పునీత మదర్ థెరెసా (5 సెప్టెంబరు)

పునీత మదర్ థెరెసా (5 సెప్టెంబరు)


“పేదసాదలను సానుభూతితో చూడుము. దైవాజ్ఞలమీది గౌరవముచే పేదలకు సాయము చేయుము” (సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 29:8-9).

“దయకు, శాంతికి అర్ధాన్నిచ్చి, రోగులకు, అనాధలకు, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు విడిచిపెట్టిన అనాధ పసికందులకు, వృద్ధులకు, ఆశ్రయాన్ని కల్పించి, తన జీవితాన్ని అంకితం చేసుకున్న దైవ సేవకురాలు,” పునీత మదర్ థెరిస్సా గారు!

“దేవుని చేయిలో నేనొక చిన్న పెన్సిల్‌ ముక్కను. వ్రాసేవాడు ఆయనే. ఆలోచించేవాడు ఆయనే. నడిపించేవాడు ఆయనే. నేను చేయాల్సిందంతా ఒక చిన్న పెన్సిల్‌ ముక్కగా ఉండటమే” అని పునీత కలకత్తాపురి మదర్ థెరెసా గారు చెప్పారు.

“శాంతి దూత, కరుణామయి, అనాధలకు, దిక్కులేని వారికి అమ్మ, పేదల పాలిట దయగలిగిన తల్లి” పునీత మదర్ థెరిస్సా గారు!

సేవయే ప్రధానం, సేవయే ఊపిరి, సేవయే ధ్యేయంగా, దేవునికి అత్యంత ఇష్టమైన ఆజ్ఞను ఆమె స్వీకరించింది. పేదసాధలను సానుభూతితో ఆదరించి, ప్రేమించి, చేరువచేసుకుంది. మురికివాడలలో, పేదలకు సహాయం చేసింది. తన చేతులతో సేవ చేసింది. తన ఊపిరి ఉన్నంతవరకూ, సేవే దైవాజ్ఞగా, దేవుని వాక్కును పూర్వకముగా స్వీకరించి, దేవుని ఆజ్ఞను పాటించి, నెరవేర్చింది.

మదర్ థెరెసా 26 ఆగష్టు 1910వ సం.లో అల్బేనియాలో జన్మించారు. అసలు పేరు ఆగ్నేస్‌. అయితే, ప్రపంచ వ్యాప్తముగా ‘మదర్‌థెరిస్సా’గా పేరు గాంచారు. ఆమె కతోలిక కుటుంబంలో పెరిగారు. పన్నెండేళ్ల వయస్సులోనే ఆమె దేవుని పిలుపును బలంగా అనుభూతి చెందారు. క్రీస్తు ప్రేమను వ్యాప్తి చేసే మిషనరీ కావాలని ఆమె నిశ్చయించుకున్నారు. పద్దెనిమిదేళ్ల వయస్సులో, 1928వ సం.లో ఐర్లండు దేశములోని లొరెటొ మఠకన్యల సభలో చేరి మేరి థెరిస్సాగా పేరును మార్చుకున్నారు.

మానవత్వానికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాడిన ఆమె జీవితం ప్రపంచానికి ఒక గొప్ప ప్రేరణ. 1929వ సం.లో భారతదేశానికి వచ్చి, ముఖ్యంగా కలకత్తాలో (ప్రస్తుత కోల్‌కతా), 87 సం.లు సుదీర్ఘముగా నిస్సహాయులైన ప్రజలకు సేవ చేయడంలో తన జీవితాన్ని సంపూర్ణముగా అంకితం చేసుకున్నారు. 1931 నుండి 1948 వరకు ఆమె కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసారు. 1944లో ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు.

1946వ సం.లో, ఆమె జీవితంలో ఒక కీలకమైన మలుపు సంభవించింది. కోల్‌కతా నుండి డార్జిలింగ్‌కు రైలు ప్రయాణం చేస్తుండగా, ఆమె అంతర్గత ఆత్మప్రబోధం నుండి ఒక సందేశాన్ని స్వీకరించారు, దీనిని ఆమె, కాల్ వితిన్ ఎ కాల్, పిలుపులో ఒక పిలుపు అని అభివర్ణించారు. ఆమెక పొందుకున్న సందేశం ఏమిటంటే, కలకత్తాలోని మురికివాడలలోని అత్యంత నిరుపేదలకు సేవ చేయాలని ఆదేశం.

