మరియ మాతృత్వ మహోత్సవము, YEAR ABC


మరియ మాతృత్వ మహోత్సవము, YEAR ABC
1 జనవరి
సంఖ్యా. 6:22-27, గలతీ. 4:4-7, లూకా. 2:16-21

భౌతికంగా మరియ తల్లి క్రీస్తుకు మాత్రమే తల్లి. కానీ ఆధ్యాత్మికంగా క్రీస్తు బాటలో నడిచే ప్రతిఒక్కరికీ ఆమె తల్లి. మరియమాత కన్న ఏకైక కుమారుడు యేసు ప్రభువైతే మరియ మాతృత్వం యేసు ప్రభువుద్వారా ఆయన రక్షించబోయే మానవులందరికీ సంక్రమిస్తుంది, తన ప్రియ కుమారుడు యేసు నామమున ముక్తి భాగ్యాన్ని పొందే భక్తజనులందరూ ఆ మాతృమూర్తికి బిడ్డలు అవుతారు.

ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున మన యావత్ విశ్వశ్రీసభ మరియమాత దివ్యమాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఆ తల్లి మాతృత్వంలో దాగియున్న గొప్పతనాన్నిగూర్చి, పరిశుద్ధతనుగూర్చి, మరియతల్లి సకల మానవాళికి తల్లి అనే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నది.

కన్యక అయిన మరియ, దేవుని తల్లి (గ్రీకు Theotokos). Theotokos అనగా 'దేవున్ని మోసేవారు' లేక 'దేవునికి జన్మనిచ్చేవారు' అని అర్ధము. 431వ సం.లో ''ఎఫెసు సభ''నందు మరియ దేవునితల్లి అని అధికారికముగా ప్రకటించబడి యున్నారు. ఎందుకన, ఆమె కుమారుడు యేసుక్రీస్తు, దేవుడు - మానవుడు, దైవ స్వభావమును - మానవ స్వభావమును కలిగియున్న ఒకే వ్యక్తి కనుక. పరిపూర్ణ దేవుడునైన యేసుక్రీస్తు సాక్షాత్తు త్రిత్వంలోని రెండవ వ్యక్తి. అలాంటి భగవాన్మూర్తికి జన్మనిచ్చిన తల్లి మరియ. అలా పరిపూర్ణమైన దైవ-మానవ స్వభావాలు మూర్తిభవించిన యేసుప్రభువును కన్నతల్లిని దేవుని తల్లి, దేవమాత అనటం ఎంత మాత్రము ఆక్షేపణీయం కాదు. కనక మరియతల్లిని దేవమాత అని సంబోధించడం సమంజసమే.

పవిత్రాత్మ ప్రేరిపితురాలైన ఎలిజబేతమ్మ సాక్షాత్తు మరియతల్లిని "నా ప్రభువు తల్లి" (లూకా. 1:43) అని ఎలుగెత్తి పలికినది. పవిత్రాత్మ ప్రేరణతో ఎలిజబేతమ్మ పలికిన మాట అక్షరాలా సత్యం. పవిత్రాత్మ అనుగ్రహంతో, దివ్య శక్తితో తాను గర్భాన  దాల్చిన వ్యక్తి, తన రక్తమాంసాలను ఇచ్చి జీవం పోసిన వ్యక్తి. సాక్షాత్తు తండ్రి దేవుని జనితైక కుమారుడు, త్రిత్వంలోని రెండవ వ్యక్తి, పుత్ర భగవానుడు అలాంటి కుమార దేవుని కన్న మరియమాత దేవమాత కాదా! కన్న ప్రేవుల సాక్షిగా మరియతల్లి దేవమాతే! ఇదే సత్యాన్ని నిర్ధారిస్తూ శ్రీసభ, మరియ యదార్ధంగా దేవుని తల్లి దేవమాతేనని విశ్వసిస్తోంది (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 495).

మరియ మాతృత్వం - దైవ మాతృత్వం
మాతృత్వం అనునది ఆడజన్మకు దేవుడిచ్చిన గొప్పవరం. సాధారణంగా మాతృత్వం అనునది దాంపత్య జీవితంద్వారా కలుగుతుంది. అది సహజం, కాని, మరియతల్లి మాతృత్వం దీనికి భిన్నమైనది, గొప్పది,  పవిత్రమైనది, ఎందుకంటే, మరియ మాతృత్వం దాంపత్య జీవితం వలన కలిగినది కాదు. సాక్షాత్తు పవిత్రాత్మ ప్రభావంతో ఆమె గర్భం దాల్చారు, క్రీస్తుకు జన్మనిచ్చారు (లూకా. 1:34,35). "యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి యిమ్మానువేలు అని పేరు పెట్టును (యెషయ 7:14) అను ప్రవచనాన్ని, మరియతల్లి నెరవేర్చి "అనుగ్రహ పరిపూర్ణ రాలుగా" ధన్యురాలుగా చరిత్రకెక్కారు.

కన్యత్వం చెడని మాత
దేవమాత ప్రార్థనలో మరియతల్లిని "కన్యశుద్దము చెడనిమాతా, అని మనము సంబోధిస్తూ ఉన్నాము. మరియతల్లి నిత్యకన్య ఎలా అవుతారు? మరియతల్లి పురుషుని సహకారంతో బిడ్డను కనలేదు. సాక్షాత్తు పవిత్రాత్మ ప్రభావముతో కన్నారు అని బైబులు  గ్రంధము బోధిస్తున్నది (లూకా. 1:34,35). మరియతల్లి నిత్యకన్య అని, కన్యగానే దైవకుమారుడికి జన్మనిచ్చింది అని మన తల్లి శ్రీసభ తొలి దశనుంచి విశ్వసిస్తూనే వస్తోంది. శ్రీసభ విశ్వాసానికి మూలం సువార్త ప్రబోధం. దైవకుమారుడు యేసుక్రీస్తు పవిత్రాత్మ వలననే కన్య మరియతల్లి గర్భాన శిశువుగా జన్మించారని. ప్రభు జననానికి పురుష సాంగత్యం కారణం కాదని శ్రీసభ ప్రగాఢ విశ్వాసం (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 496). అంతేకాదు, క్రీస్తు భగవానుడు ఇలా ఒక కన్యగర్భాన నరావతారుడై జన్మించటం మానవ మేధస్సుకు, మానవ తర్కానికి అతీతమైన దివ్యశక్తి ప్రభావంతో జరిగిన దైవకార్యమనికూడా శ్రీసభ విశ్వసిస్తుంది. ఈ సందర్భంలోనే మనము ఒక  కతోలిక  వేదాంతి చెప్పిన మాటలను మననం చేసుకోవాలి, "విశ్వసించే వాళ్లకు వివరణ అక్కరలేదు; విశ్వసించని వాళ్లకు వివరించడం సాధ్యం కాదు."

మానవుల మాత మరియ
మరియతల్లి మనందరికీ తల్లి! క్రీస్తు భగవానుడు సిలువమీద మరణించేముందు, తన మాతృమూర్తిని తనకు అత్యంత ప్రియశిష్యుడు యోహానుకు తల్లిగా అప్పగించారు (యోహాను. 19:27) దీనిద్వారా, మరియమాత మానవులందరికీ తల్లి అని క్రీస్తు అధికారికంగా ప్రకటించారు. ఆ క్షణంనుండి మరియమాత అపోస్తులకు, యావత్ మానవజాతికి తల్లి అయ్యారు. క్రీస్తును గురించి ప్రకటిస్తే ఖచ్చితంగా మరణ శిక్ష విధిస్తామని రోమనులు ప్రకటించిన నేపధ్యములో, ప్రాణభయంతోనున్న అపోస్తులులతో కలిసి మరియ ఎడతెగక ప్రార్ధన చేసారు. వారందరినీ చైతన్యపరచారు. పవిత్రాత్మను రాకడ సమయములో వారితోనే యున్నారు. వారిలో ఉన్న పిరికితనాన్ని సమాధి చేశారు. ధైర్యముగా సువార్తను ప్రకటించారు. చివరికి క్రీస్తుకోసం మరణించటానికి సైతం వాళ్లు సిద్ధపడ్డారు, ప్రాణత్యాగంకూడా చేశారు. మరియతల్లి శ్రీసభను కాపాడింది. ఇప్పటికీ, ఎప్పటికీ మరియ తల్లి శ్రీసభకు సకల మానవాళికి తల్లిగా కొనసాగుతుంది.

మరియ దేవునితల్లి, మనందరికీ తల్లికూడా. మరియతల్లిపై భక్తివిశ్వాసాలను పెంపొందిoచు కోవడానికి ప్రయత్నం చేద్దాం.

