31వ సామాన్య ఆదివారము (Year A) మలా 1:14-2:2,8-10; 1 తెస్స 2:7-9,13; మత్త 23:1-12 వినయము, పవిత్రతకు పిలుపు
మనందరం ముఖ్యముగా ఆధ్యాత్మిక నాయకులు వినయము, పవిత్రత
కలిగి జీవించాలని, ఆదర్శముగా ఉంటూ, ప్రజలను సన్మార్గములో నడిపించాలని, సువార్తను
ప్రకటించాలని నేటిపఠనాలు తెలియజేయుచున్నాయి. మలాకి ప్రవక్త (క్రీ.పూ 5వ శతాబ్దం)
మరియు యేసు, వారి సమకాల అవినీతి నాయకులకు విసిరిన సవాలు నేటికి మనకు సవాలుగా
ఉంటుంది. మలాకి ప్రవక్తద్వారా, ప్రభువు యాజకులను చీవాట్లు పెట్టుచున్నాడు, ఎందుకన
వారు బలిపీఠముపై అపవిత్రమైన ఆహారమును అర్పించుటద్వారా దేవున్ని అగౌరవపరచారు. దేవున్ని
చిన్నచూపు చూసారు. నేటి ఆధ్యాత్మిక
నాయకులు వారి వైఫల్యాల గురించి తప్పక ఆత్మపరిశీలన చేసుకోవాలి. సంఘాలు, తమ
లక్ష్యాలను సాధించాలంటే, మంచి నాయకత్వం ఎంతో అవసరం. ఇశ్రాయేలు చరిత్రలో అనేక
సమస్యలు లోపభూయిష్టమైన నాయకత్వం వల్లనే జరిగాయని నేటి పఠనాలు గుర్తుకు
చేయుచున్నాయి. రెండవ పఠనములో పౌలుగారు నిస్వార్ధమైన నాయకత్వము, యేసుచేత ప్రేరేపింపబడిన
నాయకత్వాన్ని తెస్సలోనిక సంఘమునకు ఇవ్వాలని, లేనిచో సంఘము నష్టపోవునని ఆందోళన
చెందడం చూస్తున్నాము.
నేటి సువిషేశములో, యేసు యెరూషలేము దేవాలయములో
ప్రవేశించి బోధించుచున్నారు (మత్త 21:23). ధర్మశాస్త్రబోధకులు, పరిసయ్యుల గురించి, వారి ఆధ్యాత్మిక నాయకత్వ వైఫల్యాన్ని
గురించి ప్రజలను, శిష్యులనుయేసుహెచ్చరించుచున్నారు. యాజకులు
ఒడంబడిక బాధ్యతలను తెలిపెడి ఆచార సంప్రదాయాలకు సంరక్షకులు. ధర్మశాస్త్రబోధకులు
చట్టములోని నిగూఢ అర్ధాన్ని వివరించేవారు. పరిసయ్యులు మతాచారాలను పునరుద్ధరించుటకు
ప్రజా ఉద్యమాన్ని ఏర్పాటు చేసినవారు. ఈవిధముగా, వారు “మోషే ధర్మాసనమున
కూర్చొని ఉన్నారు” (23:2). అనగా ధర్మశాస్త్రాన్ని (దేవుని
అధికారము) బోధించడానికి, వివరించడానికి అధికారాన్ని కలిగియున్నారు.
అయితే,వారు ఉపదేశములను చేయుదురు, కాని వాటిని పాటింపరు. వారు బోధించునది వారే ఆచరింపరు (23:3). వారి వ్యక్తిగత జీవితం అసహ్యకరమైనది. వారిని వంచకులు అని యేసు
సంబోధిస్తున్నారు (23:13). వారు మోయసాధ్యముకాని భారములను
ప్రజల భుజములపై మోపుదురేకాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెన
వ్రేలైనను కదపరు (23:4). వారిలో ఎలాంటి వినయముగాని,
పవిత్రతగాని లేదు. ప్రజలపట్ల ఎలాంటి జాలి, దయ, కరుణ చూపలేదు. కాని యేసు, “నా కాడిని మీరెత్తుకొనుడు... ఏలన, నా కాడి
సులువైనది, నా బరువు తేలికైనది” (మత్త 11:29-30) అని అన్నారు. వారు తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు. అగ్రస్థానములను,
ప్రధానాసనములను కాంక్షింతురు (23:5-6). కాని
యేసు, “ప్రజలు మీ సత్కార్యములనుచూచి పరలోకమందున్న మీ
తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారియెదుట ప్రకాశింపనిండు” (మత్త 5:16)
అని అన్నారు. వారు ‘బోధకుడా’ (రబ్బీ, గురువా) అని పిలిపించుకొనుటకు తహతాహలాడుచున్నారు (23:7-8). యూదాఇస్కారియోతు మాత్రమే యేసును ‘గురువా’ (26:25), ‘బోధకుడా’
(26:49) అని సంబోధించాడు. ‘తండ్రీ’, ‘గురువా’ మరియు
‘బోధకుడా’ అను సంబోధనలను యేసు తృణీకరిస్తున్నారు (23:8-12). యూదులు
అబ్రహమును ‘తండ్రీ’ అని భావించేవారు (మత్త 3:9; లూకా 16:24,
30; యోహాను 8:53). కాని యేసు, “మీ తండ్రి ఒక్కడే. ఆయన పరలోకమందున్నారు” (23:9) అని
అన్నారు. క్రీస్తు ఒక్కడే మన గురువు (23:10). ప్రభువు,
స్పష్టముగా మానవ (మన) జీవితములోని గురువుల, బోధకుల, తండ్రుల పాత్రను తిరస్కరించడంలేదు,
కాని అలాంటి హోదాలోనున్నవారు సేవాభావముతో, వినయముతో, పవిత్రముగా జీవించాలని,
ఆదర్శముగా జీవించాలని ప్రభువు ఉద్దేశం.
ధర్మశాస్త్రబోధకులు, పరిసయ్యులు చట్టాన్ని ఎరిగియున్నారు,
కాని పాటించుటలేదు. వారి స్వలాభంకొరకు మతాన్ని వాడుకొనుచున్నారు.
చట్టాన్ని వారిస్వలాభం కొరకు వివరించారు. ప్రజలను మోసము చేయుచున్నారు. అందుకే
వారిని యేసు తీవ్రముగా గద్దించారు (23:13-33). యేసు శిష్యులు
వారివలె ఉండకూడదు. “మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై యుండవలయును. తననుతాను
హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తననుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” (23:11-12;
19:30; 20:16; మత్త 20:25-28).“ఎవడు మొదటివాడు కాగోరునో
వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడిగా ఉండవలయును” (మార్కు 9:35).
బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతను యిస్తూ అంత:ర్గత, ఆధ్యాత్మిక
విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇంటిని అనేక స్వరూపాలతో,
పటాలతో అలంకరిస్తున్నాము, కాని అనుదినం
ప్రార్ధన చేస్తున్నామా? కార్లలో, బైకులకు,
మెడలో జపమాలలు ఉంటున్నాయి, కాని రోజు జపమాలను
ప్రార్దిస్తున్నామా? బైబులును ఇంటి గూటిలో అలంకరించి
పెడుతున్నాము, కాని రోజు దేవుని వాక్యాన్ని చదువుచున్నామా,
ధ్యానిస్తున్నామా? ప్రతీరోజు పూజలో
పాల్గొంటున్నాము, కాని అవసరతలోనున్న పొరుగువారికి సహాయం
చేస్తున్నామా? ఏదోవిధముగా, మనందరం శ్రీసభలో వివిధ బాధ్యతలను కలిగియున్నాము. ఆ
బాధ్యతలను నిస్వార్ధ నాయకత్వ లక్షణాలను కలిగి, యేసు నాయకత్వముచేత ప్రేరేపింపబడి
నెరవేరుస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం.
అధికార దుర్వినియోగం చేసేవారిని దేవుడు
తొలగిస్తాడు అన్నది మొదటి పఠన సారాంశం. యెషయ గ్రంథములో యెరూషలేము పాలకులను గూర్చిన
ప్రవచనాన్ని నేడు వింటున్నాము. నాయకులను వారి అధికారమునుండి తొలగించే శక్తి
దేవునికి యున్నది. ముఖ్యఅధికారి, రాజగృహ నిర్వాహకుడు అయిన షెబ్నాను తొలగించాడు.
ఎందుకన, తన పదవిని, ప్రజలకొరకుగాక, తనకోసం, తన పేరుకోసం, ప్రతిష్ఠకోసం
వాడుకున్నాడు. షెబ్నా స్థానములో ఎల్యాకీమును నియమిస్తున్నాడు. “దావీదు వంశపురాజు
తాళపు చెవిని ఎల్యాకీము తన భుజములమీద తాల్చునట్లు చేయుదనిని, అతడు తెరచిన
దానిని ఎవరు మూయలేరు. అతడు మూసిన దానిని ఎవరు తెరువలేరు” (22:22) అని
దేవుడు పలికాడు. అయితే, తరువాత కాలములో ఎల్యాకీమునుకూడా పదవినుండి
తొలగించాడు. ఎందుకన, బంధుప్రీతి వలన ఎల్యాకీము తన బాధ్యతలను సరిగా
నిర్వహించలేక పోయాడు. ఇది మనందరికీ ఒక గుణపాటం కావాలి. కనుక, మనకు ఇవ్వబడిన
అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. మనకు అధికారము ఇచ్చునది దేవుడే. కనుక, దేవుని మహిమ
కొరకే దానిని వినియోగించాలి.
దేవుని మనస్సును మనం పూర్తిగా తెలుసుకోలేమని
రెండవ పఠనములో పౌలుగారు తెలియజేయు చున్నారు. ఎందుకన, దేవుని జ్ఞానం
మనకు అందనిది.
సువార్తలో యేసు మెస్సయ అని, దేవుని
ప్రత్యక్షరూపమని చూస్తున్నాము. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు
(ఎక్కువగా గ్రీకులు, రోమనులుయుండే ప్రాంతం) వెళ్ళుచూ, మార్గమధ్యమున “ప్రజలు నేను
ఎవరినని చెప్పుకొనుచున్నారు?” అని అడిగారు. “కొందరు బప్తిస్త
యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరియొక
ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు” అని సమాధానం ఇచ్చారు. హేరోదుతోసహా ప్రజలు ఇలా
అనుకోవడం మార్కు 6:14-15లో చూడవచ్చు. వారు మెస్సయ్య గురించి బిన్నాభిప్రాయాలను
కలిగియున్నారు. దావీదు మహారాజు వారసుడిగా, రోమను
సామ్రాజ్యాన్ని నాశనంచేసి, ఇశ్రాయేలు రాజ్యకీర్తిని తిరిగి స్థాపిస్తాడని
భావించారు. అప్పుడు యేసు “మరి నన్నుగూర్చి మీరు ఏమనుకొనుచున్నారు?”(వ్యక్తిగత ప్రశ్న) అని ప్రశ్నింపగా, పేతురు, “నీవు క్రీస్తువు”అని సమాధాన మిచ్చాడు. పేతురు (ఇతర శిష్యులు)
యేసును అభిషిక్తునిగా, మెస్సయ్యగా, క్రీస్తుగా
గుర్తించారు. (Christos – ‘క్రీస్తు’ గ్రీకు పదం; ‘మెస్సయ్య’ హీబ్రూపదం.
మెస్సయ్య అనగా ‘అభిషిక్తుడు’ అని అర్ధం).
మార్కు తన సువార్తను "దేవుని కుమారుడు యేసు క్రీస్తుసువార్త" (1:1) అంటూ
ప్రారంభించాడు. యేసుకూడా స్వయముగా “నేనే క్రీస్తు” అని చెప్పారు.
ప్రధానార్చకుడు, ‘దేవుని కుమారుడవు అగు క్రీస్తువు నీవేనా?’ అని ప్రశ్నింపగా, అందుకు యేసు “ఔను, నేనే” అని సమాధాన
మిచ్చారు (మార్కు 14:61-62).
యేసు, శిష్యుల ప్రయాణం, గలిలీయ
ప్రాంతమునుండి, యెరూషలేము వైపునకు మొదలైనది. ఇది యేసు శ్రమల, మరణం వైపునకు
పయణం. బహుషా, అందులకే ప్రభువు తనను గురించి ప్రజలుగాని, శిష్యులుగాని ఎలా
అర్ధం చేసుకొనుచున్నారో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకే యేసు శిష్యులకు, “మనుష్యకుమారుడు
(బాధామయ సేవకునిగా) అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్రబోధకులచే
(Sanhedrin, యూదప్రజల న్యాయసభ) నిరాకరించబడి, చంపబడి, మూడవరోజున ఉత్థాన
మగుట అగత్యము” అని ఉపదేశించారు (మార్కు 8:31). “నీవు క్రీస్తువు” అని చాటిచెప్పిన
పేతురుకు ఈ విషయం బోధపడలేదు. అందుకే, పేతురు యేసును ప్రక్కకు తీసికొనిపోయి, "అట్లు పలుకరాదు" అని వారించాడు (మార్కు 8:32). దీనినిబట్టి, శిష్యులు యేసును
"క్రీస్తు, మెస్సయ్య"గా గుర్తించారు, కాని దానిలోని
అర్ధాన్ని గ్రహించలేక పోయారు. బహుశా, పేతురు, ఇతర శిష్యులు, మెస్సయ్య అంటే ఒక
రాజుగా యూదులను పాలిస్తాడని, రోమను సామ్రాజ్యాన్ని కూలద్రోస్తాడని భావించి
ఉంటారు! యేసు శిష్యులవైపు చూచి, “సైతాను! నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుష్యులకు
సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు” (మార్కు 8:33) అని
అన్నారు. ప్రభువు ఉత్థానము తరువాత, మెస్సయ్య అనగా ఏమిటో, శిష్యులకు
అర్ధమయినది.
