పునీత పాద్రె పియో

పునీత పాద్రె పియో

పాద్రె పియో (ఫ్రాన్సెస్కో ఫొర్జోనే) 25 మే 1887 వ సం.లో జుసెప్ప, గ్రాజియో ఫొర్జోనే దంపతులకు పియేత్రెల్చిన అను చిన్న వ్యవసాయ పట్టణములో జన్మించారు. మరుసటి రోజే దగ్గరలోని దేవాలయములో జ్ఞానస్నానమును పొంది ఫ్రాన్సెస్కో ఫొర్జోనేగా నామకరణం చేయబడ్డాడు. ఫొర్జోనే కుటుంబము పేదదైనప్పటికిని, విశ్వాసములోను, దైవప్రేమలోను ఉన్నతమైన కుటుంబము. ఈ కుటుంబము ప్రతీ రోజు దివ్యపూజా బలిలో పాల్గొనేది. సాయంత్రం ఇంటిలో జపమాలను జపించేది. కర్మేలుమాత పేరిట వారములో మూడురోజులు మాంసమునుండి ఉపవాసము ఉండేవారు. పియోగారి తాత, నాయనమ్మలకు, తల్లిదండ్రులకు చదవడం, రాయడం రాకపోయినను, బైలు ఖంటస్థము వచ్చు కనుక పిల్లలకు బైలు కథలు చెప్పగలిగేవారు. ఇలాంటి దైవీక, ఆధ్యాత్మిక కుటుంబములో పియోగారి జీవితములో విశ్వాస బీజాలు పడ్డాయి.

ఫ్రాన్సెస్కో తన చిన్నతనముననే అసాధారణమైనటువంటి అనుగ్రహ వరాలను ప్రదర్శించాడు. తన 5వ యేట, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తన బాల్య జీవితమునుండే మఠవాస జీవితము పట్ల ఎనలేని మక్కువను, ప్రేమను పెంచుకున్నాడు. చిన్నతనమునుండే భక్తి విశ్వాసాలు కలిగియుంటూ దేవాలయమునకు వెళ్లి ప్రార్ధన చేయుటకు ఇష్టపడేవాడని అతని తల్లి వివరించినది. చిన్న బాలునిగా ఉన్నప్పుడే తన కావలి సన్మనస్కునితో మాత్రమేగాక, యేసు ప్రభువు, మరియ తల్లితో సంభాషించ గలిగేవాడు. తన అమాయకత్వముతో ప్రతీ ఒక్కరు ఇలాంటి అనుభవాన్నే కలిగియుంటారని భావించాడు. ఒకసారి ఈ ఆధ్యాత్మిక వైఖరిని గమనించిన ఒక స్త్రీ ఇలా అడిగింది: ‘‘నీవు ఎప్పుడు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నావు? నీవు ప్రధమముగా దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడా?’’ దానికి సమాధానంగా, ‘‘ఎల్లప్పుడూ, కుమార్తె, ఎ్లప్పుడూ’’ అని చెప్పాడు.  అలాగే అనేకసార్లు సాతాను చేత శోధింపబడి, దాడి చేయబడ్డాడు.

ఫ్రాన్సెస్కో తన 15వ యేట, ఇటలీ దేశములోని, మొర్కోనె అను ప్రదేశములో పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి కపూచిన్‌ సభకు చెందిన నోవిషియేట్‌ లోనికి ప్రవేశాన్ని పొంది, కపూచిన్‌ సభ అంగీని 22 జనవరి 1903 లో స్వీకరించాడు. అప్పుడే తన పేరును పియోగా మార్చుకున్నాడు. ఒక సం.ము తరువాత, 22 జనవరి 1904లో తన ప్రధమ మాటపట్టును చేశారు. తన ఆదర్శమైన ప్రవర్తనను, భక్తి విశ్వాసాలను చూసి, తోటివారు మరియు మఠ పెద్దలు అతనిని ఎంతగానో ప్రశంసించేవారు. ‘‘ఇతర మఠ విద్యార్థులోకన్నా అతనిలో ఏదో ప్రత్యేకత ఉండేది. నేను అతనిని గమనించినప్పుడెల్ల, ఎంతో వినయముగా, ధ్యానపూర్వకముగా, మౌనముగా ఉండేవాడు. సోదరుడు పియోలో నన్ను అమితముగా తట్టినది ఏమంటే, ప్రార్ధనపట్ల అతనికున్న ప్రేమ’’ అని తోటి మఠ విద్యార్థి ఒకరు సాక్ష్యమిచ్చారు.

