Showing posts with label Saints and Blesseds. Show all posts
Showing posts with label Saints and Blesseds. Show all posts

పునీత జోజప్పగారి పండుగ (మార్చి 19)

పునీత జోజప్పగారి పండుగ (మార్చి 19)

2సమూ7:4-5, 12-14, 16; రోమీ 4:13, 16-18, 22; మత్త 1:16, 18-21, 24



కన్య మరియ సంరక్షక భర్త
బాల యేసుకు సాకుడు తండ్రి
విశ్వ శ్రీసభ పాలకపోషకుడు
కార్మిక వర్గ పాలక పునీతుడు
పునీత జోజప్పగారు!

ఉపోద్ఘాతము: ‘యోసేపు’ లేదా ‘జోజప్ప’ అనగా ‘కలుపుకొను’ లేదా ‘దేవుడు సమృద్ది చేయును’ అని అర్ధం. యోసేపు కన్యమరియమ్మకు జ్ఞానభర్త, యేసుకు సాకుడు తండ్రి. ఇంత గొప్ప వ్యక్తి పండుగను మార్చి 19న కొనియాడు చున్నాము. యోసేపు గురించి బైబులులో చాలా తక్కువగా వ్రాయబడటం వలన, మనం ఆయన గురించి చాలా తక్కువ శ్రద్ధను చూపుతూ ఉంటాము. ఆయనపట్ల భక్తిని పెంపొందించుట చాలా అరుదు! పవిత్ర కుటుంబములో మరచిపోబడినవారు! యోసేపు, మరియలను మనం ఎప్పుడు కూడా ఒక జంటగా గుర్తించాలి.

1962వ సం.లోనే 23వ జాన్ జగద్గురువులు, రోమీయ క్రమములో (ప్రస్తుత ప్రధమ కృతజ్ఞతార్చన ప్రార్ధన) యోసేపు నామమును చేర్చడం గమనార్హం! నేడు ఇతర కృతజ్ఞతార్చన ప్రార్ధనలలో కూడా పునీత జోజప్పగారిని స్మరించుకుంటున్నాము. యోసేపు మరియభర్త కనుక, యేసునకు తండ్రి!

బాలయేసు దేవాలయములో తప్పిపోయినప్పుడు, మరియ యేసుతో, “నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి” (లూకా 2:48) అని చెప్పినది. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుటకు” (లూకా 2:52) యోసేపు కృషి ఎనలేనిది!

యూదసంప్రదాయములో ఐదు సం.లు నిండిన పిల్లలు, తండ్రుల ప్రత్యేకమైన సంరక్షణలో ఉండేవారు. యోసేపు యూదమత విశ్వాసాన్ని, బోధనలను యేసుకు బోధించాడనడములో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు! యోసేపు తన కుటుంబాన్ని దేవుని మార్గములో నడిపించాడు. యేసుకు ప్రాయము వచ్చినప్పుడు, యోసేపే యేసును యూద ప్రార్ధనా మందిరమునకు (సినగోగు) పరిచయం చేసియుంటాడు. యోసేపు వండ్రంగి, కనుక వండ్రంగి పని నైపుణ్యాలను కూడా యేసునకు నేర్పియుంటాడు. “మీలో ఏ తండ్రియైన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా” (లూకా 11:11-12) అని చెప్పినప్పుడు యోసేపు ప్రేమ, ఆప్యాయతలు యేసు మదిలో మెదిలి ఉంటాయి! “తప్పిపోయిన కుమారుడు” (లూకా 15) ఉపమానం చెప్పినప్పుడు, యోసేపు తండ్రి ప్రేమను యేసు గుర్తుకు చేసుకొని యుంటారు!

పండగ ఆవిర్భావం-యోసేపుపట్ల గౌరవం: యోసేపునకు సంబంధించిన పండుగ ఐదవ శతాబ్దములో ‘కోప్టిక్ దైవార్చన కాలెండరు’లో మొదటిసారిగా ప్రస్తావించ బడినది. 8 వందల సంవత్సరములలో మొదటిసారిగా ఫ్రెంచ్ కాలెండరులో కనిపిస్తుంది. అనేక శతాబ్దాలుగా యోసేపునకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. 16వ శతాబ్ధములోనే అతని ఆరాధనకు అధికారిక ప్రోత్సాహం ఇవ్వబడినది. ఆధునిక కాలములో అత్యంత ప్రజాదరణ పొందిన పునీతులలో యోసేపు ఒకరు.

మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవమును 9వ భక్తినాధ జగద్గురువులు 1847లో ప్రారంభించారు. క్రీ.శ. 1869-70లో జరిగిన ప్రధమ వాటికన్ మహాసభలో, 9వ భక్తినాధ జగద్గురువులు పునీత యోసేపుగారిని “విశ్వశ్రీసభ పాలక పోషకుడు”గా ప్రకటించారు. అలాగే, శ్రీసభ “ఆస్తిపాస్తులకు సంరక్షకులు”గా ప్రకటించారు. క్రీ.శ. 1955లో 12వ భక్తినాధ జగద్గురువులు యోసేపుగారిని “కార్మికుల పాలకుడు”గా గౌరవించారు. మంచి మరణాన్ని కోరుకునే వారందరూ పునీత యోసేపుగారిని ప్రత్యేకంగా ప్రార్ధిస్తారు. 1989వ సంవత్సరములో రెండవ జాన్ పౌలు జగద్గురువు యోసేపు “రక్షకుని సంరక్షుకుడు” అని గౌరవించారు.

“యోసేపుద్వారా మరియ వద్దకు, మరియద్వారా, పవిత్రతకు ఊటయైన యేసు వద్దకు మనం నడిపించ బడుచున్నాము” అని 15వ బెనెడిక్ట్ జగద్గురువులు యోసేపు పట్ల భక్తిని వెల్లడించారు.

“కొంతమంది పునీతులు వాళ్ళ ప్రత్యేక కార్యసాధకతతో కొన్ని అవసరాల్లో మాత్రమే వారి సహకారాన్ని మనకందిస్తారు. కాని, మన పవిత్ర పాలకులైన యోసేపు ప్రతీ అవసరంలోను, ప్రతీ పనిలోను, ప్రతీ సందర్భములోను మనకు సహాయం చేసే శక్తి కలిగియున్నారు” అని పునీత థామస్‌ అక్వినాస్‌ కొనియాడారు.

“పునీత యోసేపుగారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండా లేను. దీనిని నమ్మనివారు పరీక్షించుకోవచ్చును. ఆ పరమపితా పితృని గౌరవించుట ఎంతో మేలని తెలుసుకొందురు” అని పునీత తెరేసమ్మ వెల్లడి చేసారు.

యోసేపు జ్ఞానభర్త, సాకుడు తండ్రి: యోసేపు బెత్లేహేములో జన్మించారు. యోసేపుకు చాలా పెద్దవయస్సు ఉన్నప్పుడు కన్యమరియతో ప్రధానం జరిగిందని తెలుస్తుంది. అప్పటికి మరియ వయస్సు 14 సంవత్సరములు ఉండవచ్చు. గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మరియమ్మగారికి అందించక మునుపే ఈ నిశ్చితార్ధం జరిగింది.

“దేవుడు యోసేపును కన్య మరియకు జీవిత భాగస్వామిగా ఒసగాడు. మరియకు తోడుగా, ఆమె కన్యత్వమునకు సాక్షిగా, ఆమె గౌరవానికి సంరక్షకునిగా నిలిచాడు” అని 13వ సింహరాయ జగద్గురువులు పేర్కొన్నారు.

యేసుక్రీస్తు సువార్త ప్రచారం ఆరంభించక మునుపే, నజరేతు గ్రామంలో క్రీ.శ. 20లో యేసు, మరియ హస్తాలలో తమ వయోభారంతో పరిశుద్దమైన సహజ మరణం పొందారు.

యోసేపు బాధ్యతగల జ్ఞానభర్తగా, మంచి సాకుడు తండ్రిగా అత్యుత్తమ బాధ్యతాయుతముగా, లోకరక్షకునికే సంరక్షకుడుగా యున్నారని సువార్తలద్వారా గ్రహించ గలుగుతున్నాము. మత్త 1:17 ప్రకారం, యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహామునుండి దావీదు వంశము వరకు యోసేపు ముందు తరాల పేర్లు ఇవ్వబడినవి. అయితే యోసేపు మరియతో వివాహానికి నిశ్చితార్ధం జరిగాక, వారు సంసార పక్షంగా కాపురం చేయకముందే మరియమ్మ గర్భవతి కావడం యోసేపును ఎంతగానో కలచి వేసింది. మరియమ్మను నొప్పింపక, అవమానింపక, రహస్యంగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్లు మత్త 1:19లో చెప్పబడినది. ఇక్కడ యోసేపు గంభీర వ్యక్తిత్వం, ఘర్షణ ధోరణిలేని సాధుత్వం, పుట్టుకతో వచ్చిన సహజమైన పాపభీతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పిమ్మట ప్రభువు దూత మాటప్రకారం, మారుమాటలాడక మరియను చేర్చుకున్నారు. ఇక్కడే వారు తమ బాధ్యత, విధేయత, పరిశుద్దతకు పూర్తిగా లోబడి దైవాజ్ఞలను తు.చ. తప్పక పాటించారు. ఇదే వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత.

