సకల ఆత్మల సంస్మరణ దినం (నవంబరు 2)

 సకల ఆత్మల సంస్మరణ దినం (నవంబరు 2)


నేడు మనము ‘సకల ఆత్మల సంస్మరణ దినము’ను కొనియాడుచున్నాము. ఈ సందర్భముగా, మొట్టమొదటిగా, మరణం అంతం కాదని గుర్తుచేసుకుందాం! భూలోకములో జీవించి మరణించిన సకల విశ్వాసులను నేడు గుర్తించి కొనియాడుచూ, ఉత్థానముపట్ల ఒక గొప్ప నిరీక్షణను, నమ్మకమును మనము కలిగియున్నామని గుర్తించుదాం! సజ్జనులు అనగా మంచి జీవితమును జీవించి మరణించినవారి ఆత్మలు దేవునిచెంత కొలువై యుండును. వారు శాంతిని బడయుదురు. వారు అమరత్వమును పొందెదరు. వారు కలకాలము దేవుని సన్నిధిలో ఉండెదరు (చూడుము సొ.జ్ఞా. 3:1-9). ఈ వాస్తవాన్ని ఎరిగిన మనము మరణించిన మన ఆప్తులపట్ల ఈ గొప్ప నమ్మకాన్ని కలిగి యుంటున్నాము.

అలాగే, పరలోకం మన జీవితాలకు గమ్యం అని నేడు గుర్తుచేసుకుంటున్నాము. కనుక మనము దేవున్ని నమ్ముకుంటూ, ఆయనను విధేయిస్తూ, నీతిగల జీవితాన్ని జీవించాలని పిలువబడుచున్నాము. దైవస్నేహములో జీవించగలిగినట్లయితే, పరలోకమున ఆయన సన్నిధిలో మనం కలకాలం జీవించగలము. కనుక, మరణం అంతం కాదు, ఆరంభం మాత్రమే! మనం శాశ్వతముగా దేవునిలో ఐఖ్యమై జీవించాలన్నదే దేవుని కోరిక కూడా!

దేవుడు తన ఈ కోరికను మనకు తన కుమారుడైన యేసుక్రీస్తుద్వారా మనకు అందిస్తున్నారు. ఈ గొప్ప నిరీక్షణను, నమ్మకాన్ని క్రీస్తులో కనుగొనుచున్నాము. క్రీస్తు రక్షణ నొసగి, తన మరణము, ఉత్థానములద్వారా నిత్యజీవితమును ఒసగుచున్నాడు. “క్రీస్తు రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి” (రోమీ. 5:9). “ఇపుడు క్రీస్తుద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము” (రోమీ. 5:11). దేవుడు క్రీస్తుద్వారా మన పాపములను క్షమించుచున్నాడు, తనతో సమాధానపరచు కొనుచున్నాడు. కనుక క్రీస్తుద్వారా పరలోకమునకు చేరు గొప్ప నమ్మకముతో మనము జీవిస్తున్నాము.

ఈ నమ్మకము నెరవేరాలంటే, మనం క్రీస్తును రక్షకునిగా విశ్వసించాలి. “కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును” (యోహాను. 6:40) అని ప్రభువు చెప్పియున్నారు. ఆయన దగ్గరకు వచ్చువారికి శాశ్వత జీవమును ఒసగును. కనుక దేవుడు మనకొసగు రక్షణను పొందాలంటే, క్రీస్తును సంపూర్ణముగా విశ్వసించుటద్వారా, మనము దేవునికి ప్రతిస్పందించాలి. ఈవిధముగా, శాశ్వత జీవితమునకు విశ్వాసము, అది క్రీస్తునందు విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమని అర్ధమగుచున్నది. కనుక, మరణించిన వారి నిరీక్షణ, నమ్మకం వారి విశ్వాసముపై ఆధారపడి ఉంటుంది.

మృతుల కొరకు ప్రార్ధన: ఈరోజు ప్రత్యేకముగా సకల ఆత్మల (మన ఆప్తుల కొరకు మాత్రమేగాక, సకల ఆత్మల కొరకు, ముఖ్యముగా దిక్కులేని ఆత్మల కొరకు అనగా ప్రార్ధించడానికి ఎవరులేని ఆత్మల కొరకు) నిత్యవిశ్రాంతి కొరకు ప్రార్ధన చేస్తాము. కతోలిక విశ్వాసం ప్రకారం మరణించిన కొందరి ఆత్మలు వారు జీవించిన జీవితమును బట్టి – అనగా పాపాత్మలు, పరలోకమునకు వెళ్లకముందు శుద్ధీకరణ పొందవలసి ఉంటుంది. అలాంటి ఆత్మలు శుద్ధీకరణ పొంది నిత్యవిశ్రాంతిని పొందాలంటే, భూలోకములోనున్న ఆత్మలు అనగా మనము వారికొరకు ప్రార్ధనలు చేయాలి, దానధర్మాలు చేయాలి, పూజలు పెట్టించాలి. పాత నిబంధన గ్రంథములోకూడా, యూదులు మరణించిన వారికొరకు దేవాలయములో ప్రార్ధనలు చేసారు, పాపపరిహార బలిని అర్పించారు (చదువుము 2 మక్క. 12:42-46).