మూడు సం.ల అనంతరం, 1907 వ సం.లో నిత్యమాట పట్టును చేశారు. 10 ఆగష్టు 1910 వ సం. తన 23వ యేట, పియోగారు గురువుగా అభిషిక్తుడైనాడు. పియోగారికి తన ఆధ్యాత్మిక జీవితములో దివ్యపూజాబలి అతి ప్రాముఖ్యమైనది. దివ్యపూజా బలిలో అనేక సందర్భాలలో ధ్యానముతో కూడిన మౌనములోనికి వెళ్లెడివాడు తద్వారా, దివ్యపూజ కొన్ని గంటలపాటు కొనసాగెడిది. దివ్యపూజను తక్కువ సమయములో పూర్తిచేయమని కోరినప్పుడు, ‘‘అందరి గురువువలె దివ్యపూజను చేయవలెనని నాకూ ఉన్నదని ఆ దేవునికి తెలుసు కాని నేను చేయలేను’’ అని సమాధానమిచ్చాడు. పియోగారు క్రీస్తు శ్రమలను ఎక్కువగా ధ్యానించెడివాడు.

పియోగారి భక్తిని చూసి అనేకమంది విశ్వాసులు ఆకట్టుకున్నారు. నెమ్మదిగా ఒక్కరొక్కరు ఆయన ఆధ్యాత్మిక సలహా కొరకు ఆయన దగ్గరకు రావటం మొదలు పెట్టారు. అనేకమంది ఆయన ఆధ్యాత్మిక సలహాను పొంది వారి జీవితాలలో మరచి పోలేని అనుభావాన్ని పొందియున్నారు. సంవత్సరాలు గడిచే కొద్ది వేలమంది సంఖ్యలో ప్రపంచ నలుమూల నుండి కూడా యాత్రికులు, భక్తులు పియోగారి దగ్గరకు రావటం జరిగినది.

పియోగారు గొప్ప ప్రార్ధనాపరుడు. అతి చిన్న వయసులోనే, 30 సం. లోపే ఆధ్యాత్మిక అంచులకు చేరుకో గలిగాడు. ఎడతెరిపి లేకుండా ప్రార్ధన చేసేవాడు. చాలా సాధారణమైన భాషలో ప్రార్ధించేవాడు. ఎక్కువగా జపమాలను వల్లించేవాడు. ఇతరులకు కూడా జపమాల జపించాని చెప్పెడివాడు. ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మ కొరకు ప్రార్ధించాలని కోరేవాడు. ‘‘మన ప్రార్థనతో ఉత్తరించు స్థమును ఖాళీ చేయవలెను’’ అని పియోగారు చెబుతుండెడివాడు.

పియోగారు తన జీవితాంతము కూడా అనారోగ్యముతో బాధపడినారు. అయితే అతను ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు. తన శారీరక బాధలన్నింటిని కూడా ఇతరుల మారుమనస్సు నిమిత్తమై ఒక బలిగా దేవునకు అర్పించాడు. తన జీవితములో ఎన్నో ఆధ్యాత్మిక బాధలను కూడా అనుభవించారు. ‘‘నా అనారోగ్యము దేవుని ప్రత్యేకమైన నిర్ణయము అని నా నమ్మకము’’ అని పియోగారు చెబుతుండెడివారు. తన జీవితాన్ని పాపాత్ముల కొరకు ఒక త్యాగబలిగా అర్పించుకోవాలనే కోరిక ఆయనలో బలముగా ఉండేది. 20 సెప్టెంబరు 1918 వ సం.లో పూజానంతరం, క్రీస్తు సిలువ ఎదుట కృతజ్ఞతా ప్రార్ధన చేసుకొంటూ ఉండగా, తన శరీరముపై క్రీస్తు పంచగాయాలను పొందియున్నారు. అప్పుడు అతనికి 31 సంలు. ఈ పంచగాయాలను ఇలా 50 సం.లు పాటు కలిగియున్నాడు. శ్రీసభ చరిత్రలో క్రీస్తు పంచగాయాలను పొందిన మొట్ట మొదటి గురువు పాద్రె పియోగారు.