పేతురు చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము
ఆయన కొరకు పట్టుదలతో దేవుని ప్రార్ధించింది. అప్పుడు దూత అతనిని చెరసాలనుండి
(మరణమునుండి) విడిపించినది (అ.కా. 12:1-12). కొన్ని సం.ల తరువాత, రోమునగరములో
పేతురు మరల చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము తప్పక అతని కొరకు ప్రార్ధన
చేసియుండవచ్చు. కాని, ఈసారి అతను తన మరణమును తప్పించు కొనలేకపోయాడు.
చెరసాలనుండి విముక్తుడైనందుకు పేతురు ‘వీరుడు’ (హీరో) కాలేదు.
కాని, తన ప్రాణమును త్యాగము చేసినందులకు, వేదసాక్షి మరణము
పొందినందులకు వీరుడయ్యాడు. పేతురు చెప్పిన విశ్వాస సత్యము అతని జీవితమునే
మార్చివేసింది: “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్త 16:16).
అందుకు ప్రభువు, “యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ
విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు
కావు” (16:17) అని అన్నారు. ‘ధన్యత’ అనగా సంతోషము. ఈ
ధన్యతకు/సంతోషమునకు కారణం, యేసు ‘సజీవుడగు దేవుడు’ అని గుర్తించడం.
పేతురు తన జీవితములో, తన హృదయములో యేసును సజీవ దేవునిగా
నిలుపుకున్నారు. అందుకే యేసు, “నీవు పేతురువు, ఈ రాతి మీద నా
సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింప జాలవు. నేను నీకు పరలోక రాజ్యపు
తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోక మందును
బంధింపబడును. భూలోక మందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోక మందును
విప్పబడును” (16:18-19) అని బాధ్యతను అప్పగించారు.
యేసు నాకు ఎవరు? అన్న ప్రశ్నకు నా
సమాధానం ఏమిటి? ఈప్రశ్న క్రీస్తుపట్ల మనకున్న నిబద్ధతపైగల చాలా
క్లిష్టమైన ప్రశ్న! క్రీస్తునుగూర్చి ఎన్నో విన్నాము, చదివాము. కాని, ప్రభువు మనలనుండి
మనవ్యక్తిగత అభిప్రాయాన్ని కోరుచున్నారు. ప్రభువును తెలుసుకోవాలంటే, జ్ఞానం ఉంటే
సరిపోదు. క్రీస్తును వ్యక్తిగతముగా అనుభూతి చెందాలి. ఆయన జీవిత బాటలో మనం
పయనించాలి. ఆయనవలె ప్రేమించాలి, క్షమించాలి. మనకు అప్పగించ బడిన బాధ్యతలను
(తల్లి, తండ్రి, గురువు, మఠకన్య, టీచరు...)
సక్రమముగా నెరవేర్చాలి.
14వ సామాన్య
ఆదివారము, (9 జూలై 2023) జెకర్యా 9:9-10;
రోమీ
8:9,11-13;
మత్త
11:25-30 ప్రభువే మన విశ్రాంతి నిలయము!
“భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా
యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీ రెత్తుకొనుడు... ఏలన, నా కాడి
సులువైనది. నా బరువు తేలికైనది” (మ. 11:28). పాత నిబంధనలో, ‘కాడి’ వ్రాతపూర్వకమైన
లేదా మౌఖికమైన మోషే చట్టాన్ని (ధర్మశాస్త్రము) సూచిస్తుంది. సమస్య మోషే చట్టము
కాదు. మోషే చట్టము గూర్చిన తప్పుడు వివరణలను యేసు తీవ్రముగా ఖండించాడు. “వారు
[పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు] మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై
మోపుదురే కాని ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు” (మ
23:4). మోషే చట్టము ప్రజలకు భారముగా మారినది. అందుకే యేసు, “భారముచే అలసి సొలసి
యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను” అని పలికాడు.
మనకున్న భారాలు ఏమిటి? కుటుంబ, శారీరక, ఆర్ధిక, ఆరోగ్య,
సాంఘిక, సామాజిక, మానసిక, ఆధ్యాత్మిక భారాలతో సతమత మవుతూ ఉంటాము. ఇన్ని భారాలతో
నున్న మనకు యేసు ప్రభువు మాటలు మనకెంతో ఊరటను కలిగిస్తాయి. “ఆయన మిమ్మును గూర్చి
శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్నియు ఆయనపై మోపుడు” (1 పేతు 5:7) అన్న పేతురు
మాటలను గుర్తు చేసుకుందాం. ప్రభువు నందు నమ్మకముంచిన, ఆయనపై ఆధారపడి జీవించిన, “అపుడు
మన ఆత్మలందు విశ్రాంతి పొందుదము” (మ 11:29).
మనం సమస్తమును ప్రభువు నుండి నేర్చుకోవాలి. ఎందుకన
ఆయనే సత్యము. విజ్ఞానము. చట్టము. కనుక ‘ప్రభువు కాడి’ మోషే చట్టమే, కాని అది
ప్రజలకు భారమైనది కాదు. నిజమైన మోషే చట్టము, జ్ఞానము. ఇది పరిసయ్యుల తప్పుడు
వివరణలకు వ్యతిరేకమైనది. యేసు ప్రభువు ఈ లోకానికి వేంచేసే సమయానికి, పరిసయ్యులు,
ధర్మశాస్త్ర బోధకులు 613 నియమాలను సూచించారు. ప్రభువు భారమును మనపై మోపుటకు
రాలేదు. కాని మనకు విశ్రాంతి నొసగుటకు వచ్చెను. కనుక, ప్రతీ విశ్వాసి, క్రీస్తు
కాడిని ఎత్తుకొనుటకు, క్రీస్తు భారమును మోయుటకు సిద్ధపడ వలెను. ఎందుకన, ఆయన
సత్యము, విజ్ఞానము, చట్టము. ఆయన మనకు పరలోక రాజ్యమునకు సంబంధించిన విషయములను బయలు
పరచును.
విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగు పరచి
పసిబిడ్డలకు బయలు పరచితివి” (మ 11:25) అని యేసు పలికారు. పరలోకమున ప్రవేశించాలంటే,
పరలోక పరమ రహస్యాలను గ్రహించాలంటే పసిబిడ్డల మనస్తత్వమును కలిగి యుండాలి. “మీరు
పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని
మీతి వక్కాణించు చున్నాను” (మ 18:3) అని ప్రభువు పలికి యున్నారు. పసి బిడ్డలు
షరతులులేని ప్రేమను గుర్తించెదరు. వారు షరతులులేని ప్రేమతోనే సమాధాన మిచ్చెదరు. మన
ప్రేమ క్రీస్తులో కేంద్రీకృతమైనచో, మనం ఒకరినొకరము మరియు తోటివారిని షరతులు
లేకుండా ఎలా ప్రేమించాలో ప్రభువు మనకు నేర్పిస్తారు. మనపైన పరలోక తండ్రికి యున్న అనంతమైన
ప్రేమ కేవలం క్రీస్తుకు మాత్రమే తెలుసు. మన విజ్ఞానము, వివేకముపై మాత్రమే ఆధార
పడుచున్నామా లేదా దేవుని విజ్ఞానముపై ఆధారపడు చున్నామా? విజ్ఞులకు, వివేకవంతులకు పరలోకము
మరుగు పరచ బడినది ఎందుకన, దేవుని చిత్తమును, మార్గమును తెలిసి కొనుటకు వారు
దేవునిపై ఆధారపడక, వారి బలాన్ని, తెలివి తేటలను నమ్ముకొను చున్నారు. పసిబిడ్డల
సంపూర్ణ నమ్మకాన్ని కలిగి యుందురు. ఆనాడు, యూదమత నాయకులు కపటముతో, గర్వముతో
ప్రభువు బోధనలకు స్పందించలేదు. కాని సామాన్య ప్రజలు ఎక్కువగా ప్రభువునకు
స్పందించారు. కపటము, గర్వము ఉన్న విశ్వాసులు పరివర్తన చెందలేరు.
యేసు మార్గము సాధుశీలత,
వినమ్రత గలది. ప్రభువు కాడి ఆయన జ్ఞానము. అది సత్యముగల కాడి. తన అనుచరులపై ప్రభువు
మోపు కాడి దేవుని చిత్తమును తెలుసుకొని దానిని విధేయించడం. సత్యమును జీవించుటలో
విఫలమైనవారు వ్యసనపరులుగా మారెదరు. విశ్వాసి తన పాపములకు బానిస యగును. పాత
నిబంధనలో దేవున్ని దర్శించిన మోషే సాధుశీలత, వినమ్రత కలిగి యున్నాడు. ధర్మశాస్త్రానికి
మధ్యవర్తి. “నేను మీ నడుమ వినయాత్ములు, దీనులైన ప్రజలను మిగుల నిత్తును, వారే
నన్ను నమ్ముకొందురు. అట్టివారు ఎవరికి కీడు చేయరు, కల్లలాడరు, మోసము చేయరు” (జెఫన్యా
3:12) అని ప్రవక్త ప్రవచించాడు. యేసు వినయముగల రాజు. గాడిద పిల్లపై ఎక్కి వచ్చును
(జెకర్యా 9:9-10; మ 21:5). ఆయన శాంతి కరుడైన రాజు (యెష 9:6; యో 20:21; యో 14:27; లూకా
2:14). ప్రభువు రాజ్యము నేల అంచుల వరకు వ్యాపించును (జెకర్యా 9:10) అని ప్రవక్త
ప్రవచించాడు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని లూకా 1;33లో చదువుచున్నాం. దైవరాజ్య
వ్యాప్తి భాద్యతను మొదటగా ప్రభువు శిష్యులకు (మా 16:20; మ 28:18-19), నేడు
జ్ఞానస్నానం పొందిన మనందరికి అప్పగించారు. ఇది మనందరి భాద్యత/వాక్కుద్వారా,
సత్క్రియల ద్వారా ఈ భాద్యత నెరవేర్చ మనం ప్రయత్నం చేయాలి.
మన అనుదిన జీవితములో ఎన్ని
భారములున్నను, ఇతరులతో వినయము, వినమ్రత కలిగి జీవించ ప్రయత్నం చేద్దాం. మన
పాపములను మోయు దేవుని గొర్రెపిల్ల క్రీస్తువే (యో 1:29). జీవితాన్ని భారముగా
మార్చుకోక, ప్రభువునందు నమ్మక ముంచి ఆయన ఒసగు విశ్రాంతి (నిత్యానందము, నిత్యజీవము
యో 10:10) యందు సేద తీరుదాం!
13వ సామాన్య ఆదివారము (2 జూలై 2023) 2 రాజు 4:8-11, 14-16; రోమీ 6:3-4, 8-11; మత్త 10:37-42 క్రైస్తవ పిలుపు – శిష్యరికం
మనం చేసే ప్రతీ కార్యములో దేవునితో, తోటివారితో మన బంధాన్ని బలపరచుకున్నప్పుడే, ప్రతిఫలాన్ని పొందుతామని నేటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి.
మొదటి పఠనములో షూనేము స్త్రీ ఎలీషాను ప్రవక్తగా, దైవభక్తునిగా గుర్తించి, ఉదారముతో
ఆతిథ్యమునిచ్చి, తన దాతృత్వానికిగల ప్రతిఫలాన్ని
పొంది, జీవితాన్ని ధన్యంచేసుకున్నది.
ఆతిథ్యము ఇవ్వడం అంత సులువైన విషయమేమీ కాదు. చాలా సమయాన్ని, వనరులను వెచ్చించాలి. ఆ స్త్రీ, తన భర్త సహాయముతో తమ ఇంటిలో ఎలీషాకు అన్ని వసతులు ఏర్పాట్లు
చేసింది. ప్రతిఫలముగా, దేవుడు ఆమెకు
సంతానవరమును వాగ్దానం చేసాడు. రక్షణ ప్రణాళికలో దేవునితో సహకరించే వారికి
ప్రతిఫలాన్ని ఇవ్వడములో దేవుడు ఎప్పటికీ విఫలము కానేరడు. అలాగే, వాగ్దానం మేరకు ఆ స్త్రీ ఒక కుమారున్ని పొందినది. ఆ బిడ్డ
పెరుగుతూ, అకస్మాత్తుగా మరణించినప్పుడు
ఎలీషాను వేడుకొనగా, చనిపోయిన ఆ బిడ్డను
దేవుడు మరల బ్రతికించాడు. నేటి సువిషేశములో ప్రభువు అన్నమాటలు ఆ స్త్రీకి ఆక్షరాల
వర్తిస్తాయి. “ప్రవక్తను, ప్రవక్తగా గుర్తించి
స్వీకరించువాడు, ప్రవక్త బహుమానము పొందును” (మత్త 10:41). ఆవిధముగానే,ఆ స్త్రీ ప్రవక్త బహుమానాన్ని పొందినది.
నేటి సువిశేష పఠనం శిష్యరికము గురించి బోధిస్తుంది.
యేసు తన శిష్యులకు రాబోయే ప్రేషితకార్యం గూర్చి బోధిస్తూ వారిని సంసిద్ధ పరస్తూ
ఉన్నాడు. శిష్యుడు యేసుప్రభువును తన జీవితములో ప్రధమ స్థానముగా చేసుకోగలగాలి.
ప్రేమ మార్గములో క్రీస్తును అనుసరించాలి. ప్రభువు కొరకు తన ప్రాణాలను సైతం
అర్పించుటకు సిద్ధముగా ఉండాలి. అన్నింటికన్న మిన్నగా దేవున్ని ప్రేమించాలి.
