మరియ వ్యాకుల మాత పండుగ

మరియ వ్యాకుల మాత పండుగ


ఈరోజు మన విశ్వ కతోలిక శ్రీసభ మరియమాత యొక్క "వ్యాకులమాత" పండుగను కొనియాడుతూ ఉన్నది. ముందుగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతవారం మనమంతా కూడా మరియమాత యొక్క జన్మదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో కొనియాడి నాము. ప్రస్తుతం ఈనాడు మరియమాత యొక్క "వ్యాకులమాత" పండుగను కొనియాడుతూ ఉన్నాము. పండుగ సందర్భంగా ఈ పండుగ ద్వారా మరియమాత మనందరికీ ఇస్తున్న సందేశాన్ని గూర్చి ధ్యానం చేద్దాం:

"శోకార్తులు ధన్యులు, వారు ఓదార్ప బడుదురు" (మత్తయి సువార్త 5:4).
మానవ జీవితం సుఖ ,దుఃఖాల కలయిక! అందరూ దేవుడిని కోరుకునేది ఒక్కటే! నాకు మంచి జీవితాన్ని ఇవ్వండి ఎటువంటి శోధనలు నాకు కలుగకుండా కాపాడండి అని! దుఃఖాన్ని ఎవ్వరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే అందులో శోధన ఉంటుంది. కానీ దుఃఖాన్ని కూడా దేవుడిచ్చిన బహుమానంగా స్వీకరించిన గొప్ప తల్లి మన మరియతల్లి.

"అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసిరాలను. నీ మాట చొప్పున నాకు జరుగుగాక!" అనెను. అంతట ఆ దూత వెళ్లిపోయెను (లూకా సువార్త 1:38).
మరియతల్లి "నేను ప్రభువు దాసిరాలను" అని అంటూ ఉన్నారు. ఇదిగో! లోకానికి ఒక మంచి జరగబోతున్నది అది నీ ద్వారానే సాధ్యమవుతుంది. నీ గర్భం, నీ పూర్తి జీవితం నాకు కావాలి. వివాహం కాకముందు నువ్వు పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించాలి అని దేవుడు అడిగినప్పుడు మరియతల్లి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, చివరికి నిశ్చితార్థం జరిగిన భర్తను కుటుంబసభ్యులను కూడా సంప్రదించకుండా ఇది దైవ నిర్ణయం నేను తప్పకుండా నెరవేర్చాలి అని తన యొక్క పూర్తి జీవితాన్ని దేవునికి అర్పించారు. క్రీస్తుకు జన్మనిచ్చారు. సాధారణంగా దేవుని తల్లి అంటే అందరి మనసులో ఆమె గొప్ప మనిషి, ఎటువంటి కష్టాలు ఉండవు, భోగభాగ్యాలు అనుభవిస్తుంది అనే భావన కలిగి ఉంటారు. మరియతల్లి జీవితం దీనికి పూర్తి వ్యతిరేకం. ఆమె దేవునికి తల్లి దేవమాత అయినప్పటికీ మనము ఎవ్వరు అనుభవించని కష్టాలను ఆమె అనుభవించారు. మనము ఎవ్వరు అనుభవించని దుఃఖాన్ని ఆమె అనుభవించారు. కేవలం మన కోసం బాల్యంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, ఒక వయస్సు వచ్చిన తరువాత కట్టుకున్న భర్త జోజప్ప గారిని పోగొట్టుకున్నారు, ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత సిలువ శ్రమల ద్వారా తన యొక్క ప్రియ కుమారుని పోగొట్టుకున్నారు. మన అనుదిన జీవితాలలో ఒక కొద్దిపాటి కష్టం వస్తే భోజనానికి, దేవునికి దూరంగా ఉంటూ ఏడుస్తూ కూర్చుంటాము. దేవునికి దూరంగా వెళ్ళిపోతాము కానీ మరియతల్లి మాత్రం కష్టాలను దుఃఖాన్ని సైతం దేవుడిచ్చిన బహుమానంగా స్వీకరించారు. దుఃఖముతో నిండి ఆ దుఃఖాన్ని దేవుడు తీసివేస్తారు అని విశ్వాసంతో దేవునికి దగ్గరగా జీవించే ప్రతి ఒక్కరికి దేవుడు వెలకట్టలేని ఓదార్పును దయ చేస్తారు అని పరిశుద్ధ గ్రంధం పలుకుతున్నది. అటువంటి గొప్ప ఓదార్పు దేవుడి దగ్గర నుంచి మరియతల్లికి లభించింది. ఆమె జీవించిన విశ్వాస జీవితం, దేవుని పట్ల ప్రేమ, ఆత్మ శరీరాలతో సహా పరలోకమునకు చేరి, తండ్రి చెంతన, కుమారుని చెంతన ఆసీనురాలుగా వెలుగొందే భాగ్యాన్ని తీసుకువచ్చి పెట్టాయి. నేటి కాలంలో, మనకి దుఃఖం, కష్టం వస్తే దేవుడు నుంచి దూరంగా వెళ్లి పోతున్నాము తప్ప దేవునికి దగ్గరగా జీవించడం లేదు.

