సకల పునీతుల పండుగ (01 నవంబరు)
దర్శన. 7:2-4, 9-14, 1 యోహా.
3:1-3, మత్త. 5:1-12
సకల పునీతుల మహోత్సవము మనము ఎవరమో, భవిష్యత్తులో మనము
ఏమగుదమో అన్న విషయాలను గుర్తుకు చేస్తుంది: “మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని,
ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చునప్పుడు ఆయన
యధార్ధ రూపమును మనము చూతుము. ఆయనవలె అగుదుము” (1 యోహా. 3:2). పునీతులు వారి జీవిత
గమ్యస్థానాన్ని విజయవంతముగా చేరుకొనియున్నారు. మనము కూడా వారి అడుగుజాడలలో
నడవాలని, మన జీవిత ధ్యేయముపై మన చూపును ఉంచాలని గుర్తుకు చేయుచున్నారు. ప్రభువు
బోధించిన అష్టభాగ్యాలను (మత్త. 5:1-12) జీవించి, కష్టాలలో వారు మనలను
ప్రోత్సహిస్తున్నారు, మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనకు తోడుగా ఉంటున్నారు. ఎందుకన,
వారుకూడా మనలాగే కష్టాలను అనుభవించి యున్నారు. శోధనలకు, బలహీనతలకు లోనయ్యారు. అయితే,
వారు ఎల్లప్పుడూ ప్రభువులో ఎదిగారు, ప్రభువులో బలపడినారు.
ఇదే ప్రయాణాన్ని బైబులులో కూడా అనేకమంది వ్యక్తులలో
చూస్తున్నాము: భయముతో తన భార్యను సోదరిగా పరిచయం చేసిన అబ్రహాము ... విశ్వాసమునకు
తండ్రిగా ఎదిగాడు. సరిగా మాటలాడలేని మరియు హత్య చేసిన మోషే దైవప్రజలను వాగ్ధత్త
భూమికి నడిపించాడు. నూతన నిబంధనములో ప్రభువు శ్రమలను అడ్డుకున్న పేతురు, ఆ తరువాత
క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించడానికి సిద్ధపడ్డాడు.
పునీతులు సంతోషవంతులు, అనగా ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన
జీవితాన్ని జీవించినవారు, ఎందుకన, వారు “దీనాత్ములు, శోకార్తులు, వినమ్రులు, నీతి
నిమిత్తము ఆకలిదప్పులు గలిగినవారు, దయామయులు, నిర్మల హృదయులు...” వారి సర్వసం క్రీస్తే
అయ్యున్నాడు. యేసు క్రీస్తే వారి సంతోషం.
పునీతులలో వేదసాక్షులను కూడా స్మరించుకొంటున్నాము. అందుకే
ఈనాటి మొదటి పఠనములో వింటున్నాము: “భయంకర హింసను సురక్షితముగ అధిగమించిన వారే ఈ
వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళన మొనర్చుకొని వానిని
తెల్లనివిగ చేసికొనిరి” (దర్శన. 7:14).
పునీతుడు / పునీతురాలు అనగా పవిత్రుడు / పవిత్రురాలు అని అర్ధం. వారు
పవిత్ర జీవితమును వీరోచితముగా జీవించినవారు. వారు దేవుళ్ళు, దేవతలు కారు. వారు సృష్టికర్తయైన దేవుని అత్యుత్తమ నిర్మాణములు, ప్రతినిధులు, స్వరములు. నులివెచ్చదనముతో అటుఇటు
గాకుండా జీవించే వందమంది కంటే ఒక్క పునీతుడు, ఒక్క పునీతురాలు దేవునికి అమోఘమైన మహిమను సంపాదించి పెడతారు. పునీతులందు దేవుడు తన వాక్కు విలువను, సువార్తా సుగంధమును, అష్టభాగ్యాల మాధుర్యాన్ని నిక్షిప్త పరుస్తారు.
ఈ పునీతులందే శ్రీసభ తన అమూల్య సంపదను, తన విలువ క్రమాన్ని భద్రపరుస్తుంది. పునీతులద్వారా పునరుద్ఘాటిస్తూ, తన సభ్యులను సంఘటిత పరుస్తుంది. పునీతులద్వారా తన ఔన్నత్యాన్ని,
మహిమను, విజ్ఞానమును ప్రతిబింబిస్తుంది.
పునీతులు జ్ఞాన చోదకులు, సునిశిత
బోధకులు, ఆదర్శప్రాయులు, దైవరాజ్య నమూనాలు, ఇహవరాలకు వారధులు. అలాంటి
వారి స్మరణ నేడు మనకు గొప్ప దీవెన! అయితే, పునీతులలో అన్నిరకాల జీవన స్థాయికి, అంతస్తుకు చెందిన వారున్నారు. యేసు ప్రభుని ప్రధమ శిష్యులు (అపోస్తులు), పీఠాధిపతులు,
సువార్తీకులు, ప్రేషితులు, దైవరాజ్యంకోసం అహర్నిశలు శ్రమించినవారు,
వివిధ మఠస్థాపకులు,
గురువిధ్యాయాలలో ఆచార్యులు,
మఠవాసులు (స్త్రీలు, పురుషులు), నూతనముగా విశ్వాసమును చేపట్టినవారు,
వివిధ దేశవాసులు (భారతీయులు కూడా), అత్యున్నత పురస్కారం (నోబల్ బహుమతి) పొందినవారు,
వీరందరూ దేవుని పరికరాలే, ఆనవాళ్ళే.