ఈ అంతర్గత సందేశంపై స్పందిస్తూ, మదర్ థెరెసా 1948లో కాన్వెంట్‌ను విడిచిపెట్టడానికి అనుమతి పొంది, మురికివాడల్లో పని చేయడం ప్రారంభించారు. మదర్ థెరెసా తన పిలుపునకు ప్రతిస్పందనగా, 7 అక్టోబర్‌ 1950వ సం.లో, ‘మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ, అను సభను స్థాపించారు. ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం, నిస్సహాయులు, రోగులు, అనాథలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడం. ప్రారంభంలో వారు ఒక్కరే సేవను మొదలు పెట్టినా, క్రమంగా చాలామంది యువతులు మదర్ థెరెసాతో కలిసి సేవలో పాలుపంచుకున్నారు. ఈ సభ ద్వారా ఎంతో మందికి ఆశ్రయం, వైద్యం, ఆహారం లభించాయి.

1952వ సం.లో, హోమ్ ఫర్ ది డయింగ్”, “నిర్మల్ హృదయ్”ను స్థాపించారు. మరణం అంచున ఉన్న వారికి ప్రశాంతమైన మరణాన్ని పొందేలా చూసారు. ఆ తరువాత 1955లో “శిశు భవన్” అనే అనాథాశ్రమాలను, 1957లో “శాంతి నగర్” అనే కుష్టు వ్యాధిగ్రస్తుల కాలనీని స్థాపించారు.

2012 నాటికే ఈ సభ దాదాపు, 133 దేశాలలో వ్యాపించి, 4500కు పైగా సభ్యులు, వివిధ రకాలుగా సేవలను అందిస్తూ, పునీత మదర్‌ థెరిస్సా ఆశలను సజీవముగా ఉంచుతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మదర్ థెరెసాగారు దీనతకు, వినమ్రతకు, సేవకు ఒక రూపం. అవే సుగుణాలు ఆమెను ప్రపంచ తారను చేశాయి. అటువంటి విలువైన సుగుణాలను కలిగి జీవించిన ఆమె జీవితాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి.

మదర్ థెరెసా జీవితం అనేక విశేషమైన సుగుణాలకు ఒక ఉదాహరణ. అవి ఆమె లోతైన ఆధ్యాత్మిక విశ్వాసాల నుండి ఉద్భవించాయి. ఆమె ఏవిధంగా వినయం, సేవాభావం కలిగి జీవించిందో తెలుసుకుందాం.

1.       మదర్ థెరెసా వినయం:

“వినయం అన్ని సుగుణాలకు మాతృమూర్తిసంరక్షకురాలు’. దీనత్వము కలిగి ప్రవర్తించడం వినయం. వినయము గలవారు తమను తాము తగ్గించుకొని అణుకువ కలిగి జీవిస్తారు. ఎప్పుడు తమ గొప్పను ఇతరుల యెదుట ప్రదర్శించాలని కోరుకోరు. గొప్ప వ్యక్తిత్వము గలవారు వినయం కలిగి జీవిస్తారు. వినయం గలవారు నిరాడంబరంగా జీవిస్తారు. వినమ్రులు గొప్ప ఆశయాలు కలిగి జీవిస్తారు. నిందకుఅవమానాలకు గురియైనావినయం గలవారు సమతుల్యాన్ని పాటించి ఆదర్శంగా జీవిస్తారు. ఇలాంటి విలువైనగొప్పదైన వినయ సుగుణాన్ని తన జీవితంలో రంగరింప జేసుకొనిజీర్ణింప జేసుకొని జీవించి పేద సాధలను అక్కున చేర్చుకున్న అమృత వర్షిణిదయార్ద్ర హృదయిణిపునీత కలకత్తాపురి మదర్ థెరెసా గారు. “నా జీవితములో నెరవేర్చబడిన ప్రతీది దేవుని కార్యమే. నాదంటూ ఏమీ లేదు. నేను దేవుని చేతిలో ఓపెన్సిల్‌ మాత్రమే. వ్రాసేది ఆయనే. దేవుడే ప్రతి కార్యము నా ద్వారా చేస్తున్నారు. నన్ను ఓ సాధనముగా ఉపయోగించు కొనుచున్నారు” అని ఆ అమ్మ తన వినమ్రతను చాటుకొనియున్నది.

