పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ - క్రిస్మస్

పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ - క్రిస్మస్

పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ దివ్య బాల యేసునకు ప్రత్యేకమైన భక్తిని కలిగియున్నాడు. చరిత్రలో 1223వ సం॥లో క్రిస్మస్‌ జాగరణ సందర్భంగా పశువుల పాకను ఏర్పాటు చేసి క్రీస్తు జనన సన్నివేశాన్ని సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి. క్రీస్తు జన్మించిన చారిత్రాత్మకమైన పవిత్ర భూమికి తీర్ధయాత్ర చేయటం, ముఖ్యముగా బెత్లహేము నగరంలో ఉన్న గుహను సందర్శించటం, ప్రాన్సిస్‌ వారికి ఇలాంటి ప్రత్యేకమైన గొప్ప ఆలోచన రావటానికి కారణం అని చెబుతారు. ఈ అనుభవము వలననే పేదరికముతో, వినయముతో పశువుల పాకలో జనించిన దివ్య బాల యేసు పట్ల తన ప్రత్యేక భక్తి మరింత బలపడినది. వాస్తవానికి ఈ గొప్ప సుగుణాలను అనుకరించటానికి ఫ్రాన్సిస్‌ వారు సన్యాస సభను స్థాపించి    ఉన్నారు. ఇటలీ దేశంలో అస్సీసి పట్టణమునకు దరిగా ఉన్న గ్రేచియా అనే గుహలో క్రీస్తు జన్మను ఒక ప్రత్యేక అనుకరణములో ఫ్రాన్సిస్‌ పున:సృష్టించాడు. ఈ సందర్భంగా అచ్చట దివ్య పూజా బలిలో పాల్గొనాలని, తాను స్వయంగా ఏర్పరచిన పశువుల పాకలోని క్రీస్తు జనన సన్నివేశాన్ని దర్శించాలని అచ్చటి పట్టణ ప్రజలను ఆహ్వానించి యున్నాడు.

‘‘బెత్లెహేములో జన్మించిన ఆ బాలయేసును జ్ఞాపకం చేసుకుంటూ దివ్యబాల యేసు పొందిన అసౌకర్యాలను పశువుల పాకలో ఎలా పరుండినది, ఎద్దు, గాడిద తొట్టి ప్రక్కన ఎలా నిలిచి ఉన్నవి మొ॥గు సన్నివేశాన్నిటినీ తన కళ్ళారా చూడాని అలా చేయాలను కున్నాను’’ అని ఈ విధంగా చేయడానికి గల కారణాన్ని ఫ్రాన్సిస్‌ వారు ఒకసారి తన స్నేహితునితో చెప్పియున్నాడు.

ఫ్రాన్సిస్‌ వారు గ్రేచియా గుహలో పశువుల పాకను ఏర్పాటు చేసి దానిలో ఓ చక్కటి పశువుల తొట్టిని ఏర్పాటు చేసి, ప్రక్కన ఎద్దును, గాడిదను కట్టివేసి ఆ రోజు రాత్రి నిజముగా మొదటిసారి క్రిస్మస్‌ జరుగుతున్నట్టుగా, అనగా క్రీస్తు జన్మిస్తాడేమో అన్నట్లుగా క్రీస్తు జనన సన్నివేశాన్ని చాలా అద్భుతంగా సుందరంగా సృష్టించాడు. ఈ సన్నివేశం ద్వారా క్రీస్తు ఈ లోకానికి ఏ విధముగా ముఖ్యముగా పేదరికంలో, నిడారంబరంలో వచ్చి ఉన్నాడో ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాని అలా చేసి ఉన్నాడు.

గొప్ప సువార్త విలువయిన పేదరికముచేత ఎంతగానో ఆకర్షితుడైన ఫ్రాన్సిస్‌వారు, ఆయన జీవించి ఉన్న కాలంలోని భౌతిక వాదనను, దురాశను జయించడానికి ఈ సన్నివేశాన్ని సృష్టించినట్లుగా కూడా చెప్పుకుంటారు.

పునీత బొనవెంతుర గారు (ఫ్రాన్సిస్‌ స్థాపించిన సభ సభ్యుడు మరియు సమకాలికుడు) ఈ అద్భుత సన్నివేశం గురించి ఈ విధముగా వ్రాసియున్నారు: ‘‘ఫ్రాన్సిస్‌ వారి మరణానికి 3సం॥ల ముందు ఈ సంఘటన జరిగియున్నది. అత్యంత భక్తితో సాధ్యమైనంత గొప్ప ఉత్సవముగా ఉత్సాహముతో క్రీస్తు జనన సన్నివేశాన్ని కొనియాడారు. దీని కొరకై ఫ్రాన్సిస్‌ వారు అప్పటి పోపుగారి నుండి అనుమతిని కూడా పొందియున్నారు. ఆ తర్వాత పశువుల పాకను, తొట్టిని ఏర్పాటు చేసి, ఎండిన గడ్డిని, ఒక ఎద్దును, ఒక గాడిదను, అక్కడ కట్టివేశాడు. తన సహోదరుందరినీ పిలిచాడు. ప్రజలు కూడా అక్కడ సమావేశమయ్యారు. వారి సంతోష గానముతో అచ్చటి వనము దద్దరిల్లి పోయింది. అద్భుత రాత్రి ఘడియు వెలుగుతో, స్తుతి కీర్తనలతో, పాటలతో, మహా గొప్పదిగా గడచి పోయినది’’. ఎంత అద్భుతమైన సన్నివేశం! బొనవెంతుర గారు ఇంకా ఇలా వ్రాసియున్నారు : ‘‘దైవ సేవకుడు ఫ్రాన్సిస్‌ నిండైన భక్తితో ఆ తొట్టి ఎదుట నిలబడి ఉన్నప్పుడు, అతని కళ్ళలో నీళ్ళు తిరుగు చుండగా, ప్రకాశ వంతమైన ఆనందంలో మునిగి పోయాడు. ఫ్రాన్సిస్‌ వారు సువార్తను గానం చేశాడు. ఆ తర్వాత క్రిస్మస్‌ గురించి అక్కడ సమావేశమైన వారందరికీ ప్రసంగించాడు. తన సున్నితమైన ప్రేమను బట్టి, క్రీస్తు నామమును ఉచ్చరించలేక బెత్లహేము బాలుడాఅని పిలచియున్నాడు’’.

దివ్య బాల యేసు దర్శనం: ఫ్రాన్సిస్‌ మొదటిసారిగా పశువుల పాకను ఏర్పాటు చేసిన రోజున, ఫ్రాన్సిస్‌ వారికి అక్కడ సమావేశమైన వారికి, దివ్య బాల యేసు దర్శన మిచ్చినట్లుగా చెబుతారు. బొనవెంతురగారు వ్రాసినట్లుగా, ‘‘గ్రేచియా ప్రాంతంలోని జాన్‌ అనే యుద్ద వీరుడు క్రీస్తు ప్రేమ వలన యుద్ధమును వీడి ఫ్రాన్సిస్‌ వారికి ప్రియమైన స్నేహితుడుగా మారాడు. ఈ జాన్‌ గారు పొందిన దర్శన సాక్ష్యముగా, ఆ రోజు ఫ్రాన్సిస్‌ వారు తను చేసిన పశువుల పాకలోని తొట్టిలో పరుండి, నిద్రించుచున్న దివ్య బాల యేసును తన రెండు చేతులలోనికి ఆప్యాయముగా తీసుకొని తన గుండెలకు హత్తు కున్నాడు’’.

ఈ భక్తి ప్రచారం: పునీత ఫ్రాన్సిస్‌ ఆరంభించిన ఈ క్రిస్మస్‌ సన్నివేశం త్వరలోనే ఇటలీలోని ప్రతి దేవాలయములో ప్రాచుర్యము పొందినది. ఈ భక్తి, విశ్వాసం గృహాలలో కూడా త్వరలోనే చేరి పోయింది. ఈ రోజు అనేక సెక్యులర్‌ సంస్థలలో కూడా పశువుల పాకను కట్టడం చూస్తున్నాము. పశువుల పాక లేకుండా క్రిస్మస్‌ పండుగను ఊహించలేము. ఈ అద్భుత సన్నివేశం శ్రీసభ ఆచారంగా వస్తున్నది. అయితే మనము ఏర్పాటు చేసే పశువుల పాక కేవలం అంకరణ కొరకు కాక దివ్య బాల యేసుని వినయము, నిరాడంబరత, పేదరికం అనే సుగుణాలను మనము ధ్యానించాలి.

No comments:

Post a Comment