పరిశుద్ధ కర్మెలు మాత మహోత్సవం
నిర్గమ 3:1-6, 9-12; మత్త 11:25-27
మరియ మాతకుగల అనేక పరిశుద్ధ నామములలో “కర్మెలు మాత” ఒకటి. ప్రతి
సంవత్సరము జూలై 16వ తేదీన మనమంతా “కర్మెలు
మాత” మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాము. ఇది “కర్మెలు మాత”కు అంకితం చేయబడిన పండుగ. ఈ
పండుగ ప్రధానముగా, మరియతల్లి పునీత సైమన్ స్టాక్ గారికి ఇచ్చిన దర్శనమును, మరియు కర్మెలు
సభ స్థాపనను స్మరించు కుంటుంది. ముందుగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు! “కర్మెలు
మాత” మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంగా, ఈ పండుగను గూర్చి కొన్ని లోతైన
విషయాలు ధ్యానిద్దాం:
పండుగ చరిత్ర:
ఈ పండుగ మూలాలు పాలస్తీనాలోని కర్మెలు కొండతో ముడిపడి ఉంది. ఈ పర్వత
శ్రేణి దట్టమైన వృక్షసంపదకు మరియు సుందరమైన ప్రకృతికి ప్రసిద్ధి చెందింది. “కర్మెలు
మాత” అనే బిరుదుకు ఈ పర్వతమే మూలం. బైబిల్‌లో అత్యంత ప్రముఖంగా ప్రస్తావించబడిన
ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఏలియా ప్రవక్త 450 మంది బాలు దేవత
ప్రవక్తలను సవాలు చేసి, అద్భుతంగా యావే దేవుని శక్తిని
నిరూపించిన ప్రదేశంగా కర్మెలు కొండ ప్రసిద్ధి చెందింది (1 రాజు
18:19-40). ఏలియా ప్రార్థనకు ఫలితంగా పరలోకం నుండి అగ్ని
దిగి వచ్చి బలిని దహించివేసిన సంఘటన ఇక్కడే జరిగింది. ఇది దైవశక్తికి, అద్భుతమైన విశ్వాసానికి గొప్ప నిదర్శనం! ఏలియా ప్రవక్త ఆధ్యాత్మిక
వారసత్వాన్ని అనుసరిస్తూ, క్రైస్తవ సన్యాసులు ఆరంభం నుంచే ఈ
పర్వతం మీద నివసిస్తూ వచ్చారు. ప్రార్థన, ధ్యానం, మౌనం, దేవునికి సంపూర్ణ అంకితభావంతో వారు జీవించారు.
12వ శతాబ్దాలలో జరిగిన క్రూసేడులు లేదా ‘సిలువ యుద్ధాల’ సమయంలో, ఐరోపా నుండి వచ్చిన క్రైస్తవ సైనికులు “పవిత్ర భూమిని”
సందర్శించారు. ముఖ్యముగా మూడవ క్రూసేడు తర్వాత, వీరిలో కొందరు, యుద్ధం మరియు ప్రపంచ అల్లకల్లోలం నుండి విముక్తి పొంది, కర్మెలు కొండ ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఆకర్షితులయ్యారు. వారు తమ సైనిక
జీవితాలను విడిచిపెట్టి, సన్యాస జీవితాన్ని ప్రారంభించాలని
నిశ్చయించుకున్నారు.
ఈ సైనికులు, ఏలియా స్థాపించిన
సంప్రదాయాన్ని అనుసరిస్తూ, కఠినమైన ప్రార్థన, తపస్సుతో కూడిన
జీవితాన్ని గడిపారు. వారు తమ జీవితాలను సంపూర్ణముగా దేవునికి అంకితం చేసుకున్నారు.
వారి ఆదర్శం ఏలియా ప్రవక్త ఆత్మను ప్రతిబింబించింది. వారు అక్కడ నిర్మించిన
దేవాలయాన్ని పరమ పవిత్ర మరియమాతకు అంకితం చేసారు. కాలక్రమేణా, ఈ సమూహం “కర్మెలు మాత సహోదరులు” (Brothers of Our Lady of Mount
Carmel) గా పిలువబడింది. ఆ తరువాత “కర్మెలు సభగా” పేరు గాంచింది. ఈ
పేరు వారు మరియమాత పట్ల చూపిన అమితమైన భక్తిని, ఆమెను వారు తమ
ఆశ్రయంగా, మార్గదర్శిగా గుర్తించడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
మరియమాత, కర్మెలు సభకు ప్రధాన పోషకురాలు, ఆదర్శం.