ఒకసారి ఒక గురువు ఆమెను మిషనరీస్ ఆఫ్ ఛారిటీ మదర్ జనరల్ కానప్పుడు ఏం చేస్తారు అని అడిగినప్పుడు, ఆమె, నేను కాలువలు, మరుగుదొడ్లను శుభ్రం చేయడంలో ఫస్ట్‌క్లాస్” అని సమాధానమిచ్చారు. ఇది ఆమె నిరాడంబరతకు, ఆమెలోని వినయానికి గొప్ప నిదర్శనం.

పునీత పేతురు గారి మాటలను గుర్తు చేసుకుందాం: “మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింప వలెను. ఏయనదేవుడు అహంకారులను ఎదిరించివినయశీలురను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. ముక్తి సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును” (1 పేతురు 5:5-6).

2.       మదర్ థెరెసా సేవాభావ జీవితం:

యుక్తవయస్సులోనే, సేవ చేయాలనే బలమైన కోరికతో ఆమె 18 ఏళ్ల వయసులో మఠకన్యగా మారారు. కలకత్తాలో ఉపాధ్యాయురాలిగా కొంతకాలం పనిచేశాక, ఆమెకు కలకత్తాలోని మురికివాడల్లో ఉన్న దయనీయమైన పరిస్థితులు, పేదల బాధలు కనిపించాయి. ఈ బాధలు చూసి ఆమె చలించిపోయారు. వారికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

“దేవుని చేతిలో నేను ఒక చిన్న పెన్సిల్‌ లాంటి దానిని. మొద్దుబారి విరిగిన పెన్సిల్‌ నేను. కాని ఆయనే నన్ను తన సేవకు ఉపయోగించు కుంటాడు. తన అవసరం కొద్ది నన్ను పదును చేస్తాడు. అసలు నన్ను నడిపించేది, వ్రాసేది ఆయన హస్తమే. ఆయన చిత్తానికి తల దించుతాను. తన సేవలో నేను తరియించడమే నా భాగ్యం” అని పునీత థెరెసాగారు స్పష్టంగా చెప్పియున్నారు. యెషయా ప్రవక్త పలుకులను గుర్తుకు చేసుకుందాం: “ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాడ్యుని చేసితిని. ఇతడిని ఎన్నుకొంటిని. ఇతని వలన ప్రీతి చెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని” (యెషయ 42:1). ఈ సృష్టిలో మనిషి మహోన్నతుడు. స్వార్ధాన్ని త్యాగం చేసి, సేవాతత్పరతతో పరుల శ్రేయస్సు కొరకు శ్రమించినపుడు మనిషి మహోన్నతుడు అవుతాడు. జగాలు మారినా, యుగాలు గడచినా, నిస్వార్ధ సేవ అందరి నీరాజనాలు పొందుతుంది. సేవ చేయటంలో పొందు ఆనందం ఎంతో గొప్పది. అలుపెరుగక అందించే సేవలు ఆత్మతృప్తిని  కలిగిస్తాయి. ఇతరుల మెప్పుకోసం లేదా ఆర్ధిక ప్రతిఫలం కోసం లేదా పేరు ప్రఖ్యాత కోసం ఒనర్చే సేవలు, స్వంత గొప్పలు చాటుకొనేందుకు, స్వప్రయోజన సాధనాలు అవుతాయి. ఉత్తమమైన సేవలో పరమార్ధం ఉంటుంది. పరుల ప్రీతికోసంగాక దేవుని ప్రసన్నత కోసం సేవలు చేయాలి. అటువంటి మంచి దృక్పధం కలిగి చరిత్రలోప్రజల గుండెల్లో జీవించిన పునీతురాలు మదర్ థెరెసా గారు.

