Showing posts with label marriage. Show all posts
Showing posts with label marriage. Show all posts

వివాహం: దేవుని ప్రణాళికలో ప్రేమ మరియు ఐక్యత

 వివాహం: దేవుని ప్రణాళికలో ప్రేమ మరియు ఐక్యత

ప్రియమైన సోహోదరీ సోహోదరులారా,
తెలుగులో ఒక సామెత ఉంది, “పెళ్లి ఒక వింత ముచ్చట, చూస్తే కాసేపే గానీ మోస్తే జీవితాంతం”. అనగా, వివాహం యొక్క బాహ్య ఆర్భాటము కొద్దిసేపే ఉంటుంది కానీ దాని బాధ్యతలు జీవితాంతం ఉంటాయి అని ఈ సామెత చెబుతుంది.

ఈరోజు మనం వివాహం అనే పవిత్రమైన అంశం గురించి ధ్యానిద్దాం. కతోలిక విశ్వాసములో, వివాహము కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక ఒప్పందం మాత్రమే కాదు. అది దేవునిచే స్థాపించబడిన ఒక దివ్యసంస్కారము. ప్రేమ మరియు ఐక్యత యొక్క శక్తివంతమైన చిహ్నము. దేవుడు మానవున్ని తన పోలికలో, రూపములో సృష్టించాడు. “నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. అతనికి సాటియైన తోడును సృష్టింతును” అని పలికాడు (ఆది 2:18). ఈ మాటలు వివాహం అనేది దేవుని యొక్క ప్రణాళికలో భాగమని స్పష్టం చేస్తున్నాయి. అలాగే, ఇది వివాహం యొక్క మూలము మరియు ఉద్దేశము (ఆది 1:27-28, 2:18-25). “తోడు” అనగా సేవకుడు లేదా సేవకురాలు అని కాదు. ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఒకరి బలహీనతలను మరొకరు భర్తీ చేస్తూ, కలిసి జీవించడాన్నిసూచిస్తుంది. అన్ని విషయాలలో ఇరువురు సమానమే అని అర్ధం. “భార్యాభర్తలది బండి చక్రాల వంటిది, ఒకటి సరిగా లేకున్నా నడవదు” అంటే, భార్యాభర్తలు ఇద్దరూ సమానముగా మరియు సమన్వయముతో ఉంటేనే జీవితము సాఫీగా సాగుతుందని అర్ధం.
వివాహము దివ్య సంస్కారము
క్రీస్తు ప్రభువు తన జీవితము మరియు బోధనల ద్వారా వివాహానికి మరింత ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. కానాలోని వివాహ విందులో ఆయన చేసిన మొదటి అద్భుతం వివాహ బంధము యొక్క ప్రాముఖ్యతను తెలియ జేస్తుంది. నూతన నిబంధనలో, అపోస్తలుడు పౌలు వివాహాన్ని క్రీస్తు మరియు శ్రీసభ మధ్యనున్న ప్రేమ మరియు ఐక్యతకు ఒక గొప్ప సారూప్యంగా వర్ణించాడు (ఎఫెసీ5:21-33). ఈ కారణముగానే, కతోలిక శ్రీసభ వివాహాన్ని ఏడు దివ్యసంస్కారాలలో ఒకటిగా పరిగణిస్తుంది.
దివ్యసంస్కారముగా, వివాహం కేవలం ఒక బాహ్య ఆచారము కాదు. అది దేవుని యొక్క అనుగ్రహాన్ని అందించే ఒక సాధనము. పెళ్లి చేసుకునే స్త్రీ పురుషులు తమ ప్రేమను మరియు నిబద్ధతను వ్యక్తం చేస్తున్నప్పుడు, క్రీస్తు వారి మధ్య ఉంటాడు మరియు వారి బంధాన్ని బలపరుస్తాడు. ఈ అనుగ్రహము వారికి ఒకరినొకరు ప్రేమించడానికి, గౌరవించడానికి మరియు పిల్లలను విశ్వాసంలో పెంచడానికి సహాయ పడుతుంది.
వివాహ బంధము యొక్క లక్షణాలు
కతోలిక బోధన ప్రకారము, వివాహ బంధానికి నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి:
1. స్వేచ్ఛ: స్త్రీ మరియు పురుషుడు ఎటువంటి బలవంతము లేకుండా, పూర్తిగా స్వేచ్ఛగా వివాహము చేసుకోవాలి. వారి నిర్ణయము వారి స్వంతముగా ఉండాలి. ఇంకో సామెత గుర్తుకొస్తుంది, “పెళ్లి కాని వాడికి లోకము ఒక ఆటస్థలం, పెళ్లయిన వాడికి అదొక పోరాట స్థలము” అంటే, పెళ్లికి ముందున్న స్వేచ్ఛను మరియు పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలు, ఒత్తిడులను ఈ సామెత వివరిస్తుంది.
2. సంపూర్ణ నిబద్ధత / ఐఖ్యత: వివాహము అనేది జీవితాంతము ఉండే శాశ్వతమైన బంధము. “మరణము మనలను వేరు చేసే వరకు” అనే ప్రమాణము ఈ నిబద్ధతను తెలియ జేస్తుంది. విడాకులు దేవుని ప్రణాళికకు విరుద్ధమైనవిగా శ్రీసభ బోధిస్తుంది. ఆది 2:24 “నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు”. వివాహములో భార్యాభర్తల మధ్య ఉండే సన్నిహితమైన మరియు విడదీయరాని బంధాన్ని ఇది తెలియ జేస్తుంది. ఇది శారీరకమైన, భావోద్వేగ పరమైన మరియు ఆధ్యాత్మికమైన ఏకత్వాన్ని సూచిస్తుంది. అందుకే ప్రభువు మత్త 19:6లో ఇలా అన్నాడు, “దేవుడు జతపరచిన జంటను మానవ మాత్రుడు వేరుపరప రాదు”. కనుక, వివాహ బంధము అనేది పవిత్రమైనది మరియు శాశ్వతమైన బంధము. దేవుడు ఇద్దరినీ ఒకటిగా చేశాడు, కాబట్టి వారు ఒకరినొకరు విడిచిపెట్ట కూడదు” అని పునీత అగుస్తీను గారు నొక్కి చెప్పారు. ఇంకో సామెత ఉంది, “మాట తప్పితే మనిషి తప్పినట్లే, పెళ్లి తప్పితే బ్రతుకే తప్పుతుంది” కాబట్టి, వివాహ బంధమును నిలబెట్టు కోవడానికే ప్రయత్నం చేయాలి.
3. నమ్మకము: భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు విశ్వాసానికి ద్రోహము చేస్తాయి మరియు వివాహ బంధాన్ని నాశనము చేస్తాయి. నమ్మకము లేకపోతే ఆ బంధము బలహీనంగా ఉంటుంది. నమ్మకము అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఒక భావోద్వేగ బంధం. ఇది నిజాయితీ, విశ్వాసము మరియు గౌరవంపై ఆధారపడి ఉంటుంది. నమ్మకము ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సురక్షితముగా మరియు భరోసాతో ఉంటారు. వారు తమ ఆలోచనలు, భావాలు మరియు బలహీనతలను ఎటువంటి భయం లేకుండా పంచుకోగలరు. నమ్మకం బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఒకరినొకరు నమ్మినప్పుడు, వారు మరింత దగ్గరగా ఉంటారు మరియు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. నమ్మకము ఉన్న బంధములో, సమస్యలను పరిష్కరించడం సులభము అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరి ఉద్దేశాలను విశ్వసిస్తారు మరియు కలిసి పరిష్కారము కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీ బంధంలో నమ్మకము
 లేకపోతే, దానిని తిరిగి నిర్మించడానికి సమయం పడుతుంది. కాబట్టి ఓపికగా ఉండండి. నమ్మకము అనేది ఒక బంధాన్ని బలముగా ఉంచే ఒక అమూల్యమైన బహుమతి. దానిని కాపాడుకోవడం ఇద్దరి బాధ్యత.
4. ఫలవంతం- సంతానోత్పత్తి: వివాహం యొక్క ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి పిల్లలను కనడం మరియు వారిని క్రైస్తవ విశ్వాసంలో పెంచడం. పిల్లలు దేవుని నుండి వచ్చిన బహుమానాలు మరియు కుటుంబ ప్రేమకు ప్రతిరూపాలు. ఆది 1:28 “దేవుడు వారిని దీవించి, సంతానోత్పత్తి చేయుడు” అని ఆజ్ఞాపించాడు. అందుకే, సంతానోత్పత్తి వివాహం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలలో ఒకటిగా చెప్పబడింది. వివాహం అనేది పురుషుడు మరియు స్త్రీ యొక్క సన్నిహితమైన కలయిక, ఇది పిల్లలను కనడానికి మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఉద్దేశించబడింది” అని పునీత థామస్ అక్వినాస్ స్పష్టం చేసారు. అందుకే పునీత జాన్ క్రిసోస్టోమ్ గారు,వివాహం ఈ లోకములో చిన్న శ్రీసభ” అని అన్నాడు. ఇక్కడ భార్యాభర్తలు మరియు పిల్లలు విశ్వాసములో కలిసి ఎదుగుతారు అని అర్ధము.
వివాహపు విలువలు / వివాహములో భార్యాభర్తల బాధ్యతలు మరియు సంబంధాలు (ఎఫెసీ 5:21-33, కొలొస్సీ 3:18-19, 1 పేతురు 3:1-7):
కతోలిక వివాహము అనేక ముఖ్యమైన విలువలను, బాధ్యతలను కలిగి యుంటుంది:
1. పరస్పర విధేయత మరియు ప్రేమ: ఇది వివాహానికి పునాది. భార్యాభర్తలు ఒకరినొకరు నిస్వార్థంగా ప్రేమించు కోవాలి. ఒకరి అవసరాలను మరొకరు పట్టించు కోవాలి. ఎఫెసీ 5:21-25, “పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా! ప్రభువునకు విధేయులైనట్లే, మీ భర్తలకును విధేయులై ఉండుడు. శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా! క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు”. కనుక, ఈ వచనాలు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించు కోవాలని, ప్రేమించాలని మరియు ఒకరి అవసరాలను మరొకరు తీర్చాలని సూచిస్తున్నాయి. భార్య భర్తకు లోబడి యుండటం అనేది ప్రేమపూర్వకమైన గౌరవాన్ని సూచిస్తుంది, మరియు భర్త తన భార్యను క్రీస్తు శ్రీసభను ప్రేమించినట్లుగా నిస్వార్థముగా ప్రేమించాలి.
2. గౌరవము: ఒకరి అభిప్రాయాలను, హక్కులను మరియు వ్యక్తిత్వాన్ని గౌరవించడము చాలా ముఖ్యము. భర్తలు తమ భార్యలను గౌరవంగా చూడాలని మరియు వారి అవసరాలను అర్థము చేసుకోవాలని, భర్తలు తమ భార్యలను అర్థము చేసుకోవాలని, వారి అవసరాలు, భావాలు, బలహీనతలు, బలాలు తెలుసుకోవాలని, వారిని బలహీనమైన వారిగా కాకుండా విలువైన వారిగా చూడాలని 1 పేతురు 3:7లో చదువుచున్నాము.
3. సహనము మరియు క్షమాపణ: జీవితములో కష్టాలు మరియు విభేదాలు రావడం సహజం. సహనముతో ఉండటము మరియు ఒకరినొకరు క్షమించు కోవడము బంధాన్ని బలపరుస్తుంది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కోపము చూపకూడదని మరియు ద్వేషించ కూడదని కొలొస్సీ3:19 హెచ్చరిస్తుంది (“భర్తలారా! మీరు మీ భార్యలను ప్రేమింపుడు. వారిపట్ల కఠినంగా ప్రవర్తింపకుడు”). భర్తలు తమ భార్యలను ప్రేమించాలి. ఈ ప్రేమ కేవలము భావోద్వేగ పరమైనది మాత్రమే కాదు, అది నిబద్ధతతో కూడిన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, మరియు శ్రద్ధ చూపే ప్రేమ. భర్తలు తమ భార్యల పట్ల కఠినముగా ఉండకూడదు. కఠినత్వము అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదు, అది మాటలతో బాధించడము, నిర్లక్ష్యం చేయడము, వారి పట్ల అసహనము చూపడము, వారిని నియంత్రించడానికి ప్రయత్నించడము వంటివి కూడా కావచ్చు. భర్తలు తమ భార్యలతో దయగా, మృదువుగా, సహనముతో ప్రవర్తించాలి. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు, భార్యాభర్తలు ఒకరినొకరు సహనముతో భరించాలి మరియు ఒకరి బలహీనతలను క్షమించాలి” అని వివాహ జీవితములో సహనము మరియు క్షమాపణ ఎంతో ప్రాముఖ్యమైనవని తెలియ జేశారు.
4. సంభాషణ: బహిరంగముగా మరియు నిజాయితీగా ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం సమస్యలను పరిష్కరించడానికి మరియు సాన్నిహిత్యాన్ని పెంచడానికి సహాయ పడుతుంది. సంభాషణ ద్వారా భార్యాభర్తలు తమ సంతోషాలు, బాధలు, భయాలు, ఆందోళనలు మరియు ఆశయాలను ఒకరితో ఒకరు పంచుకో గలుగుతారు. ఇది ఒకరి మనసులోని విషయాలను మరొకరు అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుంది, తద్వారా ఒంటరితనము మరియు అపార్థాలు తొలగిపోతాయి. జీవితములో సమస్యలు తలెత్తినప్పుడు, వాటిని చర్చించడము మరియు కలిసి పరిష్కార మార్గాలను కనుగొనడము చాలా ముఖ్యము. సంభాషణ ఒక సురక్షితమైన వేదికను కలిగిస్తుంది. ఇక్కడ ఇద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మరియు ఒక ఉమ్మడి నిర్ణయానికి రావడానికి ఉపయోగ పడుతుంది.
5. ప్రార్థన మరియు విశ్వాసము: కలిసి ప్రార్థించడము మరియు విశ్వాసములో పాలుపంచు కోవడము భార్యాభర్తలను దేవునికి దగ్గర చేస్తుంది మరియు వారి బంధానికి ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది.