"నా సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనునప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగ ఎంచుకొనుడు" (యాకోబు వ్రాసిన లేఖ 1:2). "ఎట్లన, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును" (యాకోబు వ్రాసిన లేఖ 1:3).
మన దగ్గర కావాల్సినంత ధనం ,సంపదలు ఉంటే దేవుడిని మర్చిపోతాము కానీ దుఃఖం వస్తే మనం దేవునికి దగ్గరగా జీవిస్తాము, ప్రార్ధనలు చేస్తాము. అందుకే దేవుడు కొన్ని సందర్భాలలో మనకు పరీక్షలు పెడుతూ ఉంటారు. గొప్ప గొప్ప ప్రవక్తలకు సైతం దేవుడు పరీక్షలు పెట్టారు. ఉదాహరణకి అబ్రహామునకు దేవుడు విశ్వాస పరీక్ష పెట్టినప్పుడు, నీ కుమారుడిని నాకు బలి ఇవ్వు అని అడిగినప్పుడు, అబ్రహాము ఏది ఆలోచించకుండా దేవుని ప్రణాళికను నెరవేర్చుట కొరకు తన యొక్క బిడ్డ ప్రాణాలను సైతం ఇవ్వటానికి వెనుకాడలేదు. పై వాక్యం సెలవిస్తోంది, కష్టాలు ,శోధనలు ఉన్నవారు అదృష్టవంతులు అని. కానీ కష్టాలు శోధనలు మనకు వచ్చినప్పుడు మనల్ని మనం దురదృష్టవంతులుగా ఎంచుకుంటూ దేవుడిని విమర్శిస్తున్నాము. మరియతల్లి తన యొక్క దుఃఖాన్ని , కష్టాలను శోధనలను సైతం దేవుడిచ్చిన బహుమానాలుగా స్వీకరించి నీతివంతమైన జీవితాన్ని జీవించారు. నేడు మన తల్లి శ్రీసభ చేత మన చేత ధన్యురాలుగా కీర్తించబడుతున్నారు.

ఈ పండుగ ద్వారా మరియతల్లి మనందరికీ అందిస్తున్న సందేశం:
మరియతల్లి అనుభవించిన 7 దు:ఖ పూరితమైన మరియు బాధతో
కూడిన సంఘటనలను "వ్యాకులమాత"పండుగ ద్వారా మన కతోలిక శ్రీసభ మనందరికీ గుర్తు చేస్తుంది. మరియతల్లి యొక్క హృదయము మీద ఉన్న ఆ ఏడు ఖడ్గములు మరియతల్లి అనుభవించిన బాధలకు నిదర్శనం. మరియతల్లి అనుభవించిన 7 దుఖ పూరితమైన సంఘటనలు:
1.సిమియోను క్రీస్తుప్రభువు యొక్క భవిష్యత్తును, మరియు ఆ భవిష్యత్తులో వచ్చే శ్రమలను గూర్చి చెప్పినప్పుడు.
2.దేవదూత కలలో కనిపించి,"శిశువును చంపుటకు హేరోదు రాజు వెదక బోవుచున్నాడు. కావున నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు అని దేవదూత పునీత జోజప్ప గారికి చెప్పినప్పుడు.
3.యెరూషలేము ఆలయములో ప్రభువు తప్పిపోయినప్పుడు.
4.సిలువ మార్గములో ప్రభువును చూసినప్పుడు.
5.ప్రభువును సిలువ వేసినప్పుడు.
6.ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని సిలువ మీద నుండి దించి మరియతల్లి యొక్క ఒడిలో పెట్టినప్పుడు.
7.ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని భూస్ధాపనము చేసినప్పుడు.

