పునీత అస్సీసి పుర
ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)
ఫ్రాన్సిస్ 12వ శతాబ్దంలో జీవించిన గొప్ప పునీతుడు, మహనీయుడు. ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి ఉండరు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహ, సేవా భావాలతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించ గలనో, అప్పుడే దేవున్ని పరిపూర్ణంగా ప్రేమించగలనని
ఎరిగినవాడు. ప్రేమ, కరుణ స్వరూపియైన దేవుని మంచితనమును
ఫ్రాన్సిస్ అలవర్చుకున్నాడు. పవిత్రాత్మ చేత ప్రేరేపింప బడినవాడు. తనకున్న
ధాతృత్వం, జీవితాంతం ఆచరణలో పెట్టిన
గొప్ప వ్యక్తి. తప్పుచేసిన తన సహోదరులను సరిచేయుటకు ఎన్నడు వెనకాడలేదు. ‘‘ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇప్పటికైనా మొదలు పెడదాం’’ అని తన మరణావస్థలో తన సహోదరులతో పలికిన గొప్ప
పునీతుడు ఫ్రాన్సిస్. దేవుని సృష్టి పట్ల, ముఖ్యంగా మూగ జీవులపట్ల ప్రత్యేకమైన ఆకర్షణని, ప్రేమని, సోదరభావాన్ని
వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.
ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ. 1182లో జన్మించారు. తండ్రి పీటర్ బెర్నార్డ్, తల్లి పీకా. తండ్రి పెద్ద బట్టల వ్యాపారి.
ఫ్రాన్సిస్ చలాకీగా, కలుపుగోలు తనంతో
వ్యాపారంలో తండ్రికి సహాయం చేసేవాడు. కాని, ఫ్రాన్సిస్ విందు, వినోదాలకు
అధికంగా ఖర్చుచేసేవాడు. యుక్త వయస్సులో గొప్ప యోధుడుగా కావాలని కళలు కన్నాడు.
యుద్ధాలలో పాల్గొన్నాడు. పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డాడు.
చెరసాలలో కూడా అందరితో కలవిడిగా తిరుగాడుచూ చతురోక్తులతో నవ్వించేవాడు. చెరనుండి
విడుదల అయిన కొద్ది రోజులకు తీవ్రజబ్బున పడ్డాడు. కోలుకున్నాక, ఆపూలియా వెళ్ళు త్రోవలో ప్రభువు స్వరాన్ని
విన్నాడు: ‘‘ఫ్రాన్సిస్, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా, సేవకుడినా?’’ ‘‘యజమానుడిని’’ అని ఫ్రాన్సిస్ సమాధానం ఇచ్చాడు. మళ్ళీ ఆ స్వరం, ‘‘కాని, నీవు యాజమానుడిని గాక, సేవకుడిని
సేవిస్తున్నావు’’ అని పలికింది.
అప్పుడు, ఫ్రాన్సిస్, ‘‘అయితే, నన్నేమి చేయమంటారు?’’ అని
ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్వరం,
‘‘నీవు తిరిగి
నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు’’ అని చెప్పింది. ఫ్రాన్సిస్ తిరిగి అస్సీసికి
వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్ సువార్త ధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు
దానం చేసాడు. రోము నగరములోని పునీత పేతురు సమాధిని సందర్శించి తననుతాను దేవునికి
అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు సేవలు చేయాలని
తీర్మానించుకున్నాడు.
దైవ చిత్తాన్వేషి
ఈనాటి మానవుడు ‘కోరికలు’ అనే వలయంలో
చిక్కుకున్నాడు. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహ పడిపోతున్నాడు. సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక పోతున్నాడు. దేవుని వాక్యం, కార్యంపై ధ్యానంచేసి, ఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మానవునికి సమయం
లేకుండా పోయింది. దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలోనున్న
ఆనందాన్ని, సంతోషాన్ని గ్రహించలేక
పోతున్నాడు.
ఫ్రాన్సిస్ దైవచిత్తాన్ని అన్వేషించడంలో
పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్త వయస్సులో, చిలిపిగా యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికిని, మార్పు, మారుమనస్సు త్వరలోనే అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాల్లోనికి వెళ్లి
దేవుని వాక్యంపై, ప్రేమపై
ధ్యానించడం, ప్రార్ధించడం
ప్రారంభించాడు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు క్రీస్తు ప్రతిమ ఫ్రాన్సిస్
హృదిని, మదిని తొలచడం ప్రారంభించింది.
ఫ్రాన్సిస్ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే!
ఖచ్చితమైన దైవపిలుపును 14 మే 1208న పునీత మత్తయి గారి పండుగ రోజున పొందాడు. ఆనాటి సువార్తా, ‘‘క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం’’ ఫ్రాన్సిస్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం
చేసుకున్నది వెమ్మటే ఆచరణలో పెట్టుటకు బయలు దేరాడు. ఇలా దైవ చిత్తాన్ని అన్వేషించాడు.
తన జీవితాన్ని చూసి కొందమంది ఆయన సహోదరులుగా, అనుచరులుగా చేరారు. 1209లో 3వ ఇన్నోసెంట్ పోపుగారు ఈ చిన్న సమూహమును
దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా
అభిషేకించి, ఆత్మరక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకు, భిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతిని
ఇచ్చారు. 1219 నాటికి ఫ్రాన్సిస్ అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిస్ స్థాపించిన సభ ఎంతగానో
అభివృద్ధి చెందింది. ఈనాడు ప్రపంచమంతటా వారు సేవలను అందిస్తున్నారు.
ఫ్రాన్సిస్ చాలా పేద జీవితాన్ని జీవించాడు.
ఒక్కోసారి భోజనంలో బూడిద కలుపుకొని తినేవాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు ముళ్ళపొదల్లో
పడుకొనేవాడు. తన సహోదరుల పట్ల శ్రద్ధగా ఉండేవాడు.
ప్రకృతి ప్రేమికుడు
ఫ్రాన్సిస్ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిద్వారా
దేవుని మహిమను పొగడేవాడు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమను, గౌరవాన్ని పెంచుకున్నారు. ప్రకృతిలోని
సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. సమస్తమును తన సహోదరీ, సహోదరులుగా పిలిచాడు. ప్రకృతి పట్ల, అతనికున్న ప్రేమ వలన, ఈ తరము వారు కూడా ప్రకృతి పట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని
కోరుకొనేట్టు ప్రేరేపింప బడాలని ఆశిద్దాం.
14 సెప్టెంబర్ 1221లో ప్రార్ధన
చేస్తుండగా పంచగాయాలను పొందాడు. 3 అక్టోబర్ 1226లో స్వర్గస్తులైనారు. మరణించిన రెండేళ్లకే
శ్రీసభ ఫ్రాన్సిస్‌ను పునీతునిగా ప్రకటించింది.
Excellent write up on seraphic Father Francis. May st Francis bless you.
ReplyDelete