ఆధునిక సవాళ్లు మరియు కతోలిక ప్రతిస్పందన
నేటి ప్రపంచములో వివాహము అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. మారుతున్న సాంఘిక విలువలు, ఆర్థిక ఒత్తిళ్లు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడము వంటి కారణాల వల్ల వివాహ బంధము బలహీన పడుతోంది. విడాకుల సంఖ్య పెరుగుతోంది మరియు చాలామంది యువకులు వివాహము పట్ల ఆసక్తి కూడా చూపడము లేదు.
          ఈ సవాళ్ల నేపథ్యములో, కతోలిక శ్రీసభ వివాహము యొక్క ప్రాముఖ్యతను మరియు దాని పవిత్రతను నొక్కి చెబుతోంది. వివాహానికి ముందు మరియు తరువాత జంటలకు తగిన శిక్షణ మరియు మద్దతును అందిస్తుంది. ఆరోగ్యకరమైన మరియు విశ్వాసమైన వివాహ జీవితాన్ని గడపడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. కష్టాల్లో నున్న జంటలకు సహాయం చేయడానికి మరియు వారి బంధాన్ని పునరుద్ధరించడానికి శ్రీసభ ప్రయత్నిస్తుంది.
          ప్రియమైన సహోదరీ సహోదరులారా, వివాహము అనేది దేవుని యొక్క గొప్ప బహుమానం. ఇది ప్రేమ, ఐక్యత మరియు ఫలవంతమైన జీవితానికి పిలుపు. మనం ఈ పవిత్రమైన బంధాన్ని గౌరవిద్దాం. దాని విలువలను కాపాడుకుందాం మరియు మన జీవితాల ద్వారా దాని యొక్క అందాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. క్రీస్తు మనలను ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకుందాం మరియు మన వివాహాలను దేవుని ప్రేమకు మరియు ఆయన సంఘానికి చిహ్నముగా నిలుపుకుందాము.
వివాహ వాగ్దానాలు

వాగ్దానాలు (Vows): ఇది వివాహ వేడుకలో అత్యంత ముఖ్యమైన భాగము. పెళ్లి చేసుకునే స్త్రీ పురుషులు ఒకరికొకరు స్వేచ్ఛగా మరియు బహిరంగముగా తమ ప్రేమను, విశ్వాసాన్ని మరియు జీవితాంతము కలిసి ఉంటామని వాగ్దానం చేస్తారు. ఈ వాగ్దానాలు వారి బంధానికి పునాది. ఈవాగ్దానాల ద్వారా, వారు ఒకరినొకరు భార్యాభర్తలుగా అంగీకరిస్తారు. ఇది వారి స్వచ్ఛందమైన మరియు పూర్తి అంగీకారాన్ని సూచిస్తుంది. కనుక, వివాహములో వాగ్దానాలు అత్యంత ముఖ్యమైనవి, ఇవి భార్యాభర్తల నిబద్ధతను మరియు ప్రేమను వ్యక్తము చేస్తాయి. ఈ వాగ్దానాలు కేవలము మాటలు మాత్రమే కాదు, అవి భార్యాభర్తల హృదయ పూర్వకమైన సంకల్పాలు మరియు వారి జీవితాంతము పాటించవలసిన బాధ్యతలు. ఈ వాగ్దానాల ద్వారానే వారి వివాహము ఒక దివ్యసంస్కారంగా మారుతుంది మరియు వారు దేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ వాగ్దానాలను నిలబెట్టు కోవడానికి వారు ఒకరికొకరు సహాయము చేసుకోవాలి, ప్రార్థన చేయాలి.