ఒకసారి మదర్ థెరెసా గారు ఇలా అన్నారు“చీకటిని నిందించే బదులుగా ఓ క్రొవ్వొత్తిని వెలిగించు” అని. ఇదే ఆమె జీవితములో జీవితాంతం గుర్తుపెట్టుకొని ఆచరించారు. చీకటిలో బ్రతుకుతున్న జీవితాలకుతన ప్రేమ, సేవ ద్వారా, వెలుగును నింపియున్నారు. ఇదే సందేశాన్ని ఈ నాటికి కూడామదర్ థెరెసాగారు స్థాపించిన మఠకన్య సభద్వారా చాటి చెప్పుచున్నది. జీవించినంత కాలం ప్రతిరోజును దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానంగా భావించి పేదలను, రోగులను, అనాధులనుపసిపిల్లలను ఆదరించి వారికి నిజమైన ప్రేమనుదయనుసేవను అందించిన గొప్ప తల్లి, ప్రేమమూర్తివినయమూర్తిసేవామూర్తి పునీత థెరెసా గారు.

మదర్ థెరెసా యొక్క సేవకు మూలస్తంభం ఆమె యొక్క అచంచలమైన కరుణ.మీరు ప్రజలను తీర్పు తీరిస్తే, వారిని ప్రేమించడానికి మీకు సమయం ఉండదు” అని అనేవారు. ఆమె దారిద్య్రాన్ని కేవలం భౌతికమైన కొరతగా మాత్రమే చూడలేదు, అది ఒంటరితనం మరియు ఆధ్యాత్మిక నిస్సహాయత అని నమ్మేవారు. ఆమె దృష్టిలో “నిరాదరణకు గురవడం, ప్రేమించబడకపోవడం, అందరిచేత మరచిపోబడటం” అనేది తినడానికి ఏమీ లేని వ్యక్తి కంటే చాలా గొప్ప పేదరికం. అందుకే ఆమె తన సేవలను కుష్టు వ్యాధిగ్రస్తులు, హెచ్‌ఐవి/ఎయిడ్స్ రోగులు, మరియు సమాజం నుండి వెలివేయబడిన ఇతర అణగారిన వర్గాల వారికి విస్తరించారు. ఆమె ప్రతి వ్యక్తిలోనూ క్రీస్తును చూశారు. ప్రతి ఒక్కరూ మారువేషంలో ఉన్న యేసు క్రీస్తు” అని ఆమె నమ్మారు.

ఈ ప్రయాణములో ఎన్నో ఇబ్బందులుఅవమానములు, తిస్కారములు, చీదరణలు, దూషణలు ఎదురయ్యాయి. మదర్ థెరెసా జీవితం అనేక సవాళ్లతో నిండి ఉంది. అయిన వాటన్నింటిని ఆమె దేవుని సహాయముతో ధైర్యముగా ఎదుర్కొని యున్నది. ‘మత మార్పిడి’ పేరుతో కొందరు ఆమెను నిందించారు. అందరూ మంచి మనుషులుగా, దేవుని బిడ్డలుగా సమాజములో గౌరవముగా జీవించాలని ఎల్లప్పుడూ ఆమె కోరుకున్నారు, దానినిమిత్తమై ఎంతగానో కృషిచేసియున్నారు. నిధులులేని మురికివాడల్లో తన సేవను ప్రారంభించడం నుండి ప్రపంచవ్యాప్తంగా వందలాది సంస్థలను నిర్మించడం వరకు ఆమె అసాధారణమైన పట్టుదలను ప్రదర్శించారు. ఆమె మాటలలో, దేవుడు మనం విజయం సాధించాలని కోరడు, మనం ప్రయత్నించాలని మాత్రమే కోరుతాడు’ అని చెప్పేది.

‘నీ జీవితములో ఇంత గొప్పగా సాధించడానికి కారణం ఏమిటి’ అని ఓ ఇంటర్వూలో అడిగినప్పుడు, “క్రీస్తు తనను తానుగా జీవముగల అప్పముగా మార్చుకొని మనకు జీవమును ఇచ్చియున్నారు. ఈ పరమ రహస్యాన్ని ప్రతీరోజు ఉదయం దివ్యపూజా బలితో ముగిస్తాము. ఇంత గొప్పగా దేవుని కార్యాలు చేయడానికి కారణం, ప్రతీరోజు నాలుగు గంటలు ప్రార్థన చేయటం” అని ఆమె సమాధానము ఇచ్చియున్నది.