ఈ సకల పునీతుల
మహోత్సవం రోజున, శ్రీసభ అధికారికముగా గుర్తించబడిన, గుర్తింపులేని, పునీత పట్టం కట్టిన, కట్టని సకల పునీతులను గౌరవిస్తూ, వారిని ఆ గొప్ప స్థితికి చేర్చిన పవిత్రాత్మను ఆరాధిస్తున్నాము.
మనకోసం మధ్యవర్తిత్వం వహించి ప్రార్ధించమని మనం పునీతులను వేడుకోవడం అవసరమా? దీనిని గురించి
పునీత తోమాస్ అక్వినాసుగారు, దేవుని అధికార క్రమంలో, మనం పునీతుల
ద్వారా ఆయన చెంతకు చేర్చబడాలని,
ఆయన దివ్యవరాలు వారిద్వారా మనపై కురిపిస్తారని, వారి మధ్యవర్తిత్వం ద్వారా మనపై దీవెనలు దిగివస్తాయని చెప్పారు. పునీతుల విజ్ఞానం దేవుని ప్రేమలో నెలకొని ఉంటుంది. అందువలననే,
పునీత అల్ఫోన్సుస్ గారు,
“ఎవరైతే తన హృదయంలో సంపూర్ణ పవిత్రత సాధించుటకు ఆశను కలిగి ఉండరో అతడు/ఆమె ఉత్తమ క్రైస్తవుడు/రాలు కానేరడు/దు” అని తెలిపారు. నేడు
వారు మనకోసం ప్రార్ధన చేయుచున్నారు.
దేవుడు ఎప్పుడునూ అసాధ్యమైన కార్యాలను కోరడు. మన జీవితంలో చేసే ప్రతి మంచి పనికి దేవుడు బహుమతినిస్తారు. అది ఈ జీవితంలో కూడా సాధ్యమే! కాని, సణుగుకొనుచు పనిచేస్తే దేవుని నుండి గొప్ప కార్యమును, మహత్తర కార్యమును ఎలా ఆశించగలం! అని పునీత అవిలాపుర తెరేసమ్మగారు అన్నారు. అయితే, ఈ లోకంలో జీవిస్తున్న మనం సంపూర్ణ స్థితిగల దైవరాజ్యంలోని ఆత్మతో సఖ్యత కలిగియున్నాం. మన విశ్వాస ప్రకటనలో “పునీతుల
సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను” అని చెప్పుచున్నాము.
పునీత ఎఫ్రేము, పునీత జాన్ క్రిసోస్తం వారిననుసరించి నాల్గవ శతాబ్దంలోనే సకల వేదసాక్షులను (పునీతులను) గౌరవించడం జరిగింది. ఎనిమిదవ శతాబ్దంలో రోము నగరంలో నవంబర్ ఒకటవ తారీఖున ఈ సంప్రదాయము ఆచరించడం ఉండేది. ఈ శతాబ్దంలోనే జగద్గురువులైన నాలుగవ గ్రెగోరి ఈ సంప్రదాయాన్ని శ్రీసభ అంతటికీ వ్యాపింప చేసారు. ఈరోజున ప్రతి విచారణ గురువు తన విచారణలోని ప్రజందరి కొరకు దివ్యపూజా బలిని అర్పిస్తారు.
మనం సత్యోపదేశంలో నేర్చుకున్న దానిని బట్టి, ఈలోకంలో
ఉన్నవారు యుద్ధసభ లేదా యుద్ధరంగ క్రైస్తవులు, ఉత్తరించు స్థలంలోని ఆత్మలు ఉత్తరించు సభ లేదా బాధామయ క్రైస్తవులు, మోక్షాన్ని స్వతంత్రించుకున్న ఆత్మల జయసభ లేదా విజయ క్రైస్తవులు అని తెలుసుకున్నాం. ఈ మూడు సభలు కలిస్తేనే విశ్వ శ్రీసభ అవుతుంది. ఈ సభలు ఒకరికొకరు సంబంధం కలిగి దైవ ప్రేమలో, కృపలో భాగస్తులై ఒక కుటుంబంగా భావించాలి. ఒక కుటుంబములోని సభ్యులు ఎలాంటి సహాయ సహకారాలు అందించుకుంటూ జీవిస్తుంటారో అందరికీ తెలిసిందే కదా!
ఇటువంటి సఖ్యత, బాంధవ్యమును బట్టి దైవరాజ్యంలోని పునీతులు మనల్ని కూడా తమ అడుగు జాడల్లో నడచి, ప్రభు మార్గంలో పైకిరావాలని, శక్తివంచన లేకుండా తమ ప్రార్ధనల్ని, విన్నపాలను ప్రభువుకు అప్పగిస్తారని అనడంలో సందేహం లేదు!
