మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవం (మార్చి 19)

మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవం (మార్చి 19)

Fr. Praveen Kumar Gopu OFM Cap.
STL Biblical Theology, M.A. Psychology
Br. Joseph Thamby Ashram, Peddavutapally
ఉపోద్ఘాతము
‘యోసేపు’ అంటే ‘కలుపుకొను’ లేదా ‘దేవుడు సమృద్ది చేయును’ అని అర్ధం. యోసేపు కన్యమరియమ్మకు జ్ఞానభర్త, యేసుకు సాకుడుతండ్రి. ఇంత గొప్ప వ్యక్తిని మనం ఎంతవరకు అభినందిస్తున్నాము, గౌరవిస్తున్నాము? యోసేపుగురించి బైబులులో చాలా తక్కువగా పేర్కొనడం వలన, మనం ఆయన గురించి చాలా తక్కువ శ్రద్ధను చూపుతూ ఉంటాము. ఆయనపట్ల భక్తిని పెంపొందించుట చాలా అరుదు! పవిత్ర కుటుంబములో మరచిపోబడినవారు! యోసేపు, మరియలను మనం ఒక జంటగా గుర్తించాలి. గతములో, అనేక చిత్రపఠాలలో, యోసేపును వృద్దునిగా చిత్రీకరించడం జరిగింది. బహుశా, మరియ కన్యత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్ల కూడదని అయుండవచ్చు! కాని ఇది వారి ప్రేమపూర్వక బంధాన్ని తక్కువ చేసినట్లయినది. పునీత అవిలా తెరెసా యోసేపు యువకుడేనని నొక్కిచెప్పినది. భర్త ప్రేమతో యోసేపు కన్యతల్లియైన మరియను ఎంతగానో ఆదరించాడు అని నేడు దివ్యపూజలో స్మరించుకుంటున్నాము. 1962వ సం.లోనే 23వ జాన్ జగద్గురువులు, యోసేపు నామమును రోమీయ క్రమములో (ప్రస్తుత కృతజ్ఞతార్చన ప్రార్ధన 1) చేర్చడం గమనార్హం! నేడు ఇతర కృతజ్ఞతార్చన ప్రార్ధనలలో కూడా స్మరించుకుంటున్నాము. యోసేపు మరియభర్త కనుక, యేసునకు తండ్రి! బాలయేసు దేవాలయములో తప్పిపోయినప్పుడు, మరియ యేసుతో, “నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి” (లూకా 2:48) అని చెప్పినది. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుటకు” (లూకా 2:52) యోసేపు కృషి ఎనలేనిది! యూదసంప్రదాయములో ఐదు సం.లు నిండిన పిల్లలు, తండ్రుల ప్రత్యేకమైన సంరక్షణలో ఉండేవారు. యోసేపు యూదమత విశ్వాసాన్ని, బోధనలను యేసుకు బోధించాడనడములో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు! యోసేపు తన కుటుంబాన్ని దేవుని మార్గములో నడిపించాడు. యేసుకు ప్రాయము వచ్చినప్పుడు, యోసేపే యేసును యూద ప్రార్ధనా మందిరమునకు (సినగోగు) పరిచయం చేసియుంటాడు. యోసేపు వండ్రంగి, కనుక వండ్రంగి పని నైపుణ్యాలను కూడా యేసునకు నేర్పియుంటాడు. “మీలో ఏ తండ్రియైన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా” (లూకా 11:11-12) అని చెప్పినప్పుడు యోసేపు ప్రేమ, ఆప్యాయతలు యేసు మదిలో మెదిలి ఉంటాయి! “తప్పిపోయిన కుమారుడు” (లూకా 15) ఉపమానం చెప్పినప్పుడు, యోసేపు తండ్రి ప్రేమను యేసు గుర్తుకు చేసుకొని యుంటారు!

