పునీత అగస్తీను (28 ఆగష్టు)
బిషప్, శ్రీసభ పండితుడు, క్రీ.శ. 354 – 430
అగస్టీను
వారికి పునీత పట్టా ఇచ్చు సందర్భములో, 1వ లియో (సింహరాయులు) జగద్గురువులు, “పునీత అగస్టీను వారి పండుగను ప్రత్యేక గౌరవంతో, ఒక అపోస్తలునికి
ఇవ్వాల్సిన ప్రాముఖ్యతతో జరుపుకోవాలి. తరతరాల వరకు కతోలికులకు,
అన్యులకు అందరికి సమానంగా వీరి రచనలు మంచి ప్రేరణ,
స్పూర్తి అందిస్తాయి” అని అన్నారు.
అగస్టీను
ఉత్తర ఆఫ్రికాలోగల హిప్పోనగర పీఠం, నుమిదియా మండలంలోని ‘తగాస్తే’ అనబడు చిన్న పట్టణంలో క్రీ.శ. 354 నవంబరు
13న తొలి సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు అంత ధనవంతులుకారు. కాని ఉన్నత
కుటుంబమే. తండ్రి పేరు పెట్రిషియస్. అతను అన్యుడు. తల్లి మోనికమ్మ (పునీతురాలు).
తండ్రి
అన్యుడు, కోపిష్టి కాని మోనికమ్మ వల్ల తన మరణానికి చాలాముందే దీనత్వము
ఆపాదించుకొని జ్ఞానస్నానంపొందాడు. వీరికి అగస్టీను, నవిజియస్ అనే కొడుకులు పెర్పుతువా అనే కూతురు కలిగారు. “పరుల
బ్రతుకులు ప్రవర్తనగూర్చి ఆసక్తి కనబరిచే మనిషి తననుతాను సంస్కరించు కోవడానికి
ఎందుకు జాగ్రత్తపడడు? ఒక పాపాత్ముని
యెడల దైవం చూపే కనికరమును గుర్తించాలి. తాను ఉన్న స్థితికంటే గొప్పవాడని ఎవరూ
తలంచరని గ్రహించాలి” అని ఈ
అనుభవజ్ఞుడు వ్రాశారు. అగస్టీను తన 12 ఏళ్ల ప్రాయంలో ‘మదౌరా’ పట్నంలోని ఒక రోమను వ్యాకరణ పాఠశాలలో చేర్పింపబడ్డారు. లతీను భాష బాగా నేర్చాడు.
తన 16వ
ఏట తగాస్తేకు తిరిగి వచ్చాడు. ఇక అగస్టీనుకు అనేకమంది చెడు స్నేహితులు ఉండేవారు.
దుర్వ్యసనాలతో విచ్చలవిడిగా తిరిగేవాడు. వీరిని సంస్కరించాలని తండ్రి ఆకాంక్ష.
కాని అంత తీరిక పట్టింపు ఆయన చూపలేదు. వైరము, మోహము, క్రోధము (ఎఫీ. 5:31) అనే మనో వికారాలను అణచివేసు కొమ్మని తల్లి బుద్దిమాటలు చెప్పేది.
పదేపదే ప్రభువును ప్రార్థించింది.
ఇంతలో
తండ్రి గతించగా ఒక ధనవంతుని ఆర్ధిక సహాయంతో ‘కర్తానె’ నగరంలో పెద్ద చదువులకై
వెళ్లాడు. అక్కడ మానసికంగా బాగానే ఎదిగాడు. సాహిత్య విద్యలో మొదటి వానిగా నిలిచాడు.
కాని ధన సంపాదన, కీర్తి,
అహంకారం పెంచుకునేందుకే చదువని అప్పట్లో తుచ్చగా
భావించానని అగస్టీను తమ ఆత్మకథలో వ్రాసుకున్నారు. తన ఈ విద్యాకాలంలోనే ఒక స్త్రీతో
సంబంధం పెట్టుకొని 13 సం.లు కాపురం చేశారు. తనకు 20 ఏళ్లు నిండకముందే తండ్రి అయ్యాడు. కాని అగస్టీను ఒక
అన్యుడుగానే జీవించడం తల్లి మోనికాకు నచ్చలేదు. మనో పరివర్తన చెంది మంచి
క్రైస్తవుడుగా మారాలని దేవుని సాయం కోరుతు పరిపరి విధాల జపతపాలు నిర్వహించింది.
