సామాన్య 24వ ఆదివారము
సిలువ విజయం:
విశ్వాసానికి కేంద్రం, నిరీక్షణకు మూలం
“పరలోకము నుండి
దిగివచ్చిన మనుష్యకుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు” (యోహాను 3:13). “ఆయన అన్నివిధముల
మానవమాత్రుడై ఉండి, అంతకంటే వినయముగలవాడై, మరణము వరకును, సిలువపై మరణమువరకును, విధేయుడాయెను” (ఫిలిప్పీ 2:8).
క్రీస్తునందు ప్రియ సహోదరీసహోదరులారా!
సెప్టెంబరు 14న శ్రీసభ పవిత్ర
సిలువ విజయోత్సవంను ఘనంగా జరుపుకుంటుంది. ఈ పండుగ క్రీస్తు
సిలువను మహిమపరచడానికి, ఆ సిలువ మార్గంలో పయనించడానికి,
మన సిలువలను విశ్వాసంతో మోయడానికి మనల్ని
ఆజ్ఞాపిస్తుంది.
క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం, ప్రతీక క్రీస్తు సిలువ. ఇది దేవుని
ప్రేమకు, మానవాళి విమోచనకు, నిత్యజీవానికి ఒక
అద్భుతమైన విజయోత్సవ చిహ్నం. దేవుని అనంతమైన ప్రేమను, క్రీస్తు
చేసిన మహత్తర త్యాగాన్ని, మరియు పాపము, మరణముపై సాధించిన చారిత్రాత్మక విజయాన్ని సిలువ చాటిచెబుతుంది. ఈ విజయం మన విశ్వాసానికి పునాది, మన జీవితాలకు అర్థం, మన ఆశలకు
ఆధారం.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ సిలువను “జీవగ్రంథం” అని పిలిచారు. ఎందుకంటే అది జ్ఞానోదయం, ప్రేమ, వినయం, త్యాగం అనే జీవిత పాఠాలను బోధిస్తుంది. ఇది పునరుత్థాన నిరీక్షణకు, నిత్యజీవానికి ఒక బలమైన గుర్తు. పునీత రోజ్ ఆఫ్ లిమా చెప్పినట్లు, “పరలోకానికి
చేరుకోవడానికి సిలువ తప్ప వేరే నిచ్చెన లేదు”. కనుక, సిలువ లేని పునరుత్థానం ఉండదు.
పునీత రెండవ జాన్ పౌల్ గారు సిలువ క్రైస్తవానికి మూలచిహ్నం అని
పేర్కొన్నారు.
నేటి మొదటి పఠనాన్ని సంఖ్యా కాండము 21:4-9 నుండి ఆలకిస్తున్నాం. ఎదోము దేశం గుండా సాగిపోతున్న ఇస్రాయేలీయులు దేవునిపైనా, మోషేపైనా సణుగుతూ తమ కష్టాల గురించి మొరపెట్టుకున్నారు. దీనికి
శిక్షగా దేవుడు వారి మధ్యలోకి విషసర్పాలను పంపగా, వాటి కాటుకు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తమ తప్పు తెలుసుకున్న ఇస్రాయేలీయులు
పశ్చాత్తాపంతో మోషేను ప్రార్థించగా, దేవుడు ఒక కంచు
సర్పము చేసి స్తంభంపై ఉంచమని చెప్పాడు. ఆ కంచు సర్పం వైపు చూసిన ప్రతి ఒక్కరూ
బ్రతికారు. ఇజ్రాయెలీయులు తమ స్వార్థం, అవిధేయత కారణంగా
శిక్షకు గురయ్యారు. ఈ సంఘటన వారి పాపాలకు, వాటి
పర్యవసానాలకు స్పష్టమైన ఉదాహరణ. అయితే, వారు తమ తప్పును
గుర్తించి, పశ్చాత్తాపంతో మోషే ద్వారా దేవుని దయను
కోరారు. ఇది మన జీవితంలో కూడా పాపం చేసినప్పుడు దేవుని కరుణను కోరడం ఎంత ఆవశ్యకమో
తెలియజేస్తుంది.