పండగ ఆవిర్భావం-యోసేపుపట్ల గౌరవం
యోసేపునకు సంబంధించిన పండుగ ఐదవ శతాబ్దములో ‘కోప్టిక్ దైవార్చన కాలెండరు’లో మొదటిసారిగా ప్రస్తావించ బడినది. 800లలో మొదటిసారిగా ఫ్రెంచ్ కాలెండరులో కనిపిస్తుంది. అనేక శతాబ్దాలుగా యోసేపునకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. 16వ శతాబ్ధములోనే అతని ఆరాధనకు అధికారిక ప్రోత్సాహం ఇవ్వబడినది. ఆధునిక కాలములో అత్యంత ప్రజాదరణ పొందిన పునీతులలో యోసేపు ఒకరు.

మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవమును 9వ భక్తినాధ జగద్గురువులు 1847లో ప్రారంభించారు. క్రీ.శ. 1869-70లో జరిగిన ప్రధమ వాటికన్ మహాసభలో, 9వ భక్తినాధ జగద్గురువులు పునీత యోసేపుగారిని “విశ్వశ్రీసభ పాలక పోషకుడు”గా ప్రకటించారు. అలాగే, శ్రీసభ “ఆస్తిపాస్తులకు సంరక్షకులు”గా ప్రకటించారు. క్రీ.శ. 1955లో 12వ భక్తినాధ జగద్గురువులు యోసేపుగారిని “కార్మికుల పాలకుడు”గా గౌరవించారు. మంచి మరణాన్ని కోరుకునే వారందరూ పునీత యోసేపుగారిని ప్రత్యేకంగా ప్రార్ధిస్తారు. 1989లో రెండవ జాన్ పౌలు జగద్గురువు యోసేపు “రక్షకుని సంరక్షుకుడు” అని గౌరవించారు. “యోసేపుద్వారా మరియ వద్దకు, మరియద్వారా, పవిత్రతకు ఊటయైన యేసు వద్దకు మనం నడిపించ బడుచున్నాము” అని 15వ బెనెడిక్ట్ జగద్గురువులు యోసేపు పట్ల భక్తిని వెల్లడించారు. “కొంత మంది పునీతులు వాళ్ళ ప్రత్యేక కార్యసాధకతతో కొన్ని అవసరాల్లో మాత్రమే వారి సహకారాన్ని మనకందిస్తారు. కాని, మన పవిత్ర పాలకులైన యోసేపు ప్రతీ అవసరంలోను, ప్రతీ పనిలోను, ప్రతీ సందర్భములోను మనకు సహాయం చేసే శక్తి కలిగియున్నారు’ అని పునీత థామస్‌ అక్వినాస్‌ కొనియాడారు. “పునీత యోసేపుగారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండా లేను. దీనిని నమ్మనివారు పరీక్షించుకోవచ్చును. ఆ పరమపితా పితృని గౌరవించుట ఎంతో మేలని తెలుసుకొందురు” అని పునీత తెరేసమ్మ వెల్లడి చేసారు.

యోసేపు జ్ఞానభర్త, సాకుడు తండ్రి
యోసేపు బెత్లేహేములో జన్మించారు. యోసేపుకు చాలా పెద్దవయస్సు ఉన్నప్పుడు కన్యమరియతో ప్రధానం జరిగిందని తెలుస్తుంది. అప్పటికి మరియ వయస్సు 14 సం.లు ఉండవచ్చు. గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మరియమ్మగారికి అందించక మునుపే ఈ నిశ్చితార్ధం జరిగింది. “దేవుడు యోసేపును కన్య మరియకు జీవిత భాగస్వామిగా ఒసగాడు. మరియకు తోడుగా, ఆమె కన్యత్వమునకు సాక్షిగా, ఆమె గౌరవానికి సంరక్షకునిగా నిలిచాడు” 13వ సింహరాయ జగద్గురువులు పేర్కొన్నారు. యేసుక్రీస్తు సువార్త ప్రచారం ఆరంభించక మునుపే, నజరేతు గ్రామంలో క్రీ.శ. 20లో యేసు, మరియ హస్తాలలో తమ వయోభారంతో పరిశుద్దమైన సహజ మరణం పొందారు.

