మరియమాత మోక్షమునకు కొనిపోబడుట, ఆగష్టు 15

మరియమాత మోక్షమునకు కొనిపోబడుట, ఆగష్టు 15
స్వాతంత్ర్య దినోత్సవము

ఈ రోజు భారత దేశము కొరకు విజ్ఞాపన ప్రార్ధన చేద్దాం. ఎందుకన, ఈ రోజు మన దేశం బ్రిటిష్ సంకెళ్ళనుండి విముక్తి పొంది, స్వాతంత్ర్యమును పొందియున్నది. దీనిని దేశమంతటా గొప్ప మహోత్సవముగా కొనియాడు చున్నాము. ఈ రోజు బాహ్య శరీరాలకు స్వాతంత్ర్యం చేకూర్చబడిన రోజు. అయితే, అంత:రంగిక ఆత్మలు పాపము నుండి విడుదల పొంది, స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును పొందాలని మన దేశం కొరకు ప్రార్ధన చేద్దాం.

1 తిమో. 2:1-5: “మానవులందరి కొరకు దేవునకు విన్నపములును, ప్రార్ధనలును, మనవులును, కృతజ్ఞతలును అర్పించాలి. మనము సత్ప్రవర్తనతోను, సంపూర్ణమగు దైవభక్తితోను, ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును (నేటి రాజకీయ నాయకుల కొరకు) తదితర అధికారులందరి కొరకును ప్రార్ధనలు చేయవలయును. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది. మానవులందరు రక్షింప బడవలయునని, సత్యమును (యేసు) తెలుసుకొన వలయునని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే, దేవుని, మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు.” ఈ దేవుని చిత్తం నెరవేరాలంటే, మనం అందరి కొరకు ప్రార్ధన చేయాలి. మనం భారతీయులం కనుక, ఈ రోజు మన దేశం కొరకు ప్రార్ధన చేద్దాం. స్వాతంత్ర్యము కొరకు ప్రార్ధన చేద్దాం. ఆధ్యాత్మిక విడుదల / స్వాతంత్ర్యము కొరకు ప్రార్ధన చేద్దాం.

కొలొస్సీ. 1:13-14: “దేవుడు మనలను అంధకార శక్తి నుండి విడిపించి, తన ప్రియ పుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది. మన పాపములు క్షమింప బడినవి.”

పాపము నుండి స్వాతంత్ర్యము రావాలి. సాతాను (దుష్టత్వము) నుండి, దాని దుష్టక్రియల నుండి స్వాతంత్ర్యము రావాలి. మన ఆత్మలకు (అంత:రంగిక) స్వాతంత్ర్యము చేకూరినప్పుడే సంపూర్ణ స్వాతంత్ర్యమును పొందినవారమవుతాము!

1 యోహా. 3:8: “సాతాను ఆదినుండియు పాపము చేయు చుండెను. కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సాతానుకు చెందిన వాడగును. సాతాను కృత్యములను నశింప చేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను.”

కనుక, ఆధ్యాత్మిక విడుదల కొరకు, పాపము నుండి విడుదల కొరకు, సాతాను బానిసత్వము నుండి విడుదల కొరకు ఈ రోజు మనము ప్రార్ధన చేయాలి. అలాంటి ఆధ్యాత్మిక విడుదలను ఒసగుటకు, రక్షణను ఒసగుటకు యేసు ప్రభువు ఈ లోకమున అవతరించాడు.

లూకా. 2:30-33: సిమియోను బాల యేసును చూచి ఇలా పలికాడు: “ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచితిని: అది అన్యులకు ఎరుక పరచు వెలుగు; నీ ప్రజలకు మహిమను చేకూర్చు వెలుగు.సిమియోను రక్షణను, స్వేచ్ఛను, సత్యమును, స్వాతంత్ర్యమును కనులారా చూసాడు.

దర్శన. 1:7: “మేఘ మండలము నుండి ప్రభువు వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును.” భారత దేశములోని ప్రజలందరూ నిజమైన, సంపూర్ణమైన స్వాతంత్ర్యమును పొందాలని, ప్రతి ఒక్కరు ప్రతి నేత్రము అయనను చూడాలని, రక్షణను, స్వాతంత్ర్యమును, విడుదలను పొందాలని ప్రార్ధన చేద్దాం.

