రోమునగర పునీత లారెన్సు (10 ఆగష్టు)
ఆర్చ్ డీకను, వేదసాక్షి (క్రీ.శ. – 258)
రెండవ (పునీత) సిక్స్’తు జగద్గురువులవద్ద రోమునగరంలోగల ఏడుగురు ప్రధాన డీకనులలో లారెన్సుగారు ఒకరు.
వీరు స్పెయినుదేశంలోని హ్యుయెస్కాకు చెందినవారు.
ఆ రోజుల్లో ఏలుబడిచేస్తున్న వలేరియన్ చక్రవర్తికి క్రైస్తవులనిన గిట్టకపోయేది. అనేక వేద హింసలకు పాల్పడ్డారు. ఆయన ఆజ్ఞ ప్రకారం రెండవ సిక్స్’తు జగద్గురువులు క్రీ.శ. 258లో వేదసాక్షి మరణంకు గురయ్యారు. వారి మరణానంతరం మరో మూడు దినాలలో తనకుకూడ వేదసాక్షి మరణం ప్రాప్తింప బడబోతోందని ఆర్చి డీకను లారెన్సుగారు జ్ఞానదృష్టితో ప్రవచించారు. లారెన్సుగారు ఆనందంతో చర్చికి సంబంధించిన విలువైన సామాగ్రిని అమ్మివేసి ఆ సొమ్మును బీదసాదలకు దానధర్మం చేసేశారు. ఇందుకు వలేరియను చక్రవర్తికి చెందిన రోము నగర ప్రధాన అధిపతి ఆగ్రహించగా లారెన్సుగారు తనకు మూడు దినాలు గడువు ఇచ్చినట్లయితే ఆ ఆస్తులను తీసుకొస్తానని మాట ఇచ్చారు.
లారెన్సుగారు కుంటివారిని, గుడ్డివారిని, కటిక పేదలు, నిర్భాగ్యులు, అనాధలను తీసికొచ్చి ప్రధాన అధిపతి వద్ద ఉంచి వారంతా చక్రవర్తికి సంబంధించి శ్రీసభ ఆస్తులని పలికారు. ప్రధాన అధిపతి మండిపడి లారెన్సుగారికి మరణ శిక్ష విధింపచేశాడు. ఎర్రగా కాలిన ఇనుప పెనముపై లారెన్సుగారిని పడుకోబెట్టి మంట రగిలేలా చేశాడు. లారెన్సుగారు తనను ఒక వైపు బాగానే వేయించారు. రెండవ వైపుకుకూడ త్రిప్పండని కోరారు. ఎంతటి బాధనైనా విశ్వాసంకోసం ఓర్చుకొని క్రీ.శ. 258లో తన అంతిమ శ్వాసను విడిచారు. ఈ విషయాన్ని పునీత అంబ్రోసు, పునీత ప్రుడెన్సియసుగారు తమ రచనల్లో పేర్కొన్నారు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునాయని, బంగారంలాంటి లారెన్సుగారు నిశ్శబ్దంగా దేవునికి సాక్షిగా నిలిచారు.
లారెన్సుగారి వేదసాక్షి మరణవార్త రోమునగర మందంతటా దావానలంలా వ్యాపించింది. వారి విశ్వాసానికి, మాతృకకు ఎంతోమంది అన్యులు క్రైస్తవవేదం అనుసరించారు. విగ్రహారాధన, సృష్టి వస్తువుల పూజలు మాని క్రీస్తు భగవానుని నమ్మారు. పునీత లారెన్సుగారి సమాధిని తివోలి పట్టణంకు పోవు రహదారి ప్రక్కన ఏర్పాటుచేశారు. 5, 6 శతాబ్దములో లారెన్సుగారి సమాధిపై పెద్ద అందమైన దేవాలయం నిర్మింపబడింది. రోము నగరంలోని ఏడు ప్రధాన బృహద్దేవాలయాలలో ఇదీ ఒకటిగా నేటికీ ప్రసిద్ది నొందింది. పేదలు, వంటపని వాడ్రకు పునీత లారెన్సుగారు పాలక పునీతునిగా నియమింప బడ్డారు. నడుమునొప్పి, మంటల్లో చిక్కినవారు, వారి శారీరక రుగ్మతల్లో వీరి మధ్యవర్తిత్వాన ప్రార్ధించిన వారు ఉపశమనం పొందినట్లుగా భక్తులు సాక్షమిచ్చారు.
“నా ప్రభువైన దేవుని మాత్రమే పూజిస్తాను, సేవిస్తాను. ఈ బాధలు నన్ను భీతిల్లచేయ జాలవు” (పునీత లారెన్సు).
No comments:
Post a Comment