ఈ సంఘటన, క్రీస్తు సిలువ త్యాగానికి సూచనగా ఉంది. సర్పం పాపానికి
ప్రతీక. ఇస్రాయేలీయుల అవిధేయత వల్ల విషసర్పాలు వారిని కాటువేశాయి. అలాగే, మానవాళి అంతా ఆదిపాపం వల్ల ఆధ్యాత్మిక మరణాన్ని ఎదుర్కొంది. మోషే
ఎత్తిన కంచు సర్పం విషంనుండి శారీరక స్వస్థతనిచ్చింది. అదేవిధంగా, క్రీస్తు సిలువపై మన పాపాలను భరించి, మనకు
నిత్యజీవాన్ని ఇచ్చారు. కేవలం దానిని చూసి విశ్వసించడం ద్వారా ఇస్రాయేలీయులు
బ్రతికారు. అలాగే, మనం క్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ
పొంది నిత్యజీవం పొందుతాము. ఈ సంఘటన దేవుని ప్రణాళికలో సిలువ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది.
దేవుడు ఇస్రాయేలీయులను పాములనుండి రక్షించడానికి ఒక భయంకరమైన చిహ్నాన్ని (పాము)
ఉపయోగించారు. అదేవిధంగా, మన పాపాలనుండి మనల్ని విమోచించడానికి లోకానికి
అత్యంత భయంకరమైన శిక్షా సాధనమైన సిలువను ఉపయోగించారు. ఇది దేవుని అద్భుతమైన
జ్ఞానాన్ని, శక్తిని వెల్లడి చేస్తుంది.
ఈ పోలిక నేటి సువిశేష పఠనంలో స్పష్టంగా కనిపిస్తుంది. యేసు
స్వయంగా, “మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను
విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకును అట్లే మనుష్యకుమారుడును ఎత్త బడవలెను”
అని అన్నారు. ఈ వచనం మోషే ఎత్తిన సర్పానికి, సిలువపై ఎత్తబడిన క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం
చేస్తుంది. ఈ రెండు సంఘటనలు దేవుని దయ, ప్రేమకు
నిదర్శనాలు.
విశ్వాసులకు శక్తి, అవిశ్వాసులకు
అవివేకం
అవిశ్వాసులకు సిలువ కేవలం బాధ, మరణానికి చిహ్నం. అందుకే, అపోస్తలుడైన పౌలు
సిలువను గురించి, “యూదులకు ఆటంకము, అన్యజనులకు అవివేకము” (1కొరి 1:23) అని
అన్నారు. ఒక శక్తివంతమైన మెస్సయ్య కొరకు ఎదురుచూచిన యూదులకు సిలువ పూర్తిగా
విరుద్ధం, ఎందుకంటే, ‘సిలువపై చంపబడినవాడు శాపగ్రస్తుడు’ అని ద్వితీ 21:23లో చెప్పబడింది.
అన్యులు లేదా గ్రీకులు శక్తి, అందం, జ్ఞానాన్ని ఆరాధించేవారు. కాబట్టి, ఒక దేవుడు
సిలువపై భయంకరమైన మరణం పొందడం వారికి వెర్రితనంగా తోచింది. అందుకే, పౌలు జ్ఞానం,
తర్కం, మానవ అంచనాలను పక్కన పెడితేనే సిలువలోని దైవిక శక్తిని అర్ధం చేసుకోగలమని
అన్నారు.
