అతి దూతలు మిఖాయేలు-గాబ్రియేలు-రఫాయేలు గార్ల ఉత్సవం

 అతి దూతలు మిఖాయేలు-గాబ్రియేలు-రఫాయేలు గార్ల ఉత్సవం (సెప్టెంబర్ 29)


 - శుభ సందేశకులు...
- అంతర్వేణి సంభాషణలు కర్తవ్య నిర్వహణను ఉపదేశిస్తాయి...
- దేవదూతలు ఏదో రూపంలో సందేశాన్నందిస్తునే ఉంటాయి... 
- ఎవరి పట్ల విశ్వాసాన్ని, భక్తిభావాన్ని, గౌరవాన్ని చూపుతామో ఆ పెద్దలే దేవదూతలు...

ఈ సువిశాల భూ ప్రపంచాన్ని పరికించి చూచిన అదో అద్భుతమైన సృష్టిగా భావిస్తాము. అలాగే మనకు తెలియని మన చుట్టూ ఉండే మరో అద్భుతమైన ప్రపంచం దేవదూతలకు నిలయమై ఉన్నది. ఈ దూతల ప్రపంచమునకు మన ప్రపంచమునకు పెద్ద తేడా ఏమీ లేదు. మన చుట్టూ మన తోపాటుగా అదృశ్యం లో ఉండే అత్యంత రహస్యమైన ప్రపంచం ఇది. ఇలాంటి దేవదూతల గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక సంఘటనలు బోధింపబడి ఉన్నాయి. కానీ ఈనాడు ఈ దూతలను చూచిన వారు ఎవరైనా ఉన్నారా? ఏ బోధకులు కూడా దీని బోధించే స్థితిలో లేరు. కానీ దివ్య గ్రంధములో ఇంచుమించు ప్రతి ఒక్క దైవజనుడు దేవుని దూతల యొక్క పరిచర్యను పొందియున్నారు. మరి రక్షణ చరిత్రలో, పరిశుద్ధ గ్రంధంలో ఇంత ఉన్నత స్థానమును పొందిన దేవుని దూతలను గూర్చి, వారి పరిచర్యను గూర్చి   మనమంతా తెలుసుకోవటం కనీస ధర్మం. అందుకే వీటిని దృష్టిలో పెట్టుకుని మన తల్లి శ్రీ సభ ప్రతి ఏటా సెప్టెంబర్  29వ తేదీన రక్షణ చరిత్రలో దేవుని, ప్రణాళికలో పాలు పంచుకొని తమదైన పాత్రను పోషించి వెలుగొందిన ప్రధాన అతి దూతలు(మిఖాయేలు- గాబ్రియేలు- రఫాయేలు) గార్ల ఉత్సవాన్ని కొనియాడుతూ వారి ఔన్నత్యాన్ని గూర్చి, రక్షణ చరిత్రలో , దేవుని ప్రణాళికలో వారు పోషించిన పాత్రను మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ఈ మేరకు దేవదూతల గురించి వారి పరిచర్యను గురించి కొన్ని విషయాలు సవివరంగా చర్చిద్దాం:

దూతల విభజన:

దేవదూతలు ఎంతమంది ఉంటారో ఎవరికి స్పష్టంగా తెలియదు. 10 లక్షల దాకా ఉంటారని కొందరు కతోలిక వేదపండితులు వాకొన్నారు. ఈ దూతలో ప్రధానంగా ఏడుగురిని అతి దూతలుగా భావించి గౌరవిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథములోని తోబీతు గ్రంధం 12,15 దీనికి ఆధారం. ఏడుగురిలో క్రైస్తవ ప్రపంచానికి ముగ్గురు పేర్లు మాత్రమే తెలుసు వాళ్లే మిఖాయేలు, గాబ్రియేలు,రఫాయేలు.

ఆరవ శతాబ్ద కాలంలో న్యూడో డయనీష్కస్ అనే కతోలిక రచయిత దూతలను తొమ్మిది గణాలుగా విభజించారు. ఆ గణాలను మళ్లీ మూడేసి బృందాలతో కూడిన మూడు వర్గాలుగా విభజించారు. ఆ వైనం ఇది:-

1. సెరాపులు- కెరూబులు- సింహాసనాలు
2. అధికారులు- నాధులు- శక్తులు
3. పరిపాలకులు- అతిదూతలు- దూతలు

ఈ గణ విభజన ప్రాచీన క్రైస్తవ లోకంలో బాగా ప్రచారంలోనికి వచ్చింది.