 

వివాహము

వివాహము
“కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు”

వివాహము దేవుడు ఏర్పాటు చేసిన ఒడంబడిక. సృష్టి ఆరంభములోనే దేవుడు వివాహమును ఒక పవిత్రమైన ఒడంబడికగా ఏర్పాటు చేసాడు. దేవుడు ఆదాము ఏవలను సృష్టించిన తరువాత (ఆది 1:26-27), ఆది 2:24లో ఇలా చదువుచున్నాము, “కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు” (ఎఫెసీ 5:31; మత్త 19:5-6; మార్కు 10:7-8). జీవితకాల అనుబంధముతో ఇరువురు వ్యక్తులను (స్త్రీపురుషులు) ఐక్యముచేస్తూ దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప పవిత్ర వ్యవస్థ వివాహము అని ఈ వాక్యము తెలియ జేయుచున్నది. వివాహం అంటే ‘విడనాడటం’, ‘హత్తుకొనిపోవటం’, ‘ఏకశరీరులవటం. ఇవి వివాహ ఒడంబడిక స్వభావాన్ని సూచిస్తున్నాయి. వివాహం దేవుని రూపకల్పన. ఒకరినొకరు పరిపూర్ణం చేసుకొనే భాగస్వామ్యం. కుటుంబ సంబంధాలు ముఖ్యమైనవి. అయితే, వివాహము నూతన కుటుంబాన్ని ఏర్పరస్తుంది. అనగా భార్యతో నూతన ఇంటిని, కుటుంబాన్ని ఏర్పరచు కోవడం. ఉన్న కుటుంబము కంటే ప్రాధాన్యమైనదని అర్ధం. ‘ఆకాలములో’ కుటుంబ సంబంధాలకు, ముఖ్యముగా కుమారుడు-తల్లిదండ్రుల మధ్య బంధం చాలా ప్రాముఖ్యత కలిగి యుండేది. కనుక తల్లిదండ్రులను “విడనాడటం” అనేది నూతన కుటుంబానికి ప్రతీక.
“విడనాడటం” శారీరక సంబంధాలను అధిగమించడాన్ని సూచిస్తుంది. వివాహము సామాజిక, చట్టపరమైన ఒప్పందం మాత్రమేగాక, ఒక ఒడంబడిక బంధాన్ని ఏర్పరస్తున్నది.
“హత్తుకొనిపోవటం” [అంటిపెట్టుకోవడం, ఐఖ్యమవడం], హీబ్రూ పదం ‘దబాక్” అతుక్కొని, అంటుకొని ఉండటం అనే అర్ధాలను కలిగియున్నది. ఇది భార్యాభర్తల మధ్య విడదీయరాని, నమ్మకమైన బంధాన్ని తెలియజేస్తుంది. “హత్తుకొని పోవడం” అనేది పూర్వ నిబంధనలో యావే దేవునితో ఇస్రాయేలు యొక్క సంబంధాన్ని వివరించే ఒడంబడిక బాషను ప్రతిబింబిస్తున్నది. దేవుడు తన ప్రజలతో విడదీయరాని ఒడంబడికను చేసినట్లుగానే, వివాహం అనేది ఒక ఒడంబడికగా చేయబడుచున్నది. వివాహములో ప్రేమ, విశ్వసనీయత బంధముతో ఒకరితో నొకరు కట్టుబడి యుంటారు. “హత్తుకొని పోవడం” అనేది ఇరువురి మధ్యన లోతైన భావోద్వేగ మరియు శారీరక సాన్నిహిత్యాన్ని తెలియ జేయుచున్నది.
“ఏకశరీరులవటం” బైబులులో వివాహానికి సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైన వచనం. ఇది భార్యాభర్తల మధ్యన శారీరక సంబంధాన్ని సూచిస్తుంది. శారీరకముగా ఒకటవుతారు. ఇది సంతానోత్పత్తితో ముడిపడి యుంటుంది. “ఏకశరీరులవటం” లోతైన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ బంధాన్ని కూడా సూచిస్తుంది. వివాహం కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు. ఇది జీవితాల సంపూర్ణ కలయిక. “ఏకశరీరులవటం” స్త్రీపురుషుల సమానత్వమును, పరిపూరకతను ధృవీకరిస్తుంది. “ఏకశరీరులు” అనునది వివాహములోని ఐఖ్యత, సాన్నిహిత్యం, భాగస్వామ్యమును నొక్కిచెబుతుంది. వ్యక్తులు భిన్నముగా ఉన్నప్పటికినీ ఒకటిగా ఐఖ్యమవుతారు. “ఏకశరీరులవటం” వివాహముయొక్క శాశ్వత బంధాన్ని అనగా ‘అవిచ్చిన్నత’ స్వభావమును ధృవీకరిస్తుంది. వివాహం అనేది విడదీయరాని జీవితకాల బంధం. కనుక, మానవ సంబంధాలకు వివాహము పునాది అని ఆది 2:24 నొక్కి చెబుతుంది.
వివాహము యొక్క ముఖ్య ఉద్దేశములు ఏమిటంటే, ఒకటి, సాహచర్యం: “నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు” (ఆది 2:18) అని స్వయముగా యావే దేవుడే పలికియున్నాడు. అందుకే ఆదాముకు తోడుగా, సహచరినిగా ఉండుటకు ఏవను సృష్టించాడు. రెండు, సంతానోత్పత్తి: ఆదాము, ఏవలకు ఇవ్వబడిన తొలి ఆజ్ఞలలో ఇది ఒకటి, “సంతానోత్పత్తి చేయుడు” (ఆది 1:28). కుటుంబ నిర్మాణం, మానవజాతి కొనసాగింపు యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కిచెబుతుంది (సత్యోపదేశం 1652). మూడు, పరస్పర ప్రేమ, సహకారం: వివాహము బంధం అనేది ప్రేమపూరితమైన బంధము. ఈ ప్రేమ త్యాగపూరిత మైనది. ఒకరినొకరు అర్ధంచేసుకోవడం, సహకారం అందించుకోవడం, ఒకరికొకరు మద్దతు నిచ్చుకోవడం ప్రధానం. పరస్పరం ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి (ఎఫెసీ 5:25-33).
వివాహము జీవితకాల బంధము. “దేవుడు జత పరచిన జంటను మానవుడు వేరుపరప రాదు” (మార్కు 10:9) అని యేసు వివాహములోనున్న శాశ్వత అనుబంధాన్ని నొక్కి చెప్పాడు. బైబులులో కొన్ని పరిస్థితులలో విడాకులు అనుమంతిచ బడినప్పటికినీ (మత్త 19:8), దేవుని ఉద్దేశము అది కానేకాదు. ఆరంభమునుండి ఇలా లేదు. మలాకీ 2:16లో ఇలా చదువుచున్నాము, ఇస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను విడాకులను అసహ్యించు కొందును” (చదువుము మత్త 19:3-9).
వివాహము బాధ్యత కలిగిన బంధము. భార్యాభర్తలిరువురు పరిపూరకరమైన బాధ్యతలను కలిగి యుంటారు. ఈ బాధ్యతలు పరస్పర సమర్పణను, త్యాగపూరిత ప్రేమను నొక్కిచెబుతున్నాయి. భర్తయొక్క బాధ్యతలను ఎఫెసీ 5:25-28లో చూడవచ్చు: “క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో, అట్లే భర్తలు భార్యలను ప్రేమించాలి.” లోతైన త్యాగపూరిత ప్రేమ, నిస్వార్ధము, విశ్వసనీయత ముఖ్యాంశాలు. భార్యయొక్క బాధ్యతలను ఎఫెసీ 5:22-24లో చూడవచ్చు: “ప్రభువునకు విధేయులైనట్లే, మీ భర్తలకును విధేయులై యుండుడు. శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలయును.” ఈ బాధ్యతలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూపించడానికి ఎంతమాత్రము కాదు, కాని వివాహ బంధములో పరస్పర గౌరవము, సేవ ఎంతో ప్రాముఖ్యమని తెలియజేయు చున్నది.
వివాహము పవిత్రమైన బంధము. వివాహ బంధములో విశ్వసనీయత చాలా విలువైనది. వ్యభిచారం, అనైతిక జీవితం తీవ్రముగా ఖండించ బడినది. “వ్యభించరింపరాదు” (నిర్గమ 20:14). “వివాహము అందరి చేతను గౌరవింప బడవలెను. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలయన, అవినీతి పరులును, వ్యభిచారులును, దేవుని తీర్పునకు గురియగుదురు” (హెబ్రీ 13:4). వివాహ బంధము స్వచ్చముగా, పవిత్రముగా ఉండాలని బైబులు బోధిస్తున్నది.
వివాహము దివ్యసంస్కారము. క్రీస్తుచే స్థాపించబడిన అంత:ర్గత కృపానుగ్రహ చర్య. వివాహ దివ్యసంస్కారం దంపతుల బంధాన్ని బలోపేతం చేస్తుంది. పవిత్రతలో ఎదగడానికి తోడ్పడుతుంది. తల్లిదండ్రులుగా వారి బాధ్యతలకోసం వారిని సిద్ధం చేస్తుంది.
వివాహ సంబంధమునుగూర్చి కొరింతీయులు అడిగిన ప్రశ్నలకు, పౌలు మొదటి లేఖ 7:1-16లో ఇచ్చిన సమాధానాలను పరిశీలించుదాం: లైంగిక అనైతిక జీవితాన్ని నివారించడానికి ప్రతీ వ్యక్తికి స్వంత జీవిత భాగస్వామి ఉండాలి. ఇది చట్టపరమైన, పవిత్రమైన పిలుపు (1-2). వివాహ బంధములో పరస్పర సమర్పణ ప్రాముఖ్యం. వివాహము ఒక ఒడంబడిక. వివాహములో జీవిత భాగస్వాములు ఒకరికొకరు స్వేచ్చగా ఇచ్చిపుచ్చుకుంటారు (సత్యోపదేశం 1643). ఒకరిపై ఒకరికిగల అధికారం, ఆధిపత్యమునుగాక పరస్పర ప్రేమ, గౌరవం, సంబంధాన్ని సూచిస్తుంది (3-4). ఆధ్యాత్మిక ప్రయోజనాల కొరకుతప్ప, ఇరువురు అంగీకారముతో తప్ప, శారీరక సాన్నిహిత్యాన్ని నిలిపివేయరాదు. తాత్కాలిక సంయమనం ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడానికై యుండాలి (5). బ్రహ్మచర్యము వ్యక్తిగత పిలుపు, ఉత్తమం అని పౌలు గుర్తించాడు, కాని ఆ వరమును అందరు కలిగియుండలేదు. కనుక, బ్రహ్మచర్యము, వైవాహిక జీవితము రెండూ దేవుని పిలుపు, బహుమానాలే (6-7). బ్రహ్మచర్యము దైవరాజ్యాన్ని, వైవాహిక జీవితము శ్రీసభతో క్రీస్తు ఐఖ్యతను ప్రతిబింబిస్తున్నాయి (సత్యోపదేశం 1617, 1620). అవివాహితులు, విధవలు ఒంటరిగా యుండుట ఉత్తమము. తననుతాను దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకోవడములో బ్రహ్మచర్యము ప్రయోజనకరము. అయినప్పటికినీ, మానవ బలహీనతల దృష్ట్యా, వ్యామోహము వలన, వ్యధ చెందుట కంటె వివాహమాడుట మేలు (8-9). అవివాహితులకైనను, వివాహితులకైనను పవిత్రత అవసరం. “వివాహితులు దాంపత్య జీవిత లైంగిక విశుద్ధతను, ఇతరులు సంయమనముతో పవిత్రముగా జీవించాలి” (సత్యోపదేశం 2349). వివాహము అవిచ్చిన్నమైనది. యేసు బోధనను (మత్త 19:6) పౌలు పునరుద్ఘాటించాడు (10-11). వివాహము రద్దుచేయలేనటు వంటిది. జీవితకాల ఒప్పందం (సత్యోపదేశం 1640). జీవిత భాగస్వామి జీవించియుండగా పునర్వివాహం చేసికోరాదు. పౌలు మిశ్రమ వివాహాల గురించి ఇలా చెబుతున్నాడు. అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామి వివాహ బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడితే, విశ్వాసి విడాకులు తీసుకొనరాదు (12-13). మిశ్రమ వివాహాలలో [కతోలిక వ్యక్తిని, జ్ఞానస్నానం పొందిన కతోలికుడు కాని వ్యక్తికి మధ్య వివాహం] ఎన్నో సవాళ్లు ఉంటాయని శ్రీసభ గుర్తుచేస్తూ ఉంటుంది, అయితే, వాటి చెల్లుబాటును సమర్ధిస్తూ ఉంటుంది. విశ్వాసి అయిన జీవిత భాగస్వామి తన విశ్వాసానికి సాక్ష్యమిచ్చేలా ప్రోత్సహిస్తూ ఉంటుంది (సత్యోపదేశం 1633-1637). విశ్వాసియగు భాగస్వామి పరిశుద్ధతను ఆపాదిస్తారు. ఇది వివాహ దివ్యసంస్కారములో నుండి ప్రవహించే కృపయని శ్రీసభ విశ్వాసం. అవిశ్వాసులకు పవిత్రీకరణ సాధనముగా ఉంటుంది (14). అవిశ్వాసియగు జీవిత భాగస్వామి విడిచిపెట్ట దలచిన, విశ్వాసి కట్టుబడి యుండనక్కర లేదు. విశ్వాసి ప్రశాంతముగా జీవించుటకు, అలాగే భాగస్వామియొక్క మారుమనస్సు కొరకు ఆశించాలని శ్రీసభ ప్రోత్సహిస్తున్నది (15-16).
(1). వివాహము దేవుని నమ్మకమైన ప్రేమను ప్రతిబింబించే పవిత్రమైన ఒడంబడిక. దంపతులకు, కుటుంబ సభ్యులకు దేవుని కృపా సాధానము. (2). బ్రహ్మచర్యం విలువైనది. దేవునిపై అసాధారణమైన భక్తికి గొప్ప మార్గం. శ్రీసభలో బ్రహ్మచర్యము, వివాహము రెండూ దైవ పిలుపే. (3). పరస్పర సమర్పణ. వివాహము క్రీస్తు-శ్రీసభ సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. (4). అవిచ్చిన్నత. వివాహము విడదీయరానిది. జీవితకాల కలయిక. విడాకులు దేవుని ఉద్దేశానికి, ప్రణాళికకు విరుద్ధం. (5). వైవాహిక జీవితములో సువార్త ప్రచారం. అవిశ్వాస భాగస్వామిని విశ్వాసమువైపు నడిపించే అవకాశం యున్నది.
నేడు వివాహ జీవితములో ఎన్నో సవాళ్లు. సామాజిక, ఆర్ధిక, చట్టపరమైన మార్పుల కారణముగా అనేక ఆధునిక సవాళ్ళను ఎదుర్కుంటున్నది. ఇది క్రైస్తవ సంఘాలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. నేటి ప్రధాన సమస్యలు – విడాకులు, భార్యాభర్తలమధ్య, తల్లిదండ్రులు-పిల్లలమధ్య సమన్వయలోపం, వరకట్న వేధింపులు, ఆర్ధిక ఒత్తిళ్ళు, గృహహింస, వివాహేతర సంబంధాలు, పని ఒత్తిళ్ళు, సంప్రదాయ కుటుంబాలు క్షీణించడం..మొ.వి. ఈలాంటి సమయములో మనం [శ్రీసభ నాయకులు, గురువులు, పెద్దలు,] ఆధ్యాత్మిక, ఆచరణాత్మక మద్దతును ఇవ్వగలగాలి. వివాహ జీవిత విలువల గురించి తెలియజేయాలి. వివాహానికి జంటలను సిద్ధం చేయడానికి ముందు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉంటుంది శ్రీసభ. వాటిలో తప్పక పాల్గొనేలా ప్రోత్సహించాలి. ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం, నిబద్ధత మొదలగు బైబులు ఆధారిత విలువల గురించి వివరిస్తారు. విబేధాలను ఎలా పరిష్కరించుకోవాలో, ఆర్ధిక వ్యవహారాలను ఎలా నిర్వహించాలో, బలమైన ఆధ్యాత్మిక పునాదిని ఎలా ఏర్పరచుకోవాలో అన్న అంశాలను విశదపరుస్తూ, మార్గదర్శకాన్ని చేస్తూ ఉంటారు. వివాహానంతరం కూడా కౌన్సిలింగ్ విసృతముగా అందుబాటులో ఉన్నాయి. భార్యభర్తలిద్దరు కుటుంబ శ్రేయస్సు కొరకు సమానముగా దోహదపడే భాగస్వామ్యముగా క్రైస్తవ వివాహం రూపొందించ బడినదని గుర్తించాలి.