క్రీస్తుపై ప్రేమ గొప్పదై యుండాలి. అలాంటి వారికి తప్పక ప్రభువు ప్రతిఫలాన్ని
ఒసగుతాడు. ఇదే భావాన్ని మొదటి పఠనములో చూసాము. అలాగే, అలాంటి వారు జ్ఞానస్నానముద్వారా, తమనుతాను క్రీస్తుతో పోల్చుకొని, ప్రేమ మార్గములో క్రీస్తును అనుసరిస్తూ, శాశ్వతముగా పాపాన్ని త్యజించువారని రెండవ పఠనం తెలియజేయు
చున్నది. క్రీస్తుతో మరణించినచో, క్రీస్తులో జీవించ
గలుగుతాము.
క్రీస్తునందు ప్రియ సోదరులారా! క్రీస్తును
అనుసరించడములో మనం నిజముగా ఏమి త్యాగం చేసాము? క్రీస్తును అనుసరించడం అంత సులువైన విషయమేమీ కాదు. జీవిత సర్వాన్ని దేవునికి
అర్పించాలి. ఇది ఖచ్చితముగా త్యాగపూరితమైన జీవితం. సవాలుతో కూడినటువంటి జీవితం.
క్రీస్తును ఎన్నుకొని, సిలువ వరకు ఆయనను
వెంబడించడం ఎన్నటికీ వైఫల్యం కాదు.మరణానికి
మార్గం కాదు. తప్పక నిత్యజీవితానికి మార్గం. “తన సిలువ నెత్తుకొని నన్ను అనుసరింపని
వాడు నాకు యోగ్యుడు కాదు” (మత్త 10:38). సిలువను మోయడం క్రీస్తును అనుసరించడములో విడదీయని
భాగం (మార్కు 8:34). ఎప్పుడైతే, ఒక వ్యక్తి స్వార్ధముతో, లోకాశలతో జీవిస్తూ ఉంటాడో, అతను తన జీవితాన్ని కోల్పోతాడు. “తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు, దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు
దానిని దక్కించు కొనును (మత్త 10:39). అనగా, ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలకు విధేయతతో జీవిస్తూ, తోటి సోదరులపట్ల ప్రేమ కలిగి జీవిస్తాడో, తప్పక జీవాన్ని పొందును. కనుక, యేసును వెంబడించడం అనగా దేవుని మహిమ కొరకు మరియు ఇతరుల మేలు
కొరకు మన ప్రాణమును కోల్పోవడం.
మనకు సువార్తను బోధించే వారి జీవితాలలోకూడా యేసును
మనం గుర్తించాలి. సువార్తా నిమిత్తమై తమ జీవితాలను అంకితం చేయడానికి, తమ కుటుంబాలను, భూములను, ఆస్తులను వదిలివేసి దేవునిచే పిలువబడిన వారు మన మధ్యలో
ఎంతోమంది యున్నారు. వారు అందరివలె సాధారణమైన మనుష్యులే. మానవ నైజానికి అతీతులు ఏమీ
కాదు. కనుక, వారికి మన ఆప్యాయత, మద్దతు, సంఘీభావం ఎంతో అవసరం.
వారికి సహాయపడటం మన బాధ్యత. ప్రేమ, ఆతిథ్యము, ప్రార్ధనల ద్వారా వారికి అండగా యుండవచ్చు. ఆతిథ్యము
క్రైస్తవ జీవితములో భాగం. యేసు తన బోధనలలో కూడా ఆతిథ్యముగూర్చి నొక్కి చెప్పాడు. “నా
శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగినవాడు తన
బహుమానమును పోగొట్టు కొనడు (మత్త 10:42).
ఆత్మపరిశీలన చేసుకుందాం. యేసుతో నా సహవాసం, బంధం ఎలాయున్నది?
సిలువను
మోయుటద్వారా నిజమైన శాంతిని, సంతోషాన్ని పొందుచున్నానా? నా జీవితాన్ని కోల్పోవుట వలన, క్రీస్తులో నిత్యజీవాన్ని పొందుతానని విశ్వసిస్తున్నానా? మన అనుదిన జీవితములో క్రీస్తుకు ప్రాధాన్య మిస్తూ, అనుదిన సిలువను
ఎత్తుకొని ప్రభువును వెంబడించ ప్రయత్నం చేద్దాం!
12వ సామాన్య ఆదివారము (25 జూన్ 2023) యిర్మియా 20:10-13; రోమీ 5:12-16; మత్త 10:26-33 భయపడకు! దేవునిపై నమ్మకాన్ని ఉంచు!
12వ సామాన్య ఆదివారము (25 జూన్ 2023)
యిర్మియా 20:10-13; రోమీ 5:12-16; మత్త 10:26-33
భయపడకు! దేవునిపై నమ్మకాన్ని ఉంచు!
నేటి పఠనాలు దేవునిపై విశ్వాసము, నమ్మకముంచాలని
బోధిస్తున్నాయి. మన పరిస్థుతులు విరుద్ధముగా నున్నను, భయానకరముగా నున్నను, దేవుడు
మనపట్ల శ్రద్ధను కలిగియున్నాడని విశ్వసించాలి. ఆపద సమయములో దేవుడు మన ప్రార్ధనలను
తప్పక ఆలకిస్తాడు.
మొదటి పఠనములో, యిర్మియా ప్రవక్త దైవసందేశాన్ని
ప్రకటించుటలో తనకు ఎదురైన సవాళ్లు, వ్యతిరేకతపై తన నిరాశను, వేదనను
వ్యక్తపరుస్తున్నాడు. కష్టాలు, బాధలు, వ్యతిరేకత ఉన్నను, దేవునిపై తన నమ్మకాన్ని,
విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. దేవుడు తనతో ఉన్నాడని, తనకు బలాన్ని
చేకూరుస్తూ, శత్రువుల బారినుండి కాపాడు చున్నాడని తెలియజేయు చున్నాడు. దేవుని
రక్షణ, విశ్వసనీయతపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి, దేవున్ని బలాడ్యుడుగా, వీరుడుగా గుర్తిస్తున్నాడు.
ఘోరమైన కుట్రలనుండి, దుర్మార్గుల చేతులనుండి దేవుడు యిర్మియాను విడిపించాడు. కష్టాల
సమయములో దేవునిపై ఆధారపడాలని యిర్మియ జీవితం సూచిస్తుంది. విపత్కర పరిస్థితులలో
జీవిస్తున్న మనం, లోక శక్తులపైగాక, దేవునిపై నమ్మకముంచాలి. కష్టాల సమయములో
విశ్వాసాన్ని స్థిరముగా ఉంచుకొని, పట్టుదలతో ఉండాలని యిర్మియా జీవితం మనకు
నేర్పుచున్నది.
రెండవ పఠనము దేవుని రక్షణ, పాపవిముక్తి గూర్చి
తెలియజేయుచున్నది. ఆదాము ద్వారా (ఆది) పాపము ఈ లోకములోనికి ప్రవేశించి, మరణానికి
దారితీసింది. దేవుని సహవాసమునుండి దూరము చేసింది. అయినను దేవుడు మనలను
చేయివిడువలేదు. క్రీస్తు అనుబడు గొప్ప అనుగ్రహము ద్వారా మనకు రక్షణ ఒసగాడు. తండ్రికి
సంపూర్ణ విధేయతద్వారా, సిలువ త్యాగబలిద్వారా, క్రీస్తు తన మరణముద్వారా మన
భయాలన్నింటిని తొలగించాడు. మనకు శాంతిని ప్రసాదించాడు. మన శిక్షనుండి విడిపించి,
తిరిగి మనలను దేవునితో సఖ్యత పరచాడు.
దైవరాజ్యమును, సువార్తను ప్రకటించుటలో, క్రీస్తుకు
సాక్ష్యమిచ్చుటలో ఎవరికీ భయపడకూడదని సువిశేషము తెలియజేయు చున్నది. అప్పటికే
ప్రభువు శిష్యులతో వారు పొందబోవు హింసల గురించి ప్రస్తావించారు (మత్త 10:16-25).
అయినప్పటికిని, వారు ధైర్యముగా ఉండాలని ప్రభువు కోరుచున్నారు. వారి విశ్వాసము, విధేయత, వారి సహనం, పట్టుదల వారిని వెలుగులోనికి నడిపించును. క్రీస్తుకు
సాక్ష్యమివ్వడం మన జ్ఞానస్నాన పిలుపు. అయితే, హింసలు కూడా మనం ఎదుర్కోవలసి
ఉంటుంది. భయం ఆశలోనికి నడిపించాలి. క్రీస్తు సిలువ మనకు గొప్ప ఆదర్శం. సిలువను
ఆలింగనం చేసుకొని, శత్రువులను క్షమించడం వలన, మరణ భయం తొలగిపోయింది.
క్రీస్తు బోధించు విషయముల నెల్ల వెలుతురులో
బోధించాలి. ఇంటిమీది నుండి ప్రకటించాలి. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి, ఆత్మను
నాశనము చేయలేని వారికి భయపడ కూడదు. ఆత్మను, శరీరమును కూడ నరక కూపమున నాశనము చేయగల
దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఎందుకన, శారీరక జీవితం అశాశ్వతం. క్రీస్తునందు
శాశ్వత జీవితమున్నదనేది మన దృఢవిశ్వాసం. మన ధైర్యం దేవునిపై మనకున్న
విశ్వాసమునుండి వస్తుంది. ప్రతీ ఒక్కరికి దేవుడు విలువని ఇస్తాడు. మన తల వెంట్రుక
లన్నియు లెక్కింప బడియే యున్నవి. అనగా దేవుడు మనవైపు ఉన్నాడని, మన గురించి
క్షుణ్ణంగా ఎరిగియున్నాడని అర్ధం. శత్రువు బారినుండి మనలను కాపాడుటకు దేవుడు సమర్ధుడు,
ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నాడని అర్ధం. దేవుని దృష్టిలో మనం అతి విలువైన వారము.
కనుక, క్రీస్తు రక్షణను పొందాలంటే, మనం చేయవలసినది
ఆయనను సంపూర్ణముగా విశ్వసించడం, ప్రార్ధన చేయడం మరియు దేవుని చిత్తాన్ని
నెరవేర్చడం. ఆయనను విశ్వసించడం అనగా, ఆయన పక్షమున ఉండటమే. ప్రార్ధనలో ధైర్యాన్ని
పొందుతాం (మత్త 26:38,42). నిజమైన క్రైస్తవులుగా ఉండటం అంటే, మనలను మనం క్రీస్తుకు
సంపూర్ణముగా సమర్పించుకోవడమే. విపత్కాలములో కూడా ధైర్యముగా క్రీస్తుకు
సాక్ష్యులుగా మారాలి. మనం నిజముగా క్రీస్తుకు సాక్ష్యులుగా ఉండాలంటే, శ్రమలను
ఎదుర్కోవలసినదే. అంధకార సమయములో దేవుడు మనతో వెలుగుగా యున్నాడని దృఢముగా
విశ్వసించాలి. క్రీస్తు పొందిన శ్రమలు తిరుసభలో ఎప్పటికి ఉంటాయి. “భయపడకుడు” ఆన్న
క్రీస్తు మాటలు మనకు గొప్ప ఊరటను కలిగిస్తాయి. మనతోనున్న క్రీస్తు సాన్నిధ్యం ఆయన
కొరకు ప్రాణాలు అర్పించుటకైనను ధైర్యాన్ని ఇస్తుంది. “ప్రజల యెదుట నన్ను
అంగీకరించు ప్రతి వానిని, పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును”
(మత్త 10:32). మన సాక్ష్యం ఇతరులలో కూడా ధైర్యాన్ని నింపును.
11వ సామాన్య ఆదివారము (18 జూన్ 2023) నిర్గమ 19:2-6; రోమీ 5:6-11; మత్త
9:36-10:8 దేవుని ప్రేమను గుర్తుంచు!
నేటి పఠనాలు, దేవుడు మన జీవితాలలో ఏవిధముగా
ఇమిడియున్నాడో, ఆయన ప్రేమ యెట్టిదో తెలియజేయు చున్నాయి.
మొదటి పఠనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వమునుండి ఏవిధముగా విడిదల
చేసాడో, సినాయి పర్వతమువద్ద మోషేద్వారా వారికి జ్ఞాపకం
చేయుచున్నాడు. “గరుడపక్షి తన పిల్లలను రెక్కలమీద మోసికొని పోవునట్లే నేనును మిమ్ము
మోసికొని వచ్చి నా కడకు చేర్చుకొంటిని” (19:4) అని దేవుడు తన
ప్రజలపైనున్న ప్రేమను వ్యక్తపరచాడు. దేవుని సహాయం లేనిచో, వారు
వాగ్ధత్తభూమిలోనికి ప్రవేశించేవారు కాదు. ఇది మన రక్షణ చరిత్రకూడా. దేవుడు
మనలనుకూడా తన కడకు చేర్చుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఒడంబడికకు విశ్వసనీయముగా కట్టుబడి
ఉండాలి.
మన జీవితములో దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదోయని, దేవుని
మంచితనము, శాశ్వత దయాగుణము, ప్రజల
సృష్టికర్త, సంరక్షకుడు, విశ్వసనీయుడని,
“మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెనని,
ఇట్లు దేవుడు మనపై ఉన్న ప్రేమను చూపుచున్నాడని”, క్రీస్తుద్వారా దేవుడు మనలను పాపము, మరణములనుండి
విముక్తిచేసి, శాశ్వత జీవమును ఒసగాడని, కనుక ఆయనయందు విశ్వాసం ఉంచాలని పౌలు దేవునికి మనపైనున్న ప్రేమను జ్ఞాపకం
చేయుచున్నాడు.
