పునీత బ్రిందిసి లారెన్సు, జూలై 21

 పునీత బ్రిందిసి లారెన్సు, జూలై 21
ఫ్రాన్సిస్కన్ కపూచిన్ గురువు, శ్రీసభ పండితుడు, మతసాక్షి (క్రీ.శ. 1559-1619)

ఇటలీ దేశములోని బ్రిందిసి (నేపుల్స్ రాజ్యం) అను ప్రాంతములో విల్లియం, ఎలిజబెత్ దంపతులకు 22 జూలై 1559వ సం.లో జన్మించారు. అసలు పేరు జూలియో సీజర్ రోస్సి. అక్కడ ఫ్రాన్సిస్కన్ (Conventuals) సభకు చెందిన పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనమునుండే వక్తగా తనలోనున్న గొప్ప ప్రతిభను కనబరచారు. చిన్నతనములోనే తల్లిదండ్రులు చనిపోవడంతో, వెనిస్ నగరములో తన బాబాయి వద్ద ఉండి, అక్కడ పునీత మార్కు కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు.

1575లో తన 16వ యేట, వెరోన పట్టణములో ఫ్రాన్సిస్కన్ కపూచిన్ సభలో చేరి పేరును ‘లారెన్సు’గా మార్చుకున్నారు. తత్వ, వేదాంత శాస్త్రాభ్యాసాలను పాదువ యూనివర్సిటిలో పూర్తి చేసుకొని, తన 23వ యేట గురువుగా అభిక్తులైనారు. డీకనుగా ఉండగానే తపస్సుకాలములో అద్భుతముగా ప్రసంగించుట వలన, ఇటలీ దేశములోని ముఖ్య పట్టాణాలకు వాక్య బోధనకు ఆహ్వానింప బడినారు.

లారెన్సు బహుభాషా కోవిదుడు. మాతృభాష ‘ఇటాలియన్’తోపాటు, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, బొహెమెయిన్, లతీను, గ్రీకు, హీబ్రూ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. అరమాయిక్, సిరియక్ భాషలు కూడా నేర్చుకున్నారు. బైబులును గ్రీకు, హీబ్రూ భాషలలో అధ్యయనం చేసారు. యూదులకు హీబ్రూ భాషలో వాక్యపరిచర్య చేయుటకు ఎనిమిదవ క్లెమెంట్ పోపు లారెన్సును రోము నగరమునకు పిలిపించి ‘యూదులకు అపోస్తోలిక బోధకుడు’గా నియమించారు. ఎంతోమంది యూదులను క్రైస్తవ విశ్వాసులుగా మార్చారు. జర్మనీలో లూథరన్ ప్రొటెస్టంటు ప్రజలకు శ్రీసభ సందేశాలను తెలియజేసారు.

హంగరీ రాజ్యాన్ని టర్కీ సైన్యం ఆక్రమించుటకు సిద్ధమవుతుందని తెలిసిన రెండవ రుడోల్ఫ్ చక్రవర్తి కోరిక మేరకు, లారెన్సు జర్మని చక్రవర్తిని కలిసి టర్కీ సైన్యాన్ని ఎదురుకోవడానికి తగినంత సైన్యాన్ని ఏర్పరచేలా చేయగలిగారు. తగిన రాజకీయ సలహాలను కూడా అందించారు. అందువల్లనే, 1601లో జరిగిన యుద్ధములో (9-14 అక్టోబరు) 80 వేల టర్కీ సైన్యాన్ని, కేవలం 18 వేల క్రైస్తవ సైన్యం చిత్తుగా ఓడించింది. యుద్ధ సమయములో లారెన్సు సిలువ పైకెత్తి చేసిన ప్రోత్సాహం చెప్పుకోదగినది.

తన 31వ యేట టస్కని కపూచిన్ ప్రావిన్సుకు అధిపతిగా ఎన్నికయ్యారు. తన విధులను పరిపాలనా నైపుణ్యముతో బాధ్యతాయుతముగా నిర్వర్తించారు. 1602వ సం.లో కపూచిన్ సభకు ‘మినిస్టర్ జనరల్’గా ఎంపిక అయ్యారు. ప్రేగ్, వియన్నా, గోర్జియా ప్రాంతాలలో కపూచిన్ ఆశ్రమాలను తెరిచారు.

లారెన్సు ‘శాంతిదూత’గా పోపుచేత నియమింప బడినాడు. ఈ బాధ్యత అతనిని అనేక దేశాలకు వెళ్ళేట్లు చేసింది. లారెన్సు తన బోధనలద్వారా జర్మని, ఆస్ట్రియా, బొహేమియా దేశాలలో అనేకమందిని తిరిగి విశ్వాసములోనికి నడిపించగలిగారు. రుడోల్ఫ్ చక్రవర్తి మరొకసారి లారెన్సును స్పెయిన్ దేశమునకు రాజదూతగా పంపి, మూడవ ఫైలిప్పు రాజును కతోలిక రాజుల సైన్యములో భాగస్థులు అయ్యేట్లు ఒప్పించగలిగారు. ఆ సమయములో ‘మాడ్రిడ్’లో కపూచిన్ ఆశ్రమాన్ని తెరిచారు. ‘మ్యూనిక్’లో మరో ఆశ్రమాన్ని కూడా తెరిచారు.

22 జూలై 1619లో సరిగ్గా 60సం.ల ప్రాయములో, తన పుట్టిన రోజునే, పోర్చుగల్ దేశములోని లిస్బన్ నగరములో తీవ్రమైన అనారోగ్యముతో మరణించారు. 17 మే 1783లో ఆరవ భక్తినాధ (Pius VI) పోపు లారెన్సును ధన్యుడిగా, 8 డిసెంబరు 1881లో పదమూడవ లియో (Leo XIII) పోపు పునీతునిగా, 19 మార్చి 1959లో ఇరువై మూడవ జాన్ (John XXIII) పోపు శ్రీసభ పండితునిగా ప్రకటించారు.

దేవుని వాక్యము పట్ల అమితాసక్తిని, భక్తిని లారెన్సు ప్రదర్శించారు. గొప్ప పండితుడు, విద్యావేత్త అయినను, ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించేవారు.

No comments:

Post a Comment