గలతీ. 5:1: “స్వేచ్ఛ కోసం క్రీస్తు మనల్ని విముక్తుల్ని జేశాడు.” యోహాను. 8:32: “సత్యము అనగా యేసు మిమ్ము స్వతంత్రులను చేయును.” 2 కొరి. 3:17: “ప్రభువు ఆత్మ ఎచట ఉండునో అచట స్వాతంత్ర్యము ఉండును.”

స్వేచ్ఛ అనగా నేమి?

“మన స్వంత బాధ్యతతో ఉద్దేశపూర్వకమైన చర్యలను చేపట్టు శక్తియే స్వేచ్ఛ. సత్యములోను, మంచితనములోను, అభివృద్ధికి, పరిణతికి అవసరమయ్యే శక్తియే స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛ దేవుని వైపుకు నిశ్చితముగా సాగాలి. ఈ స్వేచ్ఛ మానవ చర్యలకు విలక్షణతను ఆపాదిస్తుంది. మనం ఎంత ఎక్కువగా మంచిని చేస్తే అంత ఎక్కువగా స్వేచ్చాపరులము అవుతాము. స్వేచ్ఛ మనలను బాధ్యత కలిగి జీవించునట్లు చేస్తుంది. స్వేచ్ఛను వినియోగించడమనగా ఏదిబడితే అది చెప్పడం, చేయడం కాదు. స్వేచ్ఛ ఉందికదాయని, స్వప్రయోజనాల సంతృప్తికోసం ఇహలోక వస్తువులను భోగించడమే భవితగమ్యం అని భావించడం పొరపాటు” (కతోలిక శ్రీసభ సత్యోపదేశం).

స్వేచ్ఛగా జీవించడానికి ఆర్ధిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను చాలాసార్లు ఉల్లంఘిస్తూ ఉంటాము. అది మన నైతిక జీవనాన్ని కుంటుబరచి ప్రేమకు విరుద్ధముగా పాపంచేసే శోధనలలో పడవేస్తుంది. నైతిక చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా, మనిషి తన స్వంత స్వేచ్ఛను కోల్పోతాడు, తనలోతానే బంధీ అవుతాడు. ఇరుగుపొరుగు వారితో సహవాసాన్ని కోల్పోతాడు. దైవసత్యాన్ని ఎదిరిస్తాడు.

మామూలుగా, స్వేచ్ఛ అనగా సామాజిక న్యాయం, సమానత్వం, ఎంచుకొను హక్కు, అనియంత్రిత, మెరుగైన జీవితం మొదలగు వానిగా భావిస్తూ ఉంటాము. ఈ రోజు ‘స్వేచ్ఛ’ అనే పదమును వ్యక్తిగత, స్వార్ధపూరిత ప్రయోజనాలకు, వ్యక్తిగత ఆలోచనలకు వక్రీకరించ బడుచున్నది.

ఈనాడు కొన్ని దుష్టశక్తులు మన దేశములో ఇలాంటి స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్నాయి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనుకొంటూ అజ్ఞానములో, అంధకారములో జీవిస్తున్నాము. దీనిఫలితమే, ఇంకా మన దేశములో ప్రబలిపోతున్న బడుగువర్గాల అణచివేతలు, ఆడవారిపై, చిన్న పిల్లలపై అరాచకాలు, మైనారిటీలను విదేశీయులుగా భావించడం..మొ.వి. ఏం? మనం భారతీయులం కాదా? దేశభక్తి మనకు లేదా? మతం పేరిట ఎందుకు తుచ్ఛ, నీచ రాజకీయాలు, వివక్షలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, తప్పుడు కేసులు? ఏం? నేను ఒక మతం వాడిని కాకపోతే, ఈ దేశములో ఉండే హక్కు, స్వాతంత్ర్యము, నాకు లేదా? ఎందుకు నేను భయం భయంగా నా దేశంలో బ్రతికే పరిస్థితి వచ్చింది?

