పునీత పేతురుగారి సింహాసనోత్సవం - 22 ఫిబ్రవరి

 పునీత పేతురుగారి సింహాసనోత్సవం - 22 ఫిబ్రవరి

"నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను"


అపోస్తులందరిలో పునీత పేతురుగారికి క్రీస్తు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నారు. పేతురు గారి విశ్వాసాన్నిబట్టి
, ఆయనలోని నాయకత్వపు లక్షణాలను బట్టి,
 దేవుడు తాను నిర్మించిన శ్రీసభకు పేతురును నాయకుడిని చేశారు: "నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను" (మత్తయి 16:18; యోహాను 21:16-17). ప్రభువు పేతురుకు ఇచ్చిన అధికారాన్ని ప్రత్యేక విధముగా స్మరించుకుంటూ తల్లి శ్రీసభ ప్రతి యేట ఫిబ్రవరి 22న పునీత రాయప్ప (పేతురు)గారి సింహాసనోత్సవముగా కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు ప్రతినిధిగా తిరుసభ పాలనా బాధ్యతల్ని అందుకున్న మొదటి జగద్గురువులు అపోస్తలుడైన పునీత పేతురు. ఈ మహోత్సవాన్ని శ్రీసభ ప్రారంభంనుండి జరుపుతున్నట్లు చరిత్ర వెల్లడిస్తుంది. ఈ మేరకు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

పేతురు ప్రధానత్వం
నూతన వేదం అపోస్తులుల జాబితాలను పేర్కొన్నపుడల్లా పునీత పేతురుగారి పేరే మొదట వస్తుంది (మార్కు 3:16-19). ఇతరుల అపోస్తలుల తరపున అతడు మాట్లాడుతూ ఉంటాడు (మత్త 16:16). పునరుత్థాన క్రీస్తు శిష్యులందరిలోను పేతురుగారికే మొదట దర్శన మిచ్చారు (1 కొరి 15:5).

నూతన వేదంలో మూడు ప్రధాన సందర్భాలు పేతురు, 12 మంది శిష్యుల్లో ప్రధానుడని రుజువు చేస్తాయి. మొదటిగా, మత్తయి 16:13-19 వచనాలను మనం పరిశీలిస్తే, క్రీస్తు సీమోను పేతురు నామాన్ని 'కేఫా'గా మార్చారు. 'కేఫా' అనగా 'రాయి' అని అర్థం. తాను నిర్మించబోయే తిరుసభకు అతన్ని పునాది రాయిని చేశారు. ఇంక అతనికి పరలోకరాజ్యపు తాళపు చెవులు (పూర్తి అధికారం) ఇచ్చారు. వేటినైనా బంధించడానికి, విప్పటానికి సర్వాదికారం ఇచ్చారు. అనగా క్రీస్తు గృహానికి క్రీస్తే యజమానుడు కాగా, పేతురు ఆ యజమానునికి ప్రతినిధి అవుతాడని భావం. వీటన్నిటినిబట్టి పేతురు అపోస్తులలో ప్రధానుడని అర్థం చేసుకోవాలి.

రెండవదిగా, లూకా 22:31-32 వచనాలను పరిశీలిస్తేక్రీస్తు మరణ సందర్భంలో, సాతాను అపోస్తులందరిని శోధించింది. పేతురుతోపాటు అందరూ పడిపోయారు. కానీ క్రీస్తు ప్రార్థనా బలంవల్ల పడిపోయిన పేతురుగారు మరల లేస్తారు. అలా లేచాక అతడు తన సోదరులను బలపరుస్తాడు. ఇక్కడ "సోదరులు" అనగా క్రీస్తును విశ్వసించే ఇతర అపోస్తలులంతా; వీరినందరినీ బలపరిచే పేతురు, వీరికి నాయకుడు అవుతారు కదా! పేతురు బలహీనుడైనా ప్రభువు అతనికి ఈ నాయకత్వాన్ని దయచేశారు.

మూడవదిగా, యోహాను 21:15-17 వచనాలను పరిశీలిస్తే, ఇక్కడ క్రీస్తు మూడు పర్యాయాలు తన మందను కాయమని పేతురుకు చెప్పారు. అనగా అతన్ని ఖచ్చితముగా తన మందకు నాయకున్ని చేసారు. క్రీస్తే తన మందకు మంచి కాపరి. పూర్వవేద ప్రజలకు 'యావే కాపరి' అనగా నాయకుడు అయినను న్యాయాధిపతులు, రాజులు, నాయకులు కూడా ప్రజలకు కాపరులే. వీరు యావే అధికారంలో పాలుపొంది ఇశ్రాయేలు ప్రజలకు నాయకులు అయ్యారు. అలాగే ప్రధాన కాపరియైన క్రీస్తు కూడా పేతురుకి, తన నాయకత్వంలో పాలుపంచి యిచ్చారు. అతడు క్రీస్తనే ప్రధాన కాపరి క్రింద పనిచేసే ఉపకాపరి. ఇంకా ప్రభువు ఒకే మంద, ఒకే కాపరి అన్నారు (యోహాను 10:16). ఈ ఒకే కాపరి మొదటి పేతురుగారే! ఈ ఒకే కాపరిద్వారా క్రీస్తు మందుకు ఐక్యత సిద్ధించింది.

