పునీత మార్కు
సువార్తీకుడు, వేదసాక్షి
మార్కు సువార్తీకుడు, వేదసాక్షి - నలుగురు సువార్తీకులలో మార్కు ఒకరు. మార్కు మారుపేరు యోహాను. తల్లి పేరు మరియమ్మ. వారి స్వస్థలం యెరూషలేము. మరియమ్మ యెరూషలేము సంఘములో ప్రముఖ సభ్యురాలు. పేతురు వీరికి సుపరిచితుడు. దేవదూత సహాయమున చెరసాల నుండి విడుదల పొందిన పేతురు, వీరి యింటికి వెళ్ళాడు (అ.కా. 12:12). యెరూషలేములోని వీరి నివాసములో అపోస్తలులు తరుచుగా సమావేశమయ్యేవారు (అ.కా. 12:12, 25; 15:37, 39). మార్కు మారుపేరుగల యోహాను బర్నబాకు దగ్గర బంధువు (కొలొస్సీ 4:10).
పౌలు అనుచరుడు - మార్కు పౌలు అనుచరుడు. సువార్తా ప్రచారముకై, మార్కు పౌలు, బర్నబాలతో కలిసి పనిచేసాడు. క్రీ.శ. 46-48 మధ్య కాలములోని, పౌలుగారి మొదటి ప్రేషిత ప్రయాణములో, పౌలు, బర్నబాలు, మార్కు అను మారుపేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి అంతియోకు తిరిగి వెళ్ళారు (అ.కా. 12:25). అంతియోకు నుండి సైప్రసులో వేదప్రచారము చేసారు. యోహాను [మార్కు] ఉపచారకునిగా వారికి తోడ్పడ్డాడు (అ.కా. 13:5). పౌలును అతని తోడివారును పాఫోసు నుండి సముద్ర ప్రయాణము చేసి, మధ్య ఆసియా మైనరు దక్షిణ తీరములోని పంపీలియాలోని పెర్గాకు వచ్చారు. మార్కు [యోహాను] వారిని అక్కడే దిగవిడచి వారితో కొనసాగక, యెరూషలేమునకు తిరిగి పోయాడు (అ.కా. 13:13). "వారి సువార్తా ప్రచారములో అతడు చివరివరకు వారితో ఉండక, వారిని పంఫీలియాలో విడిచిపెట్టి వెనుకకు మరలిపోయెను" అని అ.కా. 15:38లో చదువుచున్నాము. మార్కు మధ్యలోనే తిరిగి వెళ్ళడముతో, పౌలు నిరాశ చెందియుండవచ్చు! మార్కు నమ్మదగినవానిగా, వేదప్రచారములో దృఢముగా నిలబడగలడా అని తన అనుమాన్ని కూడా వ్యక్తపరచి యుండవచ్చు! ఈ సంఘటన, పౌలు, బర్నబాల మధ్య విబేధాలను సృష్టించినది.
క్రీ.శ. 49-52 మధ్య కాలములోని, పౌలుగారి రెండవ ప్రేషిత ప్రయాణమునకు, బర్నబా తమతో మార్కు అనుమారుపేరు గల యోహానును తీసికొని పోగోరెను. కాని పౌలు అతనిని తీసికొని పోవుట మంచిది కాదని తలంచాడు. అందుచేత వారిద్దరి మధ్య ఈ విషయమై తీవ్రమైన తర్జనభర్జనలు జరిగాయి. కనుక వారు విడిపోయారు. బర్నబా మార్కును తీసికొని ఓడనెక్కి సైప్రసుకు పోయాడు. పౌలు సిలాసును ఎన్నుకొని, ఆసియా మైనరులోని సిరియా, సిలీషియా వెళ్ళాడు (అ.కా. 15:37, 39-41).