ప్రియమైన మిత్రులారా! మరియతల్లి కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ప్రభువు కొరకు కార్చారు, ఈ లోకము కొరకు కార్చారు. ప్రభువు మరణించిన తరువాత ప్రభువు యొక్క దివ్యమైన శరీరాన్ని ఒడిలో వుంచుకొని ఒక కంటితో ప్రభువు కొరకు ఏడుస్తూ ఇంకో కంటితో ఈ లోకము కొరకు ఆలోచించారు. ఈ సమాజములో ఎవరూ భరించలేని అవమానాలనూ ప్రభువు పేరిట మన కొరకు భరించారు. మన పాపముల కొరకు ప్రభువును త్యాగం చేసిన దయగల అమ్మ మన మరియతల్లి! అందుకే ప్రభువు మరణించే ముందు మరియతల్లిని యోహాను గారికి అప్పగించారు. కేవలం యోహాను గారికి మాత్రమే కాదు, మనందరికీ తల్లిగా ఇచ్చారు. దేవుని పేరిట నిందారోపణలు భరించేవారికి పరలోకములో ప్రత్యేకమైన స్ధానం ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరియతల్లి ఈ యొక్క మాటకు కట్టుబడి జీవించారు ఇప్పుడు పరలోకరాణిగా తండ్రి దేవుని చేత అభిషేకం పొందారు. "వ్యాకులమాతగా" ఎంతో మంది కన్నీటిని తుడుస్తున్నారు. ఎంతో మందికి ఎన్నో మేలులను దయచేసి ముందుకు నడిపిస్తున్నారు మన జీవితంలో మన చుట్టూ ఎన్నో కష్టాలు, శోధనలు చుట్టుముట్టి ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం మన విశ్వాసాన్ని కోల్పోతూ అసలు దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా? అని ప్రశ్నిస్తూ ఉంటాము నిజానికి కష్టాలు కన్నీళ్లు శోధనలు ఇవన్నీ మనలని దేవునికి దగ్గర చేస్తాయే తప్ప దూరం చేయవు.

ఒక విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అంటే పరీక్ష చాలా అవసరం. సంవత్సరకాలం అతను చదివినదంతా కూడా చివరి పరీక్షల్లో మంచిగా రాయగలిగితే ఉత్తీర్ణత సాధిస్తాడు. లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. అదే విధముగా మన జీవిత పయనంలో ప్రభువు మనకు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలను పరీక్షల రూపంలో ఇస్తూ ఉంటారు మరి మనము మన జీవిత పరీక్షను ఎలా రాస్తున్నాము? ఉత్తీర్ణత సాధించి ప్రభువును సంతోష పెడుతున్నామా? లేదా నిరాశకు గురి చేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి!

మరియమ్మ గారు క్రీస్తు ప్రభువుకు, ప్రభు శిష్యులకు, ప్రవక్తలకు, పునీతులకు ఎన్నో శ్రమలు ఎన్నో పరీక్షలు ఎదురుపడినప్పుడు వారు తమ విశ్వాసాన్ని కోల్పోలేదు. శిష్యులు కొన్ని సందర్భాలలో తమ విశ్వాసాన్ని కోల్పోయిన, చివరకు మాత్రం విశ్వాసాన్ని బలపరచుకొని ప్రభువు కొరకు మరణించటానికి సిద్ధపడ్డారు.