యోసేపు బాధ్యతగల జ్ఞానభర్తగా, మంచి సాకుడు తండ్రిగా అత్యుత్తమ బాధ్యతాయుతముగా, లోకరక్షకునికే సంరక్షకుడుగా యున్నారని సువార్తలద్వారా గ్రహించగలుగుతున్నాము. మత్త 1:17 ప్రకారం, యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహామునుండి దావీదు వంశం వరకు యోసేపు ముందు తరాల పేర్లు ఇవ్వబడినవి. అయితే యోసేపు మరియతో వివాహానికి నిశ్చితార్ధం జరిగాక, వారు సంసారపక్షంగా కాపురం చేయకముందే మరియమ్మ గర్భవతి కావడం యోసేపును ఎంతగానో కలచివేసింది. మరియమ్మను నొప్పింపక, అవమానింపక, రహస్యంగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్లు మత్త 1:19లో చెప్పబడినది. ఇక్కడ యోసేపు గంభీర వ్యక్తిత్వం, ఘర్షణ ధోరణిలేని సాధుత్వం, పుట్టుకతో వచ్చిన సహజమైన పాపభీతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పిమ్మట ప్రభువుదూత మాటప్రకారం మారుమాటలాడక మరియను చేర్చుకున్నారు. ఇక్కడే వారు తమ బాధ్యత, విధేయత, పరిశుద్దతకు పూర్తిగా లోబడి దైవాజ్ఞలను తు.చ. తప్పక పాటించారు. ఇదే వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత.

మనుష్యావతారమెత్తిన యేసుక్రీస్తుకు, మరియమాతకు సంరక్షకుడుగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా యోసేపు గురించి సువార్తలు వెల్లడిస్తున్నాయి. కాని, యోసేపుమాత్రం సువార్తల్లో ఎక్కడా ఒకమాటైనా మాట్లాడినట్లు లేదు. వారి ప్రవర్తన, చేసేపనిని నిర్వర్తించడంబట్టి దైవాదేశానుసారముగా జీవించాడని ఖచ్చితముగా చెప్పవచ్చు. గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శ్రమైకజీవితం, బాధ్యతాపాలన, వివేకం, వివేచనం, మితవ్యయం, మితభాషిత్వం, తననుతాను తగ్గించుకొనడం, దయ, దానధర్మగుణం, ఆపదలోనున్న వారిని ఆదుకోవడం, నిగర్వం, నిశ్చలత, నిరాడంబరత్వం ఇలా మంచి గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహా మనిషి!

యోసేపు సుగుణాలు
నీతిమంతుడు
పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, శ్రీసభకు రాసిన లేఖలో (రెడెంప్తోరిస్ కుస్తోస్ 1989), పునీత యోసేపుగూర్చి, “లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు అంటే అతడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, సాధుశీలుడు, వినమ్రహృదయుడు. నిర్మలత్వం, నిష్కపటత్వము మొదలైన సుగుణాలతో కూడిన వ్యక్తిత్వం కలవారు” అని ప్రశంసించారు. వాస్తవానికి నీతిమంతుడు - ప్రార్ధనాపరుడు, విశ్వాసములో జీవించేవాడు. మత్త 1:19లో, యోసేపు “నీతిమంతుడు” అని చదువుచున్నాము. యోసేపు “నీతిమంతుడు” అని పిలవటం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. యూదుల సంప్రదాయాలలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని, కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థాన్ని కొనియాడేవారు. ఈ నిశ్చితార్థం పూర్తయిన కొన్ని నెలల తర్వాత వివాహాన్ని ఆచరించేవారు. లూకా 1:7 ప్రకారం, యోసేపునకు మరియతల్లి ప్రధానము చేయబడింది. ఇక వీరిరువురుకూడా కొన్ని రోజులలో పరిశుద్ధ వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, పవిత్రాత్మ ప్రభావం వలన మరియతల్లి గర్భం దాల్చారు. ఇది దైవ ప్రణాళిక! మోషే ధర్మశాస్త్రం ప్రకారం, వివాహం కాకముందు స్త్రీ గర్భం ధరిస్తే అది పాపం. శిక్షలుకూడా చాలా కఠినంగా ఉంటాయి. ద్వితీ. 22:20-21 ప్రకారం, అలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని చెబుతుంది.