అగస్టీనుగారు “దేవా! ఆమె నా
కోసం మరీ మరీ నిన్ను ప్రార్థించింది” అని వ్రాశారు.
అగస్టీనుగారు
సుప్రసిద్ధ గ్రంథకర్తలైన వెర్టిల్, వర్రో, సిసిరో
రచనల్ని చదివి సంతృప్తి పడక, వేద శాస్త్రాలు చదవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తగాస్తే,
కర్తాన్య పట్టణాల్లో 9 సం.లు సాహిత్యం, వ్యాకరణ శాస్త్రాల విద్యాలయాన్ని నడిపారు. మోనికాగారు తమ దాపులోని బిషప్పుగార్కి
తన గోడు వెళ్లబోసుకుంది. “అమ్మా! నీ పుత్రుని పరివర్తన కోసం నీవు రాల్చిన ఎన్నో
కన్నీటి చుక్కలు వృధాపోవు. నీ ప్రార్థనలు, ఉపవాసాలు, సుబోధలు అగస్టీనును ఏనాటికైనా ఉత్తమ క్రైస్తవుని చేస్తాయి అని జోస్యం
చెప్పారు.
క్రీ.శ
383లో అగస్టీన్ ఒంటరిగా ఇటలీలోని రోమునగరంలో పాఠశాల ప్రారంభించారు. కాని ఆర్ధిక
లేమివల్ల విఫలమయ్యారు. ఇటలీదేశలోనే ఉన్న ‘మిలానో’ నగరంలో ఒక ప్రసిద్ధ పాఠశాల
అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు. ఇక్కడే పునీత బిషప్ అబ్రోసుగారితో పరిచయ మేర్పడింది. వారి ఉపన్యాసాలు, సలహాలు అగస్టీనుగారిలో మార్పుకు అంకురార్పణ చేశాయి. ఆ
రోజుల్లో గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో, ప్లోటినస్’ల రచనలు చదివారు. “ప్లేటో నిజ
దేవుని గురించిన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. ఆ యేసు నాకు మార్గం చూపారు”
అని తన పుస్తకంలో అగస్టీన్ వ్రాసుకున్నారు.
ఇంతలో
తల్లి మోనికా ఆఫ్రికా నుండి బయలుదేరి ఇటలీలోని ‘మిలానొ’ నగరంలో ఉన్న కుమారుని
చేరుకుంది. ఈ విషయమై, “ప్రేమబలం వల్లనే ఆమె నాకోసం ప్రయాణం కట్టుకుని నన్ను వెంబడించింది” అని అగస్టీన్ తన పుస్తకంలో వ్రాసుకున్నారు. ఇప్పటికైనా
అగస్టీన్ మంచి క్రైస్తవుడు కావాలని, ఉంచుకున్న స్త్రీని విడిచివేయమని
ప్రాధేయపడింది. అందుకు అగస్టీనుగారు నీతికి, ఆధ్యాత్మికతకు మధ్య సంఘర్షణలో
పడిపోయారు. బైబిలు చదవడం మొదలు పెట్టారు. ముఖ్యంగా పౌలు లేఖలు వీరిని ఎంతగానో ఆకర్షించాయి.
పాత నిబంధనలోని ప్రవచనాలు క్రొత్త నిబంధనలో క్రీస్తునందు నిజంకావడం అగస్టీనుగారిని
విశ్వాసంలోకి నడిపించింది.
ఒకరోజు
ఆఫ్రికానుండి పొంతితియాన్, అలిపియస్ అను ఇద్దరు క్రైస్తవులు వచ్చి అగస్టీనుగార్ని కలసుకున్నారు. ఈజిప్టు దేశ
పునీత అంతోనివారి ఆదర్శ జీవిత చరిత్రను విన్నింప జేశారు. పునీత పౌలు రోమీయులకు
వ్రాసిన లేఖ 13:13-14 చదివిన అగస్టీనుగారిలో పరివర్తన కలిగింది. తాను
అనుసరిస్తున్న అసత్య సిద్ధాంతాలను, తప్పుడు బోధనలను విడిచి పెట్టారు. మిలాన్
నగరంలోనే పునీత బిషప్ అంబ్రోసు ద్వారా క్రీ.శ. 387 ఏప్రిల్ 24న జ్ఞానస్నానం
పొందారు. కొత్త జీవితం మొదలు పెట్టారు. పిమ్మట స్వదేశం వెళ్లడానికి తల్లితో సహా
ఓస్టియా ఓడరేవు వెళ్లారు. అస్వస్థతవల్ల అక్కడే తల్లి మృతిచెందారు. ఈ సందర్బంగా, “నా
తల్లికి ఆమె ప్రార్ధనలకు, ఉన్నతాశయాలకు నేను సర్వదా ఋణపడి ఉంటాను”
అని అగస్టీను వ్రాసుకున్నారు.
