యేసు దివ్యరూపధారణ మహోత్సవం (6 ఆగష్టు)
(తాబోరు పర్వతం పై ఏసు పేతురు, యాకోబు,
యోహానులకు తన దివ్యరూపమును ప్రదర్శించుట 1వ శతాబ్దం)
నేడు యేసు
దివ్యరూపధారణ మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. దివ్యరూప ధారణ, యేసు జీవితములో
జరిగిన మహత్కర సంఘటన. యేసు శ్రమలానంతరం పొందబోవు మహిమకు తార్కాణం. ఇదొక గొప్ప
దివ్యదర్శనము. ఈ అద్భుతమైన సంఘటనను మత్త. 17:1-8; మార్కు. 9:2-9; లూకా. 9:28-36;
2పేతు. 1:16-18లో చూడవచ్చు.
యేసు ప్రభువు
సిలువ పాటులు భరించడానికి ఒక ఏడాది ముందుగా తన ప్రియ శిష్యులైన పేతురు, యాకోబు,
యోహానులను వెంటబెట్టుకొని కైసరియా ఫిలిప్పినుండి ఎనిమిది రోజులు
ప్రయాణంచేసి అక్కడ నున్న ఒక ఉన్నత పర్వతం పైకి ఎక్కివెళ్లారు. ఆ పర్వతం ఏదని
పరిశోధింపగా, అది గలిలీ ప్రదేశంలో తిబేరియా సరస్సుకు దాదాపు రెండువేల అడుగుల
ఎత్తున ఉన్న తాబోరు పర్వతంగా క్రీ.శ. 254లో
గుర్తించబడింది.
“అచట వారి యెదుట యేసు
రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె
తెల్లగా నయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి
కనబడిరి” (మత్త. 17:2-3; మార్కు. 9:2-3) మోషే ధర్మశాస్త్రానికి
గుర్తుకాగా, ఏలీయా ప్రవక్తలకు ప్రతినిధి. వారు యేసు ప్రభువును
ఆరాధించారు. ఆయనతో సంభాషించారు. ఇదే సమయంలో పరలోక తండ్రి దివ్యవాణి మరొక్కసారి “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను ఆనంద భరితుడనైతిని. ఈయనను
ఆలకింపుడు” (మత్త. 17:5; మార్కు. 9:7) అని వినిపించెను. యేసు
నిజముగా ‘దేవుని కుమారుడు’ అని శిష్యులు
అర్ధముచేసుకుంటున్న విషయాన్ని, ఆ వాణి ధృవపరుస్తున్నది.
మహోన్నతమైన
గొప్పతనంతో ప్రభువు బహిరంగ జీవితం ఆరంభించడానికి, రాబోవు
మహిమలో ముందుగానే రుచిచూసిన భాగ్యంపొంది యేసు ప్రభువు అనుభవింపబోతున్న వేదన,
శ్రమలు చూసి, బెదరి చెదరిపోకుండ ప్రభుశిష్యులు
తమ విశ్వాసంలో బలపడటానికిగాను ఈ యేసు దివ్యరూపధారణ మహాత్మ్యంయొక్క దృశ్యం పేతురు,
యాకోబు, యోహానులలో హృదయం నిండా బాగా
వేళ్లూనింది.
పూర్వంలో
విగ్రహారాధన, ఏదో భేతాళ కల్పిత కథల్లాంటి దబ్బరదేవుళ్ల పండగ స్థానంలో
వాటిని పరిత్యజించి క్రైస్తవులైన ప్రజలు యేసు దివ్యరూపధారణ మహోత్సవానికి
తెరతీసినట్లు తెలుస్తుంది. ఇది నాలుగు లేక 5వ శతాబ్దారంభంనుండి ఈ పండుగ
జరుపబడుతున్నట్లు బోధపడుతుంది. ప్రాచ్య శ్రీసభలో ముఖ్యంగా అర్మేనియాలో ఈ పండగ మూడునుండి
ఆరు రోజుల వరకు జరుపుకున్నారు. పశ్చిమ ప్రాంత శ్రీసభలో, 9వ శతాబ్దంనుండి ఈ పండగ
ఆచరిస్తున్నట్లుగా చరిత్ర వ్రాతలను బట్టి తెలుస్తున్నది.
15వ శతాబ్దంలో
జరిగిన అద్భుత సంఘటన ఇది. అపరిమిత సంఖ్యలో ఉన్న టర్కీ సైనికదళంపై, అందులో
కేవలం నాలుగోవంతు మాత్రమే ఉన్న క్రైస్తవ సైన్యం దేవుని దయవల్ల, బెల్గ్రేడ్’లో జరిగిన ముఖాముఖి యుద్ధంలో ఘనవిజయం సాధించిన సందర్భంను
పురస్కరించుకొని ప్రతిఏడాది “యేసు మహిమరూప ప్రదర్శన ఉత్సవం”
జరుపుకునేలా అది యావత్ ప్రపంచంలో శ్రీసభ కొనియాడేలా విస్తరింప 3వ
కలిస్తస్ జగద్గురువులు క్రీ.శ. 1456లో నిర్ణయం జారీ చేశారు. ఇదే పండుగ రోములోని
పునీత యోహాను లాథరన్ దేవాలయంలో సాధారణ క్రమంలోనే జరుపబడుతోంది.
దివ్యరూపధారణలో దాగియున్న పరమార్ధము:
ఇప్పటి వరకు శిష్యులచేత ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా, మెస్సయాగా, పరిగణింపబడిన యేసు, తన నిజస్వరూపమును తెలియపరచడం ఎంతోముఖ్యం. ఫలితముగా, శిష్యుల విశ్వాసము దృఢపరచబడినది.
ప్రభువులో నున్న దైవత్వమును చూపించి, ఫలితముగా, శిష్యులను బలపరచియున్నాడు. తండ్రి తనకు అప్పగించిన
పనిని నెరవేర్చుచున్నారు (యెషయ 42:1-4, లూకా. 9:35. యోహాను. 4:34). తాను మోషేతోను (ధర్మశాస్త్రము), ఏలియాతోను (ప్రవక్తలు)
మాట్లాడుటద్వారా తాను ప్రవక్తల ప్రబోధములను, ధర్మశాస్త్రమును రద్దుచేయక, సంపూర్ణ మొనర్చుటకు వచ్చితినని (మత్త. 5:17) తెలియ జేయుచున్నారు.
అలాగే, యేసు
దివ్యరూప ధారణ, పరలోక
పరమరహస్య అనుభూతిని తెలియజేయుచున్నది. పరలోకం అంటే ఒక స్థలము కాదని, అది ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని
తెలియజేయుచున్నది. యేసు ప్రభువే ఆ దైవరాజ్యము. త్రిత్వైక దేవుడే ఆ పరలోక రాజ్యము
(నిత్యజీవము).
Praise the lord father
ReplyDelete