సిలువ బలహీనతకు చిహ్నం కాదు, అది దేవుని సర్వశక్తివంతమైన
ప్రేమకు, పాపంపై సాధించిన అంతిమ విజయానికి చిహ్నం. “సిలువ
వేయబడిన క్రీస్తు దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై ఉన్నాడు” అని 1కొరి 1:24లో
చదువుచున్నాం. దేవుని ప్రేమ యొక్క శక్తిని, రక్షణ ప్రణాళిక యొక్క జ్ఞానాన్ని
క్రీస్తు మనకు చూపారు. క్రీస్తుపై విశ్వాసం ఉంచి, సిలువ మార్గాన్ని అనుసరించేవారు మాత్రమే దానిలోని శక్తిని,
జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరని పౌలు స్పష్టం చేశారు. ఈ శక్తి మరియు జ్ఞానమే మనలను
దేవునితో ఐక్యం చేస్తుంది.
సిలువ - దేవుని అనంతమైన ప్రేమకు ప్రతీక
సిలువ దేవుని అపారమైన ప్రేమకు గొప్ప నిదర్శనం. “దేవుడు లోకమును ఎంతో
ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను.
ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక, నిత్యజీవము
పొందును” అని యోహాను 3:16లో చదువుచున్నాం. దేవుని ప్రేమకు
స్పష్టమైన వ్యక్తీకరణే సిలువ. “తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వాని కంటె
ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు” అని యోహాను 15:13లో పలికిన ప్రభువు, తన
త్యాగంద్వారా దానిని నిజం చేసారు.
సిలువపై క్రీస్తు అనుభవించిన బాధ, మనపై ఆయనకున్న ప్రేమకు గొప్ప సాక్ష్యం. ఆయన నిరపరాధి అయినను, మన పాపాల కోసం ఆ శిక్షను స్వచ్ఛందంగా భరించారు. ఈ ప్రేమ, ఏ మానవ ప్రేమతోనూ పోల్చలేనిది. శత్రువుల కోసం కూడా ప్రార్థన చేసే
గొప్ప ప్రేమ అది, “తండ్రీ! వీరు చేయునదేమో వీరు ఎరుగరు. వీరిని క్షమించుము” అని లూకా 23:34లో క్రీస్తు సిలువపై పలికిన మాటలు,
ఆయన ప్రేమ ఎంత శక్తివంతమైనదో, క్షమాగుణం ఎంత గొప్పదో తెలియజేస్తాయి. మన పాపాల కోసం దేవుని కుమారుడు సిలువపై తానుగా బలి అయ్యారు. ఈ బలి
మనలను దేవునితో సమాధాన పరుస్తుంది. సిలువపై క్రీస్తు మరణించడం వల్ల, మన పాపాలని క్షమించి, ఆయనతో తిరిగి సంబంధం నిలబెట్టుకోవడానికి
వీలు కల్పిస్తుంది.
సిలువ – పాపం, మరణం, సాతానుపై విజయం
సిలువ పాపముపై విజయం. “మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై
మరణించెను” అని రోమీ 5:8లో చదువుచున్నాం. యేసు తన
ప్రాణాన్ని అర్పించడం ద్వారా మన పాపాలన్నింటినీ తనపై వేసుకున్నారు. సిలువపై క్రీస్తు మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తమైతే, ఆయన పునరుత్థానం
పాపం, మరణం, సాతానుపై క్రీస్తు
విజయాన్ని సూచిస్తుంది. సిలువద్వారా మనలను పాపపు బానిసత్వం నుండి విముక్తి చేసి, పాపం వలన కలిగిన అవమానాన్ని తుడిచిపెట్టారు. ఈ విజయం మనకు నిత్యజీవానికి ఆశాజ్యోతిని వెలిగిస్తుంది. “వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మనమీద ఋణముగాను, మనకు విరుద్ధముగానుఉండిన
పత్రమును ఆయన తన సిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండ తొలగించెను” (కొలొస్సీ
2:14). అనగా, పాపం వల్ల మనపై ఉన్న శిక్షను యేసు తనపై వేసుకుని, దానిని పూర్తిగా తొలగించాడు.