సువిషేశములో దేవుని ప్రేమ, క్రీస్తునందు
చూడగలము. “కాపరిలేని గొఱ్ఱెలవలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు
తరుగుకొని పోయెను” (మత్త 9:36). యేసు అన్ని పట్టణములను,
గ్రామములను తిరిగి, ప్రార్ధనా మందిరములలో
బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు
ప్రకటించుచు, జనుల వ్యాధి బాధలనెల్ల పోగొట్టు చుండెను”
(9:35). “ప్రభువు తన ప్రజల గాయములకు కట్టు కట్టును. వారి దెబ్బలను నయము
చేయును” (యెష 30:26) అని ప్రవక్త ప్రవచనాలు క్రీస్తునందు నెరవేరాయి. క్రీస్తు
ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కాపరి.
దేవునికి మనవి, ప్రార్ధన చేయమని శిష్యులను కోరుతూ, అలాగే వారిని ప్రజల మధ్యలోకి పంపుచు తన కరుణను వ్యక్తపరచారు.
“మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు” (మత్త 10:8)
అని యేసు తన శిష్యులను పంపుచున్నాడు. ఎందుకన, “పంట
మిక్కుటము. కాని కోతగాండ్రు తక్కువ” (9:37). దేవుడు
సమస్తమును మనకు ఉచితముగా ఒసగును. ఆయన ఒసగువాడు, గొప్పదాత.
దేవుడు మనకు ఒసగిన వరములను ఇతరులతో ఉదారముగా పంచుకోవాలి. యేసు తన శిష్యులను వారు
పొందిన దానిని ఇతరులకు ఒసగడానికి పంపుచున్నాడు. ఇతరులకు సేవ చేయడానికి, సువార్తను బోధించడానికి శిష్యులను పంపాడు. ప్రేమ మరియు ఉదారతతో సేవ
చేయాలి. ఏమీ ఆశించకుండా దైవరాజ్యమును ప్రకటించాలి. “క్రీస్తు శిష్యులు విశ్వాసం
కలిగి, దాన్ని జీవించడం మాత్రమేగాక దాన్ని ప్రకటించాలి.
నిబ్బరతతో సాక్ష్యమివ్వాలి, వ్యాప్తి చేయాలి” (సత్యోపదేశం, 1816). శిష్యులు తమ ప్రేషితకార్యము
ద్వారా ఇతరులను దేవుని వైపుకు మరల్చాలి.
యేసు ప్రేషిత కార్యములో మనంకూడా భాగస్థులం కావాలి.
ఎలాంటి మినహాయింపు లేకుండా, మనమందరం సువార్త బోధకులుగా, మిషనరీలుగా
పిలువబడియున్నాము. దేవుని ప్రేమను, కరుణను, దయను, క్షమాపణను ఇతరులకు పంచాలి. నేడు సామాన్య
దైవప్రజలు ఈ కార్యములో ఎక్కువ బాధ్యత కలిగి యుండాలి. అందరం ఏకమనస్కులై, సహకార మందించుకుంటూ ఉండాలి. ఎవరికీ సాధ్యమైన రీతిలో వారు విచారణ, సంఘ, శ్రీసభ అభివృద్ధి కొరకు కృషి చేయాలి. దేవుడు
మనకు ఎన్నో అనుగ్రహాలను ఇచ్చియున్నాడు. కనుక, దైవరాజ్య సేవలో
ఔదార్యముతో మన సేవలను అందిద్దాం. వాటిని సంఘాభివృద్ధికై ఉపయోగించుదాం. ఇది మనందరి
ప్రేషితకార్యం.
మనం ఎల్లప్పుడు ఆనందముగా ఉండాలని కోరుకుంటాం. ప్రామాణికమైన, నిజమైన ఆనందం ధనవంతులవడములో, భౌతిక విషయాలలో, ప్రాపంచిక విజయాలలో నున్నదని పొరబడుతూ ఉంటాం. అయితే, నిజశాశ్వతానందాన్ని ఈలోకముగాని, దానిలోనున్న ఏదియుగాని ఇవ్వలేదు. ‘ఆనందం’నకు మరోపేరు ‘ఆశీర్వాదం’ లేదా ‘ధన్యత’. అందరుకూడా నిజశాశ్వతానందాన్ని కలిగియుండాలని యేసు ‘కొండమీద ప్రసంగం’లో అష్టభాగ్యాలను బోధిస్తున్నాడు. ఈ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ధన్యతను యేసు ‘దేవుని/పరలోకరాజ్యం’ అని పిలిచాడు. కొండమీద ప్రసంగం’లో, యేసు నిర్దేశించిన విలువలు నిజశాశ్వతానందాన్ని ఇవ్వగలవు. అవి ఈలోకాలోచనలకు విరుద్ధమైనవి. నేటి మానవుడు దీనత బదులుగా ధనంలో, శోకార్తి బదులుగా సరదాలలో, వినమ్రత బదులుగా లోకజ్ఞానములో, నీతి బదులుగా మద్యం-భోజనంలో, దయ బదులుగా బలంలో, హృదయశుద్ది బదులుగా శారీరకవ్యామోహములో, శాంతిస్థాపకత బదులుగా వార్తలను సృష్టించుటలో, ధర్మం బదులుగా న్యాయవాదములో నిజశాశ్వతానందం ఉన్నదని భావిస్తున్నాడు. అష్టఅష్టభాగ్యాలలోని అన్ని విలువలను ప్రతీ ఒక్కరు కలిగియుండాలి. నా సంతోషాన్ని నేను ఎక్కడ వెదుకుచున్నాను? ఈ లోకము, లోక వస్తువులలోనా? లేదా యేసు ఒసగిన అష్టభాగ్య-విలువలలోనా? యేసు విలువలలో నిజశాశ్వతానందాన్ని వెదకినట్లయితే మనం “ఆనంద పడాలి; మహానంద పడాలి. ఎందుకన, పరలోకములో మనకు గొప్ప బహుమానము కలదు” (మత్త.5:12). జెఫన్యా ప్రవక్తకూడా ఇదే విషయాన్ని తెలుపుచున్నాడు. వినయవంతులు, దేవుని ఆజ్ఞలను పాటించువారు, న్యాయము పాటించువారు, దేవుని శిక్షను తప్పించుకొందురు (2:3; 3:12-13).
సాధారణముగా మనం దేవుడు జ్ఞానవంతులను, వివేకవంతులను, శక్తివంతులను, పేరుప్రతిష్టలున్నవారిని, ఉన్నత జీవనము కలవారిని ఎన్నుకోవాలని ఆశిస్తూ ఉంటాము. కాని వాస్తవానికి, లోకముచే అవివేకులుగా, బలహీనులుగా, అల్పముగ, నీచముగ, విలువలేనిదిగ భావింపబడువారిని దేవుడు ఎన్నిక చేసికొనును (1 కొరి.1:27-28). ఎందుకన, లోకముచే గొప్పగా భావింపబడేది ఏదియు నిజశాశ్వతానందాన్ని ఇవ్వలేదని పౌలు స్పష్టం చేయుచున్నాడు. దేవునినుండి వచ్చు శక్తితో, కృపతో మాత్రమే మనం దేవుని జీవితాన్ని జీవించగలం. దేవుని కార్యాన్ని చేయగలం. కనుక, మనం దేవునిపై ఆధారపడి జీవించాలి. దేవుని అవసరత మనకున్నదని గ్రహించడమే నిజమైన ఆనందం. మన నమ్మకాన్ని దేవునిపై ఉంచడమే నిజమైన ఆనందం. అలాగే, పవిత్రముగా జీవించాలని దేవుడు మనలను పిలచుచున్నాడు. పవిత్రతలో నిజమైన ఆనందం ఉంటుంది. కనుక, నేటి మూడు పఠనాలు కూడా మనలను కోరేది ఒకటే – నిజమైన ఆనందాన్ని పొందాలంటే, యేసు అడుగుజాడలలో నడవాలి. యేసువలె జీవించాలి, ప్రవర్తించాలి. “ప్రభువైన యేసుక్రీస్తును ధరించాలి” (రోమీ.13:14). పశువుల తొట్టిలో పుట్టినప్పటినుండి సిలువపై మరణించు వరకు యేసు పేదవానిగా జీవించాడు. ప్రతీఒక్కరిపట్ల వినమ్రహృదయుడై, దయగలవాడై జీవించాడు (మత్త.11:29). పాపులను, సుంకరులను, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని, సమరీయ స్త్రీని, నాయిను విధవరాలిని, రోగులను ఆయన ఆదరించాడు. నీతినిమిత్తమై ఆకలిదప్పులు కలిగి జీవించాడు. పేదవారిని చిన్నచూపు చూచినవారిని ఆయన కఠినంగా మందలించాడు. యేసు యెరూషలేము నగరమును చూచి విలపించాడు. శ్రమలను, మరణాన్ని అనుభవించాడు. ప్రభువు సందేశం ఏమనగా - తండ్రి రాజ్యము కొరకు కృషిచేయువారు, దేవుని ప్రేమను ప్రతిబింబించేవారు, తోటివారికి సేవచేసేవారు, ఈ సేవలో కష్టాలను, ఇబ్బందులను, నిరాశను, నిరుత్సాహాన్ని, అలసటను సహించేవారు నిజశాశ్వతానందాన్ని పొందుతారు. సవాలుతో కూడిన జీవితాన్ని ప్రభువు మనకు ఒసగారు. అయితే, సవాళ్ళను ఎదుర్కొనడానికి కావలసిన ఆత్మబలాన్నికూడా మనకు ఒసగాడు. “నా పేరిట నన్ను ఏమి అడిగినను చేసెదను” (యోహా. 14:14) అని వాగ్దానం చేసాడు. కనుక, యేసుక్రీస్తే మన ఆనందం. ఆయనలోనే మన నిజశాశ్వతానందం.
పరమ పవిత్ర క్రీస్తు శరీరరక్తముల (దివ్యసత్ప్రసాద) మహోత్సవం (22 జూన్) ఆది.కా. 14:18-20; 1 కొరి 11:23-26; లూకా 9:11-17
ఉపోద్ఘాతం: ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ రోజు మనం పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల (దివ్యసత్ప్రసాద)
మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. ఈ పండుగ మన విశ్వాసానికి
గుండెకాయ లాంటిది. ఇది మన రక్షకుడు యేసుక్రీస్తు తనను తాను మనకు ఆహారంగా
అర్పించుకున్న అద్భుతమైన ప్రేమను గుర్తు చేస్తుంది. పవిత్ర సప్త సంస్కారాలలోకెల్లదివ్యసత్ప్రసాదంమన క్రైస్తవ జీవితానికి మూలస్తంభం.
క్రీస్తు ప్రభువు తన ఆత్మ ప్రేరణతో దీన్ని ప్రవేశపెట్టారు. మన హృదయాలలో
నివసించడానికి, మన ఆత్మలను పోషించడానికి ఆయన
దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించారు. ఇది సర్వమానవాళికి ప్రసాదించిన గొప్ప వరం,
శ్రీసభకు అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద.
దివ్యసత్ప్రసాదంలోదైవసాన్నిధ్యంనిక్షిప్తమై ఉంటుంది.
పండుగ నేపథ్యం:ఈ పండుగ
బెల్జియం దేశానికి చెందినజూలియానాఅనే మఠకన్యకు తరచుగా కనిపించిన ఒక దివ్యదృశ్యం నుండి ఉద్భవించింది.
ఆమె దగదగ మెరిసిపోతున్న చంద్రుడిని చూసేది, దానిపై ఒక మచ్చ ఉండేది. అది ఏదో అద్భుతమని ఆమెకు స్పష్టంగా
అర్థమైంది. అయితే, ఆ దృశ్యం గురించి ఇతరులతో
పంచుకోవడానికి ఆమె భయపడింది. ఎందుకంటే, దాన్ని
వివరించలేకపోయింది, దాని లోతైన భావాన్ని
గ్రహించలేకపోయింది.ఆ దృశ్యం యొక్క
అర్థాన్ని తెలుసుకోవాలని ఆమె తీవ్రంగా కోరుకుంది, అందుకు ఉపవాసాలు, ప్రార్థనలు చేసింది. కొన్ని రోజుల
తర్వాత, సాక్షాత్తుక్రీస్తు ప్రభువుఆమెకు ఆ దృశ్యం యొక్క లోతైన భావాన్ని అర్థమయ్యేలా చేశారు. ఆ విధంగా
ఆమె జ్ఞానోదయం పొందింది. ఈ సంఘటన దివ్యసత్ప్రసాద మహోత్సవానికి పునాది వేసింది.
పండుగ విస్తరణ-దివ్యసత్ప్రసాద గౌరవార్థం ప్రత్యేక ఉత్సవం: జూలియానాకు కనిపించిన దృశ్యం యొక్క లోతైన భావం క్రమంగా స్పష్టమైంది.
ఆ దృశ్యంలోచంద్రుడు
శ్రీసభను సూచిస్తుండగా, దానిలోని మచ్చ 'దివ్యసత్ప్రసాద' గౌరవార్థం ఒక ప్రత్యేక ఉత్సవం లేని లోపాన్ని తెలియజేసింది.
ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడంలో తోడ్పడమని
ప్రభువు తనను ఆజ్ఞాపిస్తున్నాడని ఆమె గ్రహించింది. "నేను ఒక సాధారణ కన్యస్త్రీని,
ప్రభువు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు,
దీన్ని నేను నెరవేర్చగలనా!" అని లోలోపల
సతమతమవుతుండగా, పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు
ధైర్యాన్ని ప్రసాదించారు.
