సకల ఆత్మల సంస్మరణ మహోత్సవము (2 నవంబర్)
నవంబరు మొదటి తేదీన జయసభ అనగా మోక్షంలో శ్రీసభ విజయోత్సవంను, ఇక్కడ మనం కొనియాడాము. ఆ మరుసటిరోజే అనగా నవంబరు రెండవ తేదీన యుద్ధసభ అనగా ఈలోకంలోని విశ్వాస క్రైస్తవులు ఉత్తరించు సభ లేక స్థలంలో బాధను అనుభవిస్తున్న మరియు తమ పాపములన్నియు పరిహరింపబడే వరకు అనగా ఆ స్థితి దాటిపోయే వరకు వేచి ఉండాల్సిన బాధను పొందుతున్న మానవుల ఆత్మ సత్వర విముక్తికై దేవుని ప్రత్యేకంగా వేడుకొనే పండుగను జరుపుకుంటున్నాం. అనగా మోక్షంలోని విజయ క్రైస్తవులు, ఉత్తరించు స్థలంలోని బాధామయ క్రైస్తవులు భూలోకంలోని యుద్ధరంగ క్రైస్తవులు ఒకరికొకరు ప్రార్ధించుకొని ఫలభరితులౌతారని దైవ కుటుంబంగా అలరారుతారని శ్రీసభ ప్రకటింప జేస్తుంది.
విశ్వాసులు ప్రార్ధనలు, త్యాగక్రియలు ముఖ్యంగా దివ్యబలి పూజార్పణ
ద్వారా ఈ ఉత్తరించు ఆత్మల సత్వర విముక్తికై అవసరమని ట్రెంటు మహాసభ వెల్లడించింది.
ఈ ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు సహాయం చేయగల స్థితిగాని, లేదా వేరే ఆత్మకు సహాయంచేసే శక్తిగాని ఉండదు.
అందుకే వారిని దిక్కులేని ఆత్మలు అంటాం. కాని పరలోకంలో నివసిస్తున్న ఆత్మలు
భూలోకంలో నివసిస్తున్న మానవులు దేవుని ప్రార్ధించి బ్రతిమాలుకొని ఆయా ఉత్తరించు
ఆత్మల బాధామయ కాలాన్ని తగ్గింప కలిగేలా చేయనగును. క్షమింప బడదగిన పాపాన్నీ
పరిహరింపబడి, అందుకు తగిన బాధలన్నీ
భరించి, ఈ ఉత్తరించు ఆత్మలు
ప్రక్షాళన అయిన పిమ్మట మాత్రమే విముక్తి ఆశించి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశింప గలుగుతాయి. కనుక ఉత్తరించు స్థలమును శుద్ధీకరణ
స్థలం, ప్రాయశ్చిత్త స్థలం అని
పిలువదగును.
ఐదవ శతాబ్దం నుండే ఈ ఉత్తరించు ఆత్మలు నిత్య
విశ్రాంతి పొందుటకై ప్రార్ధనలు, దివ్యబలి పూజలు
అర్పించే సంప్రదాయం ఉంది. కాని,
‘‘పునీత క్లూని
ఒడిలో’’ వారి కృషి వలన పదవ శతాబ్దంనుండి
ఈ సంప్రదాయం ప్రపంచం నలుమూలలకు వ్యాపించింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో అసంఖ్యాకమైన సైనికలు, ప్రజలు ప్రాణాలు వదిలారు. ఈ సందర్భంగా క్రీ.శ. 1915లో పదిహేనవ బెనెడిక్ట్ పోపుగారు ప్రతి గురువు
ఈ ఉత్తరించు ఆత్మల పండుగ రోజున మూడు దివ్యబలి పూజలు చేయ అనుమతిని మంజూరు చేసారు.
మొదటి పూజ వేదనననుభవిస్తున్న ఉత్తరించు ఆత్మల నిత్య విశ్రాంతి కోసమును, రెండవ పూజ పరిశుద్ధ జగద్గురువు పోపుగారి ప్రత్యేక
మరియు పొత్తు తలంపు నెరవేర్పుకును,
మూడవ పూజకు
గురువు యొక్క సొంత తలంపు కొరకు అర్పింప సెలవిచ్చారు. ఈ పూజలు అర్పించుటకు ముందు
చనిపోయిన ఆయావ్యక్తుల పేర్లు చెప్పి వారి ఆత్మ నిత్య విశ్రాంతి కోసమని, ఉత్తరించు స్థలంనుండి విమోచింపుమని ప్రభువును
వేడుకొంటు గురువు పూజలు సమర్పింప సెలవు పొందియున్నారు.
కతోలిక ఆచారం చొప్పున విశ్వాసుల విన్నప
ప్రార్ధనలు సల్పుట, సమాధుల స్థలాన్ని
సందర్శించి, ప్రత్యేక జపాలు, పాటలు... మధ్య తీర్ధజలాలతో సమాధులను
ఆశీర్వదించడం జరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో విశ్వాసులు ప్రదక్షిణగా సాయంకాలం
సమాధుల వద్దకు వెళ్లి ప్రార్ధనలు చేసుకొంటూ క్రొవ్వొత్తులు,
దీపాలు
వెలిగిస్తారు. అవి వెలిగినంత సేపు రాత్రిళ్ళు సందర్భోచిత గుర్తుగా వెలుగుతూనే
ఉంటాయి.
చనిపోయిన వార్లను ప్రార్ధన పూర్వకంగా మనం జ్ఞాపక పరచుకుంటే, దేవుడు మన తలంపును, ఆశాభావాన్ని బలపరుస్తారు. తద్వారా మనను వీడిన మన సహోదరీ సహోదరులు క్రీస్తు పునరుత్థాన భాగ్యంలో తప్పక పాలుపంచుకుంటారు.
No comments:
Post a Comment