పాదువాపురి పునీత అంతోని మహోత్సవము: 13 జూన్

పాదువాపురి పునీత అంతోని మహోత్సవము: 13 జూన్

నేడు మనం ‘అద్భుతాల అంతోని పాదువా పురి’ మహోత్సవాన్ని ఘనముగా కొనియాడు చున్నాము. అయితే, అతని అసలు పేరు అంతోని కాదు; అసలు ఊరు పాదువా కాదు. మరి పాదువా పురి’ అంతోనిగా ఎలా మారారో తెలుసుకుందాం. ఆ పుణ్యాత్ముని జీవితాన్ని ధ్యానిద్దాం. ఆయన జీవించిన సువార్త సుగుణాలను మనంకూడా జీవించ ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ అందరికీ అంతోనివారి పండుగ శుభాకాంక్షలు!

పునీత అంతోనివారు క్రీ.శ. 1195 ఆగుష్టు 15, పోర్చుగల్ (అప్పట్లో స్పెయిను దేశములో భాగం)లోని లిస్బన్ నగరంలో, మార్టిన్, తెరెసా దంపతులకు జన్మించారు. పాత లిస్బనులోని కేథీధ్రలునందు (పెద్ద దేవాలయములో) జ్ఞానస్నానము పొంది ఫెర్నాండో అనే పేరుతో నామకరణం చేయబడ్డాడు. అక్కడ జ్ఞానస్నానపు తొట్టిపై ఇలా వ్రాసియుంటుంది: ఇక్కడ పవిత్రమైన బాప్తిజపు జలాలు అంతోనివారిని, జన్మపాపమునునుండి శుభ్రము చేసెను. ప్రపంచము ఆయన కాంతిలోను, పాదువా ఆయన శరీరమందును, పరలోకం ఆయన ఆత్మయందు ఆనందించుచున్నది. 

తండ్రి పోర్చుగల్ రాజైన రెండవ అల్ఫోన్సు కొలువులో రెవెన్యూ అధికారి. చిన్ననాటినుండే క్రైస్తవ విశ్వాసములో, మరియతల్లిపట్ల ప్రత్యేక భక్తితో పెరిగాడు. మంచి ప్రవర్తనతో పెరిగాడు. గ్రామప్రజలు అతనిని ‘చిన్న దేవదూత’ అని పిలిచేవారు. ఫెర్నాండో 15 సం.ల ప్రాయమున లిస్బనులోని, పు. అగుస్తీనువారి మఠములో (Canons Regular of St. Augustine) చేరారు. రెండు సం.ల తర్వాత కోయింబ్రాలోని సాంతక్రూజ్ అగస్తీను ఆశ్రమానికి పంపబడ్డాడు. 9సం.ల పాటు ప్రార్ధనా జీవితం, దైవశాస్త్ర అధ్యయనంద్వారా వేదపండితుడు అయ్యాడు.

ఫెర్నాండోకు 25 సం.ల వయస్సు ఉన్నప్పుడు, అతని జీవితములో గొప్ప మార్పు, అద్భుత సంఘటన జరిగింది. ఇది తన జీవితాన్నే మార్చివేసింది. అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన ఐదుగురు సహోదరులు మొరాకోలో జరిగిన వేదహి౦సలలో చంపబడ్డారు. ముక్కలుగావున్న వారి దేహాలను శవపేటికలో చూచిన తర్వాత, ఫెర్నాండో చలించి తానుకూడా వేదప్రచారకుడిగా, వేదసాక్షి మరణాన్ని పొందాలాని, క్రీస్తు కొరకు తన ప్రాణాలను అర్పించాలనే కోరిక తనలో దహించి వేయగా, పునీత ఆగస్తీనువారి మఠాన్ని విడచి, ఫ్రాన్సిస్ వారి సభలో చేరాడు. 1221 సం.లో ఫ్రాన్సిస్ సభ అంగీని ధరించి, తన పేరును అంతోనిగా మార్చుకున్నాడు. కొన్ని మాసాలలోనే, క్రీస్తు సువార్తను ప్రకటించి, ఇతరులను క్రైస్తవులుగా మార్చి, వేదమరణము పొందాలనే ఆశయముతో మొరోకో ప్రాంతానికి బయలుదేరాడు. అయితే, దేవుని చిత్తము వేరుగా ఉండినది. మార్గమధ్యములో తీవ్ర మలేరియా జ్వరమునకు గురియగు వలన వెనుకకు తిరిగి రావలసి వచ్చింది. దేవుడు తననుండి వేరేరకమైన త్యాగాన్ని కోరుతున్నాడేమోనని గ్రహించాడు. తిరుగు ప్రయాణములో ఉధృతమైన గాలితుఫాను వలన, వారు ప్రయాణించే ఓడ ఇటలీ దేశములోని సిసిలి తీరప్రాంతానికి చేర్చబడింది. అక్కడ ఫ్రాన్సిసు సభ సోదరులు అతనికి సపరిచర్యలు చేయగా, పూర్తిగా కోలుకున్నాడు.