సిలువ మరణముపై విజయం. “మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము
ద్వారా నశింప జేసి... విముక్తిని ప్రసాదించెను” (హెబ్రీ 2:14-15). యేసు పునరుత్థానం మరణాన్ని జయించింది. దీనివల్ల మనం మరణానికి భయపడాల్సిన
అవసరం లేదు. ఎందుకంటే, యేసులాగే మనం కూడా మరణం నుండి తిరిగి
లేచి నిత్యజీవంలో ఉంటామనే నిరీక్షణ మనకు ఉంది. “ఓ మృత్యువా! బాధ కలిగింపగల నీ
ముల్లు ఎక్కడ?” (1 కొరి 15:55) అను వాక్యం మరణముపై క్రీస్తు విజయాన్ని స్పష్టంగా
చూపిస్తుంది.
సిలువ సాతానుపై విజయం. సాతాను పాపం ద్వారా మానవాళిని తన
బానిసత్వంలో ఉంచాలని ప్రయత్నించింది. కాని, క్రీస్తు మరణం, పునరుత్థానం ద్వారా సాతాను శక్తి పూర్తిగా బలహీనపడింది. కొలొ 2:15లో
ఇలా చదువుచున్నాం, “సిలువపైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను నిరాయుధులను చేసెను.
వారిని బందీలుగా చేసి, తన విజయ యాత్రలో నడిపించి, అందరకును ఆయన బహిరంగముగా
ప్రదర్శించెను”.
సిలువ - విశ్వాసానికి, నిరీక్షణకు మూలం
క్రీస్తు సిలువ కేవలం ఒక భౌతిక చిహ్నం కాదు, అది మన విశ్వాసానికి, నిరీక్షణకు పునాది. సిలువ క్రైస్తవులకు నిరంతర నిరీక్షణకు
గుర్తు. ఇది క్రీస్తుతో మనం ఐక్యమవుతామని, ఆయన బాధలలో మనం
పాలుపంచుకుంటామని, అంతిమంగా ఆయన విజయంతో భాగమవుతామని మనకు
గుర్తుచేస్తుంది. ఫిలిప్పీ 3:10లో పౌలుగారు, “క్రీస్తు శ్రమలలో పాల్గొనవలెననియు,
మృత్యువునందు ఆయనను పోలియుండ వలయుననియు నా కోరిక” అని అన్నారు. అనగా, ఒక క్రైస్తవుడు క్రీస్తును అనుసరించేటప్పుడు, క్రీస్తు అనుభవించిన శ్రమలను కూడా తన జీవితంలో భాగం చేసుకుంటాడు.
సిలువ శ్రమలకు, త్యాగానికి గుర్తు. కష్టాల సమయంలో, సిలువ మనలను బలోపేతం
చేస్తుంది. సిలువపై బాధలను అనుభవించిన క్రీస్తు, మన కష్టాలను
అర్థం చేసుకుంటాడని (హెబ్రీ 4:15), మనల్ని ఎప్పుడూ ఒంటరిగా
విడిచిపెట్టడని మనకు విశ్వాసం కలిగిస్తుంది. మన కష్టాలు నిరర్థకం కావు. మన జీవితాల్లో వచ్చే ప్రతి కష్టం, సిలువ వెలుగులో చూసినప్పుడు అది ఒక రక్షణకు, పునరుత్థానానికి
మార్గం అవుతుంది. అవి మనల్ని క్రీస్తుతో మరింత దగ్గర
చేసి, అంతిమంగా ఆయన విజయమైన పునరుత్థానంలో
భాగం చేస్తాయి (రోమీ 8:17). క్రీస్తు సిలువలో మరణించి, తిరిగి లేచినట్లే, మన కష్టాలు కూడా చివరికి ఒక గొప్ప విజయానికి,
నూతన జీవితానికి దారి తీస్తాయి. ఇది మనకు సిలువ
ద్వారా లభించే గొప్ప నిరీక్షణ.