యోసేపు స్థానంలో మరొక మానవమాత్రుడు ఉన్నట్లయితే, ఖచ్చితంగా మరియతల్లిని తీసుకొని వెళ్లి న్యాయంకోసం పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల చేతికి అప్పగించేవాడు. కాని యోసేపు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా అవమానింప ఇష్టంలేక మరియతల్లిని మౌనంగా, రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు (మత్త 1:19). ఎందుకన, ఆయన నీతిమంతుడు. దేవదూత స్వప్నంలో కనిపించి ఇది దైవకార్యం, మరియను విడిచిపెట్టవద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు, దేవుని ప్రణాళికను అర్థంచేసుకొని యోసేపు మరియతల్లికి అన్ని వేళలా తోడుగా ఉన్నారు.

నేడు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే భార్య/భర్తమీద లేనిపోని అనుమానపడేవారు, చిన్నచిన్న మనస్పర్ధలకు విడాకులు తీసుకొని కుటుంబాలను చేజేతులారా నాశనం చేసుకునేవారు కోకొల్లలు! అట్టివారు ఓసారి యోసేపుగారిని స్మరించుకుంటే మంచిది. యోసేపు, మరియతల్లి వీరిరువురుకూడా కాపురం చేయకముందే మరియతల్లి గర్భం దాల్చారు. ఆ క్షణంలో మరియమ్మను యోసేపుగారు బహిరంగంగా జనంమధ్య అవమానించ లేదు, దానికి బదులుగా, మౌనంగా రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు. కాని దూతద్వారా ఇది దైవకార్యం, పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యం అని తెలుసుకొని మరియతల్లికి అండగా ఉన్నారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో యోసేపుగారి మంచి మనసును బట్టి దేవుడు ఆయనను నీతిమంతునిగా సత్కరించారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. నీతిమంతుడు అనగా, నీతిగా, న్యాయముగా జీవించేవాడు, సత్ప్రవర్తన కలిగి యుండేవాడు, ధర్మాత్ముడు అని అర్ధం. కనుక ఇదొక గొప్ప సుగుణం.