అటుపిమ్మట,
స్వగ్రామం చేరుకున్నారు. తన కుమారుడు 17వ యేట మరణించాడు. తనలో విపరీతమైన వైరాగ్యం
జనించింది. కఠోర బ్రహ్మచర్యం పాటించారు. క్రీస్తుకోసం తానొక ఆశ్రమం స్థాపించారు.
దారిద్ర్యం, ప్రార్థన,
గ్రంథపఠనం వంటి వ్రతదీక్షతో ఆశ్రమ మఠం అభివృద్ధి
చెందింది. తాను గురువు కావాలని అనుకోలేదు. కాని గురువిద్యను అధ్యయనంచేసి, క్రీ.శ. 391లో హిప్పోనగర పీఠాధిపతి వలేరియస్ గారిచే
గురుపట్టాభిషిక్తులయ్యారు. ఉత్సాహంతో మత ప్రచారం చేశారు. ఉత్తరించు ఆత్మల విమోచనకై
ప్రార్థన, సిలువ
స్వరూపవందన ప్రోత్సహించారు. తన 42వ ఏట క్రీ.శ. 395లో బిషప్ వలేరియస్ వారికి సహాయక పీఠాధిపతిగా అభిషిక్తులై
వారి మరణానంతరం హిప్పోనగర పీఠాధిపతి అయ్యారు.
గురువులు,
డీకనులు, ఉపడీకనుల సంఖ్యను పెంపొందింపజేసి క్రైస్తవ విశ్వాసం వర్ధిల్లజేశారు. క్రీస్తు
అపోస్తలునిగా సామాన్య జీవితంకు మఠవాసులు కట్టుబడునట్లు చేశారు. మఠ ఆశ్రమాలు,
వైద్యశాలలు, గుడులు నెలకొల్పారు. స్త్రీలకు ఒక సభను
ఏర్పరచి తన చెల్లి పర్ఫెతువాగారిని మఠ శ్రేష్టురాలిగా నియమించారు.
అగస్టీనుగారు
తమ క్రైస్తవులతో “మీరు లేకుండా
నేనొక్కన్నే రక్షింపబడటం నాకు ఇష్టంలేదు” అనే వారు. “నేనెందుకు ఈ లోకంలో ఉన్నాను? క్రీస్తులో జీవించడానికి. అదికూడా మీతో కలసి వారితో జీవించడానికి.
ఇదే నా సంపద, గౌరవం, ఆనందం” అనేవారు.
వీరికి
పునీత జెరోమ్ గారితో పరిచయముండేది. ఆనాటి బలమైన అసత్య బోధనా సిద్ధాంతం, ‘మేనిచియం’
మత నాయుకుడైన ఫెలిక్స్తో బహిరంగ చర్చలో ఓడించగా, అతడు
జ్ఞానస్నానం పొందినట్లు చరిత్ర చెపుతోంది. విగ్రహారాధకులలో పరివర్తన కలిగేలా
బోధించారు. వారికొరకై “దేవుని పట్టణం” అనే గ్రంథం
విరచించారు. కతోలికుల వేదంకు వ్యతిరేకులైన “డోనాటినులు, పెలాజినియసుల”కు తగు బుద్దిచెప్పుటకు
“పునీతులయొక్క ముందస్తు గమ్యస్థానం,”
“పట్టుదలావరం” అనే గ్రంథాల్ని వ్రాశారు. గురువులు క్రీస్తు అడుగుజాడల్లో
నడుస్తూ ఆదర్శ జీవితంతో మంచి కాపరులై తమ క్రైస్తవ మందను పరిరక్షించు కోవాలన్నారు.
వీరు క్రీ.శ. 430 ఆగష్టు
28న తమ 76వ ఏట పరమ పదించారు.
No comments:
Post a Comment