పునీత పేతురు పౌలుల
బృహద్దేవాలయ ప్రతిష్ట ఉత్సవం (18 నవంబర్)
అపోస్తలులు పునీత పేతురు, పునీత పౌలు మృత శరీరాలు పురాతన దేవాలయాలలో
సమాధి కాబడి యుండగా నేడు వారిని శ్రీసభ అత్యంత వైభవంగా గౌరవిస్తుంది. పునీత పౌలు
బసిలికల, పునీత పేతురు వాటికను బసిలిక దేవాలయం నాలుగవ శతాబ్ధంలోనే మొదటగా
నిర్మించ బడ్డాయి. వారు అపోస్తలులైన సాక్ష్యులే కాకుండా రోమను శ్రీసభకు
వ్యవస్థాపకులు మరియు సంరక్షకులు. నేటికి వారికి ఆ పూర్తి గౌరవం, కీర్తి ప్రతిష్టలున్నాయి.
ఈ అపోస్తలులు వేదసాక్షి మరణం పొందిన ప్రదేశాలను
భక్తులు గౌరవిస్తూ నేటికీ ప్రత్యేక శ్రద్ధతో భద్రపరచి ఉన్నారు. పురాతన సమాచారం
ప్రకారం పునీత పేతురుగారు కీ.శ. 64 లేదా 67లో వాటికను కొండపై వేదసాక్షి మరణం పొందారు. తమ
రక్తాన్ని క్రీస్తు సాక్షిగా నేలపై ధారపోశారు. ఆ పరిశుద్ధ ప్రదేశం దాపులో నాలుగు పలకలగా
ఆక్రుతిగల ఎత్తైన స్థంభం ఒకటి ఉన్నది. ఇక్కడికి నీరో చక్రవర్తి నివసించిన
ప్రాంగణం కూడా ఎంతో దూరంలో లేదు. ఆ దగ్గరలో గల సమాధుల స్థలంలోనే పునీత పేతురు మృత
దేహం ఖననం చేయబడినది. క్రైస్తవుడును శ్రీసభ అనుకూరుడైన రోము రాజ్యాధినేత కాన్‌స్టంటైన్
చక్రవర్తి ఏలుబడి చేస్తుండగా, క్రీ.శ. 326లో పునీత పేతురు
సమాధులు వాటికన్లో పెద్ద బసిలికా దేవాలయాన్ని దగ్గరుండి కట్టించారు ఆనాటి
జగద్గురువు సిల్వెస్టరు గారు.
అయితే ఆ దేవాలయాన్ని మరిన్ని మెరుగులతో
విస్తరించి ప్రసిద్ధ శిల్పులు బ్రమంతే మరియు మైకేల్ అంజేలోగారి రూపకల్పన చొప్పున
పెద్ద బసిలికా గుడి పునర్నిర్మించ బడినది. ఇది ప్రపంచములోనే అతి పెద్దదియు, ధనవంతమైన దేవళంగా ప్రసిద్ధిచెంది ఒకే దఫాగా 50 వేలమంది భక్తులు దివ్యబలి పూజలో పాల్గొన వీలుపడుతుంది.
ఎనిమిదవ అర్బన్ పోపుగారు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్ర దేవాలయాన్ని క్రీ.శ. 1626 నవంబరు 18న ఆశీర్వదించి ప్రతిష్ట ఉత్సవమును నిర్వహించారు. దేవాలయ ఉన్నత పీఠముకు క్రింద
భాగాన పునీత పేతురు సమాధి ఉండేటట్లు ఏర్పాటు జరగడం విశేషం.
ఇక పునీత పౌలుగారు ఇటలీలో త్రేఫౌంటేన్ అను
ప్రదేశంలో క్రీ.శ. 64 లేదా 67లో హతసాక్షులై క్రీస్తుకోసం రక్తం బలి
కార్చారు. ఈ ప్రదేశం రోమునుండి ఒస్తియా పట్టణం వైపు పోవు రహదారిలో పేతురుగారి
సమాధికి 7మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ
నిర్మింప బడిన దేవాలయంను 1వ థియోడోసియస్
చక్రవర్తి కట్టించారు. క్రీ.శ. 440 నుండి 461 వరకు పాలించిన పునీత లియో ది గ్రేట్ (పునీత
సింహరాయలు) పోపుగారు ఈ దేవాలయాన్ని ఆశీర్వదించారు. అయితే పెద్ద అగ్ని ప్రమాదం వలన
ఆ గుడి క్రీ.శ. 1823 లో తగులబడి
పాడై పోయింది.
అందుకు స్పందించి ప్రపంచమంతా క్రైస్తవులు, క్రైస్తవేత్తరులు భారీ విరాళాలను పంపించారు. ఆ
ధనంతో పునీత పౌలు బసిలిక దేవాలయంను వినూత్నంగా కట్టించారు. దీనికి ముందుండి
నడిపించింది జద్గురువు 9వ పయస్
(భక్తినాధ) పోపుగారు. క్రీ.శ. 1854 డిసెంబరు 10న ఈ బృహద్దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్టాపన
గావించారు. ఈ ప్రతిష్టాపనకు రెండు రోజులు ముందుగా అనగా 1854 డిసెంబరు 8న ‘‘మరియమాత జన్మపాప
రహితోద్భవి’’ అని అధికార
పూర్వకంగా ప్రకటించి నిర్మలమాత పండుగను ప్రవేశ పెట్టారు.
పునీత అగుస్తీనువారు ఇలా చెప్పారు, ‘‘దేవునికి కట్టించినట్లు హతసాక్షులకు మనం గుడులు నిర్మించడం లేదు. కాని ఈ లోకంలో మనల్ని వీడి వెళ్లి మోక్షంలో దేవునితో జీవిస్తున్న వారి ఆత్మలకు జ్ఞాపకార్ధంగా మాత్రమే గుడులు కడుతున్నాం.’’
No comments:
Post a Comment