పై మూడు పఠనాలు, పేతురు శిష్యుల్లో ప్రధానుడనీ, క్రీస్తు అతనికి ప్రత్యేక అధికారం అప్పజెప్పాడని రుజువు చేస్తున్నాయి. పేతురు గొప్పతనంవల్ల అతనికి ప్రత్యేక అధికారం రాలేదు. క్రీస్తు కరుణవల్ల వచ్చింది. క్రీస్తు మెస్సయ్య, అతడు పేతురును మెస్సయ్య సమాజానికి శిరస్సునిగా, నాయకునిగా నియమించారు.

అపోస్తుల కార్యాలు తొలి ఎనిమిది అధ్యాయాలు, పేతురు తొలి నాటి క్రైస్తవ సమాజంలో ఎలా నాయకత్వం వహించింది వివరిస్తాయి. మత్తీయాసు పండ్రెండవ అపోస్తులునిగా ఎన్నుకోవడంలో, పరిశుద్ధాత్మ దిగివచ్చాక యెరుషలేములో ఉపన్యసించడంలో, కుంటి వాడిని స్వస్థపరచాక దేవళంలో మాట్లాడటంలో పేతురుగారు నాయకత్వం వహించారు. ఈ పేతురు ప్రధానత్వం, తర్వాత పోపుగారికి లభించింది.

పరలోక రాజ్యపు తాళం చెవులు - నిర్వచనం
పునీత పేతురుగారి స్వరూపాలను, చిత్రపటాలను మనం గమనించినట్లైతే, ఆయన చేతిలో తాళం చెవుల గుత్తి కనిపిస్తూ ఉంటుంది. పరలోక రాజ్యపు తాళం చెవులులేదా పరలోక రాజ్యానికి తాళం చెవులుఅనే మాట ప్రజల్ని దేవుని రాజ్యంలోకి ప్రవేశించేందుకుఅనుమతిచ్చే అధికారాన్ని సూచిస్తుంది (మత్త 16:19). పరలోక రాజ్యపు తాళంచెవుల్నియేసు పేతురుకు ఇచ్చాడు. నమ్మకస్థులైన ప్రజలు దేవుని పవిత్రశక్తిని పొంది పరలోక రాజ్యానికి ఎలా వెళ్లవచ్చో చెప్పే సమాచారాన్ని తెలియజేసే అధికారాన్ని యేసు పేతురుకు ఇచ్చాడని అర్ధం.

పేతురు ఆ తాళంచెవుల్ని ఎవరి కోసం ఉపయోగించాడు?
దేవుడు తనకిచ్చిన ఆ అధికారాన్ని పేతురు, మూడు గుంపుల వారిని పరలోకానికి వెళ్లేందుకు మార్గం తెరవడానికి ఉపయోగించాడు. ఆ మూడు గుంపులు ఎవరంటే: 
యూదులు: యేసు చనిపోయిన కొంతకాలం తర్వాత, పేతురు యూదులతో మాట్లాడుతూ, రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా యేసును అంగీకరించమని వారిని ప్రోత్సహించాడు. రక్షణ పొందాలంటే ఏమి చేయాలో పేతురు వారికి చూపించాడు. ఆవిధంగా రాజ్యంలోకి ప్రవేశించడానికి మార్గాన్ని వారికి చూపించాడు. కొన్ని వేలమంది అతని మాటను అంగీకరించారు’ (అ.కా. 2:38-41).
సమరీయులు: పేతురు ఆ తర్వాత సమరీయుల దగ్గరకు పంపించబడ్డాడు. అతను, అలాగే అపొస్తలుడైన యోహాను వారి దగ్గరకు వెళ్లి విశ్వాసులు పవిత్రశక్తి పొందేలా వారికోసం ప్రార్థించారు.అలా చేయడం ద్వారా పేతురు మరొక రాజ్యపు తాళంచెవిని ఉపయోగించాడు (అ.కా. 8:14-17). దానితో పరలోక రాజ్యానికి వెళ్లే అవకాశం సమరీయులకు దొరికింది.
అన్యులు: యేసు చనిపోయిన మూడున్నర సంవత్సరాల తర్వాత, అన్యులు (యూదులు కానివాళ్లు) కూడా పరలోక రాజ్యంలో భాగమయ్యే అవకాశం పొందుతారని దేవుడు పేతురుకు తెలియజేసారు. అప్పుడు పేతురు వారికికూడా, దైవరాజ్యము గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. అలా అతను రాజ్యపు తాళంచెవుల్లో ఇంకొకదాన్ని ఉపయోగించాడు. దాంతో అన్యులు పవిత్రశక్తిని పొందడం, క్రైస్తవులుగా మారడం, భవిష్యత్తులో పరలోకరాజ్య పౌరులుగా అయ్యేందుకు అవకాశం సాధ్యమైంది (అ.కా. 10:30-35, 44, 45).

