బాప్తిస్మ యోహాను జయంతి మహోత్సవము
యెష 49 :1-6, అ.కా. 13:22-26. లూకా 1:57-66,80
వెలుగుకు సాక్ష్యమిద్దాం!
ఈ రోజు బాప్తిస్మ యోహాను జననాన్ని తిరుసభ కొనియాడుచున్నది. యోహాను ప్రవక్తలలో గొప్పవాడు. పవిత్రాత్మ దేవుడు తన ద్వారా ప్రవక్తల ప్రవచనాలను పరిపూర్ణం చేసాడు. యోహాను వెలుగునకు సాక్ష్యమీయ వచ్చాడు. "నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు. ఇప్పుడు నేను ఆయనను చూచితిని. ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను" (యో 1:33-34). యోహాను ప్రవక్తలలో చివరి ప్రవక్త. ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలకు రక్షణ నమ్మకాన్ని కలిగిస్తాడు. ప్రవక్తలు దైవ ప్రజల రక్షణను బోధిస్తారు. ప్రవక్తలు దేవునిచేత అభిషేకించబడినవారు.
ఈనాటి మొదటి పటనంలో వింటున్నాం: "నేను తల్లి కడుపున పడినప్పటినుండియు ప్రభువు నన్నెన్నుకొని తన సేవకునిగా నియమించెను" (యెష 49:1). ఈ వాక్యం మనకు బయలుపరచు విషయమేమనగా, మనం జన్మించకమునుపే, దేవుడు మనలను మన పిలుపును ఎన్నుకొని యున్నాడు. ఈ విషయం యిర్మియా విషయములో (యిర్మియా 1:5), బాప్తిస్మ యోహాను విషయములో (లూకా 1:15), యేసు విషయములో (లూక 1:31), పౌలు విషయములో (గలతీ 1:15) నిరూపితమైయున్నది. "అతడు నాకు పదునైన కత్తివంటి వాక్కునొసగెను" (యెష 49:1). ప్రవక్తలు దేవుని వాక్కును ప్రవచించారు. దైవ ప్రజలు ఆలకించారు. వారు ప్రవక్తలద్వారా, దైవ సందేశమును వినియున్నారు. దేవుని వాక్కు ఆత్మ యొసగు ఖడ్గము(ఎఫే 6:17). దేవుని వాక్కు సజీవమును, చైతన్య వంతమునైనది. అది కత్తివాదరకంటే పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకును, కీళ్ళ మజ్జ కలియువరకును అది చేధించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను అది విచక్షింపగలదు (హెబ్రీ 4:12). ప్రభువు యెషయాతో "యిస్రాయేలు! నీవు నా సేవకుడవు" అని చెప్పాడు. దేవుడు తన ఇస్రాయేలు ప్రజలతో పలుకుచున్నాడు. వారి చివరి ధ్యేయం అన్యులకు వెలుగును మరియు రక్షణను భూధిగంతముల వరకు తీసుకొని రావడం (చదువుము ఆ.కాం. 22:17-18).
కాని, అనేకసార్లు ఇస్రాయేలు వారి బలహీనత వలన దేవునికి దూరముగా వెళ్ళడం జరిగింది. దేవుని ఆశీర్వాదమును మరచితిరి. ఈ మానవ బలహీనత బాప్తిస్మ యోహానులో కూడా చూస్తున్నాం. తను చెరసాలలో ఉన్నప్పుడు, తన శిష్యులను యేసు చెంతకు పంపి, "రాబోవు వాడవు నీవా! లేక మేము మరియొకరి కొరకు ఎదురు చూడవలేనా" అని ప్రశ్నించడం జరిగింది. "ఇదిగో! లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల" (యో 1:29) అని యేసును యోర్దాను నది చెంత చూచినప్పుడు ప్రవచించిన ప్రవచనాలను, కష్టాలలో ఉన్నప్పుడు యోహాను మరచాడా?
మనము కూడా కష్టాలలో, బాధలలో దేవుణ్ణి నిందిస్తాం. ఆయన సాన్నిధ్యాన్ని అనుమానిస్తాం. దేవుని అనుగ్రహాన్ని అనుమానిస్తాం. దేవుని ప్రేమను అనుమానిస్తాం. ఇలాంటి సమయములో విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ప్రార్ధనలో గడపాలి, జీవించాలి. దేవుడు ఎల్లప్పుడూ మన వెన్నంటే ఉంటాడు. , ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి.
రెండవ పటనములో, పౌలుగారు, దావీదు మహారాజు గూర్చి, యోహానుగూర్చి, యేసును గూర్చి బోధిస్తున్నాడు. దేవుడు దావీదును అభిషేకించి, ఆయన వంశమునుండి మెస్సయ్యను పంపియున్నాడు. మెస్సయ్యా అనగా అభిషేకించబడినవాడు. ఇలా దేవుడు ఇస్రాయేలు ప్రజలకు చేసిన వాగ్ధానమును నెరవేర్చాడు. ఈ వాగ్ధానమునకు సాక్ష్యముగా, ఈ ప్రవచనాల పరిపూర్ణత కొరకు బాప్తిస్మ యోహాను పంపబడినాడు. యోహాను యేసయ్య రాకను ఆగమనం చేసాడు. యేసు రాకతో, యోహాను ప్రవక్త కార్యము ముగిసినది.
సువిశేష పటనములో, యోహాను జననము గూర్చి వింటున్నాం. ఆయన జననం వెలుగును ఈ లోకానికి పరిచయం చేయడం. ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వడం. మనం ప్రవక్తలం కాకపోవచ్చు. అయినప్పటికిని, యోహానువలె ఆ వెలుగునకు సాక్ష్యమీయుటకు పిలువబడి యున్నాము. యేసు మనకు చేసిన కార్యముల గూర్చి, ఒసగిన దీవెనల గూర్చి సాక్ష్యమిద్దాం! ఈ లోకానికి ప్రభువు ఒసగిన రక్షణకు సాక్ష్యమిద్దాం!
No comments:
Post a Comment