జ్ఞాన వివాహము 3

 జ్ఞాన వివాహము 3


వివాహము ఏడు దివ్యసంస్కారాలలో ఒక దివ్యసంస్కారము. ఈ వివాహముద్వారా, జ్ఞానస్నానము తీసుకున్న ఇరువురు కతోలిక క్రైస్తవులు దేవుని సమక్షములో, దైవప్రజల సమక్షములో, ఓ నూతన క్రైస్తవ కతోలిక కుటుంబాన్ని ఏర్పరచుకొనుచున్నారు. కనుక నేడు మనమందరం దేవునికి కృతజ్ఞులై ఉండాలి. వివాహం దివ్యసంస్కారం కనుక, అది యేసుక్రీస్తుతో ముడిపడి ఉంటుంది; ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. నూతన వధూవరులకు గట్టిగా చప్పట్లతో అభినందనలను తెలుపుదాం! ఆది 2:20లో, దేవుడు "పురుషునికి తగిన తోడెవ్వరు దొరకలేదు" అని చదువుచున్నాం. మరి నేడు వీరిరువురిని ఇక్కడ దంపతులుగా నిలబెట్టడానికి వారి తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసాలు పడి ఉంటారు. కనుక, వారి తల్లిదండ్రులకు గట్టిగా 
చప్పట్లతో అభినందనలను తెలుపుదాం!