దేవుడు నీకిచ్చిన గొప్పవరం ఏమిటి అని అడుగగా, ఆమె వెంటనే ‘పేద ప్రజలు’ వారిద్వారా నేను 24 గం.లు యేసుక్రీస్తు ప్రభువుతో ఉండే భాగ్యమును పొందియున్నాను అని సమాధానం చెప్పింది.

3.       ప్రపంచవ్యాప్త గుర్తింపు

మదర్ థెరెసా సేవలకు గుర్తింపుగా ఆమెకు అనేక అవార్డులు లభించాయి. 1979లో ఆమెకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ బహుమతిని ఆమె పేదల తరపున స్వీకరించారు. భారతదేశంలో ఆమె సేవలకు గుర్తింపుగా 1980లో భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అయితే, మదర్ థెరెసా కేవలం అవార్డులు, గుర్తింపుల కోసం కాకుండా, మానవత్వం కోసం జీవించారు. ఈ అవార్డులను స్వీకరించినప్పుడు ఆమె ప్రదర్శించిన నిరాడంబరత కూడా ఆమె యొక్క ముఖ్యమైన సుగుణాలలో ఒకటి.

ఆమె 1997లో తన తుది శ్వాసవిడిచారు. 2005వ సం.ము, అక్టోబర్ 19న, రెండవ జాన్ పాల్ జగద్గురువులు ఆమెను పునీతురాలుగా ప్రకటించారు.

ఆమె మరణానంతరం కూడా ఆమె స్థాపించిన సభ మరియు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తన సేవలను కొనసాగిస్తోంది. మదర్ థెరెసా జీవితం ఒక గొప్ప సందేశం. మానవ సేవ, కరుణ, ప్రేమ అనేవి ఏ మతానికి, ఏ ప్రాంతానికి పరిమితం కాదని ఆమె నిరూపించారు. ఆమెను ఈ ప్రపంచం ఎప్పటికీ ఒక గొప్ప మానవతావాదిగా గుర్తుంచుకుంటుంది.

మనంకూడా మదర్ థెరెసా వలె మన దైనందిన జీవితాల్లో ప్రేమ, దయ, సేవాభావంతో జీవిస్తూ, “మీలో గొప్పవానిగా ఉండదచిన, ముందుగా సేవకుడై ఉండవలయును” (మార్కు 10:43) అన్న క్రీస్తు ప్రభువుని పలుకులను పాటిస్తూ జీవించుదాం. తద్వారా, క్రీస్తు ప్రేమను, సేవను ఈలోకానికి అందించుదాం. మనమందరమూ కూడా, పేదల యెడల సానుభూతి చూపిద్దాం. దయ కలిగిన వారముగా కనికరముతో, స్వార్ధము లేకుండా, దాచుకోకుండా, దోచుకోకుండా, మనకు చేతనంత సహాయమును, మన అవసరతలో ఉన్నవారికి అందించుదాం. పునీత మదర్ థెరిస్సా అమ్మ ఆశలను, మనం నెరవేర్చాలి. ఆమె చేపట్టిన తలంపులను, కార్యరూపం దాల్చి, మదర్ థెరెసా ఆశయాలను మన సేవలో బ్రతికించాలి.

ఈనాడు పునీత మదర్ థెరిస్సా గారిని మనము స్మరించుకొంటూ, ఇతరులకు సహాయం చేసే సానుభూతి స్వభావమును, అవసరతలలో ఉన్నవారికి, దిక్కులేని వారికి, సహాయం చేసే చేతులను విప్పులాగున, దైవాజ్ఞలను అనుసరించేలాగునా, మన కొరకు ప్రార్థన చేయమని కోరుదాం. దేవుని వద్ద ‘నిధిని’ దాచుకునే, దయ గలిగిన హృదయాలను మనకు దయచేయమని, పునీత మదర్ థెరిస్సా గారి ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. ఆమెన్.

No comments:

Post a Comment