దేవునితల్లియైన మరియమ్మకు మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవదూత అందించిన సందేశానికి వినయపూర్వక హృదయముతో 'అవును' అని చెప్పుటవలన, మనకి జీవితాన్ని, రక్షణను తన గర్భములోని శిశువుద్వారా తీసికొని వచ్చింది. ఈ రక్షణకార్యమునకై దేవుడు మరియమ్మను ప్రత్యేకవిధముగా, జన్మపాపరిహితగా ఎన్నుకొన్నాడు. ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు చెబుతున్నట్లు, కాలము పరిపక్వమైనప్పుడు దేవుని కుమారున్ని మోయుటకు, దేవునికి తల్లిగా మారుటకు ఆమెను ఎన్నుకొని యున్నాడు (గలతీ. 4:4).

గతమున దేవుడు తనప్రజలతో, ప్రవక్తలద్వారా మాట్లాడియున్నాడు (హెబ్రీ. 1:1-12). తన యాజకులద్వారా దేవుడు తనప్రజలను దీవించియున్నాడు. ఈనాటి మొదటిపఠనములో, యాజకులైన ఆహారోను, అతని పుత్రులు ఏవిధముగా ప్రజలపై దీవెనలు పలుకవలెనో యావే మోషేకు తెలియజేసి యున్నాడు (సంఖ్యా. 6:22-27). కాని, ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపియున్నాడు. ఆయన రాజ్యమును, మహిమను తన కుమారునిద్వారా బయలుపరచి యున్నాడు. సకలమానవాళికి తన రక్షణప్రణాళికను ఎరుకపరచి యున్నాడు. (యోహాను. 14:8-9).

సృష్టి ఆరంభమునుండి ఎన్నుకొనిన, నడిపింపబడిన దేవుని ప్రజలనుండి ఉద్భవించినవాడు యేసు. సువిశేష పఠనములో విన్నవిధముగా (లూకా. 2:21) శిశువుకు సున్నతి చేయడముద్వారా (ఆది. 17:1-14) అబ్రహాముతో దేవుడు చేసిన ఒడంబడికకు వారసుడు. మనము క్రీస్తునందు జ్ఞానస్నానము పొందుటద్వారా దేవునికి దత్తపుత్రులుగా మారియున్నాము (కొలస్సీ. 2:11; ఫిలిప్పీ. 3:3). దేవుని బిడ్డలముగా, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములకు (ఆది. 12:3; 22:18) మనమును వారసులమగు చున్నాము (గలతీ. 3:14). యాజకుడైన ఆహారోను ఈ దీవేనలనే దైవప్రజలపై అందించి యున్నాడు. ఈనాడు ఈ దీవెనలను మనముకూడా మరియతల్లిద్వారా, రక్షకుడైన యేసుక్రీస్తుద్వారా పొందుచున్నాము. ఈ గొప్ప ఆనందదాయకమైన శుభసందేశమే, దేవదూతద్వారా గొల్లలకు తెలియజేయడమైనది (లూకా. 2:10).

యేసు బెత్లేహేములో జన్మించాడు. యోసేపు, మరియమ్మలకుతప్ప ఆ విషయం ఎవరికినీ తెలియదు. కాని, వేగముగా గొల్లలకు ఆ శుభసందేశం, లోకరక్షకుని జననపరమరహస్యం తెలియజేయడమైనది. దేవదూత వారిఎదుట ప్రత్యక్షమై, ''మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభసమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తుప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువులతొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు" (లూకా. 2:10-12) అని తెలియజేసెను. దేవుడు తెలియజేసిన ఆ పరమరహస్యాన్ని గాంచుటకు గొల్లలు వెమ్మటే బెత్లేహేమునకు వెళ్ళిరి. అక్కడ పశువుల కొట్టములో మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి.

గొల్లలవలె మనముకూడా వేగముగా మరియ యోసేపులతో యేసును కనుగొనుటకు త్వరపడుదాం. గొల్లలు తాము వినినవానిని, చూచినవానిని గురించి దేవునివైభవమును శ్లాఘించిరి (లూకా. 2:20). దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దీవెనలకి మనముకూడా ఆయనను మహిమపరచుదాం. మరియతల్లివలె, దేవునివాక్యమును మనస్సున పదిలపరచుకొని ధ్యానించాలి. క్రీస్తుసందేశము మనహృదయాలలో సమృద్ధిగా ఉండాలి (కొలస్సీ. 3:16). అప్పుడే దేవదూతవలె, గొల్లలవలె, జ్ఞానులవలె మనుమును ఈ గొప్ప సందేశాన్ని, దీవెనని, పరమరహస్యాన్ని ఇతరులకు ఇవ్వగలం.