అయితే, పౌలు మార్కుల మధ్యగల సమస్యలు ఎక్కువకాలం కొనసాగలేదని భావించవచ్చు! వారి మధ్యగల మనస్పర్ధలను తొలగించుకొని త్వరలోనే సఖ్యత పడ్డారు. రోమునగరమున మొదటిసారిగా ఖైదు [గృహ నిర్బంధం] చేయబడిన పౌలును (క్రీ.శ. 61-63), ఆసియా మైనరును సందర్శించే భాగములో రోమునగరములోనే నున్న మార్కు, పౌలుని విశ్వసనీయ సహచరులలో ఒకనిగా అతనిని సందర్శించాడు (కొలొస్సీ 4:10). ఫిలేమోనుకు వ్రాసిన లేఖలో కూడా "తన తోడి పనివానిగా" మార్కును ప్రస్తావించాడు (ఫిలే 24). పౌలు రెండవసారి ఖైదు చేయబడినప్పుడు, క్రీ.శ. 61 వ సం.లో, తిమోతికి తాను వ్రాసిన లేఖలో, "త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుము. లూకా మాత్రమే నాతో ఉన్నాడు. మార్కును నీ వెంట బెట్టుకొని రమ్ము. అతడు పనిలో నాకు సాయపడగలడు" (2 తిమోతి 4;9, 11) అని మార్కు గురించి ప్రస్తావించాడు. బహుశా, పౌలు హతసాక్షి మరణాన్ని పొందినప్పుడు, మార్కు అక్కడే ఉండి యుండవచ్చు!
పేతురు సన్నిహితుడు - క్రైస్తవ సంప్రదాయం ప్రకారం, మార్కు, పేతురుతో కూడా సన్నిహిత సంబంధాన్ని కలిగి యున్నాడు. పేతురు ఆసియా మైనరు ప్రాంతాలలోని అనేక క్రైస్తవ సంఘాలకు వ్రాసిన లేఖలో, "నా కుమారుడు మార్కు" (1 పేతురు 5:13) అని పేర్కున్నాడు. అలెగ్జాండ్రియా క్లెమెంట్, ఇరేనియస్ మొదలగు వారు, మార్కు పేతురుకు వ్యాఖ్యాతగా, విశ్లేషకునిగా వ్యవహరించాడని చెబుతారు.
మార్కు సువార్త - లూకా సువార్తీకునివలె, మార్కుకూడా యేసు బోధనలను ఎప్పుడు ప్రత్యక్షముగా వినలేదు. మార్కు పేతురుకు వ్యాఖ్యాతగా, విశ్లేషకునిగా వ్యవహరించాడు గనుక, తన సువార్త పేతురు బోధనలపై ఆధారపడి ఉంటుంది. 'క్రీస్తు సువార్త'కు సంబంధించి అనేక విషయాలను సేకరించాడు. పేతురు-పౌలుల మరణానంతరం, రోమునగర విశ్వాసుల అభ్యర్ధన మేరకు, రోమీయులనుద్దేశించి [అన్య-క్రైస్తవులు], మార్కు బహుశా క్రీ.శ. 60-70 సం.ల మధ్యలో గ్రీకు భాషలో వ్రాసియున్నాడు. అయితే, సువార్తలో ఎక్కడకూడా తన పేరును ప్రస్తావించలేదు. నాలుగు సువార్తలలో ప్రధమముగా వ్రాయబడిన సువార్త. క్రీస్తు దేవుని కుమారుడని, పాపము మరియు మరణము నుండి మనలను రక్షించడానికి బాధలనుభవించి మరణించాడని తెలియజేయడానికి ఈ సువార్త వ్రాయబడినది.