వారు మరియమాతను కేవలం తమ రక్షకురాలుగానే కాకుండా, దైవచింతన, మౌనం, దేవుని వాక్యానికి విధేయత వంటి సన్యాస జీవిత ఆదర్శాలకు ఆమెను పరిపూర్ణ ఉదాహరణగా, ఆదర్శముగా భావించారు. ఆమె జీవితం, దేవుని సంకల్పానికి తనను తాను పూర్తిగా అప్పగించుకోవడం, వారి ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ఆదర్శముగా నిలిచింది. ఈ విధంగా, కర్మెలు కొండపై ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ఉద్యమం, మరియమాత పట్ల లోతైన భక్తితో పెనవేసుకుని, నేటి కర్మెలు మాత మహోత్సవానికి పునాది వేసింది.
పునీత సైమన్ స్టాక్ – కర్మెలు సభ:
శ్రీసభ చరిత్రలో మరియతల్లి దర్శనాలు చాలా విరివిగా కనిపిస్తుంటాయి.
ఇటువంటి ప్రాముఖ్యమైన మరియతల్లి దర్శనాలలో అత్యంత ప్రాముఖ్యమైన దర్శనం మరియతల్లి “కర్మెలు
మాత”గా పునీత సైమన్ స్టాక్ గారికి ఇచ్చిన దర్శనం.
సైమన్ స్టాక్ గారు 1165వ సంవత్సరంలో ఇంగ్లాండు
దేశంలోని ‘కెంట్’ కౌంటీలో జన్మించారు. చిన్నతనమునుండే, భక్తి విశ్వాసాలతో, ఆధ్యాత్మిక
విషయాలపై ఆసక్తితో పెరిగారు. 12 సంవత్సరాల వయస్సునుంచే అడవిలో, ఒక బోలుగా ఉన్న
చెట్టు కాండములో సన్యాసిగా జీవించడం ప్రారంభించాడని కథలు ప్రచారంలో ఉన్నాయి.
“స్టాక్” అనే ఇంటిపేరు కూడా “చెట్టు కాండం” అనే అర్థం నుంచి వచ్చిందని కొందరు
అంటారు. అతి ప్రాచీన సన్యాసుల ఆచారాలను అనుసరించి, కేవలం పండ్లు మరియు నీటిని
మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, తన సమయాన్ని ఎక్కువగా ప్రార్థన
మరియు ధ్యానంలో గడిపారు. రెండు దశాబ్దాల ఏకాంత జీవితం తర్వాత, దైవశాస్త్రంలో
విద్యను అభ్యసించి, గురువుగా అభిషిక్తుడై, తిరిగి మరల తన ఏకాంత జీవితానికి తిరిగి
వెళ్ళాడు. ఆయన ఈ ఏకాంత జీవితాన్ని 1212వ సంవత్సరం వరకు
కొనసాగించారు.
కర్మెలు సభ అప్పటికి ఇప్పుడే ఇంగ్లాండు దేశములోనికి ప్రవేశించింది. కర్మెలు
సభ సన్యాసుల కఠినమైన సన్యాస జీవనం సైమన్ స్టాక్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. 1212 వ సంవత్సరములో వీరు కర్మెలు
సభలో చేరారు. ఈ పిలుపును ఆయన దైవిక ఆదేశంగా భావించారు, తన
ఆధ్యాత్మిక ప్రయాణంలో తదుపరి అడుగుగా గుర్తించారు. ఇది కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక
ఎదుగుదల కాకుండా, ఒక సంఘంలో భాగమై, మరియమాతకు
అంకితం చేయబడిన సభ ద్వారా దైవసేవ చేయాలనే దైవిక ప్రణాళిక
అని ఆయన గ్రహించారు. సైమన్ స్టాక్ కార్మెలైట్ సభలో చేరి, ఆక్స్‌ఫర్డ్‌లో
వేదాంత శాస్త్రములో విద్యను పూర్తి చేసిన తర్వాత, 1215వ
సంవత్సరంలో ఆయన సభకు వికార్ జనరల్‌గా నియమించబడ్డారు.
కర్మెలు సభ ప్రాచీన ఆరంభ మూలాల విషయములో కొన్ని వర్గాలనుండి సవాళ్ళను
ఎదుర్కొన్నది. ఈ వివాదంలో కర్మెలు సభ తరపున సైమన్ స్టాక్ గారు ధైర్యంగా నిలబడ్డారు. సభ యొక్క చరిత్రను,
వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని, దేవునిపట్ల
వారికున్న అంకితభావాన్ని ఆయన శక్తివంతంగా వాదించారు. చివరికి, ఈ
వివాదం పోప్‌లచే పరిష్కరించబడింది. వివిధ
పోప్‌లు, ముఖ్యంగా పోప్ ఇన్నోసెంట్ IV మరియు
పోప్ అలెగ్జాండర్ IV వంటివారు, కార్మెలైట్
సభ యొక్క నియమాలను మరియు వారి చట్టబద్ధతను ధృవీకరించారు.