ముందుగానే ఆమె ఈ దృశ్యం గురించి కొంతమంది దేవాలయ పెద్దలకు, తెలిసిన గురువులకు, తోటి మఠకన్యలకు తెలియజేసింది. వారందరూ
కలిసి అప్పటిలియోదిపుర పీఠాధిపతినికలిసి ఈ విషయం ప్రస్తావించారు. తమ మేత్రాసనంలో 'దివ్యసత్ప్రసాద' మహోత్సవాన్ని ఏర్పాటు చేయవలసిందిగా
పీఠాధిపతిని అభ్యర్థించారు. తత్ఫలితంగా, రోబెర్టో పీఠాధిపతులు 1246వ సంవత్సరంలో తమ గురువులందరికీ అధికారపూర్వకమైన
ఉత్తర్వులను పంపి, ఈ ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
అలా ఆ మేత్రాసనంలో ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఈ గొప్ప మహోత్సవం
ద్వారా 'దివ్యసత్ప్రసాద' ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని గ్రహించారు. అది చూసిన
ఇతర పీఠాధిపతులు తమ మేత్రాసనాల్లో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. తరువాత కొన్నాళ్ళకి
ఈ ఉత్సవ సంబరం ఇతర దేశాలకు విస్తరించింది. చివరికి1264వ సంవత్సరంలో, మూడవ ఉర్భాను పోపుగారు ఈ మహోత్సవం
శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించారు.
దివ్యసత్ర్పసాదం-చారిత్రకాంశాలు: తొలి రోజుల్లో క్రైస్తవులుజ్ఞానస్నానాన్ని మాత్రమే ప్రధాన సంస్కారంగాపరిగణించారు. జ్ఞానస్నానంతో ప్రారంభమైన
క్రైస్తవ జీవితాన్ని దివ్యసత్ప్రసాదం మరింత పెంపొందిస్తుందని వారు భావించారు.
అందువల్ల, వారి దృష్టిలో సత్ప్రసాదం జ్ఞానస్నానం
అంత ముఖ్యమైనది కాదు.
క్రీస్తు దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించిన సందర్భాన్ని పరిశీలిస్తే,
క్రీస్తు "భుజించమని" మాత్రమే
అన్నారు కానీ “ఆరాధించమని” అనలేదు. కనుక, తొలినాటి
క్రైస్తవులు దాన్నిభోజనంగానేభావించారు కానీ ఆరాధ్య వస్తువుగా ఎంచలేదు. పూజకు హాజరైన క్రైస్తవులు,
దివ్యసత్ప్రసాదాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకొని
వెళ్ళేవాళ్లు. దాన్ని తమ ఇళ్లల్లో భద్రపరుచుకుని భుజించేవాళ్లు. ఈ సంప్రదాయం8వ శతాబ్దం వరకుకొనసాగుతూ వచ్చింది.
అదే కాలంలో, దాన్ని దేవాలయాలలో పదిలపరచి పూజ జరగని
సమయాల్లో పంచి పెట్టేవాళ్లు. వ్యాధిగ్రస్తులకు కూడా భోజనంగా ఇచ్చేవాళ్లు. ఈ
సందర్భాలన్నింటిలోనూ దాన్ని భోజనంగానే ఎంచారు. విశ్వాసులు దాన్ని బహిరంగంగా
ఆరాధించలేదు.
పదకొండవ శతాబ్దంలో దివ్యసత్ప్రసాదం పట్ల వైఖరిలో మార్పు: పదకొండవ శతాబ్దంలో, బెరింగారియస్అనే వ్యక్తి కారణంగా దివ్యసత్ప్రసాదం
పట్ల ప్రజల వైఖరిలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అతను దివ్యసత్ప్రసాదంలోదైవసాన్నిధ్యం లేదని, రొట్టె, ద్రాక్షారసాలు క్రీస్తు శరీర రక్తాలుగా
మారవనివాదించాడు.
దీనితో శ్రీసభ 'దివ్యసత్ప్రసాదంలో' దైవసాన్నిధ్యం ఉందని ప్రజలకు స్పష్టంగా బోధించడం ప్రారంభించింది.
ఈ బోధన ఫలితంగా ప్రజలలో దైవసాన్నిధ్యం పట్ల భక్తిభావం పెరిగింది.
క్రమంగా, దివ్యసత్ప్రసాదం కేవలం భోజనం అన్న భావన
మరుగున పడిపోయింది. బదులుగా, అదిఆరాధ్య వస్తువుఅన్న భావన ప్రజలలో పెచ్చుపెరిగింది. దీనితో విశ్వాసులు
దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించడం మానేసి, ఆరాధించడం మొదలు
పెట్టారు.
దైవసాన్నిధ్యం నడిపూజలో నెలకొంటుందని విశ్వాసులకు తెలియజేయడం కోసం,
గురువులు నడిపూజలో‘దివ్యసత్ప్రసాదాన్ని’పైకెత్తి చూపించేవారు.
అలా పైకెత్తబడిన దివ్యభోజనాన్ని కంటితో చూడడం
మహాభాగ్యంగా విశ్వాసులు భావించారు.
దివ్యసత్ప్రసాద భక్తిలో మార్పులు: క్రమేణా, దివ్యసత్ప్రసాదంలోని దైవసాన్నిధ్యం
పట్ల భక్తి మరింతగా పెరిగింది. దీని ఫలితంగా, 13వ శతాబ్దంలో 'దివ్యసత్ప్రసాద' పండుగను నెలకొల్పారు. దీనితో పాటుసత్ప్రసాద ఆశీర్వాదం, ప్రదక్షిణలు, 40 గంటల ఆరాధనలువంటి కొత్త భక్తి పద్ధతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విధంగా
దివ్యసత్ప్రసాద ఆరాధన విస్తృతంగా ప్రచారంలోనికి వచ్చింది.
అయితే, దివ్యసత్ప్రసాదాన్ని ఆరాధించడం ఎంతగా
ప్రచారంలోనికి వచ్చిందో, దాన్ని భోజనంగా స్వీకరించడం అంతగా
తగ్గిపోయింది. విశ్వాసులు తాము పాపులమని భావించి, ఆ దివ్య భోజనాన్ని స్వీకరించడానికి తాము యోగ్యులం కామని భావించేవారు.
అందువల్ల, వారు పూజకు హాజరైనప్పటికీ, 'దివ్యసత్ప్రసాదాన్ని' మాత్రం స్వీకరించేవారు కాదు.
దివ్యసత్ప్రసాదం: ఆరాధన - స్వీకరణ మధ్య సమతుల్యత: దివ్యసత్ప్రసాదం పట్ల భక్తిలో వచ్చిన ఈ పరిణామ క్రమంలోమంచి, చెడు అంశాలు రెండూ ఉన్నాయి.
మంచి ఏమిటంటే, తొలి వెయ్యేళ్లల్లో లేనిఆరాధనాంశం పదకొండవ శతాబ్దం తర్వాత ప్రచారంలోకి రావడం.
ఇది నిజంగా మెచ్చుకోదగిన అంశం. ప్రజలు
దివ్యసత్ప్రసాదంలోనిదైవసాన్నిధ్యాన్ని గుర్తించి, దాన్ని గౌరవించడంప్రారంభించారు.
అయితే, చెడు ఏమిటంటే, 'దివ్యసత్ప్రసాదం' ఒక భోజనం అన్న విషయం మర్చిపోవడం.
ప్రభువు ఎప్పుడూ దివ్యసత్ప్రసాదంలో తనను తాను
మనకు భోజనంగా అర్పించుకోవడానికి కోరుతుంటాడు. ఇది ఆయన యొక్కచైతన్యవంతమైన సాన్నిధ్యం. దురదృష్టవశాత్తు, విశ్వాసులు ఈ చైతన్యవంతమైన
సాన్నిధ్యాన్ని కేవలంజాడాత్మకమైన సాన్నిధ్యంగామార్చారు. అంటే, ప్రభువు సత్ప్రసాదంలో వట్టినే
ఉండిపోతాడు అనుకున్నారు, మనం అతన్ని భుజించనక్కరలేదు, ఆరాధిస్తే చాలు అనుకున్నారు.
ఈ పరిణామం, దివ్యసత్ప్రసాదం యొక్క అసలు
ఉద్దేశాన్ని పాక్షికంగా పక్కకు నెట్టింది. దివ్యసత్ప్రసాదం కేవలం ఆరాధనకు మాత్రమే
కాకుండా, మన ఆత్మలకు పోషణగా, క్రీస్తుతో ఐక్యతను పెంపొందించే
భోజనంగాకూడా
ఉద్దేశించబడింది.
ఈ రోజు మనము విన్న పఠన భాగాలను ధ్యానించుకుందాం.
మొదటి పఠనం: (ఆది 14:18-20) ఈ భాగంలో, మెల్కీసెదెకుఅనే సాలెం రాజు మరియుయాజకుడు అబ్రహాముకురొట్టె ద్రాక్షారసములనుతీసుకొని వచ్చాడు. అంతేకాకుండా,
అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ సంఘటనక్రీస్తు యొక్క యాజకత్వానికి, మరియు ఆయన శరీర రక్తములకు ఒక పూర్వఛాయ
(prefigurement)గా చెప్పవచ్చు.
మెల్కీసెదెకు యాజకుడు, రాజు. ఇదేవిధంగా,
క్రీస్తు కూడా రాజులకు రాజు, మరియు ప్రధాన యాజకుడు. ఇక్కడ సమర్పించబడిన రొట్టె ద్రాక్షారసములు
క్రీస్తు శరీర రక్తములకు సంకేతాలుగా ఉన్నాయి. మెల్కీసెదెకు అబ్రహామును
ఆశీర్వదించినట్లుగా, క్రీస్తు దివ్యసత్ప్రసాదము ద్వారా
మనలను ఆశీర్వదిస్తాడు.
రెండవ పఠనం:(1
కొరి 11:23-26) ఈ భాగంలో, పౌలు అపొస్తలుడు ప్రభువు కడరాత్రి
భోజనాన్ని గురించి మనకు తెలియజేస్తున్నాడు. యేసు తన శరీరమును విరిచి, ద్రాక్షారసమును తన రక్తముగా ఇచ్చి, తన శిష్యులకు “నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయుడు” అని
ఆజ్ఞాపించాడు. ఇది దివ్యసత్ప్రసాద స్థాపన గురించి తెలియ జేయుచున్నది.
ప్రతిసారి మనం దివ్యసత్ప్రసాదమును స్వీకరించినప్పుడు, మనం క్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని
ప్రకటిస్తున్నాము. ఇది ఒక జ్ఞాపకార్థం మాత్రమే కాదు, క్రీస్తు యొక్క నిజమైన ఉనికి. ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దివ్యసత్ప్రసాదం ద్వారా
మనం ఆయనతో ఐక్యమవుతాము.
సువార్త పఠనం: (లూకా 9:11-17) ఈ సువార్త భాగం ఐదు రొట్టెలు, రెండు చేపలతో ఐదువేల మందికి పైగా ప్రజలను యేసు పోషించిన అద్భుతాన్ని
వివరిస్తుంది. ఈ అద్భుతం దివ్యసత్ప్రసాదానికి ఒక శక్తివంతమైన సంకేతం. యేసు తన
శిష్యుల చేతులలో రొట్టెలను విరిచి ఇచ్చినట్లే, ఆయన తన శరీరమును మనకు ఆహారంగా ఇస్తున్నాడు. ఐదు రొట్టెలు, రెండు చేపలు ఐదువేల మందిని పోషించినట్లే, క్రీస్తు శరీరం మరియు రక్తం మన ఆకలిని తీర్చి, మనకు నిత్యజీవమును ప్రసాదిస్తుంది. ఈ అద్భుతం క్రీస్తు యొక్క
దైవత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన సర్వశక్తిత్వమును వెల్లడి చేస్తుంది.
దివ్యసత్ర్పసాదం-నాలుగు ప్రభావాలు: దివ్యసత్ప్రసాదం మన క్రైస్తవ జీవితంలో అనేక అద్భుతమైన ప్రభావాలను
కలిగి ఉంది. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం:
1. నిత్య జీవితం:“నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున
లేపుదును” (యో 6:54).ఈ వాక్యం దివ్యసత్ప్రసాదం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రభావాలలో ఒకటిగా
నిలుస్తుంది. దివ్యసత్ప్రసాదం ద్వారా మనకు లభించేకృపానుగ్రహంమనల్ని కడవరకు నడిపిస్తుంది. పౌష్టికాహారం మన శరీరానికి బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుందో, అదేవిధంగాదివ్యసత్ప్రసాదంమన ఆత్మకు దైవజీవమును ప్రసాదిస్తుంది. అంటే, దేవునితోఐక్యతనుకలిగిస్తుంది. ఈ భోజన ప్రభావం శాశ్వత జీవాన్ని ప్రసాదించేంత వరకు,
దేవునిలో మన ఐక్యత సంపూర్ణమయ్యేంత వరకు ఏ
మాత్రం ఆగదు. ఇది మన క్రైస్తవ ప్రయాణంలో నిరంతర పోషణగా, నిత్యజీవానికి మార్గంగా నిలుస్తుంది.
2. పునరుత్థానము:మనం పైన
పరిశీలించిన వచనం (యో 6:54) ప్రకారం, భక్తి, విశ్వాసాలతో 'దివ్యసత్ప్రసాదాన్ని' స్వీకరించేవారునిత్యజీవితాన్నిపొందుకుంటారని ప్రభువు వాగ్దానం చేసియున్నారు. ఈ దివ్య భోజనం
దేవునితో ఐక్యతను పెంపొందించడమే కాకుండా, మరణానంతరం మనపునరుత్థాన మహిమకొరకు కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే
ఉంటుంది. ప్రభువు మనలను మహిమతో లేవనెత్తి, పరలోక బహుమానమైన నీతి కిరీటాన్నిమనకు అందించేంత వరకు ఈ దివ్య భోజనం యొక్క ప్రభావం మనలో కొనసాగుతుంది.