పండుగ ప్రాముఖ్యత: పునీత పేతురుగారి సింహాసనోత్సవ పండుగ మరింత క్లుప్తంగా చెప్పాలంటే, పునీత పేతురు గారి కుర్చీ పండుగ అని దీనర్థం. ప్రతి మేత్రాసణములో ఒక కథీడ్రల్ ఉంటుంది. ఆ కథీడ్రల్ నందు మేత్రాణులు కూర్చోవటానికి ఒక ప్రత్యేకమైన సింహాసనము (కుర్చీ) ఏర్పాటు చేయబడి ఉంటుంది. పీఠాధిపతులు తమయొక్క అధికారక సందేశాలను ఈ కుర్చీలోనుండి వినిపిస్తారు. ఈ  కుర్చీ వారియొక్క అధికారానికి గుర్తు. క్రీస్తు ప్రభువు అష్టభాగ్యాలను బోధిస్తున్నప్పుడు కూర్చుని బోధించారు. యూదామత సాంప్రదాయాలలో గురువులు ఏవైనా విషయాలు అధికారకంగా బోధించాలి అంటే నించొని బోధించేవారు కాదు కూర్చొని బోధించేవారు. కుర్చీ ( సింహాసనం) తిరుసభ పీఠాధిపతులకు ఇచ్చినటువంటి అధికారానికి, అలాగే అపోస్తుల వారసత్వములో వారు భాగస్వామ్యాన్ని పంచుకునే విధానాన్ని మనకు తెలియజేస్తున్నది. రోమునగరంలో పునీత పేతురుగారి మహాదేవాలయంలో లోపలి భాగంలో మనం గమనిస్తే ఒక  సింహాసనం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇది చెక్కతో చేయబడిన సింహాసనం. ఇది సాక్షాత్తు పేతురుగారు ఉపయోగించిన సింహాసనం అని చెబుతారు. ఈ సింహాసనం యొక్క పైభాగంలో ఒక పెద్ద కిటికీ అమర్చబడి ఉంటుంది. ఆ కిటికీకి అద్దం మీద కొన్ని ప్రతిబింబాలు మనకు కనిపిస్తాయి. ఆ ప్రతిబింబం మీద ఒక పెద్ద పావుర రూపాన్ని మనం చూడవచ్చు. ఈ పావురం పవిత్రాత్మకు చిహ్నంగా ఉంటుంది‌. అలాగే ఈ పావురం చుట్టూ, 12 వెలుగు రేఖలుకూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీకూడా అపోస్తులుల చిహ్నంగా అవి గుర్తించబడుతున్నాయి. ఈ విధంగా పునీత పేతురుయొక్క అధికారాన్ని పవిత్రాత్మ సర్వేశ్వరుడు సంరక్షిస్తూ ఉన్నారు. వారియొక్క ఆధ్వర్యంలో పేతురు వారసులైన పోపుగార్లందరు కూడా పరిపాలిస్తున్నారు అన్న గొప్ప సత్యాన్ని మరియు తిరుసభ యొక్క అధికారాన్ని, పోప్ గారి యొక్క అధికారాన్ని మనమంతా అంగీకరించాలని ఈ పండుగ మన నుండి కోరుతూ ఉన్నది.

రోమునగర పేతురు సింహాసనోత్సవాన్ని పేతురు వేదసాక్షి మరణం పొందిన పండుగతో సమానంగా, పవిత్రంగా జరుపుకోవాల్సి ఉంది. "వేదసాక్షి మరణం ద్వారా పేతురు మోక్షంలోని మహిమ సింహాసనాన్ని అత్యంత వైభవంతో అలంకరించారు" అని పునీత లియో సింహళీ పోపుగారు పేర్కొన్నారు. రోములోని పేతురు సింహాసనమును అధికార మాధ్యకంగా వారిచే తానే భూలోకంలో శ్రీసభ తలయైన వారు కూర్చోడానికి స్థాపించారు.

No comments:

Post a Comment