పునీత శ్రామిక యోసేపు

 పునీత శ్రామిక యోసేపు

“మీరు ఏ పని చేసినప్పటికిని దానిని చిత్తశుద్ధితో మనుష్యుల కొరకు చేయుచున్న కార్యము వలెగాక, దేవుని కార్యముగా భావించి చేయుడు. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తుంచుకొనుడు. ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు” (కొలొస్సీ 3:23-24)


యోసేపు, కన్య మరియమ్మ భర్త, యేసుకు సాకుడు తండ్రి. దావీదు వంశస్థుడు. పాలస్తీనా, గలిలీయ ప్రాంతములోని నజరేతు నివాసి. శ్రామికుడు, ధార్మికుడు. దయగలవాడు, దైవచిత్తానికి విధేయుడు. నీతిమంతుడు (మత్త 1:19). నీతిమంతుడనగా చట్టాన్ని ప్రేమించి, గౌరవించే వ్యక్తి. దేవుని చిత్తాన్ని పాటించేవాడు. యోసేపు గొప్ప విశ్వాసి, ప్రార్ధనాపరుడు. మరియ యేసులను మిక్కిలిగా ప్రేమించాడు. పవిత్రాత్మ వలన గర్భందాల్చిన మరియను భార్యగా చేకున్నాడు. యేసును కన్న కుమారునిలా చూసుకున్నాడు. వారి సంరక్షణకు, పోషణకు నిత్యం తపన పడ్డాడు, శ్రమించాడు.

యోసేపు వృత్తి వండ్రంగి. యూద సంస్కృతిలో చేతపని గౌరవప్రదముగా భావించబడేది. ఆ వృత్తితోనే తిరు కుటుంబాన్ని పోషించాడు. తన చేతి పనిద్వారా, నుదుటి చెమట ద్వారా, తిరు కుటుంబానికి అండగా ఉన్నాడు. తన శారీరక శ్రమద్వారా, దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్తుడయ్యాడు. యోసేపు తన పనిని ఎంతగానో ఇష్టపడ్డాడు. ఎప్పుడుకూడా అలసటను చూపలేదు. ఒక విశ్వాసిగా, పనిని సద్గుణముగా, విలువైనదానిగా, గౌరవనీయమైనదిగా మార్చాడు. తన పనిలో ఎల్లప్పుడు సంతృప్తిని పొందాడు. ప్రతీ పని విలువైనదే. యోసేపు రెండురెట్లు పనిచేసాడు. వండ్రంగిగా, నిజాయితీగా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించాడు. అలాగే యేసును పెంచడములో, మరియమ్మతో కలిసి పనిచేసాడు. ఈ ప్రపంచములో కుటుంబాన్ని పోషించడం, పిల్లలను పెంచడము రెండూ విలువైన పనులే! తండ్రిగా తన పాత్రను పరిపూర్ణముగా పోషించాడు.

యేసుకూడా, యోసేపునుండి వండ్రంగి పనిని నేర్చుకున్నారు. తన బహిరంగ ప్రేషితకార్య ప్రారంభము వరకు, యోసేపు పనిలో సహాయముగా ఉన్నారు. యేసు “వండ్రంగి కుమారుడు” (మత్త 13:55), “యోసేపు కుమారుడు” (లూకా 3:23; 4:32; యోహాను 1:45; 6:42), “వండ్రంగి” (మార్కు 6:3) అని  పిలువబడినాడు. పని అంటే కేవలం మేధోపరమైనదని గ్రీకులు భావించేవారు; శారీరక పనులన్నీ బానిసల చేత చేయించేవారు. సోక్రటీసు, అరిస్టాటిలు పనిని చిన్నచూపు చూసారు. అలాంటి దృక్పధాన్ని యేసు మార్చారు. పని చాలా పవిత్రమైనదని, గౌరవప్రదమైనదని, దేవునికి ప్రీతికరమైనదని యేసు ఈ లోకానికి తెలియజేయుటకు అట్లు చేసాడు. యేసు దృక్పధాన్నే క్రైస్తవ లోకం, ముఖ్యముగా అనాధి [బెనదిక్టైన్] మఠవాసులు... ఇతరులు కొనసాగించారు.

మానవ శ్రమ యొక్క ప్రాముఖ్యతకు, పవిత్రతకు యోసేపు గొప్ప ఉదాహరణ, ఆదర్శం! మానవ శ్రమకు ఆయన నిజమైన చిహ్నం! మానవులు తమ శ్రమ వలన, దేవుని సృజనాత్మక సృష్టికార్యములో భాగస్తులగుచున్నారు. “దేవుడైన యావే నరుని ఏదెను తోటను సాగుచేయుటకు, కాచుటకు దానిలో ఉంచెను” (ఆ.కాం. 2:15). కనుక, శ్రమించడం మానవ కర్తవ్యం అని, శ్రమించడం దైవప్రణాళికలో పాల్గొనడమేనని అర్ధమగుచున్నది. శ్రమద్వారా, మానవకుటుంబాభివృద్ధికి, సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా, దేవుని సృష్టి పరిపూర్ణత సాధిస్తుంది. మన అనుదిన పని అర్పణ అయినప్పుడు, భూమి బలిపీఠం అవుతుంది. కనుక, దేవుని మహిమార్ధమై మనం శ్రమించాలి.