పాద్రె పియో గారికి దేవుడు ఎన్నో అసాధారణమైన ఆధ్యాత్మిక వరములను ఒసగియున్నాడు: స్వస్థతా వరము, ఒకేచోట రెండు చోట్ల కనిపించడం, ప్రవచనం, అద్భుతాలు, ఆత్మ వివేచనము, ఇతరుల హృదయాలను చదవటం, అన్యభాషలు అర్ధం చేసుకోవడం, దేవదూతలను గాంచడం, తాను పొందిన పంచగాయములనుండి మధుర సువాసను మొ.గునవి.

పాద్రె పియో గారు ఉదయం 2.30 గం.లకే లేచి ప్రార్ధన చేసుకొని దివ్యబలి పూజకు సిద్దపడేవాడు. తక్కువగా నిద్రపోయి, మితముగా భోజనము చేసేవాడు. రోజులో ఎక్కువ సమయము పాపసంకీర్తనాలు వినేవాడు. రోజులో దాదాపు 16 గంటు పాపసంకీర్తనాలను వినేవాడు. చాలా పేద జీవితాన్ని జీవించాడు. పేదరికము, బ్రహ్మచర్యము, విధేయత అను వ్రతాలను ఎంతో గౌరవించి జీవించాడు.

పాద్రె పియో గారు ఆరంభించిన ప్రార్ధనా సమూహాలుఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించాయి. పేదవారిలో క్రీస్తు తిరుముఖమును గాంచాడు. తన 81వ యేట 23 సెప్టెంబర్‌ 1968 వ సం.లో తుది శ్వాసను విడిచాడు. మరణించినప్పుడు తన చేతిలో ల ఉన్నది. ఆయన చివరి పలుకు: ‘‘యేసు, మరియ...యేసు, మరియ....’’

పాద్రె పియో గారు తరచుగా ఇలా అంటుండేవారు: ‘‘నా మరణానంతరము నేను ఇంకా ఎక్కువ కార్యాలు చేసెదను. నా అసలు ప్రేషిత కార్యము, నా మరణానంతరము ఆరంభమగును.’’

16 జూన్‌ 2002 వ సం.లో రెండవ జాన్‌ పౌలు పోపు గారు పియో గారిని పునీతునిగా ప్రకటించారు. పునీత పియోగారి జీవితమంతా కూడా పునీత పౌలుగారు కొలస్సీయుకు వ్రాసిన లేఖ 1:24 లో చెప్పిన వాక్యాలలో ఇమడ్చవచ్చు: ‘‘మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలో కొదువగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను.’’

‘‘ప్రార్ధించండి. ఎదురుచూడండి. ఆందోళన చెందడం నిరుపయోగము. దేవుడు దయామయుడు. మన ప్రార్థనను ఆయన ఆకించును. ప్రార్ధన మనకున్న గొప్ప ఆయుధము. దేవుని హృదయానికి ప్రార్ధన తాళం చెవి. యేసు ప్రభువుతో కేవలము పెదవులతో గాక, హృదయముతో మాట్లాడవలయును. వాస్తవానికి, కొన్ని సందర్భాలలో ఆయనతో తప్పక హృదయముతో మాట్లాడవయును...’’ (పాద్రె పియో).

No comments:

Post a Comment