అక్కడనుండి 23 మే 1221వ సం.న అస్సీస్సిపురములో జరిగిన ఫ్రాన్సిసు సభ సర్వసభికుల సమావేశము (great Chapter of Mats)లో పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారిని కలుసుకొన్నారు. పునీత ఫ్రాన్సీసువారి జీవితము, బోధనలు అంతోనివారిని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఫ్రాన్సీసు వారి సభలో చేరిన తర్వాత, అంతోని వారు, తన చదువును, తెలివితేటలను ప్రక్కన పెట్టి, చాలా సాధారణమైన జీవితాన్ని జీవించాడు. ఆశ్రమములో చాల సాధారణ పనులు చేస్తూ ఉండేవాడు. తాను గురువు కనుక, సహోదరులకు ప్రతీరోజు దివ్యపూజను చేసేవారు. ఆతరువాత, వంటగదిలో పాత్రలను కడిగేవాడు. నేలను తుడిచి శుభ్రం చేసేవాడు. ఈ సాధారణ జీవితాన్ని అంతోనివారు ఎంతగానో ఆస్వాదించాడు. మిగతా సమయమంతా దగ్గరలోని గుహలో సుదీర్ఘ ప్రార్ధనలు చేసేవాడు.

1222వ సం.లో, అంతోనివారికి 27 సం.లు ఉన్నప్పుడు, ఫోర్లి అనే ప్రాంతములో ఒకరోజు, అనేకమంది దోమినిక్ సభకు, ఫ్రాన్సీసు సభకు చెందిన మఠవాసులు గురుపట్టమును పొందియున్నారు. ఆరోజు ప్రసంగీకులు రాకపోవడము వలన, ఎవరినైనా ప్రసంగించమని కోరారు. కాని, అంతమంది ఎదుట ప్రసంగించడానికి ఎవరుకూడా ముందుకు రాలేదు. చివరికి అంతోనివారిని కొన్ని మాటలు చెప్పవలసినదిగా ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన ప్రసంగించు చుండగా, అందరి హృదయాలు పరిశుద్దాత్మతో నింపబడ్డాయి. అక్కడ ఉన్న వారందరు వారు ఓ గొప్ప ప్రసంగీకుని మధ్యలో, ఓ గొప్ప వేదాంతి సన్నిధిలో జీవిస్తున్నామని అప్పుడు గుర్తించారు.

పునీత ఫ్రాన్సీసువారు, పని, చదువు, బోధనల కన్న, 'ప్రార్ధన, భక్తి విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు. ఆతరువాత ఫ్రాన్సీసువారి అనుమతితో ఇతర మఠవాసులకు వేదాంత శాస్త్రాన్ని భోదించాడు. ఆయన గొప్ప ప్రసంగీకులు. అనేకచోట్ల, ముఖ్యముగా ఇటలీ, ఫ్రాన్సు దేశములలో విజయవంతముగా సువార్తా ప్రచారము చేయడం జరిగింది. ఈ సమయములో, అంతోనివారు పేరుప్రఖ్యాతలను గాంచాడు. అవిశ్వాసులు, దేవుని వాక్యమును విననప్పుడు, ఆయన అనేక అద్భుతాలనుకూడా చేసేవాడు. ఒకసారి, అద్రియాటిక్ సముద్రము ప్రక్కనే ఉన్న రిమిని అనే పట్టణములో ప్రజలు ఆయనను ఆలకించక పోవడముతో, ప్రక్కనే ఉన్న నీళ్ళవైపుకు తిరిగి చేపలకు ప్రసంగించడం మొదలుపెట్టాడు. చేపలన్నీ కూడా తలలను బయటకు పెట్టి సువార్తను విన్నాయి. అంతోనివారు వాటిని ఆశీర్వదించాకే, నీళ్ళలోకి వెళ్లిపోయాయి.

