పునీత జోజప్ప గారి మహోత్సవం - మార్చి 19వ తేదీ

 పునీత జోజప్ప గారి మహోత్సవం - మార్చి 19వ తేదీ

 

రక్షణ ప్రణాళిక లో దేవమాతకు భర్తగా, దివ్య బాలయేసుకు సాకుడు తండ్రిగా, తిరు కుటుంబ పోషకుడిగా తన జీవిత పాత్రలో నీతిమంతునిగా, కష్టజీవిగా, విశ్వాసనీయుడిగా  వినుతికెక్కిన సుగుణ శీలుడు పునీత జోజప్ప గారు. మన తల్లి శ్రీసభ  ప్రతి ఏటా మార్చి 19వ తేదీన విశ్వవ్యాప్తంగా పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఆయన విశ్వాస జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు క్రీస్తు బాటలో అడుగులు వేయాలని మన అందర్నీ ఆదేశిస్తున్నది. ఈ మేరకు జోజప్ప గారి సుగుణాలను ధ్యానిద్దాం-:

1. నీతిమంతుడు పునీత జోజప్ప

పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు శ్రీ సభకు రాసిన లేఖలో పునీత జోజప్ప గారిని గూర్చి ఈ విధంగా ప్రశంసించారు: "లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు అంటే అతడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, సాదు శీలుడు, వినమ్ర హృదయుడు, నిర్మలత్వం, నిష్కపటత్వము మొదలైన సుగుణాలతో కూడిన వ్యక్తిత్వం కలవారని పునీత జోజప్ప గారిని ప్రశంసించారు"..

మత్తయి సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు జోజప్ప గారిని "నీతిమంతుడని" సంబోధిస్తున్నారు. దేవుడు జోజప్ప గారిని "నీతిమంతుడు" అని పిలవటం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. యూదుల సంప్రదాయాలలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని, కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థాన్ని కొనియాడే వారు. ఈ నిశ్చితార్థం పూర్తయిన కొన్ని నెలల తర్వాత వివాహాన్ని ఆచరించేవారు.

లూకా సువార్త 1వ అధ్యాయం 27  వచనాన్ని మనం పరిశీలిస్తే యోసేపు గారికి మరియతల్లితో ప్రధానము చేయబడింది. ఇక వీరిరువురూ కూడా కొన్ని రోజులలో పరిశుద్ధ వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో పవిత్రాత్మ ప్రభావం వలన మరియతల్లి గర్భం దాల్చారు. ఇది దైవ ప్రణాళిక. మోషే ధర్మ శాస్త్రం ప్రకారం వివాహం కాకముందు స్త్రీ గర్భం ధరిస్తే అది పాపం కిందకి వస్తుంది శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి.

జోజప్ప గారి స్థానంలో మరొక మానవమాత్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా మరియతల్లిని తీసుకొని వెళ్లి న్యాయం కోసం పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల చేతికి అప్పగించే వారు. కానీ జోజప్ప గారు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా అవమానింప ఇష్టంలేక మరియతల్లిని మౌనంగా, రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు(మత్తయి 1:19) దేవదూత స్వప్నంలో కనిపించి ఇది దైవ కార్యం దయచేసి మరియమ్మను విడిచి పెట్టవద్దు. ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు దేవుని ప్రణాళికను పరిపూర్తిగా అర్థం చేసుకొని జోజప్ప గారు మరియతల్లికి అన్ని వేళలా తోడుగా ఉన్నారు..

నేడు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే భార్య మీద లేనిపోని అనుమానాలతో చేయి చేసుకునేవారు, విడాకులు తీసుకొని కుటుంబాలను చేజేతులారా నాశనం చేసుకునే వారు లేక పోరు. అట్టివారు ఓసారి జోజప్ప గారిని స్మరించుకుంటే మంచిది. జోజప్ప ,మరియతల్లి మీరిరువురు కూడా కాపురం చేయకముందే మరియ తల్లి గర్భం దాల్చారు. ఆ క్షణంలో మరియమ్మను జోజప్ప గారు బహిరంగంగా జనం మధ్య అవమానించ లేదు మౌనంగా రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు. కానీ దూత ద్వారా ఇది దైవకార్యం పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యం అని తెలుసుకొని మరియతల్లికి అండగా ఉన్నారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో  జోజప్ప గారి మంచి మనసును బట్టి దేవుడు ఆయనను నీతిమంతునిగా సత్కరించారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం..