ఈ ఆచారమును అనుసరించి, క్రైస్తవులుకూడా ఆరంభమునుండి, ఈనాటి వరకుకూడా మరణించిన వారికొరకు ప్రార్ధనలు చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రారంభంనుంచి శ్రీసభ చనిపోయిన వారిని భక్తిమంతముగా స్మరించి గౌరవిస్తూ వస్తున్నది. వాళ్ళ విముక్తికోసం ప్రార్ధనలు అర్పిస్తున్నది. మరీముఖ్యముగా వారికోసం దివ్యపూజలు జరుపుతూ వస్తున్నది. ఈ భక్తి క్రియల మూలముగా వారు శుద్ధులై దైవదర్శనం చేసుకోగలుగుతారని శ్రీసభ నమ్మకం. వారికోసం దానధర్మాలు, పరిపూర్ణ ఫలాలు, ప్రాయశ్చిత్త కర్మలు శ్రీసభ ప్రోత్సహిస్తుంది (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, 1032).

చాలా కొద్దిమంది మాత్రమే, పాపమునుండి పరిపూర్ణముగా శుద్ధీకరింపబడినవారిగా మరణించి దేవుని రాజ్యములో (పరలోకము) ప్రవేశించెదరు. చాలామంది పాపములోనే మరణిస్తూ ఉంటారు. అలాంటి వారి ఆత్మలు శుద్ధీకరింపబడాలి. దేవుని దయగల ప్రేమాగ్నిలో వారి పాపాలు దహింపబడాలి. ఇదియే ఉత్తరించు స్థలముగా తల్లి శ్రీసభ బోధిస్తున్నది. “పరలోకమునకు ముందు గది” (ante-chamber) అని చెప్పవచ్చు! “క్షాళన స్థలం" లేదా "శుద్ధీకరణ స్థలం” అని సత్యోపదేశంలో చెప్పబడింది. పూర్తిగా శుద్ధిపొందలేని వారు ఉంటారు. అయితే వారికికూడా నిత్యరక్షణ లభిస్తుందని హామీ ఉన్నది. పరలోకములో ప్రవేశించడానికి పవిత్రత అవసరం. ఈ పవిత్రతను సాధించడానికి ప్రక్షాళనం అవసరం (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, 1030-31). ఉత్తరించు స్థలములోనున్న ఆత్మలు వారంతట వారు ప్రక్షాళనం గావించలేరు. కనుక వారు బ్రతికియున్న మనపై ఆధారపడి ఉండెదరు. కనుక మన ప్రార్ధనలు, అర్పణలు, పూజలు... వారి ప్రక్షాళనకు ఎంతో అవసరము!

సమాధుల సందర్శన: నేడు శ్రీసభ పూర్వుల సమాధులను సందర్శించి ప్రత్యేకముగా వారి ఆత్మల నిత్యవిశ్రాంతి కొరకు ప్రార్ధన చేస్తుంది. వీలున్నచోట్ల సమాధులవద్దే దివ్యబలిపూజ అర్పించబడుతుంది. ఈరోజు మన ప్రార్ధనలన్నియుకూడా సకల ఆత్మల కోసం అర్పించబడుచున్నాయి.

సమాధుల చెంత ప్రార్ధన చేయుచుండగా మన మరణం గురించికూడా ఒక్కక్షణం ధ్యానించాలి. మన మరణం గురించి ధ్యానించడం విచారకరమైనది ఎంతమాత్రమును కాదు! ఇంకా ఎన్ని రోజులు మనకి ఇవ్వబడినాయో మనకు తెలియదు! జీవించిన ప్రతీరోజు ప్రభువును ప్రేమించాలి, అలాగే మనము ప్రభువుచేత ప్రేమింపబడాలి. అందులకు ఈ ఆత్మపరిశీలన తప్పక తోడ్పడుతుంది.

ముగింపు: పూలతోటలో, మనకు ఇష్టమైన, అందమైన పూలు కోయబడినప్పుడు మనకి ఎంతో బాధ, దు:ఖము కలుగుతుంది. కాని, పూలతోట అధికారి వాటిని కోసి, వాటిని తగిన స్థలములో ఉంచినప్పుడు, సంతసిస్తాము. అలాగే, జీవితమనే అందమైన ఈ పూలతోటలో, అందమైన పూలలాంటి మన ఆప్తులు మరణించినప్పుడు మిక్కిలిగా బాధపడుతూ ఉంటాము. కాని ఈ జీవితాలకు సృష్టికర్త అయిన దేవుడే స్వయముగా వారిని పిలచి, వారికి తన రాజ్యములో తగిన స్థానమును ఒసగినప్పుడు మనము మిక్కిలిగా సంతోషించాలి. వారు దేవుని సమక్షములో క్షేమముగా ఉన్నారని భావించాలి.

ప్రియ సోదరీ! సోదరా! నిండిన విశ్వాసముతో, నమ్మకముతో, సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు ప్రార్ధన చేద్దాం. ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల ప్రక్షాళన కొరకు ప్రార్ధన చేద్దాం. దేవుడు తన దయగల ప్రేమతో, వారిని కనికరించి, పాపవిముక్తిని గావించి తన స్వర్గ రాజ్యములో వారిని చేర్చుదురుగాక. ఆమెన్.

1 comment: