పునీత అంబ్రోసు - పీఠాధిపతి, వేద పండితుడు

పునీత అంబ్రోసు - పీఠాధిపతి, వేద పండితుడు (330 - 4 ఏప్రిల్ 397)
నిర్భంద స్మరణ, డిశంబర్ 7

"ఈ పుణ్య పురుషుని నిష్కపట ప్రేమ కారణమున ప్రభువు వీరినెన్నుకొనెను. వీరికి నిత్య మహిమ ప్రసాదించెను. వీరి సందేశ కాంతి వలన శ్రీసభ మెరయుచున్నది."

అంబ్రోసు కతోలిక కుటుంబములో జన్మించాడు. తండ్రి అవురేలియుస్ అంబ్రోసు. తల్లి జ్ఞానవంతురాలు మరియు భక్తి పరురాలు. తండ్రి మరణానంతరం, రోము నగరములో విద్యను అభ్యసించాడు. అతను వివాహరహితుడు.

అంబ్రోసు, 33 వ ఏటనే, తన జీవితములో న్యాయవాదిగా, మిలాను (ఇటలీ దేశం) గవర్నరుగా, చక్రవర్తికి మంచి స్నేహితునిగా ఎన్నో విజయాలను చవిచూసాడు.

374 వ సం,,ర కాలములో, ఎన్నో భిన్నమతాభిప్రాయాలు ప్రబలిపోతూ ఉండేవి. ముఖ్యముగా, "క్రీస్తు దైవత్వము" గూర్చి అనేక భిన్నాభిప్రాయాలతో ఉన్నవారు (ఏరియన్లు) కతోలిక చర్చికి సవాలుగా ఉండెడివారు. వీరు చర్చిని వినాశనము చేయబూనియున్నారు. అలాంటి సమయములోనే మిలాను పీఠాధిపతి మరణించారు. ఆయన ఏరియన్ల అభిప్రాయాలను ఏకీభవించాడు. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఏరియనా? లేక కతోలికుడా? ఇరు వర్గాలవారు కధిద్రల్ లో సమావేశమయ్యారు. వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. మిలాను గవర్నరుగా అంబ్రోసు అక్కడికి రావడం జరిగింది. ఉద్వేగభరితమైన ప్రసంగముతో ఇరు వర్గాల వారిని శాంతింప జేశాడు. కలహాలు లేకుండా  పీఠాధిపతిని ఎన్నుకొనవలసినదిగా వారిని ఆజ్ఞాపించాడు.


హఠాత్తుగా, జనములోనుండి ఒక స్వరం, "అంబ్రోసు పీఠాధిపతి" అనడం, ఆతరువాత అందరు ఏక స్వరముతో "అంబ్రోసు పీఠాధిపతి" అనడం జరిగింది. తన విజయవంతమైన జీవితాన్ని వదులుకో లేక, భిన్నమతాభిప్రాయాల మధ్య నలగడం ఇష్టం లేక, అంబ్రోసు అక్కడనుండి వెమ్మటే తప్పుకొన్నాడు. చక్రవర్తి దగ్గరకు వెళ్లి ఈ నిర్ణయమునుంచి తనను తప్పించమని, అతను అప్పటికి ఇంకా జ్ఞానస్నానమే స్వీకరించలేదని విజ్ఞప్తి చేసుకొన్నాడు. కాని, ఒక గవర్నరు పీఠాధిపతి కార్యానికి అర్హత పొందటం చక్రవర్తి తన సంతోషాన్ని, సమ్మతాన్ని వెల్లడించాడు. చక్రవర్తి నిర్ణయాన్ని విన్న అంబ్రోసు ఒక సెనేటర్ గృహములో తలదాచుకొన్నాడు. చక్రవర్తి నిర్ణయాన్ని తెలుసుకొన్న ఆ సెనేటర్, వెమ్మటే అంబ్రోసును అప్పగించాడు. ఇక ఎక్కడికి పారిపోవడానికి అవకాశము లేక, అంగీకరించక తప్పలేదు. వారంరోజులలో, జ్ఞానస్నానము, గురుపట్టము స్వీకరించి, పీఠాధిపతిగా నియమించబడ్డాడు. అయితే, బలవంతముగా ఒప్పుకోవలసి వచ్చినది కనుక, గవర్నరుగా ఉన్నప్పటి విలాసవంతమయిన జీవితాన్నే జీవిస్తాడని అందరూ భావించారు. కాని, ఆశ్చర్యముగా, అంబ్రోసు తనకున్న ఆస్తినంత అమ్మివేసి పేదలకు దానం చేసాడు. పునీత సింప్లీషియన్ చెంత బైబిల్ గ్రంధ పఠనము, వేదాంత శాస్త్రమును అభ్యసించాడు.