దైవభక్తిపరుడు
దైవభక్తిగల వారిలో ఐదు సుగుణాలు ఖచ్చితముగా ఉంటాయి:
1. దేవున్ని నమ్ముతారు: అనగా అందరికన్నా, అన్నింటికన్నా దేవునికి ప్రధానస్థానం ఇవ్వడం. దేవునిపై ఆధారపడి జీవించడం. దేవునికన్న, ఇతర విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. దైవభక్తిగల తండ్రి తన కుమారున్ని దేవునివైపుకు నడిపిస్తాడు. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుచు, దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుట” (లూకా 2:52) యోసేపుగారు చూసారు. కష్టతరమైనవి ఎన్నో యోసేపుగారు చేయగలిగారు, ఎందుకన, ఆయన దేవున్ని నమ్మాడు, విధేయించాడు. దేవునిపై నమ్మకముంచడం అనగా, మన భయాలలో, బలహీనతలలోకూడా ముందుకు వెళ్ళగలము అని విశ్వసించడం.
2. దేవుని వాక్యాన్ని ఎరిగినవారై ఉంటారు: దేవునియొక్క వాక్యమును హృదయమున నిలుపు కొంటాడు (కీర్త 119:11). దైవభక్తిగల భర్త, తండ్రికి దేవునివాక్యం తప్పక తెలిసియుంటుంది. యోసేపు దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా ఎరిగినవారు.
3. ఎల్లప్పుడూ ప్రార్ధన చేస్తారు: మత్తయి 6:5-15లో, యేసు తన శిష్యులకు ప్రార్ధన చేయడం నేర్పించాడు. దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్ధన చేస్తాడు. యోసేపుగారు దేవుని చిత్తాన్ని అక్షరాల పాటించాడు.
4. బంధాలను నిర్మిస్తారు: ఆపదలలో, కష్టసమయాలలో, కుటుంబాలను నిలబెడతాడు. పునీత జోజప్పగారు అక్షరాల అలాగే చేసారు. తిరుకుటుంబాన్ని నిలబెట్టారు, నిర్మించారు.
5. ఇతరులకు సేవ చేస్తారు: హృదయపూర్వకముగా సేవ చేయుటం. యోసేపు గొప్పతనం ఏమిటంటే, ఆయన మరియతల్లి భర్తగా, యేసుకు తండ్రిగా, రక్షణ ప్రణాళికలో తన సేవను హృదయపూర్వకముగా, సంపూర్ణముగా అందించాడు. ఆయన సేవ త్యాగపూరితమైనది. తిరుకుటుంబానికి తన జీవిత సర్వాన్ని త్యాగం చేసాడు. తన ప్రేమను తన సేవలో పరిపూర్ణం గావించాడు. విశ్వాసముద్వారా నీతిమంతుడు జీవిస్తాడు (రోమీ 1:17).

కష్టజీవి
మత్త 1:1-16 ప్రకారం, యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలుసు. యోసేపు ఈ పేరుప్రఖ్యాతులను ఉపయోగించి ఏవైనా చేయవచ్చు. కాని ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తినే కుటుంబ పోషణకై ఎంచుకున్నాడు. ఈ వడ్రంగి వృత్తిలోనే మంచి ప్రావీణ్యతను, గుర్తింపును సంపాదించుకున్నాడు (మత్త 13:55). ‘పని చేయడం’ అనేది రక్షణ ప్రణాళికలో భాగస్తులగుటకు ఓ చక్కటి మార్గం. మనకున్న వరాలద్వారా సమాజములో ఇతరుల సేవనిమిత్తమై ఉపయోగించే బాగ్యం లభిస్తుంది. పనిచేయడం దేవుని ప్రణాళికలో భాగం. ఏ పనైనను మానవ గౌరవార్ధమై యుండాలి.

సంరక్షకుడు / ప్రేమగల తండ్రి
తన స్వప్నంలో దేవదూతద్వారా దేవుని ఆదేశాలను స్వీకరించి, హేరోదు రాజుయొక్క దుష్టతలంపులనుండి బాల యేసును కాపాడారు. ఒక గాడిద సహాయముతో తాను నడుస్తూ మరియతల్లిని, బాలయేసును సురక్షిత ప్రాంతానికి చేర్చి శత్రువుల బారినుండి తల్లిని, బిడ్డని కాపాడారు (మత్త 2:13-15). అదేవిధముగా, బాలయేసు 12 ఏళ్ళ ప్రాయంలో యెరుషలేములో తప్పిపోయినప్పుడు తల్లడిల్లిపోయి, మూడు రోజులపాటు నిద్రాహారాలు మానేసి వెతికి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా క్రీస్తుకు తోడుగా ఉన్నారు. యోసేపు నిజమైన తండ్రి, నిజమైన సంరక్షకుడు. మరియతల్లి, యేసు కొరకు ఆయన సర్వం ప్రేమతో, ఆప్యాయముతో చేసాడు. యోసేపు బాలయేసుకు సర్వం చేసారు. ప్రతీ క్షణం వెన్నంటి ఉన్నారు.