ఇది కేవలం ప్రస్తుత జీవితానికే కాకుండా, శాశ్వతమైన
భవిష్యత్తుకు కూడా మనల్ని సిద్ధం చేస్తుంది.
3. ప్రభువుతో సహవాసం:దివ్యసత్ప్రసాదం యొక్క మరో అద్భుతమైన ప్రభావంప్రభువుతో సహవాసం. “నా
శరీరమును భుజించి, నా రక్తమును పానము
చేయువాడు నా యందు, నేను వానియందు ఉందును” (యో 6:56) అని యేసు ప్రభువు స్పష్టం చేశారు. ఈ
వాక్యం దివ్యసత్ప్రసాదం ద్వారా మనం పొందే లోతైన ఐక్యతను తెలియజేస్తుంది. దివ్యసత్ప్రసాదం స్వీకరించడం ద్వారా మన
శరీరంక్రీస్తు
శరీరముగా, మన హృదయంక్రీస్తు హృదయముగారూపాంతరం చెందుతుంది. దివ్యసత్ప్రసాద రూపంలో క్రీస్తు మన హృదయంలోనికి
వచ్చిన తర్వాత, మనం ఆయనతోఏకమవుతాము. దీని అర్థం, మనం క్రీస్తుతో పాటు జీవిస్తున్నాము, ఆయనతో నిరంతర సహవాసంలో ఉన్నాము. ఇది కేవలం ఒక భోజనం కాదు, క్రీస్తుతో అనుబంధాన్ని బలపరిచే ఒక దివ్యమైన అనుభవం.
4. క్రీస్తు ద్వారా నూతన జీవితం:దివ్యసత్ప్రసాదం యొక్క నాల్గవ కీలక
ప్రభావంక్రీస్తు ద్వారా
నూతన జీవితాన్నిపొందడం. యేసు స్వయంగా ఇలా అన్నారు,“పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల
ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము
జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను”
(యో 6:51).భౌతిక ఆహారం మనకు శక్తిని, బలాన్ని అందించి
రోజువారీ పనులు చేసుకోవడానికి ఎలా సహాయపడుతుందో, అలాగేమన ఆత్మలను పోషించడానికిఆధ్యాత్మిక ఆహారం అవసరం. ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రీస్తు "దివ్యసత్ప్రసాదముగా"
మనకు అనుగ్రహించారు. అయితే, భౌతికాహారాన్ని జీర్ణించుకుని శక్తిని
పొందడానికి ఆరోగ్యకరమైన శరీరం ఎంత అవసరమో, అదేవిధంగా
క్రీస్తు ప్రసాదించే'దివ్యసత్ప్రసాదాన్ని' స్వీకరించి ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని పొందడానికిమన ఆత్మలు ఆరోగ్యంగా, పవిత్రంగా ఉండటం అంతే అవసరం. కనుక, మనంపరిపూర్ణ విశ్వాసముతో, యోగ్యమైన రీతిలోనిండు పూజలో పాల్గొని 'దివ్యసత్ప్రసాదాన్ని' స్వీకరించాలి. అప్పుడే ఈ జీవాహారం మనలో
నూతన జీవితాన్ని, ఆధ్యాత్మిక బలగాన్ని ప్రసాదించగలదు.
కతోలిక బోధన మరియు మన జీవితాలకు అన్వయింపు:దివ్యసత్ప్రసాదం కతోలిక విశ్వాసంలో ఒక అద్భుతమైన సంస్కారం. ఇది మన
జీవితాలకు ఎలా అన్వయిస్తుందో ఇప్పుడు చూద్దాం:
(1). క్రీస్తు యొక్క నిజమైన ఉనికి:కతోలిక విశ్వాసంలో, దివ్యసత్ప్రసాదంలో రొట్టె
ద్రాక్షారసములు అద్భుతముగా క్రీస్తు శరీర రక్తములుగా మారుతాయి. ఇది కేవలం ప్రతీక
కాదు, ఇది క్రీస్తు యొక్క నిజమైన ఉనికి. ఆయన
మన మధ్య జీవించి ఉన్నాడు.
(2).క్రైస్తవ
జీవితానికి కేంద్రం:దివ్యసత్ప్రసాదం మన క్రైస్తవ జీవితానికి కేంద్రం. ఇది మనకు
ఆధ్యాత్మిక ఆహారం, బలం, మరియు నిత్యజీవానికి ఖచ్చితమైన మార్గం.
(3). త్యాగం మరియు పునరుత్థానం:దివ్యసత్ప్రసాదం క్రీస్తు యొక్క సిలువ
త్యాగాన్ని మరియు ఆయన మహిమగల పునరుత్థానాన్ని గుర్తు చేస్తుంది. ప్రతిసారి మనం
దివ్యసత్ప్రసాదమును స్వీకరించినప్పుడు, మనం ఆ త్యాగంలో,
పునరుత్థానంలో పాలుపంచుకుంటాము.
(4). ఐక్యత మరియు ప్రేమ:దివ్యసత్ప్రసాదం మనలను క్రీస్తుతోను,
ఒకరితో ఒకరిని ఐక్యపరుస్తుంది. మనం ఒకే
రొట్టెలో పాలుపంచుకోవడం ద్వారా, మనం ఒకే శరీరంలో భాగమవుతాము. ఇది మనలో
ప్రేమను, సోదరభావాన్ని పెంపొందిస్తుంది.
(5). సేవ మరియు మిషన్:దివ్యసత్ప్రసాదమును స్వీకరించిన తర్వాత,
మనం క్రీస్తు యొక్క ప్రేమను లోకానికి చాటి చెప్పడానికి,
ఇతరులకు సేవ చేయడానికి శక్తిని పొందుతాము.
దివ్యసత్ప్రసాదం మనలను మిషనరీలుగా మారుస్తుంది.
దివ్యసత్ప్రసాద స్వీకరణలో యోగ్యత:నేడు, క్రీస్తు ప్రభువు మనందరినీయోగ్యమైన రీతిలోతన శరీర, రక్తములను స్వీకరించమని కోరుతున్నారు.
ఈ మధ్య కాలంలో, చాలామంది కతోలికులు 'దివ్యసత్ప్రసాద' విషయంలో అనేక పొరపాట్లు చేస్తూ
ఉన్నారు. వాటిలో ముఖ్యమైనది పూజకు ఆలస్యంగా రావడం.నిండు పూజలో సరైన విధముగా పాల్గొనని వారు, ఆ మహాప్రసాదాన్ని
స్వీకరించడానికి అనర్హులుఅని బైబిల్ స్పష్టం చేస్తోంది (1 కొరి 11:27-31). మనం క్రీస్తు చూపినప్రేమ, క్షమాగుణ
సిద్ధాంతాలనుపాటిస్తున్నామా లేదా అనిఆత్మపరిశీలనచేసుకోవాలి. అలా పాటించకపోతే మనలో 'దివ్యసత్ప్రసాద' శక్తి ఏ మాత్రం పని చేయదు. కనీసం
ఇకనుండైనా, యోగ్యమైన రీతిలో ప్రభువు సర్వమానవాళికి
ప్రసాదించిన ఈ గొప్పజీవాహారాన్ని స్వీకరించుదాం!అప్పుడే దివ్యసత్ప్రసాదం యొక్క నిజమైన
శక్తిని, ఆశీర్వాదాలను మనం అనుభవించగలం.
ప్రియమైన విశ్వాసులారా, పరమ పవిత్ర
క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం నాడు, మన ప్రభువు
యేసుక్రీస్తు మనపై కురిపించిన అపారమైన ప్రేమను ధ్యానించుకుందాం. ఆయన తనను తాను
మనకు ఆహారంగా ఇచ్చి, మనలను తనలో ఐక్యపరుచుకున్నాడు. ఈ
అద్భుతమైన బహుమానానికి మనం కృతజ్ఞులమై ఉందాం. దివ్యసత్ప్రసాదమును భక్తి శ్రద్ధలతో
స్వీకరిద్దాం. ఈ దివ్యసత్ప్రసాదం మనకు నిత్యజీవమును, ఆశీర్వాదములను ప్రసాదించుగాక. మన జీవితాలలో క్రీస్తు ప్రేమను,
త్యాగాన్ని అనుసరిద్దాం.
ప్రార్థన:యేసుక్రీస్తు ప్రభువా, మీరు
దివ్యసత్ప్రసాదము ద్వారా మాకు జీవమును ప్రసాదించినందుకు మీకు వందనములు. ఈ పవిత్ర
బలిపీఠం వద్ద మీ దయను, మీ ప్రేమను అనుభవించడానికి మాకు సహాయం
చేయుము. మీ శరీరమును, మీ రక్తమును స్వీకరించడం ద్వారా మీతో
మరింత సన్నిహితంగా జీవించే కృపను ప్రసాదించుము. మీ పరిశుద్ధ నామానికి మహిమ
కలుగుగాక. ఆమెన్.
ఈ రోజు మనం త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను కొనియాడు చున్నాము. ప్రతీ సంవత్సరం, పెంతకోస్తు పండుగ తరువాత వచ్చు ఆదివారమున ఈ పండుగను కొనియాడుతూ ఉంటాము. చారిత్రాత్మకముగా, ఈ పండుగ క్రీ.శ. 1030వ సంవత్సరములో పెంతకోస్తు పండుగ తరువాత, మొదటి ఆదివారమున ప్రారంభ మైనది. ఇరువైరెండవ జాన్ పోపు గారు, క్రీ.శ. 1334 వ సంవత్సరములో, దీనిని విశ్వ శ్రీసభ పండుగగా ఆమోదించారు.
మనం ప్రతీ ప్రార్ధనను స్లీవ గురుతుతో, అనగా “పిత, పుత్ర, పవిత్రాత్మ, ఆమెన్” అని ప్రారంభిస్తాము. ప్రతీ ప్రార్ధనను త్రిత్వ స్తోత్రముతో, అనగా “పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును, ఎప్పుడును, సదా కాలము కలుగునుగాక, ఆమెన్” అని ముగిస్తాము.
దేవుడు ఏక త్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు. ఒకే సర్వేశ్వరుడు కాని, త్రిత్వవంతుడై యున్నాడు. అనగా, పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఉన్నారనియు, ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావము ఒకటేననియు అర్ధము. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవస్వభావము ఉండుట వలన, ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై యున్నారు. వీరిలో శక్తి, మహిమ మొదలైన లక్షణములలో ఎలాంటి బేధము లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నింటిలో సరిసమానులు. వీరు ముగ్గురు ఆరంభము లేనివారై యుండుట వలన, వీరిలో ముందటి వ్యక్తి, వెనుకటి వ్యక్తి లేరు. సర్వేశ్వరుని ముఖ్య లక్షణాలు ఆరు: 1. సర్వేశ్వరుడు తనంతట తానై యున్నాడు. 2. ఆరంభము లేక యున్నాడు. 3. శరీరములేక యున్నాడు. 4. మితిలేని సకల మేలుల స్వభావము కలిగి యున్నాడు. 5. అంతట ఉన్నాడు. 6. పరలోకమునకు, భూలోకమునకు మూలకారణమై యున్నారు. ఇది కతోలిక విశ్వాసము. “పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించు చున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించు చున్నాను. పవిత్రాత్మను విశ్వసించు చున్నాను” అని అపోస్తలుల విశ్వాస ప్రమాణములో ప్రకటిస్తున్నాము.
“పరమ పవిత్ర త్రిత్వం ఒక నిగూఢ సత్యం. క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి అది కేంద్ర బిందువు” (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 234). వాస్తవముగా, త్రిత్వైక పరమ రహస్యాన్ని వివరించడం, అర్ధంచేసుకోవడం చాలా కష్టం. “త్రిత్వం పరిష్కరించాల్సిన సమస్య కాదు, జీవించాల్సిన పరమ రహస్యం” అని పునీత అగుస్తీను వారు చెప్పియున్నారు. బైబులులో “త్రిత్వం” అనే పదం మనకు ఎక్కడా కనిపించదు.
మత్తయి సువార్త చివరిలో యేసు ప్రభువు తన శిష్యులతో, “మీరు వెళ్లి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు” (28:19) అని చెప్పాడు. పౌలు కొరింతీయులకు రాసిన రెండవ లేఖ చివరిలో, “యేసుక్రీస్తు ప్రభువు కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకు లభించును గాక!” (13:14) అని వారిపైకి ఆశీర్వాదాలను అర్ధిస్తూ ముగించాడు. యేసువే స్వయముగా తన బోధనలలో, దేవున్ని “ఆబ్బా! తండ్రీ” అని పిలచి, తన శిష్యులుకూడా అలాగే అర్ధించాలని నేర్పించాడు (మార్కు. 14:36, మత్త. 6:9). ఆదరణకర్త (యోహాను. 14:16), ఒదార్చువాడు (14:26) అని పవిత్రాత్మ గురించి పలికి యున్నాడు. “నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు” (యోహాను. 14:9) అని చెప్పి, త్రిత్వములోని ముగ్గురు వ్యక్తుల మధ్యనున్న ప్రేమ సహవాసము గురించి తెలియజేసి యున్నాడు. పవిత్రాత్మ వచ్చినప్పుడు, సమస్త విషయములను బోధించును (యోహాను. 14:26) అని, త్రిత్వైక సర్వేశ్వరుని ద్వారా, శిష్యులు ప్రేమ, క్షమను పొందెదరని చెప్పాడు.