చిత్రాల్లో, బొమ్మల్లో దేవదూతలు:

ప్రాచీన చిత్రకారులు నానా సందేశాలతో దూత బొమ్మలు గీశారు. సుప్రసిద్ధ శిల్పులు నానా భావాలతో దూతల శిల్పాలు చెక్కారు. వీటిని వీక్షించడం వల్ల సామాన్య ప్రజలకు దూతల పట్ల భక్తి ప్రపత్తులు పెరిగాయి. నన్మనస్కులకు  లింగం లేకపోయినా వారిని పురుషులు లాగానే మలిచారు. వాళ్లు యవ్వనంలో బలంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. బాల దేవదూతలు కూడా ఉన్నారు వీళ్లు బాల యేసుని, పిల్లలను సంరక్షిస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ దూతలకు తెల్లని అంగీలు ఉంటాయి. వారి ముఖం నుండి కాంతి వెలువడుతుంది. వీళ్లు సైనికుల్లాగా ఆయుధాలు ధరించి ఉన్నట్లుగా కనిపిస్తారు. వీళ్ళు రారాజు సేవలో, పిశాచం తో పోరాడే యోధులు. మామూలుగా దూతలకు రెండు రెక్కలు ఉంటాయి. దేవుడు పంపగా నరుల దగ్గరికి శీఘ్రంగా వచ్చే వార్తవహులని ఈ రెక్కల భావం. కొందరు దూతలను క్రీస్తుకి, మరియమాతకు దైవ సందేశాన్ని తీసుకొని వస్తున్నట్లుగా చిత్రించారు. కొందరిని వేద సాక్షులకు కిరీటాలు, ఖర్జూరపు మట్టలు అందిస్తున్నట్టుగా చిత్రించారు. ఆ భక్తులు అనుభవించిన శ్రమలకు ఇవి బహుమానాలు. సువిశేష రచయితలకు, పునీతులకు దివ్య ప్రేరణలు కలిగిస్తున్న ట్లుగా చిత్రించారు. దైవార్చనలో దేవుణ్ణీ,దివ్యసత్ర్పసాదాన్నీ ఆరాధిస్తున్నట్లుగా గీసారు. అలాగే మన ప్రసిద్ధ కతోలిక పుణ్యక్షేత్రాలను దర్శించినట్లైతే ఆలయ ముఖ ద్వారాల వద్ద అదేవిధంగా దివ్యసత్ర్పసాద మందసములో దేవదూతలు దేవుని స్తుతిస్తున్నట్లుగా స్వరూపాలు దర్శనమిస్తాయి. ప్రాచీన దేవాలయాల్లో కనిపించే ఈ బొమ్మలు, చిత్రాలు తప్పకుండా భక్తులకు ప్రేరణ పుట్టిస్తాయి.

ప్రధాన అతి దూతలు వారి పరిచర్యలు:
మిఖాయేలు:

దేవదూతల్లో కెల్లా మిఖాయేలు సుప్రసిద్ధుడు. మిఖాయేలు అనగా దేవుడు వంటివాడు ఎవడు అని అర్థం.మిఖాయేలు గారిని మొదట యూదులను పరిరక్షించే దూతగా చిత్రకారులు చిత్రీకరించారు. ఆ తర్వాత క్రైస్తవ ప్రపంచానికి ఉన్న సైన్యానికి  అధికారిగా,ఓదార్చే సన్మనస్కుడుగాను అభివర్ణింపబడినారు. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడటం, దాని బంది నుండి విశ్వాసుల ఆత్మలను కాపాడటం, శ్రీ సభకు ప్రత్యేక పాలకులుగా ఉండటం, ఆత్మలను దైవ తీర్పుకు తీసుకురావటం అనే ఈ నాలుగు విధుల్ని మిఖాయేలు ప్రధాన దేవదూత నిర్వహిస్తున్నట్లు శ్రీ సభ సాంప్రదాయము ద్వారా పితరుల బోధనల ద్వారా తెలుస్తున్నది. దూతల సైన్యాన్ని మిఖాయేలు నడిపిస్తాడు. మిఖాయేలు, ఆయన దూతలు మహాసర్పంతోఅంటే సాతానుతో యుద్ధంచేశారు (యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 12:7).