వివాహము దేవుని విశ్వసనీయతకు సూచన (ఎఫెసీ 5:28-32): వివాహం దివ్యసంస్కారం కనుక, దానికి శాశ్వత విలువ ఉన్నది. మీరు (వధూవరులు) ఒకరికొకరు చేసే 'వాగ్దానం' మరణం వరకు ఉంటుంది. కనుక ఎల్లప్పుడు ఒకరికొకరు నమ్మకం కలిగి జీవించాలి. పాత నిబంధనలో, దేవుడు తన ప్రజలతో 'శాశ్వత ఒప్పందాన్ని' చేసుకొని దానికి విశ్వసనీయతతో కట్టుబడి యున్నాడు. దేవుడు ఎప్పుడు తన ప్రజలపట్ల విశ్వసనీయముగా ఉన్నాడు. వారు పాపముచేసినను వారిని ఎన్నడు ఎడబాయలేదు. నూతన నిబంధనలో, క్రీస్తుకు, శ్రీసభకు మధ్యనున్న సంబంధాన్ని చూస్తున్నాము. శ్రీసభ కొరకు క్రీస్తు తన ప్రాణాలను సైతము సిలువపై అర్పించాడు. కనుక, మీ వివాహములో ఒకరిపై ఒకరికి ఉండవలసినది విశ్వసనీయత; అది దేవునికి-ఆయన ప్రజలకు మధ్యనున్న విశ్వసనీతను, క్రీస్తుకు-శ్రీసభకు మధ్యనున్న విశ్వసనీయతను సూచిస్తుంది. మీ ఇరువురిమధ్య కూడా అలాంటి విశ్వసనీయత, నమ్మకం ప్రేమ ఉండాలి. కనుక, నేడు మీరు చేసే వాగ్దానాలను ఎప్పుడు, కలకాలం, మరణం వరకు కాపాడుకోవాలి.

క్రీస్తు ప్రేమ సుమాతృక: (యోహాను 15:12-16): క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించాడో, ప్రేమిస్తున్నాడో మనదరికి తెలుసు! ఎదో ఒక సందర్భములో ఆయన ప్రేమను మనం వ్యక్తిగతముగా పొందియున్నాము! మనలను (తన వధువైన శ్రీసభ కొరకు) సిలువ మరణం వరకు ప్రేమించాడు. నిజమైన ప్రేమ అర్ధంచేసుకుంటుంది; త్యాగానికి సిద్ధపడుతుంది; ఇతరుల కొరకు తాను బాధలను అనుభవిస్తుంది; ఇతరుల మంచి కొరకు పాటుపడేలా చేస్తుంది. ఇలాంటి ప్రేమనే ప్రభువు తన మాటలలో వ్యక్తపరచాడు యోహాను 15:13 - "తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వానికంటే ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు". అలాగే, భార్యాభర్తలిరువురు అలాంటి ప్రేమను కలిగి జీవించాలి.

వివాహ వాగ్దానాన్ని ఒప్పందముగాగాక (అశాశ్వతమైనది; రాద్దుచేసుకోవచ్చు), శాశ్వత వాగ్ధానముగా, 'ఒడంబడిక'గా  పరిగణించాలి. ఒప్పందం తుంచుకుంటే తెగిపోతుంది, కాని 'ఒడంబడిక' శాశ్వతమైనది. ఇది ఒక ఆధ్యాత్మిక వాగ్దానం. ఎందుకన, ప్రభువు నామమున, దైవజనుల సమక్షములో మీరు నేడు మీ వాగ్దానములద్వారా ఒకటవుతున్నారు, ఏకశరీరులవుతున్నారు. స్వయముగా క్రీస్తే మీ వివాహాన్ని ఆశీర్వదించుచున్నారు, కనుక మీ ప్రేమను, బంధాన్ని నిలబెట్టుకోవడానికి, ఎప్పుడు క్రీస్తు వైపుకు మరలండి. ఆయనే మన సర్వస్వానికి మూలం, ఆధారం.

వివాహము దేవుని తలంపు (ఆది 1:26-28): దేవుడు మానవ జాతిని సృజించాడు. తన పోలికలో మానవుని చేసాడు. "నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు" (ఆది 2:18) అని దేవుడు తలంచి, వారిని స్త్రీ పురుషులనుగా సృష్టించాడు. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడని వారికి ఆజ్ఞాపించాడు. కనుక వివాహ బంధముద్వారా, దేవుని తలంపును, చిత్తమును మనం పరిపూర్ణం చేయాలి.

దేవుడు ప్రేమామయుడు; అనంత ప్రేమ కలిగినవాడు. వివాహ బంధములోని భార్యా భర్తల ప్రేమలో ఈ దేవుని ప్రేమ ప్రతిబింబిస్తుంది, విస్తరిస్తుంది. కనుక భార్యాభర్తల పరస్పర ప్రేమ దేవుని ప్రేమను సూచిస్తుంది. ఇది మనం తప్పక గుర్తుంచుకోవలసిన విషయం! భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ తప్పక ఉండాలి, ఎందుకన, దేవుడు స్త్రీని సృష్టించినపుడు, పురుషుడు ఇలా పలికాడు: "చివరకు ఈమె నా వంటిదైనది. ఈమె నా యెముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి యగును.

వివాహము దేవుని తలంపు కనుకనే, యేసుకూడా కానా పల్లెలోని పెండ్లికి వెళ్లి, తన దైవ సాన్నిధ్యముతో, వధూవరులను ఆశీర్వదించాడు (యోహాను 2:1-11). వారికోసం తన ప్రధమ అద్భుతాన్ని (నీళ్ళను ద్రాక్షారసముగ మార్చాడు) చేసాడు. వివాహము దేవుని తలంపు కనుకనే, పరిసయ్యులు విడాకుల గురించి అడిగినప్పుడు, యేసు వారికి ఇలా సమాధానమిచ్చాడు: మత్తయి 19:8 - ఆరంభమునుండి విడాకులు దేవుని తలంపు కాదు; అది మానవులు ఏర్పాటు చేసుకున్నదని యేసు స్పష్టం చేసాడు. మత్తయి 19:6లో "దేవుడు జతపరచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదు" (మార్కు 10:9) అని యేసు ఖరాఖండిగా చెప్పాడు. వివాహములోని 'అవిచ్చిన్నత' స్వభావాన్ని స్పష్టం చేస్తుంది. అనగా అది శాశ్వత బంధం.

సత్యోపదేశం:

ప్రేమ పునాది: జీవితములో, ప్రేమతో కలిసి కరిగిపోయేలా మమేకమవటం వలన వైవాహిక జీవితం ఏర్పడుతుంది. దేవుడే వివాహమును స్థాపించాడు. దైవ ప్రేమ ఈ వివాహ బంధములో ప్రదర్శితం  కావాలి. స్త్రీ పురుషునికి సహచరిణి. పురుషునితో సమానురాలు. సహ ధర్మచారిణిగా దేవుడు అతనికిచ్చాడు. అందుకే వారు ఏకశరీరులవుతారు (ఆది 2:24). కనుక, బేధాభిప్రాయాలు ఉండకూడదు. ఏకశరీరులవటం ఒక రోజులో (ఒక రాత్రిలో) జరిగేది కాదు; ఇది నిరంతరం జరిగేది; వైవాహిక జీవితంలో కలిసి పంచుకోవడం ద్వారా అనుదినం మెరుగవుతారు, అభివృద్ధి చెందుతారు. ఏకశరీరులవటం అనగా ఒకరినొకరు ప్రేమించుకోవడం; ఒకరితోనొకరు తమ జీవితాలను పంచుకోవడం; స్వార్ధం నుండి బయట పడటం... ఏకమవడం అనగా విడిగా వున్న ఇద్దరు వ్యక్తులు శారీరకముగా, మానసికముగా, ఆర్ధికముగా ఏకమై ముందుకు సాగడం.

పాపసంకీర్తనం: పాపసంకీర్తనంద్వారా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సన్నద్ధం కావడం సముచితం.

దివ్యబలిపూజ - దివ్యసత్ప్రసాదం: వివాహం సాధారణముగా దివ్యపూజలో జరుగుతుంది. ఎందుకనగా, క్రీస్తు ఏవిధంగా శ్రీసభ కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడో, దంపతులుకూడా ఒకరికోసం ఒకరు సమర్పించుకొనే వైవాహిక ప్రమాణాన్ని గుర్తుకు చేస్తుంది. అలాగే, దివ్యసత్ప్రసాదం స్వీకరించడంద్వారా, క్రీస్తు ప్రభుని ఒకే శరీరాన్ని, ఒకే రక్తాన్ని స్వీకరించడంద్వారా, క్రీస్తునందు ఒకే దేహముగా రూపొందుచున్నారు. 

పవిత్రాత్మ: వాళ్ళ ఒప్పందానికి ఆమోద ముద్ర పవిత్రాత్మ. ఆయనే వాళ్ళ ప్రేమకు మూలం. వాళ్ళ విశ్వసనీయతను నూత్నీకరించే బలం ఆయనే.