మనకు అర్ధం అయ్యేవిధముగా, త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులకు, తండ్రి దేవుడు, సృష్టికర్తయని, పుత్ర దేవుడు రక్షకుడని, పవిత్రాత్మ నూత్నీకరించువాడని నిర్దిష్టమైన పాత్రలు ఇవ్వబడ్డాయి. తండ్రితో, ఆత్మతో తనకున్న అతి సమీప సంబంధాన్ని, ఐఖ్యతను, ప్రేమ బంధాన్ని, యేసు చాలా స్పష్టముగా తెలియ జేసాడు. యోహాను తన సువార్తలో, సృష్టి కలిగినప్పుడు, వాక్కు అయిన క్రీస్తు దేవునితో ఉండెను అని చెప్పాడు (యోహాను. 1:1-3). యేసు జననసూచన – దూత ప్రకటన లేదా గబ్రియేలు దూత దేవమాతకు మంగళవార్త చెప్పినప్పుడు, త్రిత్వైక దేవుని కార్యము స్పష్టముగా కనిపిస్తుంది: దేవుడు పంపిన గబ్రియేలు దూత, మరియమ్మ అనుగ్రహ పరిపూర్ణురాలని, పవిత్రాత్మ ఆమెపై వేంచేయునని, ఆమె గర్భములో యేసును ధరించునని తెలియ జేసెను.
పిత దేవుడు, మనకు తండ్రి లాంటివాడు. మనలను తన పోలికలో సృజించాడు. భూలోకములో మన ప్రయాణం ముగిసాక, మరల తండ్రి దేవుని యొద్దకు చేరుకుంటాము. ఆయన మనలను పోషించును, నిత్యము తన జీవితాన్ని మనకు ఇస్తూ ఉంటాడు. “నేను ఉన్నవాడను” అని దేవుడు మోషేకి తెలియజేసాడు. తండ్రి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా చేసుకొని వారిని బానిసత్వమునుండి నడిపించి, సినాయి కొండపై ఆజ్ఞలను ఒసగాడు. వారి వెన్నంటే ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు.
పుత్ర దేవుడు, యేసు క్రీస్తు మనకు సోదరుడు, స్నేహితుడు. అవిధేయత మార్గములనుండి మనలను తనవైపుకు మరల్చుకుంటాడు. ఆయన మనకోసం, మనలో ఒకరిగా జన్మించాడు. మనం శ్రమలలో నున్నప్పుడు, ఆయన మనతో శ్రమలనుభవిస్తాడు. మన ఆనందములో ఆయన పాలుపంచుకుంటాడు. ప్రేమించడం, ప్రేమించబడటం అను జీవిత పరమార్ధం వైపుకు మనలను నడిపిస్తాడు. ఆయన ద్వారా దేవుని కృపానుగ్రహమును, రక్షణను పొంది యున్నాము. యేసు తండ్రిని మనకు పరిచయం చేసాడు.
పవిత్రాత్మ దేవుడు మనలో వసిస్తున్న జీవము, మన శ్వాస, దైవీక శక్తి. దేవుని నుండి ఆత్మను స్వీకరించాము. ఆత్మద్వారా మనము దేవుని ‘అబ్బా! తండ్రీ!’ అని పిలుస్తున్నాము. ఆత్మద్వారా మనం దేవుని బిడ్డల మయ్యాము. బిడ్డలము కనుక వారసులము. క్రీస్తు తోడి వారసులము (రోమీ. 8:15-17). యేసు క్రీస్తు, ఆత్మ ఇరివురు కూడా మనలను ప్రేమగల తండ్రి దేవుని వైపునకు నడిపించును. జ్ఞానస్నానము ద్వారా ఆత్మను పొందిన మనం ‘నూతన జీవితము’ను పొందియున్నాము. ఆత్మ మనలను క్రీస్తులో ఐఖ్యము చేయును. బిడ్డలముగా దేవునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచును. “క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన యెడల ఆయన మహిమలో కూడ మనము భాగస్థులము అగుదము” (రోమీ. 8:17). ఆత్మ మనకు తర్ఫీదు నిచ్చును, మార్గనిర్దేశం చేయును, బోధించును, మనలను ప్రేమించును, ఒదార్చును, బలపరచును.
సువిశేష పఠనము (యోహాను 3:16 –18)
ఈ మూడు వచానాలు మన జీవితాలలో త్రిత్వైక సర్వేశ్వరుని ప్రాముఖ్యత గురించి తెలియజేయు చున్నాయి. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను” (16). ఈ వాక్యము, నేటి పండుగ పరమార్ధమును తెలియ జేయుచున్నది. దేవుడు ఎందుకు త్రిత్వైక సర్వేశ్వరుడు అన్న దానికి ఈ వచనం గొప్ప తార్కాణం. దేవుడు ఎంతో ప్రేమ కలవాడు. స్వాభావికముగా, ఆ ప్రేమను తనలోనే దాచుకొనలేడు. ఆ ప్రేమ పొంగి పొరలును. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే, అది జీవము గలదిగా మారును. ప్రేమ ఒంటరిగా, ఏకాంతములో గ్రహింపబడదు. అది ఇతరుల సాన్నిహిత్యములో, సహవాసములో సంపూర్ణతను పొందును. అందుకే త్రిత్వము.
త్రిత్వైక సర్వేశ్వరుని ప్రేమ ఎప్పుడు కూడా నదిలా ప్రవహిస్తూ, పొంగి పొరలును. అందుకే, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు. ఈ దైవీక ప్రేమ వలననే, ఈ సృష్టిలో ప్రతీదీ మనగలుగుచున్నది. మానవాళి, విశ్వం, సృష్టి అందం, అన్నీ కూడా పొంగి పొరలుతున్న ఈ దైవీక ప్రేమనుండే వచ్చాయి. ఆ ప్రేమ ప్రవాహములో ప్రవహించడానికి మనలను మనం అనుమతించు కోవాలి. “ప్రేమ... ప్రేమ... ఆ తరువాత అన్నియు అనుగ్రహింప బడును” అని పునీత అగుస్తీను వారన్నారు. సర్వము దేవుని ప్రేమే అని తెలుసుకుందాం!
వ్యాఖ్యానము సువిశేష పఠనములో, మూడు ముఖ్యమైన విషయాలను గ్రహించాలి: - మనలను రక్షించే దేవుని ప్రేమ, కుమారుని రూపములో ప్రసాదించబడినది (3:16). - దేవుని చిత్తము మనలను రక్షించడమే కాని, ఖండించడం కాదు (3:17). - ఈ ప్రేమను విశ్వసించే ధైర్యము మనకు ఉండాలని దేవుడు మనలను కోరుచున్నారు (3:18).
యోహాను. 3:16 - “దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.” ప్రేమించడం అనగా ప్రేమకొరకు తననుతాను ఇతరులకు సంపూర్ణముగా ఇవ్వడం. ప్రేమ అనగా, వ్యక్తుల మధ్య సంబంధములోని అనుభవము. ఆనందం, దు:ఖం, బాధ, ఇవ్వడం, నిబద్ధత, జీవితం, మరణం మొ.గు భావాలు, విలువలు ప్రేమలో ఉంటాయి. పాత నిబంధన గ్రంథములో ఈ భావాలన్నీ “హెసెద్” (hesed) అనే మాటలో వ్యక్తపరచ బడ్డాయి. మన బైబులులో దానిని ‘దాతృత్వం’, ‘దయ’, ‘విశ్వసనీయత’ ‘ప్రేమ’ అని అనువదించ బడినది. నూతన నిబంధనలో, ఈ దేవుని ప్రేమను యేసు తన బోధనలలో, కార్యములలో బహిర్గత మొనర్చాడు. స్నేహము, దయ అను భావాలతో ఈ ప్రేమను తెలియ జేశాడు. ఉదాహరణకు, బెతానియాలో మార్తమ్మ కుటుంబముతో నున్న సంబంధములో, “యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను” (యోహాను. 11:5, 33-36). యేసు తన ప్రేషిత కార్యాన్ని ప్రేమకు సాక్షాత్కారముగా ఎదుర్కొన్నాడు: “ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను” (యోహాను. 13:1). ఈ ప్రేమలో, తండ్రితో తనకున్న లోతైన సహవాసమును బహిర్గత మొనర్చాడు: “నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని” (15:9). అలాగే, “నేను మిమ్ము ప్రేమించి నటులనే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు” (15:12) అని మనతో చెప్పుచున్నాడు. యోహాను ప్రేమకు ఇలా నిర్వచనం ఇస్తున్నాడు: “క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది. కనుక మనము కూడ మన సోదరుల కొరకై ప్రాణమును అర్పింపవలెను” (1 యోహా. 3:16). “ఆయన యందు జీవించు చున్నానని చెప్పు కొనెడి వాడు యేసు క్రీస్తు వలె జీవింప వలెను” (1 యోహా. 2:6).
యోహాను. 3:17 - దేవుడు లోకమును ప్రేమించి, దానిని రక్షించడానికి తన ప్రాణమును అర్పించాడు. ‘లోకము’ అనగా సర్వ మానవాళి. ఈ లోకమును ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. యోహాను సువార్తలో ‘లోకము’ అనగా యేసును అంగీకరించక, వ్యతిరేకించినవారు అని ప్రత్యేకమైన అర్ధము ఉన్నది (7:4, 7; 8:23, 26; 9:39; 12:25). ఈ లోకము యేసు రక్షణ కార్యమునకు వ్యతిరేకం. ఇది విరోధి అయిన సాతానుచే ఆధిపత్యం కలిగి యున్న లోకము. ఈ లోకానికి సాతాను “లోకాధిపతి” (14:30, 16:11) అని పిలువబడినది. అధికారులచేత, పాలకుల చేత, అన్యాయాలను, అక్రమాలను, అణచివేతలను సృష్టించి, విశ్వాసులను, సంఘాలను హింసించును, కష్టాలకు గురి చేయును, నాశనం చేయును (16:33). దేవుని పేరిట వారు ఈ దుష్ట కార్యములు చేయుదురు (16:2). అయితే, యేసు సాతాను “లోకాధిపతి”ని త్రోసివేయును, జయించును (12:31). యేసు లోకముకన్న బలవంతుడు. “నేను లోకమును జయించితిని” (16:33) అని చెప్పాడు. యోహాను. 3:18 - దేవుని ఏకైక కుమారుడు మన కోసం తననుతాను అర్పించు కున్నాడు. యేసు ప్రేషిత కార్యమును వివరించడానికి, అనాధి క్రైస్తవ సంఘం యేసుకు ఇచ్చిన, పురాతనమైన, అందమైన నామము “రక్షకుడు”. హీబ్రూలో “గోయల్” (Goel) అని పేరు. కష్టాలలోనున్నవారి ఆస్తులను కాపాడిన దగ్గరి చుట్టమునుగాని, ప్రధమ సోదరునిగాని, “గోయల్” అని పిలిచేవారు (లేవీ. 25:23-55). అయితే, బబులోనియా ప్రవాసమున, ప్రతీ ఒక్కరు సర్వాన్ని కోల్పోయారు. అలాంటి సమయములో, దేవుడు తన ప్రజలకు “గోయల్” (రక్షకుడు) అయ్యాడు. తన ప్రజలను బానిసత్వము నుండి రక్షించాడు. నూతన నిబంధనలో, యేసు, తొలుత జన్మించిన పుత్రుడు మన “గోయల్” అయ్యాడు. యేసు గురించి ‘రక్షకుడు’, ‘విమోచకుడు’, (లూకా. 2:11; యోహాను. 4:42; అ.కా. 5:31), ‘న్యాయవాది” (1 యోహా. 2:1), ‘సోదరుడు’ (హెబ్రీ. 2:11) మొ.గు వానిగా చెప్పబడింది. యేసు మానవాళి కుటుంబ రక్షణార్ధమై, ఆయన సోదరులమైన మనమందరము తిరిగి మరల సంపూర్ణ సోదర ప్రేమలో జీవించడానికి తననుతాను సంపూర్ణముగా అర్పించుకున్నాడు. యేసు స్వయముగా, “మనుష్య కుమారుడు సేవించుటకే గాని, సేవింప బడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము (“గోయల్”), విమోచన క్రయ ధనముగ తన ప్రాణమును దాయ పోయుటకు వచ్చెను” (మార్కు. 10:45) అని చెప్పాడు. ఈ ఆవిష్కరణను, “క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసెను” (గలతీ.2:20) అని పౌలు వ్యక్తపరిచాడు.
యోహాను సువార్తలో త్రిత్వైక బోధన తండ్రి కుమారుల మధ్యనున్న అతి సన్నిహిత సంబంధము గురించి యోహాను నొక్కి చెప్పాడు. తండ్రి ప్రేమను తెలియజేయడమే కుమారుని లక్ష్యం (17:6-8). “నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము” (10:30) అని యేసు ప్రకటించాడు. వారి మధ్య ఐఖ్యత ఉన్నది. ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే (14:9). తండ్రిని గురించి వెల్లడి జేయడములో, యేసు ఆత్మను గురించి కూడా తెలియజేసాడు, “తండ్రి యొద్దనుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ” (15:26). మనతో ఉండటానికి దేవుడు పవిత్రాత్మను పంపును. అలాగే, “నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను” (16:7) అని యేసు పలికాడు. అనగా యేసు పవిత్రాత్మను పంపును. తండ్రి దేవుడు / పుత్ర దేవుడు పవిత్రాత్మను పంపును. ఈ సత్యం తండ్రి కుమారుల మధ్యనున్న గొప్ప సహవాసమును, ఐఖ్యతను స్పష్టముగా వెల్లడి చేయుచున్నది. ఇదే ఐఖ్యత తన ప్రజల మధ్య ఉండాలని ప్రభువు ఆశించారు (13:34-35;17:21). ఇదే త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ గొప్ప సందేశము: మనము పరస్పర ప్రేమ కలిగి, ఐఖ్యతగ జీవించాలి.