తనకున్న న్యాయవాది మరియు వక్త నైపుణ్యాలతో భిన్న మతాభిప్రాయాలను ధైర్యముగా ఎదుర్కొని పుణ్య జీవితాన్ని జీవించాడు.

పుణ్య కార్యాలు

గోతికులు (Goths) దండెత్తినప్పుడు, బందీలుగా కొనిపోబడిన వారిని, తన దగ్గర ఉన్న ధనాన్ని పరిహారముగా ఇచ్చి వారిని విడుదల చేయించాడు. దేవాలయమునకు సంబంధించిన బంగారమును కూడా వారికోసం వెచ్చించాడు. "ధనాన్ని సమకూర్చుకోవడం కన్నా, ఆత్మలను రక్షించడం ఎంతో ఉత్తమ మైనది" అని చెప్పాడు. అంబ్రోసు అధికారముకన్న పేదవారికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చాడు.

చక్రవర్తి మరణానంతరం, చక్రవర్తి భార్య జుస్తీన (ఏరియన్) తమ నాలుగు సం,,ల కుమారునికి రాజ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించినది. చక్రవర్తి మరణముతో రాజ్యం బలహీనపడినదని తలంచి, పూర్వం రోమా సైనికుడైన మాక్సిముస్, రాజ్యముపై దండెత్త చూసాడు. ఆ సమయములో, జుస్తీన మాక్సిముస్ తో సంధి చేయవలసినదిగా అంబ్రోసును ప్రాధేయపడినది. ఆమె తనకు శత్రువైనప్పటికినీ, అంబ్రోసు రాజీ ప్రయత్నాలు చేసి సఫలీకృతుడైనాడు.

ఆ తరువాత, జుస్తీన కృతజ్ఞతాభావము లేకుండా, దేవాలయాన్ని అప్పగింపవలసినదిగా ఆజ్ఞాపించినది. కాని, అంబ్రోసు దానికి అంగీకరించలేదు. "దేవుని ఆలయమును నేను ఎప్పటికి ఇవ్వలేను" అని ఖరాఖండిగా చెప్పాడు. ప్రజలు అంబ్రోసు వైపు ఉన్నారు. తనకు ఉన్న ప్రజల మద్దతుతో, అతి సులభముగా, జుస్తీనాపై తిరిగుబాటు చేసి, ఆమె సామ్రాజ్యాన్ని కూలదోసే అవకాశం అంబ్రోసుకు ఉన్నప్పటికిని, హింస ఇష్టము లేక, శాంతియుతముగా పరిష్కరించుటకు ప్రయత్నాలు చేసాడు. జుస్తీన అనేకసార్లు తన సైన్యముతో దేవాలయాన్ని ఆక్రమించ ప్రయత్నాలు చేసింది.

మ్రానికొమ్మల ఆదివారమున దేవాలయమును అప్పగింప బోయేది లేదని తన ప్రసంగములో ఖరాఖండిగా చెప్పాడు. భయబ్రాంతులైన ప్రజలు, అంబ్రోసుతో పాటు, దేవాలయములోనే తల దాచుకొన్నారు. ప్రజలలో ధైర్యాన్ని నింపుటకు, తాను స్వయముగా కూర్చిన గీతాలను ఆలపించమని కోరాడు. వారి విశ్వాసాన్ని చూసి, స్తుతి గీతాలను విని, సైన్యము కూడా చివరికి వారితో చేరడం జరిగింది.