ఈ యొక్క వ్యాకులమాత పండుగ సందర్భంగా మరియమ్మ గారు అదే తెలియజేస్తున్నారు: ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చిన వాటన్నిటినీ ఎదుర్కొని ప్రభువు కొరకు నడవండి. ప్రభువుతో నడవండి. ప్రభువు కొరకు జీవించండి. ప్రభువుతో జీవించండి అని తెలియజేస్తున్నారు.

మరియమాత తాను అనుభవించిన 7 దుఃఖ పూరితమైన సంఘటనలు గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకొని మనము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభువు నాకు ఉన్నారు అని విశ్వాసంతో నడుద్దాం.

మరియతల్లి అనుభవించిన 7 దు:ఖ పూరితమైన సంఘటనలు:
1. సిమియోను క్రీస్తుప్రభువు యొక్క భవిష్యత్తును, ఆ భవిష్యత్తులో వచ్చే శ్రమలను గూర్చి చెప్పినప్పుడు -"ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది" (లూకా. 2:34-35).

మోషే చట్టప్రకారం వారు శుద్ధి గావించు కొనవలసిన దినములు కావటం వలన(లూకా. 2:22) మరియమాత యోసేపు గారు బాల యేసును తీసుకొని యెరుషలేము దేవాలయానికి వెళ్లారు. నిజానికి మరియమ్మ గారికి జన్మ పాపము లేదు కాబట్టి శుద్దీకరణ సాంగ్యము అవసరం లేదు అయినా చట్టానికి తలవంచి తనను తాను తగ్గించుకొని మరియమ్మ గారు శుద్దీకరణ పొందడానికి సిద్ధమయ్యారు. ఎవరైనా ఒక స్త్రీకి దేవుడు దర్శనమిచ్చి నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. కానీ నీ కళ్ళ ముందే నీ కుమారుడు మరణిస్తాడు. నువ్వు చూస్తుండగానే దుర్మార్గులు కొందరు నీ కుమారుని ప్రాణాలు తీస్తారు అని చెబితే ఆ స్త్రీ ఏం చేస్తుంది? చదువుతుంటే మనకే కన్నీళ్లు వస్తున్నాయి! ఖచ్చితంగా ఏ అమ్మ దీనికి ఒప్పుకోరు కానీ మరియమ్మ గారు దీనికి భిన్నంగా ప్రవర్తించారు. తనకు జన్మించబోయే దైవ కుమారుడు లోక రక్షణ కోసం శ్రమలను అనుభవించి మరణించబోతున్నారని తెలిసి కూడా మరియమ్మ గారు ప్రభువుకు జన్మనివ్వడానికి సిద్ధపడ్డారు. మానవ రక్షణ కోసం మనకోసం తాను సైతం వ్యాకులమాతగా దుఃఖ భారాన్ని వహించడానికి తన కుమారుని కష్టాలలో కన్నీళ్ళలో పాలు పంచుకోవడానికి అంగీకరించారు. ఇది దేవుని చిత్తం. నేను ఆయన దాసురాలను అంటూ తన ప్రేమను వ్యక్త పరిచారు.

2. దేవదూత కలలో కనిపించి,"శిశువును చంపుటకు హేరోదు రాజు వెదక బోవుచున్నాడు. కావున నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు అని దేవదూత పునీత జోజప్ప గారికి చెప్పినప్పుడు - హేరోదురాజు బాలయేసును చంపడానికి భటులను పంపుతున్నాడని తెలియగానే మరియతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తక్షణమే పసిగుడ్డు బాలయేసును తీసుకుని భర్త యోసేపు గారితో కలిసి ఐగప్తునకు ప్రయాణమయ్యారు. ఆ రాత్రి వేళ ఆ చీకటిలో చలిలో పసిబిడ్డను తీసుకొని దేశం కాని దేశం ప్రాణభీతితో వెళ్లారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎంత నీరసంగా ఉంటుందో ప్రతి అమ్మకు ప్రతి అక్కకు తెలుసు. కానీ మరియమాత తన కన్నీటిని తుడుచుకుని మన సంతోషం కొరకు అంత మనోవేదనలో కూడా ముందుకు నడిచారు.

