడిగా, కళారంగ అభిలాషిగా గుర్తింపు పొందాడు.

పీటర్ బెర్నడోనె మంచి మనిషి, మంచి తండ్రి. కాని, చాలా గర్విష్టి. ఎందుకన, ఆనాటి సంస్కృతి, సాంప్రదాయాలు ఆయనను అలా మార్చివేశాయి. ఆయన జీవిత విలువలు ‘డబ్బు’ అనే పదముతో పోల్చవచ్చు. సుఖం, సంతోషం, హోదా, అధికారం, పేరు ప్రతిష్టలు, డబ్బుతో కొనగలిగే ప్రతీది ఆయన జీవితంలో ప్రాముఖ్యమైనవే!

తండ్రిగారి ఆశయాల ప్రభావం తెలియకుండానే ఫ్రాన్సిస్ పై పడింది. మంచి వ్యాపారవేత్తగా సుసంపన్నుడిగా పెరగాలని, యుద్ధములో పోరాట పటిమలు చూపి కీర్తి ప్రతిపత్తులు సాధించాలని, జీవితాంతం ధైర్యసాహసాలతో, శక్తిసామర్థ్యాలతో ఉత్తమ యోధునిగా, వీరుడు, ధీరుడుగా కొనసాగాలని, క్షమింపక తిరిగి దెబ్బ వేయాలని, కేవలము ధనవంతులు మాత్రమే జీవితంలో గెలవగలరని, జీవితాన్ని కలిగియుందురని ఫ్రాన్సిస్ మనసులో బలంగా పడిపోయింది.

సాహసాలు చేయడంలో ప్రీతిని, అనుకున్నది సాధించాలనే మొండి పట్టుదలను, వాస్తవంలో జీవించడం, తండ్రి నుండి ఫ్రాన్సిస్ వారసత్వంగా పుణికి పుచ్చుకున్నాడు.

అలాగే, తల్లి నుంచి మంచి అలవాట్లయిన మృదువైన మనస్తత్వం, ప్రేమానురాగాలు, సంగీతం, సాహిత్యం మొదలగు గుణాలను అలవర్చుకున్నాడు. ఆమె ఎప్పుడూ తన కుమారుడు విశ్వాసముతో, మంచితనముతో పెరగాలని ఆశించింది. ఆమె సద్గుణ మంతురాలు కనుక పేదవారిలో యేసుని చూడాలని, వారు ఎప్పుడు వచ్చినా వట్టి చేతులతో తిరిగి పంపకూడదని నచ్చచెబుతూ ఉండేది. “పేదలగు మీరు ధన్యులు... వినమ్రులు ధన్యులు... శాంతి స్థాపకులు ధన్యులు. మంచిగా జీవించు. నీకు దేవుని ఆశీర్వాదములు కలవు. పేదవారి పట్ల, బడుగువారి పట్ల, పీడితుల పట్ల, దయగా ఉండు. నిన్ను గాయ పరచిన వారిని క్షమించు” అని తల్లి యొక్క మృదువైన స్వరము ఫ్రాన్సిస్ లో ప్రతిధ్వనించేది.

తల్లిదండ్రుల విభిన్న అభిప్రాయాల మధ్య ఫ్రాన్సిస్ కుస్తీ పడే వాడు. యువకుడైన ఫ్రాన్సిస్ వారిరువురి ఆలోచనలతో రాజీ పడటానికి ప్రయత్నం చేసేవాడు. అంతయు సక్రమంగానే సాగుతున్నట్లుగా కనిపించింది. కాని, క్రమక్రమముగా తనలోని అంతరాత్మ ప్రబోధనాను సారముగా నూతన ప్రపంచం వైపు దృష్టిని సారించాడు. అప్పుడు దేవుడు-సాతాను, ఆత్మ-శరీరం, మంచి-చెడు, వెలుగు-చీకటి, ఎన్నటికీ రాజీపడవని, అవి ఎప్పుడూ కూడా విరుద్ధమైనవని తెలుసుకున్నాడు.

అదే సమయంలో, తన కుమారుడు ఫ్రాన్సిస్ యొక్క విలాసవంతమైన జీవితాన్ని, ఆర్థిక దుబారా ఖర్చులను చూసి తండ్రి పీటర్ బెర్నడోనె మిక్కిలిగా బాధపడేవాడు. తల్లి పీకా మాత్రం తన కుమారుని గురించి చాలా నిస్సందేహముగా, గొప్ప నమ్మకముతో ఉండేది. ఒకసారి పీటర్ బెర్నడోనె ఫ్రాన్సిస్ పై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి, కోపగించుకున్నప్పుడు తల్లియే కాపాడింది. ఆమె తన భర్తతో, “ఫ్రాన్సిస్ ఎన్నటికీ చెడ్డవాడిగా మారడు. అతను ప్రభువును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ఈ లోక సంబంధమైన జీవితాన్ని ఎక్కువకాలం కొనసాగించలేడు. తన పేరుకు తగ్గట్లుగా, యోహాను గారి వలె క్రీస్తుకు నిజమైన శిష్యుడిగా మారతాడు” అని తేల్చేసి చెప్పింది.