మనుష్యావతారమెత్తిన యేసుక్రీస్తుకు, మరియమాతకు సంరక్షకుడుగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా యోసేపు గురించి సువార్తలు వెల్లడిస్తున్నాయి. కాని, యోసేపు మాత్రం సువార్తల్లో ఎక్కడా ఒకమాటైనా మాట్లాడినట్లు లేదు. వారి ప్రవర్తన, చేసే పనిని నిర్వర్తించడంబట్టి దైవాదేశానుసారముగా జీవించాడని ఖచ్చితముగా చెప్పవచ్చు. గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శ్రమైక జీవితం, బాధ్యతా పాలన, వివేకం, వివేచనం, మితవ్యయం, మితభాషిత్వం, తననుతాను తగ్గించుకొనడం, దయ, దానధర్మగుణం, ఆపదలోనున్న వారిని ఆదుకోవడం, నిగర్వం, నిశ్చలత, నిరాడంబరత్వం ఇలా మంచి గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహా మనిషి పునీత జోజప్పగారు!

యోసేపు సుగుణాలు

నీతిమంతుడు: సువార్తలలో జోజప్పగారు న్యాయవర్తనుడు, నీతిమంతుడు అని అర్ధమగుచున్నది.
పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, శ్రీసభకు రాసిన లేఖలో (రెడెంప్తోరిస్ కుస్తోస్ 1989), పునీత యోసేపుగూర్చి, “లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు అంటే అతడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, సాధుశీలుడు, వినమ్ర హృదయుడు. నిర్మలత్వం, నిష్కపటత్వము మొదలైన సుగుణాలతో కూడిన వ్యక్తిత్వం కలవారు” అని ప్రశంసించారు.

వాస్తవానికి జోజప్పగారు నీతిమంతుడు, ప్రార్ధనాపరుడు, విశ్వాసములో జీవించేవాడు. మత్త 1:19లో, యోసేపు “నీతిమంతుడు”

అని చదువు చున్నాము. యోసేపు “నీతిమంతుడు” అని పిలవటం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి.

యూదుల సంప్రదాయాలలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని, కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థాన్ని కొనియాడేవారు. ఈ నిశ్చితార్థం పూర్తయిన కొన్ని నెలల తర్వాత వివాహాన్ని ఆచరించేవారు. లూకా 1:7 ప్రకారం, యోసేపునకు మరియతల్లి ప్రధానము చేయబడింది. ఇక వీరిరువురుకూడా కొన్ని రోజులలో పరిశుద్ధ వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, పవిత్రాత్మ ప్రభావం వలన మరియతల్లి గర్భం దాల్చారు. ఇది దైవ ప్రణాళిక! మోషే ధర్మశాస్త్రం ప్రకారం, వివాహం కాకముందు స్త్రీ గర్భం ధరిస్తే అది పాపం. శిక్షలుకూడా చాలా కఠినంగా ఉంటాయి. ద్వితీ. 22:20-21 ప్రకారం, అలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని చెబుతుంది.

యోసేపు స్థానంలో మరొక మానవమాత్రుడు ఉన్నట్లయితే, ఖచ్చితంగా మరియతల్లిని తీసుకొని వెళ్లి న్యాయంకోసం పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల చేతికి అప్పగించేవాడు. కాని యోసేపు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా అవమానింప ఇష్టంలేక మరియతల్లిని మౌనంగా, రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు (మత్త 1:19). ఎందుకన, ఆయన నీతిమంతుడు. దేవదూత స్వప్నంలో కనిపించి ఇది దైవకార్యం, మరియను విడిచి పెట్టవద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు, దేవుని ప్రణాళికను అర్థంచేసుకొని యోసేపు మరియతల్లికి అన్ని వేళలా తోడుగా ఉన్నారు.

నేడు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే భార్య/భర్తమీద లేనిపోని అనుమాన పడేవారు, చిన్నచిన్న మనస్పర్ధలకు విడాకులు తీసుకొని కుటుంబాలను చేజేతులారా నాశనం చేసుకునేవారు కోకొల్లలు! అట్టివారు ఓసారి యోసేపుగారిని స్మరించుకుంటే మంచిది. యోసేపు, మరియతల్లి వీరిరువురుకూడా కాపురం చేయకముందే మరియతల్లి గర్భం దాల్చారు. ఆ క్షణంలో మరియమ్మను యోసేపుగారు బహిరంగంగా జనంమధ్య అవమానించ లేదు, దానికి బదులుగా, మౌనంగా రహస్యముగా విడిచి పెట్టాలను కున్నారు. కాని దూతద్వారా ఇది దైవకార్యం, పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యం అని తెలుసుకొని మరియతల్లికి అండగా ఉన్నారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో యోసేపుగారి మంచి మనసును బట్టి దేవుడు ఆయనను నీతిమంతునిగా సత్కరించారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. నీతిమంతుడు అనగా, నీతిగా, న్యాయముగా జీవించేవాడు, సత్ప్రవర్తన కలిగి యుండేవాడు, ధర్మాత్ముడు అని అర్ధం. కనుక ఇదొక గొప్ప సుగుణం.

దైవభక్తిపరుడు: దైవభక్తిగల వారిలో ఐదు సుగుణాలు ఖచ్చితముగా ఉంటాయి:

1. దేవున్ని నమ్ముతారు: అనగా అందరికన్నా, అన్నింటికన్నా దేవునికి ప్రధాన స్థానం ఇవ్వడం. దేవునిపై ఆధారపడి జీవించడం. దేవునికన్న, ఇతర విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. దైవభక్తిగల తండ్రి తన కుమారున్ని దేవుని వైపుకు నడిపిస్తాడు. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుచు, దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుట” (లూకా 2:52) యోసేపుగారు చూసారు. కష్టతరమైనవి ఎన్నో యోసేపుగారు చేయగలిగారు, ఎందుకన, ఆయన దేవున్ని నమ్మాడు, విధేయించాడు. దేవునిపై నమ్మకముంచడం అనగా, మన భయాలలో, బలహీనతలలోకూడా ముందుకు వెళ్ళగలము అని విశ్వసించడం.

2. దేవుని వాక్యాన్ని ఎరిగినవారై ఉంటారు: దేవునియొక్క వాక్యమును హృదయమున నిలుపు కొంటాడు (కీర్త 119:11). దైవభక్తిగల భర్త, తండ్రికి దేవునివాక్యం తప్పక తెలిసి యుంటుంది. యోసేపు దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా ఎరిగినవారు.

3. ఎల్లప్పుడూ ప్రార్ధన చేస్తారు: మత్తయి 6:5-15లో, యేసు తన శిష్యులకు ప్రార్ధన చేయడం నేర్పించాడు. దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్ధన చేస్తాడు. యోసేపుగారు దేవుని చిత్తాన్ని అక్షరాల పాటించాడు.

4. బంధాలను నిర్మిస్తారు: ఆపదలలో, కష్టసమయాలలో, కుటుంబాలను నిలబెడతాడు. పునీత జోజప్పగారు అక్షరాల అలాగే చేసారు. తిరుకుటుంబాన్ని నిలబెట్టారు, నిర్మించారు.

5. ఇతరులకు సేవ చేస్తారు: హృదయపూర్వకముగా సేవ చేయుటం. యోసేపు గొప్పతనం ఏమిటంటే, ఆయన మరియతల్లి భర్తగా, యేసుకు తండ్రిగా, రక్షణ ప్రణాళికలో తన సేవను హృదయపూర్వకముగా, సంపూర్ణముగా అందించాడు. ఆయన సేవ త్యాగపూరితమైనది. తిరుకుటుంబానికి తన జీవిత సర్వాన్ని త్యాగం చేసాడు. తన ప్రేమను తన సేవలో పరిపూర్ణం గావించాడు. విశ్వాసముద్వారా నీతిమంతుడు జీవిస్తాడు (రోమీ 1:17).

కష్టజీవి: మత్త 1:1-16 ప్రకారం, యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలుసు. యోసేపు ఈ పేరుప్రఖ్యాతులను ఉపయోగించి ఏవైనా చేయవచ్చు. కాని ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తినే కుటుంబ పోషణకై ఎంచుకున్నాడు. ఈ వడ్రంగి వృత్తిలోనే మంచి ప్రావీణ్యతను, గుర్తింపును సంపాదించు కున్నాడు (మత్త 13:55). ‘పని చేయడం’ అనేది రక్షణ ప్రణాళికలో భాగస్తులగుటకు ఓ చక్కటి మార్గం. మనకున్న వరాలద్వారా సమాజములో ఇతరుల సేవనిమిత్తమై ఉపయోగించే బాగ్యం లభిస్తుంది. పనిచేయడం దేవుని ప్రణాళికలో భాగం. ఏ పనైనను మానవ గౌరవార్ధమై యుండాలి.

ప్రతి భర్త! ప్రతి తండ్రి! కూడా పునీత జోజిప్ప గారి వలె, కుటుంబ బాధ్యతలను స్వీకరించగలగాలి. కష్టపడి పని చేయగలగాలి. కుటుంబం అంటే బాధ్యత కలిగి ప్రవర్తించడం అని, వీరి నుండి గ్రహించాలి. కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండడం వీరినుండే నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞను, దేవుడు ఏర్పరిచిన బాధ్యతను, ఎటువంటి అవాంతరాలు వచ్చినా, కుటుంబమును విడిచిపెట్టకుండా, నెరవేర్చాలి. క్రీస్తు ప్రభుని సాకుడు తండ్రియైన జోజప్పగారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవునిచే ఎన్నుకోబడిన మంచి వ్యక్తి. ప్రతి పురుషుడు వీరి వలె, కుటుంబ బాధ్యతలు స్వీకరించి దేవుని అనుసరణలో జీవించడానికి, పిల్లలను క్రమశిక్షణతో, బాధ్యతతో పెంచడానికి, దేవుని అనుసరణలో జీవింపచేయడానికి కష్టపడాలి.