3. యెరూషలేము ఆలయములో ప్రభువు తప్పిపోయినప్పుడు - మరియమ్మ గారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేసిన సంఘటన ప్రభువు తనకు 12 సంవత్సరాల వయసులో ఉండగా జరిగింది. యూదుల ఆచారం ప్రకారం మరియమాత, యోసేపు గారు పాస్కా పండుగకు యెరుషలేము వెళ్లారు. వారితో పాటు బాలయేసును కూడా తీసుకు వెళ్లారు. పండుగ దినాలు ముగిశాక వారు తిరిగి ప్రయాణం అయ్యారు. కానీ బాలయేసు అక్కడే ఉండిపోయారు. ఈ సంగతి తల్లిదండ్రులకు తెలియదు. తమ ప్రాంతం నుంచి వచ్చిన తోటి యాత్రికులతో కలిసి వస్తున్నారు అనుకుని ముందుకు కదలి పోయారు. అలా ఒక రోజంతా ప్రయాణం చేశాక బాలయేసు కోసం వెతికితే ఆయన ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మరియతల్లి అనుభవించిన మనోవేదన అంతా ఇంత కాదు! అందరికీ అసలే కొత్త ప్రాంతం. పైగా పసి వయసు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు అనే విషయాలు ఆమెకు తెలియక సమయానికి తిన్నారా లేదా అని కన్నీరు పెడుతూ తల్లడిల్లిపోయారు. చివరికి వేద బోధకుల మధ్య బాలయేసు కూర్చుండి వారి బోధనలను వింటూ వారిని తిరిగి ప్రశ్నలు వేస్తున్నప్పుడు వారు బాలయేసును కనుగొన్నారు.

4. సిలువ మార్గములో ప్రభువును చూసినప్పుడు - 5.ప్రభువును సిలువ వేసినప్పుడు -

5.ప్రభువును సిలువ వేసినప్పుడు -

6. ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని సిలువ మీద నుండి దించి మరియతల్లి యొక్క ఒడిలో పెట్టినప్పుడు -

7. ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని భూస్ధాపనము చేసినప్పుడు - ఏ తప్పు చేయని తన కుమారుడు దుష్టులైన యూదుల చేతికి చిక్కి అవమానాలను భరించవలసి రావటం మరియతల్లిని తీవ్రమైన మనోవేదనకు గురిచేశాయి. క్రీస్తు ప్రభువు రక్తాన్ని ఆ పవిత్రమైన రక్తాన్ని ఆమె చూసినప్పుడు తన కళ్ళు దుఃఖ సాగరంలో నిండిపోయాయి. ప్రభు దేహాన్ని నిలువెత్తు గాయం చేస్తున్నప్పుడు, ఆ మరియమ్మ గారి హృదయం తట్టుకోలేక కడుపు కోతతో వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ బాధను వర్ణించటం ఎవరి వల్ల కాదు! కానీ ఇవన్నీ మరియమాత భరించారు ఆమె ప్రస్తుత దుఃఖాన్ని చూడలేదు. భవిష్యత్తులో వచ్చే దేవుని రాజ్యాన్ని చూశారు, పరలోక రాజ్యానికి రాణి అయ్యారు. అదే విధముగా ఈ యొక్క పండుగ ద్వారా మరియమాత మనందరికీ తెలియజేస్తున్న సందేశం అదే - ఎన్ని కష్టాలు ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువు కొరకు జీవించండి, ప్రభువుతో జీవించండి. 

కాబట్టి ప్రియ మిత్రులారా! మనము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇవన్నీ ప్రభువు ఇచ్చిన బహుమానాలుగా భావించి ముందుకు నడుద్దాం. అందర్నీ నడిపిద్దాం. మరోసారి మీ అందరికీ కూడా వ్యాకులమాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు ఆమెన్.

జోసెఫ్ అవినాష్✍✍✍
పెదవడ్లపూడి విచారణ
WhatsApp-: 7207773395

No comments:

Post a Comment