ధ్యానాంశము: మరియ - నిష్కళంకమాతా! వందనము!
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు (1:28). నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము.” (1:31)
ధ్యానము: సర్వేశ్వరునియందు నేను ఆనందించి సంతోషించెదను. నా ఆత్మ నా దేవునియందు ఆనందించుచున్నది. ఎందుకన, ఆయన నాకు రక్షణ వస్త్రములను తొడిగెను. ధర్మమునే ఆభరణముగా చుట్టి పెండ్లి కుమార్తె తన భర్తకై తయారైన విధమున నన్ను తయారు చేసెను." తల్లి తిరుసభ నిష్కళంకోద్భవిమాత మహోత్సవమును ప్రతీ దైవార్చన సం.లో డిశంబర్ 8న కొనియాడుచున్నది. "నిష్కళంకము" అనగా "పాపరహితము." ఈ మహోత్సవము ద్వారా మరియతల్లి పాపరిహితముగా జన్మించినదని లేక జన్మపాపములేక జన్మించినదను విశ్వాసమును కొనియాడుచున్నాము.
దశాబ్దాలనుండి కూడా శ్రీసభ, మరియ తల్లి దేవుని ద్వారా "అనుగ్రహ పరిపూర్ణురాలు" అని, ఆమె జన్మపాపము లేకుండా ఉద్భవించిన మాత అను విశ్వాసమును బోధిస్తున్నది. ఈ విశ్వాసాన్ని, అధికారపూర్వకముగా 9వ భక్తినాధ పాపుగారు 8 డిశంబర్ 1854వ సం.లో ప్రకటించియున్నారు. "మిక్కిలిగా ఆశీర్వదింపబడిన పరిశుద్ధ కన్య మరియమ్మ, తను గర్భములో పడిన క్షణమునుండి, సర్వశక్తి మంతుడైన దేవుని ఏకైక అనుగ్రహము, ఆశీర్వాదము, అనుమతి వలన, లోకరక్షకుడైన యేసు క్రీస్తునాధుని సుకృత పుణ్యములద్వారా, ఆదిపాపము అను మచ్చనుండి ఆమె పరిశుద్ధముగా ఉంచబడియున్నది."
గబ్రియేలు దూత పలికిన "దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మా, వందనము" అను శుభవచనములను మనము ప్రతీరోజు జపిస్తున్నాము. గబ్రియేలు దూత వచనముల ద్వారా, దేవుని యొక్క పరమ రహస్యము పరిపూర్ణముగా, నిండుగా మరియమ్మపై ఉన్నదని విదితమగుచున్నది.
దేవుడు సమస్త విశ్వమును తన కుమారుని ద్వారా, కుమారుని కొరకు సృష్టించెను. సర్వపరిపూర్ణత కుమారునిలో ఉండెను. ఈ పరిపూర్ణత, శ్రీసభకు శిరస్సు, సమస్తమును అయిన క్రీస్తునుండి పొంగిపొరలి, తన శరీరమునయిన శ్రీసభలో ప్రవహిస్తూ ఉన్నది (కొలస్సీ. 1:12-20). తన శరీరమునయిన శ్రీసభలోనికి ఈ పరిపూర్ణత్వము దిగివచ్చుటకు ముందుగా, ప్రత్యేక విధముగా, దేవుని తల్లిగా నెంచుకొనబడిన మరియ తల్లిపై రావడం జరిగియున్నది. అందుకే, ఆమె పరిశుద్దురాలు, పరిపూర్ణురాలు, జన్మపాపరహితముగా ఉద్భవించిన మాత, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు.
ఏవమ్మను మానవ లోకమునకు తల్లిగా ఆదికాండములో చూస్తున్నాము. ఆమె అవిధేయత వలన లోకమునకు పాపము సంక్రమించియున్నది. నూతన ఏవమ్మ అయిన మరియ తల్లి విధేయతద్వారా, లోకరక్షణమునకు ద్వారములు తెరువబడియున్నాయి. దీనినిమిత్తమై, ఆమె నిర్మలత్వముగా, పరిపూర్ణముగా సృష్టింపబడియున్నది. ఎందుకన, ఆమెద్వారా, వాక్కు, లోకరక్షకుడు, రెండవ ఆదాము, పాపపరిహారముగా ఉద్భవింపనున్నాడు.
మరియమ్మ, నిష్కళంకోద్భవిమాత అని 9వ భక్తి నాధ పాపుగారు 1854వ సం.లో మాత్రమే అధికారపూర్వకముగా ప్రకటించినప్పటికిని, ఈ విశ్వాసం తిరుసభ ఆరంభమునుండియే (7వ శతాబ్దము నుండి) ఉన్నది. అధికారపూర్వకముగా ప్రకటింపబడిన, నాలుగు సం.ల తరువాత అనగా 1858వ సం.లో, లూర్దునగరములో పునీత బెర్నదెత్తకు దర్శనములో మరియ తల్లి తననుతాను "నేను నిష్కళంకోద్భవిమాతను" అని సంభోదించి మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని దృఢపరచియున్నది.
మరియ నిష్కళంకోద్భవము ద్వారా, త్రిత్వైక దేవుని లోకరక్షణ ప్రణాళికను సుస్పష్టముగా చూడవచ్చు. పాపములో పడియున్న లోకాన్ని రక్షించుటకు దేవుడు ముందుగానే ప్రణాళికను ఏర్పాటు చేసియున్నాడు. దానినిమిత్తమై మరియను జన్మపాపరహితగా సృష్టించాడు. తద్వారా, ఈ లోకానికి పరిశుద్ధమైన, పరిపూర్ణమైన మానవత్వమును తీసుకొని వచ్చి, ఆయనద్వారా మరల లోకాన్ని దేవునిలో ఏకమగునట్లు చేసియున్నాడు.
అవిధేయతద్వారా, స్వతంత్రమును దుర్వినియోగము చేసికోవడముద్వారా, ఆమె కుమారుడు యేసు క్రీస్తుద్వారా మరల మనము స్వతంత్రమును, పరిశుద్ధమును పొందగలుగుచున్నాము. మరియ నిష్కళంక మాత, జన్మపాప రహిత. ఎందుకన, ఆమె దేవునికి తల్లిగా ఎన్నుకొనబడియున్నది. పరిశుద్ధత్వమును, పరిపూర్ణతను పొందియున్నది. దేవునియొక్క చిత్తము, అనుగ్రహముతో సహకరించినచో మనమూ ఆ దేవుని అనుగ్రహములను పొందగలము.
No comments:
Post a Comment