సంరక్షకుడు / ప్రేమగల తండ్రి: తన స్వప్నంలో దేవదూతద్వారా దేవుని ఆదేశాలను స్వీకరించి, హేరోదు రాజుయొక్క దుష్టతలంపులనుండి బాలయేసును కాపాడారు. ఒక గాడిద సహాయముతో తాను నడుస్తూ మరియతల్లిని, బాలయేసును సురక్షిత ప్రాంతానికి చేర్చి శత్రువుల బారినుండి తల్లిని, బిడ్డని కాపాడారు (మత్త 2:13-15). అదేవిధముగా, బాలయేసు 12 ఏళ్ళ ప్రాయంలో యెరుషలేములో తప్పిపోయినప్పుడు తల్లడిల్లిపోయి, మూడు రోజులపాటు నిద్రాహారాలు మానేసి వెతికి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా క్రీస్తుకు తోడుగా ఉన్నారు. యోసేపు నిజమైన తండ్రి, నిజమైన సంరక్షకుడు. మరియతల్లి, యేసు కొరకు ఆయన సర్వం ప్రేమతో, ఆప్యాయముతో చేసాడు. అలాగే బాలయేసుకు సర్వం చేసారు. ప్రతీ క్షణం వెన్నంటి ఉన్నారు.

ప్రార్థనాపరుడు: యోసేపు మంచి ప్రార్థనాపరుడు. మోషే ధర్మశాస్త్రాన్ని, పది ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించాడు. దేవుని ఆదేశానుసారం ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి దేవదూత ముందుగా సూచించినట్లు ఆ బిడ్డకు ‘యేసు’ అని పేరు పెట్టారు (లూకా 2:21). మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించి, పాటించి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడియున్నట్లు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారు (లూకా 2:22-24). సాధారణంగా కలలను ఎవరూ పట్టించుకోరు. కాని యోసేపు మాత్రం తన స్వప్నంలో దేవునిద్వారా దూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని త్రికరణశుద్ధిగా ఆలకించి, పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు (మత్త 1:19-24; 2:13-15; 2:19-23). యోసేపు నోరుతెరిచి మాట్లాడిన ఒక్క సందర్భంకూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఆయన దేవునిపట్ల ప్రేమను, తన విశ్వాసాన్ని మాటల్లోగాక, తన చేతల్లో నిరూపించారు.

మంచి మరణం: పునీత యోసేపు దేవుని పిలుపును అందుకున్నాడు. మరియతల్లికి భర్తగా, దైవకుమారునికి తండ్రిగా పిలుపును అందుకున్నాడు. తన పిలుపును సంపూర్ణ విశ్వసనీయతతో పరిపూర్తి చేసాడు. ఆతరువాత దేవుడు యోసేపును తన సన్నిధిలోనికి పిలచుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, క్రీస్తు, మరియతల్లి సన్నిధిలో, ఒడిలో భాగ్యమైన మరణాన్ని పొందారు. తిరుసభ పాలకుడిగా, మంచి మరణాన్ని ప్రసాదించు పునీతుడిగా వినతికెక్కారు.

ముగింపు: యేసు, మరియ, యోసేపులు తిరుకుటుంబము! లోకరక్షణార్ధమై దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసారు. రక్షణ చరిత్రలో వారు ఒకటిగా నిలిచారు. ముగ్గురుకూడా విడదీయలేనటువంటి వారు. దేవుని ప్రణాళికలో, వారి వ్యక్తిగత గుర్తింపులు ఒకరితోనొకరికి సంబంధాన్ని కలిగియున్నాయి. కనుక, వారి ముగ్గురిని విడివిడిగా చూడక, ఎప్పుడు ఒకటిగానే చూడాలి, ఒకటిగానే అర్ధంచేసుకోవాలి! యోసేపును ఎప్పటికీ మరువరాదు! ఆయన మరియ యేసులకు ఏమిచేసాడో, మనకూ, విశ్వశ్రీసభకూ చేయగలడు!

యోసేపు దేవుని చిత్తానికి పరిపూర్ణముగా తలొగ్గాడు. దైవపిలుపుకు, బాధ్యతకు, త్యాగానికి ప్రతిస్పదించి, దైవప్రణాళికకు సహకరించాడు. తన జీవిత సర్వాన్ని దేవుని చేతులో అప్పజెప్పాడు. అతను ఎందుకు మౌనముగా ఉన్నాడంటే, దేవుని మాటను ఎక్కువగా ఆలకించాడు గనుక! ఎప్పడూ వాదించలేదు; వెనకడుగు వేయలేదు; అభ్యంతరం చెప్పలేదు; వివరణలు అడగలేదు; దేవుని ఆజ్ఞలను ఎప్పుడూ ప్రశ్నించలేదు, దేనిని నిలువరించలేదు. దేవుని ప్రణాళికను మౌనముగా, శాంతియుతముగా నేరవేర్చడములోనే గర్వపడ్డాడు. మౌనములోనే, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

యోసేపు మౌనజీవిత సందేశం – ఇష్టపూర్వక విధేయత, సేవ! సంకల్పం, సేవయే యోసేపు జీవిత రహస్యం. ఇదే మనకు ఆయన జీవిత సందేశం!

పునీత జోజప్ప గారి ప్రార్థనా సహాయమును, తప్పనిసరిగా మన అందరికీ దయచేయమని, ఈ పండుగ రోజున మనమందరమూ వారికి ప్రార్థించుకుందాం. వారి ఆశీస్సులను పొందుకుందాం. వారిలో ఉన్న, నీతిని మనమూ అలవరచుకొని, దేవుని ఆదేశమును అనుసరించే విధముగా మనమూ ఆ విధముగా దేవుని బోధన ఆలకించి జీవించుదాం.

అందరికీ, మరియ భర్తయగు పునీత జోజప్పగారి పండుగ శుభాకాంక్షలు!

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్

 పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)


ఉపోద్ఘాతం:
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ 12వ శతాబ్దంలో జీవించిన గొప్పపునీతుడుమహనీయుడు. ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి యుండరు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహ, సేవా భావముతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో 

, అప్పుడే దేవున్ని పరిపూర్ణముగా ప్రేమించగలనని గ్రహించాడు. ప్రేమ, కరుణ స్వరూపియైన దేవుని మంచితనమును ఫ్రాన్సిస్‌ అలవర్చుకున్నాడు. పవిత్రాత్మచేత ప్రేరేపింప బడ్డాడు. తన ధాతృత్వ సుగుణాన్ని, జీవితాంతం ఆచరణలో పెట్టిన గొప్పవ్యక్తి. “ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇప్పటికైనా మొదలు పెడదాం” అని తన మరణావస్థలో తన సహోదరులతో పలికిన గొప్పపునీతుడు ఫ్రాన్సిస్‌. దేవుని సృష్టిపట్ల, ముఖ్యంగా మూగజీవులపట్ల ప్రత్యేకమైన ఆకర్షణని, ప్రేమని, సోదరభావాన్ని వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.

కుటుంబ నేపధ్యం: ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ. 1182వ సం.లో జన్మించాడు. జ్ఞానస్నానం పేరు యోహాను. తరువాత ఫ్రాన్సిసుగా పిలువబడ్డాడు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌తల్లి పీకా. తండ్రి పెద్ద ధనవంతుడైన బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్‌ చలాకీగా, కలుపుగోలు తనముతో వ్యాపారంలో తండ్రికి సహాయం తోడుగా ఉండేవాడు. కాని, ఫ్రాన్సిస్‌, తోటియువతతో కలిసి విందువినోదాలకు అధికంగా డబ్బు ఖర్చుచేసేవాడు, దుబారా చేసేవాడు. ఒకవైపు తండ్రి తన వ్యాపారంలో ఫ్రాన్సిసు గొప్పవారసుడు కావాలని కలలు కనేవాడు.

కాని, మరోవైపు ఫ్రాన్సిసు యుక్తవయస్సులోనే గొప్పయోధుడు కావాలని కలలు కనేవాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు. 1202వ సం.లో పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే అస్సీసి ఓడిపోవడముతో ఖైదీగా పట్టుబడ్డాడు. తన కల చెదరిపోయింది. చెరసాలలోకూడా అందరితో కలవిడిగా తిరుగాడుచూ చతురోక్తులతో నవ్వించేవాడు. ఒక సంవత్సరం తరువాత, చెరసాలనుండి విడుదలయ్యాడు. కాని, కొద్దిరోజులకే తీవ్రజబ్బు బారిన పడ్డాడు. ఈ సమయంలోనే తనలో ఎంతో మార్పు కలిగింది. తన జీవితములోనికి తొంగి చూడటం ప్రారంభించాడు.

దైవపిలుపు: అయినను, మరల 1205వ సం.లో, పోపు సైన్యముతో కలిసి యుద్ధము చేయుటకు బయలుదేరాడు. ఆపూలియా వెళ్ళుత్రోవలో, “ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగోరుచున్నావు? యజమానుడినా లేదా సేవకుడినా? అని ఒక స్వరాన్ని విన్నాడు. ‘యజమానుడిని’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం చెప్పాడు. మళ్ళీ ఆ స్వరం, “కాని, నీవు యాజమానుడినిగాక, సేవకుడిని సేవిస్తున్నావు” అని పలికింది. అప్పుడు ఫ్రాన్సిస్‌, “అయితే, నన్నేమి చేయమంటారు?” అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్వరం, “నీవు తిరిగి అస్సీసి నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని చెప్పింది.

ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్తధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానంచేసాడు. ఆస్తినంతా త్యజించి, స్వచ్చంధ పేదరికంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. దైవపిలుపును అర్ధంచేసుకోవడం మొదలుపెట్టాడు. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి, ప్రార్ధన చేయడం ప్రారంభించాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

          ఈ అన్వేషణలో ఉండగానే, ఫ్రాన్సిసువారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన మరో అద్భుతమైన, మరపురాని సంఘటన జరిగింది. ఒకరోజు ఫ్రాన్సిస్ తన గుర్రముపై వెళ్ళుచుండగా, ఒక కుష్ఠురోగి ఎదురు పడ్డాడు. యుద్ధానికి వెళ్ళకముందు ఫ్రాన్సిస్ కుష్ఠురోగులను చూసి అసహ్యించుకునేవాడు. వారినుండి దూరముగా తప్పించుకునేవాడు. కాని ఈసారి, ఫ్రాన్సిస్ కుష్ఠురోగి దగ్గరకు వెళ్లి కౌగలించుకొని ముద్దుపెట్టు కున్నాడు. కుష్ఠురోగిని ముద్దాడి, అతనికి సహాయం చేసిన తరువాత, గుర్రముపై తిరిగి వెళ్ళేటప్పుడు, వెనుదిరగగా, అక్కడ ఆ కుష్ఠురోగి కనిపించలేదు. చుట్టూచూడగా అతని జాడ ఎక్కడా కనిపించలేదు. ఆ సమయములో తనను సందర్శించినది స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే అని ఫ్రాన్సిస్ గ్రహించాడు. ఈ సంఘటన తన జీవితములో మరువలేని తీయనైన అనుభూతిగా ఫ్రాన్సిస్ వర్ణించాడు. లోకబంధకములనుండి తనను విముక్తిగావించిన అద్భుతమైన సంఘటనగా వర్ణించాడు.

అయితే, ఖచ్చితమైన దైవపిలుపును 14 మే 1208 సం.లో, పునీత మత్తయిగారి పండుగ రోజున అర్ధంచేసుకున్నాడు. ఆనాటి సువార్తా, “క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం” ఫ్రాన్సిస్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టుటకు బయలు దేరాడు.

రోమునగరములోని పునీత పేతురుగారి సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠురోగులకు సేవలు చేయాలని తీర్మానించుకున్నాడు. ఈవిధముగా, తన జీవితాన్ని, సేవకు (సంఘంనుండి వెలివేయబడినవారికి, పేదవారికి, కుష్ఠురోగులకు) అంకితం చేసుకున్నాడు. అస్సీసి పట్టణ ఆవల జీవిస్తూ ప్రార్ధించాడు, బోధించాడు, రోగులకు సేవచేసాడు. కుష్ఠురోగుల సేవద్వారా తనలో ఆధ్యాత్మిక చింతన పెరిగింది, తన మిషన్‌, తన ప్రేషితసేవను, దేవునిచిత్తాన్ని తెలుసుకోగలిగాడు. కుష్టురోగులను ఆలింగనం చేసుకోవడంద్వారా, సర్వమానవాళిని గౌరవించాలి, రక్షించాలి అని తెలుసుకున్నాడు. సకలసృష్టితో సహోదరభావమును పెంపొందించు కోవడంకూడా నెమ్మదిగా తెలుసుకోగలిగాడు.

అలాగే, సువార్తను జీవించడం మరియు దానిని ప్రకటించడం, బోధించడం ప్రారంభించాడు. దేవునియొక్క ప్రేమను, కరుణను ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాడు. సాన్ దమియానో దేవాలయములో సిలువలోని యేసుప్రతిమ ముందు ప్రార్ధించు చుండగా, యేసు కళ్ళు తెరచి, ఫ్రాన్సిసుతో, “వెళ్లి నా దేవాలయాన్ని పునర్నిర్మించు” అని చెప్పడం తన ప్రేషితకార్యానికి మూలమైనది. ఆరంభములో పాడుబడిన దేవాలయాలను పునర్నిర్మించిన ఫ్రాన్సిస్ అతిత్వరలోనే శ్రీసభ పునరుద్ధరణకు దోహద పడ్డాడు. 

ఫ్రాన్సిసు సభ: త్వరలోనే అస్సీసిలో అనేకమంది మన్ననలను పొందాడు. తన పేద, ఆధ్యాత్మిక జీవితాన్నిచూసి ఎంతోమంది ఆయనను అనుసరించారు. ఈవిధంగా, చిన్నసహోదరబృందం ఏర్పడింది. ఫ్రాన్సిస్‌ తన స్వచ్చంధ పేదరికం, సహోదరభావం, సంఫీుభావంద్వారా, లోకాన్నే మార్చివేసాడు.

తన జీవితాన్నిచూసి కొందమంది ఆయన సహోదరులుగాఅనుచరులుగా చేరారు. 1209వ సం.లో, మూడవ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మల రక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకుభిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతిని ఇచ్చారు. 1219 నాటికి ఫ్రాన్సిస్‌ అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిసువారు స్థాపించిన మఠవాస సభ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఫ్రాన్సిస్‌వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతోమంది తమ జీవితాలను అంకితం చేసుకొని, ఫ్రాన్సిసువారి బాటలో నడుస్తూ, సేవామార్గంలో జీవిస్తూ, స్వచ్చంధ పేదరికాన్ని జీవిస్తూ, ప్రపంచమంతటా వారు తమ సేవలను అందిస్తున్నారు. ఫ్రాన్సిస్‌ అనుచరుడనగా ‘స్వచ్చంధ పేదరికం’లో జీవించడం అనగా, సోదరునిగా జీవించడం, మానవగౌరవాన్ని పెంపొందిచడం.

దైవచిత్తాన్వేషి: ఈనాటి మానవుడు ‘కోరికలు’ అనే వలయంలో చిక్కుకున్నాడు. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహపడి పోతున్నాడు. సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక పోతున్నాడు. దేవునివాక్యం, దేవునికార్యంపై ధ్యానంచేసిఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మానవునికి సమయం, ఆసక్తి లేకుండా పోయింది. దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలోనున్న ఆనందాన్ని, సంతోషాన్ని నేటి మానవుడు గ్రహించలేక పోతున్నాడు.

ఫ్రాన్సిస్‌ దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్తవయస్సులో, చిలిపిగా యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికిని, మార్పు, మారుమనస్సు అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి దేవుని వాక్యంపై, దేవుని ప్రేమపై ధ్యానించడం, ప్రార్ధించడం ప్రారంభించాడు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు క్రీస్తుప్రతిమ ఫ్రాన్సిస్‌ హృదిని, మదిని తొలచింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే! ఈవిధముగా, తన జీవితములో జరిగిన ప్రతీ సంఘటననుండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

ప్రకృతి ప్రేమికుడు: ఫ్రాన్సిస్‌ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవాడు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమనుగౌరవాన్ని పెంచుకున్నాడు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. సమస్తమును తన సహోదరీసహోదరులుగా పిలిచాడు. సూర్యుడు ఆయన సోదరుడు, చంద్రుడు ఆయన సోదరి. ఆకాశములోని పక్షులకు, నీటిలోని చేపలకు ప్రవచనాలను బోధించాడు. భయంకరమైన తోడేలుకు ఉపదేశం చేసి దానిని సాధుజంతువుగా మార్చాడు. ప్రకృతిపట్ల, ఫ్రాన్సిసువారికున్న ప్రేమవలన, ఈ తరమువారుకూడా ప్రకృతిపట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు ప్రేరేపింపబడాలని ఆశిద్దాం.

శాంతిదాత: ఫ్రాన్సిసువారు తన జీవితముద్వారా ఈ లోకాన్నే మార్చేసారు. క్రూసేడుల కాలములో, శాంతిని నెలకొల్పుటకు మధ్యవర్తిగా ఫ్రాన్సిస్ ధైర్యముగా ఈజిప్టుకు వెళ్లి అక్కడి సుల్తానును కలిసాడు. యుద్ధాన్ని ఆపాలని కోరాడు. ఈ సంఘటన సకల మానవాళిపట్ల ఫ్రాన్సిసువారికున్న ప్రేమ, కరుణను తెలియజేస్తుంది. ఫ్రాన్సిస్ వారు ప్రపంచ శాంతిదూత అని చెప్పడానికి ఆయన చేసే శాంతి ప్రార్ధనయే గొప్పనిదర్శనం.

ప్రభువా! నీ శాంతి సాధనముగా నన్ను మలచుకొనుమయా!
ద్వేషమున్నచోట, ప్రేమను వెదజల్లనీయుము
గాయమున్నచోట క్షమాపణను చూపనీయుము
అవిశ్వాసమున్నచోట విశ్వాసమును నింపనీయుము
నిరాశయున్నచోట ఆశను పెంచనీయుము
అంధ:కారమున్నచోట జ్యోతిని వెలిగింప నీయుము
విచారము నిండినచోట సంతోషమును పంచనీయుము
ఓ దివ్యనాధా!
పరుల ఓదార్పును వెదకుట కంటె, పరులను ఓదార్చు వరము నీయుము
పరులు నన్ను అర్ధము చేసుకొన గోరుట కంటె, పరులను అర్ధముచేసుకొను గుణము నీయుము
పరులు నన్ను ప్రేమించాలని కోరుట కంటె, పరులను ప్రేమింప శక్తినీయుము
ఎందుకన,
యిచ్చుట ద్వారా పొందగలము
క్షమించుట ద్వారా క్షమింప బడగలము
మరణించుట ద్వారా నిత్యజీవము పొందగలము

క్రిస్మస్: పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ దివ్యబాలయేసుపట్ల ప్రత్యేకమైన భక్తిని కలిగియున్నాడు. 1223వ సం.లో క్రిస్మస్‌ జాగరణ సందర్భంగా పశువుల పాకను ఏర్పాటు చేసి క్రీస్తుజనన సన్నివేశాన్ని సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిసుగారు. అస్సీసి పట్టణమునకు దగ్గరిలోనున్న గ్రేచియా అనే గుహలో క్రీస్తుజన్మను ఒక ప్రత్యేక అనుకరణములో ఫ్రాన్సిస్‌ పున:సృష్టించాడు. ఈసందర్భంగా అచ్చట దివ్యపూజాబలిలో పాల్గొనాలని, తాను స్వయంగా ఏర్పరచిన పశువులపాకలోని క్రీస్తుజనన సన్నివేశాన్ని దర్శించాలని అచ్చటి పట్టణ ప్రజలను ఆహ్వానించియున్నాడు.

సిలువపట్ల ఆరాధన: ఫ్రాన్సిసువారు యేసు పవిత్ర సిలువను ఎంతగానో ఆరాధించేవారు, గౌరవించేవారు. ఎక్కడ దేవాలయము కనబడిన, వెంటనే మొకాళ్ళూని సిలువను ఆరాధించేవారు. ఆయన ఈవిధముగా ప్రార్ధించేవారు, “ఓ యేసుక్రీస్తువా, ఇక్కడ ఈ దేవాలయమునందును, ప్రపంచములోని ప్రతీ దేవాలయమునందును, ప్రతీ దివ్యమందసమునందునుగల మిమ్ము మేము ఆరాధించుచున్నాము. మిమ్ము స్తుతించుచున్నాము. ఎందుకన, మీ పవిత్ర సిలువద్వారా మీరు ఈ లోకమును రక్షించితిరి.” అందుకేనేమో, యేసు పవిత్ర సిలువ మహోత్సవమునాడే, 14 సెప్టెంబర్‌ 1224వ సం.లో, అల్వెర్నా అనే కొండప్రాంతములో ప్రార్ధన చేయుచుండగా క్రీస్తు పంచగాయాలను తన శరీరముపై పొందాడు.

ముగింపు: సువార్తను అక్షరాల జీవించి, క్రీస్తువలె, క్రీస్తునుపోలి జీవించడానికి ప్రయత్నం చేసిన గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్. అందుకే చరిత్రకారులు ఫ్రాన్సిసువారిని ‘మరోక్రీస్తు’ అని పిలిచారు. సంపూర్ణముగా దేవునిపై ఆధారపడి జీవించాడు. అస్సీసిపుర ఫ్రాన్సిసుగారు, 3 అక్టోబర్‌ 1226వ సం.లో స్వర్గస్తులైనారు. మరణించిన రెండేళ్లకే, అనగా 1228వ సం.లో తొమ్మిదవ గ్రెగోరి పోపుగారు, ఫ్రాన్సిసువారిని పునీతునిగా ప్రకటించారు. పునీత ఫ్రాన్సుసువారు ఇటలీ దేశానికి పాలకపునీతుడు.

అలాగే, 1979 నవంబరు 29వ తేదీన రెండవ జాన్ పౌల్ జగద్గురువులు, పునీత అస్సీసి ఫ్రాన్సిసు వారిని పర్యావరణమునకు, వాతావరణ సంరక్షణ, జీవజాల సమగ్రతను కాపాడుటకు కృషిసలుపు వారందరికి పాలక పునీతునిగా ప్రకటించి యున్నారు.

జీవితము ఒసగే సుఖసంపదలను ఒడిసి పట్టుకోవాలని పరుగులు తీస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ క్రిందికి తోయబడ్డాడు. వివిధ రూపాలలో తాను క్రీస్తును కలుసుకొనుట ద్వారా, ఆత్మప్రేరేపితుడై జీవితములో ఏది విలువైనదో, ఏది శాశ్వతమైనదో తెలుసుకున్నాడు. సేవకుడినిగాక, యజమానిని సేవించడం మొదలుపెట్టాడు. సువార్తయే తన నియమాళిగా చేసుకొని జీవించాడు. క్రీస్తులేకుండా ధనవంతునిగా ఉండుట కంటె, క్రీస్తు కొరకు పేదవానిగా ఉండుటకు ఫ్రాన్సిస్ ఇష్టపడ్డాడు.

“క్రైస్తవమతం ఒసగిన వారిలో ఫ్రాన్సిస్ గౌరవ ప్రదమైన వ్యక్తులలో ఒకనిగా నిలిచిపోతాడు. సర్వాన్ని పరిత్యజించి వైరాగ్య జీవితాన్ని జీవించాడు. కుష్ఠురోగులకు సేవలు చేసాడు” అని నెహ్రూజీ ఫ్రాన్సిస్ వారి గురించి చెప్పారు. “ప్రపంచములోని ఏకైక నిజాయితీగల ప్రజాస్వామ్యవాది మరియు మానవతావాది, ప్రధమ హీరో, ధీరుడు, నాయకుడు ఫ్రాన్సిస్” అని జీ.కే. చెస్టర్టన్ రాసాడు. “ప్రపంచములోనే గొప్ప జ్ఞాని ఫ్రాన్సిసుగారు” అని గాంధీజీ ప్రశంసించారు.

మొదటిగా ఫ్రాన్సిస్ తన ఆత్మను చక్కదిద్దుకున్నారు, ఆతరువాత దేవాలయము, అటుపిమ్మట ప్రపంచము! ఫ్రాన్సిసు వారివలె దేవుని కలలను నిజం చేద్దాం. శాంతి, ప్రేమ, నీతి, న్యాయం కలిగిన ప్రపంచం కోసం మనం కలలు కందాం. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనవంతు కృషి చేద్దాం.

పునీత కార్మిక యోసేపు గారి మహోత్సవము

పునీత కార్మిక యోసేపు గారి మహోత్సవము

“మీరు ఏ పని చేసినప్పటికిని దానిని చిత్తశుద్ధితో మనుష్యుల కొరకు చేయుచున్న కార్యము వలెగాక, దేవుని కార్యముగా భావించి చేయుడు. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తుంచుకొనుడు. ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు” (కొలొస్సీ 3:23-24).

యోసేపుగారు, కన్య మరియమ్మ భర్త, యేసుకు సాకుడు తండ్రి. అతను దావీదు వంశస్థుడు. పాలస్తీనా, గలిలీయ ప్రాంతములోని నజరేతు నివాసి. శ్రామికుడు, ధార్మికుడు. దయగలవాడు, దైవచిత్తానికి విధేయుడు. అతను నీతిమంతుడు అని మత్త 1:19లో చదువుచున్నాము. నీతిమంతుడనగా చట్టాన్ని ప్రేమించి, గౌరవించే వ్యక్తి. దేవుని చిత్తాన్ని పాటించేవాడు. యోసేపు గొప్ప విశ్వాసి, ప్రార్ధనాపరుడు. మరియ యేసులను మిక్కిలిగా ప్రేమించాడు. పవిత్రాత్మ వలన గర్భము దాల్చిన మరియమ్మను భార్యగా చేకున్నాడు. యేసును కన్న కుమారునిలా చూసుకున్నాడు. వారి సంరక్షణకు, పోషణకు నిత్యము తపన పడ్డాడు, ఎంతగానో శ్రమించాడు.
 
యోసేపు వృత్తి వండ్రంగి. యూద సంస్కృతిలో చేతపని గౌరవ ప్రదముగా భావించ బడేది. ఆ వృత్తితోనే తిరు కుటుంబాన్ని పోషించాడు. తన చేతి పనిద్వారా, నుదుటి చెమట ద్వారా, తిరు కుటుంబానికి అండగా ఉన్నాడు. తన శారీరక శ్రమద్వారా, దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్తుడయ్యాడు. యోసేపు తన పనిని ఎంతగానో ఇష్టపడ్డాడు. ఎప్పుడుకూడా అలసటను చూపలేదు. ఒక విశ్వాసిగా, పనిని సద్గుణముగా, విలువైనదానిగా, గౌరవనీయమైనదిగా మార్చాడు. తన పనిలో ఎల్లప్పుడు సంతృప్తిని పొందాడు. ప్రతీ పని విలువైనదే. యోసేపు రెండురెట్లు పనిచేసాడు. వండ్రంగిగా, నిజాయితీగా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించాడు. అలాగే యేసును పెంచడములో, మరియమ్మతో కలిసి పనిచేసాడు. ఈ ప్రపంచములో కుటుంబాన్ని పోషించడం, పిల్లలను పెంచడము రెండూ విలువైన పనులే! తండ్రిగా తన పాత్రను పరిపూర్ణముగా పోషించాడు.
 
యేసుకూడా, యోసేపునుండి వండ్రంగి పనిని నేర్చుకున్నారు. తన బహిరంగ ప్రేషితకార్య ప్రారంభము వరకు, యోసేపు పనిలో సహాయముగా ఉన్నారు. యేసు “వండ్రంగి కుమారుడు” అని మత్త 13:55లో, “యోసేపు కుమారుడు” అని లూకా 3:23; 4:32; యోహాను 1:45; 6:42లో పిలువ బడినాడు. యేసువండ్రంగిగా మార్కు 6:3లో  పిలువ బడినాడు.
 