సమస్యలు - దేవుని కృపావరం: ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు, వరితోపాటు వారి బలహీనతలను మోసుకొస్తారు; వివాహ జీవితం ప్రారంభించాక తెలియని బలహీనతలు బయటపడతాయి. కనుక, వివాహ బంధములో ఎన్నోసమస్యలు తలెత్తడం సర్వసాధారణం: వైషమ్యం, ఆధిక్యతాభావం, నమ్మకద్రోహం, అసూయ, సంఘర్షణలు, ద్వేషం, ఎడబాట్లు, ఆరోపణలు, మనస్పర్ధలు, మొ.వి (దాంపత్య, ఆర్ధిక, ఆరోగ్య, సామాజిక, కుటుంబ సమస్యలు). అయితే, ప్రేమించడానికి, క్షమించడానికి, స్వస్థపరచడానికి వివాహ జీవితం ఓ గొప్ప అవకాశం! అయితే, ఈ గాయాలను, బలహీనతలను మాన్పడానికి దేవుని కృపావరం అవసరం. విశాలభావం కలిగి పరస్పర సహాయం, ఆత్మత్యాగాలను చేసుకోవడానికి వివాహం తోడ్పడుతుంది. క్రైస్తవ వైవాహిక కృపావరం క్రీస్తు శిలువ ఫలమే. సర్వమానవాళిని ఆయన రక్షించడానికి వచ్చాడు. కనుక, వివాహ బంధములోని సమస్యలనుండికూడా మిమ్ములను రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసం, నమ్మకం ఉంచండి.

దాంపత్య జీవితములోని నాలుగు ముఖ్యమైన అంశాలు: ఐఖ్యత (వారు ఇరువురు కాదు; ఒకే శరీరం), అవిచ్చిన్నత (విడదీయరాని బంధం; తుదిశ్వాస వరకు ఉండే బంధం), ప్రేమపట్ల విశ్వసనీయత (అన్యోన్య ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకం), సంతానం పట్ల ఆకాంక్ష (పిల్లల పెంపుదల, విద్య, విశ్వాస బోధ).

తిరు కుటుంబం (మరియ, యోసేపు, బాలయేసు) ప్రతీ కుటుంబానికి ఆదర్శం: ప్రతీ కుటుంబం ఒక గృహస్థ శ్రీసభ, దేవుని కుటుంబము. మానవ జీవితం సుసంపన్నమయ్యే పాఠశాల. వివాహ జీవితం ఒక ప్రేమ పాఠశాల. కుటుంబములోనే సహనాన్ని, ఆనందాన్ని, సోదరప్రేమను, క్షమాగుణాన్ని, ప్రార్ధనను నేర్చుకుంటారు. కానా పెళ్ళిలో తన మధ్యస్థ వేడుదలద్వారా సహాయం చేసిన మరియ తల్లి, మీకొరకు కూడా ప్రార్ధంచును గాక! కుటుంబ పాలకుడైన జోజప్పగారు మీకు సహాయపడును గాక! దివ్య బాలయేసు మీ కుటుంబములో నివసించును గాక!

జ్ఞాన వివాహము 2

జ్ఞాన వివాహము 2

వివాహం ద్వారా స్త్రీ పురుషుల మధ్య జీవితాంతం ఒక భాగస్వామ్యం ఏర్పడుతుంది ఈ భాగస్వామ్యం ఏమిటంటే దంపతుల శ్రేయస్సు సంతానం పిల్లల విద్య కోసం నిర్దేశించబడినది.

వివాహము దేవుని ప్రణాళిక / దైవానుగ్రహము

వివాహం ఓ దివ్య సంస్కారం అని మనందరికీ తెలుసు, ఎందుకంటే, వివాహాన్ని స్వయంగా దేవుడే ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఎప్పుడైతే స్త్రీపురుషులను సృష్టించాడో, వారి ఇరువురి నైజంలోనే వైవాహిక పిలుపును రాసి ఉన్నది. దేవుడు ప్రేమతో నరుని సృష్టించాడు, ఎందుకంటే, దేవుడు ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపుడు (1 యోహా 4:8). అలాగే వారిని ప్రేమించటానికి పిలుపునిచ్చాడు. ఇది అందరికీ సహజసిద్ధమైన, ప్రాథమికమైన పిలుపు. అలాగే దేవుడు మానవుని తన రూపంలో తన పోలికలో సృష్టించాడు (ఆ.కాం. 1:27; 1 యోహాను 4:8,16). అందుకే మానవుడు ప్రేమ కలిగి జీవించాలి. అలాగే దేవుడు నరుని ఒంటరిగా ఉండనీయలేదు; స్త్రీ పురుషులను సృష్టించాడు (ఆ.కాం. 1:27). అందుకే వారు అన్యోన్య ప్రేమతో, సంపూర్ణముగా, అపజయమెరుగని వారిగా జీవించాలి. ఈ అన్యోన్య ప్రేమను దేవుడు దీవించాడు. ఏమని దీవించాడంటే, “వ్యాప్తి చెందండి, భూమిని నింపండి, దానిని వశం చేసుకోండి” (ఆ.కాం. 1:28).

దేవుడు స్త్రీ పురుషులను ఒకరికోసం ఒకరిని సృష్టించాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. “మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు” (ఆ.కాం. 2:28). అందుకే పురుషునికి తోడుగా స్త్రీని సృష్టించాడు (ఆ.కాం. 2:18-25). స్త్రీ “అతని మాంసంలో మాంసం” అనగా స్త్రీ అతని సహచరిని, అతనికి సమానురాలు; సహధర్మచారిణిగా దేవుడు ఆమెను అతనికిచ్చాడు. అందుకే “నరుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యకు హత్తుకుంటాడు. వాళ్ళిద్దరు ఏక శరీరులవుతారు” (ఆ.కాం. 2:24).

ఈ విధముగా వివాహం అనేది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. వివాహము ద్వారా స్త్రీ, పురుషులు ఏకశరీరులుగా అగుచున్నారు. ఇదే విషయాన్ని అనగా తండ్రి దేవుని ప్రణాళికను, చిత్తమును సుత దేవుడు క్రీస్తు ప్రభువు కూడా వివరించి యున్నారు (మత్త 19:3-12). ప్రభువు అంటున్నారు:  “ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృష్టించాడు. ఈ కారణముచేతనే పురుషుడు, తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని యుండును. వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏకశరీరులై యున్నారు (మత్త 19:4-6).

ఈ సందర్భముగా పాపము ఎలా వివాహ జీవితమును నాశనం చేసి ఉందో తెలుసుకోవాలి. ఎందుకనగా పాపం ఈ నాటికి కూడా అనేక రూపాలలో వివాహ వ్యవస్థను, కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. పాపము అనగా దేవునికి వ్యతిరేకముగా చేయటం, జీవించడం; దేవున్ని అవిధేయించడం. ఈ పాపము వలన స్త్రీ పురుషుల సంబంధములో, వైషమ్యం, ఆధిక్యతభావం, నమ్మకద్రోహం, అసూయ, సంఘర్షణలు, ద్వేషం, ఎడబాట్లు, గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఈ రోజుల్లో విడాకులు, ఆస్తిసమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లలు లేనితనం, ఉద్యోగ సమస్యలు, అక్రమ సంబంధాలు, ఇగో సమస్యలు, పంతాలు పట్టింపులు, ప్రసార సాధనాల వల్ల వచ్చే ఇబ్బందులు మొదలగునవి ఎన్నో ఉన్నాయి. ఈ కల్లోల పరిస్థితిని చూసినప్పుడు, చాలా బాధగా ఉంటుంది.

పాపంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు, దేవుడు మనలను తృణీకరించడని గుర్తుంచుకోవాలి. ఎందుకన, ఆయన దయగల దేవుడు, కృపా మయుడు. ఆయనను విశ్వసిస్తే, పరిష్కార మార్గాలను చూపిస్తాడు. సమస్యలను అధిగమించేలా చేస్తాడు. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా విడాకులు అంటున్నారు. మత్తయి 19:8 లో ప్రభువు అంటున్నారు, “ఆరంభమునుండి విడాకులు లేవు. మీ హృదయ కాఠిన్యమునుబట్టి, విడిపోవుటకు మోషే అనుమతించాడు.” కానీ, ఇప్పుడు ప్రభువు అంటున్నారు స్త్రీ పురుషుల వివాహ బంధం విడదీయరానిది అని. “దేవుడు జత పరిచిన జంటను వేరుపరపరాదు” (మత్త 19:6). ఈ విధముగా వివాహబంధంలో ఉన్న సమస్యలను ప్రభువు పునరుద్ధరిస్తున్నారు.

వైవాహిక జీవితం కొనసాగడానికి కావలసిన బలాన్ని, కృపావరాన్ని ప్రభువే స్వయంగా ఇస్తారు. క్రైస్తవ వైవాహిక కృపావరం,  క్రీస్తు సిలువ ఫలమే. ఆ సిలువే క్రైస్తవ జీవన సర్వస్వానికి మూలం. అందుకే పునీత పౌలుగారు ఇలా అంటున్నారు: “క్రీస్తు శ్రీ సభను ప్రేమించిన విధముగా శ్రీసభను పరిశుద్ధ పరచటానికి, తననుతాను సమర్పించుకున్న విధముగా, భర్త, భార్యను ప్రేమించాలి. ఈ కారణం చేతనే పురుషుడు తన తల్లిదండ్రులను వదలి తన భార్యతో ఐక్యం అవుతాడు.” (ఎఫే 5:25-26; 31-32; ఆ.కాం.2:25).

