పునీత పెర్పెతువా, పునీత ఫెలిచిత - మార్చి 7

పునీత పెర్పెతువా, పునీత ఫెలిచిత - మార్చి  7
(వేదసాక్షులు క్రీ.శ. 203)

ఆఫ్రికా దేశములో 3 వ శతాబ్దం ఆరంభములో సెప్టెమియస్‌ సవేరస్‌ చక్రవర్తి పాలిస్తున్నాడు. అతడు క్రైస్తవ వ్యతిరేకి. క్రీస్తును నమ్మినవారిని నానా హింసకు గురి చేసి, క్రైస్తవ మతాన్ని విడచి పెట్టేలా ప్రోత్సహిస్తున్నాడు. విడచిపెట్టని విశ్వాసులను చంపివేస్తున్నాడు. ఇలా వేదసాక్షి మరణాన్ని పొందినవారే పునీత పెర్పెతువా, పునీత ఫెలిచిత గార్లు.

విబియ పెర్పెతువా ఒక ఉన్నత కుటుంబానికి చెందిన 22 ఏళ్ల యువతి. చంకలో ఒక బిడ్డ కూడా ఉంది. ఈమె దగ్గర పని చేసే యువతి ఒకామె ఉంది. ఆమె పేరు ఫెలిచిత లేదా ఫెలిసిటి. ఆమె నిండు చూలాలు. వీరిరువురు కూడా క్రీస్తును గాఢముగా నమ్మారు. విగ్రహారాధనను వదలి, బాప్తిజం పొందుటకు గురువు రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. వీరి మాటలను విని ఎంతోమంది క్రైస్తవ మతములోనికి వస్తున్నారు. ఈవిషయం చక్రవర్తికి తెలిసినది. వారిద్దరిని నిర్భందించమని ఆజ్ఞాపించాడు. వీరిరువురితో పాటు మరో ముగ్గురు క్రీస్తు భక్తులైన మహిళలు, వారి ఉపదేశకుడైన సెతూరస్‌ కూడా నిర్భందించబడ్డారు.  విగ్రహారాధకుడైన పెర్పెతువా తండ్రి ఖైదులలోనున్న కూతురు దగ్గరకు వచ్చి, ‘‘క్రీస్తును విడచి పెట్టు, నీకు విడుదల దొరుకుతుంది’’ అని అన్నాడు. అందుకు ఆమె, ‘‘నాన్నా! నేను క్రైస్తవురాలిని. నేను నేనే గాని వేరేదాన్ని కాను కదా!’’ అని తన విశ్వాసాన్ని వెల్లడించినది.

ఖైదీలో తన మొదటి రోజు గురించి తన డైరీలో ఈవిధముగా రాసింది, ‘‘ఇంత చీకటిని నేనేనాడు చూడలేదు. ఎంత కఠోరమైన రాత్రో! చాలా వేడి, సైనికుల మొరట ప్రవర్తన! నా బిడ్డను గురించే నా ఆందోళన! చివరకి జైల్లో ఒక మోస్తారు మెరుగ్గా ఉన్న చోటకు మమ్మును తరలించారు. అక్కడ నా బిడ్డకు పాలు ఇవ్వగలిగాను.’’

తన కల గురించి ఇలా వ్రాశారు, ‘‘కలలో నా వద్దకు ఒక బంగారు నిచ్చెన వచ్చి నిబడినది. నేను స్వర్గద్వారానికి ఎక్కిపోయాను. ఒక ఎత్తాటి గొర్రె కాపరిని చూశాను. చుట్టూ తెల్లని వస్త్రాలు ధరించిన వేలాదిమంది ఉన్నారు. నావంక పుత్రికా వాత్సల్యముతో చూసి, ‘స్వాగతం బిడ్డా! రా!’ అని గంభీర స్వరముతో ఆహ్వానించారు.’’ఈ దృశ్యముతో పెర్పెతువాగారి విశ్వాసం మరింత బపడినది.

వారు క్రీస్తును త్యజించక పోవడముతో, న్యాయ తీర్పరి, ‘‘వీరిని కైసరు చక్రవర్తి పుట్టినరోజు పండుగనాడు పోటీలు నిర్వహించడానికి బోనుల్లో పట్టి తెచ్చే క్రూర మృగాలకు కేరింతలు కొట్టే ప్రేక్షకుల సమక్షములో ఆహారముగా వేయండి’’ అని తీర్పు ఇచ్చాడు. ఈలోగా, ఒక రోజు పెర్పెతువా గారికి మరో కల వచ్చింది. ఆమె సోదరుడు అందమైన ముఖముపై భయంకరమైన పుండు అంకురించి మరణించాడు. కాని, అతడు మోక్షప్రాప్తినొంది ఆనందముగా ఉన్నట్లు కలలోని దృశ్యం. ఆ తర్వాత ఆమెను మరో జైలుకు మార్చారు. తన స్నేహితురాలైన ఫెలిచితకు దూరముగా వెళ్ళినది. అక్కడ ఒక రాత్రి మరో కలగన్నారు. డీకన్‌ అయిన పంపోనియస్‌  కనబడి తాను చూసిన క్రైస్తవ ధర్మమార్గములోనే కడపటి వరకు నడచిరావాలని ఆహ్వానించారు.

ఫెలిచిత గర్భవతిగా ఉండుట వలన శిక్ష అమలు జరపడం ఆపివేయడమైనది. అయితే కైసరు ఉత్సవానికి మూడు రోజుల ముందుగా ఆమె ప్రసవించినది. నిర్ణీత సమయానికి ముందుగానే ఆమె ఆడపిల్లను కన్నారు. ఇప్పుడు శిక్షను అమలు చేయుటకు నిర్ణయించారు. ఆ క్రైస్తవ పుణ్య స్త్రీను అడవి మృగాలకు ఆహారముగా విడువబడ్డారు. క్రూరమృగాల పోటీ ఆవరణలో ప్రజల కోలాహలం మధ్య వారు పులులు, సింహాలకు ఆహారముగా నిలబడ్డారు. అయితే, ఆ క్రూరమృగాలు సాధుజంతువుల్లా ఏ హాని చేయక నిబడ్డాయి.  పెర్పెతువా గారు ఎలుగెత్తి, ‘‘క్రైస్తవ విశ్వాసుల్లారా! మీ విశ్వాసములో మీరు గట్టిగా నిలబడండి. ఒకరి యెడల ఒకరు ప్రేమనే చూపండి. మా బాధకు మీరు భయకంపితులు కాకండి’’ అని పలికారు.

జైలులో ఈ పుణ్య స్త్రీ ఆదర్శం పరిశీలించిన జైలు అధికారి మారుమనస్సు పొంది తాను కూడా క్రీస్తును నమ్ముచున్నట్లు బాప్తిజం తీసుకుంటానని ప్రకటించాడు. ఇంతలో కసాయి తలాయి వచ్చి ఆ పుణ్య స్త్రీలను తమ కత్తులకు బలిచేసి ప్రాణాలు తీశారు. ఈ సంఘటన క్రీ.శ. 203 మార్చి 7వ తేదీన జరిగింది. పెర్పెతువా అనగా నిత్య, శాశ్వత అని అర్ధం. ఫెలిచిత అనగా ఆనందం అని అర్ధం.

ధ్యానాంశం: మీరు మొలకువతో ప్రవర్తింపుడు. ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు. ప్రార్ధనా మందిరములో మిమ్ము చెండాడుదురు. అధిపతుల ఎదుట, రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలిచెదరు’’ (మార్కు. 13:9).

No comments:

Post a Comment