ఇదేనా భారత దేశం జరుపుకుంటున్న నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యము? మతపరమైన స్వేచ్ఛకు ఎందుకు భంగం వాటిల్లింది? కేవలం కొద్దిమంది స్వార్ధబుద్ధి వలన! అందుకే, ఈ రోజు మన దేశం కోసం ప్రార్ధన చేయాలి. నిజమైన స్వాతంత్ర్యం కోసం ప్రార్ధన చేయాలి.

యోహాను. 8:31-32: ప్రభువు మనతో అంటున్నారు: “మీరు నా మాటలపై నిలిచి యున్నచో, నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును.”

ఇది మనం పొందవలసిన నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యము. బాధ్యతతో కూడిన స్వేచ్ఛ ఫలవంతమైనది, అర్ధవంతమైనది. అది సోదర ప్రేమతో ముడిపడి యున్నది. కనుక మనము అందరిని గౌరవించాలి. మన స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదు. స్వార్ధముగా జీవించ కూడదు.

అలాగే నేటి సమాజములో నున్న చెడును, దుష్టశక్తులను... వ్యతిరేకించాలి. వాటినుండి మనం ఇంకా విముక్తి కావాల్సి యున్నది.

నిజమైన స్వాతంత్ర్యమును పొందినప్పుడు ఎల్లప్పుడూ మంచినే చేస్తూ ఉంటాము. కనుక, ఈ రోజు మన దేశం కోసం ప్రార్ధన చేయాలి.

పాపము నుండి స్వేచ్ఛ! దాని మరణ వేతనమైన మరణము నుండి స్వేచ్ఛ! ఇది నిజమైన స్వేచ్ఛ! స్వేచ్ఛ వలన శాశ్వత జీవనము లభించును (రోమీ. 6:22, 23). అనగా ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు జీవించు చున్నాడు (గలతీ. 2:20).

ఈ స్వేచ్ఛ వలన మనము మరియ తల్లివలె దేవుని పిలుపునకు, చిత్తానికి, “అవును” అని ప్రత్యుత్తరము ఇవ్వగలము. ఈ రోజు మరియ తల్లి మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడు చున్నాము కనుక, మన దేశం కోసం ప్రార్ధన చేసేప్పుడు మరియ తల్లి ప్రార్ధన సహాయాన్ని వేడుకుందాం! ఆమె నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యములో జీవించినది: పాపరహితగా, నిష్కళంక మరియగా జన్మించినది. సంపూర్త స్వేచ్ఛపరురాలు, సంపూర్ణ స్వతంత్రురాలు.

మరియ మోక్షారోహణము అనగా ఆత్మ, శరీరములతో పరలోకమునకు కొనిపోబడుట. ఈ భాగ్యాన్ని దేవుడు కొద్ది మందికి మాత్రమే ఇచ్చాడు: మొదటి వ్యక్తి హనోకు (ఆది. 5:24), ఏలియా (2 రాజు. 2:11), మరియ తల్లి.

మనం పాపమును వీడి పుణ్య మార్గములోనికి రావాలి. అందులకు మరియ తల్లిని, ఆమె జీవితాన్ని ఆదర్శముగా తీసుకుందాం. మన దేశం కొరకు ప్రత్యేకముగా ప్రార్ధన చేద్దాం. దేశ నాయకుల కొరకు ప్రార్ధన చేద్దాం. మన దేశం ఇంకా నిజమైన స్వాతంత్ర్యమును, స్వేచ్ఛను, విడుదలను పొందవలసి యున్నది. మరియ తల్లి విన్నపము ద్వారా, దేశములో శాంతి, సమాధానము, భద్రత కొరకు ప్రార్ధన చేద్దాం.

రోమీ. 6:22లో చెప్పబడినట్లుగా, “ఈనాడు పాపము నుండి విముక్తి పొంది, దేవునికి దాసులమైతిమి. పవిత్రతకు చెందిన ఫలితమును స్వీకరించితిమి. చివరకు, శాశ్వత జీవితము లభించును.”

No comments:

Post a Comment