పని అంటే కేవలం మేధోపరమైనదని గ్రీకులు భావించేవారు. శారీరక పనులన్నీ బానిసల చేత చేయించేవారు. సోక్రటీసు, అరిస్టాటిలు పనిని చిన్నచూపు చూసారు. అలాంటి దృక్పధాన్ని యేసు మార్చారు. పని చాలా పవిత్రమైనదని, గౌరవప్రదమైనదని, దేవునికి ప్రీతికరమైనదని యేసు ఈ లోకానికి తెలియ జేయుటకు అట్లు చేసాడు. యేసు దృక్పధాన్నే క్రైస్తవ లోకం, ముఖ్యముగా అనాధి [బెనడిక్టైన్] మఠవాసులు... ఇతరులు కొనసాగించారు.
 
మానవ శ్రమ యొక్క ప్రాముఖ్యతకు, పవిత్రతకు యోసేపు గొప్ప ఉదాహరణ మరియు ఆదర్శం! మానవ శ్రమకు ఆయన నిజమైన చిహ్నం! మానవులు తమ శ్రమ వలన, దేవుని సృజనాత్మక సృష్టి కార్యములో భాగస్తులగు చున్నారు. “దేవుడైన యావే నరుని ఏదెను తోటను సాగుచేయుటకు, కాచుటకు దానిలో ఉంచెను” అని ఆ.కాం. 2:15లో చదువుచున్నాము. కనుక, శ్రమించడం మానవ కర్తవ్యం అని, శ్రమించడం దైవప్రణాళికలో పాల్గొనడమేనని అర్ధమగు చున్నది. శ్రమద్వారా, మానవ కుటుంబాభివృద్ధికి, సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా, దేవుని సృష్టి పరిపూర్ణత సాధిస్తుంది. మన అనుదిన పని అర్పణ అయినప్పుడు, భూమి బలిపీఠం అవుతుంది. కనుక, దేవుని మహిమార్ధమై మనం శ్రమించాలి.
 
మే 1న ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’. శ్రీసభకు పాలక పునీతుడైన యోసేపు గౌరవార్ధమై,12వ భక్తినాధ జగద్గురువులు, నాస్తిక కమ్యూనిజం నేపధ్యములో, దానికి వ్యతిరేకముగా, శ్రమ పోషకునిగా, ప్రతీ కార్మికునికి పాలక పునీతునిగా యోసేపును గుర్తించి, ‘పునీత శ్రామిక యోసేపు పండుగ’ను, దైవార్చన పండుగగా, క్రీ.శ. 1955వ సం.లో స్థాపించారు.
 
ఈ పండుగ మనకు తెలియజేసే పరమార్ధము ఏమిటంటే, పని, వృత్తి గౌరవాన్ని పెంపొందించడానికి, మానవ శ్రమ యొక్క గౌరవం దేవుని పోలికలో సృజింపబడిన శ్రామికున్ని గౌరవించడములో ఉంటుందని, పాపానికి ఫలితము మానవ శ్రమ ఎంత మాత్రము కాదని, మరియు పని కేవలము ఉద్యోగము కాదని అది ఒక బాధ్యత అని, సేవ చేయడమని ఈ మహోత్సవం తెలియజేయుచున్నది. అలాగే, క్రైస్తవులు పనిపట్ల గౌరవాన్ని, అవగాహనను పెంచుకోవాలని తల్లి శ్రీసభ ఆశిస్తున్నది. ప్రతీ పనిలో, విలువను, గౌరవాన్ని, సంతోషాన్ని చూడగలగాలి. పని వినయాన్ని నేర్పుతుంది. పని పవిత్రతలో నడిపిస్తుంది.
 
మన జీవిత స్థితి ఏదైనా, దైవాంకిత జీవితమైనా, సాధారణ క్రైస్తవ జీవితమైనా, మన పని పవిత్రమైనది. దేవుడు మనకు అప్పగించిన పనిని వివేచించడము, మన వృత్తిని వివేచించడములో భాగమే. మన పనిద్వారా, దేవుని రాజ్యము, భూలోకమునకు వచ్చుటలో మన వంతు కృషిచేసిన వారమవుతాము.
 
యంత్రాంగం, కంప్యూటరు... మొ.గు. కారణాల వలన నిరుద్యోగం అధికమగుచున్నది. నిరుద్యోగం అభద్రతాభావాన్ని కలిగిస్తుంది. ఎంతోమందిని పేదవారిగా, నిరాశ్రయులుగా చేయుచున్నది. నేటి లోకము ఎలా ఉన్నదంటే, మనుష్యులను యంత్రాలుగా చూస్తున్న లోకం! కార్మికుల ఆత్మగౌరవాన్ని అణగద్రొక్కే లోకం! పనికన్న, వేతనాన్ని చూసే లోకం! కూర్చొని డబ్బు సంపాదించాలనే లోకం! ఈ పరిస్థితులలో, ప్రజల హక్కులను, ముఖ్యముగా కార్మికుల హక్కులను, వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతీ ప్రభుత్వానికీ ఉన్నది! మనము కూడా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నము చేయాలి.
 
అనేక కారణముల వలనగాని పనిని కోల్పోయిన వారిని, పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని, పునీత శ్రామిక యోసేపు మధ్యస్థ ప్రార్ధన వేడుదలలో ఉంచుదాం. యోసేపు తప్పక ఓదార్పును, మద్దతును, మార్గదర్శకమును అందించగలరు. మనము కూడా పనిని బట్టిగాక వ్యక్తులను గౌరవించాలి. ప్రతీ పని విలువైనదే అని గుర్తించాలి!
 
నేటి సమాజానికి పునీత కార్మిక యోసేపు గారి సందేశం:
శ్రమ యొక్క విలువ: యోసేపు గారు ఒక సాధారణ కార్మికుడు. తన చేతులతో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. శ్రమను గౌరవించడం, కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది. ప్రతి పనిలోనూ నిజాయితీ, అంకితభావం ఉండాలని ఆయన జీవితం బోధిస్తున్నది. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి పని పవిత్రమైనదే అని ఈరోజు మనం గుర్తించాలి. ఈ సృష్టిలో ఎవ్వరూ తక్కువ కాదు. ఎవ్వరూ ఎక్కువ కాదు. అందరూ సమానులే. ఏ వృత్తి ఎక్కువ కాదు. ఏ వృత్తి తక్కువ కాదు అనే స్వచ్ఛమైన భావనను ప్రజలందరూ గ్రహించాలి.
 
కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యత: యోసేపు గారు మరియమ్మ గారికి ప్రేమగల భర్తగా, యేసు ప్రభువుకు సాకుడు తండ్రిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. కుటుంబ బంధాల యొక్క పవిత్రతను, ప్రేమ, సహనం, బాధ్యతతో కూడిన కుటుంబ జీవితాన్ని గడపడం ఎంత ముఖ్యమో ఆయన జీవితము ద్వారా తెలుస్తున్నది. నేటి సమాజములో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న సమయములో ఇది మనకు గొప్ప మార్గదర్శకం.
నిశ్శబ్ద సేవ: యోసేపు గారు ఎక్కువగా మాట్లాడకుండా నిశ్శబ్దముగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన నిశ్శబ్ద సేవ, విధేయత, విశ్వాసము మనకు స్ఫూర్తినిస్తాయి. మనం చేసే ప్రతి పనిని గొప్పగా చెప్పుకోకుండా, ఫలితము గురించి ఆందోళన చెందకుండా నిస్వార్థముగా పనిచేయాలని ఆయన జీవితము మనకు నేర్పుతున్నది.
విశ్వాసం మరియు విధేయత: యోసేపు గారి జీవితం విశ్వాసానికి, దేవుని చిత్తానికి విధేయతకు నిదర్శనము. కష్ట సమయాల్లో కూడా ఆయన తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మన జీవితములో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లలో దేవునిపై విశ్వాసం ఉంచడము, ఆయన చిత్తానికి లోబడి ఉండటము మనకు ధైర్యాన్నిస్తున్నది.
పేదలు మరియు అణగారిన వారి పట్ల ప్రేమ: యేసు ప్రభువును పెంచే బాధ్యతను స్వీకరించిన యోసేపు గారు, పేదల పట్ల, అణగారిన వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపించారు. సమాజములో వెనుకబడిన వారికి సహాయం చేయడము, వారి బాధలను పంచుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన జీవితము మనకు గుర్తు చేస్తున్నది.
 