అందుకే సిలువ కేవలం ఒక దుఃఖ చిహ్నం కాదు, అది అంతులేని ప్రేమకు, అచంచలమైన
విశ్వాసానికి, నిరీక్షణకు, పాపంపై
పూర్తి విజయానికి ప్రతీక. మనలను పాపం నుండి విముక్తి చేసి, దేవుని
ప్రేమలో నిలిపి, నిత్యజీవానికి మార్గం చూపిన ఆ సిలువ
విజయాన్ని మనం నిత్యం ధ్యానిద్దాం.
సిలువ
విజయోత్సవ పండుగ చరిత్ర
క్రీ.శ. 320 సెప్టెంబర్ 14న, కల్వరిలో క్రీస్తుప్రభువు మోసిన సిలువ
కోసం జరిగిన అన్వేషణ ఫలించి పవిత్ర సిలువ లభ్యమైంది. ఐదు సంవత్సరాల తరువాత,
క్రీ.శ. 325లో, కాన్స్టాంటైన్ చక్రవర్తి యెరుషలేములోని
కల్వరి కొండ సమీపంలో ఒక దేవాలయాన్ని నిర్మించి, పవిత్ర సిలువలో కొంత భాగాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. అయితే, క్రీ.శ. 614లో పెర్షియన్ రాజు ఖోస్రోయి
యెరుషలేముపై దాడి చేసి విజయం సాధించి, తన విజయ సూచనగా
దేవాలయంలోని పవిత్ర సిలువను అహంకారంతో తీసుకొని వెళ్ళాడు. 13 సంవత్సరాల తర్వాత, క్రీ.శ. 627లో, కాన్స్టాంటైన్’నోపిల్కు
చెందిన హేరక్లియుస్ చక్రవర్తి పెర్షియన్ రాజును ఓడించాడు. పవిత్ర సిలువను తిరిగి
యెరుషలేముకు పంపించాడు. క్రీ.శ. 629లో, హేరక్లియుస్ చక్రవర్తి యెరుషలేముకు వచ్చి సెప్టెంబర్ 14న సిలువను పునఃప్రతిష్ఠించి ఆరాధించాడు. ఈ సంఘటననే మనం ‘పవిత్ర సిలువ
విజయోత్సవం’గా జరుపుకుంటున్నాం.
క్రైస్తవ
లోకంలో సిలువ చరిత్ర:
సిలువపై క్రీస్తు శరీరాన్ని చూపించే ఆచారం ఐదవ శతాబ్దంలో
ప్రారంభమైంది. నాల్గవ శతాబ్దం వరకు క్రైస్తవులు కేవలం ఖాళీ సిలువనే వాడేవారు. ఈ
ఖాళీ సిలువ కూడా నాల్గవ శతాబ్దంలోనే ప్రచారంలోకి వచ్చింది. తొలి మూడు శతాబ్దాల్లో
క్రైస్తవులు సిలువను చాలా అరుదుగా వాడారు. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి:
1. అన్యమతస్తుల ఎగతాళి: యూదులు, గ్రీకులు మరియు రోమనులు సిలువను ఎగతాళి
చేసేవారు. సిలువ ఎక్కినవాడు శాపగ్రస్తుడని యూదుల భావం కాగా, కొరత వేయబడినవాడు వెర్రివాడని గ్రీకు మరియు రోమను ప్రజల తలంపు.
అందువల్ల, తొలిక్రైస్తవులు సిలువను బహిరంగంగా
ప్రదర్శించడానికి వెనుకాడారు. ప్రాచీన రోమను భవనాల్లో గాడిద తలగల మనిషి సిలువమీద
వేలాడుతున్నట్లు, క్రింద ఒక నరుడు అతన్ని
ఆరాధిస్తున్నట్లు గీయబడిన చిత్రం ఒకటి కనబడింది. దాని క్రింద “అలెక్స్ప్రెమెనోస్
తన దేవున్ని ఆరాధిస్తున్నాడు” అని వ్రాసి ఉంది. ఆ గాడిద తలగల మనిషి క్రీస్తే,
అలా ఆ రోజుల్లో అన్యమతాలవాళ్ళు సిలువ వేయబడిన
క్రీస్తుని ఎగతాళి చేసేవారు.