1237వ సంవత్సరములో జరిగిన కార్మెలైట్ సభ యొక్క సాధారణ సమావేశములో సైమన్ స్టాక్ గారు కూడా పాల్గొన్నారు. ఈ సమయములో,
తురుష్కుల నుండి తీవ్రమైన హింసలను ఎదుర్కొన్నారు. కార్మెల్ మఠసభ గురువులను
బెదిరించి తమ మఠ నిలయాల నుండి వారిని తరిమి కొట్టారు. భయాందోళనతో మఠ అధిపతి
అయినటువంటి సైమన్ స్టాక్ గారు సైతం మఠాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. సైమన్ స్టాక్
గారు ఈ భయాందోళనల మధ్య స్వదేశంలోని, ‘కెంట్’కు తిరిగి వచ్చారు.
1247వ సంవత్సరంలో సైమన్ స్టాక్ గారు
కార్మెలైట్ మఠానికి అధిపతిగా నియమించిన తరువాత (1265 తన మరణం వరకు), సభ
పునరుద్ధరణకు ఎంతగానో కృషి చేసారు. ఎంతో విశ్వాసముతో వినయ విధేయతలతో భయాందోళనతో
చెల్లాచెదురైన తమ గురువులను తమ తమ మఠాలకు చేర్చాలని, వేద హింసలు ఆగిపోయి
తురుష్కులు మారుమనస్సు పొందాలని, మరియతల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నారు. అయితే
ఈ సమయములోనే యూరప్ దేశాలలో, మరియమాత భక్తిని, కర్మెలు సభను విస్తరించారు.
“కర్మెలు మాత” పేరుతో నూతన దేవాలయాలను నిర్మించారు. సభను ఐరోపాలోని ప్రముఖ విద్యా కేంద్రాలలో స్థాపించడానికి
అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈవిధముగా, సైమన్ స్టాక్ నాయకత్వంలో, కర్మెలు సభ కేవలం ఒక చిన్న సన్యాస సమూహం నుండి
ఐరోపా అంతటా ప్రభావవంతమైన, మరియు విస్తృతంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ సభగా
రూపాంతరం చెందింది.
కర్మెలు మాత దర్శనం:
కర్మెలు సభ అనేక కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో, 1251 జూలై 16వ తేదీన మరియమాత “కర్మెలు మాత”గా సైమన్ గారికి దర్శనమిచ్చి వస్త్రముతో
తయారు చేసిన చిన్న గోధుమ రంగు ఉత్తరీయాన్ని [స్కాపులర్] దయ చేసారు. కర్మెలు సభ
సభ్యులకు ఒక విశేష అనుగ్రహముగా ఇవ్వబడింది. ఈ ఉత్తరీయాన్ని ధరించి విశ్వాస
విధేయతలతో ప్రార్థించే వారికి అనేక రకమైన మేలులు కలుగుతాయని ముఖ్యంగా మరణ సమయంలో తప్పక
రక్షించ బడతారు అని మరియ తల్లి వాగ్దానం చేశారు. ఆ క్షణం నుండి మరియమాత
ఉత్తరీయమును ధరించి ప్రార్థించే వారందరికీ రక్షణ, సంరక్షణ, శాంతి లభిస్తూ వచ్చాయి.
ఉత్తరీయాన్ని ధరించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది. సైమన్ గారు
ప్రార్ధించిన ప్రకారం, గురువులు తిరిగి తమ తమ మఠములకు చేరుకుని తమ సేవలను
కొనసాగించారు.
ఈవిధముగా, ఈ సంఘటనలతో, “కర్మెలు మాత” భక్తి క్రమక్రమంగా పెరిగింది. 1380వ సంవత్సరంలో మూడవ హోనోరియసు పోపు గారు కర్మెలు మఠ
స్థాపనను, నియమావళిని ధృవీకరించటం ద్వారా “కర్మెలు మాత” పండుగ మొదట ప్రారంభమైనది.
కొంతమంది కతోలిక మఠవాసులు పర్వతం మీద ఒక చిన్న దేవాలయములను నిర్మించి దానిని “కర్మెలు
మాత”కు అంకితమిచ్చారు.