2. కష్టజీవి

మత్తయి(1:1-16) పునీత జోజప్ప గారు దావీదు వంశానికి చెందిన వ్యక్తి. దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలుసు. జోజప్ప గారు ఈ పేరుప్రఖ్యాతులను ఉపయోగించి ఏవైనా చేయవచ్చు. కానీ ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తిని కుటుంబ పోషణ కై ఎంచుకున్నారు. ఈ వడ్రంగి వృత్తి లోనే మంచి ప్రావీణ్యతను ,గుర్తింపును సంపాదించుకున్నారు(మత్తయి 13:55)

3. సంరక్షకుడు

తన స్వప్నంలో దేవదూత ద్వారా దేవుని ఆదేశాలను స్వీకరించి. హేరోదు రాజు యొక్క దుష్ట తలంపుల నుండి బాల యేసును కాపాడారు. ఒక గాడిద సహాయముతో తాను నడుస్తూ మరియతల్లిని, బాల యేసును సురక్షిత ప్రాంతానికి చేర్చి శత్రువుల బారినుండి తల్లి, బిడ్డని కాపాడారు(మత్తయి 2:13-15) అదేవిధంగా బాలయేసు  12 ఏళ్ల ప్రాయంలో యెరుషలేములో తప్పిపోయినప్పుడు తల్లడిల్లిపోయి మూడు రోజులపాటు నిద్రాహారాలు మానేసి వెతికి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా క్రీస్తుకు తోడుగా ఉన్నారు.

4. ప్రార్థనాపరుడు

జోజప్ప గారు మంచి ప్రార్థనా పరుడు. మోషే ధర్మశాస్త్రాన్ని, పది ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి. దేవుని ఆదేశానుసారం ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి దేవదూత ముందుగా సూచించినట్లు ఆ బిడ్డకు "యేసు" అని పేరు పెట్టారు. మోషే ధర్మ శాస్త్రాన్ని న గౌరవించి, పాటించి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు బాల యేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారు. సాధారణంగా కలలను ఎవరూ పట్టించుకోరు. కానీ జోజప్ప గారు మాత్రం తన స్వప్నంలో దేవుని ద్వారా దూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని త్రికరణశుద్ధిగా ఆలకించి, పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో నోరు తెరిచి మాట్లాడిన సందర్భాలు మనకు అనేకం కనిపిస్తాయి. కానీ జోజప్ప గారు నోరు తెరిచి మాట్లాడిన ఒక్క సందర్భం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఆయన దేవుని పట్ల ప్రేమను , తనకు గల విశ్వాసాన్ని మాటల్లో కాదు చేతల్లో నిరూపించి  చూపించారు...

5. మంచి మరణం

పునీత జోజప్ప గారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి. క్రీస్తు ,మరియతల్లి సన్నిధిలో భాగ్యమైన మరణాన్ని పొందారు. తిరు సభ పాలకుడిగా ,మంచి మరణాన్ని ప్రసాదించు పునీతుడిగా వినతికెక్కారు...

చివరిగా

ఈ నూతన సంవత్సరాన్ని మన పరిశుద్ధ పోపు గారు జోజప్ప గారి మహా సంవత్సరముగా అంకితమిచ్చారు. పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకు కావాల్సిన వర ప్రసాదాలను తన ప్రియ కుమారుని ద్వారా అనుగ్రహించమని పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం... అందరికీ పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

జోసెఫ్ అవినాష్
యువ కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచారణ


No comments:

Post a Comment