“పరదేశం (భూలోకం)లో ఉన్న మనల్ని స్వదేశం
(మోక్షరాజ్యం)లోని స్వగృహమునకు చేరి తండ్రిని చూచి, స్తుతించి, ఆరాధిస్తూ, సంతోషిస్తూ ఉండాలని సకల పునీతులు సదా మనలను స్వాగతిస్తూ ఉంటారు. ప్రభువుద్వారా,
ప్రభువుతో, ప్రభువునందు ఉండేందుకై మనకోసం ఆ పునీతులు మధ్యవర్తుల్లా ఎల్లప్పుడూ దేవాధి దేవుని వేడుకుంటూ ఉంటారు. వారి శ్రద్ధ మన బహీనతల్లో ఎంతో సహాయకారి కాగలదు” అని ఆరవ పౌలు పోపుగారు సందేశం ఇచ్చారు.
ఆత్మలన్నింటికి పరిపూర్ణతను ప్రసాదించి, హెచ్చించి, వారిని దేవుని మహిమలోనికి ప్రవేశింప యోగ్యత కలిగించేది స్వయంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడే. ఇక్కడ మనం గుర్తుంచుకోవసినది ఏమంటే, క్రీస్తు పరమ దేవరహస్యాలను క్రోడీకరించి, ఏడాది పొడవున గుర్తుచేసి కొనియాడ చేసిన శ్రీసభ ఈ సకల పునీతుల పండుగ రోజున క్రీస్తు సిలువ విజయ ఫలాల్ని గుర్తుచేస్తుంది. పునీతులను సాధించుకున్న ప్రభువును కొనియాడుతుంది.
పరిశుద్ధతకు మారుపేరు మన రక్షకుడైన క్రీస్తు పాపదోషంపై పరిశుద్ధత విజయం సాధించి, మనకు విజయం సాధించి
పెట్టిన క్రీస్తు కృపయే, అనగా క్రీస్తు అద్వితీయ ప్రేమ జీవితమే. అదే ముక్తికి మూలం.
“పరిశుద్ధతను సాధించాలనే కోరిక తన హృదయంలో లేకున్నట్లయితే, అతడు క్రైస్తవుడైనా కాని, అతడు ఉత్తమ క్రైస్తవుడు కాడు, కానేరడు” అంటున్నారు పునీత అల్ఫోన్సుసు గారు. ప్రభువైన క్రీస్తు అసాధ్యమైనదేదీ మనలనుండి కోరుట లేదు. అసాధ్యమనుకున్న మంచికి సుసాధ్యం చేసుకొన ప్రయత్నించమని దేవుడు మనల్ని కోరుతున్నాడు.
క్రీస్తు ప్రేమకోసం, సాక్ష్యంకోసం ఎందరో పుణ్యాత్ములు అనేక ప్రదేశాలలో అనేక విధాల హింసింపబడి వధింప బడ్డారు. ఈ సందర్భంగా ఈ లోకంలో మరణం అనగా పరలోకంలో జననం అని అర్థం అని చెప్తారు.
ధన్యతగల జీవితమును జీవించడమే
పునీత జీవితం, అదియే క్రైస్తవ జీవితము. పునీతులను గౌరవించు క్రమములో మన భక్తి
కేవలం పునీతుల పటాల, స్వరూపాల అలంకరణతో ఆగిపోకూడదు. వారి జీవితం మనకు ఆదర్శం
కావాలి. వారి అడుగుజాడలలో నడవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే నేటి పండుగ, మనలను
ఎంతగానో సవాలు చేయు పండుగ. పునీతునిగా జీవించుటకు ధైర్యము వహించు! ఇది గొప్ప ఆశయం,
ఆదర్శం! మనం అలా జీవించగలమా? అని అంటే తప్పకుండా జీవించవచ్చు అని చెప్పవచ్చు. ఎవరు
కూడా పునీతులుగా పుట్టరు. పునీతులుగా జీవించాలి. ఆ శక్తి మనలో ఉన్నది.
జ్ఞానస్నానములో పవిత్ర జీవితమునకు పిలుపును అందుకొని యున్నాము. ఆ పిలుపునకు
విశ్వాసముగా జీవించాలి.
సకల పునీతులు, ముఖ్యముగా కన్య
మరియ మన జీవితాలకు ఆదర్శముగా ఉండునుగాక! వారి ఆదర్శ జీవితమును పాటించినచో, ఒకరోజు
మనముకూడా వారి సమూహములో చేరెదము. దేవుని ముఖాముఖి గాంచెదము. “పవిత్రమైన జీవితమును
గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువును దర్శింప లేరు” (హెబ్రీ. 12:14).
మన ఆధ్యాత్మిక క్రైస్తవ
జీవితములో, సకల పునీతుల ప్రార్ధనలద్వారా, దేవుడు మన తోడుగా ఉండునుగాక!
DearFr. PRAVEEN
ReplyDeleteI appreciate your efforts and good work. Plz continue...
Excellent work Rev. Fr.Praveen
ReplyDeleteAppreciate your interest and generosity.
ReplyDelete