1227వ సం.లో ఫ్రాన్సిస్ వారి సభ ఇటలీలోని ప్రావిన్స్ కు అధిపతిగా నియమించబడ్డారు. మూడు సంవత్సరాలు 9వ గ్రెగోరి పోపుగారికి రాయబారిగా పనిచేసారు. రాయబారిగా ఇటలీ దేశమంతటా సువార్తా ప్రచారం చేసారు. 1228వ స౦.లో, రోమునగరములో, 9వ గ్రెగోరి పోపుగారి సమక్షములో గురువులకు, ప్రజలకు ప్రసంగించారు. అప్పుడు అంతోనివారిలోని పాండిత్యాని, దైవజ్ఞానాన్ని గుర్తించిన పోపుగారు ఆయనను గూర్చి ఇలా చెప్పారు. అంతోనివారు ఒక బైబిలు ఆయుధాగారం. లోకమున ఉన్న బైబులు గ్రంధాలన్నీ కోల్పోయినను, అంతోనివారు తప్పనిసరిగా తిరిగి వ్రాయగలరు.

ఆ తరువాత, వేదప్రచారము నిమిత్త౦ ఇటలీలోని పాదువాపురిలో నియమించబడ్డారు. అక్కడ అనేకమంది మారుమనసు కలిగేలా ప్రసంగించటమేకాక అనేక అద్భుత కార్యములు చేసి ఎంతో పేరు పొందారు. దేవుని కృపను నమ్ముకోవాలని, దేవుని క్షమాపణను కోరుకోవాలని బోధించాడు. ప్రజలలోనున్న గొడవలను ప్రశాంతముగా పరిష్కరించేవాడు. అనైతిక జీవితాన్ని ప్రజలు వీడేలా చేసాడు. తన ప్రసంగాలను వినడానికి గుంపులు గుంపులుగా వచ్చేవారు. పేదలపట్ల శ్రద్ధ కలిగి యుండేవారు. అవినీతి పనులకు వ్యతిరేకముగా బోధించాడు.

ప్రసంగిస్తూ తన తోటి సహోదరులతో తన స్నేహితుని ఎస్టేటులో ఉండేవారు. అక్కడ ఉండగా అనారోగ్యంతో అంతోనివారు తన మరణము సమీపించినదని తెలుసుకొని అక్కడనుండి పాదువాపురికి కొనిపొమ్మని కోరగా, పాదువాపురి చేరకముందే మార్గమధ్యలోనే అర్చేల్ల అనే స్థలములో, పునీత క్లారమ్మ సభకు చెందిన మఠములో చివరిగా ప్రార్ధన స్తుతి గీతాలు పాడుతూ తన 36వ ఏటనే, 13 జూన్ 1231 సం.లో తుదిశ్వాస విడిచారు.

మరణించి సంవత్సరం పూర్తి కాకముందే అనగా 30 మే 1232వ సం.న, 9వ గ్రెగోరి పోపుగారు, అంతోనివారి పవిత్రతను, పవిత్ర జీవితాన్ని గుర్తిస్తూ పెంతకోస్తు పండుగ రోజున పునీతపట్టం కట్టారు. తన మరణము తరువాత, అద్భుతాల అంతోనివారిగా ప్రసిద్ది గాంచారు.

పునీత అంతోనివారికి నవదిన జపములు, మంగళవార ప్రత్యేక భక్తి

పునీత అంతోనివారి అంత్యక్రియలు మంగళవారం జరిగినందున, మొట్టమొదటిసారిగా అతని మద్యవర్తిత్వం వలన అద్భుతాలు మంగళవారం రోజున జరిగినందున, పాదువాపురి ప్రజలు మంగళవారమును ఆయనకు అంకితం చేసారు. ఆనాటినుండి ఫ్రాన్సీసు వారి సభకు చెందిన దేవాలయములలో అతని గౌరావార్థం మంగళవార భక్తిని ప్రారంభించారు. ఆ తర్వాత అది ప్రపంచం మొత్తం ప్రచారం చేయడం జరిగింది. పునీత అంతోనివారి జీవితచరిత్రను వ్రాసిన జాన్ పేక్ హోంగారు ఈ విముగా వ్రాసారు: ఆ పునీతుని శవపేటికను తాకిన వారందరును వారిభాదల నుండి స్వస్థతను పొందారు.

