పునీత సిలువ యోహాను (14 డిశంబర్)

పునీత సిలువ యోహాను (14 డిశంబర్)

సిలువను ప్రేమించి సిలువను ధ్యానించి సిలువ కోసం త్యాగాలు చేసిన విశ్వాసులు ఎందరినో శ్రీసభలో చూస్తున్నాం. సిలువ అనేది కష్టాలకు, శ్రమలకు గుర్తు. కాని క్రీస్తు వలన సిలువ రక్షణకు గుర్తుగా మారింది. దీనిని బట్టి అనేక బాధలను అనుభవించిన యోహాను తాను నమ్మిన సిలువను వీడక సిలువ యోహానుగా పిలువ బడుతున్నారు.

పునీత యోహానుగారి తండ్రి ఫ్రాన్సిస్కో. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. కాని తమ కుటుంబం హోదా కంటే తక్కువ స్థాయిలో ఉన్న స్త్రీని వివాహ మాడాడు. అందువలన తనకు వారసత్వంగా సంక్రమించాల్సిన ఆస్థిపాస్తులు ఇవ్వబడలేదు. పేద జీవితం జీవించాల్సి వచ్చింది. నేత పని వృత్తిగా తీసుకొని తన భార్యతో సహా కష్టించి జీవనోపాధి కలిగించుకున్నాడు. వీరి ప్రేమ సంతానమే యోహాను. తండ్రి తన చిన్నప్పుడే మరణించాడు.

పేదరికం వన సరియైన చదువుకు నోచుకోలేదు. తన తల్లిని ఆదుకొనే నిమిత్తం ఒక ఆసుపత్రిలో సేవకునిగా చేరారు. ఈవిధంగా బాల్యంలోనే ఏడు సంవత్సరాలు కష్టపడి పనిచేసి భుక్తి గడుపు కున్నారు. ఒకవైపు పని చేస్తూనే మరోవైపు యేసు సభ గురువు పాఠశాలలో కొద్దిపాటి విద్యను అభ్యసించాడు. ఆ సమయంలోనే ఒక గురువు కావాలని తలంచాడు. కార్మెలైటు సభలో చేరాడు. క్రీస్తు ప్రతినిధిగా గురుపట్టాభిషిక్తుడైనాడు.

ఆ రోజుల్లో యోహానుగారికి సిస్టర్‌ అవిలాపురి తెరెసాగారితో పరిచయం ఏర్పడినది. ఆమె అప్పటి కార్మెలైటు సభను సంస్కరించి మహిళలకోసం ఒక సభను స్థాపించాలన్న కృషిలో నిమగ్నమై యున్నారు. యోహాను గారిని కూడా ఒక సభను స్థాపించమని ఆమె కోరారు. ఆమె కోరిక మేరకు కార్మెలైటు సభను కొద్ది మార్పులు చేసి సంస్థను వారు ప్రారంభించారు. వీరు క్రొత్తగా సంస్కరణను ప్రవేశ పెట్టి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. కొంతమంది యోహాను గారిని ఒక అవిధేయత సన్యాసిగా ముద్రవేసి ఒక గదిలో నిర్భంధించారు. ఇలా తొమ్మిది మాసాలు యోహానుగారు ఒంటరిగా ప్రార్ధిస్తూ అనేక దైవ దర్శనాలను పొంది ఆధ్యాత్మికంగా బలం పుంజుకున్నారు. ఈ కాలంలోనే వారు ‘‘ఆత్మకు అంధకార రాత్రి’’ అనే పుస్తకం వ్రాశారు. ఇది వీరి గొప్ప రచన.

తర్వాత కొన్నాళ్ళకు కార్మెలైటు సభకు ప్రాంతీయ అధిపతిగా నియమితుయ్యారు. తాను చేసెడు దీన కార్యక్రమాలపట్ల కొంతమంది అపోహలు, అపార్ధాలు సృష్టించడం వలన, యోహాను గారిని పదవీచ్యుతులను చేసి సుదూర మఠానికి బదలీ చేశారు. వీరి ఆధ్యాత్మిక, మానసిక ప్రవర్తనను సాటి సన్యాసులే అవగాహన చేసుకోలేక పోవడం వలన వీరు అనేక కష్టాలు, బాధలు, అనుభవించాల్సి వచ్చింది. అనంతరం వీరు తీవ్ర అస్వస్థతకు గురియై తన 49వ యేట 1591 లో పరలోక ప్రాప్తినొందారు.

వీరికి 1726లో 13వ బెనడిక్ట్‌ పోపుగారిచే పునీత పట్టం ఇవ్వబడిరది. నిత్య గురువు క్రీస్తు అనుభవించిన శ్రమలనే ధ్యానిస్తూ యేసు మోసిన సిలువనే ప్రేమిస్తూ కష్టాలు బాధలద్వారా తననుతాను విశుద్ధ పరచుకొంటూ నిజమైన విజయుడయ్యాడు సిలువ యోహాను. ‘‘మంచికి పూనుకొను వానికి దేవుని అనుగ్రహము లభించును. చెడ్డకు పూనుకొను వానికి ఆ చెడుయే దాపురించును’’ (సామె. 11:27).

No comments:

Post a Comment