జపమాల పండుగ (7 అక్టోబరు)

జపమాల పండుగ (7 అక్టోబరు)


జపమాల దేవరహస్యము ద్వారా మరియ మాతను కొనియాడుట లెపాంతోఓడరేవు పట్టణంలో క్రీ.శ. 1571 అక్టోబర్‌ 1న జరిగిన పెద్ద యుద్ధంలో మహమ్మదీయులపై క్రైస్తవులు ఘన విజయం సాధించినందుకు జ్ఞాపకార్ధంగా జపమాల మాత ఉత్సవం ఆరంభమైంది. యూదులు దేవునిచేత ఎన్నుకొనబడిన ప్రజలు. దేవుడు వారి జాతిని రక్షించడానికై ఒక రక్షకుని పంపిస్తానని వాగ్దానం చేసాడు. ఆ మెస్సయా రాక కోసం వారు ఎదురు చూచుచుండగా దేవుడు చేసిన గొప్పకార్యం మరియఅనే బాలికను వారి మధ్య జన్మింప చేయడమే! ఈమె తల్లిదండ్రులు అన్నా జ్వాకీము.

మరియమాతకు మానవు రక్షణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నది. గలిలీయ సీమయందలి నజరేతు అనే గ్రామమునకు చెందిన ఒక సాధారణమైన స్త్రీగా మరియ మనకు పవిత్ర గ్రంథములో కనిపిస్తుంది. పూర్వ నిబంధనములో ఎలాంటి ప్రాధాన్యత లేనిదై, ఏ మంచి రాదు అని పిలువబడిన గ్రామం నజరేతు. కాని దేవుని ప్రణాళికలు వేరు. అల్పమైన దానిని అధికం చేయగడు. సాధారణమైన మరియను అసాధారణమైన దైవ రక్షణ ప్రణాళికకు, దేవుడే ఎన్నుకొని, ఒక అసాధారణమైన సాధనంగా వినియోగించినట్లు మనం చూస్తున్నాము. ఆదినుండి ఆమెను పాపమలినం సోకకుండా దేవుడే ఏర్పరచుకున్నట్లు, చివరి వరకు పాపంతో ఏ సంబంధం లేకుండా జీవించి, తన పూర్తి సమ్మతిని వెల్లడించి, దేవునికి విధేయించినది. దేవునికి తల్లిగా మానవ రక్షణకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహోన్నతమైన మాతృమూర్తిగా విశ్వ శ్రీసభ ఆమెను శ్లాఘించింది. ఇప్పుడు రక్షణ చరిత్రలో మరియమాత స్థానం అవగత మవుతుంది. పూర్వ నిబంధనమును రక్షకుడైన యేసు క్రీస్తు రాకకొరకు సిద్ధ పరచేదిగా మనం గ్రహించినప్పుడు, మరియ మాత ఆ రక్షకుని తల్లిగా, ఆయన ఈ లోకంలో ప్రవేశించడానికి దేవుడు ఏర్పరచిన ద్వారంగా మనం చూచినప్పుడు, మరియమాత ప్రాముఖ్యత మనకు మరింత తేటతెల్ల మవుతుంది.

ఈ రీతిగా ప్రవచన పరంగా సాతానుపై విజయం సాధించే ఆ స్త్రీ మరియమాతేనని గ్రహించగలం. మన ఆది తల్లిదండ్రులకు దేవుడు ప్రకటించిన విజయము ఈమె ద్వారానే సాధ్యమయింది (ఆది. 3:15). అందుకే, దేవుని యందు వినయ విధేయతలు గల సేవకులందరిలో మరియ ఉన్నతురాలిగా కొనియాడ బడుతున్నది.

మరియ మధ్య వర్తిత్వానికి కారణాలు కొన్ని యిలా చెప్పుకోవచ్చు:

1. దేవుని తల్లిగా, దేవుని అనుగ్రహాలతో నింపబడిన మాతగా దేవునిచే సృష్టింపబడిన వారి మధ్య నిలబడిన విధానాన్ని బట్టి, ఆమె దివ్య మాతృత్వాన్ని బట్టి, ఆమె ఈ మధ్యవర్తిత్వానికి ఎన్నుకోబడినది.

2. ఈలోకంలో ఉండగానే క్రీస్తుతో ఐఖ్యమైయున్న రీతిని బట్టి, ఆయన దేవునితో మానవులను ఐఖ్య పరచిన రక్షణ కార్యాన్ని బట్టి, ఆ కార్యంలో ఆయన తరువాత ఆమె పోషించిన ఆ ప్రత్యేక పాత్ర, ఐక్యత కారణంగా మధ్యవర్తిగా నిబడినది. ఆయన రక్షణ కార్యంలో ఆమె కూడా భాగాన్ని పంచుకుంది.

3. దేవుడు తన ప్రియ బిడ్డలపై కృపావరాలను కృమ్మరించిన విధానమును బట్టి, ఆమె మధ్యవర్తినీ అయ్యింది. యేసు క్రీస్తు ఈలోకానికి ఆమె ద్వారా పంపబడినాడు అని గ్రహించడం ద్వారా ఆమె మధ్యవర్తిత్వం అర్ధమవుతుంది. మానవుల పట్ల ఆమె చూపిన శ్రద్ధ, ఆసక్తియే దీనికి తార్కాణం. మరియమాత మానవులు అనేక అవసరాలలో, కోర్కెలలో వారితో ఉంటుంది, ఆదుకుంటుంది. మానవ అవసరాలలో ఆదుకోవడమంటే, ఆ అవసరాలను క్రీస్తుని రక్షణాత్మక పరిధిలోనికి, ప్రభావం క్రిందకు చేర్చడమే! ఇదే మధ్యవర్తిత్వం. ఆశలు, అవసరాలు, ఆవేదనతో కూడిన మానవులకు ఆమె పుత్రునికి మధ్య మరియమాత మధ్యవర్తినిగా ఉంటుంది.

ఒకప్పుడు క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య లెపాంతోఓడరేవు పట్టణం వద్ద పెద్ద యుద్ధం జరిగింది. ఇది సముద్రంలో జరుపబడిన నావికా యుద్ధం. క్రైస్తవుల తరుపున ఆస్ట్రియా రాజు డాన్‌ స్వాన్‌నాయకత్వం వహించి యుద్ధం చేసాడు. తనకు తక్కువ సైన్యం ఉన్నాకాని క్రైస్తవులు ఆ యుద్ధంలో 1571 అక్టోబర్‌ 1న ఘనవిజయం సాధించారు. కన్య మరియ తల్లియందు భక్తి, విశ్వాసం, నమ్మిక గల రాజు మరియ తల్లి మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నాడు. కన్య మరియ మధ్యవర్తిత్వాన సహాయ మర్ధించి, ప్రార్ధించి, జపమాలను జపిస్తూ, పోరు సల్పి ఘనవిజయం సాధించడమైనది.

ఈ ఘనత ఆ దేవుని తల్లికే చెందునని డాన్‌ స్వాన్‌రాజు ఉద్వేగంతో పేర్కున్నారు. ఈ విజయం జ్ఞాపకార్ధంగా 5వ పయస్‌ (భక్తి నాధు) పాపుగారు ఈ జపమాల మరియమాత ఉత్సవాన్ని ప్రవేశ పెట్టారు.

మొట్టమొదట ఈ జపమాలను పరిశుద్ధ మరియమాత 13వ శతాబ్దంలో జీవించిన పునీత దోమినిక్‌గారికి వెల్లడించారు. అన్ని భక్తి మార్గాలలో జపమాల ఒక గొప్ప అందమైన, మధురాతి మధురమైన భక్తి మార్గం. క్రైస్తవ విశ్వాస సంక్షిప్తమే ఈ జపమాల. ఈ విశ్వాసాన్ని తన హృదయం నిండా నింపుకున్న మహాఘని మరియమాత ద్వారా యేసు ప్రభుని చేర్చగలిగేదే ఈ జపమాల.

మన విశ్వాసాన్ని ప్రకటించే విశ్వాస సంగ్రహంతో జపమాల మొదలెడతాం. మన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్ధన చేస్తాం. పిమ్మట తల్లిని స్తోత్రిస్తాం. మన విన్నపం అర్దిస్తాం, తర్వాత త్రియేక దేవునికి మహిమగా స్తోత్రం చెప్తాం. ఆ తర్వాత ‘‘ఓ నా యేసువా! నా పాపమును మన్నించండి....’’ అని ప్రభుని వేడుకుంటాం. ఈ వేడుదల తప్పక చెప్పాలని స్వయంగా మరియమాతయే ఫాతిమా నగరంలో పిల్లలకు దర్శన మైనప్పుడు, క్రీ.శ. 1917 మే 13న మరియు జూన్‌ 13న తెలియ జేశారు.

పునీత అల్ఫోన్సస్‌ ది లిగోరి గారు ఈ విధంగా చెప్తున్నారు: ‘‘జపమాల భక్తి ప్రపంచానికి అపరితమైన మేులు అందించింది. ఎంతో మంది పాపం నుండి విమోచింప బడ్డారు. పరిశుద్ధ జీవితం జీవింప గాడిన పడ్డారు. మంచి మరణంతో సత్కరింప బడ్డారు. జపమాలను హృదయ పూర్వకంగా మనస్సు కలిగి చెప్పాలి.’’ ఒకసారి మరియ తల్లి, పునీత యులాలియతో ఇలా చెప్పి యున్నారు: ‘‘ఆదరా బాదరాగా తక్కువ భక్తితో 53 పూసల జపమాలను జపించడం కంటే, నెమ్మదిగా భక్తితో 53 పూసల జపదండ చెప్పవలయును.’’ 6వ పౌల్‌ పాపుగారు ‘‘జపమాలను వల్లించడం వలన ప్రభువు జీవిత పరమ రహస్యాలను ధ్యానించేటట్లు వ్యక్తికి తోడ్పడుతుంది. ప్రభువుకు దగ్గరగా ఉన్న ఆ తల్లి దృష్టితో మనం ప్రభుని చూడగలం’’ అని చెప్పారు.

No comments:

Post a Comment