పదిహేనవ శతాబ్దంలో కర్మెలు సభ మహిళలను కూడా ఆహ్వానించింది. ఈ మహిళలు మఠవాసినులుగా
ఆశ్రమాలలో నివసిస్తూ, ప్రార్థన, ధ్యానం, దైవసేవలో తమ జీవితాలను అంకితం చేసుకున్నారు.
ఇది కార్మెలైట్ ఆధ్యాత్మికతకు ఒక ముఖ్యమైన మలుపు. అంతేకాకుండా, సామాన్య ప్రజలు కూడా కార్మెలైట్ ఆధ్యాత్మికతను తమ దైనందిన జీవితంలో
ఆచరించేందుకు అవకాశం కల్పించబడింది. వీరు ప్రత్యేక ప్రమాణాలు చేయకపోయినా, కార్మెలైట్ ఆదర్శాలైన ప్రార్థన, దైవచింతన, మౌనం, మరియమాత భక్తిని పాటిస్తూ, సభతో ఆధ్యాత్మికంగా అనుబంధం కలిగి జీవించేవారు.
చివరకు, 1726వ సంవత్సరంలో 13వ బెనెడిక్ట్ పోప్ గారు ఈ పండుగను రోమను దైవార్చన కాలెండరులో చేర్చి, అధికార
పూర్వకంగా విశ్వవ్యాప్తం చేశారు. అప్పటినుండి కర్మెలు మాత పండుగను 16 జూలైన
కొనియాడటం జరుగుతుంది.
ఈ పండుగ ద్వారా మరియతల్లి మనందరికీ ఇస్తున్న సందేశం:
“అడగందే అమ్మైనా అన్నం పెట్టదు” అంటారు. శ్రమలలో, వేదనలలో ఉన్న మనము
వాటిని జయించి శాంతి వంతమైన జీవితాన్ని జీవించాలి అంటే, మనము కూడా దేవుని శరణు
వేడుకోవాలి. దేవున్ని ప్రార్ధించాలి. సైమన్ స్టోక్ గారు చెల్లాచెదురైన తమ
గురువులను తమ తమ మఠాలకు చేర్చమని, తురుష్కుల మనసును మార్చమని మరియతల్లిని
వేడుకున్నారు. మరియతల్లి సైమన్ గారి ప్రార్థనను ఆలకించారు. ఆలకించడం మాత్రమే కాదు, తన ప్రియ కుమారుని ద్వారా ఆ సమస్యకు పరిష్కారం
చూపించారు. “కర్మెలు మాత”గా ఆ తల్లి సైమన్ గారికి దర్శనం ఇచ్చారు. ఈనాడు మనం కూడా
మన బాధలను, విన్నపాలను, కోర్కెలను ఆ తల్లికి వినయ విధేయతలతో సమర్పిస్తే ఖచ్చితంగా
మన సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. మరియతల్లి తన బిడ్డలను ఎప్పుడూ కూడా సైతాను
చేతిలో నాశనం చెంద నివ్వరు. కాబట్టి మంచి మనసుతో ప్రార్థన చేద్దాం. లోకములో
జరుగుతున్న యుద్ధాలు, అవినీతి, అక్రమాలు ఆగిపోవాలి అని మరియతల్లి మధ్యస్థ
ప్రార్థనను వేడుకుందాం.
“కర్మెలు మాత” పండుగ
సందర్భముగా, మానం ఏమి నేర్చుకుందాం అంటే, రక్షకుని మాత, మనకు రక్షణ కార్యములను జరిపిస్తారని
విశ్వసిద్దాం. మన విశ్వాసము, మన విశ్వాస కార్యములే, మన విశ్వాసాన్ని నిలబెడతాయి.
మనకు రక్షణగా నిలుస్తాయని విశ్వసిద్దాం. మనం కూడా మన జీవితములో మనల్ని ఎవ్వరూ
రక్షించలేని సమయములో... “కర్మెలు మాత” సహాయాన్ని వేడుకుందాం. కన్య మరియమాత
క్రీస్తు ప్రభుని తల్లి. అవసరతలలో ఉన్నవారిని ఆదుకోకుండా, ప్రాణాపాయ స్థితిలో
ఉన్నవారిని కాపాడకుండా ఉండరు. ఆమె సహాయమును అందించకుండా ఉండరు. కాబట్టి, “కర్మెలు
మాత” సహాయం కొరకు ప్రార్ధన చేద్దాం!
మీ అందరికీ కర్మెలు మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు మిమ్ములను దీవించునుగాక! ఆమెన్.
No comments:
Post a Comment