పునీత బర్నబాసు (జూన్ 11)

 పునీత బర్నబాసు
అపోస్తలుడు, పౌలు సహచరుడు, వేదసాక్షి

అపోస్తలుల కార్యములు 11:24లో, “ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోను, విశ్వాసముతోను నిండి యుండెను” అని చదువుచున్నాము. అలాగే, “అతడు తన సొంత భూమిని అమ్మి, వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదముల చెంత పెట్టెను” (11:37).

నేడు అపోస్తలుడు, పునీత పౌలు సహచరుడు, వేదసాక్షి పునీత బర్నబాసు (క్రీ.శ. 1-60) మహోత్సవమును కొనియాడుచున్నాము. యూదలేవీ వంశానికి చెందిన గొప్ప ధనవంతుడైన యోసేపు సైప్రస్ అను ద్వీపములో జన్మించాడు. కాని, కుటుంబము యెరూషలేములో స్థిరపడింది. సౌలు కాలములోనే, ఈ యోసేపు కూడా గమాలియేలు వద్ద విద్యాభ్యాసం చేసాడు.

పెంతకోస్తు తరువాత క్రీ.శ. 29 లేక 30లో క్రీస్తు విశ్వాసిగా మారి బర్నబాసు అను పేరు మార్చుకున్నాడు. బర్నబా అనగా ‘ఉత్సాహపరచువాడు’ అని అర్ధము (అ.కా. 4:36).

పరివర్తన పొందిన పౌలును యెరూషలేము అపోస్తలులకు పరిచయం చేసినది ఈ బర్నబానే (9:27). యెరూషలేములోని క్రీస్తు సంఘము బర్నబాసును సిరియాలోని అంతియోకియాకు గ్రీకు-క్రైస్తవులను సందర్శించమని పంపెను. బర్నబాసు పౌలును తార్సునగరము నుండి అంతియోకియాకు తీసుకొనిరాగా, వారిరువురు, ఒక ఏడాది అచట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు క్రీస్తు సువార్తను బోధించిరి (11:26).

క్రీ.శ. 45లో యెరూషలేములో గొప్ప కరువు ఏర్పడినప్పుడు, పౌలు, బర్నబాసులు అంతియోకియా నుండి సహాయమును పొంది యెరూషలేము క్రైస్తవ సంఘమునకు విరివిగా సహాయము అందించిరి. యెరూషలేమునుండి తిరిగి వచ్చిన తరువాత, పౌలు బర్నబాసు, మార్కు అను మారుపేరు గల యోహానుతో కలిసి సైప్రసు ద్వీపములో సువార్తా ప్రచారమును చేపట్టారు. ఆ తరువాత ఆసియా మైనరులో (టర్కీ) సువార్తా ప్రచారం చేసారు. వారు అచట యూదుల చేత ఎన్నో హింసలను పొందారు. అయినప్పటికిని, అచట ఎన్నో క్రైస్తవ సంఘాలను నిర్మించారు.

బర్నబాసు సైప్రసులో వేదప్రచారం చేయుచుండగా, రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు (క్రీ.శ. 61కి ముందే). అనాధి క్రైస్తవ సంఘ విశ్వాసులు బర్నబాసును ఎంతగానో గౌరవించారు. బర్నబాసు అవశేషాలను క్రీ.శ. 482లో సైప్రసులోని సలామిస్ వద్ద కనుగొన్నారు. అతని సమాధిలో హీబ్రూ భాషలో వ్రాయబడిన మత్తయి సువార్త గ్రంథమును కూడా కనుగొన్నారు. పౌలుతో కలిసి, అపూర్వ సేవలు అందించినందులకు, 12మందిలో ఒకరు కాకున్నను, శ్రీసభ బర్నబాసును ‘అపోస్తలుడు’గా గౌరవించినది.

అపోస్తలుడు అనగా ‘పంపబడినవాడు’ అని అర్ధము. యేసు తన శిష్యులను వేదప్రచారమునకు పంపాడు (మత్త. 10:1-15). వారికి సూచనలను ఇచ్చి, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు అని చెప్పాడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు, దయ్యములను వెడలగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చాడు. “శ్రీసభ స్వభావ సిద్ధంగానే వేదబోధక సంఘం” (Ad Gentes Divinitus, No. 2). వేదబోధక సంఘముగా, ఏమీ ఆశించక సంపూర్ణముగా క్రీస్తు కొరకు మన జీవితాలను అర్పించుకుందాం.

No comments:

Post a Comment