2. వేదహింసలు: తొలి మూడు శతాబ్దాల్లో వేదహింసలు ఉండేవి. సిలువ చిహ్నం ద్వారా
క్రైస్తవులు రోమను ప్రభుత్వానికి చిక్కిపోయే ప్రమాదం ఉండేది. అందుచేత వారు సిలువను
వాడటానికి భయపడ్డారు.
ఇంకా, క్రీస్తును దిగంబరునిగానే సిలువ
వేశారు. అలాంటి దిగంబర క్రీస్తును బహిరంగంగా చూపించడానికి క్రైస్తవులు వెనుకాడారు.
అందుకే క్రీస్తు రూపం ఉన్న సిలువలు ఐదవ శతాబ్దం వరకు వాడుకలోకి రాలేదు. అంతకు
ముందు క్రీస్తు దేహం లేని సిలువను వాడి అది జీవన దాయకమైనదని విశ్వసించేవారు.
సిలువ
వాడకం:
క్రైస్తవ సంకేతాలన్నింటిలోను మనం ఎక్కువగా వాడేది సిలువనే. ఐదవ
శతాబ్దంలోనే సిరియా దేశంలో పూజనర్పించే పీఠంపై సిలువను పెట్టేవారు. ఆరవ శతాబ్దంలో
ప్రదక్షిణాల్లో సిలువను మోసుకొనిపోవడం మొదలుపెట్టారు. 8వ శతాబ్దంలో షార్ల్మేన్ రాజు పోపు గారికి ప్రదక్షిణ సిలువను
బహూకరించాడు. ప్రదక్షిణ ముగిసాక దాన్ని పూజనర్పించే పీఠం దగ్గర పెట్టేవారు.
మధ్యయుగాల్లో దేవాలయాల గోడలపై పండ్రెండు చోట్ల సిలువ ఆకృతులు చెక్కేవారు. ఈ
పండ్రెండు చోట్ల దేవాలయాలకు ప్రతిష్ఠ చేసేవారు. క్రమేణ దేవాలయాల మీదే కాకుండా ఇళ్ళ
మీద, బళ్ళ మీద, ఇంకా రకరకాల కట్టడాల మీద సిలువ ఆకృతులు నిర్మించారు. సమాధుల స్థలాలలో
సిలువలు నెలకొల్పారు. పూజ వస్త్రాలపై వాటిని కుట్టించారు.
క్రమేణ పంట భూములను సిలువతో ఆశీర్వదించడం మొదలుపెట్టారు. అలాగే నూతన
భవనాలు, వాహనాలు, పశువులు మొదలైనవాటిని కూడా ఆశీర్వదించారు. సిలువ ఆకృతులను కూడా సిలువ
గుర్తుతో ఆశీర్వదించారు. భక్తిగలవారు తాము వాడుకొనే ప్రతి క్రొత్త వస్తువును మొదట
సిలువతో ఆశీర్వదించి గాని వాడుకొనేవారు కాదు.
11-13 శతాబ్దాల మధ్యకాలంలో క్రైస్తవులు
మహమ్మదీయులతో చేసిన యుద్ధాలకు “సిలువ యుద్ధాలు” అని పేరు. అయితే ఈ కాలంలో సిలువ
క్రీస్తు శ్రమల చిహ్నంగా కాకుండా విజయ చిహ్నంగా మారిపోయింది. క్రీస్తు తన సిలువద్వారా
మరణాన్నీ, పాపాన్నీ జయించినట్లే మనం కూడా సిలువద్వారా
శత్రువులను జయిస్తామని క్రైస్తవ ప్రభువులు భావించారు.