కాబట్టి, పునీత యోసేపు గారి ఆదర్శాలను అనుసరిస్తూ, నేటి సమాజంలో క్రైస్తవుల బాధ్యత ఏమిటంటే,
శ్రద్ధగా పనిచేయాలి మరియు నిజాయితీని పాటించాలి: తాము చేసే ప్రతి పనిలో శ్రద్ధ, నిజాయితీ కలిగి యుండాలి. తమ వృత్తిని దైవ పిలుపుగా భావించి, కష్టపడి పనిచేయాలి. అవినీతికి ఎంతమాత్రము కూడా చోటు ఇవ్వకూడదు.
కుటుంబ విలువలను కాపాడాలి: ప్రేమ, సహనం, క్షమాపణతో కూడిన క్రైస్తవ కుటుంబాలను నెలకొల్పాలి. పిల్లలకు విశ్వాసం, మంచి నడవడికను నేర్పించాలి.
నిస్వార్థ సేవలో నిమగ్నం కావాలి: తమ సమయాన్ని, శక్తిని, వనరులను ఇతరుల కోసం, ముఖ్యముగా పేదలు మరియు కష్టాల్లో ఉన్నవారి కోసము వెచ్చించాలి.
విశ్వాసాన్ని ప్రకటించాలి: తమ జీవితము ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేయాలి. మాటలతో పాటు చేతలతో కూడా సువార్తను ప్రకటించాలి.
న్యాయము మరియు శాంతి కోసం పోరాడాలి: సమాజములో నెలకొన్న అన్యాయాలు, వివక్షతలపై గళమెత్తాలి. శాంతి, సమానత్వము కోసము కృషి చేయాలి.
ప్రభుత్వాల బాధ్యత ఏమిటంటే,
కార్మికుల హక్కులను పరిరక్షించాలి: కార్మికులకు సరైన వేతనాలు, పని పరిస్థితులు, భద్రత కల్పించాలి. వారి శ్రమను గౌరవించాలి.
ఉపాధి అవకాశాలు కల్పించాలి: ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన ఉపాధి పొందే అవకాశమును కల్పించాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి.
కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి: బలమైన కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించే విధానాలను రూపొందించాలి. పిల్లల సంరక్షణ, విద్య కోసము తగిన చర్యలు తీసుకోవాలి.
పేదరికము నిర్మూలించాలి: పేదరికములో ఉన్నవారికి సహాయము అందించాలి. వారికి జీవనోపాధి కల్పించే పథకాలను అమలు చేయాలి.
సామాజిక న్యాయం మరియు సమానత్వం కల్పించాలి: సమాజంలో వివక్షత లేకుండా చూడాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. బలహీన వర్గాలకు ప్రత్యేక సహాయము అందించాలి. అన్ని వృత్తులు సమాజాభివృద్ధికి దోహదం చేసేవే. సమాజ నిర్మాణానికి పనికి వచ్చేవే. వృత్తిపనివారిని గౌరవించివారికి ఇవ్వవలసిన వేతనము గౌరవముగా అందజేసి కష్టించి పనిచేసే వారు అందరూ మనుషులే. బానిసలు కాదు. పనికిరాని వారు కాదు. సృష్టిలో అందరూ... అన్నీ ఉపయోగకరమే. విలువతో కూడినవారే. విలువతో కూడినవే అనే స్వభావమును మనస్తత్వమును కలిగి యుండాలి.
పునీత కార్మిక యోసేపు గారి జీవితం మనందరికీ ఒక గొప్ప ప్రేరణ. ఆయన చూపిన మార్గములో నడుస్తూ, శ్రమను గౌరవిస్తూ, కుటుంబ విలువలను కాపాడుతూ, నిస్వార్థంగా సేవ చేస్తూ, విశ్వాసంలో ముందుకు సాగుదాం. ప్రభుత్వాలు కూడా ఈ ఆదర్శాలను స్వీకరించి, కార్మికుల సంక్షేమానికి, సామాజిక న్యాయానికి కృషి చేయాలని ఆశిద్దాం.

ప్రార్ధన:
పునీత యోసేపుగారా! మీరు చేసినట్లుగా, సహనం, పట్టుదలతో పనిచేయడం మాకు నేర్పించండి. మా విశ్వాస కన్నులను తెరవండి, తద్వారా మేము పనిలోనున్న గౌరవాన్ని గుర్తించగలము మరియు దేవుని సృష్టికార్యములో, క్రీస్తు విమోచన కార్యములో భాగస్తుల మగుదము. పని ఆహ్లాదకరముగా ఉన్నప్పుడు, దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు, పని భారముగా ఉన్నప్పుడు, దేవునికి అర్పించునట్లు మాకు సహాయము చేయండి.
“కర్షక కార్మికులు ఎవరెవరైతే వారి శ్రమను నమ్ముకొని వారి శ్రమకు అంకితమై జీవిస్తున్నారో! అట్టి వారి శ్రమను వృధా కాకుండా వారు గౌరవమును పొందుకొనే విధముగా ఆశీర్వదించండి ప్రభూ!”
-  యేసు దేవా మీరు మానవ లోకంలో కన్య మరియ గర్భమున పవిత్రాత్మ ప్రభావముచే జన్మించారు.
-  మీకు సాకుడు తండ్రిగా యోసేపుగారు తన వృత్తి  ఐన వడ్రంగి వృత్తిని గౌరవించి, కుటుంబ పోషణకు ఆయన వృత్తిని ఆధారంగా చేసుకొని, యేసు దేవా మిమ్మునూ... మీ తల్లి  మరియమ్మనూ పోషించారు.
-  పరలోక తండ్రి దేవుడు అప్పగించిన ప్రణాళికను మీ సాకుడు తండ్రి ఐన యోసేపుగారు ప్రేమతో... బాధ్యతతో... ఇష్టతతో... సమర్థవంతంగా చిత్తశుద్ధితో నెరవేర్చారు.
 -   కర్షక కార్మికులందరికీ, మీ సాకుడు తండ్రియైన పునీత జోజప్ప గారి ఆశీస్సులు  ఉండాలని  మీకు ప్రార్థిస్తున్నాను.
-  శ్రమించి పనిచేసే వారందరికీ! శక్తి సామర్థ్యాలను మీ మహిమ కోసం సమకూర్చారు. మీరు మాకు దయచేసిన మీ జ్ఞానమును, మీరు మాకు  ఒసగిన శక్తిని, సామర్థ్యములను, చిత్తశుద్ధితో నెరవేర్చి.... కష్టించి పనిచేసి, మీకు మహిమ కరముగా జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికీ దయచేయండి దేవా. మానవులమైన మేమందరమూ కష్టించి పనిచేసేవారమే! మీరిచ్చిన జ్ఞానమును, మీరిచ్చిన సామర్థ్యమును, కొందరు వినియోగించుకొనక, బద్దకించేవారమూ మాలో ఉన్నాము. అట్టి వారిని కూడా మీరు తట్టి, వారి శక్తిసామర్ధ్యాలను వారి జ్ఞానమును వారి వినియోగించుకొనే చిత్తశుద్ధిని బద్ధకించే వారందరికీ దయచేయండి. ఎవరు ఈ సృష్టిలో సోమరిగా జీవించుకుడా, అందరూ కష్టపడిమీరిచ్చిన జ్ఞానముతో మీరిచ్చిన సామర్థ్యంతో మీరిచ్చిన నైపుణ్యములతో కష్టించి శ్రమించే మనస్తత్వమును ప్రతి ఒక్కరికీ దయచేసి, మీ ఆశీర్వాదములతో మేమందరము మా  జీవనములు కొనసాగించుకొనులాగున, మాలో ప్రతి ఒక్కరినీ మీ అనుసరణలో నడిపించండి దేవా. అయ్యో నేను చేసే పని తక్కువ. హీనము అని, మాలో ఏ ఒక్కరూ... భావించకుండా దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను నెరవేర్చాలి అనే అంకితస్వభావమును మా అందరికీ దయచేయండి ప్రభూ...
 
-  పాపమునకు దారి తీసే పరిస్థితులను, పాప వృత్తుల యందు జీవించే వారిని, దేవా మీ దయగల ప్రేమతో, అట్టివారు  పాపములో... పాపము చేయుచూ జీవించకుండా! వారికి కూడా పవిత్రమైన జీవితములను ప్రసాధించండి. వారికి హృదయ పరివర్తనను కలుగజేసి.... వారి పాపమును కడిగి వేయండి. నీతిని, న్యాయమును, పవిత్రతను కలిగిన జీవితములను మీయందు విశ్వాసముతో  మీపై ఆధారపడి జీవించేలాగున వారి జీవితములను దిద్ది ఆశీర్వదించండి.
 
నా ఈ  ప్రార్ధనను... మీ సన్నిధికి చేర్చుకొనండి. ప్రతి వ్యక్తీ కష్టించి పనిచేసే చిత్తశుద్ధి కలిగిన హృదయములను ప్రతి ఒక్కరికీ దయచేయండి. సోమరితనము మాలో ఉన్నట్లయితే సోమరితనమును మాలోనుండి తీసిపారవేసి కాల్చివేయండి. యేసు దైవమా. ఆమెన్.

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు పునీత కార్మిక యోసేపు గారి మహోత్సవ శుభాకాంక్షలు!

పునీత మార్కు

పునీత మార్కు
సువార్తీకుడు, వేదసాక్షి


మార్కు సువార్తీకుడు, వేదసాక్షి
- నలుగురు సువార్తీకులలో మార్కు ఒకరు. మార్కు మారుపేరు యోహాను. తల్లి పేరు మరియమ్మ. వారి స్వస్థలం 
యెరూషలేము. మరియమ్మ యెరూషలేము సంఘములో ప్రముఖ సభ్యురాలు. పేతురు వీరికి సుపరిచితుడు. దేవదూత సహాయమున చెరసాల నుండి విడుదల పొందిన పేతురు, వీరి యింటికి వెళ్ళాడు (అ.కా. 12:12). యెరూషలేములోని వీరి నివాసములో అపోస్తలులు తరుచుగా సమావేశమయ్యేవారు (అ.కా. 12:12, 25; 15:37, 39). మార్కు మారుపేరుగల యోహాను బర్నబాకు దగ్గర బంధువు (కొలొస్సీ 4:10).