మోషే చనిపోయి తర్వాత అతని శరీరం గురించి సాతానుతో మిఖాయేలు వాదించాడు. అంతేకాదు దేవుని సందేశాన్ని దానియేలు ప్రవక్తకు చేరవేయడానికి ఒక దేవదూతకు సహాయం చేశాడు. (దానియేలు 10:13, 21; యూదా 1:9)

దేవదూతలందరిలో మిఖాయేలుకు ఎక్కువ అధికారం ఉంది. అందుకే ఆయనకు ప్రధానాధిపతుడు,’ “మహా అధిపతియగు మిఖాయేలుఅనే బిరుదులు ఉన్నాయి. (దానియేలు 10:13, 21; 12:1) ఈ బిరుదులన్నిటిని బట్టి మిఖాయేలు దూతల సైన్యాలకు ప్రధానాధిపతిఅని చెప్పవచ్చు. అందమైన వస్త్రధారణతో ఖడ్గము, డాలు బల్లెము ఈయన చేతిలో కనిపిస్తాయి. భుజాలమీద రెక్కలతో క్రిందనున్న సైతానుతో యుద్ధం చేస్తున్నట్లు ఈ సైతాను ఒక మహా సర్ప రూపంలో ఉన్నట్లు చిత్రపటాలలో మరియు స్వరూపాలలో కనిపిస్తుంది. ఇతడు పిశాచం తోనూ సర్పంతోను పోరాడి ఆ దృష్ట శక్తులను జయిస్తునట్లుగా బొమ్మలు, స్వరూపాలు మలిచారు. ఇతన్ని భూలోకంలో నరుల పాపపుణ్యాలను తమ గ్రంథాలలో లిఖిస్తున్నట్లుగా, పరలోకంలో చనిపోయిన వారి మంచి, చెడులను తక్కెడలో  పెట్టి తూస్తున్నట్లుగా చిత్రకారులు మలిచారు. చిల్లర వర్తకులకు ప్రపంచ సైనికులకు, రక్షకభటులకు, పాలకులుగా పర్వత ప్రాంతాలకు సంరక్షకులుగా  మిఖాయేలు  వారిని కొనియాడుతుంటారు.

గాబ్రియేలు:

గాబ్రియేలు అనే  హిబ్రూ పదానికి దేవుని వీరుడని, దేవుడు నా బలం అని  అర్థం. పరలోక సామ్రాజ్యాంలో దేవుని సమక్షంలో కొలువుదీరిన ప్రధాన సప్త సన్మనస్కులలో వీరు ఒకరు. పునరుద్ధరణ దైవదూతగా పేరుగాంచిన గాబ్రియేలు ప్రధానంగా దైవ సందేశానికి వార్తాహరుడు. గాబ్రియల్ దేవదూత ప్రధానంగా శుభవార్తలను, జనన సందేశాలను, ఓదార్పు సందేశాలను అందించడాన్ని పవిత్ర గ్రంధంలో చదువుతాం. గాబ్రియేలు గారి గురించి అటు పూర్వ వేదంలోను ఇటు నూతన వేదంలోను మనం ధ్యానం చేయవచ్చు. యూదులు బానిసత్వం నుండి తిరిగి వస్తారని వార్త చెప్పినది ఈ దేవదూతే(దానియేలు 8:9) సంసోను జనన వార్తను భూలోకానికి మోసుకు వచ్చింది ఈయనే(న్యాయాధిపతులు 13-16) బాప్తిస్మ యోహాను జనన వార్తను జెకర్య గార్కి, మరియతల్లికి మంగళవార్తను అందించిన దూత గాబ్రియేల్ గారేనని పవిత్ర గ్రంథం వివరిస్తుంది. క్రీస్తు అవతరించడం గురించి గొల్లల కు, హేరోదు రాజు దుష్ట తలంపుల నుండి ఈజిప్ట్ దేశానికి బాలయేసుని తీసుకొని తిరు కుటుంబం పారిపోవాల్సింది అనే సందేశాన్ని కూడా గాబ్రియల్ గారే మోసుకువెళ్లారు. శుభవార్తలను  ప్రకటించేవారు కాబట్టి ఆయన చేతిలో లిల్లీ పుష్పం గాని, రాజ దండము గాని కనిపిస్తాయి .ఇంకో చేతిలో ఫలకము దానిమీద  ఆంగ్ల అక్షరాలతో "Ave maria, gratia plena"(దేవ వరప్రసాదములతో  నిండిన మరియమ్మ నీకు వందనాలు) అనే పదాలు ఉంటాయి. 14 వ శతాబ్ద కాలం నుండి శ్రీ సభ చరిత్రలో అనేక చిత్రాలతో మరియమాతను గాబ్రియేలు గారు గౌరవిస్తూ చేతిలో లిల్లీ పుష్పాలు ధరించి రెండు చేతులను అటు ఇటు తన హృదయం మీద వేసుకొని గాబ్రియేల్ గారు కనిపిస్తారు. ప్రసిద్ధ కతోలిక పుణ్యక్షేత్రాలలో కూడా వీటిని మనం స్వరూపాల రూపంలో చూడవచ్చు. దేవదూతలకు, మోక్ష వాసులకు, సకల పునీతులకు రాజ్ఞీగా పరిగణీంపబడే  మరియమాతకు అతని ఇస్తున్న గౌరవ సూచికమిది.

రఫాయేలు:

రఫాయేలు అనే హిబ్రూ భాష పదానికి చికిత్స చేసే వాడిని మరియు దేవుని ఔషధమని అర్థం. దేవుని సింహాసనము ఎదుట అహోరాత్రులు కీర్తించే ఏడు దూతలలో వీరు ఒకరు. తోబీతు అంధత్వాన్ని నయం చేసిన వానిగా,తోబీతు కుమారుడైన తోబియాకు రక్షగా నిలిచిన సంరక్షకుడిగా ఇతడు కనిపిస్తారు. ఈ దేవదూతను ప్రయాణికులు, యువకులు ,అమాయకులు తమ పాలక పునీతులనుగా వేడుకుంటారు. ప్రయాణానికి తగినట్లుగానే చేతి కర్రతో, కాళ్ళకి పాదరక్షలతో, శిరో పట్టికతో కురులు ముడి వేసుకుని, నడుముకు కట్టుకున్న పట్టీతో చిత్రపటాలలో కనిపిస్తారు. ఒక చేతిలోని ఖడ్గముతో రెండో చేతిని పైకి చూపుతూ ఆలకించండి అన్నట్లుగా సూచిస్తాడు. శ్రీ సభ గత పదవ శతాబ్దం నుండి రఫాయేలు దూతను వందిస్తూ వస్తున్నారు. అయితే 1922 నుండి విశ్వ శ్రీ సభ అంతట వీరిని కొనియాడటం ప్రారంభించారు.

భక్తిభావం-:

దేవదూతల్లాగ మనకు ఉపకారం చేసే వాళ్ళు ఎవరూ లేరు. కనుక మనము వాళ్ళ పట్ల గౌరవం భక్తి నమ్మకం, విశ్వాసం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. దూతలు నిరంతరం దేవుని సన్నిధిలో ఉండి అతన్ని పూజించేవాళ్ళు పరమ పవిత్రులు మనల్ని ఎల్లవేళలా పట్టించుకొని ప్రేమ భావముతో సేవలు చేస్తుంటారు. మనమంటే వాళ్లకు పరమ ప్రీతి అలాంటి వాళ్ళ పట్ల మనకు భక్తి ఉండాలి‌. పునీత బెర్నార్డ్ గారు పలుకుతున్నట్లు దేవదూతలను మనము మిత్రులుగా చేసుకోవాలి. వారి సంరక్షణలో మనకు ఎలాంటి ఆపదలు, అపాయాలు ఉండవు...

జోసెఫ్ అవినాష్ సావియో
యువ కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచార

1 comment: