మంగళవార్త పండుగ 25 మార్చి

మంగళవార్త పండుగ 25 మార్చి

ఇశ్రాయేలు ప్రజలు మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తాడని, తమను రక్షిస్తాడని వారు ఆశించారు. క్రీస్తు వచ్చినప్పుడు లోక రక్షకుడు ఆయనేనని గుర్తించ లేకపోయారు. విశ్వసించ లేకపోయారు. ‘‘దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటను ఆకించును’’ (యోహాను 8:47).

ఇప్పుడు, పతనమైన మానవాళిని రక్షించి, తిరిగి మోక్షద్వారం విప్పి, దైవ ప్రణాళిక చొప్పున తన బిడ్డలమైన నరులను తన చెంతకు చేర్చుకొనే నిమిత్తం. వేదాలలో ప్రవక్తలు పల్కిన పలుకులు నెరవేర్చుటకు యావే ప్రభువు పూనుకున్నారు. సమయం పరిపక్వం కాగా తదుపరి ఆరవ మాసమున దేవుడు దావీదు వంశస్తుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన గలిలయ సీమలోని నజరేతు గ్రామంలో నివసిస్తున్న మరియ అనబడు కన్యక వద్దకు తన దేవదూతను పంపించారు. మరియమ్మ నిష్కళంకమైనదిగా, జన్మపాపము సోకని పవిత్రగా దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నారు. మంచి పనికి మంచి మార్గం ఎన్నుకోవడం దేవుని నైజం. గాబ్రియేలు మరియ చెంత వినమ్రతతో దర్శనమై ‘‘అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. దేవుడు నీకు తోడై ఉన్నాడు’’ అన్న మాటతో మరియ పరవశించినది. సాక్ష్యాత్తు దేవుడే తన దూతలద్వారా వర్తమానం పంపడం ఆమె పవిత్రతకు, సౌశీల్యతకు తార్కాణం.

కాని, అంతలో, ‘‘నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు’’ అని అన్నప్పుడు ఆమె కలవర పడినది. ఆ శుభ వచనం ఏమిటోయని ఆలోచించు చుండగా, దేవదూత, ‘‘మరియమ్మా! నీవు భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు ‘‘యేసు’’ అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువ బడును. ప్రభువగు దేవుడు తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన ద్వారా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు’’ అనెను.

అంతట మరియమ్మ ‘‘నేను పురుషున్ని ఎరుగను కదా! ఇది ఎట్లు సాధ్యమగును?’’ అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, ‘‘పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్నావరించును. అందుచేత, ఆ పవిత్ర శిశువు ‘‘దేవుని కుమారుడు అని పిలువ బడును’’ అని అనెను.

అందుకు ఆ కన్యామణి ఇలా జవాబిచ్చినది, ‘‘ఇదిగో ప్రభువు దాసిరాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!’’ అని ఆధారుడైన ఆ ప్రభువునకు విధేయించినది. తననుతాను దేవునికి పునరంకితం చేసుకున్నది. ఆ క్షణమే క్రీస్తు శకానికి శుభారంభం అయినది. విర్రవీగే సాతానుకు విరుగుడు మందు వేసాడు ప్రభువు. నిజమైన దేవుడుగా నిజమైన నరుడుగా దైవరాజ్యం అయిన ప్రభువు నవమాసాల్లో తొలిక్షణం మరియ పరిశుద్ధ గర్భంలో అంకురించాడు. ఆ క్షణమే ఆమె దేవుని తల్లిగా మారింది. మొదటి క్రైస్తవురాలిగా ఆవిర్భవించినది.

మరియతల్లి దేవదూత మాటకు, ‘‘అట్లే అగునుగాక!’’ అంటూ ధీశాలిగా నిలబడిరది. ఆమె సహృదయం, ఉదారస్వభావం, త్యాగమయ జీవితంలో దేవాధి దేవుడు తనతో వాసమై, అంచెలంచెలుగా ఎదిగి విశ్వజ్యోతిగా ఈలోకంలో ఉదయించ డానికి తన సంపూర్ణ సహకారాన్ని అందించినది.

ఆమె జీవితం పవిత్రతకు నిలయం. తత్ఫలితముగానే తాను తండ్రికి ప్రియమైన బిడ్డగా కుమారునికి తల్లిగా, పరిశుద్ధాత్మ పత్నిగా ఎంపిక చేయబడినది. వినయ విధేయతకు ఆదర్శం ఆమె అనుదిన జీవితం. తండ్రి ఆజ్ఞకు లోబడి, కన్న కొడుకును సహితం త్యాగం చేయడానికి సిద్ధపడినది. ప్రభువు పడే శ్రమను చూస్తూ ఊరకుండి పోయింది. ఆమె ఔదార్యం, వినయం ఎంతో శ్లాఘనీయమైనది. రక్షణ చరిత్రలో తనవంతు పాత్ర సంపూర్ణముగా నిర్వహించినది. మరియ మనందరి అమ్మ. అమ్మను ఆశ్రయిద్దాం. దీవెను పొందుదాం.

ఇదంతా దేవుని అపారమైన ప్రేమకు, కరుణకు, తార్కాణం. అందుకే పునీత బెర్నర్దీను గారు, ‘‘దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యన్నత స్థానం, మరియను తన తల్లిగా ఎంపిక చేసుకోవడమే’’ అని చెప్పారు. ‘‘మరియ దేవుని తల్లి కాకపోయినచో ప్రభువుతో ఐఖ్యమై ఉండేది కాదు’’ అని వేద పండితుడు అయిన పునీత ఆల్బర్టు ఘనుడు నుడివారు.

మరియమాత ఒకసారి పునీత జెత్రూతమ్మకు కలలో కనిపించి, ‘‘ఇదిగో! ప్రభువు దాసిరాలను అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను. నేను దేవుని తల్లినని నా పేరిట వేడుకున్న ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను’’ అని వాగ్దానం చేసారు.

No comments:

Post a Comment