పునీత అంతోనివారి గౌరవార్ద౦ మంగళవారం నవదిన జపములు చెబుతారు. వరుసగా 9 మంగళవారాలు పునీత అంతోనివారి గుడిని దర్శించి లేదా పునీత అంతోనివారి స్వరూపమున ప్రార్ధనలు చెప్పువారికి, పరిపూర్ణ ఫలము లభించును.

బొలోన నివాసియగు ఒక స్త్రీ బాధలో ఉన్నప్పుడు, పునీత అంతోనివారే స్వయముగా కనిపించి ఇలా చెప్పారు: స్త్రీ! నా సభకు చెందిన ఒక గుడికి 9 మంగళవారాలు ప్రార్ధనలు చేసి, దివ్యపూజాబలిలో పాల్గొని, దివ్యసత్ప్రసాదం స్వీకరించిన, నీ ప్రార్ధనలు నెరవేరును. ఆ స్త్రీ అలాచేసి ఫలితం పొందినది. మనముకూడా పునీత అంతోనివారి యెడల భక్తిని చూపుదము. మన తండ్రియైన దేవునికి మన విన్నపాలను పునీత అంతోనివారి మధ్యస్థ ప్రార్ధనలద్వార తెలుపుదము.

గొప్ప సువార్తా సేవకుడు: దేవున్ని అమితముగా ప్రేమించాడు; అవిశ్రాంతముగా సువార్తా సత్యాన్ని ప్రకటించాడు. ఇటలి మరియు ఫ్రాన్సు దేశాలలో విశ్వాసులను బలపరచాడు. పాపాత్ములను హృదయ పరివర్తన చెందమని పిలుపునిచ్చాడు. అసత్యములో జీవించేవారిని సత్యములోనికి నడిపించాడు. ఈవిధముగా క్రీస్తు సువార్తకు అద్భుతమైన, శక్తివంతమైన సాక్షిగా మారాడు. కేవలం బోధించడమే కాకుండా, బోధించిన దానిని తన అనుదిన జీవితములో పాటిస్తూ అందరికి సుమాత్రుకగా ఉండేవాడు. క్రైస్తవ విశ్వాస సత్యాలను తన ఆదర్శ జీవితముద్వారా సమర్ధించారు. ఇది అంతోనివారిలోని ప్రత్యేకత! “వాక్కు, జీవితముద్వారా, బోధకుడు ఇతరులకు సూర్యునివలె ఉండాలి” అని అంతోనివారు ఒకసారి అన్నారు. “మన బోధన ఇతరుల హృదయాలను రగిలించాలి. మన బోధన వారిని ప్రకాశవంతం చేయాలి.

 అంతోని వారి అద్భుతాలు:

      చేపలకు సువార్తను బోధించడం (గొప్ప సువార్త బోధకులు)
గాడిద దివ్యసత్ప్రసాదమును మొకాలూని ఆరాధించడం (దివ్యసత్ప్రసాదము అత్యంత భక్తి – క్రీస్తు సాన్నిధ్యం)
కుంభ వర్షాన్ని ఆపడం
మరణించిన ఒక వ్యక్తిని సజీవముతో లేపడం
పోయిన రొట్టెల పెట్టె తాళము అంతోని వారు అద్భుత రీతిన తెరచుట; రొట్టెలు పంచుట (అంతోనివారి బ్రెడ్)
అంతోనివారిని చూసి దుష్టాత్మలు భయపడేవి (విశ్వాసము, ప్రార్ధన)
దివ్యవెలుగులో దివ్యబాలయేసు దర్శనం
అంతోని వారి నాలుక అద్భుతరీతిన అలాగే ఉండటం

    దేవుని దయ,మంచితనమును ఎరిగిన వ్యక్తి అంతోనివారు. శక్తివంతమైన ప్రసంగాల ద్వారా, తన జీవితాదర్శము ద్వారా, యేసును అనుసరించుటకు అనేకమందికి ప్రేరణగా నిలిచాడు. అలాగే, మన జీవితాలను కూడా మలుచుకుందాం!

5 comments:

  1. Beautifully worded article on st. Anthony. I learned many things. Thank you fr.

    ReplyDelete
  2. Fr. Praveen, good write up on St. Anthony, God bless👼🙏❤

    ReplyDelete
  3. From Victoria Desmond Fernandes

    ReplyDelete
  4. I congratulate fr. Praveen for your డీప్ reflection on st. Anthony. I share with all . May you like st. Anthony continue to inspire us I pray for your ministry May the lord బీకేస్ you and keep you safe

    ReplyDelete
  5. May the lord jesus bless you and keep you safe.

    ReplyDelete