దేవుడు మనకి ఒసగిన మరో గొప్ప వరం 'మరో నూతన సంవత్సరం'. నూతన సంవత్సరాన్ని ఒక గొప్ప నమ్మకము, ఆశతో చూద్దాం. మన సమాజములో అభివృద్దితోపాటు, చెడుకూడా పెరుగుతూ ఉంది. భయము, ఆధ్యాత్మికలేమి పెరగుతూ ఉన్నాయి. స్వార్ధము రోజురోజుకి పెరుగుతుంది. రాజకీయ అంధకారం, పేద-ధనిక భేదం, వ్యభిచారం, విభజనలు, మాదకద్రవ్యాలు, కులవర్గ భేదాలు మొ.గు సమస్యలతో సతమత మగుచున్నాము. ఇలాంటి పరిస్థితులలో గొప్ప ఆశగల నమ్మకముతో ముందుకు సాగాలి. దేవునిపై ఆధారపడాలి. ఆయనవైపు చూడాలి. మన సమస్యలన్నింటికీ ఆయనే పరిష్కారం. ఈ నమ్మకానికి గొప్ప ఆశ మన యువత. సమాజానికి వారు ఎంతో అభివృద్ధిని తేగలరు. తల్లిదండ్రులు, భోదకులు, యువతపై దృష్టిసారించి విద్యావంతులను చేయడానికి కృషిచేయాలి. ప్రభుత్వము, మీడియా, సంస్థలు యువత అభివృద్ధికి తోడ్పడాలి. అలాగే, పాశ్చాత్య దేశాలలో ఆర్ధికసమస్యలు ఉన్న సమయములో మన భారతదేశ ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగుపడి ఉంది. అయితే, అధికశాతం అభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని మరచిపోరాదు. కొంతకాలముగా, వ్యవసాయదారులు ఎన్నోకష్టాలను ఎదుర్కొంటున్నారు. నూతన సంవత్సరములో వారి మంచికోసం ప్రార్ధన చేద్దాం.

అన్నింటికన్నా ఎక్కువగా, మనమందరం మంచి మానవతాసంబంధాలను కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్ధంచేసికొంటూ, సహాయం చేసికొంటూ ముందుకు సాగాలి. నిజమైన స్వేచ్చ, సత్యములను కనుగొని జీవించుదాము. న్యాయముతో, సామాజిక, నైతికవిలువలతో జీవించుదాము. శాంతిస్థాపన మరో ముఖ్యఅంశం, ధ్యేయం. ''శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని బిడ్డలనబడుదురు (మత్త. 5:9).

మరియ తల్లిని మనమందరంకూడా మన ఆధ్యాత్మిక తల్లిగా నెలకొల్పుకుందాం. మరియతల్లి పుట్టిందే ఇతరులకు సహాయం చేయటానికి. ఆ తల్లి మనకు సహాయం చేయటానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. మనం చేయవలసింది ఒక్కటే భక్తిశ్రద్ధలతో జపమాలను ధ్యానం చేయటం, ఆ తల్లి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించటం. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానంచేసినట్లైతే మరియతల్లి ఎందరికో సహాయం చేశారు. ఉదాహరణకి, కానాపల్లెలో ద్రాక్షరసం కొరత ఏర్పడితే తన ప్రియ కుమారునిద్వారా ఆ కుటుంబానికి సహాయం చేయించారు, తన బంధువు ఎలిజబేతమ్మ కడువృద్ధాప్యంలో గర్భంధరించినప్పుడు, మూడు నెలలు సేవలు చేశారు. యోహాను స్వీకరించినట్లుగా మనంకూడా మరియతల్లిని మన అమ్మగా స్వీకరిద్దాం. మన ప్రార్ధన అవసరతలను మరియమాత మధ్యస్థ ప్రార్థనా సహాయముద్వారా ఆ క్రీస్తు భగవానుడికి సమర్పించుకుందాం.

No comments:

Post a Comment