ప్రార్థనాపరుడు
యోసేపు మంచి ప్రార్థనాపరుడు. మోషే ధర్మశాస్త్రాన్ని, పది ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించాడు. దేవుని ఆదేశానుసారం ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి దేవదూత ముందుగా సూచించినట్లు ఆ బిడ్డకు “యేసు” అని పేరు పెట్టారు (లూకా 2:21). మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించి, పాటించి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడియున్నట్లు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారు (లూకా 2:22-24). సాధారణంగా కలలను ఎవరూ పట్టించుకోరు. కాని యోసేపు మాత్రం తన స్వప్నంలో దేవునిద్వారా దూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని త్రికరణశుద్ధిగా ఆలకించి, పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు (మత్త 1:19-24; 2:13-15; 2:19-23). పరిశుద్ధ గ్రంథంలో యోసేపు నోరుతెరిచి మాట్లాడిన ఒక్క సందర్భంకూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఆయన దేవునిపట్ల ప్రేమను, తన విశ్వాసాన్ని మాటల్లోగాక, తన చేతల్లో నిరూపించారు.

మంచి మరణం
పునీత యోసేపు దేవుని పిలుపును అందుకున్నాడు. మరియతల్లికి భర్తగా, దైవకుమారునికి తండ్రిగా పిలుపును అందుకున్నాడు. తన పిలుపును సంపూర్ణ విశ్వసనీయతతో పరిపూర్తి చేసాడు. ఆతరువాత దేవుడు యోసేపును తన సన్నిధిలోనికి పిలచుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, క్రీస్తు, మరియతల్లి సన్నిధిలో, ఒడిలో భాగ్యమైన మరణాన్ని పొందారు. తిరుసభ పాలకుడిగా, మంచి మరణాన్ని ప్రసాదించు పునీతుడిగా వినతికెక్కారు.

ముగింపు
యేసు, మరియ, యోసేపులు తిరుకుటుంబము! లోకరక్షణార్ధమై దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసారు. రక్షణ చరిత్రలో వారు ఒకటిగా నిలిచారు. ముగ్గురుకూడా విడదీయలేనటువంటి వారు. దేవుని ప్రణాళికలో, వారి వ్యక్తిగత గుర్తింపులు ఒకరితోనొకరికి సంబంధాన్ని కలిగియున్నాయి. కనుక, వారి ముగ్గురిని విడివిడిగా చూడక, ఎప్పుడు ఒకటిగానే చూడాలి, ఒకటిగానే అర్ధంచేసుకోవాలి! యోసేపును ఎప్పటికీ మరువరాదు! ఆయన మరియ యేసులకు ఏమిచేసాడో, మనకూ, విశ్వశ్రీసభకూ చేయగలడు!

యోసేపు దేవుని చిత్తానికి పరిపూర్ణముగా తలొగ్గాడు. దైవపిలుపుకు, బాధ్యతకు, త్యాగానికి ప్రతిస్పదించి, దైవప్రణాళికకు సహకరించాడు. తన జీవిత సర్వాన్ని దేవుని చేతులో అప్పజెప్పాడు. అతను ఎందుకు మౌనముగా ఉన్నాడంటే, దేవుని మాటను ఎక్కువగా ఆలకించాడు గనుక! ఎప్పడూ వాదించలేదు; వెనకడుగు వేయలేదు; అభ్యంతరం చెప్పలేదు; వివరణలు అడగలేదు; దేవుని ఆజ్ఞలను ఎప్పుడూ ప్రశ్నించలేదు, దేనిని నిలువరించలేదు. దేవుని ప్రణాళికను మౌనముగా, శాంతియుతముగా నేరవేర్చడములోనే గర్వపడ్డాడు. మౌనములోనే, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

యోసేపు మౌనజీవిత సందేశం – ఇష్టపూర్వక విధేయత, సేవ! సంకల్పం, సేవయే యోసేపు జీవిత రహస్యం. ఇదే మనకు ఆయన జీవిత సందేశం!
అందరికీ, మరియ భర్తయగు పునీత యోసేపుగారి పండుగ శుభాకాంక్షలు!

No comments:

Post a Comment