రానురాను సిలువభక్తి ఇంకా చాలా భక్తి మార్గాలకు దారితీసింది.
పంచగాయాల భక్తి, తిరుహృదయ భక్తి, క్రీస్తు శ్రమలపట్ల భక్తి, సిలువమార్గం
మొదలైన భక్తిమార్గాలన్నీ సిలువనుండి పుట్టినవే. మధ్యయుగాల్లో సిలువ ధ్యానాలు కూడా
విరివిగా ప్రచారంలోకి వచ్చాయి.
సిలువగుర్తును
వేసికోవడం:
భక్తులు నుదుటిమీద సిలువ గుర్తు వేసికోవడం రెండవ శతాబ్దంలోనే వాడుకలో
ఉండేది. కాని ఈ ఆచారం 4వ శతాబ్దంలో బాగా వాడుకలోకి వచ్చింది.
తర్వాత నుదుటి మీద, రొమ్ము మీద కూడా ఈ గుర్తు వేసికొనే
పద్ధతి అమలులోకి వచ్చింది. కొందరు దివ్యసత్ప్రసాదంతో కూడా నుదుటిమీద, కళ్ళమీద సిలువ గుర్తు వేసికొనేవాళ్ళు. పెదవుల మీద ఈ గుర్తు వేసికొనే
పద్ధతి 8వ శతాబ్దంలో వచ్చింది. నుదురు, రొమ్ము, భుజాలమీద పెద్ద సిలువ గుర్తు వేసికొనే
ఆచారం 10వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. మొదట
నుదుటమీద, రొమ్ముమీద, ఆ పిమ్మట కుడి భుజంమీద, చివరకు ఎడమ
భుజంమీద చేతిని త్రిప్పేవారు. తర్వాతి కాలంలో చేతిని ఎడమ భుజం మీదినుండి కుడి భుజం
మీదికి త్రిప్పడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ పద్ధతే కొనసాగుతూ ఉంది. సిలువ గుర్తు వేసికోవడంద్వారా,
త్రిత్వైక దేవునికి మహిమను చేకూరుస్తున్నాం.
సిలువ గుర్తు ఆశీర్వచనం వెనుక అర్థం: నరులను సిలువ గుర్తుతో ఆశీర్వదించడంలో చాలా అర్థాలున్నాయి? ఆ నరులు క్రీస్తు ముద్రను స్వీకరించి ఆ
యజమానునికి చెందుతారని ఒక భావం. వారు క్రీస్తును విశ్వసిస్తున్నారని మరొక అర్థం. ప్రభువు
పిశాచ శక్తినుండి మనలను కాపాడతారని మరొక భావం. క్రీస్తు సిలువ మనలను రక్షించాలని
గాని అతని వరప్రసాదం మనలను కాపాడాలని గాని ఇంకొక అర్థం.
ముగింపు
మానవాళి పాపవిమోచన కోసం, యేసుక్రీస్తు
ప్రభువు సిలువపై అత్యంత దారుణమైన హింసను, అవమానాన్ని
భరించారు. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. మనల్ని పాపములనుండి, శాపములనుండి రక్షించి, విడిపించడానికి,
తండ్రి అయిన దేవుని సంకల్పం ప్రకారం, ఆయన తన ఏకైక కుమారుడైన యేసును బలిగా అర్పించారు. యేసు తన
ఇష్టపూర్వకంగా, మానవాళి రక్షణ కొరకు తననుతాను అర్పించుకొని,
సిలువపై మరణించారు. మనందరి కోసం క్రీస్తు
ప్రభువు సిలువపై బలి అయ్యారు.