పౌలు అనుచరుడు - మార్కు పౌలు అనుచరుడు. సువార్తా ప్రచారముకై, మార్కు పౌలు, బర్నబాలతో కలిసి పనిచేసాడు. క్రీ.శ. 46-48 మధ్య కాలములోని, పౌలుగారి మొదటి ప్రేషిత ప్రయాణములో, పౌలు, బర్నబాలు, మార్కు అను మారుపేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి అంతియోకు తిరిగి వెళ్ళారు (అ.కా. 12:25). అంతియోకు నుండి సైప్రసులో వేదప్రచారము చేసారు. యోహాను [మార్కు] ఉపచారకునిగా వారికి తోడ్పడ్డాడు (అ.కా. 13:5). పౌలును అతని తోడివారును పాఫోసు నుండి సముద్ర ప్రయాణము చేసి, మధ్య ఆసియా మైనరు దక్షిణ తీరములోని పంపీలియాలోని పెర్గాకు వచ్చారు. మార్కు [యోహాను] వారిని అక్కడే దిగవిడచి వారితో కొనసాగక, యెరూషలేమునకు తిరిగి పోయాడు (అ.కా. 13:13). "వారి సువార్తా ప్రచారములో అతడు చివరివరకు వారితో ఉండక, వారిని పంఫీలియాలో విడిచిపెట్టి వెనుకకు మరలిపోయెను" అని అ.కా. 15:38లో చదువుచున్నాము. మార్కు మధ్యలోనే తిరిగి వెళ్ళడముతో, పౌలు నిరాశ చెందియుండవచ్చు! మార్కు నమ్మదగినవానిగా, వేదప్రచారములో దృఢముగా నిలబడగలడా అని తన అనుమాన్ని కూడా వ్యక్తపరచి యుండవచ్చు! ఈ సంఘటన, పౌలు, బర్నబాల మధ్య విబేధాలను సృష్టించినది.

క్రీ.శ. 49-52 మధ్య కాలములోని, పౌలుగారి రెండవ ప్రేషిత ప్రయాణమునకు, బర్నబా తమతో మార్కు అనుమారుపేరు గల యోహానును తీసికొని పోగోరెను. కాని పౌలు అతనిని తీసికొని పోవుట మంచిది కాదని తలంచాడు. అందుచేత వారిద్దరి మధ్య ఈ విషయమై తీవ్రమైన తర్జనభర్జనలు జరిగాయి. కనుక వారు విడిపోయారు. బర్నబా మార్కును తీసికొని ఓడనెక్కి సైప్రసుకు పోయాడు. పౌలు సిలాసును ఎన్నుకొని, ఆసియా మైనరులోని సిరియా, సిలీషియా వెళ్ళాడు (అ.కా. 15:37, 39-41).

అయితే, పౌలు మార్కుల మధ్యగల సమస్యలు ఎక్కువకాలం కొనసాగలేదని భావించవచ్చు! వారి మధ్యగల మనస్పర్ధలను తొలగించుకొని త్వరలోనే సఖ్యత పడ్డారు. రోమునగరమున మొదటిసారిగా ఖైదు [గృహ నిర్బంధం] చేయబడిన పౌలును (క్రీ.శ. 61-63), ఆసియా మైనరును సందర్శించే భాగములో రోమునగరములోనే నున్న మార్కు, పౌలుని విశ్వసనీయ సహచరులలో ఒకనిగా అతనిని సందర్శించాడు (కొలొస్సీ 4:10). ఫిలేమోనుకు వ్రాసిన లేఖలో కూడా "తన తోడి పనివానిగా" మార్కును ప్రస్తావించాడు (ఫిలే 24). పౌలు రెండవసారి ఖైదు చేయబడినప్పుడు, క్రీ.శ. 61 వ సం.లో, తిమోతికి తాను వ్రాసిన లేఖలో, "త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుము. లూకా మాత్రమే నాతో ఉన్నాడు. మార్కును నీ వెంట బెట్టుకొని రమ్ము. అతడు పనిలో నాకు సాయపడగలడు" (2 తిమోతి 4;9, 11) అని మార్కు గురించి ప్రస్తావించాడు. బహుశా, పౌలు హతసాక్షి మరణాన్ని పొందినప్పుడు, మార్కు అక్కడే ఉండి యుండవచ్చు!

పేతురు సన్నిహితుడు -  క్రైస్తవ సంప్రదాయం ప్రకారం, మార్కు, పేతురుతో కూడా సన్నిహిత సంబంధాన్ని కలిగి యున్నాడు. పేతురు ఆసియా మైనరు ప్రాంతాలలోని అనేక క్రైస్తవ సంఘాలకు వ్రాసిన లేఖలో, "నా కుమారుడు మార్కు" (1 పేతురు 5:13) అని పేర్కున్నాడు. అలెగ్జాండ్రియా క్లెమెంట్, ఇరేనియస్ మొదలగు వారు, మార్కు పేతురుకు వ్యాఖ్యాతగా, విశ్లేషకునిగా వ్యవహరించాడని చెబుతారు.

మార్కు సువార్త - లూకా సువార్తీకునివలె, మార్కుకూడా యేసు బోధనలను ఎప్పుడు ప్రత్యక్షముగా వినలేదు. మార్కు పేతురుకు వ్యాఖ్యాతగా, విశ్లేషకునిగా వ్యవహరించాడు గనుక, తన సువార్త పేతురు బోధనలపై ఆధారపడి ఉంటుంది. 'క్రీస్తు సువార్త'కు సంబంధించి అనేక విషయాలను సేకరించాడు. పేతురు-పౌలుల మరణానంతరం, రోమునగర విశ్వాసుల అభ్యర్ధన మేరకు, రోమీయులనుద్దేశించి [అన్య-క్రైస్తవులు], మార్కు బహుశా క్రీ.శ. 60-70 సం.ల మధ్యలో గ్రీకు భాషలో వ్రాసియున్నాడు. అయితే, సువార్తలో ఎక్కడకూడా తన పేరును ప్రస్తావించలేదు. నాలుగు సువార్తలలో ప్రధమముగా వ్రాయబడిన సువార్త. క్రీస్తు దేవుని కుమారుడని, పాపము మరియు మరణము నుండి మనలను రక్షించడానికి బాధలనుభవించి మరణించాడని తెలియజేయడానికి ఈ సువార్త వ్రాయబడినది.

సువార్త ముఖ్యాంశాలు లూకా మరియు మత్తయి సువార్తలకు ప్రాధమిక మూలం మార్కు సువార్త. క్రీస్తు కాలం నాటి పాలస్తీనా పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ సువార్త దోహదపడుతుంది. "దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త" (మార్కు 1:1) అని ప్రారంభమవుతుంది. యేసు క్రీస్తు భూలోక సంబంధమైన తన ప్రేషిత కార్యము పట్ల నిస్సంకోచమైన నిబద్ధతను మార్కు సువార్తలో చూడవచ్చు. యేసును, "దేవుని కుమారుడు (1:1; 15:39), "మెస్సయ్య" (1:1; 8:29; 14:61; 15:32), "మనుష్యకుమారుడు" (2:10, 28; 8:31), "బోధకుడు" (9:5; 10:51; 14:45), "రాజు" (15:2, 9, 12, 18, 26, 32), "పెండ్లి కుమారుడు" (2:19), "ప్రవక్త" (6:4, 15; 8:28), "దావీదు కుమారుడు" (10:47-48), "రాబోయేవాడు" (11:19), "గొర్రెల కాపరి" (14:27), "దేవుని పవిత్రుడు" 1"24)గా మార్కు సువార్తలో చూస్తాము. 

"ప్రభువు మార్గము" [తండ్రి దేవుని యొద్దకు] లేదా "దైవరాజ్యము"లో, 'హృదయ పరివర్తనము' మరియు 'విశ్వాసము' (1:15) అను ప్రాముఖ్యమైన అంశాలను యేసు బోధించారు. మార్కు సువార్తలో మరో ప్రధానాంశం యేసు-శిష్యుల సంబంధం. యేసు "హృదయపరివర్తనము చెంది సువార్తను విశ్వసించుటకు" పిలచును. గురువు అయిన క్రీస్తు తన సహవాసములోనికి, అనగా "తనతో నుండుటకు మరియు సువార్త ప్రకటనకు పంపుట కొరకు" శిష్యులను పిలచును. శ్రమలు, హింసలు శిష్యరికములో భాగము (మార్కు 8:34-35).

వేదసాక్షి - మార్కు అనేక సంవత్సరాలు ఈజిప్టు దేశములోని అలెగ్జాండ్రియా పట్టణములో నివసించాడు. బహుశా, అక్కడ సంఘమును స్థాపించి, ప్రధమ పీటాధిపతిగా బాధ్యతలను చేపట్టారు. సువార్త వ్యాప్తిలో మార్కు కీలకపాత్ర పోషించాడు. అక్కడే వేదహింసలు అనుభవించి క్రీ.శ. 68-74 వ సం.ల మధ్యలో వేదసాక్షి మరణాన్ని పొందారు. క్రీ.శ. 815 వ సం.లో మార్కు మృతావశేషం, ఇటలీ దేశములోని వెనిస్ నగరమునకు కొనిపోబడి, అక్కడ పునీత మార్కు దేవాలయములో భద్రపరచ బడినది. పునీత మార్కు వెనిస్ పట్టణ పాలక పునీతులు. 

'మార్కు' అనగా 'మానవత్వముగల' అని అర్ధము. పునీత మార్కు యొక్క చిహ్నం, 'రెక్కలుగల సింహం'. ఈ చిహ్నం బప్తిస్త యోహాను గురించి ఇచ్చిన వివరణ నుండి ఉద్భవించినది (మార్కు 1:3). "ఎడారిలో ఎలుగెత్తు స్వరము" గర్జించే సింహముతో పోల్చబడినది. నాలుగు రెక్కల జీవుల గురించి యెహెజ్కేలు దర్శనమునుండి, నాలుగు రెక్కలు నలుగురు సువార్తీకులకు అన్వయించడం జరిగింది (యెహెజ్కె 1:6; 10 - సింహము, వృషభము, మనుష్యుడు, గరుడ). సింహము సార్వభౌమత్వమునకు సూచన.

రక్షణకు మూలమైన సువార్తను ప్రకటించుటలో మార్కు తన బాధ్యతను నెరవేర్చాడు. మార్కు సువార్తీకునివలె, సువార్తా ప్రచారం చేయు జ్ఞానమును దేవుడు మనకొసగును గాక!