మరియమాత మోక్షారోహణ పండుగ, ఆగష్టు 15

మరియమాత మోక్షారోహణ పండుగ, ఆగష్టు 15


మరియ మాత మోక్షారోహణ మహోత్సవమును మనము ఈ నె 15వ తేదీన కొనియాడుచున్నాము. మరియమాత ఆత్మ, శరీరములతో పరలోకానికి కొనిపోబడినదని మనందరి విశ్వాసం. 

ఆది. 5:24: ‘‘హనోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు. దేవుడు హనోకును కొనిపోయెను.’’ హనోకు మరణించకుండానే ఆత్మ శరీరములతో పరలోకమునకు కొనిపోబడెను. 

2 రాజు. 2:11: ‘‘వారింకను మాటలాడు కొనుచు ముందుకు సాగిపోవు చుండగా నిప్పు గుర్రము లాగు అగ్నిరథ మొకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొని పోయెను.’’ ఎలీషా చూచుచుండగనే ప్రభువు ప్రవక్త ఏలియాను ఆత్మ శరీరములతో స్వర్గమునకు కొనిపోయెను. ఈవిధముగా, తనను నమ్ముకొనిన ప్రవక్తనే ఆత్మ శరీరములతో దేవుడు పరలోకమునకు కొనిపోబడినప్పుడు, ఆయనకు జన్మనిచ్చిన మాతృమూర్తిని ఏవిధముగా ప్రభువు మరణమునకు గురిచేస్తాడు?

2 సమూ. 6:6-7: ‘‘ఎడ్లు బండిని గతుకుల లోనికి ఈడ్చుటచే మందసము జారి క్రింద పడ బోయెను. కనుక ఉస్సా చేయి చాచి దానిని పట్టుకొనెను. కాని యావే ఉగ్రుడై ఉస్సా నేరము సహింపక, ఉన్న వానిని ఉన్నట్లు శిక్షించెను. అతడు మందసము ప్రక్కన కూలి ప్రాణము విడిచెను.’’ మందసము తాకితేనే ప్రభువు ఒప్పుకొన లేదు. ప్రభువునకే జన్మ నిచ్చిన ఆ తల్లి శరీరమును ఏవిధముగా మరణమునకు గురిచేస్తారు? ఎట్టి పరిస్థితులో కూడా మరియ మాత శరీరమును మరణమునకు గురి చేయరు. ఇదియే శ్రీసభ విశ్వాసము, మనందరి విశ్వాసము.

2 సమూ. 6:11: ‘‘ఓబేదెదోము ఇంట మందసము మూడు మాసములుండెను. యావే ఓబేదెదోమును, అతని కుటుంబమును చల్లని చూపు చూచెను.’’ మరియమాతను గౌరవించే వారిని ప్రభువు ఎన్నడు చేయి విడువడు. మందసము ఓబేదెదోమును, అతని కుటుంబమునకు దీవెను తీసుకొని వచ్చినట్లే, మరియ మాతను గౌరవించే వారికి ప్రభుని దీవెనలు దండిగా లభిస్తాయి. పునీత లూయిస్‌ ది మోంట్‌ ఫోర్ట్‌ ఇలా అన్నారు: ‘‘ప్రతీ రోజు జపమాల జపించేవారు ఎవరూ కూడా ఎప్పటికిని దారి తప్పరు. ఈ నా మాటను సంతోషముగా నా రక్తముతో సంతకం చేయడానికి కూడా నేను సిద్దమే.’’

1950వ సం.ము నవంబరు 1వ తేదీన 12వ భక్తినాధ పాపుగారు “మునిఫిషెన్తిస్సిముస్‌ దేయుస్‌” (Munificentissimus Deus) అను విశ్వలేఖ ద్వారా ఈ విశ్వాస సత్యమును ఇలా బోధించారు: ‘‘తన భూలోక జీవితమును సంపూర్ణము గావించుకొన్న కన్య మరియమ్మగారు ఆత్మ శరీరములతో మోక్షమునకు కొనిపోబడినది.’’ విశ్వాసుందరికి మరియమాత మోక్షారోహణము చాలా ఉన్నతమైనది. ఎందుకంటే, అది కన్య మరియమ్మగారి పరలోక జనన పండుగ. మానవులందరికీ పరలోక రాజ్య బహుమానమును గూర్చి ఈ మహోత్సవము బోధిస్తుంది.

‘‘దేవుడు మరియమాత శరీరమును మట్టికి, బూడిదకు అప్పగించలేదు’’ అని పునీత ఆల్బర్ట్ గారు అన్నారు. మరియమాత ప్రభుని దయకు పాత్రురాలై, ఆయనతో ఏకమై మానవ స్వరమును ప్రభుని పరిపూర్ణ ప్రేమకు సమర్పించటమే ఆమె చేసే కార్యము. మరియమాత ముఖ్య పరిచర్య ఏమిటంటే, మానవ హృదయమును తన దివ్య కుమారునికి విధేయత చూపునట్లు చేయటమే. మరియమాత విధేయత సకల మానవాళికి రక్షణ ప్రసాదించినది. ఆమె బాటలో మనము కూడా పయనించి రక్షణ పొందుదాము.

No comments:

Post a Comment