అంగీకారం / ప్రమాణం

స్త్రీ పురుషులిద్దరూ కూడా వివాహ జీవితానికి తమ అంగీకారాన్ని స్వేచ్ఛగా తెలపాలి. వారు ఎలాంటి నిర్బంధంలో ఉండకూడదు. నిర్బంధంలో ఉన్న యెడల ఆ వివాహం కలకాలం నిలవదు. పరస్పర అంగీకారం లోపిస్తే వివాహమే లేదు. అందుకే, బలవంతపు పెళ్లిళ్లు చేయరాదు; ఇష్టం లేని పెళ్లిళ్లు బలవంతంగా చేయరాదు. ఆస్తికి, డబ్బుకు, సంపదకు ఆశపడి బలవంతపు పెళ్లిళ్లు చేస్తే, అవి కలకాలం నిలవవు. పరస్పర అంగీకారం ఉన్నప్పుడే ఒకరినొకరు భాగస్వాములుగా అంగీకరిస్తారు. మనస్ఫూర్తిగా, “నేను నిన్ను నా భార్యగా, నా భర్తగా అంగీకరిస్తున్నాను” అని చెప్పగలరు. ఈ పరస్పర అంగీకారం, గురువు లేదా దీకను శ్రీసభ తరపున ఆమోదించి వారికి దీవెనలను అందిస్తారు.

దాంపత్య ప్రేమకు అవసరమయ్యే అంశాలు

ఐక్యత, అవిచ్ఛిన్నత: వారు ఇద్దరు కాదు, ఒకే దేహం; వివాహములో వారు ఐక్యమై ఉన్నారు (మత్త 19:6; ఆ.కాం. 2:24).

విశ్వసనీయత: దాంపత్య ప్రేమకు దంపతుల అచంచల విశ్వసనీయత అవసరం. ఇది నిర్దిష్టమైన, అన్యోన్య ప్రేమను కోరుతుంది.

సంతానంపట్ల ఆకాంక్ష: ఫలించి, విస్తరించండి అని దేవుడు దీవించాడు. వైవాహిక ప్రేమ స్వభావమే సంతాన ప్రాప్తి; వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పడానికి నిర్దేశిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రధమ, ప్రధాన విద్యాబోధకులు. ఇది కుటుంబ ప్రాథమిక కర్తవ్యం.

జ్ఞాన వివాహము 1


జ్ఞాన వివాహము 1

జ్ఞాన వివాహము ఒక ఒడంబడిక. ఒక స్త్రీ, ఒక పురుషుడు జీవిత కాలము వరకు ఒడంబడికను ఏర్పరచుకొనుటయే వివాహము. వివాహ స్వభావము, భార్య, భర్తల ప్రేమ, సంతానం మరియు వారిని అన్నివిధాలుగా విద్యావంతులను చేయడం. "వివాహము అన్నింటిలో ఘనమైనది." జ్ఞానస్నానము పొందిన ఇరువురి వ్యక్తుల (స్త్రీ, పురుషులు) మధ్య జరిగెడి ఒప్పందమును లేక వివాహమును క్రీస్తు ప్రభువు దివ్యసంస్కారముగాచేసి ఉన్నతమైన స్థానమును కలుగజేసియున్నాడు.

ఒడంబడిక కేవలం న్యాయబద్ధమైనది మాత్రమేగాక, ఆధ్యాత్మికమైనది కూడా. ఎలాగంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆధ్యాత్మికమైన ఒడంబడికను ఏర్పరచుకొన్న విధముగా! మరియు క్రీస్తు తన త్యాగపూరితమైన మరణముద్వారా మనతో ఒక నూతన, శాశ్వతమైన ఆధ్యాత్మిక ఒడంబడికను ఏర్పరచుకొన్న విధముగా! వివాహ ఒడంబడిక పవిత్రమైన ప్రతిజ్ఞతో కూడుకొనియున్నది. కారణముచేతనే, వివాహము జీవితకాల అనుబంధము. ఒడంబడిక మరణముతోనే ముగుస్తుంది.

వివాహము జీవితకాల భాగస్వామ్యం. పవిత్రమైన, ఆధ్యాత్మికమైన వివాహబంధము ఏవో కొన్ని హక్కులు, బాధ్యతలతో కూడిన ఒడంబడిక మాత్రమేకాదు. వివాహ బంధములో, ఇరువురు ఒకరికొకరు సంపూర్ణముగా అర్పించుకోవాలి. సంపూర్ణ అర్పణ క్రీస్తునాధుని ప్రేమను, తన రక్తాన్ని చిందించి తన ప్రాణాలను సైతము అర్పించిన మనపైగల క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తూ ఉండాలి. అందుకే, వివాహ బంధం సంపూర్ణ స్వీయార్పణము.

పైన చెప్పినట్లుగా, వివాహము యొక్క స్వభావము లేదా ఉద్దేశము రెండు విధాలు: మొదటగా భార్యభర్తల మధ్య ప్రేమ. స్వచ్చమైన, నిజమైన ప్రేమ  ఎంతో ఉన్నతమైనది. ఈనాడు ప్రేమను అన్నివిధాలుగా తప్పుగా అర్ధం చేసుకోవడం జరుగుతుంది. ప్రేమ పేరిట ఎన్నో మోసాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో వంచనలు! కొంత మందికి ప్రేమ అంటే కేవలం శారీరక ఆకర్షణ! వివాహ సంబంధమైన ప్రేమ భార్యభర్తలమధ్య శాశ్వతమైన, ఎప్పటికీ అతిక్రమించని, పవిత్రమైన నమ్మకాన్ని కోరుకుంటుంది. నమ్మకం భార్యభర్తలిరువురు ఒకరికొకరు సంపూర్ణముగా అర్పించుకొనుటలోనుండివచ్చే గొప్ప బహుమాన ఫలితము. ఒకరినొకరు అర్పించుకొనుటలో అతి సాన్నిహిత్యమైన ఐఖ్యత, శాశ్వతమైన నమ్మకము భార్యభర్తలు కలిగియుండాలి.

రెండవదిగా, సంతానం మరియు వారిని అన్నివిధములుగా విద్యావంతులను చేయడం. బహుసంతతిని కలిగియుండటము దేవుని వరము. భార్యభర్తల మధ్య ఉన్న ప్రేమ ఫలితం సంతానము. సంతాన పోషణ, వారిని అన్ని విధాలుగా విద్యావంతులను చేయడం తల్లిదండ్రుల భాద్యత. వివాహ దివ్యసంస్కార అనుగ్రహం, భార్యభర్తల మధ్య ప్రేమను పరిపూర్ణం చేస్తుంది, నమ్మకములో వారిరువురిని ఐఖ్యపరుస్తుంది. పిల్లలను పోషించుటకు సహాయం చేస్తుంది. వివాహ దివ్యసంస్కార అనుగ్రహానికి మూలం క్రీస్తు ప్రభువు. భార్యభర్తల ఒడంబడిక ప్రతిజ్ఞలను బలపరచి, క్షమ, కరుణతో ఒకరి కష్టాలు మరొకరు భరించుటకు వారితో ఉంటాడు.

పునీత పౌలుగారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో (5:21-33) భార్యభర్తల సంబంధముగూర్చి చక్కగా చెప్పియున్నారు: పరస్పరము విధేయులై ఉండవలయును. శ్రీసభ క్రీస్తుకు విధేయత చూపునట్లే భార్యలు తమ భర్తలకు సంపూర్ణ విధేయతను చూపవలయును. క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దానికొరకై తన ప్రాణములు అర్పించెనో, భర్తలు భార్యలను అట్లే ప్రేమింపుడు. తమనుతాము ప్రేమించునట్లే భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలన, తన భార్యను ప్రేమించు వ్యక్తి తననుతాను ప్రేమించుకొనును. "ఇందు వలననే, పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును. వారిరువురు ఒకే వ్యక్తిగ ఐక్యము అగుదురు." ఇది గొప్ప సత్యము. ప్రతి భర్త తన భార్యను తననుగానే ప్రేమింపవలెను. అట్లే, ప్రతి భార్య తన భర్తను గౌరవింపవలెను.