అదేసమయములో, మరోమారు మాక్సిముస్ దండెత్తడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. జుస్తీనా, ఆమె కుమారుడు భయముతో వణకి పోయారు. ఇక వేరే మార్గము లేక, మరల అంబ్రోసును రాజీ ప్రయత్నాలు చేయవలసినదిగా ప్రాధేయపడ్డారు. గొప్ప క్షమాగుణము కలిగిన అంబ్రోసు సంధి ప్రయత్నాల కోసం అంగీకరించాడు. కాని, ఈ సారి, మాక్సిముస్ సంధి కొరకు అంగీకరించలేదు. జుస్తీన, ఆమె కుమారుడు గ్రీసు దేశమునకు పారిపోయారు. కాని, అంబ్రోసు అక్కడే ఉన్నాడు. అదృష్టవశాత్తు, తూర్పు దేశ చక్రవర్తి తేయోడోసియుస్, మాక్సిముస్ ను ఓడించడం జరిగింది. అతడు కతోలికుడు కనుక అంబ్రోసుకు చివరివరకు మంచి స్నేహితునిగా ఉన్నాడు.

390 వ సం,,లో రోమను గవర్నరు హత్యానంతరం, తెస్సలోనికలో తేయోడోసియుస్ 7,000 ల మందిని దారుణముగా వధించాడు. దానికి బదులుగా, అంబ్రోసు అతనిని చర్చినుండి బహిష్కరించాడు. కొన్ని నెలల ప్రాయశ్చిత్తము తరువాతనే, అంబ్రోసు మరల అతనిని స్వీకరించి సంస్కారములు ఇవ్వడం జరిగింది. దీనిని బట్టి, పీఠాధిపతి యొక్క అధికారం, అంబ్రోసు ధైర్యసాహసాలు స్పష్టమగుచున్నాయి.

అంబ్రోసు గొప్ప వేద పండితుడు మరియు మంచి ప్రసంగీకుడు. తన ప్రసంగాలే పునీత అగుస్తీను మారుమనస్సుకు కారణమయ్యింది.

దైవార్చన సాంగ్యాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చాడు. వాటిపట్ల కాఠిన్యం ప్రదర్శించక, దేవుణ్ణి స్తుతించుటకు ప్రజలకు సహాయముగా ఉండాలని ఆశించాడు. ఎక్కడవున్న, అక్కడి ఆచారాలను పాటించాలని అగుస్తీనువారికి కూడా సూచించాడు.

మరియ తల్లి భక్తిని కూడా ఆయన ఎంతగానో ప్రచారం చేసాడు. ముఖ్యముగా, మరియ కన్యత్వం, దేవుని తల్లిగా ఆమె ప్రాత్ర గురించి ఆయన భావాలు అనేక పాపుగార్లను ప్రభావితం చేసాయి.

అంబ్రోసు 4 ఏప్రిల్ 397 వ సం,,లో తన 57 వ ఏట మరణించాడు. ఆయన మహోత్సవం డిశంబర్ 7, అతని గురుపట్టం రోజున కొనియాడబడుచున్నది.

ప్రార్ధన:

కరుణాసాగరులగు ఓ సర్వేశ్వరా! మీరు పునీత అంబ్రోసును కతోలిక విశ్వాస బోధకుడుగను, అపోస్తుల సాహసమునకు ఆదర్శప్రాయుడుగను తయారు చేసితిరి. మీ సత్య సభను మీ హృదయమునకు అనుగుణముగా ధైర్య సాహసములతోను, వివేకముతోను పాలింపగల పుణ్య పురుషులను దానియందు తయారు చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. పునీత అంబ్రోసువారి ఆదర్శానుసారము మీ ధర్మ మార్గములందు ధైర్యముగా ప్రవర్తించుచూ మీ నిత్యానంద విందుకు తయారగునట్లు మమ్ము దీవించండి.

No comments:

Post a Comment