త్రిత్వం ప్రేమ యొక్క పరమ రహస్యం. త్రిత్వం ఐఖ్యత యొక్క పరమ రహస్యం. త్రిత్వైక దేవుని జీవితములో మనము పాలుపంచుకోవడానికి పిలువబడి యున్నాము. దేవుడు మనకు నిత్య జీవమును ఒసగును. త్రిత్వైక దేవునిలో ప్రేమ, ఐఖ్యత కలిగి మనము జీవించాలని ప్రార్ధన చేద్దాం.
“మీ
చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు
చూచితిరో, అట్లే ఆయన మరల వచ్చును” (అ.కా. 1:11).
మోక్షారోహణం – శ్రీసభ పరిచర్య ప్రారంభం
“శిష్యులు
చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. ఒక మేఘము ఆయనను కమ్మివేసెను” (1:9). ఈ రోజు
మన ప్రభువగు యేసు క్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడు చున్నాము. మోక్షారహణం ఒక
పరమ రహస్యం. గొప్ప, కీలకమైన సంఘటన. ఇది మన గొప్ప విశ్వాసము. మోక్షారోహణము అనగా
పరలోకమునకు కొనిపోబడుట. అనగా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళడం. బైబులులో, ముఖ్యముగా లూకా
రచనలలో యేసు క్రీస్తు మోక్షారోహణము గురించి కనిపిస్తుంది (లూకా. 24:50-51; అ.కా.
1:9-11; చూడుము. మార్కు 16:19).
నేడు
ముఖ్యముగా రెండు విషయాలను ధ్యానించుదాం:
ఒకటి, క్రీస్తు మోక్షారోహణము, ఆయన పరలోక
[తండ్రి] మహిమలోనికి కొనిపోబడ్డాడు (చూడుము. యోహాను. 1:14, ఫిలిప్పీ. 2:5-8). “పరలోకమునకు
ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని, కుడి ప్రక్కన కూర్చొని యున్నాడు” అని
‘అపోస్తలుల విశ్వాస ప్రమాణము’ మనకు బోధిస్తున్నది. ఆయన మరల తిరిగి వచ్చును (1:11).
“దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయును” (రోమీ.
8:34). “పాపమును గూర్చి విచారించుటకు గాక, తన కొరకై వేచి యున్న వారిని రక్షించుటకు
ఆయన రెండవ మారు వచ్చును” (హెబ్రీ. 9:28). రెండు, శ్రీసభ పరిచర్య ప్రారంభం. “పిదప
శిష్యులు వెళ్లి అంతట సువార్తను ప్రకటించిరి” (మార్కు. 16:20).
మోక్షారోహణము: యేసు ఆజ్ఞాపించిన
విధముగా, పదునొకండుగురు శిష్యులు, గలిలీయలోని ఓలీవు పర్వతము వద్దకు వెళ్ళిరి. బైబులులో
‘పర్వతం’, దేవుని కలుసుకొను పవిత్ర స్థలం, ప్రార్ధానా స్థలం. అచట శిష్యులు “ఆయనను
దర్శించి ఆరాధించిరి” (మత్త. 28:17). అప్పుడు యేసు వారు ఏమి చేయాలో తెలియజేసి,
కొన్ని ఆజ్ఞలను ఇచ్చి, వారు చూచుచుండగానే, మోక్షారోహణ మయ్యాడు. మోక్షారోహణముతో,
ప్రభువు భూలోక యాత్ర ముగిసింది. శరీరముతో మోక్షమునకు కొనిపోబడ్డాడు. దీనికి
సూచనగానే, ఈరోజు నుండి మనం దేవాలయములో పాస్కా వత్తిని వెలిగించము. అయితే, ప్రభువు “లోకాంతము
వరకు సర్వదా నేను మీతో నుందును” (మత్త. 28:20) అని అభయ మొసగాడు. తండ్రి దేవుడు
వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా (యోహాను. 16:7-16; చదువుము. అ.కా. 2:33), మోక్షారోహణమైన
ప్రభువు మనతోనే ఉంటాడు.
అ.కా.
1:3-11లో ఉత్థాన క్రీస్తు శిష్యులకు ఇచ్చిన అంతమ సందేశము, మోక్షారోహణమును
చూడవచ్చు. ఉత్థానమైన తరువాత, ప్రభువు 40 రోజులపాటు [‘అర్దవంతమైన కాలము’] తన
అపోస్తలులకు, శిష్యులకు ప్రత్యక్ష మయ్యాడు. తాను సజీవుడనని పలువిధములుగా ఋజువు
పరచుకున్నాడు. దేవుని రాజ్యము గురించి వారికి బోధించాడు. పవిత్రాత్మ ద్వారా వారికి
కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఉదాహరణకు, తండ్రి చేసిన వాగ్ధానము (పవిత్రాత్మ) కొరకు
యెరూషలేమును విడిచి వెళ్ళ వద్దు (1:4) అని ఆజ్ఞాపించాడు.
శ్రీసభ పరిచర్య: మోక్షారోహణమయిన ప్రభువు
మరల తప్పక తిరిగి వచ్చును అని వాక్యం సెలవిస్తుంది, మన విశ్వాసం కూడా! ఇప్పుడు మనం
ఆయన [రెండవ] రాకకై ఎదురుచూస్తూ ఉన్నాము. అయితే, ప్రభువు తిరిగి వచ్చేలోగా, ఆయన ఈ
లోకములో ఆరంభించిన ప్రేషిత కార్యమును ఆయన శిష్యులమైన మనమందరము కొనసాగించాలి.
ఆ
ప్రేషిత కార్యాన్ని ప్రభువు అపోస్తలులకు స్పష్టము చేసియున్నాడు: “పవిత్రాత్మ మీ
పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయా,
సమరియా సీమల యందు అంతటను, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు” (1:8). అలాగే, తన
అంతిమ సందేశముగా, “ఇహ పరములందు నాకు సర్వాధికార మీయబడినది. కనుక మీరు వెళ్లి సకల
జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను
చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించిన దంతయు వారు ఆచరింప బోధింపుడు” (మత్త. 28:18-20) అని
ఉపదేశించాడు. పెంతెకోస్తు దినమున, పవిత్రాత్మ రాక శక్తితో, ప్రారంభమైన ఆ ప్రేషిత కార్యము, నేటికి
కొనసాగుతూనే ఉన్నది. నేడు క్రీస్తునందు జ్ఞానస్నానము పొందిన మనకూ అదే ఆజ్ఞ
ఇవ్వబడినది. అపోస్తలులవలె మనము కూడా ఆ ప్రేషిత కార్యములో భాగస్థులమవుటకు పంపబడినాము.
ప్రభువు
ఇచ్చిన చివరి ఆదేశము నుండి, మన ప్రేషిత కార్యమును మూడు రకాలుగా చూడవచ్చు:
1. ఈ లోకములో క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడము: ప్రభువు తన శిష్యులతో, “ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోక మందున్న మీ
తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు” (మత్త. 5:16) అని
ఆజ్ఞాపించాడు. క్రైస్తవులు ఈ లోకమునకు వెలుగై యుండాలి. పాపమనే అంధకారముతో
నిండియున్న ఈ లోకములో క్రీస్తు విశ్వాసులు తమ మంచి పనులద్వారా, సేవా జీవితము
ద్వారా వెలుగును ప్రసరింప జేయాలి. మదర్ తెరెసా లాంటి ఎంతోమంది పునీతులు మనకు
ఆదర్శముగా ఉన్నారు. క్రీస్తు బోధించిన అష్టభాగ్యాల సత్యమును, జీవించినచో, లోకమునకు
వెలుగు కాగలము. విశ్వాసులు ఒకరికొకరు, ముందుగా వారి కుటుంబములో, ఆదర్శవంతమైన
జీవితమును జీవించాలి. కుటుంబములో ప్రేమ కలిగి జీవించువారు, సమాజములోను, లోకములోను
ప్రేమ కలిగి జీవిస్తారు.
2. సువార్త పరిచర్య: క్రీస్తు
రక్షణ సువార్తను ఈ లోకములో ప్రకటించాలి. సువార్తను మనం పొందనిచో, ఇతరులకు ఎలా
తెలియ జేస్తాము? సువార్తను తెలుసుకోవాలన్న కోరిక, తపన ఎంత మందికి ఉన్నది? ప్రస్తుత
కాలములో, సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతర వ్యక్తులు, సాధనాల ద్వారా, బైబులు
విజ్ఞానమును పెంపొందించు కోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనలో ఎంతమందిమి
నేర్చుకోవాలని ఆసక్తిని కనబరుస్తున్నాము? మనలో విద్యాపరంగా చదువుకున్నవారు
ఎంతోమంది ఉన్నారు, కాని, శ్రీసభ బోధనలను, సువార్తా వివరణలను తెలిసినవారు ఎంతమంది
ఉన్నారు?
సువార్తను
ప్రకటించడం అనగా కొన్ని వాస్తవాలకు మనం విశ్వాసపాత్రులముగా, నమ్మకముగా ఉండాలి: 1. క్రీస్తుకు,
ఆయన సందేశమునకు నమ్మకముగా ఉండాలి. 2. శ్రీసభ పరిచర్యకు నమ్మకముగా ఉండాలి. 3.
విశ్వాసుల పట్ల నమ్మకముగా ఉండాలి..
3. సకల జాతి జనులను క్రీస్తుకు శిష్యులనుగా చేయటం: క్రీస్తు శిష్యులు కావాలంటే, క్రీస్తు సువార్త బోధింప బడాలి, మారుమనస్సు
పొంది క్రీస్తునందు విశ్వసించాలి, త్రిత్వైక నామమున జ్ఞానస్నానం పొందాలి, క్రీస్తు
ఆజ్ఞలను పాటించాలి. యేసు భూలోకములో చేసిన పరిచర్య కూడా ఇదే! నేడు ఇది మనందరి
బాధ్యత! మనందరి ప్రేషిత కార్యము! ఇది సాధ్యమే, ఎందుకన, ఆయన ‘ఇమ్మానుయేలు’, “ప్రభువు
మనతో ఉన్నారు” (మత్త. 1:23, 28:20). మోక్షారోహణమునకు ముందుగా, శిష్యులు ఆయనను
దర్శించి ఆరాధించారు. కాని కొందరు సందేహించారు (మత్త. 28:17). అయినను ప్రభువు
వారిని నమ్మి వారికి బాధ్యతను అప్పజెప్పాడు. మనం అల్పవిశ్వాసులమైనను (మత్త. 630),
మన విశ్వాసం ఆవగింజంతదైనను, ప్రభువు మనలను నమ్ముచున్నాడు. ఈ బాధ్యతను మనం
కొనసాగించాలి. ఈ ప్రేషిత కార్యం విశ్వజనీనమైనది. సకల జాతి జనులను [యూదులు,
అన్యులు] క్రీస్తుకు శిష్యులనుగా చేయాలి. త్రిత్వైక సర్వేశ్వరుని ప్రేమను లోకమంతటా
ప్రకటించాలి. సకల జాతి జనులకు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించాలి. జ్ఞానస్నానము
ద్వారా, వారిని తల్లి శ్రీసభలోనికి ప్రవేశ పెట్టాలి. జ్ఞానస్నానం త్రిత్వైక సర్వేశ్వరునితో,
సంఘముతో ఐఖ్యతకు సూచన.
ఆత్మతో మన పరిచర్య సాధ్యమే!
రెండవ
పఠనములో, పౌలు, ఎఫెసీయులకు ఆత్మను
ప్రసాదింప వలసినదిగ, తండ్రి దేవుడిని అర్ధిస్తున్నాడు. ఆత్మ మనకు వివేకమును
కలిగించి దేవుని విదిత మొనర్చును. దేవుని శక్తి ఎంతో అతీతమైనది. క్రీస్తును
మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండ బెట్టు కొనినపుడు ఆయన
ఉపయోగించిన మహా శక్తియే అది! ఆత్మద్వారా మనము పొందు వివేకము మన హృదయ కన్నులను
ప్రజ్వరిల్ల జేయును, తద్వారా మన విశ్వాసము బలపడును. మన బుద్ధి, మనసులు వికాసము
పొందును. కనుక, మనలో పనిచేయుచున్న ఆత్మ వరమును తక్కువ అంచనా వేయకూడదు. “విశ్వాసులమగు
మనలో ఉన్న దేవుని శక్తి ఎంతో అతీతమైనది.” జ్ఞానస్నానము పొందిన ప్రతీ విశ్వాసిలో దేవుని
ఆత్మ వసించును. కనుక, శ్రీసభ పరిచర్యను సంపూర్ణము చేయు శక్తిని మనము కలిగి యున్నాము.
విధేయత కలిగిన విశ్వాసం మనకుండాలి. కనుక, క్రీస్తుకు సాక్ష్యులమవుదాం. ఆయన సువార్తను
ప్రకటించుదాం. సకల జాతి జనులను క్రీస్తుకు శిష్యులనుగా చేయ ప్రయత్నిద్దాం
శ్రీసభ
పరిచర్యలో, ప్రేషిత కార్యములో నిమగ్నమైయున్న సమయములోనే, మన జీవితాలను కూడా ఆత్మపరిశీలన
చేసుకోవాలి. ఇతరుల పరివర్తన, పవిత్రతయే గాక, మన జీవితాలలో పరివర్తన, పవిత్రతను
కూడా పరిశీలించు కోవాలి! ప్రభువు వచ్చునప్పుడు, ఈ భూమి మీద మన విశ్వాసమును చూడగలుగునా?
(లూకా. 18:8) అని ఎప్పటికప్పుడు పరిశీలించుకుందాం!