పునీత మరియ గొరెట్టి (జూలై 6)
ఇటలీదేశ కన్య, వేదసాక్షి, పరిశుద్ధతకు మాతృక (క్రీ.శ. 1890-1902)
ఇటలీ దేశములోని ‘అంకోన’ రాష్ట్రములోని కొరినాల్దో అనే ప్రాంతములో వ్యవసాయ కూలీ కుటుంబములో, ఏడుగురిలో మూడవ సంతానముగా 16 అక్టోబరు 1890లో జన్మించినది. లూయిస్ గొరెట్టి, అసుంత తల్లిదండ్రులు. పేదరికము వలన మరియ గొరెట్టి విద్యాభ్యాసం చేయలేక పోయింది. దైవ భక్తురాలైన తల్లి చదువుకోనప్పటికినీ, కంఠస్తముగా తెలిసిన కతోలిక సత్యోపదేశమును బోధించుట వలన, మరియ గొరెట్టి క్రైస్తవ విశ్వాసమును బలీయముగా పొందినది. మరియ గొరెట్టికి తొమ్మిది సం.ల ప్రాయములో కుటుంబ ఉపాధికై, రోమునగర సమీపములోని ‘నెట్టూనో’ అను ప్రాంతమునకు వెళ్ళారు. ఆ తరువాతి సంవత్సరం తండ్రి లూయిస్ మలేరియాతో మరణించాడు. అప్పుడు కుటుంబ భారమంతా తల్లి అసుంతపై పడింది. తల్లి పెద్ద పిల్లలతో వ్యవసాయ కూలీ పనులకు వెళ్ళినప్పుడు, మరియ గొరెట్టి తనకన్న చిన్న వారిని చూసుకోవడం, అల్లికలు చేయడం, ఇంటి పనులు చేసి చక్కబెట్టడంలాంటి పనులన్ని చేసేది. కష్టాల్లో ఉన్నప్పటికీ, ఈ కుటుంబం దేవున్ని అమితముగా ప్రేమించినది.
పదకొండు సం.ల ప్రాయములో మరియ గొరెట్టి తన చిరకాల కోరికయైన దివ్యసత్ప్రసాదమును అత్యంత భక్తిశ్రద్ధలతో స్వీకరించినది. దానికోసమై ఆధ్యాత్మికముగా ఎంతగానో సిద్ధపడింది. పాపభీతితో జీవించినది. విధేయత, వినమ్రత, పవిత్రతకు ప్రతిరూపముగా జీవించినది. పాపసంకీర్తనం చేయడానికి ఏడు మైళ్ళు నడిచి వెళ్ళాల్సి వచ్చినను ఆనందముతో వెళ్లి వచ్చేవారు.
మరియ గొరెట్టి
ఉంటున్న ఇంటిలోనే క్రింది భాగములో జాన్ సెరినెల్లి అతని పంతొమ్మిదేల్ల కుమారుడు
అలెగ్జాండరు ఉండేవారు. దుష్టబుద్ది గల అలెగ్జాండరు మరియ గొరెట్టిపై కన్నుపడి చెరచాలని
ప్రయత్నం చేసాడు. అప్పటికే రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అది తప్పు,
దేవుడు శిక్షిస్తాడు అని చెప్ప ప్రయత్నం చేసింది. కాని అలెగ్జాండరు ఆమె మాటలను
లెక్కచేయలేదు. 5 జూలై 1902లో, మరియ గొరెట్టి, తన చిన్న చెల్లి తెరెసాను
ఆడిస్తుండగా, ఆమెను లోని గదిలోనికి ఈడ్చుకుని వెళ్ళాడు. “నా దేహం ముక్కలుగా
నరకబడినను, నేను ఎన్నటికి పాపం చేయను” అని అంటూ, మరియ గొరెట్టి నిరాకరించడముతో, అలెగ్జాండరు
తీరని కోపముతో ఆమెను కత్తితో అనేకసార్లు (14 సార్లు) పొడిచి అక్కడనుండి పారిపోయాడు.
ఇంటికి వచ్చిన తల్లి, తోబుట్టువులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స
చేయించారు.
దురదృష్టవశాత్తు,
రక్తము ఎక్కువ పోవడము వలన, మరుసటి రోజే (6 జూలై) ఆమె, ఆసుపత్రిలో మరియతల్లి
ప్రతిమవైపు చూస్తూ, చేతిలోని సిలువను తన గుండెలకు హత్తుకొంటూ మరణించినది. మరణిస్తూ
అలెగ్జాండరును క్షమించినది. అతని మారుమనస్సు కొరకు ప్రార్ధించినది. అలెగ్జాండరు 29
సం.లు కారాగారములో ఉండగా, అతనికి మరియ గొరెట్టి దర్శన మిచ్చారు. ఆమె ప్రార్ధించిన
విధముగనే, అలెగ్జాండరు పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొందాడు. మరియ గొరెట్టి ధన్యత,
పునీత పట్టాలకు ప్రధాన సాక్షిగా నిలిచాడు.
27
ఏప్రిల్ 1947లో ధన్యురాలుగా, 24 జూన్ 1950లో పునీతురాలుగా మరియ గొరెట్టిని పన్నెండవ
పయస్ (భక్తినాధ) పోపుగారు ప్రకటించారు. “మరియ గొరెట్టి కత్తికి జడవ లేదు, పాపానికి
భీతిల్లారు” అని పోపుగారు కొనియాడారు. ఆమె ధన్యత పట్టములో 2,50,000 ప్రజలు పాల్గొన్నారు.
ఆమె జీవితం ఎంతమందిని తాకిందో అర్ధమగుచున్నది!.
నేడు ఆమె పవిత్రత, విశ్వాస జీవితం ఆదర్శం. అలాగే ఆశ్చర్యం! కేవలం 11 సం.ల ప్రాయమున శారీరక పరిశుద్ధత కొరకు వేదసాక్షి మరణాన్ని పొందారు. అంతకన్న ఎక్కువగా, హంతకుడిని ఆమె క్షమించడం. ఈ బాల వేదసాక్షి ధైర్యానికి, సాహసానికి, విశ్వాసానికి, పవిత్రతకు జేజేలు!
No comments:
Post a Comment