సువార్త ముఖ్యాంశాలు - లూకా మరియు మత్తయి సువార్తలకు ప్రాధమిక మూలం మార్కు సువార్త. క్రీస్తు కాలం నాటి పాలస్తీనా పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ సువార్త దోహదపడుతుంది. "దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త" (మార్కు 1:1) అని ప్రారంభమవుతుంది. యేసు క్రీస్తు భూలోక సంబంధమైన తన ప్రేషిత కార్యము పట్ల నిస్సంకోచమైన నిబద్ధతను మార్కు సువార్తలో చూడవచ్చు. యేసును, "దేవుని కుమారుడు (1:1; 15:39), "మెస్సయ్య" (1:1; 8:29; 14:61; 15:32), "మనుష్యకుమారుడు" (2:10, 28; 8:31), "బోధకుడు" (9:5; 10:51; 14:45), "రాజు" (15:2, 9, 12, 18, 26, 32), "పెండ్లి కుమారుడు" (2:19), "ప్రవక్త" (6:4, 15; 8:28), "దావీదు కుమారుడు" (10:47-48), "రాబోయేవాడు" (11:19), "గొర్రెల కాపరి" (14:27), "దేవుని పవిత్రుడు" 1"24)గా మార్కు సువార్తలో చూస్తాము.
"ప్రభువు మార్గము" [తండ్రి దేవుని యొద్దకు] లేదా "దైవరాజ్యము"లో, 'హృదయ పరివర్తనము' మరియు 'విశ్వాసము' (1:15) అను ప్రాముఖ్యమైన అంశాలను యేసు బోధించారు. మార్కు సువార్తలో మరో ప్రధానాంశం యేసు-శిష్యుల సంబంధం. యేసు "హృదయపరివర్తనము చెంది సువార్తను విశ్వసించుటకు" పిలచును. గురువు అయిన క్రీస్తు తన సహవాసములోనికి, అనగా "తనతో నుండుటకు మరియు సువార్త ప్రకటనకు పంపుట కొరకు" శిష్యులను పిలచును. శ్రమలు, హింసలు శిష్యరికములో భాగము (మార్కు 8:34-35).
వేదసాక్షి - మార్కు అనేక సంవత్సరాలు ఈజిప్టు దేశములోని అలెగ్జాండ్రియా పట్టణములో నివసించాడు. బహుశా, అక్కడ సంఘమును స్థాపించి, ప్రధమ పీటాధిపతిగా బాధ్యతలను చేపట్టారు. సువార్త వ్యాప్తిలో మార్కు కీలకపాత్ర పోషించాడు. అక్కడే వేదహింసలు అనుభవించి క్రీ.శ. 68-74 వ సం.ల మధ్యలో వేదసాక్షి మరణాన్ని పొందారు. క్రీ.శ. 815 వ సం.లో మార్కు మృతావశేషం, ఇటలీ దేశములోని వెనిస్ నగరమునకు కొనిపోబడి, అక్కడ పునీత మార్కు దేవాలయములో భద్రపరచ బడినది. పునీత మార్కు వెనిస్ పట్టణ పాలక పునీతులు.
'మార్కు' అనగా 'మానవత్వముగల' అని అర్ధము. పునీత మార్కు యొక్క చిహ్నం, 'రెక్కలుగల సింహం'. ఈ చిహ్నం బప్తిస్త యోహాను గురించి ఇచ్చిన వివరణ నుండి ఉద్భవించినది (మార్కు 1:3). "ఎడారిలో ఎలుగెత్తు స్వరము" గర్జించే సింహముతో పోల్చబడినది. నాలుగు రెక్కల జీవుల గురించి యెహెజ్కేలు దర్శనమునుండి, నాలుగు రెక్కలు నలుగురు సువార్తీకులకు అన్వయించడం జరిగింది (యెహెజ్కె 1:6; 10 - సింహము, వృషభము, మనుష్యుడు, గరుడ). సింహము సార్వభౌమత్వమునకు సూచన.
రక్షణకు మూలమైన సువార్తను ప్రకటించుటలో మార్కు తన బాధ్యతను నెరవేర్చాడు. మార్కు సువార్తీకునివలె, సువార్తా ప్రచారం చేయు జ్ఞానమును దేవుడు మనకొసగును గాక!
No comments:
Post a Comment