వివాహము - దివ్య సంస్కారము

దేవుని ప్రేమ గొప్పది, అనంతమైనది. మానవాళి ప్రేమలో ముఖ్యముగా వివాహ బంధములో దేవుని ప్రేమ ఎంతగానో ఇమిడియున్నది. నిజమైన ప్రేమను మాటలో చెప్పలేము. ఒకరిపైనొకరికి ఉన్న ప్రేమద్వారా, దైవప్రేమ ప్రదర్శింపబడుతుంది. వివాహ ప్రేమ బయటకు కనిపించెడి దేవుని ప్రేమకు చిహ్నము. అందుకే, తల్లి తిరుసభ వివాహమును దివ్యసంస్కారముగా గుర్తించినది. దివ్యసంస్కారము అనగా దైవ-మానవ ప్రేమను ఇవ్వడము మరియు స్వీకరించడము. వివాహ బంధములో, స్త్రీ, పురుషులు ఒకరిపై ఒకరు దివ్యసంస్కారాన్ని ఇచ్చుకోవడమనగా అర్ధము ఇదియే, లేక వారి అనంతమయిన ప్రేమ ప్రతిజ్ఞను, దివ్యసంస్కారముగా కొనియాడటము. వివాహ సాంగ్యములో గొప్ప ప్రేమనే కొనియాడటము మనము చూస్తున్నాము. ఉత్తానక్రీస్తు సాన్నిధ్యము వారి జీవితకాల ప్రయాణమంతయు భార్యభర్తలతో ఉండటము వలన బంధము దివ్యసంస్కారముగా చూస్తూ ఉన్నాము.

ప్రేమ - వివాహ జీవితం

"నేను మిమ్ము ప్రేమించినటులనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితులకొరకు తన ప్రాణమును ధారపోయువానికంటె ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు" (యోహాను 15:12-14). ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ప్రేమాజ్ఞ. మనము దేవున్ని ప్రేమించాలి. మన తోటివారిని ప్రేమించాలి. ఎలా? మన ప్రాణములను ఇతరులకొరకు ధారపోయాలి. సిలువపై వ్రేలాడాలని ప్రభువు మనలను కోరడంలేదు. కాని, ఆధ్యాత్మికముగా ప్రభువు మనలను కోరుచున్నారు. వివాహితులు, ఒకరికొకరు ప్రాణములను ధారపొయుదమని ప్రతిజ్ఞ చేయుచున్నారు.  పరిపూర్ణముగా ఎలా ప్రేమించాలో మనం నేర్చుకోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ ప్రతీ క్షణం అధికమధికమవుతూ ఉండాలి.

జ్ఞాన వివాహము - కుటుంబ జీవితము

జ్ఞానవివాహము ద్వారా ఇరువురు వ్యక్తులు ఒక నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నారు. "నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు. అతనికి తోడునీడయగు స్త్రీని సృష్టింతును" (ఆది 2:18). జీవిత భాగస్వామిని ఒసగేది దేవుడే. ఈవిధముగా కుటుంబ జీవితములో ప్రవేశించువారు భాగ్యవంతులు. దేవుని కృప ఎల్లప్పుడూ వారితో ఉంటుంది కాబట్టి, వారియొక్క జీవితము ఆనందదాయకముగా ఉంటుంది. వారి కష్టాలను, ఇబ్బందులను జయించుటకు పవిత్రాత్మ శక్తి వారిలో ఉంటుంది. కష్టాలలోను, వేదనలలోను పరస్పరం సహాయపడుతూ, సహకరిస్తూ జీవించుటకు శక్తి, దేవుని చిత్త ప్రకారం జీవించే దంపతులకు ఉంటుంది.

కుటుంబ జీవితములో, ముఖ్యముగా బిడ్డలకు వివాహ సంబంధాలు చూస్తూ ఉండగా, క్రింది విషయాలు గమనించుట సముచితము:

1. ప్రార్ధన మరియు దైవ విశ్వాసముగల కుటుంబము
2. మోసము, అవినీతి పరమైన మార్గముల ద్వారా డబ్బును సంపాదించని కుటుంబము
3. సొంత కుటుంబ స్థితిగతులను కొనసాగించగలిగే జీవిత శైలి
4. కుటుంబ విషయాలలోను, పనిపాట్లలోను కలిగి ఉన్న లోకజ్ఞానం.
5. జీవిత వీక్షణములోగల ఐఖ్యత
పై విషయాలను గమనించి, పాటించినట్లయితే, కుటుంబ జీవితములో శాంతి, సమాధానాలు మరియు దంపతులకు మానసిక ఐఖ్యత కలుగుతుంది.

వివాహము - అర్పణ జీవితము

"ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారిరువురు కాపురము చేయకమునుపే పవిత్రాత్మ ప్రభావమువలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానించుట ఇష్టములేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా, ప్రభువు దూత కలలో కనిపించి, 'దావీదు కుమారుడవగు యోసేపు! నీ భార్యయైన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు...'. నిదురనుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను" (మత్తయి 1:18-25).  వైవాహిక జీవితములో సంపూర్ణ సమర్పణను దేవుడు ఆశిస్తున్నాడు.

పరస్పర సమర్పణ

దంపతులు తమ దాంపత్యములో తీయదనాన్ని అనుభవించాలంటే, ఒకే శరీరము, ఒకే మనస్సు, ఒకే హృదయముతో ఐఖ్యమవ్వాలి. ప్రభువు ఇలా అంటున్నారు: "ప్రారంభమునుండి సృష్టికర్త వారిని స్త్రీ, పురుషులనుగా సృజించినట్లుగా మీరు ఎరుగరా? కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్నశరీరాలుకాక, ఏకశరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదు" (మత్తయి 19:4-6). "కుమారీ! నీవు నా పలుకులు సావధానముగా వినుము. మీ ప్రజలను, మీ పుట్టింటిని ఇక మరచి పొమ్ము. రాజు నీ సౌందర్యమునకు మురిసి పోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము" (కీర్తన 45:10-11).

స్త్రీ మరియు పురుషుడు పరస్పరము విశ్వసిస్తూ అర్పించుకొంటూ జీవితమును కొనసాగించాలి. దేవుడు ఏర్పరచిన వైవాహిక జీవితము, దానిలో ఉన్నటువంటి ప్రేమ, పరస్పర సమర్పణ, ఐఖ్యత, సమ్మతము సుస్థిరమైనది. పవిత్ర బంధం భార్యభర్తలయొక్క, సంతానముయొక్క మరియు  సమాజము యొక్క మేలుకై ఉద్దేశించబడినది. కనుక, దివ్యపూజాబలిలో, ప్రభుని మరియు ఆయన ప్రజల సమక్షములో ఏర్పరచబడిన బంధం జీవితకాలమంతయు దేవుని ప్రణాళిక, ఆజ్ఞల ప్రకారం వర్ధిల్లాలని ప్రార్ధిద్దాం!

వివాహ జీవితము, ఆనందముగా, సుఖాంతముగా ఉండాలంటే, మూడు అతి ముఖ్యమైన విషయాలు అత్యవసరం:

1. ప్రార్ధన: మిక్కిలిగా ప్రార్ధన చేయండి. ప్రార్ధన తండ్రియైన దేవునితో మాట్లాడటం. మన సంతోషాలను, బాధలను ఆయనతో పంచుకోవటం. ఆయన ప్రణాళికను, ఆజ్ఞలను తెలుసుకోవటం మరియు వాటిని ఆచరించడానికిగల శక్తిని పొందటం. ప్రార్ధన దేవుని ఆశీర్వాదాలను పొందటం. "కలసి ప్రార్ధించే కుటుంబం, ఎప్పటికి కలసి ఉంటుంది" (The family that prays together, stays together”) అనే నానుడి మనదరికి తెలిసిందే! వివాహ జీవిత ప్రారoభమునుండే, ప్రార్ధన అనే పునాదిని వేయండి. అప్పుడే వివాహజీవితం బలముగా ఉంటుంది. వివాహం దివ్యసంస్కారం అయినప్పుడు, అది దేవుని అనుగ్రహానికి, వరానికి మూలము. కేవలం మీరు మాత్రమేగాక, దేవుడుకూడా మీ వివాహజీవితం సంతోషముగా ఉండాలని ఆశిస్తున్నాడు. అన్ని సమయాలలో దేవునివైపు చూడటం నేర్చుకొని, ఆయనకు ప్రార్ధన చేయండి, తప్పక, మీ వివాహ జీవితం సంతోషముగా ఉంటుంది.

2. అనంతమైన ప్రేమ: దేవుడు మిమ్ములను అమితముగా, అనంతముగా ఎలాంటి షరతులు లేకుండా, మీలోనున్న లోపాలను చూడకుండా ప్రేమిస్తున్నాడో, మీరును ఒకరినొకరు అలా ప్రేమించుకొనుడి. అది దేవుని ప్రేమ గొప్పదనం. మీరును ఒకరిపట్ల ఒకరు అనంతముగా ప్రేమను కలిగియుండండి. నీభాగస్వామినుండి అమితముగా ఆశించక, ఇవ్వడానికి ప్రయత్నంచేయి. నీవు ఆశించిన దానిని నీవు పొందలేనప్పుడు, క్షమించు. నీనుండి ఆశించిన దానిని నీవు ఇవ్వలేనప్పుడు, క్షమించమని కోరు.

3. నమ్మకము: వివాహ జీవితాన్ని దేవుని చిత్తప్రకారముగా జీవించండి. జీవించడానికి ప్రయత్నంచేయండి. వివాహ సమయములో మీరు చేసిన వాగ్దానాలను జీవితాంతం మరువక వాని ప్రకారం జీవించండి. ఒకరిపట్ల ఒకరు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి యుండండి. అనుమానానికి చోటు ఇవ్వకండి.