మనం క్రీస్తుప్రభువును స్మరించుకున్నప్పుడు, మన హృదయాలలో వెంటనే మెరిసే దృశ్యం సిలువపై వేలాడుతున్న సిలువ
నాథునిదే. ఆయన మనకోసం తన ప్రాణాన్ని త్యాగం చేయబట్టే, ఆయనను విశ్వసించిన మనందరికీ రక్షణ లభించింది. సిలువపై క్రీస్తు మరణం
వల్లే సిలువకు పవిత్రత, విలువ వచ్చాయి. సిలువ కేవలం ఒక గుర్తు
కాదు. అది దేవుని శ్రమలకు, మన పాపములను ప్రక్షాళన చేయటానికి
రుజువు. సిలువ క్రీస్తు త్యాగాన్ని, దైవత్వాన్ని
తెలియజేస్తుంది. సిలువే మన విమోచన, సిలువే మన రక్షణ. సిలువపై మరణించిన మన
దైవం, యేసు క్రీస్తు ప్రభువు వారు! సిలువ వలన
మనకు అద్భుతాలు, స్వస్థతలు, అపారమైన ధైర్యం, శాపముల నుండి విముక్తి, దుష్టాత్మల
నుండి విడుదల లభిస్తాయి. దుష్టశక్తులు మనపై దాడి చేసినప్పుడు, సిలువపై వేలాడుతున్న క్రీస్తు రూపాన్ని స్మరించుకుంటే అది మనకు రక్షణ
కవచంలా నిలుస్తుంది. శరీరంలో ఏ బాధలు, వ్యాధులు
పీడిస్తున్నప్పుడు, ఆ స్థలంలో సిలువ గుర్తు వేసుకుంటే, ఆ బాధలనుండి విముక్తి పొందుతాము. సిలువ గుర్తులో అద్భుతమైన విముక్తి,
శక్తి దాగి ఉంది. “సిలువ మనకు అద్భుతాలు చేసే
పవిత్రమైన శక్తివంతమైన ఆయుధం!” సిలువే నా ఆయుధం అని మనలో ఎంతమంది
విశ్వసిస్తున్నారు?
క్రీస్తుప్రభువును విశ్వసించే వారందరూ సిలువను అత్యంత గౌరవంగా
చూడాలి. మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి సిలువను ఎంచుకున్నారు. మన
కష్టసుఖాలలో సిలువ గుర్తును ఆసరాగా తీసుకుందాం. సిలువపై వేలాడిన సిలువ నాథుని
రూపానికి తల వంచి ప్రార్థిస్తే, మనం ఆశీర్వదించబడతామని గ్రహించాలి. సిలువపై
వేలాడుతున్న క్రీస్తును చూస్తే ఎవరైనా తలవంచి, తమ పాపాలను ఒప్పుకొని, విడవవలసిందే. ఈ
రూపం చూస్తే దుష్టాత్మలు, దుష్టశక్తులు, పిశాచాలు సైతం భయపడి పారిపోవాల్సిందే. ఈ సృష్టిలో మనకు సిలువ కంటే
విలువైనది ఏదీ లేదు. దానిలో పవిత్రత, రక్షణ ఉన్నాయి.
మన బాధలలో, వ్యాధులలో సిలువను చూస్తూ ప్రార్థిస్తే
మన కష్టాలు దూరమవుతాయి. క్రీస్తు సిలువ స్వరూపం మన ఇళ్ళల్లో, మన హృదయాలలో ఉండాలి. మన ఇంటికి ఎదురయ్యే శోధనలనుండి, సైతాను తంత్రాలనుండి సిలువ స్వరూపం మనల్ని కాపాడుతుంది. ఇది కేవలం
ఆచారం లేదా అలంకరణ కాదు, ఇది మన బాధ్యతగా భావించాలి. క్రీస్తు
మనకోసం పడిన శ్రమలను ధ్యానిస్తూ, పవిత్రంగా, అణకువగా, దేవునియందు విశ్వాసం మరియు భయభక్తులు
కలిగి జీవిద్దాం. సిలువపై కొట్టబడిన మన ప్రభువుకు చేతులు జోడించి వందనాలు
చెల్లిద్దాం. ఆమెన్.
No comments:
Post a Comment