మే 1న ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’. శ్రీసభకు పాలక పునీతుడైన యోసేపు గౌరవార్ధమై,12వ భక్తినాధ జగద్గురువులు, నాస్తిక కమ్యూనిజం నేపధ్యములో, దానికి వ్యతిరేకముగా, శ్రమ పోషకునిగా, ప్రతీ కార్మికునికి పాలక పునీతులనిగా యోసేపును గుర్తించి, ‘పునీత శ్రామిక యోసేపు పండుగ’ను, దైవార్చన పండుగగా, క్రీ.శ. 1955వ సం.లో స్థాపించారు. పని, వృత్తి గౌరవాన్ని పెంపొందించడానికి, మానవ శ్రమ యొక్క గౌరవం దేవుని పోలికలో సృజింపబడిన శ్రామికుని గౌరవించడములో ఉంటుందని, పాపానికి ఫలితం మానవ శ్రమ ఎంత మాత్రం కాదని, పని కేవలం ఉద్యోగం కాదని అది ఒక బాధ్యత అని, సేవ చేయడమని ఈ మహోత్సవం తెలియజేయుచున్నది. అలాగే, క్రైస్తవులు పనిపట్ల గౌరవాన్ని, అవగాహనను పెంచుకోవాలని తల్లి శ్రీసభ ఆశిస్తున్నది. ప్రతీ పనిలో, విలువను, గౌరవాన్ని, సంతోషాన్ని చూడగలగాలి. పని వినయాన్ని నేర్పుతుంది; పవిత్రతలో నడిపిస్తుంది.

మన జీవిత స్థితి ఏదైనా, దైవాంకిత జీవితమైనా, సాధారణ క్రైస్తవ జీవితమైనా, మన పని పవిత్రమైనది. దేవుడు మనకు అప్పగించిన పనిని వివేచించడం, మన వృత్తిని వివేచించడములో భాగమే. మన పనిద్వారా, దేవుని రాజ్యము, భూలోకమునకు వచ్చుటలో మన వంతు కృషిచేసిన వారమవుతాము.

యంత్రాంగం, కంప్యూటరు... మొ.గు. కారణాల వలన నిరుద్యోగం అధికమగుచున్నది. నిరుద్యోగం అభద్రతాభావాన్ని కలిగిస్తుంది. ఎంతోమందిని పేదవారిగా, నిరాశ్రయులుగా చేయుచున్నది. మనుష్యులను యంత్రాలుగా చూస్తున్న లోకం! కార్మికుల ఆత్మగౌరవాన్ని అణగద్రొక్కే లోకం! పనికన్న, వేతనాన్ని చూసే లోకం! కూర్చొని డబ్బు సంపాదించాలనే లోకం! ఈ పరిస్థితులలో, ప్రజల హక్కులను, ముఖ్యముగా కార్మికుల హక్కులను, వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతీ ప్రభుత్వానికీ ఉన్నది! మనంకూడా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయాలి.

కరోన వలనగాని, యితర కారణముల వలనగాని పనిని కోల్పోయిన వారిని, పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని, పునీత శ్రామిక యోసేపు మధ్యస్థ ప్రార్ధన వేడుదలలో ఉంచుదాం. యోసేపు తప్పక ఓదార్పును, మద్దతును, మార్గదర్శకమును అందించగలరు. మనం కూడా పనిని బట్టిగాక వ్యక్తులను గౌరవించాలి; ప్రతీ పని విలువైనదే!

ప్రార్ధన:
పునీత యోసేపుగారా! మీరు చేసినట్లుగా, సహనం, పట్టుదలతో పనిచేయడం మాకు నేర్పించండి. మా విశ్వాస కన్నులను తెరవండి, తద్వారా మేము పనిలోనున్న గౌరవాన్ని గుర్తించగలను మరియు దేవుని సృష్టికార్యములో, క్రీస్తు విమోచన కార్యములో భాగస్తులగుదము. పని ఆహ్లాదకరముగా ఉన్నప్పుడు, దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు, పని భారముగా ఉన్నప్పుడు, దేవునికి అర్పించునట్లు మాకు సహాయం చేయండి.

1 comment:

  1. Fr Jacob Prasad PulapakaMay 1, 2024 at 1:25 PM

    Dear loving and Affectionate Rev. Fr. Praveen Ofm Cap., excellent message. very inspiring and motivating everyone... Thanks a lot for sharing this beautiful reflection...

    ReplyDelete

Pages (150)1234 Next